పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 2, 2009

వీడుకోలే వేదికయినా....

నిన్ను ఇంట్లో నుండి సాగనంపేటప్పుడు అనుకోలేదు
నీ దూరం నన్నింతగా బాధిస్తుందని
ఒకటా రెండా 18 సంవత్సరాలు
మాతో కలిసి మెలిసి వున్నావు
మాలో ఒకరివై పోయావు.
నిన్నెంత ప్రాణంగా చూసుకున్నాను
అందుకేనేమో నాకు ఇంత బాధ
నేను తప్ప ఇంకెవరు నీ మీద చేయి వేయకూడదనుకునేదాన్ని
ఎవరైనా నీ మీద చేయి వేస్తే
నా ప్రాణం పోయినట్లుండేది
వాళ్ల చేతులు ఎలా ఉన్నాయో
అవి అంటుకుని నువ్వెక్కడ మాసిపోతావో అని నా ప్రాణం కొట్టుకునేది
నీ మీద సర్వం సర్వాధికారం నాదే అనుకునేదాన్ని
నీ మీద ఈగ కూడ వాలనిచ్చేదాన్ని కాదు
నువ్వు కూడా నాతో అంతే విశ్వాసంగా వున్నావు.
నీ మీద ఎంత భారం వేసినా ఎప్పుడూ పన్నెత్తు మాట అనలేదు
ఓపికగా భరించావు
అలాంటి నిన్ను నేనెలా దూరం చేసుకున్నాను!
నేనెళ్లిపోతాను అని నువ్వెప్పుడూ అనలేదు
నేనే నీకు వయస్సు అయిపోయిందని
మా భారం మోయలేకపోతున్నావని
మాకు సరిగా సేవలు చేయలేకపోతున్నావని
నిన్ను నిర్థాక్షిణ్యంగా మెడ పట్టుకు గెంటేసాను
ఎంత కఠినాత్మురాలినో కదూ!
ఇప్పటికీ కళ్లముందు నువ్వే మెదులుతున్నావు
పచ్చటి నీ రూపు...చల్లటి నీ మనస్సు...
ఇప్పుడెక్కడున్నావో!
ఏ శిధిలాల క్రింద మగ్గిపోతున్నావో!

******************************************************************************

ఏంటో 18 సంవత్సరాలు మా ఇంట్లో మాతో పాటు సహజీవనం చేసిన మా ఐసు పెట్టెని (ఫ్రిజ్జు) ఆ మధ్య ఇంకో ఐసుపెట్టెతో మార్పిడి పథకం కింద సాగనంపి ఓ వారం రోజులు పడ్డ దిగులులో నుండి వెలువడ్డ ఓ చిన్నపాటి ఆవేదన. ప్రాణం లేని వస్తువులే అయినా కొన్నిటితో చిక్కటి అనుబంధాలు పెనవేసుకుంటాం. అవి దూరం అయినప్పుడు ఏదో సర్వం కోల్పోయినట్టుగా ఉంటుంది.

12 వ్యాఖ్యలు:

శేఖర్ పెద్దగోపు December 2, 2009 at 6:19 PM  

అవునండీ..కొన్ని వస్తువులతో మనకు తెలీకుండానే అలా అనుభందం ఏర్పడిపోతుంది.

మురళి December 2, 2009 at 7:06 PM  

మీకు దూరమైనా కుక్కపిల్ల గురించో, వృద్ధ గోమాత గురించో అనుకున్నాను.. నాకు ఇల్లు మారిన ప్రతిసారీ అప్పటివరకూ ఉన్న ఇల్లు గుర్తొస్తుంది కొన్నాళ్ళపాటు..

సంతోష్ December 2, 2009 at 8:05 PM  

nenedo voohinchanu kadandi,..
fridge anukoledu..
nijame ,,, na cell poyinapudu kooda ante bhada paddanu..'
maricha... meeku cell phone ante istam ledu kadu...

జయ December 2, 2009 at 10:02 PM  

అయ్యో సిరిసిరిమువ్వ గారు. అంతే నండి. ఇది సహజం. చిన్న వొస్తువుతో నైనా అనుబంధం అంత గట్టిగా ఉంటుంది. ఇలాంటి రకరకాల బాధలు నేను చాలానే పడ్డాను. కాబట్టి మీ బాధ సులభంగా అర్ధం చేసుకోగలను.

వేణూశ్రీకాంత్ December 3, 2009 at 9:58 AM  

అయ్‍బాబోయ్ ఓ నిముషం టెన్షన్ పెట్టేశారు కదండీ.. నాదీ సేమ్ ఫీలింగ్, నేను ఒకటిరేండేళ్లకే ఇలా అనుకుంటా ఇక 18 ఏళ్ళంటే... వస్తువులు ఒక ఎత్తైతే, చదువుకునే రోజుల్లో బట్టల విషయంలోకూడా నే తెగ ఫీల్ అయ్యే వాడ్ని ఎదిగే వయసు అవడం వల్ల ఎంత ఇష్టమైనవైనా కొన్నేళ్ళకి పట్టక వదిలేయాల్సి వచ్చినపుడు ఆ బాధ వర్ణనాతీతం.

సిరిసిరిమువ్వ December 3, 2009 at 12:14 PM  

@శేఖర్ గారు, అవునండి ఏదీ శాశ్వతం కాదని తెలిసినా ఏంటో అలా అనుబంధాలు పెట్టేసుకుంటాం. ధన్యవాదాలు.

@ మురళి గారు, :))

@సంతోష్ గారు, అయ్యో మరి మీ సెల్లు దొరికిందా! సెల్లు ఫోను అంటే ఇస్టం లేకపోవటం ఏం లేదండి..దాన్ని ఇష్టమొచ్చినట్టు వాడటమే ఇష్టం ఉండదు :)

@జయ గారు, నా బాధని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

@వేణూ, నాలాంటి బాపతు చాలామందే ఉన్నారన్నమాట. బట్టల విషయంలో నేను ఇప్పటికీ అంతేనండి..వాటిని వేసుకోనూ లేను..పారవేయనూ లేను..అలా ఉంచేస్తా!!

భావన December 4, 2009 at 9:49 AM  

సేమ్ పించ్. సేం పించ్. నా కార్ నాకు 9 సవత్సరాలు పాపం ఎంతో సర్వీస్ చేసింది. బాగా పాతడైపోయింది తప్పక ఇచ్చేసి కొత్త కార్ కొంటుంటే ఎంత బాధ వేసిందో ఆఖరి రోజు కూడ దానిని డీలర్ షాప్ లో వదిలి వస్తూ చేయి వేసి వెరీ వెరీ సారి అమ్మా నిన్ను వదిలించుకోవాలని కాదు తప్పక ఇస్తున్నా... చాలా చాలా థ్యాన్క్స్ ఇన్నాళ్ళ సర్వీస్ కు నా జీవితం లో ఒక భాగమై పోయావు కదా అని ఎన్నో అప్పగింతలు చెప్పి వచ్చా. నా కొడుకు నెత్తి నోరు కొట్టు కున్నాడు. అమ్మ వారం నుంచి ఇదే తంతు చివరికి డీలర్ దగ్గర కూడానా ఆపమ్మ పిచ్చి అనుకుంటారు అందరు అని. అంత సర్వీస్ ఇచ్చాక అలా వదలటం ఎంత ప్రాణం లేని వస్తువునైనా ఏమిటో బాధ చెప్పలేను.

ramya December 4, 2009 at 12:52 PM  

నిజమేనండి ఇంట్లో వస్తువులు ప్రాణమున్న వాటిలాగే పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది. ముక్యంగా కొన్నిటితో మరీ అనుబందం పెంచేసుకుంటాం. చిన్నప్పుటి మొదటి సైకిల్, మొదటి బైకు ఐతే మరీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే అవి అచ్చంగా వ్యక్తిగతమైన వస్తువులు అదీ మొదటిసారిగా.

ఎలక్ట్రానిక్స్ పదేళ్ళకు మించి వాడకానికి పనికిరావండి. వాటితో ఎంత అనుబంధమున్నా అవసరార్ధం కొత్తవి కొనక తప్పదు.
నాకు వాహనాలు మాత్రం వదలేననిపిస్తుంది. మా పాతకారు అమ్మేయాలంటే మీలాగే నేనూ బాధపడ్డాను. ప్రాణమున్న దానిలాగే అనిపించేది అది. లోపల కూర్చోగానే చక్కగా ఆత్మీయంగా తన వడిలో కూర్చోబెట్టుకుంది అనిపించేది. అది పోతుందనే బాధలో కొత్తకారు వచ్చిన సంతొషమే కలగలేదు.
మావాడైతే అమ్మా అదికూడా ఉంచేసుకుందాం అంటూ మారాం చేసాడు! ఆ కారు ఇప్పటికీ మా ప్రాంతంలో అప్పడప్పుడూ కనిపిస్తూ ఉంటది దాన్ని చూడగానే మా వాడు అమ్మా మన ఎర్ర కారు అంటూ అరిచేస్తాడు. ఇప్పుడింకా ముద్దొస్తుంది అనుకుంటూ దిగులుగా చూస్తాను నేను, కాసేపు దాని గురించి మాట్లాడుకుంటాం. పెద్దకారు మోజుతో అది చిన్నకారని అమ్మేయడమేగానీ ఎంత బావుండేదో, చిన్న రిపేరు కూడా రాలేదు. ఓ రిటేర్డ్ ఉద్యోగి కొనుక్కున్నారు దాన్ని.

సిరిసిరిమువ్వ December 4, 2009 at 4:28 PM  

@భావనా, ఏంటో ఈ పిచ్చి నాకే అనుకున్నా! అందులోనూ అమెరికాలో... మిమ్ముల్ని అలా చూసి ...ఆ డీలరు ముక్కుమీద వేలు వేసుకుని ఉంటాడే! పాపం మీ అబ్బాయి. ఇకనుండి ఏదైనా వస్తువు అమ్మేటప్పుడు మీ వెంట రానంటాడేమో!!
@రమ్య గారూ, ధన్యవాదాలు. నిజమండి అవసరానికి మార్చినా మొదటివాటి మీద ఉండే అభిమానం అలాంటిది..వాటిని ఉంచుకోనూలేము..వదిలిపెట్టనూ లేము.

మాలతి December 6, 2009 at 3:53 PM  

పచ్చటి నీ రూపు...చల్లటి నీ మనస్సు...
ఇప్పుడెక్కడున్నావో!
ఏ శిధిలాల క్రింద మగ్గిపోతున్నావో!

కాదేదీ కవితనర్హం. బాగా చెప్పేరు. మీరు కవితలు కూడా రాస్తారని నాకింతవరకూ తెలీదు. అభినందనలు.

సిరిసిరిమువ్వ December 7, 2009 at 9:39 PM  

మాలతి గారు,..హ్హ..హ్హ..మీరు మరీనూ...నేను కవిత్వం వ్రాయటమేమిటండీ బాబూ!
ధన్యవాదాలు.

భావన December 9, 2009 at 12:17 AM  

అవును అమ్మాయ్. అన్నాడు కాని తరువాత నా కొడుకు కూడా ఫీల్ అయ్యాడు ఆ వెలితి. ఎప్పుడో మా చిన్నప్పుడూ అద్దె కు వున్న నాయుడి గారి ఇల్లు నాకు ఇప్పటికి కలలోకి వస్తుంది. :-(

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP