పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

October 16, 2008

బ్లాగు ప్రయాణంలో నేను-సిరిసిరిమువ్వమీరు బ్లాగులోకం లోకి ఎలా ప్రవేశించారు అంటే సహజంగా సమాధానాలు ఇలా ఉంటాయి.....
మిత్రుల ద్వారా బ్లాగుల గురించి, కూడలి గురించి, లేఖిని గురించి తెలిసింది, అబ్బ ఎంచక్కా తెలుగులో ఎంత బాగా రాస్తున్నారో అని చదవటం మొదలెట్టి, మెల్లగా నేను కూడా బ్లాగటం మొదలెట్టా అనో, లేకపోతే అంతర్జాలంలో అనుకోకుండా ఒక రోజు తెలుగు బ్లాగులు కనపడ్డాయి, వాటిని చదవటం మొదలెట్టా, అవి చదివాక నాకు కూడా ఉత్సాహం వచ్చేసి తెలుగు మీద ప్రేమ పెల్లుబికి బ్లాగటం మొదలెట్టా, లేక ఈనాడులో బ్లాగుల గురించి వచ్చిన వ్యాసం చదివి ఉత్తేజం చెంది నేను కూడా బ్లాగు తెరిచా--ఇంచుమించి కాస్త అటూ ఇటూగా అన్ని సమాధానాలు ఇలాగే ఉంటాయి.

నేను మాత్రం బ్లాగుల మీద కాస్తంత అయిష్టతొ ఇంకాస్తంత ద్వేషంతో ఈ బ్లాగు బండి ఎక్కా! నిజం.. నేను బ్లాగు మొదలుపెట్టేటప్పటికి నాకు బ్లాగుల మీద ఉన్నది అయిష్టతే. అప్పటివరకు నేను ఒక్క బ్లాగు కూడా చదవలేదు, అసలు ఈ బ్లాగు ప్రపంచం గురించి ఆలోచించాలన్నా నాకు ఇష్టంగా ఉండేది కాదు. బ్లాగు రాయటం అంటే పనీపాటా లేనివాళ్ళు చేసే పని అన్న అభిప్రాయం ఉండేది. అసలు మన గురించి మనకు తోచింది మనమే రాసుకుని అది లోకం అంతా తెలిసేట్లు అంతర్జాలంలో పెట్టటం ఏంటి అనుకునేదాన్ని.

మా వారు, అదే చదువరిగా మీ అందరికి పరిచయం అయిన శిరీష్ కుమార్ గారు, 2005 నుండి బ్లాగులు రాస్తుండేవారు. బ్లాగులు రాయటానికి ముందునుండే వికీపిడియాలో చాలా విస్తృతంగా రాస్తుండేవారు. ఎంత విస్తృతంగా అంటే ఇంట్లో ఉన్నంత సేపు పగలూ రాత్రీ అదే పని. శని ఆదివారాలు అయితే పూర్తిగా దానికే అంకితం. నాకు అది చాలా విసుగ్గా ఉండేది. అప్పుడప్పుడు నువ్వు కూడా వికీపిడియాలో రాయవచ్చుగా అంటుండేవాళ్ళు. అసలు కంప్యూటర్ అంటేనే గిట్టని వాళ్ళకి ఇలాంటివి ఎలా ఎక్కుతాయి చెప్పండి. తను రాసే బ్లాగులు కూడా నేనసలు చూసేదాన్ని కాను. తను కూడా నా అనాసక్తిని గమనించి బ్లాగుల గురించి ఏం చెప్పేవారు కాదు.

2007 జనవరిలో నా ఆరోగ్యరీత్యా నేను ఉద్యోగం మానేసాను. అప్పుడు కాస్త కాలక్షేపంగా ఉంటుంది నువ్వు కూడా బ్లాగు మొదలుపెట్టు, ఏదో ఒకటి రాయి అంటుండేవారు. అసలు చెప్పటానికి మన దగ్గర విషయమేమన్నా ఉంటే కదా రాసేది అని నేనంత ఆసక్తి చూపించలేదు. దాదాపు అదే టైములో అనుకుంటా చదువరి, త్రివిక్రం గారు కలిసి పొద్దు అంతర్జాల పత్రిక మొదలుపెట్టారు. దాంట్లో జ్యోతి గారు సరదా శీర్షికలో వ్యాసాలు రాసేవారు. ఓ సారి జ్యోతి గారు రాసిన ఓ వ్యాసం చూపించి తన గురించి చెప్పి తను బ్లాగులు కూడా రాస్తారు అని చెప్పారు. అప్పుడు కూడా నాకు అంత ఆసక్తి అనిపించలేదు, ఆ వ్యాసం కూడా చదవలేదు. దానికి ముఖ్య కారణం నాకు ఏదైనా అంతర్జాలంలో చదవటం అంత ఆసక్తిగా ఉండేది కాదు. ఓ పుస్తకం పట్టుకుని హాయిగా పడుకుని పక్కన ఏ బఠాణీలో,మరమరాలో,కారప్పూసో పెట్టుకుని తింటూ చదువుకోవటంలో ఉండే ఆనందం కంప్యూటర్ ముందు కూర్చుని చదివితే ఉంటుందా!!ఇప్పటికీ నా ప్రాధాన్యత చేతిలో పుస్తకానికే.

సరే నీకు రాయాలనిపించినప్పుడే రాయి అని తనే నాకు ఒక బ్లాగు క్రియేట్ చేసారు. క్రియేట్ చేయటం వరకే తన పని, బ్లాగు పేరు కాని, బ్లాగు అడ్రస్సు కాని అన్నీ నేను పెట్టుకున్నవే. కాస్తంత అయిష్టత తోటే బ్లాగు మొదలుపెట్టా. మొదటి టపా ఫిబ్రవరి 22, 2007 నాడు రాసా. మొదటి టపా రాసేముందు మొదటిసారిగా కొంతమంది బ్లాగులు చదివా, చదవగానే బాగున్నాయే అనుకున్నా...ముఖ్యంగా విహారి గారి టపాలు నాకు చాలా నచ్చాయి, అలాగే పప్పు నాగరాజు గారివి, చరసాల ప్రసాదు గారివి కూడా. చరసాల గారి టపాలు బాగా వాడిగా వేడిగా ఉండేవి. ఒకరు హాస్యం, ఇంకొకరు సరసం, మరొకరు గరంగరం; ఎంత వైవిధ్యం అనుకున్నా!

నా టపా నేనెవరినో చెప్పకుండా రాసా. నేనెవరినో చెప్పాల్సిన అవసరం కూడా నాకు కనిపించలేదు. అసలు ఎందుకు చెప్పాలి! మనం రాసేవి నచ్చితే చదువుతారు లేకపోతే లేదు అన్న భావన నాది. నాకంటూ ఓ చిన్నపాటి గుర్తింపు వచ్చాకే నేనెవరినో చాలామందికి తెలిసింది. నేను మొదటి టపా రాసిన విషయం చదువరి గారికి కూడా తెలియదు. బ్లాగుకి పేరేం పెట్టానో, ఏ పేరుతో రాసానో ఏమీ తనకి చెప్పలేదు. నేను ఒక టపా రాసాను నా బ్లాగు ఏ పేరుతో ఉందో కనుక్కో అన్నా, అంతే రెండే రెండు నిమిషాలలో గూగిలించి చెప్పేసారు. అలా నా బ్లాగు ప్రస్థానం మొదలయ్యింది.

ఇక ఈ బ్లాగు బండి ఎక్కాక ఓ కొత్త లోకంలోకి వచ్చినట్లు అనిపించింది. గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యారు. నాకు తెలియని ఎన్నో విషయాలు, పుస్తకాలు, వ్యక్తుల గురించి తెలిసింది. అసలు పట్టుమని నాలుగు అక్షరాలు రాయటమే గగనం అయిపోయిన నేటి కాలంలో బ్లాగు పుణ్యమా అని నాకు భాష మీద పట్టు పెరిగింది. కొత్త కొత్త (నాకు) తెలుగు పదాల అందాలు, వాటి వాడుక గురించి తెలిసింది. బ్లాగులో నాకు నచ్చిన మరొక విషయం ఏమిటంటే "ఇక్కడ మనకు నచ్చింది స్వేచ్చగా రాసుకోవచ్చు. ఎలాంటి నియమాలు, నిష్ఠలు, ముందస్తు ఒప్పందాలు, చావు గీతలు, లక్ష్మణ రేఖలు ఉండవు. మనం తప్పులు రాసినా ముద్దుగా చెప్పేవాళ్ళే కాని విసిరిగొట్టటాలు, గోడ కుర్చీలు, ఇంపొజిషన్సు ఉండవు".

నాకు బ్లాగులు రాయటం కన్నా చదవటం ఎక్కువ ఇష్టం, అలా ఆని అదేం వ్యసనంగా మారలేదు. ఒక్కోసారి రోజుల తరబడి బ్లాగులవంక కన్నెత్తి కూడా చూడను. మధ్యమధ్యలో బ్లాగుల నుండి సుదీర్ఘ విశ్రాంతి తీసుకుంటుంటాను. రాయటం కోసం రాయను రాయాలనిపించినప్పుడు రాస్తాను. అసలు బ్లాగు అంటే పర్సనల్ డయరీ అన్న అర్థాన్ని మార్చాలేమో. "డయరీ అంటే మన వ్యక్తిగతం గురించి గుప్తంగా ఉంచేది, కాని బ్లాగు అనేది ఓ తెరిచిన నోటు పుస్తకం లాంటిది. ఆ పుస్తకాన్ని ఎవరైనా చదవవచ్చు, తప్పులు దిద్దవచ్చు, సలహాలు ఇవ్వవచ్చు, సంప్రదింపులు చేయవచ్చు".

విభిన్న వ్యక్తులు, విభిన్న రకాల బ్లాగులు---అంతరంగాలు, స్వగతాలు, మార్గదర్శకాలు, విశ్లేషణలు, కబుర్లు, కవితలు, రుచులు, అభిరుచులు, అర్థవంతమైన చర్చలు, వాదోపవాదాలు, పొగడ్తలు, తెగడ్తలు, అలకలు, నిరసనలు, తరాల అంతరాలు, విరమణలు....అన్నిటి కలబోత ఈ బ్లాగు ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతి మజిలీ ఓ మధురానుభూతే. ప్రయాణం నచ్చలేదా మధ్యలో దిగిపోవచ్చు. ఈ బ్లాగు బండిలోకి కొత్త కొత్త వ్యక్తులు ఎక్కుతూ ఉంటారు, కొంతమంది మద్యలోనే దిగిపోతూ ఉంటారు, కొంతమంది ఎక్కి దిగుతూ ఉంటారు, మరి కొంతమంది దిగి ఎక్కుతూ ఉంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా ఈ బ్లాగు బండి ప్రయాణం ఎత్తులు, పల్లాలు, మలుపుల మద్య నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. దానికి హద్దులు, అదుపులూ ఉండవు-ఉన్నదల్లా ఒక్కటే-తెలుగు భాష మీద ప్రేమ, మమకారం. అప్పుడప్పుడూ బండి పట్టాలు తప్పుతున్నట్లు అనిపించినా వెంటనే మరమత్తులు చేసి పట్టాల మీద సరిగ్గా నిలబెట్టే సహృదయులున్నంతవరకు ఈ ప్రయాణం రసరమ్యభరితంగా సాగిపోతూనే ఉంటుంది.

ఈ లోకంలో మనం చెప్పేది నోరెత్తకుండా వినేది మన బ్లాగే:).
అయ్యో మనసులోని మాటని పంచుకోవటానికి ఎవరూ లేరే అన్న బెంగ ఇక లేదు, ఒక్క నిమిషంలో మన మాటని వందలమంది మనస్సులలోకి చేరుస్తుంది. అంతే కాదు తను విన్నవి జాగ్రత్తగా దాచిపెట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి మనకు వినిపిస్తుంది. "అది మాట్లాడకు ఇది మాట్లాడకు అంటూ ఆంక్షలు పెట్టదు, ఏంటా మాటలు అంటూ సాధించదు, ఇలానే మాట్లాడు అంటూ ఆజ్ఞాపించదు. మన మనసెరిగిన నేస్తం మన బ్లాగు".

బ్లాగులు చదవండి-బ్లాగులు చదివించండి
బ్లాగులు రాయండి-బ్లాగులు రాయించండి
తెలుగు భాషని పునరుత్తేజితం చేయండి
ఎవరు రాసారన్నది కాక ఏం రాసారన్నది చూడండి.

జై తెలుగు బ్లాగులు..జై జై తెలుగు బ్లాగులు...జై జై జై తెలుగు బ్లాగులు....జైహింద్.

21 వ్యాఖ్యలు:

Ramani Rao October 16, 2008 at 4:15 PM  

చివిరిదాక అక్షరాల వెంట పరుగులెత్తించారుగా చదువ(రోధిని)రి గారు. చాలా బాగా రాసారు. ఈ ప్రయాణం మనిష్టమే. కావాలంటే కొనసాగచ్చు లేకపోతే ఆపేయచ్చు అని చాలా చక్కగా చెప్పారు.

మేధ October 16, 2008 at 5:04 PM  

>>అసలు బ్లాగు అంటే పర్సనల్ డయరీ అన్న అర్థాన్ని మార్చాలేమో. డయరీ అంటే మన వ్యక్తిగతం గురించి గుప్తంగా ఉంచేది, కాని బ్లాగు అనేది ఓ తెరిచిన నోటు పుస్తకం లాంటిది. ఆ పుస్తకాన్ని ఎవరైనా చదవవచ్చు, తప్పులు దిద్దవచ్చు, సలహాలు ఇవ్వవచ్చు, సంప్రదింపులు చేయవచ్చు.

ఇది 101% కరెక్ట్...
బ్లాగు ముఖ్యోద్దేశాన్ని చాలా చక్కగా వివరించారు...
ఇలాంటి మంచి వివరణలు అన్నిటి మీద, ముఖ్యంగా మీరు మొన్న కొన్న పుస్తకాలన్నింటి మీద రావాలని ఆశిస్తూ... :)

జ్యోతి October 16, 2008 at 5:23 PM  

వరూధినిగారు ,

చాలా బాగా చెప్పారండి. కాని మీ మొదటి టపా ఎంత హంగామా సృష్టించిందో నాకు ఇంకా గుర్తుంది. మీరు ఎంచక్కా హింట్లు ఇస్తున్నా కూడా మీరు ఎవరో కనుక్కోవాలని భలే ప్రయత్నించారు. కాని చివరికి చదువరిగారితోనే చెప్పించారు. అయిష్టంతో వచ్చినా కూడా మీకంటు ఒక గుర్తింఫు చాల తక్కువ సమయంలో దక్కించుకున్నారు.

Sujata M October 16, 2008 at 6:35 PM  

Excellent. Blog ni note book to polchaDam. Chala bavundi varoodhini garu.

సత్యసాయి కొవ్వలి Satyasai October 16, 2008 at 6:49 PM  

పసందైన సింహావలోకనం. నాటపాకి మీవ్యాఖ్య మొదట అర్ధంకాలేదు. ఒకరితర్వాత ఒకరుగా ప్రమదలు తమతమ బ్లాగ్ప్రయాణాలపై బ్లాగావళి ప్రచురిస్తోంటే అర్ధమయింది - ఏదో విశేషం ఉందని. వివరాలకై ఎదురు చూస్తున్నాం. ఈమధ్యన ఎవరిగురించైనా అలోచిస్తోంటే వాళ్ళనుండి మెస్సేజి రావడమో, కలవడమో జరుగుతోంది. నిన్న రాత్రి మన పాటలబ్లాగరు కామేష్ గారి గురించి మాఆవిడకి చెప్పా, ఈవేళ ఆయన ఐడీనుండి ఓ మెయిలొచ్చింది - సంవత్సరం తర్వాత ఇదే ఆయన ఐడీ నుండి మెయిల్. నాటపా కూడా ఇలా యాధృచ్చికమే అయుండచ్చు.

సుజాత వేల్పూరి October 16, 2008 at 7:18 PM  

వరూధిని గారు, మీ సరిగమల ప్రయాణం బహు పసందుగా ఉందండి! రమణి గారన్నట్టు అక్షరాల వెంట పరుగెత్తి మరీ చదివాను.

teresa October 16, 2008 at 7:22 PM  

బ్లాగులు చదూతున్నా, చదివిస్తున్నా... మీరిలా రాస్తూనే ఉండండి. :)

Anonymous,  October 16, 2008 at 7:29 PM  

ఒకప్పుడు కష్టమైనదే ఇప్పుడు ఇష్టమైనదన్నమాట.
మీరు ఫలానా అని నాకిప్పుడే తెలిసింది. మనసులో మాట చెప్పుకోడానికి ఎవరూ లేరే అని బెంగ ఇక లేదు . ఇదే నా అభిప్రయం కూడా

Purnima October 16, 2008 at 7:48 PM  

ఈ లోకంలో మనం చెప్పేది నోరెత్తకుండా వినేది మన బ్లాగే:).

దీనికి తిరుగు లేదు! నిజ్జంగా నిజం అది!

బాగుంది మీ ప్రయాణం, రొమాంటిక్ అనవచ్చునా? ;-)

పూర్ణిమ

రానారె October 16, 2008 at 8:56 PM  

జై హింద్! జై జన్మభూమి!! :) మీ మొదటి టపా నాకింకా గుర్తుంది.

నిషిగంధ October 16, 2008 at 8:57 PM  

చాలా చక్కగా చెప్పారండీ! అయిష్టంగా బండెక్కినా ఇప్పుడు ఇష్టంగా మీరు మాకందిస్తున్న పల్లీలు, శనగలు చాలా బావుంటున్నాయి :-)

Kathi Mahesh Kumar October 16, 2008 at 8:57 PM  

నా టపా లంకెతో సత్యసాయిగారికి వారు ‘ఎందుకు బ్లాగాలో!’గురించి పొద్దులో ప్రచురించిన వ్యాసం గుర్తొచ్చి, మళ్ళీ బ్లాగులో పెట్టారు. ఆ వెనువెంఠనే మహిళామణులందరూ కూడబలుక్కున్నట్లు సింహావలోకనాలు మొదలెట్టేసరికీ..."హబ్బా ఎంత పవర్!!!" అనుకున్నాను.

కానీ, ఆలోచిస్తుంటే ఇదేదో ప్రమదావనం ప్రళయంలా ఉంది.ఏది ఏమైనా ఇలాంటిది ప్రతిబ్లాగరూ ఒకసారి ఆలోచించాల్సిన విషయమే!

మీకు నా అభినందనలు.

రాధిక October 16, 2008 at 10:50 PM  

నిజమే అందరి బ్లాగ్ ప్రయాణం ఒకేలా వుండదు.నాకూ మీ మొదటి టపా బాగా గుర్తుంది.మావారో పే....ద్ద బ్లాగరు అంటూ మొదలు పెట్టారు.

వేణూశ్రీకాంత్ October 17, 2008 at 10:07 AM  

మీ ప్రయాణం చాల ఆసక్తికరం గా ఉందండీ. బ్లాగ్ గురించి కొన్ని విషయాలు చాలా బాగా చెప్పారు.

సిరిసిరిమువ్వ October 17, 2008 at 11:33 AM  

అందరికి ధన్యవాదాలు.

మాలతి October 17, 2008 at 6:07 PM  

తెలుగు భాషని పునరుత్తేజితం చేయండి
ఎవరు రాసారన్నది కాక ఏం రాసారన్నది చూడండి
-- బాగా చెప్పారండీ. మీరు సున్నితంగా ఆలోచిస్తారు. చక్కగా చెప్తారు. అభినందనలు.

ఏకాంతపు దిలీప్ October 19, 2008 at 12:52 AM  

చదువరి గారికి అభినందనలు :-)

psmlakshmi October 20, 2008 at 12:52 PM  

మీకు బ్లాగుతో విరోధానికి కారణం చదువరిగారు మీతో కాక కంప్యూటర్ తో కబుర్లు చెప్పటమేనని తెలిసిపోయింది. అభినందనలు. మీ విరోధానికి కాదు సిరిసిరి మువ్వలు గలగల పలికించినందుకు. psmlakshmi

ఆనంద ధార November 24, 2008 at 10:47 AM  

నేను అసలే ఈ బ్లాగు లోకానికి కొత్త.. మీ టపాలు నన్ను ఇంకా ఉత్తెజితున్ని చేస్తున్నయండి మరిన్ని బ్లాగులు రాయాలని... మంచి టపా .. థ్యాంక్స్ ..

durgeswara December 4, 2008 at 6:03 AM  

lalitaa paaraayana yaagam praarambhamavutunnadi. bloglo vivaraalu choodamdi
durgeswara.blogspot.com

తెలుగుకళ January 8, 2009 at 9:42 AM  

ఈ - తెలుగు బ్రహ్మ చదువరి శిరీష్ కుమార్ గారైతే సరిగమల గీర్వాణి వరూధిని గారని ఇవ్వాళే తెలిసింది.
బ్లాగరిగా మీ అంతరంగాలలో నన్ను చూసుకున్నాను.
చాలా బాగా వివరించారు.
నేను బ్లాగటం మొదలెట్టి ౪ నెలలే అయినా ఇప్పుడు రోజూ ఏదో ఒక బ్లాగులో అలా అలా విహరించటం అలవాటయిపోయింది.
బ్లాగు రాయని వాళ్ళు , కనీసం బ్లాగుని చదవలేని వాళ్ళు ప్రపంచంలో చాలా మిస్సయిపోతున్నట్టే నని నా మిత్రులందరికీ బ్లాగు సుగంధాలని అంటించేస్తున్నాను.
శుభాకాంక్షలు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP