పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

August 17, 2009

ఓ వర్షాకాలం సాయంత్రం



ఈ నగరానికి దూరంగా .....మా ఊరికి దగ్గరగా
ఓ వర్షాకాలం సాయంత్రం
హోరు వాన.......చుట్టూ నీటితో నిండిన పొలాలు...
కనుచూపుమేరా పొలాలు.....చుట్టూ నీరే తప్ప ఇంకో ప్రాణి కన్పించని ప్రదేశం..
అక్కడక్కడా ఆ నీటిలోనుండి తొంగి చూస్తున్న అప్పుడే నాటిన చిన్ని చిన్ని వరి మొలకలు
ఆ పొలాల మధ్యనుండి ఓ తారు రోడ్డు
ఆ రోడ్డు మీద 80-90 కిలోమీటర్ల స్పీడులో వెళ్లే కారులో నేను
రోడ్డుకి ఇరువైపులా వర్షపు లయకు తాళం వేస్తూ తలలూపుతున్న చెట్లు
రోడ్డు మీద సుడులుగా ప్రవహించే నీరు.....కారు వేగానికి ఆ నీరంతా ఎగసి కారుని ముంచేస్తుంటే...
ఓహ్.. ఆ అనుభవం మాటల్లో వర్ణించలేనిది.

మొన్న రెండు రోజుల వర్షం రైతులకి ఎంతటి ఊరటను ఇచ్చిందో నాకు అంతకు రెట్టింపు అనుభూతిని మిగిల్చింది. మన ఇంటి బాల్కనీలోనో, కిటికీ పక్కనో కూర్చుని ఏ మిరపకాయ బజ్జీలో పకోడీలో తింటూ వర్షాన్ని చూస్తూ... వింటూ అనుభవించవచ్చు....వర్షంలో తడుస్తూ అనుభవించవచ్చు.....దేని అనుభూతి దానిదే....కానీ పంటపొలాల మీద ప్రకృతితో పాటు ఉంటూ వర్షాన్ని అనుభవించటం ఉందే అది మాటలలో వర్ణించలేనిది.

ఇంతకుముందు చాలాసార్లు అనుకునో అనుకోకుండానో వర్షంలో తడిచాను, వర్షాన్ని అనుభవించాను.  చిన్నప్పుడు  బడినుండి కావాలని తడుస్తూ ఇంటికొచ్చిన రోజులున్నాయి. ఊటీలో, కొడైకెనాల్‌లో వర్షంలో తడుస్తూ తిరుగాడిన అనుభూతులున్నాయి, కానీ ఆ అనుభూతులన్నిటినీ మించిన అనుభూతి మొన్నటి సాయంత్రం వర్షంలో కాకుమాను నుండి మా ఊరు చేసిన ప్రయాణం. ఈ జన్మకిది చాలు అనిపించేంతటి అనుభూతి. అసలు ఒక్క రోజులో ఎంత మార్పో. ముందు రోజు చూసిన పొలాలేనా ఇవి అనిపించేంతటి మార్పు.

ఆగష్టు 14, 2009  శుక్రవారం సాయంత్రం హైదరాబాదు నుండి గుంటూరు ప్రయాణం.
దారి పొడవునా ఈ  పాటికి సగం నాట్లు అయిపోయి పచ్చపచ్చగా కళకళలాడాల్సిన పొలాలు బీట్లువారి ఎండిపోయిన గొంతులతో ఓ వాన చుక్క కోసం చకోరపక్షిలా ఆశగా ఎదురుచూస్తున్నాయి. ముందురోజు నాలుగు చినుకులు పడ్డా అవి పొలాలు గొంతులు తడుపుకోవాటానికి కూడా  సరిపోయినట్లు లేవు. మధ్యలో నల్లగొండ దగ్గర అడుగంటా ఎండిపోయిన కృష్ణమ్మని చూస్తే రైతన్నకి ఎన్నాళ్లీ వెతలు అన్న దిగులు. చేతిలో పుస్తకం ఉన్నా కళ్ళు అక్షరాల వెంట పరుగు తీయటం మానేసి బయట పొలాల వెంట పరుగుతీసాయి.

సాయంత్రం ఆరు అయ్యేటప్పటికి ఒక్కసారిగా చల్లపడ్డ వాతావరణం...సత్తెనపల్లి చేరుతూ ఉండగా టప్..టప్ మని చేతిమీద ఓ రెండు చినుకులు....చినుకులా రాలి....నదులుగా సాగి....వరదలై పోయి....అని పాడుకుంటుండగా గుంటూరు వచ్చేసింది..అప్పటికి సన్నటి జల్లుగా మారిన వాన రాత్రి పదయ్యేటప్పటికి జోరందుకుంది. ఆ రాత్రి పంటచేలు కరువుతీరా కడుపు నిండా నీళ్లు తాగాయి.

ఆగష్టు 15, 2009  శనివారం ఉదయం గుంటూరు నుండి కాకుమాను ప్రయాణం.

ఆకాశం నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. ఓ భారీ వర్షం పడి వెలిసాక ఆకాశాన్ని చూస్తే నాకెప్పుడూ ఆశ్చర్యమే. . దీన్లోనుండేనా ఇప్పటిదాకా  ఇన్ని నీళ్లు వర్షించింది అనిపిస్తుంది. ఏమీ తెలియని నంగనాచిలా ఎంత మౌనంగా ఉంటుందో!

రాత్రిపడ్డ వానతో దాహం తీర్చుకున్న పొలాల్ని చూస్తే నిన్నటికి ఈ రోజుకి ఎంత తేడా అనిపించింది! నీటితో కళకళలాడుతున్న పొలాలు. ఆ పొలాల్లో బురద నేను సిద్దం ఇక మీ ఇష్టం నాట్లు వేసుకోండంటూ తళతళలాడుతూ మెరిసిపోతూ మురిపిస్తుంది .


శనివారం మధ్యాహ్నం నుండి మళ్లీ భారీ వర్షం.  ఆ వర్షం లోనే కాకుమాను నుండి మా ఊరు ప్రయాణం.  మధ్యలో రేటూరు నుండి గోపాపురం వరకు చేలమధ్య నుండి రోడ్డు వెళ్తుంది.  ఆ జోరు వానలో  నిండా మునిగిన పొలాల మధ్య రయ్యిన కారులో వెళ్తుంటే ఎంత అద్భుతం అనిపించిందో! మాటలకందని అనుభూతి అది!



పాలు తాగే పసివాడు బొజ్జ నిండాక పాలు నోట్లోనుండి ఊసేస్తూ చిలిపిగా నవ్వుతూ ఉంటాడు, అచ్చంగా అలానే అనిపించింది ఆ నిమిషంలో నీట మునిగిన పొలాలని చూస్తుంటే!


ఏదేమైనా బీటలు వారిన పొలాల్ని, ఎండిపోతున్న నారుమడుల్ని చూసుకుని గుండెల్లో బాధని కళ్లల్లో నిలుపుకుని వర్షం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న రైతులకి కాస్తంత ఊరట ఈ వర్షాలు. ముమ్మరంగా నాట్లు మొదలయ్యాయి.  ఆ వర్షంలో తడుస్తూనే ఒక పక్క నారు పీకేవాళ్లు, ఇంకొక పక్క నాటు వేసేవాళ్లు,  పల్లెల హడావుడీ అంతా పొలాల పైనే ఉంది. నాట్లు వేసేటప్పుడు పొలాల్లో నారు కట్టలు ఎలా విసిరి వేస్తారో ఎప్పుడైనా చూసారా? నిజంగా అది ఒక కళ! 



గృహప్రవేశాలు, పెళ్లిళ్లు.... ఈ శుభకార్యాల హడావిడీ ఒకవైపు, నాట్ల హడావిడీ ఇంకొక వైపు.  వర్షాల  మూలాన ఈ శుభకార్యాలకి ఆటంకం అని ఎవరూ విసుక్కోలేదు. అమ్మయ్య ఇన్నాళ్టికి ఓ మంచి వర్షం పడింది ఇక నాట్లు మొదలుపెట్టవచ్చు అని అందరూ ఆనందించేవాళ్లే.
  
ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా

20 వ్యాఖ్యలు:

రాధిక August 18, 2009 at 12:42 AM  

చాలా ఆర్ద్రం గా సాగింది మీ టపా.మీ కారు ప్రయాణ దృశ్యాన్ని చాలా అందం గా వర్ణించారు.నారు విసిరే ఫొటో మీరే తీసారా?

భాస్కర రామిరెడ్డి August 18, 2009 at 3:19 AM  

పొలము బాటల ఊసులాడి
వాన నీటిన జతులు కలిపి
జాన పదుల పదము విని
నారు మళ్ళ వరుస చూసి
రైతు కళ్ళన తృప్తి గని
ఏటో వెళ్ళింది మనసు

చాలా బాగా వర్ణించారండి. కాసేపు కొలను గట్టున సేదదీరితే కానీ నా మనసు మళ్ళీ నా దరికి రానంటుంది.

Sravya V August 18, 2009 at 4:19 AM  

వర్షం లోని హర్షాన్ని మీ పోస్టు లో చూపించారు ! బాగుంది !

Vinay Chakravarthi.Gogineni August 18, 2009 at 8:55 AM  

mmmm baagundi........baaga raasaru.....

ilanti experiances chaala vunnayi na lifelo...........
returu pakka na pndla maa bava gaaridi............nenu may lo tiriganu atu vaipu.........chukkalu kanabadday.....

Anonymous,  August 18, 2009 at 11:47 AM  

"అబ్బ..." వాన మాఊర్లోనే పడినట్టనిపించిందండీ మీ పోస్ట్ చదువుతుంటే. మా ఊర్లో ఇప్పటిదాకా చెప్పుకోతగ్గ వాన ఒక్కటీ పడ్లేదు. అయినా బోర్లమీద ఊడ్పులు కానిచ్చేసారనుకోండి . వానతో పండిన పంట తల్లిపాలతో బొజ్జ నిండిన బుజ్జాయ్ లా వుంటే , బోరు నీరుతో పండిన పంట సీసా పాలు తాగి ఆకలి తీర్చుకున్న చిన్నరిలా వుంటుంది .

పాలు తాగే పసివాడు బొజ్జ నిండాక పాలు నోట్లోనుండి ఊసేస్తూ చిలిపిగా నవ్వుతూ ఉంటాడు, అచ్చంగా అలానే అనిపించింది ఆ నిమిషంలో నీట మునిగిన పొలాలని చూస్తుంటే! చాలా చక్కగా పోల్చారు

Unknown August 18, 2009 at 3:26 PM  

అద్భుతంగా ఉంది మీ అనుభవం.
ఫోటోలు మీరే తీసారా ? చాలా బాగున్నాయి.

మురళి August 18, 2009 at 5:15 PM  

"పాలు తాగే పసివాడు బొజ్జ నిండాక పాలు నోట్లోనుండి ఊసేస్తూ చిలిపిగా నవ్వుతూ ఉంటాడు, అచ్చంగా అలానే అనిపించింది ఆ నిమిషంలో నీట మునిగిన పొలాలని చూస్తుంటే!" అత్యద్భుతమైన పోలిక..

భావన August 18, 2009 at 7:55 PM  

బాగుంది మీ వూరి ప్రయాణం. మాకు కూడా మీతో పాటు పొలాలను వాటి ఆనందాన్ని కళ్ళముందు అవిష్కరింప చేసేరు. ఏమిటో వ్యవసాయధారిత రాష్ట్రం లో రైతు గోడు వినే వాడెవ్వడు..

సిరిసిరిమువ్వ August 19, 2009 at 9:38 AM  

@రాధిక గారు, ఇందులో ఫోటో ఏదీ నేను తీసింది కాదు, అన్నీ జాలంలో వల వేసి పట్టినవే:)
@ భాస్కరరామిరెడ్డి గారూ, నా టపా మొత్తం భావం మీ కవితలో చూపెట్టారు, ధన్యవాదాలు.
@ శ్రావ్యా, ధన్యవాదాలు.
@వినయ్ చక్రవర్తి గారూ, ధన్యవాదాలు. మీరు పూండ్ల రేటూరి మీదనుండి వెళితే అలానే ఉంటుంది, అయినా ఇప్పుడు రోడ్డు బాగానే ఉందే!
@లలిత గారూ, బాగా చెప్పారు.
@ ప్రవీణ్ ధన్యవాదాలు. ఫోటోలు నేను తీసినవి కావండి.
@ మురళి గారు, ధన్యవాదాలు.
@భావన గారూ, మీ వాళ్లని మా వాళ్లని అందరినీ కలిసాను.

ప్రణీత స్వాతి August 20, 2009 at 2:49 PM  

పుట్టి పెరిగిందంతా పట్నవాసమే కదండీ..ఇక్కడ ఆ అనుభూతులన్నీ ఎండ మావులు.

విశ్వ ప్రేమికుడు August 20, 2009 at 10:52 PM  

అద్భుతమైన వర్ణన.

మొన్న వర్షాలను చూసి నేను హైదరాబాదునుండే మన రైతన్నల కష్టాలు తీర్చేంతగా ఈ వర్షాలు కురిస్తే బాగుండును అని మనసులో ఎన్ని సార్లు అనుకున్నానో. ఇప్పుడు మీ టపా చదివాకా నమనసు కాస్త కుదుట పడుతోంది. మనందరి ప్రేమా వృధాపోదు.

అన్నదాతా సుఖీ భవ.... :)

విశ్వ ప్రేమికుడు August 20, 2009 at 10:54 PM  

మొన్న వర్షాలను చూసి నేను హైదరాబాదునుండే మన రైతన్నల కష్టాలు తీర్చేంతగా ఈ వర్షాలు కురిస్తే బాగుండును అని మనసులో ఎన్ని సార్లు అనుకున్నానో. ఇప్పుడు మీ టపా చదివాకా నమనసు కాస్త కుదుట పడుతోంది. మనందరి ప్రేమా వృధాపోదు.

అన్నదాతా సుఖీ భవ....
అద్భుతమైన వర్ణన.
మంచి అనుభూతిని కలిగించారు...
ధన్యవాదాలు :)

sunita August 21, 2009 at 6:12 PM  

అద్భుతంగా ఉంది మీ అనుభవం.

సుభద్ర August 22, 2009 at 12:37 AM  

చాలా చాలా బాగా రాసారు.hope for good.

నేస్తం August 24, 2009 at 4:47 PM  

చాలా చాలా బాగా రాసారు,నాకు చాలా బాదేసేది ఇండియాలో వర్షాలు కురవడం లేదని అమ్మ చెప్పినపుడు.. రోజు అడిగేదాన్ని.. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయా ఏమైనా అని :)

వేణూశ్రీకాంత్ August 24, 2009 at 11:18 PM  

వావ్ సిరిసిరిమువ్వ గారు. టపా అంతా అద్భుతమైన కావ్యంలా అనిపించిందండీ.. వర్షం గురించి చాలా చక్కగా వర్ణించారు. ఫోటోలు కూడా అందం గా అమిరాయి.. టాపా చాలా బాగుంది.

తెలుగుకళ August 30, 2009 at 3:22 PM  

ఒక్క టపా తో ప్రకృతికి చేరువ చేశారు
అభినందనలు

Vinay Chakravarthi.Gogineni September 4, 2009 at 4:47 PM  

nenu cheppindi appati climate..ippudu marindi kada......

పరిమళం September 9, 2009 at 5:50 PM  

ఓహ్ ...ఎలా మిస్ అయ్యాను ? కళ్ళకు కట్టినట్టు చెప్పారు.

మరువం ఉష September 20, 2009 at 10:09 PM  

సిరిసిరిమువ్వ గారు, నాకు ఇటువంటి ప్రయాణాల్లో అలా చూస్తూ కూర్చోవటం ఎంతో ఇష్టం. మాట్లాడటం ఇష్టం వుండదు. నాలో నేనూ ఏవేవో అవలోకనం చేసుకుంటూ ప్రకృతిని వీక్షిస్తూ... మీరు వ్రాసిన అనుభూతులు, అద్భుతమైన అనుభావలు నాకు కూడా స్వీయనుభవం... ముఖ్యంగా..

.. వర్షాకాలం సాయంత్రం
.. అప్పుడే నాటిన చిన్ని చిన్ని వరి మొలకలు
.. ఊటీలో, కొడైకెనాల్‌లో వర్షంలో తడుస్తూ తిరుగాడిన అనుభూతులున్నాయి
.. చినుకులు....చినుకులా రాలి....నదులుగా సాగి....వరదలై పోయి....అని పాడుకుంటుండగా ++ చినుకు చినుకు అందలతో చిటపట చిరు సవ్వడితో... (కూడా)
.. పాలు తాగే పసివాడు బొజ్జ నిండాక పాలు నోట్లోనుండి ఊసేస్తూ చిలిపిగా నవ్వుతూ ఉంటాడు, అచ్చంగా అలానే అనిపించింది ఆ నిమిషంలో నీట మునిగిన పొలాలని చూస్తుంటే!
.. నాట్లు వేసేటప్పుడు పొలాల్లో నారు కట్టలు ఎలా విసిరి వేస్తారో ఎప్పుడైనా చూసారా? - చూసాను అబ్బురపడ్డాను. ఇదేకాదు, నలుగురు కలిసి రోకట్లో బియ్యంపిండి దంచటం, వస్త్రకాయం పట్టటం కూడా నాకెంతో విడ్డూరం.

ఒక్కసారిగా 15సం. వెనక్కి పంపారు మనసుని. థాంక్స్.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP