పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

October 8, 2008

దుత్తెవరు మరి!!!!!

దీనికి ముందు ఇది చదివి అప్పుడు ఇది చదవండి.

.................అలా మా నాన్నతో పాటు నేను కూడా డాక్టరు గారింటికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో పాటు పాఠాలు చెప్పించుకోవటం ఒక డ్యూటీ లాగా అయిపోయింది. ఈ పాఠాలు రోజూ ఉండేవి కావు, వారానికి రెండు మూడు రోజులు ఉండేవి. వెళ్ళిన ప్రతిసారి నాకు ఉక్రోషం తన్నుకొచ్చేది, అయినా ఏం చేయలేం కదా, దేనికైనా కాలం కలిసి రావాలి! కాలం అలా జరిగిపోతుండగా కాలం కలిసొచ్చి ఒక రోజు ఒక మహత్తర అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఎట్టిదనగా..........

ఇక్కడ ఇంకో పిట్టకథ............
మాకు జువాలజీకి వచ్చే పంతులు గారికి కాస్తంత నత్తి, ఆ నత్తికి తోడు ఇంకాస్తంత చాదస్తం, వెరసి ఆయన క్లాసులో అసలు పాఠం కన్నా ఊకదంపుడు ఎక్కువగా ఉండేది. ఆర్థ్రోపొడాలో బొద్దింక గురించి పాఠం మొదలుపెట్టి మధ్యలో దోమలు ఎలా పునరుత్పత్తి చేస్తాయో చెపుతూ హఠాత్తుగా ఎంటమీబా, ప్లాస్మోడియుం అంటూ పరాన్నజీవుల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, ఏతా వాతా ఆయన ఏ పాఠం పూర్తిగా చెప్పటం అయ్యేది కాదు, పూర్తయినా మాకు అర్థమయ్యేది కాదు! ఇక పరీక్షలు దగ్గరికొస్తున్నాయనగా ఆదివారాలు స్పెషలు క్లాసులంటూ దుంప తెంచేవాళ్ళు. అదిగో అలాంటి ఓ ఆదివారం నా ఉక్రోషం తీర్చుకునే మహత్తర అవకాశం దొరికింది...........

ఓ ఆదివారం అలానే క్లాసుకి వెళ్ళాం, మాస్టారు ఇంకా రాలా, సరే కాసేపు బయట తిరిగొద్దామని బయటకి వచ్చాం, మగపిల్లలు కూడా బయటికి వచ్చి కాంటీను వేపు వెళ్ళారు. బయటకి వచ్చిన మాకు అక్కడున్న మగపిల్లల సైకిళ్ళు కంటబడ్డాయి, అంతే ఇక అటూ ఇటూ చూసి ఎవరూ చూడటంలేదని నిర్థారించుకుని టపుక్కున డాక్టరుగారబ్బాయి సైకిలు గాలి తీసేసా! ఇక క్లాసు అయిపోయాక తను సైకిలు నడిపించుకుంటూ ఇంటికి వెళుతుంటే నాకెంత ఆనందం వేసిందో!! అప్పట్లో దగ్గర్లో ఎక్కడా గాలి కొట్టేవాళ్ళు ఉండేవారు కాదు. కాలేజి నుండి కనీసం ఓ రెండు కిలోమీటర్లు వెళితే కాని గాలి కొట్టించుకోవటం కుదరదు. ఎప్పుడూ కాలేజి నుండి దగ్గరి దారిలో వెళ్ళే మేము ఆ రోజు తన వెనకే నడుచుకుంటూ ఆనందిస్తూ వెళ్ళటం ఇప్పటికి కూడా కళ్ళముందు కనపడుతుంది. అలా వెళుతూ వెళుతూ మిమ్ములిని మా నాన్న సాయంత్రం మా ఇంటికి రమ్మన్నారు పాఠాలు చెప్పించుకోవటానికి అంటూ ఓ కొంటె నవ్వు నవ్వుకుంటూ తనని దాటుకుని వెళ్ళటం నిన్నా మొన్న జరిగినట్లుంది..........

పాపం తను చాలా బుద్దిమంతుడు. తన చదువేమో తనేమో అన్నట్లు ఉండేవాడు. మరి అలాంటి తనని నేను ఎందుకు టార్గెట్టు చేసుకున్నట్లు? మా నాన్న మీద ఉక్రోషం తన మీద చూపించానన్నమాట. అది తెలిసి చేయటం కూడా కాదు. ఆ సమయానికి అలా అనిపించింది చేసేసాను. తరువాత ఎప్పుడో జ్ఞానోదయం అయింది మన అకారణ కోపాలు, ద్వేషాలు, ఉక్రోషాలు ఇలా అమాయకుల మీద చూపించేస్తుంటాం అని.

మీరు కూడా మీకు తెలియకుండా ఇలాంటివి ప్రదర్శించే ఉంటారు, లేకపోతే మీ మీద ప్రదర్శింపబడి ఉంటాయి, ఒక్కసారి మీ జ్ఞాపకాలని తవ్వుకోండి.

అన్నట్లు జ్ఞాపకాలంటే గుర్తుకొచ్చింది.........అందరిని ఒక్కసారి మన ఊర్లకి తీసుకుపోయే పాట వేణూ శ్రీకాంత్ గారు తన బ్లాగులో వినిపిస్తున్నారు, అక్కడికి వెళ్ళి విని ఒక్కసారి అలా అలా మీ ఊరి పంటచేల గట్ల మీద తిరిగి రండి..........

10 వ్యాఖ్యలు:

teresa October 7, 2008 at 10:10 PM  

you must've really got a kick out of it! అందుకే నిన్నో, మొన్నో జరిగినంత బాగా గుర్తుంది :)

Purnima October 8, 2008 at 12:01 AM  

:-) అంతే.. కొన్ని సార్లు అలా కొంత మంది బుక్కయ్యిపోతారు.

రాధిక October 8, 2008 at 2:13 AM  

జ్ఞాపకాలు తవ్వుకోండని స్పెషల్ గా చెప్పాలా?కొన్ని టపాలు చదువుతుంటే అలా గుర్తొచ్చేస్తూ వుంటాయి.

వేణూశ్రీకాంత్ October 8, 2008 at 2:42 AM  

పాపం ఓ అమాయక చక్రవర్తి బలై పోయాడనమాట :-) బాగుందండి మీ జ్ఞాపకం.
Thanks for promoting my post.

కొత్త పాళీ October 8, 2008 at 3:01 AM  

హం కహెంగె ఆప్ కో .. హవా హవాయీ :)

Rajendra Devarapalli October 8, 2008 at 10:26 AM  

మీ నాన్న గారు ఇంటికెళ్ళి ట్యూషన్ చెప్పారంటే ...
పెద్దాయన,చిన్నాయన పిల్లలకా??
ఆ జువాలజీ పంతులు గారెవరో కాస్త్ క్లూ ఇవ్వండి,
హెందుకంటే నేనూ ఆ కాలెజీలో భయపీసీ మూడునెలలో,పదిహేను రోఝులో చదివా :)

Ramani Rao October 8, 2008 at 12:22 PM  

మొత్తానికి "దుత్త " ఎవరో తేల్చేసారన్నమాట అలా.. అవునులెండి మెత్తని వాళ్ళని చూస్తే మొత్తబుద్ధి అని ఊరికే అన్నారా... మీలాంటి వాళ్ళని చూసే... నేను నా జ్ఞాపకాలని తవ్వుకొంటున్నా, ఎవరెవరికి నేను దుత్త నయ్యానా అని , అసలే నేను చాలా (అ)మాయకురాలిని కదా.. :)))

జ్యోతి October 8, 2008 at 2:08 PM  

పాపం ఆ అబ్బాయి మళ్ళి కనిపించాడా??

మాలతి October 9, 2008 at 2:33 AM  

కోపకారణాలు, పర్యవసానాలూ తేల్చేసారు. అందరూ అంత తేలిగ్గా తెలిసేసుకుని మారిపోతే ఎంత బాగుండు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP