పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 6, 2009

నా ఉపవాస దీక్ష

మన తెలుగు వారికి చాలా మందికి రెండు పూటలా సుష్టుగా భోజనం చేయకపోతే ఏదో వెలితిగా వుంటుంది, అందులో నేను కూడా ఒకదాన్ని (ఇంతకు ముందు ముచ్చటగా మూడుపూటలా భోంచేసేవాళ్లం  లేండి, అది వేరే విషయం). ఈ మధ్య కొంతమంది డైటింగు పేరుతో రాత్రి పూట తినకపోవటమో లేకపోతే ఓ రెండు పుల్కా ముక్కలు తినో లేదా ఓ గ్లాసుడు మజ్జిగ తాగో పడుకోవటం చేస్తున్నారు. కొంతమందికి రాత్రి పూట పుల్కాలు తిన్నా ఓ గుప్పెడన్నా పెరుగన్నం తినకపోతే నిద్ర పట్టదు, అంతగా మన పొట్ట అలవాటు పడిపోయింది అన్నానికి. నాలాంటి కొంతమందికయితే ఎప్పుడైనా ఓ పూట ఏదైనా కారణం చేత అన్నం తినకపోతే ఎంత దిగులుగా ఉంటుందో!

లంఖణం పరమౌషధం అంటారు. ఏదో రోగం వచ్చినప్పుడే కాకుండా మామూలుగా కూడా అప్పుడప్పుడు పొట్టను మాడ్చుకునే వాళ్లు ఉంటారు, దాన్నే ఉపవాసం అంటారు. ఈ ఉపవాసం కొంతమంది దేవుడి పేరుతో చేస్తే మరికొంతమంది డైటింగు పేరుతో చేస్తుంటారు. ఈ డైటింగుల్లో మరలా చాలా రకాలు-అందులో రకరకాల డైటులు, వాటి గురించి ఇంకోసారి చూద్దాం.

నేనయితే ఇప్పటివరకు ఎప్పుడూ దేవుడి పేరుతో కాని డైటింగు పేరుతో కాని ఉపవాసం ఉండలేదు. ఎప్పుడైనా ఆకలి అనిపించకపోతే ఓ పూట తినకుండా వుండటమే తెలుసు. అలాంటిది ఈ మధ్య ఊరికినే కూర్చుంటే ఓ మహత్తరమైన ఆలోచన వచ్చింది. వారంలో ఓ రోజు కఠిక ఉపవాసం చేసి పొట్టకి కాస్తంత విశ్రాంతి ఇద్దామని. కఠిక ఉపవాసం అంటే మరీ పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా అని కాదు కాని రోజంతా ఒట్టి మంచినీళ్లు తాగి ఉందాం అనుకున్నా. ఈ ఉపవాసం ఒంట్లో కొవ్వు తగ్గించుకోవటానికో ఒంటి బరువు తగ్గించుకోవటానికో కాదు ఏదో కాస్త ఆరోగ్యం కోసమే సుమీ!

సరే ఆలోచన వచ్చిందే తడవు ఇక ఆలస్యం ఎందుకని మొన్నో శనివారం ఉపవాసం ఉండాలని నిశ్చయించుకున్నా! శుక్రవారం పడుకునే ముందు ఘాట్టిగా నిర్ణయించుకున్నా రేపు మంచినీళ్లు తప్పితే ఏమీ తాగకూడదు తినకూడదు అని.  శనివారం పొద్దున్నే యధావిధిగా లేచి నా నిర్ణయాన్ని ఒకసారి సమీక్షించుకున్నా. మరీ ఒట్టి మంచినీళ్లు కాదులే మంచినీళ్లతో పాటు పళ్ల రసాలు, మజ్జిగ  (ద్రవపదార్థాలు) తీసుకోవచ్చు అని నా నిర్ణయానికి కాస్తంత వెసులుబాటు ఇచ్చుకున్నా.

లేవగానే కాస్తంత తేనె నిమ్మకాయ నీళ్లు తాగా, ఏడు గంటలకి కూరగాయల రసం తాగా.  ఎనిమిది అయ్యేటప్పటికి ఠంఘున గడియారం గంట కొట్టినట్టు పొట్టలో ఉపాహార గంట మొదలయ్యింది.  అందులోనూ ఆ రోజు ఉపాహారం పావ్ భాజి.  ఇవ్వళ్టికి ఉపవాస దీక్ష విరమించుకుని ఇంకో రోజు ఎప్పుడైనా పెట్టుకుందామా అని ఓ నిమిషం ఊగిసలాడా.  చ ఒక్క రోజు ఆకలికి ఆగలేనా అని మనసుని ఘాట్టిగా రాయి చేసుకుని తొమ్మిందింటి దాకా ఉపాహార గంట వినపడనట్టే ఉన్నా, ఇక ఆ తరువాత నా వల్ల కాలేదు, ఓ అరడజను కమలాలు గబాగబా రసం తీసుకుని తాగేసా!

పనిలో పడితే ఆకలి తెలియదంటారు కాని అంతా ఒట్టిదే-దేని దారి దానిదే. పదకొండింటికి మరలా పొట్టలో పేగుల అలజడి మొదలయ్యింది. ఒక్క రోజుకి మీరింత హడావిడీ చేయాలా అని వాటిని కాస్త కసిరా, అబ్బే నా మాట వింటేగా వాటి గొడవ వాటిదే! నేనేదో వాటికి రోజుల తరబడి తిండి పెట్టకుండా మాడ్చేస్తున్నట్టు ఒకటే గొడవ గొడవ! పొట్టలో ఎలుకలు పరిగెత్తటం అంటే ఏంటో తెలిసివచ్చింది. 12:30 కి కాస్తంత మజ్జిగతో వాటిని శాంతపరిచా. రెండయింది-నా ఆకలి రెట్టింపయ్యింది-మరోసారి నా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సి వచ్చింది. మంచి నీళ్లు ద్రవ పదార్థాలతో పాటు కాసిన్ని పళ్లు కూడా తీసుకోవచ్చు అని నా కఠోర నిర్ణయానికి ఇంకో సవరణ ఇచ్చుకుని ఓ పెద్ద అరటిపండు లాగించా!

ఇలా లాభం లేదని ఓ పుస్తకం పట్టుకుని కూర్చున్నా అలా అన్నా ఆకలి తెలియకుండా వుంటుందని (పుస్తకం పట్టుకు కూర్చుంటే నీకు నిద్రాహారాలు గుర్తు రావని ఎప్పుడో కాలం నాడు మా అమ్మ అన్న గుర్తు :). ఆ పుస్తకం వట్టికోట ఆళ్వారు స్వామి వ్రాసిన 'ప్రజల మనిషి'.  ఓ ఇరవై పేజీలు చదివా కానీ ఏం చదువుతున్నానో బుర్రకి ఎక్కడంల, అసలు పుస్తకం పేరే మర్చిపోయా!. సరే నిద్ర అన్నా పోదామని ప్రయత్నించా---ఆ నిద్రా రాదే. రోజూ అయితే హాయిగా అన్నం తినగానే ఓ పుస్తకం పట్టుకుని మంచం ఎక్కితే నా ప్రయత్నం లేకుండానే కనురెప్పలు మూతలు పడిపోతాయి, అలాంటిది ఆ రోజు మాత్రం ఎంతకీ మూతపడనన్నాయి. సరే అని లేచి కాసేపు టి.వి. ముందు కూర్చున్నా అలా అన్నా నిద్రపోవచ్చని (మామూలుగా నేను టి.వి. ముందు కూర్చుంటే కూర్చున్నపళంగా నిద్రపోతా అది ఏ సమయం అయినా సరే, అప్పుడే నిద్ర లేచినా సరే!), ఊహు నిద్ర రానంటే రానంది. పొట్ట నిండుగా ఉంటే మత్తుగా నిద్రొస్తుంది కాని ఖాళీగా వుంటే ఆవలింతలు కూడా రావన్నమాట అనుకున్నా!

ఈ లోగా టైం నాలుగయింది. ఆకలి కేకలు వేస్తుంది. సరే ఎటూ పళ్లు తినొచ్చు కదా అని ఓ నాలుగంటే నాలుగు పెద్ద పెద్ద బొప్పాయి ముక్కలు తిన్నా. హమ్మయ్య కాస్త పొట్ట శాంతించింది. ఇక ఇలా అయితే రాత్రికి కూడ  నిద్ర రాదు నిద్ర పోను అనుకుని నా ఉపవాస నిర్ణయాన్ని మరోసారి పునః పునః సమీక్షించుకుని రోజంతా ఉపవాసం కాదు ఒక్క పొద్దు ఉపవాసం ఉంటే చాలు అని గడియారం ఏడు గంటలు కొట్టగానే నాలుగు పుల్కాలు చేసుకుని వేడి వేడిగా తినేసి నా ఉపవాస దీక్షని విజయవంతంగా ముగించా.

ఇదేంటబ్బా ఎప్పుడన్నా శనివారం రాత్రిపూట పుల్కాలు చేయమంటే ఆరు శనివారాలు అడిగించుకుని ఏడో శనివారం కాని చేయని అమ్మ ఇవాళ అడగకుండానే పుల్కాలు చేసింది అని మా పిల్లలు ముక్కు మీద వేలేసుకున్నారులేండి అది వేరే విషయం.

21 వ్యాఖ్యలు:

మురళి June 6, 2009 at 12:26 PM  

మరీ అంత కష్టమేమీ కాదండి..మొదట్లో అందరికీ ఇలాగే ఉంటుంది కానీ, ఓ రెండు మూడు వారాలు ప్రయత్నిస్తే చేసేయగలుగుతారు.. మంచి అలవాట్లు నేర్చుకోడం మనకి కొంచం కష్టమే కదా... మీరు రాసిన విధానం మాత్రం భలేగా ఉందండి.. బాగా నవ్వుకున్నా...

హరే కృష్ణ June 6, 2009 at 3:21 PM  
This comment has been removed by the author.
హరే కృష్ణ June 6, 2009 at 3:22 PM  

హ హ్హ ..చాలా బాగా రాసారు ..ఆఫీసు లో నవ్వుతూనే వున్నా పోస్ట్ చదువుతున్నంత సేపు ..విజవంతం చేసినందుకు అభినందనలు

జ్యోతి June 6, 2009 at 3:50 PM  

బాగు... బాగు... ఇలాగే కంటిన్యూ ఐపోండి... :)))

కొత్త పాళీ June 6, 2009 at 5:05 PM  

బాబోయ్, ఉపవాసాలు మాత్రం నా వల్ల కాదు.
ఒక ఉచిత సలహా .. ఆరోగ్యపరంగా పండు రసం తాగడం కంటే పండు తినడమే మేలు.
బాగా రాశారు.

సుజాత వేల్పూరి June 6, 2009 at 5:09 PM  

మీరు కూడా ఉపవాసాలు చేస్తున్నారా ! గట్టిగా ఏడుమల్లెల ఎత్తు ఉండరు...మీకు ఈ కష్టాలెందుకండి! అవేవో మమ్మల్ని పడనివ్వండి.

మరువం ఉష June 6, 2009 at 5:12 PM  

మీరు మరీను, అంత కష్టం కాదు సుమండీ, అలవడటానికి కొంచం సమయం పట్టవచ్చు కానీ ఉపవాసం ఆ మాటకొస్తే నిర్జలాహారంగా చేయటం కూడా ఇట్టే చేయగలరు. మన దేహం కూడా మనని పరీక్షిస్తుంది, ఇది మీ మనో నిగ్రహం కూడా అవసరపడే విషయం. అంతే.

Anonymous,  June 6, 2009 at 10:13 PM  

మువ్వలా ఉండే మీకెందుకండీ ఉపవాసాలు? నాకు అవసరమని ఇలాంటి ప్రయోగాలు చేశాను కానీ పెద్దగా వర్కవుట్ అవలేదు. అసలా ఉపవాసం మాట వింటేనే పారిపోతాను, ఎలాగో ధైర్యం చేసి ఇప్పుడొచ్చి కామెంటు రాస్తున్నా. :)

పరిమళం June 6, 2009 at 10:56 PM  

ఉపవాసం అనుకుంటే ఆరోజు బాగానే చేసేస్తా ! ఆ మరుసటి రోజు బెంగ వచ్చేస్తుంది ...పొద్దున్నే లేచి నేను నిన్నకూడా కాఫీ తాగలేదు అంటూ మొదలైన రోజు ..రాత్రి పడుకొనే వరకూ అదే విధంగా సా .....గుతుంది :) :)

Ramani Rao June 7, 2009 at 8:29 AM  

ఉపవాసం ఆరోగ్య లక్షణం అంటారు కాని అదో లంకణం. కష్టమే కాని నాకు ఇష్టమే.. కాస్త ఆ విధంగానైనా తగ్గచ్చు అని అనుకొంటూ ఉంటాను(కాని చెయ్యను అది వేరే విషయం.. :) ) , పూర్తి ఉపవాసం కాస్త ఇబ్బందే.. సుజాత గారు, చెప్పినట్లు ఏడు మల్లెల ఎత్తు బంగారుబొమ్మలకి(సుజాతగారిని కూడా కలపొచ్చు) ఉపవాసాలు అవసరం లెదండి.

@సుజాతగారు: మీరు మాత్రం.. మీకు కూడా ఉపవాసం అవసరం లేదు. :) నేననాలి ఆ తిప్పలేవొ నన్ను పడనివ్వండి అని.. కాని నేను అననండి.. నేను ఉపవాసం చెస్తానంటే మా ఇంట్లో అందరూ హ్యాపీస్.. హమ్మయ్య కాస్త ఇలా చేస్తే స్లిమ్గా చూడొచ్చు అని ...ప్చ్! తివిరి ఇసుకన తైలంబు తీయవచ్చూ.... చేరి నా లాంటి మూర్ఖురాలిని మార్చలేరు..పాపం

మొత్తానికి ఏది ఏమైనా ఉపవాస దీక్ష దిగ్విజయంగా సాగించి, పుల్కాల పట్టుతో విరమించిన వైనం బాగుంది.

సిరిసిరిమువ్వ June 7, 2009 at 9:48 AM  

@సుజ్జి, శ్రీధర్, హరేకృష్ణ, జ్యోతి, కొత్తపాళీ, ధన్యవాదాలు.

@మురళి, ఉష, ధన్యవాదాలు. నిజమే ప్రయత్నిస్తే ఏదైనా చేయవచ్చు. మామూలుగానే నేను ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏది పడితే అది ఎంత పడితే అంత తినను. ఎవరింటికన్నా వెళ్లినా నేను తినని వాటిని మొహమాటం లేకుండా తిరస్కరిస్తాను. బయటకు వెళ్లినప్పుడు అంత నిక్కచ్చిగా ఉండకూడదు అని కొంతమంది తిడుతూ ఉంటారనుకోండి:). ఎప్పుడూ పొట్టను కాస్తంత ఖాళీగానే ఉంచుతాను. అందుకే ఉపవాసాల మీదకి అంతగా దృష్టిపోదు, కాకపోతే అప్పుడప్పుడు చేస్తే మంచిది కదా అని ఏదో ప్రయత్నించాను.

@సుజాత, అరుణ, రమణి, ఏంటో చాలామంది మీకు వాకింగు ఎందుకండి, మీకు డైటింగు ఎందుకండి అంటుంటారు, ఏదో ఈ రెంటి మీద లావుగా ఉండేవాళ్లకే సర్వ హక్కులన్నట్టు! ఈ రోజులలో ఎవరికైనా ఈ రెండూ మరీ ముఖ్యంగా నడక అవసరమే అని నా అభిప్రాయం.

@పరిమళం, మీకు కాఫీ ఉంటే ఇంకేమి అక్కర్లేదన్నమాట!

వేణూశ్రీకాంత్ June 7, 2009 at 6:41 PM  

హ హ భలే రాసారు. ఈ రోజు ఉపవాసం చేయాలి అన్న ఆలోచనే ఆకలి ని మాములు రోజు కన్నా రెండింతలు చేసేస్తుంది :-) అయినా ఉన్నట్లుండి ఒక రోజు అంతా ఉపవాసం ఉండటం కష్టమండీ.. మెల్లగా అంచెలంచెలు గా అలవాటు చేయాలి...

మాలతి June 7, 2009 at 9:25 PM  

:)) అచ్చంగా నాబాధే రాసేసినట్టుంది. ఇంకా నాలాటివాళ్లు వుంటారని తెలియజేసినందుకు సిరిసిరిమువ్వగారూ, ధన్యవాదాలు. ఎందుకొచ్చిన ఉవవాసాలులెద్దురూ.

మాలా కుమార్ June 8, 2009 at 3:13 PM  

బాగుందండి మీ ఉపవాస కథ.

విశ్వ ప్రేమికుడు June 10, 2009 at 7:42 PM  

హ హ హా.. బాగున్నాయి మీ పాట్లు :)

"అల్పారంభో కార్య సాధకః"
ఏ పనైనా సాధించాలంటే చిన్నగా మోదలు పెట్టి ముందుకు వెళ్లడం తెలివైన పని.

నాకు సరిగ్గా ఆ సంస్కృత పదం గుర్తులేదు కానీ... భావం మాత్రం దాదాపు అదే. మీరు ఒకేసారి కటిక ఉపవాసం మొదలు పెట్టె కంటే చిన్న చిన్న నియమాలతో ప్రయత్నిస్తే త్వరలో కటికక ఉపవాసం స్థాయికి యెదగ గలరు.

నేస్తం June 12, 2009 at 4:22 AM  

ఇంతకు ముందు ఉపవాసాలంటే ముందు ఉండేదాన్ని గాని ఈ మద్య నా వల్ల కావడం లేదు ..నేను కూడా మీలాగే కటిక ఉపవాసం ఉండకూడదంట అని ఒక ముక్క పట్టుకుని పళ్ళు,రసాలతో ఉపవాసం చేస్తున్నా ..నోము లప్పుడు,కార్తీక మాసం లోను ..

లక్ష్మి June 15, 2009 at 10:31 AM  

:))

pch...naku edo oka karanam to prati varam upavasam tappatam ledu, but oka poddelendi

Anonymous,  June 24, 2009 at 3:58 PM  

మీ కధ చదువుతుంటే , కోతి ఉపవాసం కధ గుర్తొచ్చింది .
ఉపవాసం చేస్తే నీరసం వస్తుంది కదా చెట్టెక్కి పళ్ళు కోయలేను అని ముందే కోసుకొని ,దూరంగా వుంటే జరిగి తీసుకోలెనేమో అని దగ్గరగా పెట్టుకొని , అమ్మో ఉపవాసం పూర్తయ్యేసరికి చాలా నీరసం వచ్చేస్తుంది అపుడు చెయ్యయినా కదపగలనా అని నోట్లోనే పళ్ళుపెట్టుకు కూర్చుంటుంది. చివరికి నోట్లో వుంటే ఒకటీ కడుపులో వుంటే ఒకటీనా అని గుటుక్కుమనిపిస్తుంది. అలావుంది మీ దీక్ష కుదింపు

Ram Krish Reddy Kotla July 4, 2009 at 12:16 PM  

సిరిసిరిమువ్వ గారు బాగుందండీ మీ ఉపవాస దీక్ష...నేను కూడా మీలాగే ఇలాంటి దీక్షలు ట్రై చేసి విరమించుకున్నాను... కానీ ఇపుడు మాత్రం రాత్రి కేవలం చపాతీతోనే సరిపెట్టుకుంటున్నా..ఏం చేస్తాం సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు...మరీ ఎక్కువ తింటే పొట్ట వచ్చే ప్రమాదం ఉంది కదా...అసలే పెళ్లి కావలసిన వాడిని..హ హ

రాధిక July 10, 2009 at 8:33 AM  

పెళ్ళి కాకముందు నాకు ఉపవాసాలు చెయ్యడం అంటే చాలా ఇష్టం.మంచి మొగుడొస్తాడని కాదులెండి.అయ్యో పాపం పిల్ల ఏమీ తినలేదు పచ్చి మంచి నీళ్లు కూడా తాగట్లేదు అని అందరూ ప్రత్యేక ఆశక్తి చూపిస్తూ అన్ని అమరుస్తూ వుంటే భలే వుండేది.స్కూల్లో టీచర్లు కూడా చాలా ప్రత్యేకం గా చూసేవారు.ఇప్పుడయితే ఉపవాసం నేనే చెయ్యాలి,ఇంట్లో వాళ్లకి వంటా నేనే చెయ్యాలి.అందుకే నాకు ఉపవాసం అంటే నచ్చట్లేదు.కానీ వరలస్మివ్రతం,కార్తీక మాసం లో సోమవారాలు ఇలాంటి ప్రత్యేకరోజుల్లో తప్పక ఏస్తాను.అంటే భక్తి తో కాకపోఇనా కొన్ని అలవాట్లని, జ్ఞాపకాలని మిస్ అవ్వకూడదని.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP