పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

May 18, 2009

లోక్‌సత్తా సత్తా

హమ్మయ్య..ఓ నెల రోజుల ఎదురుచూపుల తరువాత ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చర్చలు, వాదోపవాదాలు ముగిసాయి. మన మీడియా మాత్రం ఎన్నికల ఫలితాల మీద చర్చల్ని ఇంకా సాగతీస్తూనే ఉంది. నాకెందుకో ముందునుండీ ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కాంగ్రెస్సే ఎలాగోలా మళ్లీ అధికారంలోకి వస్తుందనిపించింది.  రాష్ట్రంలో కాసిన్ని సీట్లు తగ్గితే చిరంజీవితో పొత్తుతో అధికారంలోకి వస్తుందనుకున్నా కాని తన స్వంత బలం మీదే అధికారంలోకి వచ్చింది. ఇది కాంగ్రెస్సు గెలుపు అనటం కన్నా మహాకూటమి ఓటమి అనవచ్చేమో.  గెలుపోటముల మధ్య తేడా ఒకే ఒక్క శాతం. కాంగ్రెస్సుకి వచ్చిన ఓట్లు 36 శాతం మాత్రమే అంటే  64 శాతం ప్రజలు కాంగ్రెస్సుని వద్దనుకుంటున్నారన్నమాట! అయినా ఈ మైనార్టీ నాయకులే మన పాలకులు, ఇదీ మన ప్రజాస్వామ్యం!

ఈ సారి కేంద్రంలో కూడా  అలకలకొలికి లెఫ్టుతో, తంపులమారి లాలూతో సంబంధం లేకుండా కాంగ్రెస్సు అధికారం చేజిక్కించుకున్నందుకు నాకయితే సంతోషంగా ఉంది. మాట్లాడితే మద్దతు ఉపసంహరించుకుంటామన్న బెదిరింపులు, ఈ పేచీకోరు పొత్తులతో ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో  అన్న చింత ఇకపై ఉండదు.

అసలు రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు అన్న దాని కన్నా నేను ముందునుండి ఎదురుచూసింది లోక్‌సత్తాకి ఎన్ని ఓట్లు వస్తాయి అనే.  లోక్‌సత్తాకి వచ్చిన ఓట్ల శాతం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. లోక్‌సత్తాకి ఓటు వేయటం అంటే మీ ఓటు మురగపెట్టుకోవటమే అన్న వాళ్లు ఉన్నారు, హేళనగా నవ్విన వాళ్లు ఉన్నారు, అసలు లోక్‌సత్తా అభ్యర్థులకి డిపాజిట్టు అన్నా దక్కుతుందా అని చులకనగా చూసిన వాళ్లూ ఉన్నారు, ఈ సారికి మేము సాంప్రదాయకంగా ఎప్పుడూ ఓటు వేసే మా సాంప్రదాయక పార్టీకే ఓటు వేస్తాం-వచ్చేసారి లోక్‌సత్తాకి చూద్దాంలే అన్న వారూ ఉన్నారు.....కానీ ఇప్పుడు లోక్‌సత్తాకి వచ్చిన ఓట్లే మిగతా పార్టీల గెలుపోటములని ప్రభావితం చేయటంతో లోక్‌సత్తా సత్తా ఏంటో అందరికీ అర్థం అయిపోయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదు పరిథిలో తెలుగుదేశానికి తీరని నష్టం తెచ్చింది లోక్‌సత్తానే!

ఏదేమైనా ఎప్పటికైనా లోక్‌సత్తా అథికారంలోకి రావటం కల్ల అంటున్నారు జనాలు. ఇక్కడ అధికారం కాదు ముఖ్యం. ప్రజల గోడుని ప్రభుత్వం దాకా తీసుకెళ్ల గలిగే నాయకులు కావాలి, అధికారం లేకపోయినా ప్రజల సమస్యలకి బాధ్యత వహించే నాయకులు కావాలి. అలాంటి నాయకులు ఒక్కళ్లున్నా చాలు. వచ్చే ఎన్నికల తరువాత ఈ ఒక్కడికి మరో నలుగురు తోడయినా చాలు.

అసలు గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా ఈ EVM లు వచ్చాక ఫలితాలు త్వరత్వరగా వెలువడుతుంటే నాకయితే అస్సలు నచ్చలేదు.  ఇదివరకటి మజా లేదు.  తెల్లవారుజాము దాకా టి.వి. ముందు కూర్చుని ఓ పుస్తకం కలం తీసుకుని రాష్ట్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా, అభ్యర్థుల పేర్లతో  పట్టికలు  గీసుకుని ఎవరెంత లీడింగులో ఉన్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తున్నాయి, ఎవరెన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు అని మన లెక్కలు మనం వేసుకోవటంలో ఓ ఆనందం ఉండేది.  మరుసటి రోజు సాయంత్రం దాకా కూడా కొన్ని ఫలితాలు వస్తుండేవి. ఇప్పుడేంటి అన్నం వేళకే దాదాపు అన్ని ఫలితాలు తెలిసిపోతుండే! మెజార్టీలు కూడా చూడండి ఎంత తగ్గిపోయాయో! అప్పట్లో పెద్ద పెద్ద నాయకుల మెజారిటీ లక్షల్లో ఉండేది. 10,000 కి తక్కువ మెజార్టీ చాలా తక్కువగా కనపడేది. 1999 ఎన్నికలప్పటి ఎన్నికల లెక్కల పుస్తకాలు ఇంకా మా ఇంట్లో ఉన్నాయి!

15 వ్యాఖ్యలు:

చైతన్య.ఎస్ May 18, 2009 at 1:27 PM  

మీరు చెప్పినట్టే జరిగేది మాఇంట్లో కూడా. మా నాన్న ఒక పేపర్, పెన్సిల్ తీసుకొని తెగరాసేవారు. రాష్ట్రాల వారీగా, పార్టీల వారీగా పట్టిక తయారు చేసేవారు. అప్పుడప్పుడు వెళ్ళి స్కోర్ తెలుసుకునే వాళ్ళం :)

Gavesh May 18, 2009 at 3:21 PM  

లోక్ సత్తా అధికారంలోకి రానక్కర్ లేదు, రాజకీయాలను మంచి దారి పట్టించగలిగితే 294 సీట్లూ గెలిచినట్టే. కానీ మీరన్నట్టుగా లోక్ సత్తా వల్లనే టీ.డీ.పీ వారు ఓడిపోయారన్నది కొంతవరకూ నిజం కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే...
1. ఒక వేళ లోక్ సత్తా పార్టీ లేకపోయి ఉంటే, ఇప్పుడు లోక్ సత్తాకు వోటు వేసిన వారిలో సగం మంది అస్సలు వోటేసే వారే కాదేమో(నేనూ ఒకన్ని).
2. లోక్ సత్తాకు వేసిన వాళ్ళు, ఒక వేళ లోక్ సత్తా లేకపోయి ఉంటే, కాంగ్రెస్సుకే వేసుంటారనీ చెప్పలేం కదా??
మీ అభిప్రాయాలను తెలియజేయండి.

సిరిసిరిమువ్వ May 18, 2009 at 4:02 PM  

చైతన్య గారు, :)

Gavesh గారూ, ధన్యవాదాలు. గ్రేటర్ హైదరాబాదులో మాత్రం లోక్‌సత్తా ప్రభావం బాగా ఉందండి. ఉదాహరణకి శేరిలింగంపల్లి నియోజకవర్గమే తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్సు పార్టీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ 1330, ఇక్కడ లోక్‌సత్తాకి వచ్చిన ఓట్లు 27326. మీరన్నట్లు లోక్‌సత్తా లేకపోతే ఇందులో సగం మంది అసలు ఓటే వేసి ఉండరనుకున్నా, మిగతా సగంలో సగం కాంగ్రెస్సుకి వేసి ఉంటారనుకున్నా, మిగిలిన సగంలో సగం అయినా తెలుగుదేశానికి పడి ఉండేవి కాదా!

అంతెందుకు ఇదే నియోజకవరగంలో హైదర్‌నగర్, వివేకానందనగర్ డివిజన్లలో ఎప్పుడూ తెలుగుదేశానికే ఆధిక్యత వస్తుంది. ఈ సారి కూడా ఈ రెండు డివిజన్‌లలో TDP కి మంచి ఆధిక్యతే (సుమారు 8000) వచ్చింది, ఇక్కడ లోక్‌సత్తాకి వచ్చిన ఓట్లు 12,000. ఈ 12000 లల్లో ఖచ్చితంగా 10,000 తెలుగుదేశానివే. ఈ రెండు డివిజన్లే చాలన్నమాట లోక్‌సత్తా లేకపోతే శేరిలింగంపల్లి స్థానం TDP గెలిచి ఉండేదని చెప్పటానికి.

chaitanya May 18, 2009 at 7:35 PM  

నేను కూడా జే.పీ గారికే వోటు వేశాను. ఆయన గెల్చినందుకు సంతోషం కాని ఆయన ఒక్కడే గెల్చినందుకు విచారం :(
ఈ శనివారం లోకల్ టీవీ లో జే.పీ గారి ఇంటర్వ్యూ చూసాను...ఆయన ఒక మాటన్నారు..'కేవలం అధికారం కోసం రాజకీయాల్లోకి రావటం నా ద్రుష్టిలో లేకితనం' అని :)

మధు May 18, 2009 at 9:20 PM  

జయప్రకాష్ గారి మీద ఆయనికి వోట్లేసినవాళ్ళే కాదు...వేయని వాళ్ళు కూడా చాలా ఆశలున్నాయి. చెప్పినదాన్ని చేతలలో చూపించి మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తారని ఆశిద్దాం.

శరత్ కాలమ్ May 19, 2009 at 12:30 AM  

నాకు లోక్‌సత్తా పార్టీ పేరు నచ్చదు. హిందీ పేరులా అనిపిస్తుంది - అచ్చమయిన తెలుగుపేరులా అనిపించదు. జనసత్తా అని పేరు పెట్టివుంటే బావుండేదేమో కానీ అది నక్సలైట్ పార్టీ పేరులా అనిపిస్తుందేమో.

సిరిసిరిమువ్వ May 19, 2009 at 8:17 AM  

@క్రిష్ణ గారు, బాగుంది మీ విశ్లేషణ.

@చైతన్య, next time better luck అనుకుందాం. అయినా ఆయన ఒక్కడే అయినా వందమంది పెట్టులేండి.

@ మధు గారు, అందరి ఆశ ఆకాంక్ష అదే, చూద్దాం జె.పి.గారు ఎంతవరకు మన ఆశలు నిలపెడతారో!.

@ శరత్ గారు, నిజమే హిందీ పేరు లాగా ఉంటుంది. ముందు లోక్‌సత్తా ఒక సంస్థగా పుట్టి తరువాత పార్టీగా మారింది కదా ఇక అదే పేరుతో కొనసాగుతున్నారు.

పెదరాయ్డు May 19, 2009 at 8:26 AM  

శరత్, తెలుగు పేరే ఎ౦దుక౦డీ. భవిష్యత్తులో లోక్ సత్తా దేశ౦మొత్త౦ విస్తరిస్తు౦ది చూడ౦డి.

జనసత్తా అని పేరు పెట్టివుంటే బావుండేదేమో కానీ అది నక్సలైట్ పార్టీ పేరులా అనిపిస్తుందేమో - :)

మేధ May 19, 2009 at 12:06 PM  

అవును నిజమే... ఈ లు నాకు నచ్చలేదు..
అంతకుముందైతే చక్కగా రాత్రంతా, సినిమాలు వేస్తూ ఉండేవారు -- పక్కనే ఫలితాలు చూపిస్తూ ఉండేవారు.. నా చిన్నప్పుడు నాకు ఫలితాలు ఏమీ అర్ధం కాకపోయినా, సినిమా కోసం మేలుకుని ఉండేదాన్ని :) తరువాత-తరువాత ఫలితాల కోసం మేలుకుని ఉండేదాన్ని.. :)
కానీ ఇప్పుడే ఇలా, మధ్యాహ్నం కల్లా తెలిసిపోతోంది..

మీరన్నట్లు 36% ఓట్లు మాత్రమే వచ్చిన కాంగ్రెస్ మమ్మల్ని ప్రజలు కోరుకున్నారు అంటుంటే, నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు!

సుజాత వేల్పూరి May 19, 2009 at 2:01 PM  

వోట్లు కొనకుండా గెలవడం ఎలాగో జేపీ చూపించారు. ఇది ఆ పార్టీ భవిష్యత్తులో సాధించబోయే నైతిక విజయాలకు ఒక నాంది మాత్రమే! ఒకే ఒక్కడు! అయితేనేమి 294 మంది పెట్టు!

లోక్ సత్తా లక్ష్యం అధికారం కాదు! మంచి రాజకీయం! వచ్చే ఎన్నికల్లో అధికారం కాకపోయినా బలమైన సంఖ్యలో ప్రతినిధుల్ని ప్రతిపక్షంలో కూచోబెట్టగలదు లోక్ సత్తా! బలమైన ప్రతిపక్షమే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. ఇదే ప్రజాస్వామ్య విజయ రహస్యం!

శేరిలింగంపల్లి లో శ్రీనివాస్ గారికి అన్ని వోట్లు వచ్చాయంటేనే తెలుస్తోంది ఏ స్థాయిలో పార్టీ ప్రభావం చూపించిందో!

ప్రజావాణిని వినిపిచడానికి అసెంబ్లీ లో అడుగుపెట్టబోతున్న నిజమైన ప్రజల నాయకుడు జేపీ!

మురళి May 21, 2009 at 12:08 PM  

రెండు రోజులుగా మీ బ్లాగు ఓపెన్ కావడం లేదండి.. ఏదో సాంకేతిక సమస్య.. ఇప్పుడే చదివాను మీ టపా.. ఇప్పుడు రౌండ్ల వారీ గా ఫలితాలు ఇంటర్నెట్ లో దొరుకుతున్నాయి కదా.. అలా పుస్తకాలలో రాసుకునే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది.. ఇక లోక్ సత్తా కి ఇది శుభారంభం..

మంచిబాలుడు-మేడిన్ ఇన్ వైజాగ్. May 30, 2009 at 2:20 PM  

లోక్ సత్తా పార్టీ.. ప్రభావం ఈ ఎలెక్షన్లో నిజంగానే ప్రజల మీద పడింది. కాని దురదృష్టం ఏమిటంటే మిగతా పార్టీల లాగా ఈ పార్టీ డబ్బు ను ఎర గా చూపించలేదు.కేవలం ప్రజలమీద నమ్మకం తో, పోటీ చేసింది. కుకట్ పల్లి లో జే.పి గారు గెలిచారంటే అది అక్కడ ప్రజల మద్దతు పరిపూర్ణంగా వుండటమే .

Anil Dasari May 30, 2009 at 3:03 PM  

విశాపట్నం సుబాలుడు గారు :-)

మీ వ్యాఖ్యలో కొంత అతిశయోక్తి ఉంది.

>> "కుకట్ పల్లి లో జే.పి గారు గెలిచారంటే అది అక్కడ ప్రజల మద్దతు పరిపూర్ణంగా వుండటమే"

కూకట్ పల్లిలో ఉన్న రెండున్నర లక్షల పైచిలుకు వోట్లలో పోలైనవి రెండు లక్షల్లోపు, వాటిలో జేపీకి పడింది డెబ్భై వేల చిల్లర. ఆయనకి వ్యతిరేకంగా పడ్డ వోట్లు అంతకన్నా ఎక్కువ - కాకపోతే అవి చీలిపోయాయి. కాబట్టి ఆయనకి ప్రజల మద్దతు పరిపూర్ణంగా ఉందటనం సరికాదు.

That said .... మన ఎన్నికల వ్యవస్థ అలాంటిది. ఎలాగైతేనేం, అడ్డదారుల్లో మభ్యపెట్టకుండా ఓ మంచోడు గెలిచాడు. చాలా గొప్ప విషయం ఇది.

Anonymous,  December 26, 2009 at 11:48 AM  

http://dedicatedtocpbrown.wordpress.com/2009/12/25/%E0%B0%97%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%8E%E0%B0%A8%E0%B0%95%E0%B0%BE-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF-n-d-tiwari-%E0%B0%AE%E0%B1%81%E0%B0%B8%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A1/

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP