పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 16, 2009

నేనిక్కడ-నువ్వెక్కడ?

నువ్వూ నేనూ చివరిసారిగా కలిసింది ఎప్పుడు?......నా పెళ్లిలోనా?
20 సంవత్సరాల సుదీర్ఘ కాలం.....
ఏ సీమలో ఉన్నావో .....ఎలా ఉన్నావో
కుశలమేనా......నీకు కుశలమేనా
అనుకుంటూ ఇన్నాళ్లూ అన్వేషణలు

పిల్లలెంత మందో?
ఎలా ఉంటారో?
నీలాగా పాడతారా?
నీ అంత సుకుమారంగానూ ఉంటారా?
నీలాగా బద్దకం ఎక్కువా?
జవాబు దొరకని ప్రశ్నలు.....మరుగునపడ్డ జ్ఞాపకాలు

ఎప్పటికయినా కలుస్తాం అన్న ఆశ
ఇక ఎప్పటికీ కలవమేమో అన్న నిరాశ
నిరాశని భగ్నం చేస్తూ....గుండెలని మీటుతూ
జాలంలో తళుక్కున మెరిసిన నీ ఫోటో
ఇప్పటికీ అదే రూపం......నీదైన అదే చిరునవ్వు

 నెమలి నాట్యం....కోకిల పాట
సందెపొద్దుల్లో సంపెంగ నవ్వులు
అమ్మ దొంగలు.....నీలి మబ్బులు
వెన్నెల రాత్రులు.....ఆరుబయట విహారాలు
నువ్వు పాడిన పాటలు......మనం చూసిన సినిమాలు

యమునా ఎందుకే నీవు.......ఇంత నలుపెక్కినావు
అంటూ మనం చేసిన డాన్సు
క్రీస్తు జననం అంటూ
మనం వేసిన గొర్రెల కాపరి వేషాలు
చివరి నిమిషపు చదువులు.....నైటవుట్ ప్రాజెక్టులు

అలల్లా జ్ఞాపకాలు
ఒకదాని వెంట ఒకటి
ఒకదానిపై మరొకటి
అలుపన్నదే లేక
ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
మునుగుతూ తేలుతూ

ఆనాటి ఆ స్నేహమానంద గీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం....

12/12/09 న వ్రాసినది. (20 సంవత్సరాల తరువాత ఇక దొరకదేమో  అనుకున్న ఓ ప్రియసఖి ఆచూకీ దొరికిన సందర్భంగా )

16 వ్యాఖ్యలు:

మురళి December 16, 2009 at 6:26 PM  

మీ సంతోషం ప్రతి అక్షరం లోనూ కనిపించింది..

సిరిసిరిమువ్వ December 16, 2009 at 7:26 PM  

మురళి గారు, ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియలేదు..మీ అందరితో పంచుకోవాలనిపించింది...అందుకే ఇక్కడ పెట్టాను. ధన్యవాదాలు.

జయ December 16, 2009 at 7:43 PM  

మీ చిరకాల నేస్తం ఆచూకి తెలిసినందుకు అభినందనలు. మరి మీ కబురులన్ని మాకు కూడా చెప్పాలి.

. December 16, 2009 at 9:30 PM  

మీ బ్లాగ్ పెరులో సంగీతముంది మీ కలం లో సాహిత్యముంది...

మీ విరబూసిన ఆనందం అంత ఈ అక్షర వనంలో కన్పించింది.....

మీ నేస్తం చూస్తే మరింత ఆనందిస్తారు



www.tholiadugu.blogspot.com

Hima bindu December 16, 2009 at 10:02 PM  

ఆ ఆనందం వర్ణనాతీతం అనుకుంటాను...బాగుందండీ .

శ్రీలలిత December 16, 2009 at 11:11 PM  

చిన్ననాటి నెచ్చెలి ఆచూకీ దొరకడం ఎంత ఆనందం... మీకు అభినందనలు. మీ సంతోషానికి నిలువెత్తు హారతులు.

కొత్త పాళీ December 17, 2009 at 3:40 AM  

Beautiful.
I met my REC roommate after a gap of 25 years during this recent trip. He was my first best friend in college.

Saahitya Abhimaani December 17, 2009 at 6:50 AM  

అద్భుతం చాలా బాగున్నది మీ కవిత, అంతకంటే అంతర్లీనమైన భావం

జ్యోతి December 17, 2009 at 9:41 AM  

నేస్తాన్ని కలిసిన ఆనందం అందమైన కవితలా మీ సంతోషాన్ని మాకు కనిపిస్తుంది.

సిరిసిరిమువ్వ December 17, 2009 at 9:58 AM  

@జయ గారు, తప్పకుండా. మెయిలులో కబుర్లు నడుస్తున్నాయి!

@ కార్తీక్, నా కలంలో సాహిత్యం ఏం లేదండి. ఏదో నెచ్చెలి కలిసిన ఆనందంలో వ్రాసిన ఊసుపోని రాతలు. ధన్యవాదాలు.

@చిన్ని గారు, అవునండి..మా స్నేహితులం అందరం ఎన్నెన్ని విధాలుగా ప్రయత్నించామో తన ఆచూకీ కోసం. అనుకోకుండా జాలంలో తనని చూసి ఆనందంతో ఓ క్షణం మూగపోయాను.

@శ్రీలలిత గారు, ధన్యవాదాలు. తను పాటలు చాలా బాగా పాడుతుంది. "అమ్మ దొంగా నిన్ను చూడకుంటే" పాట తనకి చాలా ఇష్టమయిన పాట. ఎన్ని సార్లు పాడించుకునేవాళ్లమో. ఆ పాట విన్న ప్రతిసారి ఎక్కడుందో అనుకుంటూ నిటూరుస్తుండేదాన్ని.

@కొత్తపాళీ గారు, ఆ ఆనందం మీకూ అనుభవమేగా!

@శివ గారు, జ్యోతి గారు, ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి December 17, 2009 at 10:58 AM  

ఇలాంటి ఆనందాలుపంచుకోడానికే గదండీ బ్లాగ్మిత్రులున్నారు! ప్రియసఖి ని మళ్ళీ కనుగొన్నందుకు అభినందనలు! మీ కవిత ఎందరిలోనో ఎన్నో జ్ఞాపకాలను రేకెత్తించి ఉంటుంది.

పరిమళం December 17, 2009 at 6:11 PM  

మీ బ్లాగ్ లో అరుదైన టపా ! కవిత ఇదే మొదటిదనుకుంటా కదండీ ....మురళి గారన్నట్టు మీ సంతోషం ప్రతి అక్షరం లోనూ కనిపిస్తోంది.అనుకోకుండా జరిగిన విషయం ! నా బ్లాగ్ లో నా బాల్య మిత్రుల వియోగం గురించి రాసి ఇటువచ్చాను...మీ సంతోషం లో పాలుపంచుకోవడం నా మనసును తేలిక చేసిందండీ !

భాస్కర రామిరెడ్డి December 17, 2009 at 11:12 PM  

సిరిసిరిమువ్వ గారూ, నేనిక్కడ..నువ్వెక్కడ అని వెతికి వెతికి సాధించి మీ స్నేహితురాలిని కలిసిన ఆనందంలో మాకు ఇంత మంచి కవితను అందించినందుకు కృతజ్ఞతలు. చాలా బాగుంది, మీ మనఃస్థితిలాగే.

సిరిసిరిమువ్వ December 18, 2009 at 9:07 AM  

@సుజాత గారు, పరిమళం గారు, మీరు చెప్పేదాక దీన్ని కవిత అంటారని కూడా నాకు తెలియదండి..ఏదో మనసులోకొచ్చింది వ్రాసా. ధన్యవాదాలు.
@భారారె, ధన్యవాదాలు.

నిషిగంధ December 18, 2009 at 7:43 PM  

వావ్! 20 సంవత్సరాల తర్వాత కలవడం అంటే ఎంత ఉద్వేగంగా ఉండి ఉంటుందో కదా! ఇంత చక్కని కవిత ద్వారా మాతో ఈ సంతోషాన్ని పంచుకుని మమ్మల్ని కూడా పాత్రధారుల్ని చేసేశారు.. ఇంకొన్నాళ్ళు కబుర్లతో మీ ఇద్దరికీ అస్సలు సమయమే తెలియదేమో :-)

సిరిసిరిమువ్వ December 18, 2009 at 8:55 PM  

నిషి, మరే మీలాంటి వాళ్లు వ్రాయటం మానేస్తే ఇదిగో ఇలా మాలాంటివాళ్ల రాతలు కూడా కవితలై పోతాయి.

ఈ ఆదివారం ఫోను కోసం ఎదురుచూస్తున్నా!

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP