పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

November 10, 2011

కార్తీక మాసం వనభోజనాలు..నేనూ నా వంటలు.. నస రస

సమయం ఉదయం 6:30..అప్పుడే మంచం మీదనుండి లేచిన నా స్వగతం.....

అబ్బో చాలా టైం అయింది..రోజు రోజుకి బద్దకంగా తయారవుతున్నాను.
పిల్లకి కాలేజీ 11 గంటలకేమో కానీ ఉదయం లేవటానికి బద్దకం వచ్చేస్తుంది.
ఇవాళ ఏం కూరలు వండాలో!
అబ్బ..వెధవ వంట..ముందు పేపరు చదివి అప్పుడు వంట సంగతి చూద్దాం.

వంట అంటే గుర్తుకొచ్చింది..ఇవాళ కార్తీక పౌర్ణమి కదా!
ఉపవాసం ఉందామా....ఉందాం..ఉందాం.
రోజంతా ఏం తినకుండా ఉండగలమా?
చూద్దాం..ఎప్పుడు ఆకలయితే అప్పుడు ఉపవాసం లేదనుకుని తినేద్దాం:)

ఉపవాసం అంటే గుర్తొచ్చింది .....
జ్యోతి గారు బ్లాగుల్లో ఇవాళ వనభోజనాలు అన్నట్టున్నారుగా....మర్చేపోయాను!
పోయిన సంవత్సరం కూడా నేను వెళ్లలేదు వనభోజనాలకి.
ఈ జ్యోతి గారు ఒకళ్ళు..చూసి చూసి పౌర్ణమి రోజు....వారం మధ్యలో పెట్టకపోతే ఏ ఆదివారమో పెట్టొచ్చుగా!
కాస్త స్థిమితంగా బోలెడు రకాలు చేసుకెళ్ళొచ్చు.
ఇప్పటికిప్పుడు స్పెషల్సు ఏం చేయాలబ్బా!
పోన్లే ఇంట్లో చేసే కూరలే పట్టు కెళదాం..
ముందుపేపరు చదివి అప్పుడు చూద్దాం ఏం చెయ్యాలో!

బీరకాయలు చాలా  ఉన్నాయి..బీరకాయ శనగపప్పు కూర వండి..బంగాళాదుంప వేపుడు చేస్తే సరి..తేలిగ్గా అయిపోతాయి..రుచికి  రుచిగా కూడా ఉంటాయి.

ఇంటి దగ్గర భోజనాలప్పుడు ఈ బీరకాయ శనగపప్పు కూర ఎక్కువగా చేస్తారు..ములక్కాయ..రాములక్కాయ వేసి వండితే ఎంత బాగుంటుందో! ములక్కాయలు లేనట్టున్నాయే..సర్లే సర్దుకుపోదాం.

అదర్రా..ఇవాళ బ్లాగు వనభోజనాలకి సింపులుగా మా ఇంట్లో చేసిన కూరలతో వచ్చేసా. 

 బీరకాయ శనగపప్పు కూరకి కావలసిన పదార్థాలు...చేసే విధానం తెలుసు కదా..





 ఇక బంగాళ దుంపల వేపుడు ఉందే..నాకు మహా ఇష్టం. కాలేజీకి లంచ్ తీసుకెళ్ళినన్ని రోజులూ..బాక్సులో బంగాళాదుంప వేపుడు.. లేకపోతే కోడి గుడ్డు పొరుటు..మరో పదార్థం పెట్టనిచ్చే దాన్ని కాను.

ఈ బంగాళాదుంప వేపుడు ఇల్లేరమ్మ వాళ్ళ నాన్న వండినట్లు వండితే  మహా రుచిగా ఉంటుంది. అసలు తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి. ఇవాళ నేను అలాగే వండాలే!

ఇల్లేరమ్మ వాళ్ళ నాన్న ఎలా వండుతారా..వార్నీ.మీరు .ఇల్లేరమ్మ కథలు చదవలేదా..సరే వినండి..

బంగాళా దుంపలు ఉడకపెట్టి ముక్కలు చేసుకోండి. ...ఎన్ని దుంపలంటే  మీ ఇష్టం.

చిన్నారి లాగా మీ ఇంట్లో కూడా దుంపలు వలుస్తూ వలుస్తూ మింగేసేవాళ్ళుంటే ఓ నాలుగు ఎక్కువ ఉడకపెట్టుకోండి.

 చిన్నారి ఎవరా..అబ్బా..ఇల్లేరమ్మ చెల్లెలు..మధ్యలో మీకన్నీ ప్రశ్నలే!

ఇప్పుడు నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని పొట్టు వలవండి.

వాటిని పెద్ద ముక్కలుగా చేసుకుని ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి రోట్లో కచ్చా..పచ్చాగా దంచండి.



పొయ్యి మీద బాండీ పెట్టి ఓ నాలుగయిదు పెద్ద గరిటెల నూనె పోయండి.

ఇల్లేరమ్మ వాళ్లమ్మ చెప్పినట్టు నూనె రెండు గరిటెలే పోస్తే సాయంత్రానికి కూడా దుంపలు వేగవు..వాళ్ళ నాన్న పోసినట్టు నూనె కాస్త ఎక్కువే పోయండి...ఎంత నూనె వేస్తే ఈ కూర అంత మజాగా ఉంటుంది...తొరగా అయిపోతుంది (ఈ మాట ఇల్లేరమ్మ వాళ్ళ నాన్న చెప్పాడులే).

నూనె వేడెక్కాక శనగ పప్పు, మినప పప్పు, అవాలు, జీలకర్ర, కరివేపాకుతో  తిరగమోత వేయండి.

తిరగమోత వేగాక దంచి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దవేసి బాగా వేపండి.



ఉల్లిపాయ ముద్ద వేగాక బంగాళాదుంప ముక్కలు వేసి కాస్త ఉప్పు వేసి ముక్కలు బాగా ఎర్రగా అయ్యేవరకు వేపండి.
 
అంతే మజా మజాగా... ఘుమఘుమలాడే బంగాళా దుంపల వేపుడు రెడీ!




మరీ రెండు కూరలేనా అంటారా..నాకు తెలుసు మీరు అలా అంటారని.

ఇవిగో..ఇంకా ఉల్లి మినపట్టు.. మసాలా మినపట్టు..అల్లం పచ్చడి..కొబ్బరి పచ్చడితో..









 వీటితో పాటు ఉలవచారు.. మీగడ....ఆవకాయ..కమ్మటి పెరుగు.

వీటన్నటికన్నా ప్రత్యేకం.. మా అమ్మాయి చేతి గులాబ్ జాములు..ఐసు క్రీమూనూ.

గులాబ్ జాం ఐస్ క్రీముతో తింటే యమహాగా ఉంటుందట..ఓ సారి ప్రయత్నించండి.




అబ్బో చాలా అయ్యాయిగా!

అన్నీ చూసి ఆనందించండి.

ఆకలి నకనకలాడుతుంది..గుడికెళ్లొచ్చి అందరి బ్లాగుల మీద పడాలి..

నేను వచ్చేలోపు అందరూ మంచి మంచి వంటలు చేసి పెట్టండి...

24 వ్యాఖ్యలు:

Anonymous,  November 10, 2011 at 5:28 PM  

వరూధిని గారు నాకు ఐస్ క్రీం చాలండీ . పొద్దుటినుంచీ చాలా తినేసాను.
మిగతావన్నీ వెనకొచ్చినవాళ్ళు చూసుకోండి

జ్యోతి November 10, 2011 at 5:32 PM  

ఇవన్నీ ఏమైనా మిగిలాయా? ఖాళీ చేసారా?? నాకు అన్నీ నచ్చేసాయి. మీరు వెళ్లిరండి వీటిసంగతి చూసుకుంటాం..

జయ November 10, 2011 at 7:16 PM  

అబ్బా! ఎన్ని వంటకాలో, తప్పదు...కష్టపడి అన్నీ పట్టించేస్తా. థాంక్సండి.

లత November 10, 2011 at 7:24 PM  

ఫుల్ మీల్స్ పెట్టేశారు కదా
వెరైటీస్ అన్నీ బావున్నాయండి

మురళి November 10, 2011 at 7:26 PM  

అవునండీ, మధ్యలో సిగరెట్టు కాల్చకుండానే బంగాళా ఉల్లిఖారం కూర వండేశారా??
ఇదెలా సాధ్యం చెప్మా :-) :-)

Sravya V November 10, 2011 at 7:46 PM  

వావ్ భలే రాసారు మీ వంటల ప్రావీణ్యాన్ని ఇల్లేరమ్మ కథ తో కలిపి !
ఫొటోస్ కూడా బావున్నాయండి .

మాలా కుమార్ November 10, 2011 at 7:54 PM  

అబ్బో చాలా వంటకాలు చేసారే ! ఘుమ ఘుమ లాడిపోతున్నాయండోయ్ !

సిరిసిరిమువ్వ November 10, 2011 at 9:29 PM  

లలిత గారూ..సరేనండి..ఇంకో కప్పు ఇమ్మంటారా!

జ్యోతి గారూ..అన్నీ ఉన్నాయి..మీదే ఆలస్యం.

జయ గారూ..అన్ని పట్టించారా? కాసిని మీ పిల్లలకి కూడా!

లత గారూ..థాంక్సండి.

మురళి గారూ..:)..వారు చేస్తే సాధ్యపడదేమో కానీ..చేసింది మేము కదా..అందుకని సాధ్యమే :))

సిరిసిరిమువ్వ November 10, 2011 at 9:31 PM  

శ్రావ్యా..థాంకులు.

మాలా గారూ..మీ దాకా వచ్చేసాయా ఘుమఘుమలు..థాంక్సండి.

సునీత గారూ..థాంక్యూ.

భమిడిపాటి సూర్యలక్ష్మి November 10, 2011 at 9:34 PM  

ఇల్లేరమ్మ అమ్మ, నాన్న లు చెప్పినట్లుగా చేస్తే వంటలూ ఘుమ ఘుమ లాడిపోవు మరి.....

శ్రీలలిత November 10, 2011 at 10:02 PM  

మీ వంటలన్నీ మీ మాటలంత కమ్మగా వున్నాయి..
ఇంత రుచి ఈమధ్య చూడలేదు.అభినందనలు...

జ్యోతిర్మయి November 10, 2011 at 11:23 PM  

కథల్లో వంటల్లు, వంటల్లో కథలు భలేగా ఉన్నాయ్ రెండూనూ..

Padmarpita November 10, 2011 at 11:24 PM  

మీ వంటలన్నీ కమ్మగా బావున్నాయండి.

కొత్తావకాయ November 11, 2011 at 12:21 AM  

హ్మ్మ్.. గులాబ్ జాముల కూడానా..!! భలే బాగున్నాయ్ ఫోటోలు.

Ennela November 11, 2011 at 7:25 AM  

అయ్య బాబోయ్, ఇన్ని వంటలూ మీరొక్కరే చేసారా...హ్యాట్స్ ఆఫ్...అన్నీ రుచిగా ఉన్నాయి కానీ పొట్టలో ఎక్కువ ప్లేస్ లేదు...రేపటికి దాచుకోవచ్చా?

సిరిసిరిమువ్వ November 11, 2011 at 4:09 PM  

సూర్యలక్ష్మి గారూ..నిజమేనండోయ్!

శ్రీలలిత గారూ...మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

జ్యోతిర్మయి గారూ..కథలు కూడా బావున్నాయా..థాంక్సండి.

పద్మార్పిత గారూ..థాంక్యూ!

ఎన్నెలా..పొట్టలో ఖాళీ లేదా...సరే సరే దాచుకుని తినండి. అయినా ఈ కాలం పిల్లలు మరీ సుకుమారం..పట్టుమని పిడికెడు కూడా తినలేరు.

Ennela November 11, 2011 at 4:49 PM  

ఈ కాలం పిల్లలు మరీ సుకుమారం..పట్టుమని పిడికెడు కూడా తినలేరు.....hahahha yee pilla maaree chinnadi....

సిరిసిరిమువ్వ November 11, 2011 at 8:12 PM  

కొత్తావకాయ గారూ.ఈ మధ్య గులాబ్ జాం లనగానే మీరే గుర్తుకొస్తున్నారు..ఎప్పుడొచ్చి తినేస్తారో అని:)

మా అమ్మాయికి మాత్రం మీ పిల్లి కథతో మీరు భలే గుర్తుండిపోయారు.

Unknown November 11, 2011 at 8:14 PM  

మీ పోస్ట్ మీరు రాసిన విధానం నాకు బలే నచ్చేసింది.మరి బీరకాయ శనగపప్పు కూర సంగతి ఏంటి ?

వేణూశ్రీకాంత్ November 15, 2011 at 1:41 PM  

హహహ బాగుందండీ.. ఫోటోలు నోరూరిస్తున్నాయ్ :-)

కృష్ణప్రియ November 15, 2011 at 3:14 PM  

బాగుంది.. ఇంతకీ ఇల్లేరమ్మ ఎవరు?

సిరిసిరిమువ్వ November 16, 2011 at 12:01 PM  

శైల గారూ :)..బీరకాయ శనగపప్పు కూర ఇల్లేరమ్మ వాళ్ల నాన్న చెయ్యలేదు..అందుకని వ్రాయలేదు :).

వేణూ..ధన్యవాదాలు.

కృష్ణప్రియ గారూ..నా బ్లాగుకి స్వాగతం..మొదటిసారి వచ్చినట్లున్నారు..థాంక్సండి.

ఇంతకీ ఇల్లేరమ్మ ఎవరు?...అవ్వ..అవ్వ.. (బుగ్గలు నొక్కుకుంటునానన్నమాట).ఇల్లేరమ్మ తెలీదా..అయ్యారే!

సరదాకి అన్నానులేండి.

ఇల్లేరమ్మ కతలు..అని సోమరాజు సుశీల గారు తన బాల్యం కబుర్లతో ఓ పుస్తకం వ్రాసారు..ఆంధ్రజ్యోతిలో సీరియల్ గా వచ్చింది..ఆ పుస్తకంలో హీరోయిన్ ఈ ఇల్లేరమ్మ..అంటే రచయిత్రే! పుస్తకం చాలా సరదాగా బాగుంటుంది..వీలయితే చదవండి. మీకు కావాలంటే పుస్తకం నేను పంపిస్తాను.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP