పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 1, 2009

ఆనందమానందమాయెనే---నా సెల్లు పాడయి పోయినే!!

ఏమి హాయిలే హలా!! అహ.....ఏమి హాయిలే హలా!!

సెల్లు ఉంది ఎందుకు బ్యాగులో దాచుకోనా.....ఎత్తవే అన్న అదిలింపులు లేవు..

గడప దాటటం భయం......ఎక్కడున్నావు......ఎంతసేపట్లో వస్తావు.......ఇంత లేటు అయ్యిందేం ...అన్న ప్రశ్నల జడివానలు లేవు..

నెల రోజులనుండి ప్రాణానికి ఎంత హాయిగా ఉందో!

అసలు విషయమేమిటంటే.....నా సెల్లుఫోనుకి చీడ (వైరస్సు) పట్టింది..దాంతో దాన్ని ఓ మూలకి విసిరేసాను..

ఏంటో ఇన్నినాళ్లు నేను కోల్పోయిన నా స్వాతంత్రం అంతా తిరిగొచ్చేసిన భావన కలుగుతుంది..

నిజమండీ బాబు.....ఈ సెల్లుతో నాకు అన్నీ ఇన్నీ తిప్పలు కావు..

అసలు నాకు మొదలు సెల్లే అవసరంలేదు..ఏదో అలనాడు ఆఫీసుకి పోయి ఉద్యోగం వెలగబెట్టే రోజులలో.....ఎప్పుడయినా పిల్లలు ఇంటికి ముందుగా వచ్చేస్తే సెల్లులో కబురు పంపితే ఇంటికి వచ్చి వాలొచ్చని కొనుక్కున్నాను..కానీ అదే నా మెడకి రోకలిబండలా చుట్టుకుంటుందనుకోలేదు..

ఆ సెల్లు చేత్తో పట్టుకు తిరగాలంటే నాకయితే ఏదో కొండంత భారం మోస్తున్నట్టు ఉంటుంది..

పోనీ మెడలో తగిలించుకోవాలంటే.....అలా మెడలో వేసుకున్న వాళ్లని చూస్తే నాకు మూర్చ రోగులు మెడలో వేసుకు తిరిగే పలకలు గుర్తుకొస్తాయి (ఇది నా భావన అంతే......దయచేసి వేరుగా అర్థం చేసుకోకండి). అందుకే అది ఎప్పుడూ బ్యాగులోనే ఉంటుంది..మరి అది బ్యాగులో ఉంటే తొందరగా వినపడదు కదా! ఇక మా ఇంటాయన విసుర్లు అన్నీ ఇన్నీ కావు...సెల్లు ఎత్తని దానికి ఆ సెల్లు ఎందుకూ అంటూ.. ...(మరే నాదీ అదే ప్రశ్న..అసలు నాకు సెల్లు ఎందుకు?)

నా దృష్టిలో సెల్లు అంటే ఏదో అత్యవసరానికి వాడుకోవటానికే కాని అలంకారానికి కాదు. ప్రతివాళ్ల చెవుల దగ్గర ఈ సెల్లులు చూసీ చూసీ నాకు అవి అంటే ఎంత విముఖత వచ్చేసిందో!

ఏంటో ఏదో చెప్పబోయి ఏదో చెప్పేస్తున్నా..ఆనందం ఎక్కువయినా మాటలు దొరకవు కదా!!

నిజానికి నేను కొనుక్కున్న మొదటి సెల్లుని అప్పుడెప్పుడో మా మరిది పెళ్లిలో ఎవరో లేపేసారు....అహా పోయిందిలే అని సంతోషించా....అది పోయిన నెల తిరగకుండానే మా ఇంకొక మరిది అమెరికా నుండి మా పాపకి ఓ సెల్లు కొనుక్కొచ్చాడు....అప్పటికి మా పాపకి ఇంకా 18 నిండలేదు కాబట్టీను....18 నిండకముందు పిల్లలు సెల్లు వాడటం నా నియమాలకు వ్యతిరేకం కనకానూ.....ఇంకో సెల్లు కొనటం ఎందుకు దండగ అనీనూ....నేను ఆ సెల్లు వాడుకోవటం మొదలుపెట్టా....అమ్మయ్య......ఇప్పుడు దానికి కూడా రోజులు నిండాయి. మొన్నామధ్య మా అబ్బాయి దాన్లో బ్లూ టూతో రెడ్డు టూతో ఏదో ఉంటుంది కదా..దాన్ని కెలికినట్టున్నాడు..దెబ్బకి దానికి తెగులు పట్టుకుంది...ఇక దాని నోరు నొక్కేసి పక్కన పడేసా!

సెల్లు పాడయ్యాక మొదటిసారిగా మొన్నో రోజు ఊరు వెళ్లా....

సెల్లు లేని ప్రయాణం ఎంతా ఆహ్లాదంగా ఉందో!

ఊరు బయలుదేరతానా..గుమ్మంలోనుండి కాలు బయటపెట్టకముందే మొదలవుతుంది ఈ సెల్లాయణం...

అటునుండి..మా నాన్న........అన్నయ్య

ఇటునుండి మా ఇంటాయన!

బయలుదేరావా?
ఆటోలో వస్తున్నావా? మీ ఆయన దింపుతున్నాడా?
స్టేషను చేరావా?
ట్రెయిను కరెక్టు టైమేనా? కనుక్కున్నావా?
ఏ ప్లాటుఫారమో కనుక్కున్నావా?
ఎక్కావా?
ఎక్కడి దాకా వచ్చావు?
ఎక్కడున్నావు?
ఇంకా నడికుడేనా?
ఫోను ఎత్తవే?
మీ అన్నయ్యకి ఫోను చేసావా స్టేషనుకి రమ్మని?
ఇంకా ఎంత సేపట్లో గుంటూరు చేరతావు?
నల్లపాడు దాటగానే నాకు ఫోను చెయ్యి
దిగావా?
మీ అన్నయ్య కనపడ్డాడా?
ఇంటికి చేరారా?


* .....
* .....
* .
* .
* .
* .
* .
* .
* .
* .
* .
*

మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఆ సెల్లు అలా మోగుతూనే ఉంటుంది..అసలు ఊరికి ఎందుకొచ్చానురా భగవంతుడా అనుకుంటా!

సరే ఇక పిల్లలతో వెళితే అదో ప్రత్యేకం..పిల్లలని తీసుకెళ్లకుండా వెళితే అది మరో రామాయణం..వెరసి ఈ సెల్లుఫోను కనిపెట్టిన వాడెవడురా బాబూ అని తలపట్టుకునే పరిస్థితి.

ఇక ఎప్పుడైనా ఇంట్లోనుండి అలా బజారుకి బయలుదేరతానా...నా వెనకే సెల్లు మోత కూడా బయలుదేరుతుంది. నేనేమో సామాన్యంగా ఆటో ఎక్కను.....బస్సే ఎక్కుతాను. ఆ బస్సు మోతలో సెల్లు మాట్లాడాలంటే నాకు మహా చిరాకు....అది మోగినా నాకు వినపడదు.....వినపడినా ఎత్తను. అసలు నీకు సెల్లు ఎందుకు అని మరలా క్లాసు మొదలు:)). అయినా బయటకి వెళ్ళినవాళ్లం అక్కడే ఉండిపోతామా! నాలుగు పనులూ చేసుకు రావాలా! అర్థం చేసుకోరూ!

మా పెళ్ళయిన కొత్తలో ఇంటినుండి ఊరికి బయలుదేరుతుంటే.....వెళ్ళగానే ఓ ఉత్తరం వ్రాయమ్మా అని చెప్పేవాళ్లు....

ఇక హైదరాబాదు వచ్చిన కొత్తలో .........వెళ్లగానే ఫోను చెయ్యి అనేవాళ్లు.

ఇప్పుడో......ఇంటినుండి బయలుదేరిన దగ్గరనుండి.....అడుగడుక్కీ మనం ఏ దారిన వెళుతుంది...ఎక్కడ ఆగింది....కారులో ప్రయాణమయితే ఇక చెప్పక్కర్లేదు...అన్నీ ప్రత్యక్ష ప్రసారాలే....అంత అవసరమా...ఫోనుని .ఎంత దురుపయోగం చేస్తున్నాం అనిపిస్తుంది.

వెళ్ళగానే ఓ ఉత్తరం వ్రాయమ్మా.....అని చెప్పటంలో ఉండే ఆప్యాయత.....ఈ ప్రత్యక్ష ప్రసారాలలో నాకు కనపడదు..అంతా యాత్రికం అయిపోతుంది..ఏదో కోల్పుతున్నాం అనే భావన.

ప్రస్తుతానికయితే ఈ సెల్లు లేని జీవితం నాకు హాయిగా ఉంది!

19 వ్యాఖ్యలు:

సుజాత వేల్పూరి December 1, 2009 at 4:50 PM  

ప్రయాణంలో ఈ సెల్లు గోల (మీరు రాసిన వరస డైలాగుల) విషయంలో మీతో ఘోరంగా, భీభత్సంగా, భయానకంగా ఏకీభవించేస్తున్నా వరూధిని గారూ!

మరి ఏమిటిప్పుడు? మీ నంబర్ నా సెల్లు లోంచి తీసెయ్యాలా ఇప్పుడు?

చాలా సరదాగా ఉంది టపా ! వాస్తవికంగా కూడా!

లక్ష్మి December 1, 2009 at 4:56 PM  

వరూధిని గారు, సెల్లు గురించి నాది కూడా సేం టు సేం ఫీలింగు. వెంట వెంటనే ఫోన్ లు చేసి జనాలు పెట్టె హింస అంతా ఇంతా కాదు. మళ్ళా కొత్త సెల్లు కొనేవరకూ ఈ స్వేచ్చని ఆస్వాదించండి "Happy no-cell day(s)"

తృష్ణ December 1, 2009 at 6:02 PM  

ప్రస్తుతం నా "నాలుగో సెల్ ఫోనుకు" జ్వరం వచ్చింది. నిద్రోతోంది. కొత్తది రావటానికి సమయం పట్టేట్టుంది..:)

కానీ నా కేస్ రివర్స్...నాకు ఫొన్ లేకపొతే సంతోషించే మొదటి వ్యక్తి మా ఇంటాయన...మిస్సడ్ కాల్ ఇచ్చి, మీరు రాసిన ప్రశ్నలన్నీ నేనే ఆయనను అడుగుతూ ఉంటాను కాబట్టి...:) :)
పాపం మా అమ్మనాన్న మాత్రం నాకు కొత్త ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నరు..!!

జయ December 1, 2009 at 6:06 PM  

మీకు అంత సంతోషంగా ఉందాండి. అయితే ఎప్పటికీ మీ చేతికి సెల్ ఫోన్ రాకుండు గాకా. కాని నేను చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మీ అమ్మాయి పెళ్ళయ్యాక మీరే సెల్ ఫోన్ కొనుక్కోని,ఇప్పటివరకు మీరు పడ్డ హింసకి ఇప్పుడు మీ అమ్మాయిని గురిచేస్తారు. అప్పుడు మీ అమ్మాయి సెల్ ఫోన్ పారేస్తానంటే, మీరేమంటారు? హి..హి..హి...

మాలా కుమార్ December 1, 2009 at 6:50 PM  

బాగుందండి మీ సెల్ పురాణం . నేనైతే బయిటికి వెళ్ళేటప్పుడు , సెల్ ఇంట్లోనే మరిచి పోయి వెళుతాను .ఇంట్లో వున్నప్పుడు లోపలెక్కడో పడేస్తాను .

Anonymous,  December 1, 2009 at 7:27 PM  

ఇక నా కధ చెపుతా వినండి . హరిలో రంగ హరి......
నన్ను బజార్లో దింపి నాకో గంట టైమిచ్చి ఆయన పని చూసుకోటానికి వెళతారు . ఇక అక్కడి నుంచి ప్రతీ పదినిమిషాలకీ ఫోను , అయ్యిందా అంటూ. ఇదేం అన్యాయం అంటే .....ఇలా అయితేనే నువ్వు గంటకి తెములుస్తావు అంటారు. నాకయితే ఈ మొగుడూ వద్దూ( ఆ ఏదో మాటవరసకి) ఈ సెల్లూ వద్దూ అని గోదార్లో విసిరెయ్యాలని పిస్తుంది( సెల్లుని) ఫోను ఎత్తకపోతే సేం టు సేం మీకు పడే అక్షింతలే నాకూను. ఇక ఎక్కడికయినా ఇద్దరం కల్సి వెళితే నా సెల్ల్ తేకూడదు. ఎందుకూ నే పక్కనే వుంటానుకదా అంటారు. నేను నా సెల్ల్ ని ఎక్కువగా ఫోటోలు తియ్యటానికీ, పాటలు వినడానికీ వాడుతుంటాను. మిగతా అన్ని విషయాల్లోనూ నేను ఘోరంగా మీతో ఏకీభవిస్తూ ....సెల్లోరంగ సరి.

గీతాచార్య December 1, 2009 at 8:41 PM  

మీ సంగతేమో కానీ, రోజుకి రెండొందల (అక్షరాలా) పైన కాల్స్ అటెండ్ చేయాల్సిన నేను ఓ పర్మనెంట్ నంబరుంచుకుని (అవసరమైన వాళ్ళకి మాత్రమే) మిగిలిన వాళ్ళకిచ్చే నంబరు ఎప్పుడూ మారుస్తుంటాను. ఆఫర్ల సాకు చెప్పి.

గీతాచార్య December 1, 2009 at 8:42 PM  

సెల్లు లేందే నాకు గడవదండీ. నాకు రెగ్యులర్ గా పాటలు వింటం అలవాటు. అన్నీ అందులోనే కనుక తప్పదు.

నేస్తం December 1, 2009 at 9:04 PM  

నేనయితే సెల్ విషయంలో మహా బద్దకం చూపిస్తా.ఎప్పుడు బయటకు వెళ్ళినా మర్చిపోయి చీవాట్లు తినేస్తా..ముఖ్యంగా చార్జింగ్ చేయడం మర్చిపోతా.ఇక మా ఆయనకు సెల్ అంటె ఎంత పిచ్చి అంటే ప్రతి 3 నెలలకోసారి నా సెల్, ఆయన సెల్ మార్చేసి కొత్తవి కొంటుంటారు.యే రాయి అయితే ఏంటీ పళ్ళు ఊడకొట్టుకోడానికి ,యే సెల్ అయితే ఏంటీ మాట్లాడడానికే కదా కుదురుగా ఒక్కటి ఉంచరా అని మా ఇంట్లో ఎప్పుడూ యుద్దాలే,ఆ కొత్త సెల్ లను ఎలా వాడాలో ఏంటో... నాకు విసుగొచ్చి సగం ఇంట్లో పడేసి వెళ్తా బయటకు.

సిరిసిరిమువ్వ December 1, 2009 at 9:15 PM  

@సుజాత గారు, ఇప్పట్లో నా సెల్లుకి తిరిగి గొంతు తెచ్చే పని చెయ్యబోవటం లేదు కాబట్టి మీరు నిరభ్యంతరంగా నా నెంబరు తీసివేయవచ్చు..మళ్లా దాని గొంతు విప్పిననాడు నేనే మీకు ఫోను చేస్తాను:)
@లక్ష్మి గారు, బహుదా ధన్యవాదాలు.
@తృష్ణ గారు, ఈ విషయంలో మీకూ నాకూ బహుదూరమన్నమాట! అయ్యో పాపం మీ వారు!!
@జయ గారూ, ఏం శాపనార్థాలు పెడ్తున్నారండి!!
@మాలా గారు, నన్ను మించి ఉన్నారుగా మీరు!!
@లలిత గారు, సరి..సరి.
@గీతాచార్య గారు, "రోజుకి రెండొందల (అక్షరాలా) పైన కాల్స్"...ఇంక మీరు పిల్లలకి పాఠాలేం చెప్తారు?

వేణూశ్రీకాంత్ December 1, 2009 at 10:38 PM  

"పోనీ మెడలో తగిలించుకోవాలంటే.....అలా మెడలో వేసుకున్న వాళ్లని చూస్తే నాకు మూర్చ రోగులు మెడలో వేసుకు తిరిగే పలకలు గుర్తుకొస్తాయి"

మరే.. సెల్ ఫోను కాదు కాని మా మెడల్లో వేళ్ళాడే ఐడీ కార్డులను చూసిన ప్రతిసారి ఇదే ఫీలింగ్. హేమిటో ఈ ఖర్మ అని.

భలే విషయం మీదరాశారు సిరిసిరిమువ్వ గారు. మరీ ప్రత్యక్షప్రసారలతో విసిగించకున్నా... గుర్తొచ్చినపుడు సెల్ ఫోన్ లో ఠక్కున క్షేమం కనుక్కుని పెట్టేయడం ఉత్తరం కోసం ఎదురు చూడటం కన్నా ఉత్తమం అనిపిస్తుంది నాకు.

భావన December 2, 2009 at 11:13 AM  

నేను కూడా భీబత్సం గా ఏకీభవిచ్చేస్తున్నా మీతో ఈ సెల్ గురించి. సెల్ అంటే ఏదో అత్యవసరాలకు వాడుకోవాలి కాని బాబోయ్ హింస ఈ సెల్ల్ ఫోన్ లతో.

సిరిసిరిమువ్వ December 2, 2009 at 4:42 PM  

@వేణూ, నిజమే మెడల్లో వేళ్ళాడే ఐడీ కార్డులను చూసినప్పుడు కూడా నాకు అవే గుర్తుకొస్తాయి.
సత్వర సమాచారం కోసం ఫోను ఉపయోగమే కాని ఇప్పటిలా విచ్చలవిడి వాడకం మాత్రం నాకు ఆమోదం కాదు.

అయినా ఉత్తరాలకోసం ఎదురు చూసీ చూసీ అవి చదువుకోవటంలో ఉండే ఆనందం ముందు ఏదీ సాటిరాదు లేండి!

@భావన, మీకు అక్కడ కూడా ఈ హింస ఉందా?

మురళి December 2, 2009 at 7:13 PM  

యెంత అదృష్టం.. జలసూయగా ఉంది.. నాకూ ఫోన్ విసిరేయాలని ఉంది కానీ అవకాశం లేదండీ..ప్చ్..

సిరిసిరిమువ్వ December 2, 2009 at 8:57 PM  

@ నేస్తం, అయితే ఎవరయినా కొత్త సెల్లు కొనుక్కోవాలంటే మీ సలహా తీసుకోవచ్చన్నమాట!
@సునీత గారు, ధన్యవాదాలు.
@మురళి గారు, హ్హ..హ్హ..హ్హ. అయినా ఒకసారి విసిరేసి చూడరాదా..ఏం కొంపలు మునుగుతాయో చూద్దాం.
"జలసూయ"..ఇదేదో బాగుందే!

శ్రీలలిత December 3, 2009 at 11:34 PM  

వరూధినిగారూ,
సెల్ ఫోన్ ని ఒక necessary evil అనాలేమొ..
లేదా తెలుగులో చెప్పుకోవాలంటే "ప్రియమైన శత్రువు" అనుకోవచ్చు.
పోనీ మన వ్యావహారిక భాషలో చెప్పుకోవాలంటే "అత్తగారు" అనుకుందాం.
మంచి పనిలో ఉన్నప్పుడు "జుయ్" మని పిలుస్తుంది.
అందమైన భావనలలో ఉన్నప్పుడు మనకి ఇష్టం లేని పనిని చెయ్యమని పురమాయిస్తుంది.
ఒంటరిగా ఉండాలనుకున్నప్పుడు చెవిలో సొద మొదలుపెడుతుంది.
ఏం చెస్తాం? కొని తెచ్చుకున్న తద్దినమాయె... ఏవంటారు?

సిరిసిరిమువ్వ December 4, 2009 at 4:23 PM  

ప్రియమైన శత్రువు..అహ్హ..అహ్హ..బాగా చెప్పారు.

అత్తగారు..అంటే అత్తగారు మీ దృష్టిలో ప్రియమైన శత్రువన్నమాట! ఇంతకీ మీ అత్తగారు ఉన్నారా? మీరు అత్తగారు అయ్యారా?

Anonymous,  December 8, 2009 at 9:26 PM  

:) మీసెల్లుకి కాలం చెల్లేవేళకి నాచేతికొచ్చింది ప్చ్. కానీ నాకు మరీ ఘోరం అనిపించింది నేను రైల్లో మధ్యబెర్తులో నిద్రకోసం అలమటిస్తుంటే కిందబెర్తుమీద తల్లి వాళ్లపిల్లకోసం సెల్లులో సినిమా పాట పెడితేనూ (ఇది సాధ్యం అని నాకు అప్పుడే తెలిసింది) పైబెర్తులో ఆయన మిరపకాయల రవాణా గురించి గుంటూరుకి వినిపించేలా మాటాడుతుంటేనూ ...

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP