పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

July 28, 2009

మా ముగ్గురు రామూలు-1

మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్లింట్లో ఓ పెద్ద కుక్క ఉండేది.  అది మామూలు కుక్కే కాని ఎత్తుగా భీకరంగా ఓ చిన్న సైజు సింహంలా చూట్టానికే భయం వేసేది.  వీధి వాకిట్లో పడుకుని ఎవర్నీ వాళ్లింటి వైపు కన్నెత్తి కూడా చూడనిచ్చేది కాదు.  దానికి పేరేం ఉండేది కాదు...పిలవాలంటే చాయ్, ఇజ్జూ అంతే :). నాకు దాన్ని చూసినప్పుడల్లా ఇంట్లో పెంచుకునే కుక్కలంటే బుల్లిగా ముద్దుగా అందంగా ఉండాలి కాని ఇదేం కుక్క దెయ్యంలా అనుకునేదాన్ని. పెంచుకుంటే అసలు బొచ్చు కుక్కల్నే పెంచుకోవాలి అనుకునేదాన్ని.

మా ఒకటో రాము
నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటాను మా చుట్టాల బొచ్చు కుక్కకి (పమేరియన్) పిల్లలు పుడితే ఒకదాన్ని తెచ్చుకున్నాం. అది తెల్లటి తెలుపులో ముద్దుగా బొద్దుగా ఉండేది. దానికి మా నాయనమ్మ రాము అని పేరు పెట్టేసింది.  అప్పట్లో పొట్టేలు పున్నమ్మ సినిమాలో శ్రీప్రియ ఎంత ఫేమస్సో అందులో పొట్టేలు కూడా అంతే ఫేమస్సు.  మా నాయనమ్మ ఆ సినిమాకి... ఆ పొట్టేలుకి వీరాభిమాని .....అందుకే ఆ పేరన్నమాట! మా ఊరిలో మొదటి బొచ్చు కుక్క పిల్ల మాకే అన్న గర్వం కూడా ఉండేది మాకు!!ఇలాంటి మొదట్లు మాకు చాలానే ఉన్నాయి మరి!!!

మా ముగ్గురితో పాటు అది కూడా ఒక పిల్లలానే ఉండేది.  మాతో పాటు ఇల్లంతా పరుగులు పెట్టేది.  మా మంచాల మీదే పడుకునేది. మేము పక్కనుంటే బయటి కుక్కల మీదకి వీరావేశంతో వెళ్లేది....కయ్యానికి కాలు దువ్వేది.....మేము లేకపోతే పిల్లిలా తోక ముడుచుకుని వెనక్కి వచ్చేసేది. మా అక్కాయితో మరీ అనుబంధం ఎక్కువ దానికి. తను కాలేజినుండి వచ్చే టైముకి గేటులో కాపలా కాసేది. తరువాత తనకి పెళ్లయి బాబు పుట్టాక వాడిని ఎవరినీ అంటుకోనిచ్చేది కాదు....... మా బావ గారిని కూడా!! ఒక్క మా నాన్నంటేనే కాస్త భయపడేది. అప్పట్లో మా నాన్నకి బైకు ఉండేది.  ఊరి పొలిమేరలో  బైకు మోత వినగానె  గప్‌చుప్‌గా తన గొలుసు దగ్గరకి వెళ్లిపోయి పడుకునేది. దానికి లైఫ్‌బాయ్ సబ్బుతో స్నానం చేయించి చక్కగా దువ్వేవాళ్లం.  ఆ స్నానం చేయించిన రోజు మా ఇల్లు వళ్లు అంతా దాని జుట్టు మయంగా ఉండేది. మేము గోరింటాకు పెట్టుకుంటే దానికి కూడా నుదిటి మీద బొట్టులా పెట్టేవాళ్లం, తెల్లటి తెలుపు మీద ఆ గోరింటాకు భలే ఉండేది.  చెప్పాలంటే దాని కబుర్లు చాలానే ఉన్నాయి!

అలా దాంతో మా సహవాసం 11 సంవత్సరాలు సాగింది.  వయస్సు మీద పడి ఓ రోజు నేను లేకుండా చూసి మరీ కన్ను మూసింది.  మా నాన్న  మా అక్కాయి ఎన్ని రోజులు దాని మీద బెంగెట్టేసుకున్నారో! దాంతో ఓ నాలుగయిదు సంవత్సరాలు మళ్లా ఎవరం కుక్కను పెంచే  ఊసెత్తలేదు.  కుక్కలని పెంచటం అలవాటయ్యాక మనస్సు ఊరుకోదనుకుంటాను....

మా రెండో రాము
మా మొదటి రాము పోయిన ఓ నాలుగయిదేళ్లకి రెండో రాము వచ్చింది మా ఇంటికి. ఇది కూడా మా మొదటి రామూ వాళ్లింటినుండే వచ్చింది ..అంటే ఇది దానికి మనవడో ముదిమనవడో అన్నమాట!! అప్పుడు మా పాప పొట్టలో ఉంది. ఈ రెండో రాము బుల్లిగా భలే ముద్దుగా ఉండేది.....నాకు బాగా కాలక్షేపంగా ఉండేది దానితో.  మాకు ఇల్లు చావిడి అన్నీ కలిసే ఉంటాయి.  అప్పట్లో చావిడి నిండా గొడ్లు, వాములు, పెంట పోగు....... ఆ వాములు... పెంట పోగు నిండా ఎలుకలు, ఆ ఎలుకలు అక్కడనుండి ఇంట్లోకి వచ్చి మా అమ్మని నిద్రపోనిచ్చేవి కావు.  వాటిని నిర్మూలించటానికని మా అమ్మ ఏవేవో చేసేది. ఇంట్లో ఎలుకల బోనులు, కొన్నాళ్లకి ఎలుకలు తెలివి మీరి ఆ బోనుల్లో పడటం లేదని ఎలుకలాళ్లతో బోనులు పెట్టించేది......అవి కాక రాత్రిపూట వాముల్లో అక్కడక్కడా ఎలుకల మందు పెట్టించేది.

అప్పటికి మా రెండో  రాముకి రెండు మూడు నెలల కన్నా వయస్సు ఉండి ఉండదు.  రోజూ రాత్రి పూట పాలు తాగాక దొడ్ది మీద కాసేపు తిరిగి వచ్చేది.  ఆ రోజు కూడా అలానే తిరిగి వచ్చి నా మంచం పక్కన పడుకున్నది ఇక లేవలేదు.  మాకేం అర్థం కాలేదు అలా అకస్మాత్తుగా ఎలా చనిపోయిందా అని! ఆ రోజు సాయంత్రం పనబ్బాయి మా అమ్మ దగ్గరకి వచ్చి అక్కాయ్ వామిలో రెండు ఎలుకలు చచ్చిపోయి ఉన్నాయి అనగానే మా అమ్మకి అప్పుడు తట్టింది రాత్రి మా రామూ తిరుగుతూ వెళ్లి వామిలో పెట్టిన ఎలుకల మందు తిని ఉంటుంది అని.......ఇక మా అమ్మకి కాసేపు నోట మాట రాలేదు.  నాకయితే కొన్నాళ్లు రాత్రి పూట నిద్ర పట్టేది కాదు...... నా మంచం పక్కన అమాయకంగా నిద్రపోతున్న మా రామూనే కళ్ల ముందు మెదిలేది. దానితో ఎక్కువ రోజులు అనుబంధం లేకపోయినా మా మొదటి రాము చనిపోయినప్పటికన్నా ఇది చనిపోయినప్పుడు ఎక్కువ బాధేసింది.

రానారె గారి టపా చదివాక మా రెండో రాము గుర్తుకొచ్చి ఎక్కడో మనస్సు పొరల్లోని గాయం  రేగింది......

మా మూడో రాము గురించి మరెప్పుడైనా............

20 వ్యాఖ్యలు:

రానారె July 28, 2009 at 10:14 PM  

అయ్యో అయ్యో అయ్యో! :-|

Vinay Chakravarthi.Gogineni July 29, 2009 at 9:55 AM  

maa intlo pilli vishayamlo ila jarigindi chaala edcham....adi 1 day mottam badhapadutoo dided annamata.............
very sad incident

Anonymous,  July 29, 2009 at 10:02 AM  

ప్రస్తుతం మా అమ్మగారి ఇంట్లో ఓ సమస్య వచ్చింది. అది పెంపుడు కుక్కవల్ల . దీనిగురించి ఓ పోస్టురాస్తే ఎలవుంటుందా అని.......ఏదైనా ఉపాయం దొరుకుతుందేమో? చెప్పటం మర్చిపోయాను ...మీకు నా ప్రగాఢ సానుభూతి.

నేస్తం July 29, 2009 at 12:08 PM  

నేనూ మా కుక్క గురించి రాద్దాం అనుకున్నాను మీరు రాసేసారు :) నిజమే ఆ బాధ చాలా కష్టం గా అనిపిస్తుంది

మాలా కుమార్ July 29, 2009 at 2:30 PM  

పాపం చాలా విచారకరమైన విషయం.
ఓ సారి కుక్కని పెంచితే మళ్ళీ పెంచాలనిపిస్తుంది .నిజమే .మా చుటికిని 14 సంవత్సరాలు పెంచాను. అది చని పోయి మూడు సంవత్సరాలైతున్నా ,ఎక్కడ పమేరియన్ కనిపించినా అదే గుర్తుకొస్తుంది.మా పిల్లలు ఇంకోటి తెద్దామంటారు కాని నేనే వొప్పుకోవటము లేదు.

సిరిసిరిమువ్వ July 29, 2009 at 2:32 PM  

స్పందించిన అందరికి ధన్యవాదాలు.
@లలిత గారు, వ్రాయండి, ఎవరైనా ఉపాయం చెపుతారేమో చూడండి..
@నేస్తం మీ కుక్క గురించి కూడా వ్రాయండి. ఈ నేస్తాల గురించి ఎంత చెప్పినా ఎంతమంది చెప్పినా మన అనుభవాలు మనవే.

మధురవాణి July 29, 2009 at 3:33 PM  

హమ్మ్..మా మామయ్యా వాళ్ళ స్నోయీ చచ్చిపోతే వాళ్ళు అన్నం, నీళ్ళు లేకుండా రోజుల తరబడి ఏడ్చారు. చాలా బాధేసింది నాక్కూడా :( ఎప్పుడో ఒకసారి కనిపించే వాళ్లమయినా దానికి అందరూ గుర్తే :(
అసలు కుక్కలే ఇష్టం లేని మా నాన్నే స్నోయీని చివరి క్షణాల్లో ఆసుపత్రికి తీస్కెళ్ళారు. దాన్ని చూసి ఆయనకీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయట. చాలా రోజుల దాకా ఆ దిగులు లోంచి బయటకి రాలేకపోయారు :(

కొత్త పాళీ July 29, 2009 at 5:05 PM  

I hear you

@ నేస్తం .. సిసిము గారు రాసింది వాళ్ళింటో పెరిగిన కుక్కల గురించి. మీ కుక్క గురించి కాదు. మీ కుక్క గురించి మీరే రాయాలి!

మురళి July 29, 2009 at 5:37 PM  

ప్చ్.. మా చిన్నప్పటి పెంపుడు కుక్కలన్నీ గుర్తుకొచ్చాయండి.. పెంచినన్నాళ్ళు బాగుంటుంది.. కానీ అవి మనల్ని విడిచి వెళ్లి పోయినప్పుడు మాత్రం మళ్ళీ జీవితంలో కుక్కని పెంచకూడదు అనిపిస్తుంది.. అదీ కొన్నాళ్ళే.. మళ్ళీ కథ మామూలే.. అన్నట్టు మీ బ్లాగు కొత్త డిజైన్ బాగుంది..

సిరిసిరిమువ్వ July 29, 2009 at 9:07 PM  

@ మధుర వాణి, పెళ్లికి ముందు కుక్కలు ఇష్టం లేనివాళ్లని చూస్తే వీళ్లేం మనుషులు అనిపించేది, ఇప్పుడు అలవాటయిపోయింది :)

@కొత్తపాళీ గారు, :)

@ మురళీ, ధన్యవాదాలు.

రాధిక July 29, 2009 at 11:59 PM  

ఈ టపాకి ఇలా కామెంటు రాయకూడదనుకుంటాను కానీ రాస్తా.నాకు కుక్కలనే కాదు ఏ పెంపుడు జంతువులన్నా ఇష్టం వుండదు.ఎవరి ఇంట్లో అన్నా పెంచుకుంటుంటే వెళ్ళి ఒక పది నిమిషాలు ఆడుకుని రావడానికి బాగుంటుందంతే.నా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కుక్కలు వుండేవి.వాళ్ళు ఎప్పుడు చూసినా ఆ సోదే చెప్పుకునేవారు.చాలా విసుగొచ్చేది.అలాగే మేము వాళ్ళని ఏడిపించడానికి కూడా మంచి విషయం వుండేది.ఎక్కడన్నా కుక్క కనపడితే చొ చో చో చ్వీట్ అనుకుంటూ వెళ్ళేవారు.ఒక రోజు ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కాలేజ్ మధ్యలో తనని తీసుకెళ్ళిపోయాడు.ఏమిటా అని కనుక్కుంటే పాపం వాళ్ళ కుక్క ఆక్సిడెంట్ లో పోయిందని తెలిసింది.అప్పుడు మేమూ బాధపడ్డాము.వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా ఆలోటు తెలిసేది.ఆ కుక్క నెత్తి మీద నిమిరేవరకూ తోకూపుకుంటూ కూడా తిరుగుతూనే వుండేది.ఆ తరువాత నుండీ వేరే ఫ్రెండ్ వాళ్ళ కుక్కని ప్రేమ గా చూడడం మొదలుపెట్టాము.ఆ కుక్క కూడా చనిపోయాకా మేము కూడా అప్సెట్ అయ్యాము.
అయినా కూడా ఐ డోంట్ లైక్ పెట్స్.ఇ లైక్ థెం ఎట్ జూ :)

Lakshmi Naresh July 30, 2009 at 12:01 AM  

నా మంచం పక్కన అమాయకంగా నిద్రపోతున్న మా రామూనే కళ్ల ముందు మెదిలేది.....

idi mee manasentha badha paduthundo cheppindandi...kaani vaatini penchalante enta chiraagga untundo...vaati abhimanam antha isthama untundi...

సిరిసిరిమువ్వ July 30, 2009 at 10:32 AM  

@ రాధిక గారూ, మీరు కనీసం వాటిని జూలోనో వేరే వాళ్లు పెంచుకుంటుంటేనో అన్నా చూసి ఆనందిస్తారు, మా ఇంటాయనకి వాటిని అల్లంత దూరంలో చూసినా అసహ్యమే :(

@ లక్ష్మి గారు, మీరు కూడా రాధిక గారి టైపే అన్నమాట!

పరిమళం July 30, 2009 at 10:13 PM  

ప్చ్ ...పెంచుకున్నపుడెంత సంతోషాన్నిస్తాయో ...చివరికి అంత విషాదాన్ని మిగులుస్తాయి .

కొత్త పాళీ August 1, 2009 at 1:08 AM  

"మా ఇంటాయనకి వాటిని అల్లంత దూరంలో చూసినా అసహ్యమే :("
హయ్యో ఇది నిజమా .. ఆ హృదయం ఇంత కర్కశమా? ఇన్నాళ్ళూ ఈ గుండెకోతని ఎలా భరించారు మీరు? తల్చుకుంటేనే నా గుండె చెరువైపోతోందే!!!

తృష్ణ August 1, 2009 at 11:34 PM  

చాలా రోజులైంది మి టపాలేమి లేవు అనుకునంటున్నానండి.నా మొన్నటి టపాకి మీరు వ్యాఖ్య రాసినప్పుడు కూడా మీ బ్లాగ్ చూడలేదు...ఇవాళ మరొ బ్లాగ్ లో మీ కొత్త టపా గురించి చూసి ఇలా వచ్చను.
మా మావయ్యలు ఇద్దరు రెండు సార్లు కుక్కల్ని పెంచి అవి చనిపోయినప్పుడు చాలా రొజులు సరిగ్గా అన్నం కూడా తినని రొజులు ఉన్నాయి.అందుకే నాకు ఏవన్నా జంతువులని పెంచికొవాలి అంటె భయం.ఉన్నప్పుడు ఆనందిస్తాము కానీ వేటినయినా కోల్పొయాకా కలిగే బాధని దిగమ్రింగటం కష్టమండీ.

సిరిసిరిమువ్వ August 2, 2009 at 10:36 AM  

@పరిమళం, అవును ఆ బాధే నా చేత ఈ టపా వ్రాయించింది!
@కొత్తపాళీ గారూ, హు..మీ సానుభూతి చూసాక 20 సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్న గుండె కోత ఇంకా ఎక్కువయిపోయింది :), అయినా అది కరగని కర్కశమే!
@తృష్ణ గారూ, నిజమే కానీ పెంపుడు జంతువులతో అలవాటయ్యాక వాటిని పెంచే అలవాటు మానుకోవటం మరీ కష్టం.

వేణూశ్రీకాంత్ August 2, 2009 at 4:27 PM  

hmmm నిజమే పెట్స్ విషయం లో ఒకసారి అనుభందం ఏర్పడ్డాక ఇంట్లో మనుషుల తో సమానంగా ఓ మెంబర్ అయిపోతుంది. మీ టపా కదిలించి వేసింది.

శ్రీ August 5, 2009 at 8:21 PM  

మా దాని పీరు snowy tintin కి మేము అబిమనులం కదా .. సో దాని పేరు అల పెట్టాం ... మా ఆంటీ కి మా కంటే అదే ఎక్కువ .. (మా కంటే అదే ఎక్కువ ఇంట్లో ఉంటుంది కదా మరి )....

సిరిసిరి మువ్వ గారు .. కో.కు గారి అనువాదం చదివారు అంటే మీరు అ పుస్తకం ఎప్పటికి మరిచిపోలేరు .. కో కు గారి అనువాదం పేరు ప్రకృతి పిలుపు అండి అది ఇప్పుడు దొరకడం లేదు ..

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP