బ్లాగు పుస్తకంలో నెమలీక--అభినందన మందారమాల
వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలే అందంగా ఉంటారా? తనమానాన తన పని చేసుకొని వెళ్ళే ఆడపిల్లలు అంతకంటే అందంగా ఉంటారు..........
అయినా ఇవంటే నాకు ఇష్టం.. ఎందుకంటే ఇవి 'నా' అక్షరాలు కాబట్టి. ....
ఎవరి అక్షరాలంటే వాళ్లకి ఇష్టమే.....కానీ మన అక్షరాలని ఇష్టపడే పాఠకులు ఎంతమంది ఉంటారు?
నెమలీక అంటే ఇష్టపడని పిల్లలు ఉంటారా? అలానే నెమలికన్నుని ఇష్టపడని తెలుగు బ్లాగర్లు ఉంటారా?
చడీ చప్పుడు కాకుండా 2009 జనవరిలో బ్లాగు వ్రాయటం మొదలుపెట్టి....ఇంతింతై.......
చిన్నప్పుడు నెమలీకని పుస్తకాలల్లో దాచి పెట్టి దానికి కొబ్బరిమట్టల మధ్య ఉండే నాచు తెచ్చిపెట్టి ఆ ఈక పిల్లలు పెడుతుందని ఎదురుచూసేవాళ్లం..గుర్తుందా...
బ్లాగు ప్రారంభించిన కొద్దికాలంలోనే ఈనాడులో ఆయన బ్లాగు గురించిన పరిచయం వచ్చింది. ఆరునెలల్లో వంద టపాలు.. ఏ టపాకి ఆ టపా విన్నూత్నమే.. బ్లాగుల్లో దీన్ని ఓ రిఫరెన్సు బ్లాగు అనవచ్చేమో. సాహితీప్రియులకి మంచి విందుభోజనం మురళి గారి బ్లాగు. తెలుగులో వచ్చిన ఏ కథ గురించి అయినా నవల గురించి అయినా ఆయన దగ్గర సమాచారం దొరుకుతుందనుకుంటాను. ఒక్కసారి ఆయన దగ్గర ఉన్న పుస్తకాలు చూడాలి అని అనుకోని తెలుగు బ్లాగర్లు ఉండరేమో! ఇప్పటికే చాలామంది బ్లాగర్ల దృష్టి మురళిగారి గ్రంధాలయం మీద పడ్డట్టు.....గ్రంధచౌర్యానికి పథకాలు వేస్తున్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా..మురళి గారూ జాగ్రత్త!
ఓ సినిమా గురించి చెప్పినా....ఓ నవల గురించి చెప్పినా.....ఓ కథ గురించి చెప్పినా.....నాటకాల గురించి చెప్పినా సాధికారికంగా చెప్పగల మురళి గారు తను స్వయంగా ఓ మంచి కథకులు. సరళమైన భాష, వివరణాత్మకమయిన శైలి, సూటిగా చెప్పగల నేర్పు ఆయన సొంతం. మొన్న మొన్ననే పొద్దులో ఆయన మొదటి కథ పొడిచింది. అయినా అది మొదటి కథేంటి?....నాకయితే ఆయన బ్లాగు టపాలన్నీ కథలే.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు కదా..ఆలానే మన మురళి గారు కూడా తన మూడో ఏటే రచనా రంగంలోకి అడుగు పెట్టారట. ఆ చమత్కృతి ఏంటో ఆయన మాటల్లోనే చదవండి. పూర్వాశ్రమంలో ఆయన రేడియో రచనలు కూడా చేసారు. నాటకాల గురించి మాట్లాడేవాళ్లు ఈ రోజుల్లో అరుదుగా కనిపిస్తారు.....బ్లాగుల్లో అది మరింత అరుదు. నేను తెలుగు బ్లాగుల్లో నాటకాల గురించి మొదటిసారిగా చదివింది మురళి గారి బ్లాగులోనే. అన్నట్టు 'అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది.. మేఘం వెనుక రాగం ఉంది.....పాట మురళి గారే వ్రాసారంట! . ఆయన సాహిత్య పిపాస ఎలాంటిదంటే ఒకటి కాదు రెండు కాదు....ఏకంగా 18 ఏళ్లు వెతికి వెతికి మరీ ఓ పుస్తకాన్ని సొంతం చేసుకున్నారట!
ఎప్పటెప్పటివో..పదిపదిహేనేళ్లనా
సాధారణంగా పుస్తక పఠనం మీద ఆసక్తి ఉన్నవాళ్లకి సినిమాల మీద కూడా ఆసక్తి మెండుగానే ఉంటుంది. మురళి గారి సినిమా అనురక్తికి ఆయన సినిమాల మీద వ్రాసిన కబుర్లే నిదర్శనం. ఆయన సినిమాల మీద చక్కటి చిక్కటి విశ్లేషణలు చేస్తుంటారు. నవతరంగంలో కూడా ఆయన వ్యాసాలు వచ్చాయి. అసలు ఆయన ముందు నవతరంగంలో వ్యాసాలు వ్రాస్తూ అలా అలా బ్లాగు మొదలుపెట్టారు. కాకపోతే ఎక్కువగా కొత్త సినిమాల (80ల తరువాత సినిమాలు ) గురించే ఉంటాయి. అప్పుడప్పుడు ఆపాత మధురాల గురించి కూడా చెప్తే బాగుంటుంది!
ఆయనకి సినిమాలు చూసే విషయంలో ఎంత గుండె ధైర్యం..సాహసం అంటే సుమనోహరుడి ఉషాపరిణయాన్ని నిర్భయంగా చూసొచ్చి నిర్భీతితో మనకి ఆ సినిమా గురించి చెప్పేంత! ఇన్సూరెన్సు పాలసీలు, రావాల్సిన, తీర్చాల్సిన బాకీల వివరాలన్నీ ఓ పుస్తకంలో వివరంగా రాసి పెడతారంట లేండి..అదీ ఆయన ధైర్యం.
తను వ్రాసే అమ్మ చెప్పిన కబుర్లు అయితే నాకు మరీ మరీ ఇష్టం. అవి ఆయనకి వాళ్లమ్మ చెప్పిన కబుర్లే అయినా మనకు మన అమ్మ చెప్తున్నట్లే ఉంటాయి. "ఒలప్పో బెండకాయి కూరొండీసినావంటే..". అంటూ వాళ్ల పిన్ని పాడిన జముకుల కథ.....వాళ్ల అమ్మమ్మ బిస్సీ కబుర్లు,...సత్తెమ్మ సత్యభామగా మారి చెరువుమీద నడిచే ప్రహసనం.....గోవిందరావు జమిందారు గురించి, టాంపండు లీలలు.......కొంపముంచిన కుంటె గేదె.....అయ్యప్పనాయుడు..హరిశ్చంద్ర వేషం......అబ్బో వాళ్ల అమ్మగారు ఆయనకి ఎన్నెన్ని కబుర్లు చెప్పారో. ... ఎంత అదృష్టవంతులో మురళి గారు మీరు..
ఇక ఆయన జ్ఞాపకాలలోకి వెళ్ళామంటే ఒక పట్టాన బయటకి రాలేము. అవి చదువుతున్నప్పుడు నిక్కరేసుకున్న చిన్న మురళి మన కళ్ల ముందు మెదులుతాడు. మనం కూడా మన చిన్ననాటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతాం. ఈతపళ్ళు-ముంజెల బండి, పోలిస్వర్గం , తిప్పుడు పొట్లాం, మొగ్గల చీరలు, మల్లికాసులు, వాళ్ల సుబ్బమ్మగారి నీళ్ళావకాయ..... ఎన్నెన్ని జ్ఞాపకాలో!
మురళి గారికి వాళ్ల బామ్మ గారంటే కాస్త కోపం అనుకుంటాను. పాపం పెద్దావిడిని ఎన్ని ఇబ్బందులు పెట్టేవారో .....అంతేనా వాళ్ల తాతయ్య చేత చివాట్లు కూడా పెట్టించేవారు. ఇంతకీ పెద్దాయ్యాక అయినా తేలు కుడితే ఎలా ఉంటుందో తెలిసిందా మురళి గారూ?
అందరిని హడలగొట్టే మురళి గారికి వాళ్ల నాన్నగారంటే మాత్రం మహా హడలు సుమండి. పాపం ఆయన పదమూడో ఎక్కం కష్టాలు పగవాడికి కూడా వద్దు అనిపిస్తాయి. కత్తిరించిన జుట్టు మళ్ళీ తన తలమీద అతికించమని వాళ్ల మంగలి సత్యాన్ని పీడిస్తుంటే ..వాళ్ల నాన్నగారొచ్చి నిద్రగన్నేరు కొమ్మతో వీపుమీద కధాకళి ఆడేసారట....... ఇవన్నీ మన కళ్లముందు జరిగినట్లే వర్ణిస్తారు. ఈ జ్ఞాపకాల టపాలు చదువుతుంటే నాకు నాయిని మిట్టూరోడి కథలు గుర్తుకొస్తాయి.
మురళి గారి శైలి చదువుతుంటే నాకు అక్కడక్కడ ప్రళయ కావేరి కథలు..మా పసలపూడి కథలు గుర్తుకొస్తాయి. కుదిరితే ఓ కప్పు కాఫీ అంటూ కాఫీ కబుర్లు అయినా , తన బ్లాగులోని విషయ చౌర్యం గురించి కాపీ కబుర్లు అయినా..... మరే కబుర్లయినా కళాత్మకంగా వ్రాయటం ఆయనకే చెల్లు. చెయ్యి విరిగినట్టుంది అంటూ బ్లాగుల్లో వ్యాఖ్యల పెట్టె పాత్ర గురించి..అది పనిచేయకపోతే వచ్చే ఇబ్బందుల గురించి ఎలా చెప్పారో చూడండి. అదే చేత్తో ఆషాఢమాసం గురించి అల్లరల్లరిగానూ చెప్పగలరు.
కథలు...నవలలు....నాటికల గురించే కాదు తన చుట్టూ ఉండే మనుషుల గురించి కూడా కథ చెప్పినట్టే ఆసక్తికరంగా చెప్తారు. కష్టం, బాధ్యత, మనసు, స్నేహం..లాంటి వాటి మీద వ్యక్తిత్వవికాస తరగతులకి పనికొచ్చే మంచి విశ్లేషణాత్మక వ్యాసాలూ వ్రాయగలరు. ఇన్ని రకాల వైవిధ్య రచనలతో పాటు బ్లాగు పరిచయాలు కూడా చేసే మురళి గారి బ్లాగు గురించి ఎంత చెప్పినా అది అసంపూర్ణమే!
ఇక చివరిగా మురళి గారి బ్లాగుకే ప్రత్యేకమయిన ఓ విభాగం ఉంది..అదే నాయికల పరిచయం. మధురవాణి నుంచి కజు వరకు ..... ప్రముఖ నవలల్లోని నాయికల గురించి అద్భుతంగా విశ్లేషిస్తూ పరిచయం చేస్తుంటారు. పుస్తక పరిచయాలు సర్వసాధారణమే..కానీ బ్లాగుల్లో ఇలా అచ్చంగా నవలా నాయికల పరిచయాలు ఓ వైవిధ్యమే!
గోదావరి అంటే అమిత ఇష్టపడే ఈ గోదారబ్బాయి బ్లాగులో గోదావరి గురించిన ప్రస్తావనలు ఎక్కువగానే ఉంటాయి. మన నేల, మన నీరు, మన పల్లె, మన కొండా కోనా...ఈ మన అనుకోవటంలో ఉండే ఆనందం..ఆ అనుభూతి ఈ మన బ్లాగు చదవటంలో కూడా ఉంటుంది.
మురళి గారు రెండువందల టపాలు పూర్తిచేసిన సందర్భంగా అభినందనలు తెలుపుతూ.... ఆయన నుండి శతాధిక టపాలు కోరుకుంటూ....
ఆయన ఎన్ని చేతులతో ఎన్ని కీబోర్డులతో వ్రాస్తారో నాకు తెలియదు కాని టపటపా టపాలు రాలిపోతుంటాయి...అందుచేత నేనీ టపా ప్రచురించే సమయానికి ఆయన రెండువందల టపాలు దాటేస్తే తప్పు నాది కాదు!!