పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

September 16, 2008

ఆడ బ్లాగుల్లో సోదే ఉంటుందా?

ఆడ బ్లాగుల్లో సోది ఎక్కువా?? అసలు సోది అంటే???

ఎవరైనా బ్లాగు రాసేది తమ ఆలోచనలు, జ్ఞాపకాలు, అభిరుచులు మొదలైనవి దాచుకోవటానికి, ఇతరులతో పంచుకోవటానికి. మన జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు అంటే అక్కడ మన వ్యక్తిగత జీవితమే ఎక్కువగా ప్రతిభింబిస్తుంది. నిత్య జీవితంలో జరిగే విశేషాలనే కొంతమంది కాస్త హాస్యం కలిపి -జనాలకి నచ్చే విధంగా చెపుతుంటారు. మనసులో మాట సుజాత గారి బ్లాగు కొద్దికాలంలోనే పేరు తెచ్చుకోవటానికి ముఖ్యకారణం ఇదే. అసలు ఓ టపా చదివేటప్పుడు అందులో విషయం గురించే ఆలోచిస్తాం కాని ఆ బ్లాగరు వయస్సు ఎంత? రూపం ఎలా ఉంటుంది అని ఆలోచించి చదువుతామా?

బ్లాగుల్లో వ్యక్తిగత జీవితం గురించిన ఆలోచనలు, అనుభవాలు, జ్ఞాపకాలు--వీటి గురించి చెప్పే బ్లాగులే ఎక్కువ. అసలు వ్యక్తిగత జీవితం గురించి ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో చెప్పని బ్లాగు ఒక్కటి కూడా ఉండదేమో! అవి అందరికి నచ్చాలని కూడా ఏమి లేదు. ఏదైనా చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. ఒకరికి సోది అనిపించింది ఇంకొకరికి ఆసక్తికరంగా ఉండొచ్చు. లోకోభిన్నరుచి కదా. నాకు కవితలు అంతగా తలకెక్కవు, కొంతమందికి అవంటే ప్రాణం, కొంతమందికి టెక్నికల్ బ్లాగులు ఓ పట్టాన కొరుకుడు పడవు, కొంతమంది రాజకీయాలంటే ఆమడ దూరంలో ఉంటారు--ఏదైనా మన అభిరుచులని బట్టి మన ఇష్టాయిష్టాలనిబట్టి మనం ఎలాంటి టపాలని ఇష్టపడతామో ఉంటుంది కాని అది ఆడవాళ్ళు రాసారా మగవాళ్ళు రాసారా, అమ్మాయిలు రాసారా అమ్మమ్మలు రాసారా అన్నదాన్ని బట్టి కాదు. అవి మనకి నచ్చితే చదువుకోవటం లేకపోతే వదిలేయటమే. మనకోసం మన అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ బ్లాగులు రాయరు అన్నది కాస్తంత గుర్తుపెట్టుకుంటే చాలు.

ఈ మద్య తెలుగులో వచ్చిన బ్లాగుల్లో అనతికాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న వాటిల్లో ఆడవారివే ఎక్కువ. ఆ బ్లాగుల్లో ఏం రాస్తున్నారో అవి ఎంత వైవిధ్యంగా ఉంటున్నాయో ఒక్కసారి చూద్దాం.

నిడదవోలు మాలతి గారి తెలుగు తూలిక--సాహిత్యానికి పట్టుగొమ్మ ఈ బ్లాగు. చక్కటి హాస్యంతో మనతో ఎదురుగా నిలబడి చెపుతున్నట్లుండే కబుర్లు, కథలు ఈ బ్లాగరి స్వంతం. అసలు ఈ బ్లాగు లేకపోతే ఆవిడ గురించి మనలో చాలామందికి తెలిసి ఉండేది కాదు.

గేయాలు, పద్యాలు, అనుభవాలు, కవితలు, ఆశీస్సులు, దండకాలు, ఆటలు-ఒక్కటేంటి అన్నిటిని గురించి ఔపాసన పట్టిన ఓ అనుభవజ్ఞురాలు రాస్తున్న మరో ఆణిముత్యం లాంటి బ్లాగు జ్ఞానప్రసూన గారు రాస్తున్న సురుచి--మంచి మంచి రుచులు చూపించే బ్లాగు.

కొత్తపాళీ గారు పెట్టే కథల పోటీ గురించి మీకందరికి తెలిసే ఉంటుంది. అందులో మొదటి రెండు సార్లు బహుమతి కొట్టేసింది ఎవరో మీకు తెలుసా? ఆ ఆ..... మీకు తెలుసని నాకు తెలుసు. తను రాసేది తక్కువే అయినా రమ్యంగా రాస్తారు. కథలు రాయటమే కాదు పుస్తకాల గురించి, సినిమాల గురించి, టి.వి. సీరియల్స్ గురించి చక్కటి సమీక్షలు రాస్తుంటారు. అసలు ఆదివారం సెలవెందుకు? తనని అడగండి ఎందుకో చెపుతారు.

కాళ్ళాగని కాలపు అలలలో మనసు ఊహలు కొట్టుకుపోకుండా, ఈ బ్లాగులో ఊసులుగా పదిలపరచ ప్రయత్నం!! పూర్ణిమ చెప్పే ఈ ఊసుల కోసం ఎదురుచూడని వాళ్లు ఎవరు? టపా టపాకి మంచి పరిణితితో తనదైన శైలిలో వినూత్నంగా సాగుతున్న బ్లాగు ఇది. అందరిని ఆకట్టుకునే పుస్తక సమీక్షలు--- కాదు కాదు విశ్లేషణలు-- ఈ బ్లాగు ప్రత్యేకత.

బుజబుజ రేకుల పిల్లని, బుజ్జా రేకుల పిల్లని, బ్లాగేబ్లాగే పిల్లని అంటూ మీనాక్షి రాసే బ్లాగు ఎంత అల్లరల్లరిగ ఉంటుందంటే తను బ్లాగులోకంలో మరో విహారి అయిపోయింది. ఈ బ్లాగులో ఉండే ప్రాసలు, సెటైర్లు, విరుపులు, యాసలు తనకే ప్రత్యేకం.

నా గురించి..... చెప్పటం సులువు కాదు. అర్థం చేసుకోవటం కష్టం కాదు అంటూ మోహన పేరుతొ విశాల రాసే విశాల ప్రపంచం పేరుకి తగ్గట్లే షాయరీల దగ్గరినిండి వేదాంతం దాకా అన్ని తనలో పొదుపుకుంది. తనగురించి తన మాటలలోనే చదవండి--"ఎలాంటి topic లో అయినా ఇట్టే ఇమిడిపోతాను. Spirituality, Philosophy, Psychology, Mathematics, Physics, Social issues, movies, Arts, Languages, Cricket, ఇంటి పని, వంట పని... ఇలా దేని గురించైనా మాట్లాడేస్తుంటాను".

బ్లాగువనమది అందరిది..ఈ పోస్టులు అందరి కోసములే.....కొన్ని కలలు, కొన్ని ఆశలు, కొంచెం అల్లరి, కొంచెం కోపం, కొంచెం ప్రేమ, కొంచెం బాధ కలిపితే నేను..ఒక మామూలు తెలుగు అమ్మాయిని అంటూ బ్లాగువనం లో పాదుకున్న మరో కొంటె కోణంగి విద్య. అల్లరే కాదు చక్కటి కవితలు అల్లగలదు, అంతే చక్కగా కథలు, సినిమా కబుర్లు చెప్పగలదు. తన భయాలు,బెంచి కష్టాలు, మొదలైన వాటి గురించి చెప్పి మనల్ని హడలగొట్టేయనూ గలదు, కాస్త జాగ్రత్త.

అప్పుడు ఏమి జరిగిందంటే అంటూ కబుర్లు చెప్పే క్రాంతి గురించి తను చెప్పే కబుర్ల గురించి తెలియని వారెవ్వరు! తలనెప్పి నివారణకు మంచి మందు ఈ బ్లాగు చదవటం. మంచి హాస్యంతో అలరాడే బ్లాగులో ఇది ఒకటి.

మనకి తెలియని ఎన్నో ఆరోగ్యసూత్రాలని పరిచయం చేస్తూఅమరవాణి రాస్తున్న బ్లాగు. ఆయుర్వేద అభిమానులే కాదు ప్రతి ఒక్కరు చదవవలిసిన బ్లాగు ఇది.

ఇక రాజకీయాలు, సంగీతం, సాహిత్యం, పురాణాలు, సాంకేతికాలు, హైకూలు...ఇలా వైవిధ్యమయిన విషయాల గురించి ఎంతో అలవోకగా మేధ రాసే నాలో నేను కి ఎంతమంది అభిమానులో!

జాజుల జావళీలతో, అందమైన ప్రేమలేఖలతో , కథలతో మనతో ఊసులాడే ఒక జాబిలి . కవిత్వం అంటే తెలియని వాళ్ళని కూడా తన అభిమానులుగా చేసుకున్న ఓ night queen.

నాలో మెదిలే కన్నీటి అలలూ.. నాలో కరిగే పన్నీటి కలలూ.. నాలో రగిలే ఆలోచనల జ్వాలలూ.. వీటన్నింటి అక్షర రూపమే....కలలో...కన్నీటి అలలో అంటు తన కలలు, కవితలు, జ్ఞాపకాలు మనతో పంచుకోవటానికి వచ్చిన ఓ సరికొత్త బ్లాగు, మీరందరూ చూసే ఉంటారు.

ఈ సంవత్సరం వచ్చిన మరొక వైవిధ్యమైన బ్లాగరు గడ్డిపూల సుజాతగా అందరికి పరిచయమయిన సుజాత . తను మూడు బ్లాగులు రాయటం ఓ విశేషమయితే అవి దేనికదే వైవిధ్యంగా ఉండటం మరొక ప్రత్యేకత. -- గడ్డిపూలు లో రాజకీయాలు, సాహిత్యం, సినిమాలు, క్రీడలు, అణుఒప్పందం, తీవ్రవాదం, ఐ.ఈ.డీ లు(Improvised Explosive Devices), స్త్రీవాదం...... ఒక్కటేమిటి తను విశ్లేషించని విషయం అంటూ ఉండదు.

తన ఇంకొక బ్లాగు శ్రీనివాసం లో ప్రసిద్ధ కీర్తనలు భజనలు భావాలతో సహా ఏర్చి కూర్చి పెడుతున్నారు.

ఇక తన ఇంగ్లీషు బ్లాగు spice and chocolate.

మా అమ్మ నాకే కాక నా బ్లాగుకి కూడా పేరెట్టింది అంటూ మన ముందుకి వచ్చిన తొలి తెలుగు బడిబ్లాగరు గుర్తుందా? తెలుగు మాట్లాడటమే తప్పు అనుకునే ఈ కాలంలో చక్కటి తెలుగులో ఓ తొమ్మిదో తరగతి చదివే అమ్మాయి బ్లాగు రాయటం చాలా ఆనందకరమైన విషయం కదూ!

గుండె గొంతుకలోన కొట్టాడుతుంది గొంతు దాటి అది రానంటోంది అంటూ తన మనసులోని మాటని మనకి వినిపించాలని ఆరాటపడే రమణి గారి బ్లాగు---కందిపచ్చడితో బ్లాగులోకాన్ని ఓ ఊపు ఊపిన బ్లాగు.

ఈ మధ్య బ్లాగు లోకంలో చర్చలు, చలోక్తులు, వాగ్వివాదాలు, సెటైర్లతో సందడి సందడి చేస్తున్న బ్లాగు--అబ్బో ఆ మాత్రం మాకు తెలీదంటారా?? నేను చెప్పేది అదే మరి--- పరిచయం అక్కర్లేని బ్లాగు.

ఈ మధ్య మొదలైన మరో చల్ల చల్లని హాట్ హాట్ బ్లాగు ప్రియ, వైష్ణవి కలిసి రాస్తున్న ప్రియరాగాలు. ఇందులో ప్రియ రాసేవే ఎక్కువ. తను రాముడి మీద రాసిన టపా రేపిన కలకలం అంతా ఇంతా కాదు. తన వాదాన్ని చాలా సాధికారతతో రాసిన టపా ఇది.

కమ్మటి సువాసనల తలపులు మన మనసులలో నింపే జాజి ఈ విరజాజి. కొంత సాహిత్యభిలాషా, కాస్త తెలుగు భాషపై మమకారమూ, మరి కొంత తెలుగు సంస్కృతి పై గౌరవమూ, కొద్దో గొప్పో తెలుగు జాతి పైన అభిమానమూ కలిగిన అచ్చ తెనుగు ఆడపడుచు రాస్తున్న సరికొత్త బ్లాగు.

అప్పుడప్పుడు అలా కనిపించి ఊసులు చెప్పే స్వాతి చక్రవర్తి బ్లాగు కూడా ఈ మధ్య వచ్చిన బ్లాగుల్లో ఒకటి.

ఇక స్త్రీవాద రచనలు చేసే కొండవీటి సత్యవతి, కొండేపూడి నిర్మల, కల్పన రెంటాల కూడా బ్లాగులు రాయటం మొదలుపెట్టి మహిళా బ్లాగులకి ఓ పరిపూర్ణత కల్పించారు.

ఎప్పటినుండో రాస్తున్న రాధిక, జ్యోతి, సౌమ్య, స్వాతికుమారి, పద్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.

కొంగొత్తగా వచ్చిన మరో నాలుగు బ్లాగుల్ని కూడా చూద్దామా!

కాస్కో నా వాస్కోడిగామా....అమ్మో ఇదేంటి అనుకుంటున్నాలా, అదే మలి మీలే చూడండి. ఈ పిల్లకి ర పలకదంట మలి.

మహార్ణవం పేరుతో కథలు కవితలు రాస్తున్న శ్రీవల్లీ రాధిక గారు బ్లాగరుగా కొత్తే కాని వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో, ఈమాట అంతర్జాల పత్రికలో వచ్చాయి. తన కథలు కొన్ని హిందీ, తమిళ్, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి.

అందరిలాగానే మమూలు మనిషిని, కొంచం అల్లరి, కొంచం కోపం, కొంచం అలోచన, ఇంక నాకే తెలియని ఎన్నో కోణాలతో-- అంటూ మన ముందుకు వచ్చిన మరో బ్లాగరి నేను-లక్ష్మి.

ఓనమాలు లలిత గారిని గుర్తుకు తెస్తూ లలిత లలితంగా మొదలైన ఇంకొక బ్లాగు నా స్పందన.

ఇందుగలరందులేరని సందేహం వలదు, ఎందెందు చూసినా మహిళలే కనిపించు. నాకు తెలియని తెలుగు మహిళా బ్లాగర్లు మరి కొందరు ఉండి ఉండవచ్చు, వారందరికి కూడా నా అభినందనలు మరియు ఆశీస్సులు.

47 వ్యాఖ్యలు:

Ramani Rao September 16, 2008 at 12:31 PM  

బాగా చెప్పారు సిరిసిరిమువ్వ గారు ! వేళ్ళమీద లెక్కపెట్టగలిగేంతమంది మాత్రమే ఉన్న మన మహిళా బ్లాగర్లమీద "సొదే రాస్తారు" అంటూ విరుచుకుపడడం నేను ఖండిస్తున్నాను. ఈ టపాలో మహిళా బ్లాగర్లగురించి మీరు పడ్డ శ్రమ అభినందనీయం.

"ఏదైనా మన అభిరుచులని బట్టి మన ఇష్టాయిష్టాలనిబట్టి మనం ఎలాంటి టపాలని ఇష్టపడతామో ఉంటుంది కాని అది ఆడవాళ్ళు రాసారా మగవాళ్ళు రాసారా, అమ్మాయిలు రాసారా అమ్మమ్మలు రాసారా అన్నదాన్ని బట్టి కాదు. అవి మనకి నచ్చితే చదువుకోవటం లేకపోతే వదిలేయటమే. మనకోసం మన అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ బ్లాగులు రాయరు అన్నది కాస్తంత గుర్తుపెట్టుకుంటే చాలు."

నాకు చాలా నచ్చిన భావాలివి.

కొత్త పాళీ September 16, 2008 at 5:12 PM  

This is one of the best review blog posts ever, sisimu garu.
I noticed several blogs (Medha, Swathi, et al) that used to write very good posts, but have been rather inactive lately. This is a public request to all of them to come back to the blog-fold and start posting again.
Your post is doubly attracive for the links in appropriate places.
Very well done. Thank you.

మాలతి September 16, 2008 at 5:29 PM  

సిరిసిరిమువ్వ గారూ, తెల్లారి లేస్తూనే తొలికప్పుకాఫీతో చదివిన చాలా చాలా మంచి సమీక్ష. ఇందులో నేను చూడని బ్లాగులగురించి ఇప్పుడే తెలుసుకున్నాను.ఆడవారిని ఆడిపోసుకోడం 60వ దశకంలోనే మొదలయింది వాళ్లు చెప్పలేనంత బాగా రాస్తున్నారని తెల్లమయిన తరువాత. మంచి శీర్షిక పెట్టేరు. చక్కగా వ్యాఖ్యానించారు. అభినందనలూ ధన్యవాదాలు.

Unknown September 16, 2008 at 6:38 PM  
This comment has been removed by the author.
సిరిసిరిమువ్వ September 16, 2008 at 7:46 PM  

రమణి గారు ఎప్పటినుండో ఆడవారి బ్లాగుల మీద ఒక టపా రాయాలని, అది ఇప్పటికి ముడిపడింది. మీ టపా "బ్లాగు స్వయంవరం" కూడా దీనికి inspiration, మీ వెనక మేం ఉన్నాము అని చెప్పటం అన్నమాట :)

Kathi Mahesh Kumar September 16, 2008 at 7:52 PM  

చాలా బాగుంది. "సోది" అని సి.బి.రావు గారు అనడం మంచిదే జరిగింది. లేకపొతే ఈ టపా వుండేదికాదుకదా!

సిరిసిరిమువ్వ September 16, 2008 at 7:56 PM  

మాలతి గారు, ధన్యవాదాలు.
ఆడిపోసుకునేవాళ్ళని పట్టించుకోకుండా మనదైన దారిలో సాగిపోవటమే. అభినందించి ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ప్రోత్సాహం చాలు.

సిరిసిరిమువ్వ September 16, 2008 at 7:57 PM  

కొత్తపాళీ గారు, నిజమే కొంతమంది అప్పుడప్పుడు అలా మెరిసి మురిపిస్తుంటారు., వారందరికి మీ విన్నపమే నాది కూడాను.

తరుచుగా రాయకపోవటానికి నా మట్టుకు నాకు బోలెడు కారణాలు, అవన్నీ ఇంకో టపాలో విశదీకరిస్తా.

సుజాత వేల్పూరి September 16, 2008 at 9:15 PM  

వరూధిని గారు,
మీ సపోర్ట్ కి ధన్యవాదాలు! "ఆడవాళ్లు సోది రాయరు" అంటూ పురుషులెవరూ ముందుకు వచ్చి మనల్ని సపోర్ట్ చేయకపోయినా మీరు వచ్చారు, అంతే చాలు!

చూసే కన్నును బట్టే అభిప్రాయం ఏర్పడుతుంది. అంతే! సోది అనగానే సోదీ అవదు, బ్రహ్మాండం అనగానే అది బ్రహ్మాండం అయిపోదు.

Ramani Rao September 16, 2008 at 9:16 PM  

నెనర్లు! సిరిసిరిమువ్వగారు! "మీ వెనుక మేమున్నాము" అనే మాట చాలు ఒకరికొకరము మరింత ప్రోత్సాహంతో, ఉత్సాహంతో ముందుకు సాగడానికి.

Purnima September 16, 2008 at 9:53 PM  

బాగుందండీ టపా! అప్పుడెప్పుడో జ్యోతిగారి బ్లాగులో మహిళలు పాతిక మందే ఉన్నారు, ఇంకా పెరగాలని ఆశిస్తున్నాం అంటే నాకు నమ్మ బుద్ధి కాలేదు. ఇప్పటికీ కష్టమే.. నాకెటెళ్ళినా ఆడవాళ్ళ బ్లాగులే కనిపిస్తాయి. :-)

మంచి సమీక్ష.

Rani September 16, 2008 at 10:56 PM  

inthamandi lady bloggers unnaarani mee post choosaake thelisindi.
good post!!

Unknown September 16, 2008 at 11:00 PM  

ఎవరో ఏదో అంటే అది నిజమవదు కదండీ..
అన్నవాళ్ళ విజ్ఞత మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది.

ఏదేమయినా సరే మీ చేత మంచి టపా రాయించినందుకు చాలా సంతోషంగా ఉంది.

సాధికారకంగా చెప్పారు.

నిషిగంధ September 16, 2008 at 11:11 PM  

One of the best posts!! చాలా చాలా బాగా రాశారు సిరిసిరిమువ్వ గారు.. మీ టపా ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.. పూర్ణిమ అన్నట్లు కళ్ళు ఎటు తిరిగినా కనిపించే అమ్మాయిల బ్లాగుల్లో ఉండే టపాల్లో సమాచారం వైవిధ్యభరితం.. అలాంటిది 'సోది ' అని ఒక సీనియర్ బ్లాగర్ అనడం టూ బాడ్!!

Unknown September 16, 2008 at 11:47 PM  

"ఆడిపోసుకునేవాళ్ళని పట్టించుకోకుండా మనదైన దారిలో సాగిపోవటమే. " - ani rasaarey....meeku nijangaa aa udhesham unte ee tapa avasaramantaara??

Anil Dasari September 16, 2008 at 11:54 PM  

"ఆడ బ్లాగుల్లో సోదే ఉంటుందా?"

Apparently, the answer is a big loud "Nooooooo".

So, the re-framed question is, "సోది బ్లాగుల్లో ఆడాళ్లే ఉంటారా?"

చూద్దాం. దీనికి స్పందనగా మరో టపా ఎవరన్నా రాస్తారేమో.

రాధిక September 17, 2008 at 2:51 AM  

వరూధిని గారూ చాలా మంచి టపా.మంచి టైం లో వదిలారు.బ్లాగ్ చరిత్రలో చోటు కల్పించాల్సిన టపా.ప్రతీ బ్లాగుకీ ఇచ్చిన పరిచయం అద్భుతం గా వుంది,[లేడీ బ్లాగర్లు అద్భుతం గా రాస్తున్నారు కాబట్టి వాళ్ళసమీక్ష కూడా అద్భుతం గా వుంటుంది అంటారా?నేనూ కాదనను]
అదే చేత్తో పాత లేడీ బ్లాగర్ల గురించి కూడా వివరంగా రాసేసుంటే కొత్తవాళ్ళకి మాపరిచయాలు కూడా అయిపోయుండేవి కదా.
ఈ టపాకి లంకె నా బ్లాగులో ఇచ్చుకుంటాను.అభ్యంతరం లేదుకదా?
పాఠకులకు విజ్ఞప్తి.సిరిసిరి మువ్వ గారి బ్లాగు గురించి కూడా అందమయిన నాలుగుమాటలు ఎవరయినా రాస్తే అది ఈ టపాలో కలిపేసి మొత్తం లేడీ బ్లాగరుల పరిచయం లాగా నా బ్లాగులో లంకె ఇచ్చుకుంటాను.ముందస్తు నెనర్లు.

తెలుగు'వాడి'ని September 17, 2008 at 3:44 AM  

అవును ... అన్ని ఆడ బ్లాగుల్లో ఉండేది అంతా సోదే .. భవిష్యత్తులో రాబోవుచున్న సీ గాన పెసూనాంబ బ్లాగు తప్ప...

చిలమకూరు విజయమోహన్ September 17, 2008 at 4:37 AM  

ఆడవారి బ్లాగులగురించి చక్కటి విశ్లేషణ .

రిషి September 17, 2008 at 5:34 AM  

భలే రాసారు.

లేచింది మహిళాలోకం...!!!

ప్రపుల్ల చంద్ర September 17, 2008 at 6:41 AM  

నా ఉద్దేశ్యం ప్రకారం ఆడవాళ్ళు తక్కువగా ఉన్నా content విషయంలో మాత్రం మగవాళ్ళతో సమానంగా ఉన్నారు.

Anonymous,  September 17, 2008 at 9:17 AM  

హన్నా, అంతమాట అన్నారా.
ఎవరది,చెప్పండి,వాళ్ళావిడతో చెప్పి వాతలేఇద్దాం
తిక్క కుదురుతుంది.
ఒక్కముక్కలో చెప్పాలంటే ఆడ బ్లాగుల్లో జీవితం వుంటుంది.
ఆవకాయ నుండి అమెరికా సంక్షోభం వరకూ
మనకు తెలియని విషయం ఏవుంది .
పోని లెండీ ,ఇలాంటి విమర్సలు మనలో ఇకమత్యాన్ని పెంచుతాయ్.
ఏమంటారు?

cbrao September 17, 2008 at 10:05 AM  

ఇంత వైవిధ్యంగా రాస్తున్న మహిళా బ్లాగరుల గురించి ఒక చిన్న వ్యాసంలో పరిచయం చెయ్యబోవటం దుస్సాహసమే.వారికి న్యాయం జరిగిందనుకోను.కొండవీటి సత్యవతి, కొండేపూడి నిర్మల, కల్పన రెంటాల గురించి స్త్రీవాద బ్లాగులంటూ ఒక వాక్యంలో తేల్చివెయ్యటం జరిగింది.రాధిక, జ్యోతి, సౌమ్య, స్వాతికుమారి, పద్మల గురించి రాయవలసిన అవసరం ఉంది.పద్మ మోహనరాగాలు పాఠకులకు ఇంకా సరీగా తెలియదనే చెప్పాలి.జ్యోతి,సౌమ్య, స్వాతికుమారి, పూర్ణిమ సమీక్షలలో కనపడ్డారు.మిగతా వారిగురించీ రాయవలసి ఉంది. నిషీగంధ చక్కటి సీరియల్ కథ ఊసులాడే ఒక జాబిలట గురించి కూడా బ్లాగు పాఠకులకు పెద్దగా తెలియదు. వీటన్నింటినీ పరిచయం చేస్తూ మరికొన్ని వ్యాసాలు మీరు, ఇతర మహిళా బ్లాగరులు రాయవలసిన అవసరం ఉంది.సీ గాన పెసూనాంబ తన గురించి రాయలేదేమని మీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది.

cbrao September 17, 2008 at 10:17 AM  

మనసు బ్లాగరి సుజాత బ్లాగు పై కూడా సమీక్ష వెలువడింది.

కల September 17, 2008 at 10:50 AM  

ఉండదు,
మా ఆలోచనలు కనిపిస్తాయి. ఇప్పటికీ ఎప్పటికీ మమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం జరుగుతూనే ఉంది, ఉంటుంది. ఇదేదో ప్రతిపక్షాల కుట్రలా ఉంది అని నాకనిపిస్తోంది అధ్యక్షా.

Ramani Rao September 17, 2008 at 10:54 AM  

ఏంటీ? తెలుగు 'వాడీ' ని గారేదో మహిళా బ్లాగర్లను ఉసిగొల్పుతున్నారు? మహిళలు అన్నివేళలా అవేశపడరు. అవసరమనుకొన్నప్పుడేనండి. అయినా మీ గురించి మాకు తెలీదా? కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నారు.(లేని బ్లాగుల ఊసెత్తి మరీ... ఆమాత్రం అర్ధం చేసుకోలేమా? ) పెద్దవాళ్ళు , ప్రముఖులు లేనివాటికి సమీక్షలు రాసేవారి దగ్గర చెప్పండి. టప టపా మరిన్ని లేని బ్లాగుల సమీక్షలు లేదా రాసిన వాటిగురించే మళ్ళీ, మళ్ళీ రాసేస్తూ ...మీ కోరిక నెరవేరుస్తారు.

సి.బి రావు గారు: మంచి సమీక్షలు రాసేందుకు మీరుండగా ఇహ సిరిసిరిమువ్వ గారేమి రాస్తారు చెప్పండి? మీ అంత పెద్దవారితో పోటి పడగలమా మేము? మీరైతే చక్కగా విశ్లేషించగలరు. ఎదో మహిళా బ్లాగ్లరు ఇందరున్నారు సుమా! అని తెలియజేయడమే సిరిసిరిమువ్వగారి ఉద్దేశ్యం తప్పితే మీలాంటి పెద్దవారితో సమీక్షల విషయంలో పోటిపడి మనగలమా? వారి గురించి రాయలేదు, వీరి గురించి రాయలేదు అని అన్నారు కాని ఎవరి గురించి రాయలేదో వారి గురించి అవసరానికన్నా ఎక్కువ మీరు రాసేసారు కదా! పరిచయవాఖ్యలకు మాత్రమే పరిమితమయ్యారు మా సిరిసిరిమువ్వగారు! ఇంకేమన్నా ఎక్కువ పరిచయాలు కావాలంటే మీరున్నారన్న ధీమా మాది.

సుజాత వేల్పూరి September 17, 2008 at 11:15 AM  

తెలుగు వాడిని గారూ,
హవ్వ హవ్వ! ఇంత పబ్లిగ్గానా చెప్పడం!

ఇక పోతే,ఎవరో ఒకరు ఒక బ్లాగును సమీక్షిస్తేనే దానికి స్థాయి ఉన్నట్టు, లేకపోతే లేనట్టూ కాదు! సమీక్ష అనేది బ్లాగు పై అభిమానమో మరోటో ఉన్నవాళ్ళు రాస్తారు. అంతే కానీ అది బ్లాగ్ స్థాయిని నిర్థారించే కొలబద్ద మాత్రం కాదు. అలా అయితే నేను ఒక వంద బ్లాగుల మీద సమీక్ష రాయాలి మరి!

సుజాత వేల్పూరి September 17, 2008 at 11:18 AM  

అబ్రకదబ్ర,
ఈ ఫిటింగ్ ఏమిటి స్వామీ? "సోది బ్లాగుల్లో ఆడాళ్ళే ఉంటారా?"
అనగానేమి? సోదాహరణముగా వివరించుము?
every example carrys equal marks.

Ramani Rao September 17, 2008 at 11:40 AM  
This comment has been removed by the author.
Ramani Rao September 17, 2008 at 12:08 PM  

సమీక్ష విషయంలో మీతో నేను ఏకీభవిస్తున్నాను సుజాత గారు. కాని ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. ఇచ్చిన బ్లాగు సమీక్షే మళ్ళీ ,మళ్ళీ ఇస్తూ బ్లాగంతా ఒక్కళ్ళ సమీక్ష తోనే నింపేస్తుంటే నిజానికి చదవాలన్నా విసుగే. అలాంటివి చాలా చదివాను నేను. ఇక్కడ సదరు సమీక్షకుడికి/సమీక్షకురాలికో మళ్ళీ మళ్ళీ ఇచ్చే బ్లాగు సమీక్షా సొంతదారులపైన మీరన్నట్లు అభిమానమో, ఇంకోటో ఉంటే అది ఇంకోలా చూపించుకోవచ్చు కదా. "మా బ్లాగు మా ఇష్టం" అని అంటే కూడా నిజమే! కాని బ్లాగు అనేది వారి సొంతమే ఏమైనా రాసుకొంటారు, ఎవరూ కాదనరు, కాబట్టి కావాలనుకొంటే ఇంకో 100 సార్లు కూడా రాసుకోవచ్చు కాదనేవారెవరు లేరు. సిరిసిరిమువ్వ గారన్నట్లు నచ్చలేదని పక్కకి తప్పుకొంటాము కాని రాస్తూ మిగతావారిని విమర్శించడం ఎంతవరకూ సబబు?

సుజాత వేల్పూరి September 17, 2008 at 12:19 PM  

రమణి గారు,
వచ్చిన తంటా అక్కడేగా! అందుకేగా ఈ నిరసన?

Ramani Rao September 17, 2008 at 12:25 PM  

సుజాత గారు!
ఎస్! అందుకే... :)

Anonymous,  September 17, 2008 at 12:54 PM  

mali naaa peledi ammmaa uhu uhu uhu :(

lende postlu laasaaanani naa pelu laayaledaa andi

ite ee chaali boldannne laattanem

apuudu naa pelu lekapote mee pani maa amma ki cheptaa :):)

సుజాత వేల్పూరి September 17, 2008 at 5:15 PM  

లచిమి,
నువ్వు కొంచెం తొందరగా పెరిగి పెద్దయి, "ర" నేర్చుకోవా ప్లీజ్!

Anonymous,  September 17, 2008 at 5:20 PM  

maa amma gaalu paapam chaala lojulnunchi playatnistunnalu sujatha gaaalu

kaaani naaku 'La" palakatam le
maaa amma deeni plaaptam intele ani salipettsukundi

సిరిసిరిమువ్వ September 17, 2008 at 11:21 PM  

@మహేష్ గారు, ధన్యవాదాలు. అబ్బే అదేంలేదండి. సోది అనకపోయినా ఈ టపా రాసి ఉండేదాన్నే. కాకపోతే టపా పేరు, కాస్త ఉపోద్ఘాతం మార్చా అంతే.

@ed గారు, ఈ టపా ఆడిపోసుకునేవాళ్ళని పట్టించుకోకుండా రాసిందేనండి. పట్టించుకుని రాసి ఉంటే ఇది ఇలా ఉండి ఉండేది కాదు.

సిరిసిరిమువ్వ September 17, 2008 at 11:31 PM  

సుజాత గారు,మన పురుషులు గాంధారి లాంటి వాళ్ళు లేండి:).

పూర్ణిమ, tink, ప్రవీణ్, నిశిగంధ, ధన్యవాదాలు.

సిరిసిరిమువ్వ September 17, 2008 at 11:36 PM  

అబ్రకదబ్ర, ఓ పెద్ద నో అన్నందుకు ధన్యవాదాలు. "సోది బ్లాగుల్లో ఆడాళ్లే ఉంటారా"..ఎంత తెలివండి మీది!!

సిరిసిరిమువ్వ September 17, 2008 at 11:41 PM  

రాధికా, జగమెరిగిన బ్రాహమడికి జంధ్యం ఎందుకన్నట్లు మీ గురించి వేరే పరిచయం చేయాలా చెప్పండి?

తెలుగు'వాడి'ని గారు, మీ పప్పులేం ఇక్కడ ఉడకవులేండి.

సిరిసిరిమువ్వ September 17, 2008 at 11:42 PM  

విజయమోహన్, రిషి, ప్రఫుల్లచంద్ర, ధన్యవాదాలు.

సిరిసిరిమువ్వ September 17, 2008 at 11:45 PM  

లలిత గారు, నేను ఈ టపా రాసేటప్పటికి మీరింకా బ్లాగటం మొదలుపెట్టలేదనుకుంటా. మీ బ్లాగు లింకు ఇప్పుడు ఇస్తున్నాను.

సిరిసిరిమువ్వ September 17, 2008 at 11:51 PM  

రావు గారు, నేనిక్కడ 2007 మార్చి తరువాత మొదలుపెట్టిన బ్లాగుల గురించే చెప్పాను. జ్యోతి, రాధిక, స్వాతి, సౌమ్య--వీరందరు బ్లాగు లోకంలో బాగా ప్రసిద్దులే, వారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.

సిరిసిరిమువ్వ September 17, 2008 at 11:55 PM  

@కల, :)

@లచ్చిమి, అమ్మా లచ్చిమి ఏలవకు ఏలవకు నా తల్లివి కదూ, నీ గులించి కూలా చెప్తాలే. మలి నువ్వు ఇకనుండి ఎక్కువెక్కువ లాస్తూ ఉంటావుగా!

Anonymous,  September 18, 2008 at 6:36 AM  

Selective ignorance, Forced comparisons లేకుండా మంచి సమీక్ష రాశారు.

-- విహారి

వేణూశ్రీకాంత్ September 19, 2008 at 8:13 AM  

మహిళ ల బ్లాగులన్ని ఒక చోట చేర్చి ఎంత వైవిధ్యం గా వ్రాస్తున్నారో చెప్తూ చక్కగా పరిచయం చేసారు వరూధిని గారు, చాలా బాగుంది. మీరన్నట్లు ఒకరికి సోది అనిపించినది మరొకరికి ఆసక్తికరం గా ఉండచ్చు. ఎవరి అభిరుచి కి తగినట్లు వారు బ్లాగు వ్రాసుకుంటారు ఆ అభిరుచి నచ్చిన వారు ఆ బ్లాగు చదువుతారు.

జ్యోతి September 19, 2008 at 6:14 PM  

వరూధినిగారు,

హ్యాట్సాఫ్...

చాలా కష్టపడి ఈ టపా తయారుచేసారు. కొన్ని బ్లాగులు నాకే తెలీవు. మీ టపాలో చూసి అక్కడికి వెళ్ళొచ్చాను.
ఎవరు ఏమనుకుంటే మనకేంటి? మన పని మనం చేసుకుంటే సరి.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP