పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

October 2, 2009

పాండవులున్న గుట్టలట.....ఎవరయినా చూసారా?


పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు,  రాముడు వనవాసం చేసినప్పుడు ఎక్కడెక్కడ తిరిగారో చెప్పటానికి మన దేశంలో బోలెడు కథలు ప్రచారంలో ఉన్నాయి.  వాళ్లు నిజంగా అక్కడ తిరిగారో లేదో తెలియదు కాని ఆ ప్రదేశాలు చూసినప్పుడు మాత్రం ఒక రకమయిన ఉద్వేగానికి లోనవుతాం.  అనుకోకుండా అలాంటి ఓ కొండకి ఈ మధ్య వెళ్ళి వచ్చాం....అదే పాండవుల గుట్టలు (పాండవుల గుహలు, పాండవుల కొండలు....ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు). పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు అక్కడ ఉన్నారని కథ,  దానికి ఆనవాళ్లుగా అక్కడ కొండల మీద దశరథుడు గీసాడని చెప్పే బొమ్మలు ఇంకొన్ని చారిత్రిక ఆధారాలు ఉన్నాయి.....ఇవన్నీ నిజమా కాదా అన్నది పక్కన పెడితే.....పచ్చని చేల మధ్య ఈ కొండలు మాత్రం నిజంగా ఓ అద్భుతం. నాకు బాగా నచ్చాయి.  ఇవి వరంగల్లు జిల్లా రేగొండ మండలంలో ఉన్నాయి.


పోయిన వారాంతం వరంగల్లు జిల్లాలోని రామప్ప గుడి చూడటానికి వెళ్లి పనిలో పనిగా వీటిని కూడా చూసి వచ్చాం.  రామప్ప గుడి నుండి 24 కి.మీ దూరంలో ఈ కొండలు ఉన్నాయి.  రామప్ప నుండి ఘనపురం మీదుగా పరకాల రోడ్డులో భూపాలపల్లి క్రాసు రోడ్డు (కొత్తపల్లి) దాకా వెళ్ళాక ఎడమ వైపుకి తిరిగితే అక్కడి నుండి ఒక కి.మీ దూరంలో జూబ్లీనగర్--తిరుమల గిరి గ్రామాల మధ్య ఉన్నాయి ఈ కొండలు. ఈ కొండల్ని చూస్తే మెకన్నాస్ గోల్డు సినిమాలోని కొండలు గుర్తొస్తాయి (నేను చూసిన నాలుగయిదు ఇంగ్లీషు సినిమాలలో ఇది ఒకటి, అదీ బడాయి).

ఈ కొండలు ఓ 300-400 మీటర్ల ఎత్తు ఉండి ఉండవచ్చు.  వీటిని పూర్తిగా చూడాలంటే ఓ రోజు పడుతుంది.  ఎన్ని గుహలో.....ఎన్నెన్ని మలుపులో!  అన్నీ ప్రకృతి విచిత్రాలే!  కొండ పైకి నడవటానికి కొంతవరకు మెట్లు, సిమెంటు చేసిన దారి ఉన్నాయి. ఆ పైన ఎక్కాలంటే కాస్త కష్టమే. ఓపిక  ధైర్యం  ఉన్నవాళ్లు  ఎటునుండయినా  ఎక్కవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే వీటిని గురించి చెప్పేవాళ్లు.... దారి చూపించే వాళ్లు లేకపోతే వీటిని చూడటం మన వల్ల కాదు. వచ్చిన వాళ్లకి దారి చూపించటానికి, వాటి గురించి చెప్పటానికి ఆ కొండల దగ్గర ఓ ఇద్దరు ముసలి వ్యక్తులు ఎప్పుడూ కాచుకుని కుర్చుని ఉంటారు....వాళ్లు లేకపోతే మనం ఏమీ చూడలేము.  వాళ్లకి ఎంతో కొంత మనకు తోచినంత ఇస్తే చాలు.  ఆ వయస్సులో కూడా వాళ్లు అంత ప్రయాసపడి మనకి దారి చూపుతున్నందుకు నిజంగా అభినందనీయులు.  అది వాళ్లకి భుక్తి మార్గం కూడా.  వాళ్లు గత నలభై సంవత్సరాలనుండి ఇదే వృత్తిలో ఉన్నారట, మరియు ఈ కొండలకి ఈ మాత్రమన్నా ప్రాచుర్యం రావటానికీ,  అక్కడ ఈ మెట్ల సౌకర్యం అదీ రావటానికి వారే కారణమట! ఇంకా ఏదో చేయాలన్న తపన ఉంది వాళ్లల్లో.


మేము కొండ పైకి సుమారు రెండు కి.మీ ఎక్కి ఉంటాము.....అంటే అంతవరకే నడక దారి మెట్లు ఉన్నాయి . కొండలు విభిన్న ఆకృతులలో భలే ఉన్నాయి.  అభిమన్యుడి  రధచక్రం,  కృష్ణుడి చక్రం...ఇలా ఆకారాలని బట్టి వాటికి పేర్లు.  ఓ కొండ అయితే పడుకున్న ఒంటె ఆకారంలో ఉంది.  మధ్య మధ్య చిన్న చిన్న నీటి మడుగులు...వాటికి కుంతీ గుండం, ద్రౌపది గుండం..భరధ్వాజ గుండం..పాండవుల కోనేరు.... అని ఏవేవో పేర్లు.  ఇంకొక విషయమేమిటంటే ఇక్కడి రాళ్లు అసలు జారవు,  కొంచం గరుకుగా ఉన్నాయి.


ఓ నిఠారయిన కొండ మీద కుంతీదేవి గుడి ఉంది.  ఈ  కొండ ఎక్కటం చాలా కష్టంగా ఉంటుంది.....ఏటవాలుగా కొండ అంచు మీద ఎక్కాలి.  మధ్యలో పట్టుకోవటానికి నాలుగు చిన్న చిన్న ఇనుప రాడ్లు పాతారు.. ..ఆ రాడ్ల పక్కనే కాలు పెట్టటానికి కొంచం రాతిని చెక్కారు.  అవి కూడా ఈ మధ్యే పెట్టారట....లేకపోతే అసలు ఎక్కలేకపోదుం..ఆ కొండ అంచున ఎక్కుతూ ఒక్కసారి కిందకి చూసామంటే.....ఇక అంతే!  కాస్త భయం ఉన్నవాళ్లయితే కిందకి పడిపోతారేమో కూడా!  ఆ ముసలివాళ్లు ఇద్దరూ మాత్రం ఎంత అలవోకగా ఎక్కారో!  పైకి ఎక్కాక మాత్రం మహ ఆద్భుతంగా ఉంటుంది....ఓ గుహ.....అందులోకి మోకాళ్లమీద పాకుతూ వెళ్లాలి....అక్కడ..అప్పట్లో కుంతీదేవి పూజ చేసిన దేవుని విగ్రహాలని చెప్తారు....అవి ఉంటాయి.  పక్కన నీటి గుండం..అక్కడ నీరు ఎప్పుడూ వస్తుంటుందట.

ఇది ధర్మరాజు  పీఠం

మునీశ్వర గుహ,  ధర్మరాజు పీఠం..ఇలా కొన్ని గుహలకి పేర్లు పెట్టారు.  మునీశ్వర గుహ....ఇక్కడ భరధ్వాజ ముని తపస్సు చేసుకునేవాడట. ధర్మరాజు పీఠం...ఇక్కడ ధర్మరాజు కూర్చునేవాడట. ఇక్కడ చాలా  చల్లగా ఉంది. అక్కడే రకరకాల బొమ్మలు గీసి ఉన్నాయి...వాటిని పాండవులు గీసారని చెప్తారు. అవన్నీ కూడా ఎప్పటివో పురాతనకాలం నాటివి లాగానే ఉన్నాయి.  కొండ పైకి ఎక్కేముందు కూడా కింది నుండి చూస్తుంటే  ఒకచోట జింకల బొమ్మలు గీసి ఉంటాయి....... ధర్మరాజు ఎక్కడ ఉంటే అక్కడ అలా జింకలు బొమ్మలు గీసేవాడట!!

ఇవి పాండవులు గీసిన బొమ్మలట!

అప్పట్లో వాళ్లు రాళ్లతో గుమ్మాలు దర్వాజాలు కూడా కట్టుకున్నారట....అలాంటి ఓ ధర్వాజా  చూసాము.  మేము అన్ని కొండలు చూడలేదు.....అవన్నీ చూడాలంటే చాలా ఓపిక కావాలి....ఎక్కటం కూడా  కష్టమే.  ఈ కొండల మీద రకరకాల మెడిసినల్ ప్లాంట్సు కూడా ఉన్నాయి..పాము విషానికి విరుగుడుగా పనికొచ్చేవి..డయాబెటిస్‌ (షుగర్) వ్యాధికి వాడే ఆకులు, జమ్మి, మారేడు.. ఇలా చాలా రకాల మొక్కలు చూపించారు.

ఇదే రాతి దర్వాజా,  మాకు దారి చూపిన తాత

ప్రస్తుతానికయితే ఈ కొండల దగ్గర పర్యాటకులకు ఎలాంటి  సౌకర్యాలు లేవు.  అసలు వీటి గురించి సరయిన ప్రచారం కూడా లేదనే చెప్పవచ్చు.  వీటిని చూసాక మన చుట్టూ ఉన్న ఇలాంటి వాటిని వదిలి ఎక్కడికెక్కడికో వెళ్లి చూసి వస్తుంటాము అనిపించింది.  ఎప్పుడూ చూసే ప్రదేశాలే కాకుండా ఇలాంటి చోట్లకి వెళితే కొత్త అనుభవాలు..కొంగొత్త అనుభూతులు మన సొంతం చేసుకోవచ్చు.  పిల్లలకి కూడా మంచి హుషారుగా ఉంటుంది. హైదరాబాదులాంటి రద్దీ ప్రదేశాలనుండి ఇలాంటి వాటి దగ్గరకి వెళితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో!

 ఇప్పటికయితే ఇక్కడ  పర్యాటకుల రద్దీ అసలు లేనట్టే,  ఎప్పుడయినా వస్తుంటారట.  మేమెళ్లిన రోజయితే పండగని ఎవరూ రాలేదు అని చెప్పారు.  ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని వీటిని అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక స్థలంగా మారుతుంది.

ఈ గుట్టలకి సంబంధించిన మరికొన్ని చిత్రాలు నా ముందుటి టపాలో చూడవచ్చు.




12 వ్యాఖ్యలు:

Sravya V October 2, 2009 at 7:41 PM  

బాగుంది ! కాని నా guess మరీ 200 - 300 కి.మీ దూరంలో ఉన్నట్టుంది :(

Giridhar Pottepalem October 2, 2009 at 9:06 PM  

చాలా బాగుంది కళ్ళకు కట్టినట్టు ఫోటోల్తొ సహా చూపించారు.
గిరిధర్ పొట్టేపాళెం

Unknown October 3, 2009 at 7:07 AM  

I was in that dist for 20 yrs and in that particular area ( Parakal, Gori kothapalli, bhoopalapalli and Regonda)for 5 yrs, but never heard the historical importance and beauty of these hills.
Hats off to you!

I must make a trip this place, in my next visit to India.

EVRAO
New Zealand

సిరిసిరిమువ్వ October 3, 2009 at 4:59 PM  

@సురేషు గారు, ధన్యవాదాలు.
@శ్రావ్య, :))
@గిరిధర్ గారు, ధన్యవాదాలు.
@వెంకట్ గారు, నిజమేనండి చాలా మందికి ఈ ప్రదేశం గురించి తెలియదు. ఈ సారి ఇండియా వచ్చినప్పుడు తప్పక చూడండి.

జయ October 6, 2009 at 4:15 PM  

ఇలాంటి ప్రదేశాలు జీవితంలో తప్పకుండా, కనీసం అప్పుడప్పుడన్నా చూస్తూ ఉండాలి. చాలా మంచి ప్రాంతాలను చూపించారు.

అడ్డ గాడిద (The Ass) October 6, 2009 at 11:07 PM  

Very nice information. :-) The name of your blog is cute.

సిరిసిరిమువ్వ October 6, 2009 at 11:40 PM  

@జయ గారు,ధన్యవాదాలు.

@అడ్డ గాడిద గారు, ధన్యవాదాలు.మీ పేరు మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి

Unknown October 7, 2009 at 1:49 AM  

బాగుంది మొత్తానికి ట్రెక్కేసుకున్నారన్నమాట :)
ట్రావెలాగుడు చక్కగా ఉంది.

చైతన్య.ఎస్ October 7, 2009 at 11:42 AM  

బాగా వివరించారు నెనరులు

సిరిసిరిమువ్వ October 7, 2009 at 12:13 PM  

@ప్రవీణ్, ధన్యవాదాలు.
"బాగుంది మొత్తానికి ట్రెక్కేసుకున్నారన్నమాట"... :) ఈ ట్రెక్కేముందిలేండి..ఇంకో ట్రెక్కు చేసాం, జీవితంలో మర్చిపోలేని ట్రెక్కు, మీ ట్రెక్కు టపాలు చూసినప్పుడల్లా అది గుర్తుకొస్తుంది, దాని గురించి ఎప్పుడైనా చెప్తా!
@చైతన్య గారూ, ధన్యవాదాలు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP