పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 30, 2008

వందనం అభివందనం

పదిరోజుల పాటు జరిగిన హైదరాబాదు పుస్తక ప్రదర్శన ముగిసింది. ఇన్నిరోజులు అక్కడ తెలుగు బ్లాగర్ల హడావిడీ, అల్లరీ వేడుకగా చూసిన సాగర తీరం ఒక్కసారిగా మూగవోయింది. ఇప్పుడు అటు వెళ్లినవారికి తన జ్ఞాపకాల ఊసులు కథలు కథలుగా వినిపిస్తుంది. మరి మీరెప్పుడైనా అటు వెళితే సాగరమ్మ ఊసులు ఒకసారి వినండి.

నిజంగా e-తెలుగు స్టాలు ఓ పెళ్లివారింటిని తలపించింది. ఎక్కడెక్కడినుండో వచ్చిన బ్లాగర్లు, ఎవరెవరో తెలుసుకోవాలన్న ఆతృత, తెలిసినాక మీరు ఫలానానా అని ఆశ్చర్యపోవటాలూ, పలకరింపులు, అప్యాయతలు, చలోక్తులు, చర్చలు, ఫోటోలు, వీడ్కోళ్లు, మళ్లెప్పుడొస్తారూ, మళ్లీ రావచ్చు కదా అన్న వేడ్కోళ్లు--------నిజంగా ఓ పెళ్లి వేడుకలానే అనిపించింది. గంటలు నిముషాల లాగా కరిగిపోయాయి.

అక్కడ మన అలుపెరుగని యోధుడిని చూసి ఎంత సంబరమేసిందో! మీకు ఒంట్లో బాగోలేదన్నారు, ఇప్పుడెలా ఉంది అని అడిగితే "నాకా నాకేం లేదమ్మా, అంతా వీళ్లు ఊరికే చెప్తున్నారు" అంటూ ఒక్క మాటతో మాట దాటవేసిన తీరు ఓహ్.. అనిపించింది. అదే మనమైతే "పర్లేదండి, ఇంకా బాగా తగ్గలేదు, కానీ ఇక్కడకి రాకపోతే కుదరదు కదా అని వచ్చాను" అని పెద్ద బిల్డప్ ఇచ్చేవాళ్లం. మాటలు కాదు చేతలు కావల్సింది అని చేసి మరీ చూపించారు ఆయన. ఆయన హుషారు చూస్తే ఎవరమైనా సిగ్గుతో తల దించుకోవలసిందే. ఎదిగిన కొద్దీ ఒదగమని మొక్క నీకు చెపుతుంది--దీనికి సరైన ఉదాహరణ ఆయన అనిపించింది. ముందుగా పద్మనాభం గారికి జేజేలు.

చెప్పుకోవలసిన మరో వ్యక్తి జ్ఞాన ప్రసూన గారు. పూర్ణం బూరెలతో పాటు వాళ్ల నాన్న గారు, తను వ్రాసిన పుస్తకాలు, తను స్వయంగా తయారు చేసిన గిఫ్టు కవర్లు తెచ్చి అందరికి పంచారు. వాహ్....ఈ వయస్సులో ఎంత ఓపిక అనిపించింది.

అక్కడికి వెళ్లొచ్చాక ఫలానా ఫలానా వారు కూడా ఉండి ఉంటే ఇంకెలా ఉండేదో అని వాళ్లందరిని ఒకసారి మనోఫలకంలో తలుచుకున్నాను. అలా నేను వీరు కూడా ఉండి ఉంటే అని తలుచుకున్న వాళ్లు---అబ్బో చాలా మందే ఉన్నారు. మొత్తం తెలుగు బ్లాగర్లు ఉండి ఉంటే!!ఇంకెంత నిండుతనం వచ్చేదో! ఆ రోజు కూడా త్వరలోనే రావాలని వస్తుందని ఆశిద్దాం. ప్రపంచ తెలుగు బ్లాగర్ల మహాసభ అన్నమాట (కూడలిలో కాదండోయ్ నిజంగానే నిజంగా).

ఇంతై ఇంతై వటుండంతై బ్రహ్మాండమంతై అన్నట్లు బ్లాగర్ల సమావేశంలో హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో మనం కూడా ఓ రోజు కార్యక్రమం ఇస్తే బాగుంటుందన్నచిరు ఆలోచన మొగ్గ తొడిగి చివరికి అక్కడ స్టాలు పెట్టటానికి దారి తీసింది. ఉన్న అతి తక్కువ సమయంలోనే యుద్ధ ప్రాతిపదికిన e-తెలుగు స్టాలు పెట్టి, దాన్ని విజయవంతంగా నిర్వహించి, అదే స్పూర్తితో విజయవాడ పుస్తక ప్రదర్శనలో కూడా ఓ రోజు అంతర్జాలంలో తెలుగు గురించి ప్రదర్శన ఇవ్వటానికి కార్యోన్ముఖులు అవుతున్న మన e-తెలుగు సభ్యులకి, మిగతా బ్లాగర్లకి, మరియు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి వేల వేల అభినందనలు.

జీవితంలో మొదటి అడుగు వేయటమే కష్టమైన పని, తరువాత అడుగులు వాటంతట అవే పడి పరుగులవుతాయి. అలానే అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి పడ్డ ఈ అడుగులు పరుగులై పరవళ్లు తొక్కాలని కోరుకుందాం. ఈ విజయ స్ఫూర్తితో e-తెలుగు తరుపున, తెలుగు బ్లాగర్ల తరుపున మరిన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ మరొక్కసారి హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు పెట్టి విజయవంతం చేయటానికి పాటు పడ్డ ప్రతి ఒక్కరికి వందనం అభివందనం.

6 వ్యాఖ్యలు:

నేస్తం December 30, 2008 at 12:54 PM  

మీ ఆనందాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పి మాతో పంచుకున్నందుకు thanks అండి

మేధ December 30, 2008 at 1:17 PM  

నేను చాలాసార్లు అనుకున్నా, దీనికి రాలేకపోయినందుకు.. కానీ ఆ లోటు తెలియకుండా, బ్లాగర్లు అందరూ, రోజూ ఎలా జరుగుతోందో (ముఖ్యంగా శ్రీధర్ గారు) కళ్ళకి కట్టినట్లు చెబుతుంటే, ఎంత ఆనందం గా అనిపించిందో.. రాబోయే వత్సరంలో, ఇలాంటి కార్యక్రమలెన్నో, దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటూ...

జ్యోతి December 30, 2008 at 1:45 PM  

అవునండి. నేను చాలాసార్లు అనుకున్నా ఒక పండగలా ఉండింది. కాని దూరదేశాల్లో ఉన్నా మన మనసుకు దగ్గరైన ఎందరో బ్లాగర్లు ఉంటే బాగుండేది కదా! ఇంకా ఎంజాయ్ చేసేవాళ్లం..

కాని ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని, తమ ఇంటిలో జరిగే శుభకార్యం అన్నట్టుగా పని చేసిన బ్లాగర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి..

లక్ష్మి December 30, 2008 at 2:02 PM  

మీరందరూ కలిసిన రోజు నేను రాలేకపోయాను, కానీ మనవాళ్ళు చేసిన కృషి మాత్రం నిజంగా అభినందనీయం. అందరికీ HATS OFF!!!

చిలమకూరు విజయమోహన్ December 30, 2008 at 2:28 PM  

ఎక్కడెక్కడో ఉన్న మనమంతా అక్కడి వెళ్ళి పాల్గొనలేకపోయినా కూడా మాకందరికీ అక్కడ పాల్గొన్న అనుభూతిని కలిగించిన అందరికీ మా ధన్యవాదములు

వేణూశ్రీకాంత్ January 1, 2009 at 4:51 AM  

ఈ స్టాలు దాని వివరాలు... అందులో స్వలాభాపేక్ష లేకుండా, తమ అమూల్యమైన సమయాన్ని శ్రమని కేటాయించి మన వాళ్ళు చేసిన సేవ !! రోజు వారీ నివేదికలు.. ఇవన్నీ చూసి నాకు నిజం గా మాటలు రావడం లేదండీ !! అద్భుతం..

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP