పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 20, 2009

మహామహుల రాకతో కళకళలాడిన పుస్తక ప్రదర్శన

 శనివారం (19/12/09) పుస్తక ప్రదర్శనలో ముఖ్యమయిన కార్యక్రమం వాక్ ఫర్ బుక్సు.  ఆ సందర్భంగా  చాలామంది ప్రముఖులని చూసే అవకాశం కలిగింది.

చుక్కా రామయ్య గారు (ప్రముఖ విద్యావేత్త), పరుచూరి వెంకటేశ్వరరావు గారు (సినీ రచయిత), దేవానంద్ (ఐ.ఏ.ఎస్ ఆఫీసరు), జెన్నీ (సినీ నటులు, రచయిత), తెలకపల్లి రవి గారు (జర్నలిస్టు, టి.వి విశ్లేషకులు), రవిప్రకాష్ (టి.వి 9), చొక్కాపు వెంకటరమణ (మెజీషియను మరియు రచయిత) మొదలగువారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  నడక తరువాత వీరి ప్రసంగాలు కొనసాగాయి.....అవి నేను వినలేదనుకోండి.

 ఈ కార్యక్రమంలో బ్లాగర్ల తరుపున మరియు e-తెలుగు తరుపున పి.ఎస్.ఎం లక్ష్మి,  సతీషు కుమారు యనమండ్ర, నామాల నాగమురళీధర్, ఇనగంటి రవిచంద్ర, రాజశేఖరుని విజయ శర్మ, శిరీషు కుమార్, శివ చెరువు, సి.బి.రావు, శ్రీనివాస కుమారు, వరూధిని మరియు పుస్తకం వారి తరుపున పూర్ణిమ, అరుణ పప్పు పాల్గొన్నారు.  చాలామంది చిన్న పిల్లలు విచిత్ర వేషధారణలతో .....పుస్తకం నోరు తెరవని మహావక్త,  చదవండి....చదివించండి అన్న ప్లకార్డులతో  అలరించారు.

అక్కడికి వచ్చిన ప్రముఖులకు e-తెలుగు సభ్యులు పనిలో పనిగా e-తెలుగు గురించి, బ్లాగుల గురించి ..... పుస్తకం వారు పుస్తకం సైటు గురించి వివరించి కరపత్రాలు పంచిపెట్టారు.

సరే ఇక ఆ కార్యక్రమం అయిపోయాక e-తెలుగు స్టాలుకి వెళితే అక్కడ ఊహించని అంతర్జాల ప్రముఖులు ఎదురయ్యారు.  పరుచూరి శ్రీనివాసు గారు, అక్కిరాజు భట్టిప్రోలు గారు కనిపించారు. అక్కిరాజు గారి ఫోటో వారి బ్లాగులో ఉంది కాబట్టి ఆయన్ని తేలికగానే గుర్తు పట్టాను.  అక్కిరాజు గారితో పాటు వారి అమ్మాయి భావన కూడా వచ్చింది.   నిన్న e-తెలుగు స్టాలుకి బ్లాగర్లు కూడా చాలామంది వచ్చారు. చివరిదాకా సందర్శకులతో సందడి సందడిగా ఉన్న స్టాలు ఇదేనేమో!  చివరిలో ఊహించని విధంగా రచయిత్రి మరియు బ్లాగరు అయిన చంద్రలత గారు ఓ మెరుపులా అక్కడ ప్రత్యక్షమయ్యారు.  అనుకోకుండా  ఆమెని కలవటం చాలా ఆనందం అనిపించింది.

నిన్న e-తెలుగు స్టాలుకి వచ్చిన బ్లాగర్లు

ఇంకా ఎవరయినా వచ్చారేమో......వారి పేర్లు ఇక్కడ లేకపోతే అన్యదా భావించకండి.
e-తెలుగు స్టాలు నిర్వహణలో అహర్నిశలు శ్రమిస్తున్న కశ్యప్ గారికి నా ప్రత్యేక అభినందనలు.  అలానే తనకి చేదోడుగా ఉంటూ తోడ్పాటు అందిస్తున్న సతీషు కుమారు యనమండ్ర, నామాల నాగమురళీధర్, చక్రవర్తి గార్లకు జేజేలు మరియు అభినందనలు.  మిగతా రోజుల్లో కూడా  బ్లాగర్లు తమకు వీలయన రోజుల్లో వచ్చి స్టాలు నిర్వహణలో సహాయపడగలరని ఆశిస్తున్నాను. నిన్న పి.ఎస్.ఎం. లక్ష్మి గారు చాలాసేపు స్టాలు నిర్వహణలో తోడ్పాటు అందించి వచ్చిన సందర్శకులకు అన్నీ వివరించారు.  ఆమెకి కూడా అభినందనలు.

ఆదివారం పుస్తక ప్రదర్శనకి వెళ్లే బ్లాగర్లకి ఓ అద్భుత అవకాశం.....బ్లాగర్లు A4 సైజులో వారి బ్లాగు పేరు గానీ స్క్రీన్ షాట్ గానీ తీసుకు వచ్చి స్టాలు వద్ద ప్రదర్శించుకోవచ్చు.

ఇక చివరిగా పనిలో పనిగా కొన్నంటే కొన్నే  పుస్తకాలు కొన్నాను.  అందులో ముఖ్యమయినది (ఇం)కోతి కొమ్మచ్చి...(ముళ్ళపూడి వారి  కోతికొమ్మచ్చి రెండవ భాగం)......మొన్న శుక్రవారమే విడుదలయిందట! దాంతోపాటు చాలామంది బ్లాగు మిత్రులు మీరు చదవ్వాల్సిందే అని మరీ మరీ చెప్పిన యండమూరి అంతర్ముఖం కూడా కొన్నాను.  ఇంకా సోమరాజు సుశీల గారి దీపశిఖ తీసుకున్నాను. ఇవి కాక ఇంకో ఐదు పుస్తకాలు కొన్నాను.

తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి.

9 వ్యాఖ్యలు:

Chandra Latha December 20, 2009 at 3:46 PM  

ఆ సంతోషం నాదీను!
అందమైన అమరిక, చక్కటి నిర్వహణ ,ఓపికగా వివరణ, ఆపై,అభిమానంతో ఒకరినొకరు పలకరిచుకోవడం,సరదాగా మాట్లాడుకోవడం, స్నేహాలు పంచుకోవడం...ఎంతో బావుంది...ఇ-తెలుగు స్టాలు.
మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా.
శుభాకాంక్షలు.
మీ అందరికీ.
స్నేహపూర్వకంగా..
చంద్రలత

కొత్త పాళీ December 20, 2009 at 4:59 PM  

చాలా సంతోషం. ఒక్క వారం రోజులు ముందు ప్రయాణం పెట్టేసుకుని ఇదంతా మిస్సయిపోయాను! :(

మీరు కొన్న పుస్తకాల గురించి కూడా వివరంగా రాయండి వీలెంబడి. ఈ సారి నేను పుస్తకం తయారీ పనుల్లో ఉండి ఏమీ కొనుక్కోలేదు.

మురళి December 20, 2009 at 6:44 PM  

(ఇం) కోతి కొమ్మచ్చి వచ్చేసిందా... నేను మరికొన్ని రోజులు ఆగాలి.. 'దీపశిఖ' నేను చదివానండి.. చాలా బాగుంటాయి కథలు.. చదివాక మీరూ టపా రాయండి..

పరిమళం December 20, 2009 at 7:06 PM  

ప్చ్ ...నాకు వీలవలేదు లేకపోతే ఈ ఆనందంలో నేనూ భాగస్వామినయ్యేదాన్ని :(

మాలా కుమార్ December 20, 2009 at 7:36 PM  

ఓ నేను వచ్చేసాక చాలామంది వచ్చారన్నమాట . ఐతే నేను చాలా మిస్ అయ్యాను .

భావన December 22, 2009 at 10:14 AM  

చాలా బాగుంది అండి వరూధిని. మేము మిస్ అయ్యేము. :-(

శ్రీలలిత December 23, 2009 at 9:33 PM  

నేను పుస్తక ప్రదర్శన కి మంగళవారం వెళ్ళాను.. కాని అయిదు అవకముందే బయట కొచ్చెయ్య వలసి వచ్చింది. నేనూ కోతికొమ్మచ్చి కొన్నానండోయ్...

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI December 27, 2009 at 10:07 AM  

నేను సదా కోరుకొనే
సత్యమేకం
భావద్వయం
గుణ త్రయాలు
మనుగడకి చతుర్వేదాలు
మనిషికి పంచప్రాణాలు ..
జిహ్వకి షడ్రుచులు..
సంగీతానికి సప్తస్వరాలు..సరిగమలు
జగతికి అష్ట దిక్కులు
మనసుకి నవరసములు
బ్రతుకు పదికాలాలు!!
అటువంటి సరిగమలకి..నా బ్లొగ్ లకి స్వాగతం..
www.raki9-4u.blogsdpot.com
www.rakigita9-4u.blogspot.com
www.raki-4u.blogspot.com
సదా మీ స్నేహాభిలాషి
రాఖీ

Anonymous,  January 3, 2010 at 7:51 PM  

కోతి కొమ్మచ్చి చివరి భాగమా లేక మూడవ భాగం త్వరలో రానుందా? వెల ఎంత? ధన్యవాదాలు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP