పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

September 21, 2009

అమ్మమ్మ-అల్జీమర్స్

 సెప్టెంబరు 21,  ప్రపంచ అల్జీమర్స్ రోజు

ముసలితనం కన్నా భయంకరమైన జబ్బు ఇంకొకటి  లేదట!

ప్రపంచంలో ఏ జబ్బుకయినా మందులు ఉన్నాయి, ఉపశమనం ఉంది.....కాన్సరు, ఎయిడ్సు లాంటి ప్రాణాంతక వ్యాధులను కూడా ముందుగా గుర్తించి సరైన వైద్యం అందిస్తే పూర్తిగా తగ్గించవచ్చు కానీ ఈ ముసలితనం అన్నది చికిత్స లేని జబ్బు అని  సెలవిచ్చాడు ఓ మహానుభావుడు.  మరి ఈ చికిత్స లేని జబ్బుకి తోడు ఇంకో చికిత్స లేని జబ్బు తోడయితే.......ఆ వ్యక్తి పరిస్థితేమిటి?  అదే అల్జీమర్స్.....వయస్సుతో వచ్చే మతిమరుపు రోగం.... .అది కూడా భయంకరమయిన ప్రాణాంతకమయిన  మతిమరుపు.


ప్రస్తుతం ప్రపంచంలో 65 ఏళ్ళకు పైబడిన వారిలో 5 శాతం మంది ఈ వ్యాది భారిన పడుతున్నారని ఓ అంచనా.  దీని ముఖ్య లక్షణం జ్ఞాపకశక్తి క్షీణించటం.  మతిమరుపు అన్నది మన అందరిలో కొద్దొ గొప్పో ఉంటూనే ఉంటుంది.  వయస్సు పైబడే కొద్ది అది కాస్త ఎక్కువ అవుతుంది.  కానీ ఆ ఎక్కువవటం అన్నది ఈ వ్యాధిగ్రస్థుల్లో ఎంత ఎక్కువగా ఉంటుందంటే  ఈ మతిమరుపుతో రోజురోజుకి వారి దైనందిక జీవితం దుర్లభంగా మారుతుంది.  ఏదీ గుర్తుండదు.  అన్నం తిన్నది లేనిది గుర్తుండదు.  ఇంట్లోని తన మనుషులే తనకి గుర్తుండరు.... పేర్లు గుర్తుండవు,  బంధుత్వాలు గుర్తుండవు......  జీవితంలో అనుభవాలు, అనుభూతులు ఏవీ గుర్తుండవు.

 మొదట్లో వర్తమానానికి గతానికీ  మధ్య రంగుల రాట్నం తిరుగుతూ ఉంటారు.  తరువాత తరువాత గతం, వర్తమానం ఏమీ గుర్తుండవు. అంతా అయోమయం...శూన్యం.....ఆ శూన్యంలో నుండి వచ్చే అసహనం, కోపం, చిరాకు....... స్నానం చేయటం, బట్టలు మార్చుకోవటం లాంటి దైనందిక పనులు కూడా చేసుకోలేరు.  కొన్నాళ్లకి మాట్లాడటం, వ్రాయటం, నడవటం కూడా చేయలేరు.  వారి జ్ఞాపకాలన్నీ బ్రతికుండగానే సమాధి అయిపోతాయన్నమాట!   ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి మన ఇంట్లోనే ఉంటే!!


అవును మా అమ్మమ్మకి ఓ మూడు నాలుగు సంవత్సరాలనుండి ఈ వ్యాధి ఉంది.  ఆమె వయస్సు 80 పైనే.  ముందు మామూలు వయస్సుతో పాటు వచ్చే మతిమరుపు అనుకున్నాం.  తరువాత తరువాత అసలు రోజూ చూసే మనుషుల్ని కూడా  గుర్తుపట్టటం మానేసింది.  నేను దాదాపు రెండు మూడురోజులకి ఒకసారి తన దగ్గరకి వెళ్లేదాన్ని.  ఒక్కో రోజు బాగానే గుర్తు పట్టేది.....ఒక్కో రోజు నువ్వెవ్వరివమ్మా అని అడిగేది.  ఏంటమ్మమ్మా నేను అంటే ఏమోనమ్మ గుర్తురావటం లేదు అని అమాయకంగా ఓ నవ్వు నవ్వేది.  మీ లక్ష్మి గారమ్మాయిని అంటే మళ్లీ కాస్త జ్ఞాపకం వస్తా!! మొదట్లో మాకు ఇదంతా కొంచం వినోదంగానే ఉండేది......తరువాత తరువాత అర్థం అయ్యింది ఈ మతిమరుపు ఎంత బాధాకరమో.  తనకే కాదు ఇంట్లో వాళ్లకి కూడా దాంతో చాలా ఇబ్బందే.

అన్నం తిన్న కాసేపటికే ఏంటి ఇవాళ నాకింకా అన్నం పెట్టలేదు పెట్టు అంటూ వచ్చి టేబులు దగ్గర కూర్చుంటుంది.   ఉండుండి గతంలోకి వెళ్లిపోతుంది...అక్కడే బ్రతికేస్తుంది.....ఇక ఆమె ఆలోచనలు అప్పటినుండి  ఇప్పటికి రావు....అక్కడే ఆగిపోతాయి.  ఆమె మేనత్తలు, మేనమామలు, ముసలమ్మలు... అన్నయ్యలు, వాళ్ల పిల్లలు....తను అప్పటి జీవితంలో ఎవరితో అయితే ఎక్కువ సన్నిహితంగా ఉందో  వాళ్లందరూ గుర్తుకొస్తారు.  వాళ్లందరూ (పోయినవాళ్లతో సహా) ఇప్పుడు తనతో ఉన్నారనుకుంటుంది.

అప్పట్లో పొద్దున్నే లేచి గొడ్ల దగ్గరికి వెళ్ళి పాలు తీయటం, వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు వేయటం.....ఇవన్నీ గుర్తుకొస్తాయి....పాలుపిండే టైము అయింది చావిడి దగ్గరికి వెళ్ళాలంటూ హడావిడిగా బయలుదేరుతుంది!  ఒక్కోరోజు అర్థరాత్రి లేచి తెల్లవారింది వాకిలి ఊడవాలి అంటూ చీపురు పట్టుకు బయలుదేరుతుంది.  ఇక మామయ్య వాళ్లు తలుపులకి తాళం వేయటం ప్రారంభించారు.  మొన్నొక రోజు ఇలానే రాత్రిపూట లేచి వాకిలి ఊడవాలి అంటూ చీపురు కోసం చీకట్లో దేవులాడుతూ పడి కాలు తుంటి విరగ్గొట్టుకుంది, దానికి ఆపరేషన్..... ఆరు వారాలు బెడ్ రెస్టు....ఎంత నరకమో!!

 ఈ మతిమరుపు అన్నది కూడా తెరలు తెరలుగా వస్తుందనుకుంటా!  అప్పటిదాకా మామూలుగా ఉందల్లా హఠాత్తుగా లేచి అమ్మాయి నేనొచ్చి చాలా సేపయిందిగా ఇక నేను మా ఇంటికి వెళతా  అంటూ బయలుదేరుతుంది.  ఎప్పుడూ ఎవరో ఒకరు కాపలా ఉండాలి.  ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు వేరే ఎక్కడికయినా వెళ్ళొస్తే తనకి ఇల్లు మనుషులు అంతా కొత్తగా కొత్తగా అయోమయంగా ఉంటుంది.  బాత్రూం ఎక్కడో...వంటిల్లు ఎక్కడో....బెడ్ రూము ఎక్కడో అన్ని మర్చిపోతుంది....అన్నీ మళ్లీ అలవాటు చేయాలి.

వీళ్లతో వ్యవహరించటం కూడా చాలా కష్టమే.  ఊరికే కోపం వస్తుంది.  నువ్వు అన్నీ మర్చిపోతున్నావు అంటే మా అమ్మమ్మకి ఎంత కోపమో.  వీళ్లని పసిపిల్లలకి మల్లే  జాగ్రత్తగా చూసుకోవాలి.  వాళ్లతో వాదనలు పెట్టుకోకూడదు.  స్నేహభావంతో మెలగాలి.  వాళ్లు చేస్తామన్న పనులు చిన్నవి చిన్నవి చేయనివ్వాలి, కాకపోతే ఎవరో ఒకరి పర్యవేక్షణ ఉండాలి. 

ఇదంతా ఒక ప్రత్యేకమైన జన్యువులో లోపం వల్ల వస్తుందట. పల్లెటూర్లలో వారికంటే పట్నాలలోని వారికి ఎక్కువగా వస్తుందట. ఒంటరి జీవులకు ఇది మరీ తొందరగా వస్తుందట....ఆడవారికి మరీను. ఇది రాకుండా నివారించటానికో వచ్చాక  తగ్గించటానికో ప్రత్యేకమయిన చికిత్స కాని మందులు కాని లేవనే చెప్పొచ్చు. మన దేశంలో దీని గురించి ప్రజలలో అవగాహన కూడా తక్కువే.  ఇప్పుడు ఏవో స్క్రీనింగులు,  టెస్టులు- MMSE (Mini Mental State Exam)  వచ్చాయి....ముందుగా గుర్తించవచ్చు అంటున్నారు కాని  అవన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లోనే అంతంతమాత్రంగా ఉన్నాయి.  ఇక మన దేశంలో విస్తృతంగా రావటానికి చాలా సమయం పట్టవచ్చు. మనదేశంలో కూడా వీళ్ల కోసం ఓ సొసైటీ ఉంది. 

అసలు మనిషి ఆయుర్దాయం పెరిగేకొద్ది ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి.  బుర్రకి ఎప్పుడూ ఏదో ఒక పని పెడుతుంటే ఈ జబ్బు వచ్చే అవకాశాలు తక్కువట.  అందుకే 50 దాటిన వారు పుస్తకాలు చదవటం, పజిల్సు ఎక్కువగా చేస్తుండటం లాంటివి చేస్తుండాలి అని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. అసలు నన్నడిగితే రిటైర్మెంటు దగ్గరపడ్డ వాళ్లందరికి బ్లాగులు చదవటం అలవాటు చేస్తే సరి,  మేదడుకి మంచి మేత!!

    మా అమ్మమ్మ లాంటి మరెంతమందో అమ్మమ్మలకి,  తాతయ్యలకి  ఈ  టపా.


13 వ్యాఖ్యలు:

సుజాత వేల్పూరి September 21, 2009 at 10:55 AM  

ఇవాళ పేపర్లో కూడా ఈ వ్యాధి గురించి చదివాను. ! కాకపోతే వాళ్ళు ఇదేదో కామెడీ అన్నట్లు "తికమక-మకతిక"అని పెట్టారు శీర్షిక!

ఇటువంటి వ్యాధొకటి ఉందని తల్చుకుంటే భయమేస్తుంది. ఎప్పటికైనా వృద్ధాప్యం మీద పడకపోదు! ఆడవారికి మరీను..అంటే ఇంకా భయంగా ఉంది.
బుర్రకి ఎప్పుడూ ఏదో ఒక పని పెడుతుంటే ఈ జబ్బు వచ్చే అవకాశాలు తక్కువట. అందుకే 50 దాటిన వారు పుస్తకాలు చదవటం...this makes me feel much better!

రిటైర్మెంటు దగ్గరపడ్డ వాళ్లందరికి బ్లాగులు చదవటం అలవాటు చేస్తే సరి! LOL...!

Sujata M September 21, 2009 at 11:58 AM  

నిన్న హిందూ మాగజీన్ లో చదివాను. చాలా సమాచారం ఉంది. మీరూ చదవండి. అందులో కేర్ టేకర్స్ కి ఇచ్చిన సూచనలు చాలా మానవీయంగా ఉన్నాయి. ఆల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల తో పాటూ కుటుంబ సభ్యులను, రోగి కి దగ్గరి వాళ్ళనూ ఎక్కువగా బాధపెడుతుంది. పైగా ఇది వాళ్ళను తీవ్ర ఒత్తిడి కి కూడా గురి చేస్తుంది.

సిరిసిరిమువ్వ September 21, 2009 at 12:10 PM  

సుజాత గారూ :) మన పత్రికలకి అంతా కామేడీయే అండి. అదే నిన్నటి హిందూలో చూడండి ఎంత వివరంగా ఇచ్చాడో!

సుడోకులు, గళ్లనుడికట్లు మెదడుకి బహు చక్కని మేత----అందుకని మీకసలు ఏ ఢోకా లేదులేండి!

@సుజాత గారు,(గడ్డిపూలు)ధన్యవాదాలు. నిన్నటి హిందూ చదివాను. అవును కుటుంబసభ్యులపై చాలా వత్తిడి ఉంటుంది. అసలు వ్యాధిగ్రస్థుల కంటే ముందు కుటుంబ సభ్యులకి ఎక్కువ కౌన్సిలింగు అవసరం కూడా!

Saahitya Abhimaani September 21, 2009 at 2:54 PM  

అవును, అల్జీమర్స్ చాలా భయంకరమైన వ్యాధి. మనమెవరో మనకి తెలియని అగాధంలో పడిపోవటం తల్చుకుంటేనే వణుకు పుడుతుంది. నేను చూసాను ఈ ప్రత్యక్ష నరకం. మా అమ్మగారు, ఈ వ్యాధితోనే 3-4 సంవత్సరాలు బాధపడి 2004లో పరమపదించారు. కొత్తల్లో తెలియదు, తెలిసినాక ఏమీ చెయ్యలేము. నన్ను చూసి వాళ్ళ అన్నయ్య అనుకునేది (నాకు మా మావయ్యకి దగ్గర పోలికలున్నాయి), మా నాన్నను చూసి వాళ్ళ నాన్న అనుకునేది. ఎంత జాలివేసినా చెయ్యగలిగేది ఏమీ లేదు. వాళ్ళకి కలిగిన కష్టం చెప్పుకోలేరు. గుర్తుంటేకదా. శారీరిక బాధలు, చివరకు రోజువారి కార్యక్రమాలు కూడ మర్చిపోయి నరకం ఆనుభవించి పైలోకాలికి వెళ్ళిపోయింది. మేమెంత తాపత్రయపడి అనేక స్కానింగులు తీయించి, సైక్రియాటిస్టులు, న్యూరోలజిస్టులకు చూపించినా ప్రయోజనం లేక పోయింది.

మీరు వ్రాసిన వ్యాసం చదువుతుంటే మళ్ళీ ఆ విచారం, దిగులు ఆవరించింది. వెళ్ళి మా అమ్మ ఫొటోలు చూడాలి కాసేపు.

మాలా కుమార్ September 21, 2009 at 3:58 PM  

అవును ఇది చాలా బాధాకరమైనది. మా అత్తగారు చనిపోయాక మా మామగారు ఇలాగే చెసెవారు . కొటప్పకొండ తిరునాళ్ళకి వెలుతున్నాను అంటే జోక్ అనుకున్నాము. ఓ రోజు బాల్కనీ గోడమీదనుండి దూకపోతూ వుంటే మా పనిమనిషి చూసి గట్టిగా కేకలు పెట్టింది.అప్పుడు తెలిసింది ఆయన మన లోకంలో లేరని.మాకే కాదు తలుపు తీసివుంటె చాలు పక్క ఫ్లాట్ లలోకి కూడా వెళ్ళి గోల చేసేవారు. నాకు చాలా భయం గా వుండేది. నేనూ ,పనమ్మయి కనిపెట్టుకొని వుండేవారము . అదృష్టవసాత్తు ఆ స్టేజ్ లో ఎక్కువ రోజులు తీసుకోకుండానే వెళ్ళిపోయారు.
శివ గారు ,
మీరు రాసింది చదువుతుంటే చాలా బాధ అనిపించింది.

sunita September 21, 2009 at 4:48 PM  

ఇప్పటి చింత లేని చిన్న కుటుంబాలవల్ల ఒంటరితనం ఎక్కువై సగం బాధలూ, మారిన జీవనశైలి వల్ల సగం బాధలూ.ప్చ్ ...

వేణూశ్రీకాంత్ September 21, 2009 at 5:24 PM  

సిరిసిరిమువ్వ గారు, భారతీయులలో అరుదుగా కనిపించే ఈ వ్యాధి భారిన మీ అమ్మమ్మగారు పడటం బాధాకరమైన విషయం. నిజంగా ఈవ్యాధి తీవ్రత తెలిసిన వారు స్టెమ్ సెల్స్ రీసెర్చ్ ని కూడా సమర్ధించడానికి వెనుకాడరు. మెదడు కు వచ్చే ఈ వ్యాధిని నివారించడానికి ఎప్పుడూ మెదడును చురుకుగా ఉంచుకోడం ఒక్కటే మార్గం.

భావన September 21, 2009 at 7:43 PM  

అబ్బ ఎంత బాధ గా వుందో అందరి అనుభవాలు వివారాలు చూస్తూంటే... సునీత అన్నట్లు నూక్లియార్ కుటుంబాలలో ఇది వచ్చే చాన్స్ ఎక్కువ అట.ఫన్నీ గా వుంది కాని నిజమే బ్లాగ్ లు చదవటం అలవాటు చేస్తే సరి మంచి ఐడియా.. ;-)

Siva and all others who has/had a family member with that problem. I am so sorry for it.

సిరిసిరిమువ్వ September 21, 2009 at 8:28 PM  

@ శివ గారు, మీకు నా సానుభూతి ఎలా చెప్పాలో తెలియటం లేదు. నిజంగా వాళ్లకి చూసేవాళ్ళకి కూడా ప్రత్యక్ష నరకమేనండి.
@మాల గారు, మీరు కూడా బాధితులే అన్నమాట! వీళ్ళతో కుటుంబసభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
@సునీతా గారు, నిజం చెప్పారు. చిన్న కుటుంబం చింతల కుటుంబం అయిపోతుంది.
@వేణు, కొత్తపాళీ, భావన ధన్యవాదాలు.

రాధిక September 22, 2009 at 2:50 AM  

మాతాతయ్యకి ఇలానే మతిమరపు వుండేది.మిగతావారికంటే కాస్త ఎక్కువ అనుకునేవాళ్ళం.బయటకెళ్ళి ఇల్లు మర్చిపోవడం,ఎవరి తాలూకానో కూడా చెప్పలేకపోవడం.ఎక్కడికెలుటున్నానో కూడా తెలీకుండా అలా వెళ్ళిపోవడం చేస్తుండేవారు.చుట్టుపక్కల ఊర్లలో కూడా అందరూ తెలిసినవాళ్ళే కాబట్టి ఎప్పటికప్పుడు తీసుకొచ్చేవారు.బాత్రూంకని లేచి అటూ ఇటూ తిరిగి చివరికి తనమంచంపక్కనే కానిచ్చేవారు. మా పిల్లలకి మాత్రం భలే సరదాగా వుండేది.తాతయ్య దగ్గర కూర్చుని టైంపాస్ చేసేవాళ్ళం నేనెవరు,నువ్వెవరు అంటూ.ఎంత వెట్కారం చేసినా నవ్వుతూనే సమాధానం చెప్పేవారు[ఆయనకి కోపం బాగా ఎక్కువ.అంతకు ముందు తక్కువగా నవ్వుతూ వుండేవారు]ఇలాంటి ఒళ్ళు తెలియని పరిస్థితుల్లో ఒక సంవత్సరం వున్నారాయన. మీ టపా చదివాకా అనిపిస్తుంది తాతయ్య కూడా అల్టీమర్ పేషెంటేమో అని.ఊర్లలో ఇలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తారు.అక్కడ వుండే డాక్టర్లకి తెలీదో లేక పెద్ద ప్రాబ్లం ఏముంది అనుకుంటారో ఇలాంటి కేసుల్ని పెద్దగా పట్టించుకోరు.ఈవయసులో ఇంతేనండి అని వదిలేస్తారు.

మురళి September 22, 2009 at 11:23 AM  

చూసే వాళ్లకి చినదిగా అనిపించే సమస్య అండీ ఇది... అనుభవించే వాళ్లకి మాత్రమె అర్ధమవుతుంది ఆ కష్టం.. త్వరలోనే ఏదైనా మందు కనిపెడతారని ఆశిద్దాం...

సిరిసిరిమువ్వ September 22, 2009 at 2:22 PM  

@రాధిక, నిజమేనండీ ఇక్కడ ఈ వ్యాధి గురించి అంతగా అవగాహన లేదు. ఏదో వయస్సుతో పాటే వచ్చే సహజమయిన మతిమరుపే అనుకుంటారు.
@మురళి గారూ, lets hope for the best.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP