పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

November 2, 2009

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం--వనభోజనాల ప్రత్యేకం

"ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారు
ఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారు"

ఎంత గొప్ప అద్భుతమయిన భావన!
కృష్ణశాస్త్రిగారికి తప్ప ఇలాంటి భావనలు ఎవరికీ రావేమో!!

"ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం"..... అంటూ కృష్ణశాస్త్రి గారు ఓ అద్భుతమయిన పాటని మనకి వదిలిపెట్టి వెళ్ళారు.  నిన్న ఆయన పుట్టినరోజు....ఈ రోజు ఆయన పాటకి సార్థకత కలిగే కార్తీక పౌర్ణమి రోజు.

మా ఇంట్లో పూజలు వ్రతాలు అంతగా అలవాటు లేవు.  మాకు తెలిసి మా అమ్మ పూజలు చేసే సందర్భాలు రెండే రెండు . ..ఒకటి వినాయకచవితి....రెండవది కార్తీక పౌర్ణమి..అందుకే ఈ రెండూ అంటే నాకు మక్కువ ఎక్కువ.  మాకు సముద్రతీరం దగ్గర అవటంచేత కార్తీక మాసంలో తప్పుకుండా ఏదో ఒకరోజు సముద్రస్నానికి వెళ్లేవాళ్లం.  మాకు బాపట్ల దగ్గర అయినా అప్పట్లో సూర్యలంక బీచ్ అంత బాగుండేది కాదు..జనసంచారం కూడా చాలా తక్కువగా ఉండేది....అందుకనే ఎప్పుడూ చీరాల ఓడరేవుకే వెళ్ళేవాళ్లం.  పొద్దున్నే చీకటితో లేచి ట్రాక్టర్ల మీద వెళ్ళి స్నానాలు చేసి అక్కడే దగ్గర్లో ఏ జీడిమామిడి తోటలోనో అమ్మవాళ్లు చేసుకొచ్చిన పులిహార...పెరుగన్నం తినేసి వచ్చేవాళ్లం.  వీలయితే కార్తీకమాసంలో  రెండు మూడు సార్లు కూడా సముద్రస్నానికి వెళ్లేవాళ్లం.

ఇక కార్తీక పౌర్ణమి రోజయితే అమ్మ ఉదయన్నే మాకు దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి వత్తులు వెలిగించి వచ్చేది.  అప్పుడప్పుడు నేను కూడా వెళ్ళేదాన్ని. గుళ్ళో అందరూ తలా  ఓ పద్మం ముగ్గు వేసి దానికి పసుపు కుంకుమ వేసి ప్రమిద పెట్టి వత్తులు వెలిగించేవాళ్లు.  ఆ పద్మాలు ధగ ధగ మెరిసిపోతూ ఉండేవి, అవి ఇప్పటికీ నా కళ్లముందు అలా మెదులుతూ ఉంటాయి.  అప్పట్లో ఏంటి అందరూ పద్మాల ముగ్గే వేస్తారు ఆనుకునేదాన్ని!

అమ్మ  ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చీకటి పడుతూ పడుతూ ఉండగానే పూజ చేసి తులసమ్మ దగ్గర పద్మాల ముగ్గు వేసి దీపం పెట్టి వత్తులు వెలిగించేది . ఆ రోజు సాయంత్రం అన్నాలు కూడా అమ్మ....ఆమ్మ వాళ్లతో పాటు పెందలాడే  తినేసేవాళ్లం.  మా ఆమ్మ వాళ్లిల్లు మా ఇంటి ఎదురుగానే.....ఎక్కువగా కార్తీక పౌర్ణమి రోజు అందరం కలిసి వాళ్లింట్లో బావి పక్కనే తులసమ్మ దగ్గర కూర్చుని భోజనాలు చేసేవాళ్లం.

అమ్మవాళ్ళు ఈ రోజు చేసే వంటలలో ప్రధానమయినది నేతి బీరకాయ పచ్చడి.  ఈ రోజుల్లో మా ఊరిలో ఎవరి ఇంట్లో చూసినా ..ఎవరి వాముల మీద (ఇప్పుడు వాములు లేవులేండి), చావిళ్ళ మీద చూసినా నేతి బీరకాయలు విపరీతంగా కనపడతాయి.  మా ఇళ్లల్లో కార్తీకమాసపు వనభోజనాలలో ఈ పచ్చడి లేకుండా భోజనం ఉండదు.  అదేం విచిత్రమో ఈ హైదరాబాదులో నాకు ఇంతవరకు ఎక్కడా నేతి బీరకాయలు కనపడల.  ఇప్పటికీ వీటిని ఇంటి దగ్గరనుండి తెచ్చుకోవటమో తెప్పించుకోవటమో చేస్తాం! మరి ఇవాళ కార్తీకపౌర్ణమి సందర్భంగా మీ అందరికి ఆ పచ్చడి రుచి చూపిస్తాను.  ఇది చెయ్యటం చాలా తేలిక.   నేతి బీరకాయలు  కావాలని మాత్రం అడగకండేం!


ప్రవాసాంధ్రులకి:  నేతి బీరకాయని  సిల్క్  స్క్వాష్ (silk squash),  చైనీస్ ఓక్రా (chineese okra) అని అంటారట....మరి మీ ఇండియన్ స్టోరులో కూడా దొరుకుతుందేమో  ప్రయత్నించండి.

కావలసిన పదార్థాలు
నేతి బీరకాయ................ఒకటి
చింతపండు......చిన్న ఉసిరికాయంత
పచ్చిమిరపకాయలు.........ఆరు
నూనె............రెండు చిన్న చెంచాలు
ఉప్పు.............రుచికి సరిపడా
చిన్నుల్లిపాయ (వెల్లుల్లిపాయ) రెబ్బలు......నాలుగు
జీలకర్ర.......... ఒక చిన్న చెంచా
కొత్తిమీర..........చిన్న కట్ట
కరివేపాకు........రెండు రెబ్బలు

నేతి బీరకాయలకి తోలు బీరకాయ తోలు లాగా కాకుండా చాలా నునుపుగా ఉంటుంది.  వీటికి తోలు తియ్యక్కరలేదు.  కాయని  బాగా శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి.  బాండీలో రెండు చెంచాల  నూనె వేసి అది కాగాక పచ్చిమిరపకాయలు వేసి వేయించి తీసుకోవాలి.  తరువాత బీరకాయ ముక్కలు వేసి వాటిలో నీరు పోయేంతవరకు వేయించుకోవాలి.  వేగాక ఈ ముక్కల్లో కాస్త చింతపండు పెట్టుకోవాలి.  ముక్కలు చల్లారాక ముందుగా పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి.  (రోలు లేనివాళ్లు మిక్సీలో ఒక్కసారి తిప్పండి).  తరువాత నేతి బీరకాయ ముక్కలు వేసి నూరుకోవాలి.  ఈ పచ్చడి మరీ మెత్తగా ఉంటే బాగుండదు.  మిక్సీలో అయితే ఒక్కసారి తిప్పీ తిప్పనట్టు తిప్పితే సరిపోతుంది.  బీరకాయ పచ్చడి లాంటివి మిక్సీలో వేస్తే వాటి రుచే పోతుంది....రోటి పచ్చడి రోటి పచ్చడే..మిక్సీ పచ్చడి మిక్సీ పచ్చడే!! చివరగా కొత్తిమీర, కరివేపాకు, చిన్నుల్లిపాయ, జీలకర్ర వేసి ఒక్కసారి కచ్చాపచ్చాగా  నూరుకుని పచ్చట్లో కలుపుకుంటే నేతిబీరకాయ పచ్చడి సిద్ధం.

అసలు రోటిపచ్చళ్ల రుచి చివరగా వేసే జీలకర్ర, కరివేపాకు, చిన్నుల్లిపాయలతోటే వస్తుంది. చిన్నుల్లిపాయ వాడని వాళ్లు దానిని వాడకున్నా బాగానే ఉంటుంది.

ఈ పచ్చడిలో కావాలనుకుంటే ఇష్టమయినవాళ్లు నువ్వులు వేసుకోవచ్చు.  ముందుగా బాండీలో నూనె లేకుండా రెండు చెంచాల నువ్వులు వేసి కొంచం వేయించి పచ్చిమిరపకాయలతో పాటు నూరుకోవటమే.  పచ్చిమిరపకాయల బదులు ఎండుమిరపకాయలు కూడా వాడవచ్చు. ఇష్టమయినవాళ్ళు చివరగా ఎండుమిరపకాయలు, మినపపప్పు, శనగపప్పు, ఆవాలతో తిరగమోత పెట్టుకోవచ్చు.

వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యితో పాటు ఈ పచ్చడి వేసుకు తింటే అధరహో! అన్నంలోకే కాదు చపాతీలలోకి కూడా బాగుంటుంది.

మరి వంటలు సిద్ధం, మితృలంతా బంతిలో కూర్చుంటే ఇక వడ్డిస్తాం.


20 వ్యాఖ్యలు:

తృష్ణ November 2, 2009 at 9:09 AM  

నేతి బిరకాయ పచ్చడి మా ఇంత్లో కూడా చేసే వారండోయ్..

భాస్కర రామిరెడ్డి November 2, 2009 at 9:15 AM  

మీ అనుభవాలు బాగున్నాయి. పచ్చడికోసం ఎదురుచూస్తున్నాము.బంతిలో మొదటివరుస మాదే! కొంచెం చూసి వేయండి.
బీరకాయ పచ్చడి సందర్భ్హం కాబట్టి, మామూలు బీరకాయ ( తొక్కు తీయకుండా ), టమోటాలు, పచ్చి మిరపకాయలు వేసి నూనేలో వేంచి, రోటిలో వేసి దంచుతారు చూడండి, ఆ పచ్చడుంటే మాత్రం మర్చిపోకుండా వేసి పోండి.

kiranmayi November 2, 2009 at 9:34 AM  

అయ్యో రామా!!! నేనిప్పటి వరకు నేతి బీరకాయ అంటే మామూలు బీరకాయే అనుకున్నా. నేతి బీరకాయ పచ్చడి నాకు తెలీదు కాని, మా అమ్మ బీరకాయ పొట్టు తో పచ్చడి చేసేది. గ్రైండ్ చేస్తుంటేనే మేము అడిగి, అడిగి సగం తినేసేవాళ్ళం. బంతి లో కూర్చోవటానికి మేము రెడీ.

నేస్తం November 2, 2009 at 11:05 AM  

నేనీ రోజు ఉపవాసం రేపు వచ్చి కూర్చుంటా బంతిలో మళ్ళీ ఫ్రెష్ గా చేసి పెట్టండి లేకపోతే నేను ఒప్పుకోనంతే

సిరిసిరిమువ్వ November 2, 2009 at 11:19 AM  

@తృష్ణ గారూ, కోస్తాలో కార్తీక మాసంలో ఈ పచ్చడి చెయ్యని వారు తినని వారు ఉండరు.
@భారారె..మామూలు బీరకాయ పచ్చడి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సిద్ధం. నేతి బీరకాయ పచ్చడయితేనే కార్తీక మాసానికే పరిమితం. ఇక్కడ మారు వడ్డనలు నిషిద్ధం కాదులేండి..మీరు మొహమాటపడకుండా ఎంత కావాలన్నా అడగవచ్చు.
@కిరణ్మయి గారు, ఇప్పటికయినా నేతి బీరకాయ తెలిసింది కదా! బీరకాయ తొక్కు(పొట్టు)తో పచ్చడి కూడా చాలా బాగుంటుంది.
@నేస్తం, మీకోసం ముందే విడిగా తీసి ఫ్రిజ్జులో పెట్టా, రేపు తప్పక రండి:)

చిలమకూరు విజయమోహన్ November 2, 2009 at 12:02 PM  

మా అనంతపురం జిల్లాలో కూడా ఒకప్పుడు బాగా కనిపించేవి నేతి బీరకాయలు.రాబోయే కాలంలో కనుమరుగవుతాయో ఏమో ఇప్పుడు తినేస్తా వడ్డించండి.

సుభద్ర November 2, 2009 at 12:42 PM  

వావ్ నేతి బీరపచ్చడా??మాది తూ"గో అ౦డి!!మేము పచ్చళ్ళు పెద్దగా చేసుకో.పులుసులు కి మాత్ర౦ పులుల౦ అయినా నేను ఈ మద్య కొన్ని పచ్చళ్ళు నేర్చుకున్నా..సరె ము౦దు బ౦తిలో కుర్చున్న వారి జోరు చూస్తూ౦టే మా వెనకి వారికి మిగిల్చేలా లేరు..
మాకోస౦ కొ౦చ౦ తీసి ప్రక్క ను౦చ౦డోయ్!!!

భావన November 2, 2009 at 12:44 PM  

అవును మా అమ్మ కూడా ఈ పచ్చడి చేసేది ఈ నెల లో.. మేము కూడా సముద్ర స్నానాలకు వెళ్ళే వాళ్ళము, బాగుంది మీ పచ్చడి.. మీరే చేసిన ఫొటో లా? బలే అలంకరించేరు.. బాగున్నాయి.. అప్పుడే పొట్ట నిండి పోయింది ఇంకా బోలెడాని వంటకాలు తినాలి చాలు చాలండి అరే మళ్ళీ వేస్తారేమిటి వద్దంటే ఆ పక్కన భా. రా.రే వున్నారు ఆయనకు వేయండీ నాకు చాలు బాబు.

psm.lakshmi November 2, 2009 at 1:41 PM  

మర్చిపోయిన నేతి బీరకాయని మళ్ళీ గుర్తుచేశారు. మనం కనీసం మన చిన్నతనం సంగతులు చెప్పుకుంటున్నాం. తర్పాత తరాలకి ఇవి చందమామ కధలు.
psmlakshmi

sunita November 2, 2009 at 1:55 PM  

దాదాపు 14 సంవత్సరాలైంది నేతిబీరకాయ ముఖం చూసి.వడ్డిచ్చండి త్వరగా.

సిరిసిరిమువ్వ November 2, 2009 at 3:08 PM  

@విజయమోహన్ గారు, వడ్డించేసాం మరి రుచి ఎలా ఉందో చెప్పాలి!
@సుభద్ర గారు, మీ తూ.గో వాళ్ల పులుసులు బాగానే రుచి చూసాను. మేమూ పులుసుల వాళ్లమే కాని మీ పులుస్సుల్లో మసాలా లేకుండా ఉండవు కదా! ఇక్కడ అక్షయపాత్ర ఉందిలేండి..ఎంతమంది వచ్చినా మీ వాటా మీకు ఉంటుంది!
@భావనా, అవి నేను చేసిన...తీసిన ఫోటోలే! ఏంటీ చూస్తుంటేనే పొట్ట నిండిపోయిందా! ఏంటో అర్భకం పిల్ల పెట్టేదాకా హడావిడీ..పెట్టాక కాస్త తినగానే పొట్ట నిండిపోయిందంటుంది..(మీ అమ్మ అన్నట్లు అన్నానా?)
@లక్ష్మి గారూ, నిజమే అలానే ఉంది చూస్తుంటే. అవి కనుమరుగయిపోతే తరువాత తరాలకి నేతి బీరకాయ ఎలా ఉంటుందో చెప్పాలంటే ఉపయోగపడుతుందని దాని తీగ ఫోటో కూడా పెట్టాను.
@సునీత గారూ, ఏంటీ ఇవి గుంటూరులో కూడా అలభ్యమా! ఈ సారి కార్తీకమాసంలో ఇండియా వచ్చేయండి..మీరు ఉన్నన్ని రోజులు గుంటూరు ఈ కాయలు పంపిస్తాను.

జయ November 2, 2009 at 5:16 PM  

సిరిసిరిమువ్వ గారు, నేతి బీరకాయ పచ్చడి నాకు మాత్రం కొత్తే.. తప్పకుండా రుచి చూడాల్సిందే. బాగుంది మీ పచ్చడి.

కొత్త పాళీ November 2, 2009 at 5:39 PM  

నేతి బీరకాయ పచ్చడి అద్భుతం!
సూర్యలంక బీచీ గట్రా చెప్పి ఇప్పుడు మళ్ళి బాపట్లని గుర్తు చేశారు.
ఇప్పుడెలా?

జ్యోతి November 2, 2009 at 7:51 PM  

నాకైతే నేతిబీరకాయ ఉందని తెలుసు.ఎలా ఉంటుంది ఇదిగో ఇప్పుడే చూడడం. ఎప్పుడైనా కనిపిస్తే కొనేసి, మీరు చెప్పినట్టు పచ్చడి చేస్తాను.

మాలా కుమార్ November 2, 2009 at 9:06 PM  

మేము ఉల్లి తినము అందుకే ఇంగువ పోపు వేస్తాము .
మీ రోటి పచ్చడి ఘుమ ఘుమ లాడిపోతోంది .

భావన November 5, 2009 at 7:22 PM  

హ హ హా మా నాయనమ్మ, అత్త అనే వారు అలా. మా అమ్మ ఏడిపించేది మా అత్త ను 'అబ్బో నీ మేన కోడలు అర్భకు రాలు అవలీల గా ఒక మనిషి ప్రాణం తీసెయ్య గలదు సణుగుడి తో' అని. ;-) మా అమ్మ కు చాలా కచ్చి గా వుండేది నన్ను చూస్తే, తెగ నసిగి ప్రాణం తీసేసే దానిని, రోజు ఈ ఆకుకూరలేమిటి నాకు ఈ చేత పచ్చడులు వద్దు. ఈ పిచ్చి కూరలేమిటి బీరకాయ, సొరకాయ వండొద్దు అని చెపితే వినవేమిటి ఐనా పొద్దుట పప్పు రాత్రి చారు ఎవడైనా పెట్టుకుంటాడా అబ్బో ఇలా అనంతం గా సాగి పోతూ వుండేది సణుగుడు. పాపం మా అమ్మ ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది ఎంత విసిగించాను రా స్వామి అని, ఇంత అనుకుంటానా మళ్ళి మా అమ్మ ఇక్కడకు వస్తే మరీ రోజూ కాదు కాని సణుగుతూనే వుంటా రోజు ఇదేనా అని (కూరగాయలు తెచ్చేది నేనే మళ్ళీ ) ;-) కాని బలే అన్నారు అచ్చం గా ఆప్యామైన అత్త ప్రేమ ను నాయనమ్మ ను మా పెద్దమ్మ ను గుర్తు చేసేరు మీ మాట తో. చాలా థ్యాంక్స్ అమ్మాయ్.

వేణూశ్రీకాంత్ November 6, 2009 at 10:46 AM  

ఆహా నేతిబీరకాయ ని చూసి ఎన్నాళ్లైందండీ.. దీని ఆంగ్లనామం కూడా ఇచ్చి చాలా మేలు చేసారు. టపా బాగుంది.. కార్తీక వనభోజనాల హడావిడి బాగుంది.

సిరిసిరిమువ్వ November 6, 2009 at 1:40 PM  

@జయ గారు, నేతి బీరకాయ..హైదరాబాదులో మీకు ఎక్కడ కనిపించినా నా చెవిన కూడా ఓ మాట వేయండి.
@కొత్తపాళీ గారూ, అహ్హహ్హహ్హ..బాపట్ల గుర్తుకొచ్చేసిందా! మీరీ సారి ఇండియా వచ్చినప్పుడు చెప్పండి--అక్కడకి వనభోజనాలకి వెళదాం.
@జ్యోతి గారు, ఈ కాయలు మీకు కనిపిస్తే నాకు కూడా చెప్పండి.
@ మాలా గారూ, అవును ఇంగువ పోపు వేసుకున్నా బాగుంటుంది, అసలు పోపు వేసుకోకపోయినా ఈ పచ్చడి బాగుంటుంది.
@ భావనా, ధన్యోస్మి!
@వేణూ, ధన్యవాదాలు.
ఏంటి భోజనానికి ఇంత ఆలస్యంగానా వచ్చేది..ఆ పనులేవో భోంచేసినాక చూసుకోకూడదూ??

శ్రీలలిత November 7, 2009 at 1:33 PM  

వరూధినిగారూ, నేను బ్లాగ్ వనం లొకి ఆలస్యంగా వచ్చాను. అందరూ కడుపునిండా తిని వెళ్ళిపోయారు. కాని నేను అందరి రెసిపిలు బలే తీరుబడిగా చదువుతున్నా. నిజంగానే రోటి పచ్చడి రుచే వేరు . ఈ విషయంలొ మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా.. కాని ఇప్పుడు నన్ను రుబ్బమంటే మటుకు..అమ్మో..సారీ..అందరం స్విచ్ లు వేయడానికి అలవాటు పడిపోయామండీ...

Anonymous,  November 8, 2009 at 6:10 PM  

ఏడాది కితం వరకు అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు మామూలు బీరకాయ దొరక్క నేతి బీరకాయ తినేవాళ్ళం.
ఉత్తరాదిలో మన బీరకాయ కేవలం వర్షాకాలంలోనే దొరుకుతుంది.
మరో మాట హిందీలో దీనిని నునువా అంటారు.
మామూలు బీరకాయని తొరై అంటారు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP