పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

September 29, 2009

మా రామూ ఇక లేదు

మా మూడవ రామూ గురించి వ్రాసి కూడా బ్లాగులో పెట్టటానికి ఇదిగో అదిగో అనుకుంటూ బద్దకించాను. ఇంతలోనే దానికి బాగోలేదన్న వార్త,  ఆ పైన చనిపోయిందన్న వార్త!  అది చనిపోయే సమయానికి ఇంట్లో మా అమ్మ వాళ్లు కూడా లేరు.  అంతకు రెండు రోజుల ముందు నుండి దానికి కాస్త ఒంట్లో బాగుండటం లేదు, డాక్టరుకి చూపించి మందులు వాడారు, కాస్త తేరుకుందని బెంగుళూరు వెళ్ళారు....అంతలో ఈ వార్త!  వాళ్లు రేపు కాని రారు.  మా నాన్నకి ఇంకా ఈ వార్త తెలియదు. అసలే ఆయనకి దానిని అలా వదిలి పెట్టి ఊరెళ్లటం ఏమాత్రం ఇష్టం లేకపోయినా తప్పక వెళ్లారు.  రేపు వచ్చాక ఈ వార్త తెలిసి ఎలా స్పందిస్తారో అని మా అందరికి కంగారు.  మొన్న దానికి బాగోనప్పుడే పది మంది డాక్టర్లని సంప్రదించి....సరయిన డాక్టరు లేరని ఓ రోజంతా హడావిడీ చేసారు. అసలు ఈ వయస్సులో వాళ్లకి అదే పెద్ద తోడు.....దానితోనే వాళ్లకి కాస్త కాలక్షేపం.

మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చే RMP డాక్టరు గారికి ఓ పెద్ద ఆల్సేషియన్ కుక్క ఉండేది.  దాని పేరు సీజర్--అప్పటికి ఇంకా జూలియస్ సీజరు పేరు తెలియదు కాబట్టి ఇదేం పేరబ్బా అనుకునేవాళ్లం.  నేను కనుక కుక్కను పెంచుకుంటే ఏ రామూనో రాజూనో అని పేరు పెడతా గాని ఇలాంటి పిచ్చి పేర్లు పెట్టను అనుకునేదాన్ని. అలాగే మా ఇంట్లో మేము పెంచుకున్న మూడు కుక్కల పేర్లు రామూనే!

మా రెండో రామూ అలా అకస్మాత్తుగా చనిపోయాక చాలా రోజులు ఎవరం మళ్లా కుక్కని పెంచాలన్న ఆలోచన చేయలేదు. తరువాత ఎప్పుడో మా మూడో రామూ వచ్చింది మా ఇంటికి. ఇది కూడా మా మొదటి ఇద్దరి రామూలు వచ్చిన ఇంటినుండే వచ్చింది. ఇది ఎప్పుడొచ్చిందో కూడా నాకు గుర్తు లేదు..బహుశ పదిహేనేళ్లు పైనే అయి ఉంటుంది. దూరంగా ఉండటానేమో నాకు దీనితో అంత అనుబంధమూ లేదు, కాని దానికి మాత్రం మా మీద చాలా ఆభిమానం. ఇప్పటికీ ఇంటికి వెళితే ముందు ఓ  పది నిమిషాలు దాని  తల నిమరకపోతే ఊరుకోదు.  ఆ అభిమానం మా ముగ్గురి పిల్లల మీదే (అంటే ఆ ఇంటి పిల్లల మీదే)...మరలా ఇంటి అల్లుళ్ళు, కోడలు, మనవళ్లు, మనవరాలి మీద ఉండదు...నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఎవరు చెప్పారు దానికి మా బంధుత్వాలు అని!!

ఇది మా నాయనమ్మకి వీరాభిమాని. హచ్ ఏడ్‍లో కుక్కలాగా ఇది కూడా మా నాయనమ్మ ఎక్కడుంటే అక్కడే! అసలు వదిలేది కాదు. అప్పటికే మా నాయనమ్మ ఓపిక అయిపోవటం మూలాన ఎక్కువగా పడుకునే ఉండేది. మా నాయనమ్మ ఏనాడూ దానికి అన్నం పెట్టి ఎరగదు. దాని అన్నపానాదులు అన్నీ మా అమ్మే చూసుకునేది అయినా దానికి మా నాయనమ్మ అంటేనే ఇష్టంగా ఉండేది. ఆమెకి బాగోనప్పుడు ఆమె మంచాన్ని అసలు వదిలేది కాదు.  బయటి వాళ్లని ఎవరినీ ఆమె మీద చెయ్యి వేయనిచ్చేది కాదు..చివరికి డాక్టరుని కూడా...ముందు దానిని కట్టేసాకే డాక్టరు గారు లోపలికి వచ్చేవాళ్లు.

మామూలుగానే ముందునుండీ మా అమ్మ నాన్లకి మా ఇళ్లకి ఎవరిళ్లకి వచ్చి ఓ నాలుగు రోజులు ఉండే అలవాటు లేదు! ఎప్పుడైనా వచ్చినా ఒకటి రెండు రోజులే ఉండేది.  మా నాయనమ్మ ఉన్నంతకాలం ఆమెకి కష్టం అని వచ్చేవాళ్లు కాదు..ఇప్పుడేమో కుక్క వంక చెపుతారు..మేము లేకపోతే అది అన్నం తినదు..పాలు తాగదు అంటూ.
మా నాన్న మాతో ఉన్నట్టే దానితో కూడా యమా  స్ట్రిక్టుగా ఉంటారు. అది కూడా ఆయన ఉన్నంత సేపు ఎంత బుద్దిమంతురాలి లాగా ఉంటుందో!

బాగా తెలిసినవాళ్లు కూడా అది చూస్తూ ఉండగా మా ఇంట్లో నుండి ఏ వస్తువూ (అది వాళ్ల వస్తువు అయినా సరే) తీసుకెళ్లే సాహసం చేయరు.  అప్పటివరకు మెదలకుండా పడుకుందల్లా వాళ్లు గుమ్మం దాటేటప్పుడు ఒక్కసారిగా ఎగిరి మీద పడుతుంది.  ఎవరికయినా ఏ వస్తువయినా ఇవ్వాలంటే దాన్ని కట్టేసి అయినా ఇవ్వాలి లేదా మా  అమ్మ బయటికి వెళ్లి దానికి కనపడకుండా అయినా ఇవ్వాలి.

ఇంతగా అలవాటయిన ప్రాణి ఇక లేదంటే రేపటినుండి వాళ్లకి ఎలా ఉంటుందో!!

7 వ్యాఖ్యలు:

నేస్తం September 29, 2009 at 7:02 PM  

:( అమ్మో ఈ భాధ తెలిసినదేనండి.మా బంటీ విషయం లోనూ మావాళ్ళు ఇలాగే బాధ పడ్డారు .

మురళి September 29, 2009 at 7:17 PM  

ప్చ్.. ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి..

Bolloju Baba September 29, 2009 at 8:07 PM  

నేను బాచిలర్ గా ఉండేపుడు, ఒక కుక్కపిల్ల మచ్చికయ్యింది. పగలంతా ఎక్కడెక్కడో తిరిగినా సాయింత్రం నేను ఇంటికి చేరి, మళ్లా ఉదయం బయటకు వెళ్లే వరకూ నాతోనే ఉండేది. ఒకరోజు కూరలో ఉప్పు బదులు బట్టలసోడా వేసి కూర వండి దాన్ని అలాగే బయటపారవేస్తే ఆకుక్క తిని, ఎక్కడెక్కడో కక్కుకొని, రాత్రిపూట దేక్కుంటూ దేక్కుంటూ నా మంచంక్రిందకు చేరి చచ్చిపోయింది. (ఆరుబయట మట్టినేలపై అది దేక్కుంటూ చచ్చేముందు నన్ను చేరాలని చేసిన ప్రయత్నపు గుర్తులు ఇంకా నా జ్ఞాపకాలలో ఫ్రెష్ గానే ఉన్నాయి) that was a terrific experience. అలా ఆ కుక్కతో నా నాలుగేళ్ల అనుభవం ముగిసింది.

ఇంటిలో మచ్చికైన కుక్క చనిపోవటం చాలా బాధించే విషయమే. btw ఆ కుక్క పేరు జెన్నిఫర్.

ఈ అంశంపై పాబ్లో వ్రాసిన ఈ కవిత చదివారా?
http://www.poemhunter.com/poem/a-dog-has-died/

that was a wonderful poem on the death of a dog.

sunita September 29, 2009 at 8:10 PM  

ప్చ్!!ఏమి చేస్తాం అనుబంధాలు పెంచుకుంటే మరిచిపోవటం కష్టం, అవి జంతువులైనా ఇంకోటి ఐనా.


పద్మజ.

సిరిసిరిమువ్వ September 30, 2009 at 12:41 PM  

@నేస్తం, మురళి, కొత్తపాళీ, వేణూ ధన్యవాదాలు.

@బాబా గారు, నిజంగా terrible expereince, too sad.

ఓ మంచి కవితని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

@పద్మజ గారూ (సునీత), మీరేనా!! ధన్యవాదాలు.

మరువం ఉష October 3, 2009 at 6:58 PM  

very sorry to hear this. Amma's family has this tradition. Sobha, haidar, Zipsy, Tommy, laika, pedro, subbu, ... now maavayyaa has "siddu". pretty much the same experiences like the ones you shared.

I wrote the below at another blog sometime back... అంతకు మునుపు "హైదర్" ని పెంచినా మా తాతగారి బంగారు కుక్క మాత్రం "శోభ" ట. తాతగారు ఏవో ఒక వ్యవహారాలకి పొరుగూరు రైలు బండిలో వెళితే మాత్రం సాయంత్రం స్టేషనులోనే వేచి వుండేదట. ఆయన పోయాక కూడా అలాగే వెళ్ళివస్తూ పిచ్చి కుక్క కాటుకి గురై, ఒక కుక్క పిల్లని ఆ పిచ్చిలోనే ప్రసవించి మరణించిందట. ఆ పుట్టినవాడే "జిప్సీ" దానికి కోయదొరల వైద్యం చేయించి ఇంటి మనిషికన్నా సేవలు చేయించి బ్రతికించారట. అది కూడా పూర్ణాయుసు వరకు బ్రతికిందట. ఈ లోపు అమ్మ పెళ్ళి నాన్న గారికి కుక్కల పట్ల వున్న చిరాకుతో దాన్ని ఓ శుభసందర్భంలో ఇత్తడి చెంబుతో ఒకటి వేయటం జరిగిందట. అప్పటినుండి అల్లుడి పట్ల మొదటిసారిగా అమర్యాదగా ప్రవర్తించటం జిప్సీ గాడే మొదలుపెట్టాడట. వాడు అరిచాడు అంటే అల్లుడు వచ్చాడు అని అర్థమట. అమ్మ ఈ సంగతి ఎప్పుడు చెప్పినా మహదానందంగా వినేదాన్ని. తర్వాత "లూసీ" చివరగా "పెడ్రో" నా హయాంలో పెరిగాయి కానీ ఇప్పుడిక అన్నయ్య ఏమీ పెంచటం లేదు. మా మళ్ళ పేరే సమాధి మళ్ళు. అక్కడ దహన సంస్కారాలు, సమాధులు ఇంటివారివి, ఇంటిలోని జీవాలవీ జరుగుతాయి. మేము సంక్రాతికి పెద్దల పూజ చేస్తాము. వతనుగా ఆ సమయానికి ఓ కుక్క వస్తుంది. కాసేపు అదే తాతగారి ఆత్మ అనో, లేదా పైన వాటిల్లో ఒకరనో మేళమాడుకునుంటాము.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP