పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 8, 2012

వెలలేని మా ఖజానా...

హైదరాబాదులోని నౌబత్ పహాడ్ కింద ఖజానా ఉందో లేదో కానీ అంతకన్నా విలువైన ఖజానా మా  ఇనప్పెట్టెలో ఉండిపోయింది ఇన్నాళ్లు. ఈ ఖజానాని వెలికితీయటానికి స్పూర్తినిచ్చిన వంశీ గారికి ధన్యవాదాలు. ఇనప్పెట్టెలో భద్రంగా ఉన్న వీటిని అప్పుడప్పుడు తీసి చూసుకుంటూ ఉంటాం కానీ ఇలా వెలికితీయాలన్న ఆలోచన వంశీ గారి టపా చూసాకే కలిగింది.

చిన్ననాటి వస్తువులు, ఉత్తరాలు, స్నేహితులు, పరిసరాలు, జ్ఞాపకాలు...ఏవైనా మనకి అపురూపమే. కొన్నిటిని తలుచుకుంటూ...కొన్నిటిని చూసుకుంటూ...."గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్" అనుకుంటూ ..

ఎప్పుడో క్లాసులో టీచరు "congratulations" అంటూ చక్కగా అక్షరాలు చెక్కి ఇచ్చిన చాక్ పీసుని ఇప్పటికీ భద్రంగా దాచుకున్న నేను...

ఏంటో నా ఈ పిచ్చి..నాలాంటి పిచ్చోళ్ళు అసలుంటారా అనుకుంటుండే దాన్ని... కానీ బ్లాగుల్లోకి వచ్చాక తెలిసింది నాలాంటోళ్లు చాలామందే ఉన్నారని. ముఖ్యంగా వంశీ గారి ఖజానాలు చూస్తుంటే నాకు నన్ను నేను చూసుకుంటున్నట్టే ఉంటుంది.  ఆయనవి తరగని ఖజానాలనుకోండి!

చిన్నప్పుడు మా నాయనమ్మకి రాత్రి పూట కాళ్ళు వత్తితే నాకూ ..మా అన్నయ్యకి రోజూ చెరొక ఐదు పైసలు ఇచ్చేది..తర్వాత పది పైసలు..పదిహేను పైసలు..మా వయస్సుతో పాటు అలా అలా పెరిగి ఇరవైతో ఆగిపోయింది.  అవన్నీ భధ్రంగా కిడ్డి బ్యాంకుల్లో దాచుకునేవాళ్లం. తిరునాళ్లలో మామిడికాయ ముంతలు..యాపిల్ కాయ ముంతలు అమ్మేవాళ్ళు..మొదట్లో వాటిల్లో దాచుకునే వాళ్ళం..తర్వాత ఈ బొమ్మలు.



  




ఇదిగో ఈ అమ్మాయి బొమ్మ నాది..ఇందులో  బయటపడ్డ సంపద..అక్షరాలా అరవై తొమ్మిది రూపాయలు..







ఈ ఆంధ్రా బాంకు బుడ్డాడు మా అన్నయ్యది..ఇందులో బయటపడ్డ సంపద అక్షరాలా యాబది రూపాయల పన్నెండు పైసలు!


 ఈ నిధుల వెలికితీతలో  బయటపడ్డ  అపురూపమైన నాణాలు కొన్ని చూడండి..

                 1977 నాటి క్వార్టరు డాలరు..


                   1947 బ్రిటిష్ పాలన నాటి రూపాయి నాణెం..


 
                   1946 బ్రిటిష్ కాలం నాటి అర్థరూపాయి నాణెం....


                గాంధీ స్మారక 20 పైసల నాణెం..


ఇన్నాళ్లు మా ఇనప్పెట్టెలో ఉన్న ఈ సంపదని మొన్న ఇంటికెళ్ళినప్పుడు భధ్రంగా తెచ్చుకున్నా. మా అన్నయ్యది కూడా నేనే తెచ్చేసుకున్నా:)

11 వ్యాఖ్యలు:

శ్రీనివాస్ పప్పు March 8, 2012 at 3:20 PM  

చాలా చాలా బాగున్నాయండి మువ్వగారూ మీ ఖజానాలు,మర్చిపోలేని తీపిగుర్తులూ కూడా.

రాజ్ కుమార్ March 8, 2012 at 3:47 PM  

వావ్.. భలే ఉన్నాయండీ..
నాకు కొన్ని గుర్తొస్తున్నాయ్... చెప్పేస్తాను.

నా చిన్నప్పుడూ సంత లో కొన్న మట్టిడిబ్బి ఉండేది.
డబ్బులు దాచుకోమని అమ్మ కొనిచ్చినది అన్నమాట.
అందులో కాసులు మాత్రమే వెయ్యాలీ, కాగితాలు వెయ్యకూడదూ, నల్లగా మాడీపోతాయ్ వేస్తే అని చెప్పారు నాకు. సంవత్సరం పైన నేనూ, తమ్ముడూ అందులోనే దాచుకునే వాళ్ళం.

మధ్యలో నేను ఒకసారి అతితెలివి ఉపయోగించీ తాతయ్య ఇచ్చిన పదిరూపాయలు/ఐదురూపాయల నోట్లతో కొనుక్కు తినేసీ, వాటికి బదులు తెల్లకాగితం మడిచి డిబ్బీలో పడేసీ "అరెరె.. మరిచిపోయి నోట్ డిబ్బీ లో వేసేశాను" అన్నాను. పోనీలే అని ఊరుకున్నారు.

కొద్ది రోజుల తర్వాత నాన్నగారి చేతిలోంచి డిబ్బీ జారిపడి పగిలిపోయింది. నా బండారం బయట పడింది. ;)

తర్వాత ఇలాక్కాదని ప్లాస్టిక్ ది ఇచ్చారు. మీరు ఫోటో పెట్టారుగా అలాంటిది. దానికి కిందన మూత ఉంటుందిగా. ఇహ చూస్కోండి. పైనుండి వెయ్యటం కింద నుండి లాగెయ్యటం. అది ఎప్పుడూ నిండలేదు ;)

ఇక్కడ పోస్ట్ రాసేశానని తిట్టుకోవద్దండీ. నా తప్పేం లేదు. మీ పోస్ట్ మహిమ.. ;) ;)

సుభ/subha March 8, 2012 at 8:03 PM  

:):):)
Happy Women's Day andii..

మాగంటి వంశీ మోహన్ March 8, 2012 at 8:48 PM  

Lovely..Lovely....Thanks for sharing your treasure and letting me know...Will come back tomorrow in leisure...

Thank you madam

Maganti Vamsi

జయ March 8, 2012 at 9:02 PM  

అసలైన ఖజానాలివేనండి. నా రకరకాల ఖజానా కూడా చూసుకుంటూనే ఉంటాను. వంశీ గారు, మీరు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారండి. మీకు Congrats & happy women's day.

మధురవాణి March 9, 2012 at 4:21 PM  

భలే ఉన్నాయండీ బొమ్మలు.. ఎంత భద్రంగా దాచుకున్నారో మీరసలు.. నిజంగా ఇలాంటి జ్ఞాపకాలే అమూల్యమైన ఆస్తులు.. :)

Kottapali March 10, 2012 at 7:22 AM  

పుట్టింటి ఆస్తులు! :)

పరిమళం March 22, 2012 at 5:27 PM  

:) :)మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

సుభ/subha March 23, 2012 at 7:29 PM  

ఉగాది శుభాకాంక్షలండీ:)

సిరిసిరిమువ్వ March 26, 2012 at 10:05 AM  

పరిమళం గారూ, సుభ గారూ ధన్యవాదాలు..

మీకు కూడా నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

మాలతి April 12, 2012 at 2:27 AM  

చాలా ఆలస్యంగా చూస్తున్నా, క్షమించాలి. నాణేలు అపురూపంగా దాచుకోండి. వాటికి చాలా విలువ రాబోయేతరంలో. అన్నట్టు మీదగ్గర 1950కి ముందు ఉండే చిల్లి కానీ ఉందా?

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP