పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

October 22, 2015

మన అమరావతి - మన రాజధాని



ఓ మహా రాజధాని నిర్మాణానికి అంకురార్పణ----ఈ అంకురార్పణ ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో...ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టం. ఈ రోజు యావత్తు ప్రపంచం చూపులూ అమరావతి వైపే! ఈ చరిత్రలో మనమూ ఓ భాగం కావటం మనకు గర్వకారణం కదూ!

కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి లాగబడి..రాజధాని లేని రాష్ట్రం గా ఏర్పడి..మీ రాష్ట్రానికి మీరు వెళ్లక ఇంకా ఇక్కడే పట్టుకు వేళాడుతున్నారన్న చీదరింపులు..ఈసడింపులు..గెంటివేతలు అన్నిటినీ దిగమింగి ఇది మా ఆంధ్రుల సత్తా అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పి... పడి లేచిన కెరటంలా సగర్వంగా తలెత్తుకు నిలబడే దిశగా మొదటి అడుగు వేసే దివ్య ముహూర్తం ఆసన్నమయింది. శిధిలాల నుండి మహా రాజధాని నిర్మాణం ప్రారంభం కాబోతుంది.

శతాబ్దాల చరిత్ర ఉన్న అమరావతి మళ్లీ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతుంది.  33000 ఎకరాలు స్వచ్చందంగా ఇచ్చి ఆ ప్రాంత రైతులు రాజధాని నిర్మాణానికి  తొలి సమిధలయితే నేను సైతం రాజధాని నిర్మాణానికి ఇటుకనొక్కటి ఇచ్చాను అంటూ ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో కదం తొక్కుతూ ఈ బృహత్తర నిర్మాణం లో భాగస్వాములవటం నిజంగా ఓ అపురూప ఘట్టం.


 రాజధాని శంఖుస్థాపనకి ఇంత ఆర్భాటం అవసరమా..ఇంత ఖర్చు అవసరమా? అంటే అవసరమే! గ్లోబలైజేషన్ కాలంలో ప్రచారానికి మించిన పెట్టుబడి లేదు.  ప్రపంచం లో మేటి నగరంగా ఎదగాలంటే..పోటీలో ముందు ఉండాలంటే ప్రపంచ చూపు మన మీద పడాల్సిందే!  ప్రపంచం అంతా మన వైపు చూడాలన్నా..ఆ చూసిన చూపులు పెట్టుబడులు గా మారాలన్నా ఈ అట్టహాసం..ఈ ప్రచారం కావలిసిందే! వట్టి ప్రచారం ఉన్నా సరిపోదు...దాంతో పాటు కావలిసిన వనరులు ఉండాలి..సదుపాయాలు కల్పించాలి.  వనరులు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి.  సంకల్ప సిద్ది ఉండాలే కానీ ఏ పనైనా జరిగి తీరుతుంది.

ఇన్ని వేల ఎకరాలలో రాజధానా? అవ్వ..అవ్వ అన్నవాళ్ళే ఈ రోజు వహ్వా..వహ్వా అంటున్నారు. ఇది మన పండుగ..ప్రజల పండుగ.  కోట్లాది తెలుగు ప్రజల ఆకాంక్ష ఈ బృహత్తర రాజధాని నిర్మాణం.  భారతదేశంలో ఏ కొత్త రాజధాని నిర్మాణం అయినా ఇంత వేడుకగా ప్రజల పండుగగా జరిగిన దాఖలాలు లేవు.


రాజకీయ విభేదాలు ఉండటం సహజం కానీ ఇలాంటి చరిత్ర లో నిలిచిపోయే ఓ అద్భుతమైన ప్రజా కార్యక్రమానికి దూరంగా ఉండటం అంటే చరిత్ర హీనులుగా మిగిలిపోవటమే! రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్సు ఇప్పుడు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండి చరిత్రే లేకుండా అయిపోతుంది.  రాజకీయ అనుభవం లేని ప్రధాన ప్రతిపక్ష నేత నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించవద్దు..ఆహ్వానించినా నేను రాను అని తన అనుభవలేమిని బయట పెట్టుకోవటమే కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కుని కూడా పోగొట్టుకుంటున్నాడు. ప్రతిపక్షమంటే ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల వాక్కును వినిపించాలి, ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు నిలతియ్యాలి కానీ ప్రజల ఆశలకి ఆశయాలకి విరుద్దంగా ఈ బహిష్కరణలు ఏంటి! ఏం సాదిద్దామని!

ఈ బృహత్తర కార్యక్రమం లో ప్రధాన భాగస్వాములైన రైతులకి నా జోహార్లు.  బంగారం పండే పొలాలని వదులుకోవటం అంటే రైతుకి తన ప్రాణాలు వదులుకోవటమే! రైతు తనకి ఎంత కష్టమొచ్చినా అప్పో సొప్పో చేసి జీవనం సాగించుదామనుకుంటాడు కానీ తనకి ప్రాణపదమైన పొలాన్ని అమ్ముకోను అంత త్వరగా ఇచ్చగించడు..అలాంటిది ఊర్లకి ఊర్లే మెజారిటీ రైతులు స్వచ్చందంగా తమ పొలాలని రాజధాని నిర్మాణానికి ఇవ్వటం నిజంగా గొప్ప విషయం..ఆ భూమి పుత్రులందరికీ నా జోహార్లు.

నభూతో నభవిష్యతి లాగా సాగుతున్న  మన అమరావతి-మన రాజధాని శంఖుస్థాపన కార్యక్రమం ద్విగ్విజయంగా జరగాలని ..రాజధాని నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తయ్యి.. మహా ప్రజా రాజధాని అన్నకోట్లమంది స్వప్నం సాకారమై ...అమరావతి ప్రపంచ పటం లో ఓ ప్రముఖ స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాజధాని నిర్మాణ శంఖుస్థాపన మహోత్సవ సందర్భాన నా మనః పూర్వక శుభాకాంక్షలు.

              జై తెలుగు తల్లి...జై అమరావతి...జై ఆంధ్ర ప్రదేశ్!

 

Read more...

September 29, 2014

నలభై వసంతాల చెలిమికి వీడ్కోలు..

తెలుగు వార్తా పత్రికల చరిత్రలో  ఒక అధ్యాయం సృష్టించి....వార్తల ప్రచురణలో కొత్త పుంతలు తొక్కి...ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా..ఎప్పుడు పేపరు చదువుదామా అనేట్లు చేసి ..గత నలభై సంవత్సరాలుగా అశేష ప్రజాదరణని సొంతం చేసుకుని తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రిక గా చరిత్ర సృష్టించిన ఓ ఈనాడు పత్రికా రాజమా నీకిక వీడ్కోలు.

నాకు ఊహ తెలిసేటప్పటికే నువ్వు ఉన్నావు.  నేను పేపరు చదవటం మొదలుపెట్టింది నీతోనే! 1974 లో తెలుగు పాఠకుల లోగిళ్ళల్లోకి ఉషా కిరణాలతో పోటీ పడి నువ్వు రావటం మొదలుపెట్టిన లగాయితూ ప్రవాసంలో ఉన్నప్పుడు తప్ప నిన్ను చూడకుండా ఉన్న రోజు లేదు. e-పేపరు వచ్చినా నిన్ను చేత్తో పట్టుకుని..తడిమి తడిమి చూసుకుంటూ "ఇదీ సంగతి" లో ఈ రోజు శ్రీధర్ ఏ కార్టూన్ వేసాడా అని ముందు చూసి...ఒక్కో పేజీ చదువుకుంటూ ఓ గంట సేపయినా నిన్ను ఆస్వాదించందే రోజు మొదలయ్యేది కాదు.

నీ రాక కోసం..నువ్వు రాగానే నిన్ను చదవటం కోసం ఇంటిల్లిపాదీ పోటీ పడేవాళ్ళం.  తెలుగు పత్రికా లోకంలో మొట్టమొదటి సారిగా జిల్లా సంచికలని..ఆదివారం అనుబంధాలని ప్రవేశ పెట్టిన ఘనత నీదే! ప్రతి జిల్లా నుండి పత్రికా ప్రచురణ మొదలుపెట్టిన ఘనతా నీదే! ఇతర రాష్ట్రాలనుండి ఓ తెలుగు పత్రిక ప్రచురించబడటం కూడా నీతోనే మొదలు అనుకుంటాను! మహిళల కోసం వసుంధర అని ప్రత్యేకంగా ఓ పేజీనే ప్రారంభించావు.  పేపరు క్వాలిటీ కాని, భాష కానీ, వార్తా శీర్షికలు కానీ, ఆదివారం అనుబంధం, జిల్లా ఎడిషన్సు ప్రారంభించటంలో కానీ అన్నిటిల్లో ఓ ట్రెండ్ సెట్టర్ వి నీవు. జర్నలిజం కొత్త పుంతలు తొక్కిందీ నీతోనే! మాలాంటి భాషా ప్రేమికుల్ని వేరే పేపర్ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసిన ఘనతా నీదే!

చదువు, సుఖీభవ, ఛాంపియన్, eనాడు, సిరి, ఈతరం, స్థిరాస్థి..ఇలా వారంలో ఒక్కో రోజు ఒక్కో శీర్షికతో పాఠకులకు విలువైన సమాచారం అందిచటంలో నీకు నీవే సాటి అనిపించుకున్నావు.

ఆకట్టుకునే వార్తా శీర్షికలతో మమ్ముల్ని అలరించావు. కొన్ని శీర్షికలని చూడగానే మాలో ఆవేశం ఎగసిపడేది..రక్తం సల సలా మరిగేది. మరి కొన్ని శీర్షికలని చూడగానే విచక్షణ మేలుకునేది. నిష్పక్షపాతంగా సమకాలీన రాజకీయాలను విశ్లేషిస్తూ నువ్వు వ్రాసిన సంపాదకీయాలతో మా మనుసులని చూరగొన్నావు!

"పుణ్యభూమి", "కబుర్లు", "అక్షింతలు", "రాష్ట్రంలో రాజకీయం"...ఇలాంటి శీర్షికల ద్వారా ఎ.బి.కె ప్రసాదు, చలసాని ప్రసాద రావు, డి.వి. నరసరాజు, గజ్జెల మల్లారెడ్డి, బూదరాజు రాధాకృష్ణ లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయ భాగ్యం కలిగించావు.

తెలుగు భాష విస్తృతి కోసం నువ్వు ప్రచురించిన "తెలుగులో తెలుగెంత", "తెలుగు జాతీయాలు", "మాటల మూటలు", "మాటల వాడుక", "మాటలూ-మార్పులూ"..తెలుగు భాషకి మంచి డిక్షనరీల లాంటివి.  ఆదివారం "బాలవినోదిని" కి ముఖ్యంగా "పదవినోదం" కు పిల్లలతో పాటూ పెద్లలమూ అభిమానులం అయ్యాం!

ఓ ఆంధ్రుడి ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పి..తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్దణకు పుట్టిన ఓ ప్రాంతీయ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో నువ్వు ముఖ్య పాత్ర పోషించావు!
ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి అతి పెద్ద మహిళా ఉద్యమం అయిన సారా ఉద్యమానికి అండదండలుగా నిలిచి ఆ ఉద్యమానికి ఎనలేని ప్రచారం చేసి..మహిళల పక్షాన నిలిచిన నిన్ను ఎన్నటికీ మరువలేము! ఆ ఉద్యమం కోసం ఓ ప్రత్యేక పేజీనే కేటాయించావు.

ఏవీ ఇప్పుడు ఆ సంపాదకీయాలు! ఏవీ ఆ వార్తా శీర్షికలు! బూతద్దం పెట్టి వెతికినా ఈనాడులో  భాషాదోషాలు కనపడవు అనుకునే రోజులు పోయాయి. ముఖ్యంగా జిల్లా ఎడిషన్సు లో భాషా దోషాలు కోకొల్లలు. ఈ మాత్రం వార్తలకి..ఈ మాత్రం భాషకి ఈనాడే చదవాలా అని అనుకునేటట్టు చేస్తున్నావు. వార్తల్లో జీవం కనపడటం లేదు.  ఇదివరకటిలా వార్తలని ఆస్వాదించలేకపోతున్నాం

తెలుగు పత్రికా చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యామయిన ఈనాడు ఇక గత చరిత్రగా మిగిలిపోతుందేమో అని అనుమానం కలుగుతుంది.

పేపరు కుర్రాడితో వేయించుకుంటే నువ్వు రావటం ఆలస్యం అవుతుందని గత 15 సంవత్సరాలుగా డైరెక్టుగా ఈనాడు సంస్థ ద్వారానే నిన్ను పొందుతున్న మేము ఇక ఈ నెల నుండి నీకు సెలవు ప్రకటించేసాం.  ఇది బాధాకరమే కానీ తప్పటం లేదు.

నిన్ను ఇక అసలు చూడను అని చెప్పనులే! ఏదో అప్పుడప్పుడు నెట్టు లో e-పేపరు చూస్తూ ఉంటానులే!

ఇక సెలవు నేస్తం!

Read more...

June 1, 2014

నా రాష్ట్రం రెండు ముక్కలవుతున్న వేళ!



ఈ రోజు నా సమైక్యాంధ్రప్రదేశ్ కి చివరి రోజు! 58 సంవత్సరాల కాపురానికి ఈ రోజుతో చెల్లు చీటీ వ్రాసేస్తున్నారు!  రేపటినుండి ఎవరి ఇల్లు వారిది..ఎవరి కాపురం వారిది!

అసలు విభజనే జరగదు...ఇప్పట్లో జరగదు...లాస్టు బాల్ ఇంకా ఆడలేదు..ఇన్ని జరగదుల మధ్య విభజన జరిగిపోయింది. ఎందుకు?..ఏమిటి?..ఎలా?..ఎప్పుడు?.. ఎక్కడ?  అన్న వాటికి సరైన సమాధానాలు లేకుండానే హడావిడిగా విభజన జరిగిపోయింది.  విభజన వల్ల ఏ ప్రాంతానికి ఎంత లాభమో ప్రశ్నార్థకమే అయినా విభజనని స్వీకరించక తప్పదు కాబట్టి విభజనకి ఆహ్వానం పలుకుదామంటే మనస్సు రావటం లేదు...ఏదో దిగులు!

విభజనతో పాటు మా స్థానికత గురించి కూడా నాకు ఎక్కువ బాధగా ఉంది! మేమెక్కడకి చెందుతాము? గత పాతికేళ్ళుగా మేము తెలంగాణా లోనే ఉంటున్నాము..మా పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు..మరి మేము ఇప్పుడు తెలంగాణా వాళ్ళమా? ఆంధ్రా వాళ్ళమా? తెరాస వాళ్ళ ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడకే చెందుతారన్న సిద్దాంతం ప్రకారం మేము ఆంధ్రా..మా పిల్లలేమో తెలంగాణా అన్నమాట! మా ఇంట్లోనే మరో విభజన! పైగా సెటిలర్సు అంటూ మాకో దరిద్రగొట్టు పేరు! నేను సెటిలర్ అయితే  పక్కనున్న చేవెళ్ళ నుండి హైదరాబాదు వచ్చి స్థిరపడ్డ వాడు కూడా  సెటిలరే!

ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి మాకిష్టమున్నా లేకపోయినా మేము తెలంగాణాలో ఉండాలనుకుంటే మా చిరునామాలు..వీలునామాలూ అన్నిటిల్లో రాష్ట్రం పేరు మార్చుకోవాలి.  AP అల్లా TS అయిపోతుంది! మార్చుకోవటం ఇష్టం లేకపోతే మీ ఆంధ్రా మీరు పోండి అంటారు అంతేగా! ఇది కూడా మా ఆంధ్రా అనుకునే వచ్చాం....ఇలా విభజిస్తారనుకుంటే వచ్చి ఉండేవాళ్ళం కాదేమో!

 తెరాసా వాళ్ళు కోరుకున్న తెలంగాణా వచ్చింది కాబట్టి ఇకనైనా ఆ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే మాటలు ఆపి ఇక్కడ నివసించే ప్రజలందరికీ భద్రతాభావం కలిగించాలి. సొరకాయ అన్నోడు ఆంద్రోడు..ఆనపకాయ అన్నోడు తెలంగాణా వాడు అన్న పనికిమాలిన సిద్దాంతాలు వదిలేయ్యాలి!

అసలు తెరాసా వాళ్ళ మాటలు చూస్తుంటే వాళ్ళకి తెలంగాణా అభివృద్ది కన్నా ఆంధ్రా వాళ్ళ నాశనమే ముఖ్యమైన అజండాగా ఉన్నట్టుంది!

ఆస్తులు..అప్పులేమో జనాభా ప్రాతిపదికన పంపకాలేసారు. విద్యుత్తేమో వినియోగం ప్రకారం పంపకాలేసారు! హైదరాబాదు ఆదాయంలో ఆంధ్రా వాళ్ళకి చిల్లిగవ్వ కూడా భాగం లేదు..కానీ అప్పుల్లో మాత్రం ధారాళంగా వాటా ఇచ్చారు! సరే అయిందేదో అయింది..ఇక మా బ్రతుకులేవో మేము బ్రతుకుతామన్నా అన్నిటికీ మోకాలడ్డే!

1956 కి ముందున్నమా తెలంగాణా మాక్కావాలంటారు..మళ్ళీ భద్రాచలం డివిజన్ మాదే అంటారు.  సరే దాన్నీ వదిలేశారు..ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్రాలో కలపటానికి వీల్లేదంటారు! వాళ్ళా మాట అంటుంది గిరిజనులు..ఆదివాసీల మీద ప్రేమతో కాదు...ముంపు గ్రామాలు తమ వైపు ఉంటే రేపు అడుగడుగునా ఉద్యమాలతో పోలవరానికి ఆటంకం కలిగించవచ్చన్న దు(దూ)రాలోచనతో! సీలేరు పవర్ ప్లాంట్ ఆంధ్రాకి దక్కుతుందన్న ఆక్రోశంతో!

ఇల్లు అలకగానే పండగ కాదు..విభజన జరగగానే అభివృద్ది కాదు.  రెండు రాష్ట్రాలు సంయమనం తో వ్యవహరించినప్పుడే రెండు ప్రాంతాల్లో అభివృద్ది సాధ్యం! ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి కాని ఇలా అభిజాత్యం తో వ్యవహరించే వాళ్ళతో కష్టమే!

ఇంతకీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు! మద్రాసు నుండి విడిపోయిన అక్టోబరు 1 నా! ...తెలంగాణా ప్రాంతంతో కలిసిన నవంబరు 1 నా!!..లేక తెలంగాణాతో బంధం వీడిపోతున్న జూన్ 2 నా!!!

ఆంధ్రాకి రాజధాని లేదు...ఆదాయం లేదు...నిధులు లేవు..ఉన్నదల్లా ప్రజల్లో  ఓ ధృఢ సంకల్పం. తమ మీద తమకు నమ్మకం..కష్టపడే తత్వం.  ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకేమీ లేకపోయినా ఏదైనా సాధించగలమన్న ఓ ఆత్మ విశ్వాసం. ఆ ఆత్మ విశ్వాసమే పెట్టుబడిగా ఆంధ్రప్రదేశ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిచెందాలని..ఆంధ్రాతో పాటు తెలంగాణా కూడా బంగారు తెలంగాణా కావాలని కోరుకుందాం.

రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసుందాం అన్న రాజకీయనాయకులు దానికి అనుగుణంగా వ్యవహరిస్తారని..వ్యవహరించాలని కోరుకుందాం.

                       సర్వే జనా సుఖినోభవంతు! సర్వే రాష్ట్రా సుఖినోభవంతు!

Read more...

August 22, 2013

మాలతీ చందూర్-ఓ విజ్ఞాన సర్వస్వం

గూగుల్ సౌజన్యంతో
అలనాటి తెలుగు పత్రికలతో పరిచయం ఉన్న ప్రతి పాఠకుడికీ/పాఠకురాలికీ మాలతీ చందూర్ పేరు సుపరిచితమే.  ఆంద్రప్రభ లో ప్రమదావనం శీర్షిక తో..స్వాతిమాసపత్రికలో పాతకెరటాలు శీర్షికతో దశాబ్దాల తరబడి సాహితీ ప్రియులను ఆకట్టుకున్నారు.

 ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకి పరిచయం చేసిన అతి కొద్ది మంది రచయిత్రిలలో మాలతి గారు ఒకరు. పాతకెరటాలు శీర్షిక ద్వారా ఎన్నెన్నిప్రపంచ ప్రసిద్ద నవలలని తెలుగులో పరిచయం చేసారో! అవి చదివి అబ్బో ఈవిడ ఎంత పెద్ద చదువులు చదివి ఉంటారో అని అబ్బురపడేవాళ్ళం.  తర్వాత తెలిసింది ఆమె పెద్దగా చదువుకోలేదని.  ఒకటి కాదు రెండు కాదు ఐదు దశాబ్దాల పాటు ఈ శీర్షిక నిర్వహించారు ఆవిడ.  తెలుగు పత్రికలలో ఇంతకాలం ఓ శీర్షిక నిర్వహించిన ఘనత ఆమెకే దక్కుతుంది. నవలా పరిచయం అనే సాహితీ ప్రక్రియకి ఓ గొప్ప గౌరవం కలిగించారు మాలతి గారు.

ఈ పరిచయాలు "పాత కెరటాలు", "నవలా మంజరి" పేర్లతో పుస్తకాలుగా విడుదలయ్యాయి.  తెలుగు పాఠకుల దృష్టి ముఖ్యంగా మహిళల దృష్టి ఆంగ్ల సాహిత్యం మీదకి మళ్ళటానికి ఈ పాతకెరటాలు చాలా దోహదం చేసింది.  ఆంగ్ల నవలలే కాక పలు ఇతర భాషల నవలల్ని కూడా ఆమె పరిచయం చేసారు.  నేను వ్రాసిన పరిచయం చదివి ఊరుకోకుండా అసలు నవలని కూడా చదవాలి అని చెప్పే వారు ఆమె.

ప్రమదావనం లో అయితే అంతర్జాతీయ వార్తల దగ్గరనుండి అంతరిక్షం దాకా దేని గురించి అడిగినా చాలా లోతుగా విశ్లేషించి మరీ చెప్పేవారు.  కుటుంబ సమస్యల నుండి అంతర్జాతీయ సమస్యల వరకు చాలా విస్తృతంగా ప్రశ్నలు ఉండేవి.  ఆవిడ కూడా అంతే విస్తృతంగా సమాధానాలు చెప్పేవారు.  అసలు ఆవిడకి తెలియని విషయం ఉండేది కాదు.  తెలియకపోయినా తెలుసుకుని చెప్పేవాళ్లు.  ఆంద్రప్రభ రాగానే ముందుగా ఆ కాలమే చదివేవాళ్లం.

 ఇది ప్రత్యేకంగా మహిళల కోసమే మొదలుపెట్టిన శీర్షిక అయినా పురుషులు కూడా పోటీపడి ప్రశ్నలు అడిగేవారు.  మాలతి గారు భయపడుతూ భయపడుతూనే ఈ శీర్షిక మొదలుపెట్టారంట.

అప్పట్లో మద్రాసు వెళ్ళే తెలుగు వారు సినిమా నటులతో పాటు మాలతీ చందూర్ గారిని కూడా చూడటానికి ఉవ్విళ్లూరేవారట.. తెలుగు పాఠకలోకంలో అంతగా ప్రసిద్దులు ఆవిడ.

ఆమె పేరులో చందూర్ చూసి నాకు ఆసక్తిగా ఉండేది ఆ పేరు పట్ల.  తరువాత తెలిసింది ఆమె భర్త పేరు నాగేశ్వరరావు చందూరి అని ఆయన ఎన్.ఆర్. చందూర్ గా ప్రసిద్దులని.

సాహిత్యరంగంలోనే కాదు పాకశాస్త్రం లో కూడా ఆమె మంచి నిపుణురాలు.  ఆమె వ్రాసిన వంటలు, పిండి వంటలు పుస్తకం అప్పట్లో ఆడపిల్లలకి ఇచ్చే సారెలో ఒక ముఖ్య వస్తువుగా ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో 1974 లో మొదట ముద్రణ అయిన ఈ పుస్తకం ఇప్పటికి 30 ముద్రణలు పూర్తి చేసుకుంది.

వంటలన్నీ ఖచ్చితమైన కొలతలతో బహు సరళంగా చెప్పటం వలన కొత్తగా వంటలతో ప్రయోగం చేసేవాళ్ళకి చాలా ఉపయోగంగా ఉండేది ఈ పుస్తకం.  ఇందులో వంటకం చేసే పద్దతే కాదు ..ఆ వంటకంలో వాడే ప్రతి పదార్థం గురించి..దాని ఆరోగ్య ఉపయోగాల గురించి వివరంగా చెప్పారు.

తర్వాత కాలంలో స్వాతి వారపత్రికలో "నన్ను అడగండి" కాలం నిర్వహించారు.  వెనకటి పాఠకులకంటే ఇప్పటి పాఠకులు తెలివి మీరిపోయారు కదా, అందుకో మరి ఏ కారణంతో అయినా కానీ ప్రమదావనం ఆకటుకున్నట్లు ఇది ఆకట్టుకోలేదు పాఠకుల్ని. కాస్త విమర్శలు కూడా వచ్చాయి.  ఈ కాలం ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది.

ఆమె వ్రాసిన మొదటి కథ "రవ్వల దుద్దులు"...ఆంధ్రవాణిలో వచ్చిందట. 25 కి పైగా నవలలు, పలు కథలు, వ్యాసాలు వ్రాసారు.  ఆమె వ్రాసిన నవలల్లో శిశిర వసంతం, ఆలోచించు, భూమిపుత్రి, హృదయనేత్రి, కలల వెలుగు, మనసులోని మనసు, ఏమిటీ జీవితాలు ప్రాచుర్యం పొందాయి.

ఆవిడ రచనలు గుజరాతీ, తమిళం, కన్నడ, హిందీ లాంటి ఇతర భారతీయ భాషలలోకి అనువాదం చెయ్యబడ్డాయి.  కొన్ని ప్రసిద్ద తమిళ రచనలని ఆమె తెలుగులోకి అనువదించారు.

ఆ మధ్య రేడియో తరంగ వారు మాలతీచందూర్ గారితో చేసిన ముఖాముఖీ ఈ కింది లింకులో వినవచ్చు.

http://telugu.tharangamedia.com/specail-show-with-malathi-chandur/

తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం మాలతి గారి లాంటి సాహితీవేత్తలకి మరణం ఉండదు.

Read more...

August 19, 2013

ఎమ్ సెట్ కౌన్సిలింగుకి ఉద్యమ సెగ


ఓ రెండు సంవత్సరాలనుండి రాష్ట్రంలో విద్యార్థులకి కాస్త ఉద్యమ సెగ తగ్గి ప్రశాంతంగా ఉన్నారు.  ఇప్పుడు మళ్ళీ సెగ మొదలయ్యింది.

ఈ రోజు నుండి ఎమ్‍సెట్ కౌన్సిలింగ్ మొదలు కాబోతుంది. సీమాంధ్రలో ఉద్యమాలు ఉవ్వెత్తున జరుగుతున్నాయి.  మరి ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సిలింగు సజావుగా సాగుతుందా అన్నది పిల్లల మరియు తల్లిదండ్రుల ఆందోళన. ఇప్పటికే మన రాష్ట్రంలో కౌన్సిలింగ్ ఆలస్యం అయింది.  కోర్టు అక్షింతలతో ఇప్పుడు మొదలుపెట్టారు.  దాదాపు అన్ని రాష్ట్రాలలో ఇప్పటికే అడ్మిషన్సు అయిపోయి క్లాసులు కూడా మొదలయ్యాయి.

ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో కౌన్సిలింగు ఇలా ఆలస్యంగా జరగటం మామూలే.  ఎప్పటికప్పుడు కౌన్సిలింగు ఈ సంవత్సరం సకాలంలో పూర్తి చేసి ఆగస్టుకల్లా క్లాసులు మొదలుపెడతాం అని హామీలయితే ఇస్తారు కానీ ఏ సంవత్సరమూ సరిగా సమయానికి కౌన్సిలింగు జరిగిన దాఖలాలు లేవు.  కర్ణుడి చావుకి వెయ్యి కారణాల లా కౌన్సిలింగు ఆలస్యం అవటానికి కూడా బోలెడన్ని కారణాలు.

తెలంగాణాలో ఉద్యమం ఉదృతంగా ఉన్న రోజుల్లో కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు.  తెరాసా నాయకుడు ఉండి ఉండీ సరిగ్గా పరీక్షల ముందు ఏదో ఒక అలజడి రేపేవాళ్ళు..వాళ్ళ ఆందోళనల మూలాన పరీక్షలు వాయిదా పడ్డ సందర్భాలు ..అసలు రద్దు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఉద్యమాలు ఏవైనా కానీ ఇలాంటి వాటికి అడ్డంకి గా మారకూడదు. పిల్లలని..స్కూల్సుని..కాలేజీలని ఇలాంటివాటికి దూరంగా పెట్టాలి.  ఉద్యమాల మీదే బ్రతికేసే విద్యార్థి నాయకులున్న మన రాష్ట్రంలో కాలేజీ విద్యార్థులని దూరంగా పెట్టమంటే విద్యార్థి నాయకులే ఊరుకోరు. కనీసం స్కూలు విద్యార్థులని..కౌన్సిలింగు ప్రక్రియ లాంటి వాటిని అయినా ఈ ఉద్యమాలకి దూరంగా పెట్టాలి.

ఎమ్‍సెట్ కౌన్సిలింగు ఏ ఆటంకాలూ లేకుండా జరగాలని కోరుకుందాం.

Read more...

June 25, 2013

మేమూ-మా ట్రెక్కింగ్-మున్నార్


కేరళ...God’s own country..నిజమే..అద్భుతమైన ప్రకృతి సోయగాలు కేరళ సొత్తు.

కేరళ వెళ్ళిన వాళ్ళు సామాన్యంగా మున్నార్ వెళ్ళకుండా ఉండరు. మున్నార్ ట్రెక్కింగ్ కి మంచి అనువైన ప్రదేశం.  కొండలు..లోయలు ఉంటే ఎక్కడైనా  ట్రెక్కింగ్ కి అనుకూలమే అనుకోండి...కానీ మున్నార్ లో అది ఇంకా అద్భుతంగా ఉంటుంది.

ఒకానొక వేసవిలో మేము కేరళ పర్యటనకి వెళ్ళాము.  త్రివేండ్రం..కన్యాకుమారి, కొల్లం, అలెప్పీ చూసుకుని మున్నార్ చేరాం.  అక్కడ సైట్ సీయింగ్ కి ఓ ఆటో అతన్ని మాట్లాడుకున్నాం.  డ్రైవర్.. గైడ్ ..అన్నీ అతనే అన్నమాట! అక్కడ డాం లు..టీ తోటలు..అన్నీ చక్కగా చూపెట్టాడు.  మున్నార్ టీ తోటలు..జలపాతాలు..డ్యాంలు..ఆ కొండలు..మబ్బులు..అప్పుడప్పుడు చిరుజల్లులు...చూసి అనుభవించాలే కానీ వర్ణించలేము.  అప్పుడే పీకిన తాజా కారెట్లు..అలా చూస్తేనే తినబుద్దవుతుంది.

మా అబ్బాయి చిన్నప్పటినుండి ఎక్కడైనా కొంచం కొండలు..గుట్టలు ఉంటే చాలు ఎక్కేస్తా..ఎక్కేస్తా అంటూ ఉండేవాడు.  అలాగే మున్నార్ లో కూడా కొండలెక్కుదాం..ట్రెక్కింగ్ కి వెళదాం అంటూ మొదలుపెట్టాడు. మా అమ్మాయి కూడా వంత పాడింది.  సరే ఇప్పటి వరకు ఎప్పుడూ ట్రెక్కింగ్ చెయ్యలేదు చేద్దాం అని నేనూ సై అన్నాను.

అక్కడ ఓ రెండు మూడు ట్రెక్కింగ్ కాంప్ ల వాళ్ళ దగ్గరకి వెళితే..రెండేమో మూసేసి ఉన్నాయి..ఒకళ్ళేమో కనీసం ఓ పదిమంది ఉంటే కానీ ట్రిప్ వెయ్యం..అదీ కాక ఈ రోజు ఉదయమే ఓ గుంపు వెళ్ళింది..ఇక రేపు..ఎల్లుండి వెయ్యం అన్నాడు.

మేము ఇలా ట్రెక్కింగ్ కాంప్ ల చుట్టూ తిరగటం చూసిన ఆటో డ్రైవర్.. సార్..మీరు ట్రెక్కింగ్ కి వెళ్ళాలంటే నేను తీసుకెళతాను..చాలా మంది ఫారినర్సుని తీసుకెళుతూ ఉంటాను.  ఇక్కడ కొండలన్నీ నాకు కొట్టిన పిండి అని ఊరించాడు. అందరం ఉత్సాహంగా సరే అంటే సరే అనుకుని  అయితే రేపు ఉదయాన్నే ట్రెక్కింగ్ కి వెళదాం అని మరుసటి రోజుకి ప్లాన్ చేసాం.

మరుసటి రోజు చెప్పినట్టు ఆరుగంటలకల్లా అతను వచ్చాడు.  కొంచం దూరంలో ఓ కొండ ఉందండి..అక్కడనుండి మన ట్రెక్కింగ్ మొదలవుతుంది..అక్కడ దాకా ఆటోలో తీసుకెళతాను.  కొండ ఎక్కటానికి ఓ రెండు గంటలు..దిగటానికి ఓ రెండు గంటలు..మీరు నెమ్మదిగా నడిచినా మొత్తం ఐదు గంటలకన్నా పట్టదు అని చెప్పాడు.

మధ్యలో ఓ హోటల్ దగ్గర ఆపి టిఫిన్ పార్సిల్ చేయించుకెళితే మధ్యలో తినొచ్చండి అని సలహా ఇస్తే సరే అని దిట్టంగా టిఫిన్ పార్సిల్ చేయించాం.

ఊరినుండి ఓ ఐదారు కిలోమీటర్లు వెళ్ళాక ఆటో ఓ కొండ పాదం దగ్గర ఆపి..ఈ కొండేనండి మనం ఎక్కేది అని చూపెట్టాడు.  కొండ ఏటవాలుగా పచ్చ పచ్చగా చూడటానికి భలే ఉంది.

సరే ఇక నడక మొదలెడదాం అని మా వంక తేరిపార చూసి అదేంటండి షూస్ లేకుండా ట్రెక్కింగ్ కి వచ్చారు అని ఎర్ర బస్సు వాళ్ళని చూసినట్టు చూసాడు.  అసలు ట్రెక్కింగ్ ప్లానే లేదయ్యా మాకు..షూసు..సాండల్సు ఇన్ని రకాలంటే లగేజీ ఎక్కువవుతుందని షూ అసలు ఎవరమూ పెట్టుకోలేదు.

మామూలుగా ట్రెక్కింగ్ అంటే బాక్ పాక్..చేతిలో కర్ర..షూస్ లాంటివి ఉండాలి కదా..మేము ఇవేమీ లేకుండా బయలుదేరాం.  నేనయితే చీరలో మరీ ట్రెక్కింగ్ కి బయలుదేరా. ఈ టపా అంతా చదివాక చీరతో ట్రెక్కింగ్ చేసిన వీరవనిత అని మీరంతా నాకు బిరుదు కూడా ఇస్తారు :)

వర్షం వస్తేనే కాస్త కష్టం కానీ ..లేకపోతే మరీ అంత ఇబ్బంది ఏమీ ఉండదులేండి....షూ లేకపోయినా ఎక్కేయవచ్చు లేండి అని మా గైడ్ భరోసా ఇవ్వటంతోటి మా ట్రెక్కింగ్ మొదలయింది.  తనే నడిచేటప్పుడు సపోర్టు ఉంటే బాగా నడవచ్చు అని అందరికి తలో చేతి కర్ర ఇచ్చాడు.






ఆడుతు పాడుతు ఎక్కేస్తుంటే అలుపూ సొలుపూ ఏముంది అనుకుంటూ హుషారుగా ఎక్కేస్తున్నాం. ట్రెక్కింగ్ మొదలెట్టిన ఓ పది నిమిషాలకే మా అబ్బాయి చమట పోస్తుందంటూ పై షర్టు (పొద్దుట బయలుదేరినప్పుడు బాగా మబ్బులు పట్టి చలిగాలిగా ఉంది..వాడికి చలి గాలి పడదు..అందుకని షర్టు మీద షర్టు..మంకీ కాప్ అన్నీ బలవంతాన తొడిగిచ్చాం) తీసేసి వాళ్ళ నాన్నకి ఇచ్చాడు.  ఈయన అది భుజం మీద వేసుకుని ఈల వేసుకుంటూ ఎక్కుతుంటే రివ్వుమని కొండగాలి షర్టుని ఎగరేసుకుపోయింది. అసలు ఎటు పోయిందో కూడా కనపడలేదు.  కొత్త షర్టు..ప్చ్!  ఇప్పటికీ నా కళ్లల్లో మెదులుతూ ఉంటుంది ఆ షర్టు!




వాలు మీదకి ఎక్కటం మూలాన త్వరగా అలసిపోతున్నా ఉత్సాహంగా ఉంది.  మా గైడ్ తనతో పాటు మంచినీళ్లు తెచ్చాడు.  అవి జీలకర్ర వేసి కాచిన నీళ్ళు. మధ్య మధ్య ఇవి తాగితే అలుపు రాదు..దప్పిక దరిచేరదు..అందుకని మేము ఇవి ఎప్పుడూ వెంటపెట్టుకుని తిరుగుతాము ..మీరు కూడా తాగండి అని మధ్య మధ్య ఇచ్చేవాడు.  భలే రుచి గా ఉన్నాయి ఆ నీళ్లు.






కొంచం దూరం నడిచాక తెచ్చుకున్న పలహారాలు తిని..కాసేపు సేద తీరి మరలా మొదలెట్టాం మా ట్రెక్కింగ్!  పైకి వెళ్ళేకొద్దీ అప్పుడప్పుడు వచ్చి మన చెంపలు నిమిరి వెళ్లే మబ్బులు...కురవమంటారా ..కురవమంటారా అని కవ్విస్తున్నట్టు ఉంటాయి.  ఆ మబ్బుల్లో కొంచం పదడుగులు ముందు ఉన్నవాళ్ళు కూడా కనపడరు ఒక్కోసారి.  అక్కడక్కడ గడ్డి దుబ్బులు..పచ్చగా నున్నగా జారిపోతూ ఉండేవి. అవి ఉన్న దగ్గర మాత్రం కాస్త జాగ్రత్తగా ఎక్కాల్సి వచ్చేది..ఇక్కడ కర్ర బాగా ఉపయోగపడింది. 








మధ్య మధ్య ఫోటోలు తీసుకుంటూ కొండ పైకి సునాయసంగానే చేరాం.  ఓ రెండు గంటల్లో పైకి వెళ్ళిపోయాము.  ఎవరెస్టు అధిరోహించినంత సంబరపడి ఇక కిందకి దిగటం ఏముంది తేలికే కదా త్వరగానే వెళ్ళిపోవచ్చు అనుకుని కాసేపు అక్కడే చతికిల పడ్డాం.



మేమెక్కిన కొండ పక్కనే ఇంకో కొండ..ఈ కొండకి...ఆ కొండకి దారి కూడా ఉంది.  మా గైడ్ ఆ కొండ చూపెట్టి దిగేటప్పుడు ఆ కొండ మీదనుండి దిగుతామండి అని ఓ సన్నని దారి గుండా ఆ కొండ పైకి తీసుకెళ్ళాడు.  అక్కడినుండి హుషారుగా కిందకి దిగటం మొదలుపెట్టాం.  కొంచం దూరం దిగాక కొండ మరీ స్లోపుగా ఉండి ఒక అడుగు వేస్తే నాలుగు అడుగులు జర్రున కిందకి జారిపోతుంది. ఉన్న కొద్దీ దిగటం చాల కష్టమైపోయింది. ఒకళ్ళ చేతులు ఒకళ్ళం పట్టుకుని మెల్లగా దిగటం మొదలుపెట్టాం.  కింద కిందకి వెళ్ళే కొద్దీ చిన్న చిన్న రాళ్ళు..బాగా కొనతేలి కొన్ని..నున్నగా కొన్ని...అడుగు వేస్తే వెళ్ళి కిందపడతామేమో అన్నంతగా జారిపోతున్నాయి.  అందులోనూ అవి లూజుగా ఉండి కిందకి దొర్లిపోతున్నాయి.  ఒక్కోచోట అయితే ఇక అసలు ముందుకెళ్ళలేం అనిపించింది.  ఉత్సాహం కాస్తా భయం లోకి మారింది.

మాతో పాటు మా అక్క వాళ్ళ బాబు కూడా ఉన్నాడు.  తను అయితే చివరి చివరికి అసలు నడవలేకపోయాడు.  కాసేపు మా గైడు తనని పట్టుకుని నడిపించాడు కూడా.  అలా నడుస్తూనే ఉన్నాం.  ఎంతసేపటికీ కింద రోడ్డు కనపడటం లేదు.  మా గైడేమో ఇంకెంతండి..ఇంకొక్క పదినిమిషాలండి..వచ్చేసాం..వచ్చేసాం అని చెప్తూనే ఉన్నాడు.  గంట..రెండు..మూడు గంటలు అలా నడుస్తూనే ఉన్నాం..  ఇంకాస్త ముందుకి వెళ్ళాక తను కూడా దిక్కులు చూట్టం మొదలెట్టాడు.  అలా కాసేపు అన్ని దిక్కులూ చూసి చూసి దారి తప్పాం అనుకుంటానండి..ఈ దారి ఎప్పుడు చూడలేదు నేను కూడా అని చావు కబురు చల్లగా చెప్పాడు.

తెచ్చుకున్న మంచినీళ్ళు అయిపోయాయి.  ముందు దారేమో భయంకరం..పోనీ వెనక్కి వెళదామా అంటే వెనక్కి కొండ పైకి అసలు ఎక్కలేని పరిస్థితి.  ఆ జారే రాళ్ళ మీద అది అసలు అయ్యే పని కాదనిపించింది.  సరే ముందుకే వెళితే ఎక్కడో అక్కడికి చేరుకుంటాం కదా అని అలానే పళ్ళబిగువున నడక సాగించాం.  అందరికీ ఒంట్లో శక్తి హరించుకుపోయింది.  మాట రావటం లేదు.  అసలు మాట్లాడే పరిస్థితే లేదు.  కింద రాళ్ళు..రప్పలు చూసుకుంటూ ఒకరినొకరం పట్టుకుని మెల్లగా నడుస్తూ..నడుస్తూ...చివరికి ఓ టీ ఎస్టేటులోకి తేలాం.  పాపం మా గైడు కూడా అలాంటి దారి ఊహించలేదు.

ఆ టీ ఎస్టేట్ ఏమో చాలా పెద్దది.  దాంట్లో నుండి బయట రోడ్డు మీదకి పడటానికి బోలెడంత నడవాల్సి వచ్చింది. చివరకి ఎలాగో ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్డెక్కాం.  అదేమో మున్నార్ కి బాగా దూరం.




మేము బయటకి వచ్చిన దగ్గర ఊరు కూడా ఏమీ లేదు.  అప్పుడొకటి..ఇప్పుడొకటి జనాల్ని కుక్కేసుకుని జీపులే తిరుగుతున్నాయి అటూ ఇటూ.  అది కూడా పర్యాటకులు కాదు..పొలం పనులకి అటూ ఇటూ తిరిగేవాళ్ళు.   వాళ్ళ చేతుల్లో కొడవళ్ళు..కర్రలు..బుట్టలు..పారలు తోటి కిక్కిరిసిపోయి ఉండేవి జీపులు. మా గైడ్ ఏమో తన ఫ్రెండుకి మేము ఎక్కడయితే ట్రెక్కింగ్ మొదలుపెట్టామో అక్కడికి ఆటోతో వచ్చి ఉండమని చెప్పి వచ్చాడు.  మేమేమో ఇంకో దారిన బయటపడ్డాం.  అక్కడికి తన ఫ్రెండుకి ఫోను చేసి రమ్మన్నా రావటానికి గంట పడుతుందన్నాడు.  ఆ దారిన బస్సులు కూడా ఉండవట.  జీపులో వెళ్ళాల్సిందేనండి అన్నాడు.

ఒక్క జీపు కూడా కాస్త ఖాళీది రావటం లేదు.  చూడగా చూడగా కాసేపటకి ఓ జీపు ఓ మనిషి పట్టే ఖాళీతో వచ్చింది.  అదే మహాభాగ్యం అనుకుని ఐదుగురం దాంట్లో ఎక్కేసాం.  ఎలాగో రూముకి వచ్చి పడ్డాం.  కాందిశీకుల్లాగా తయారయ్యాం రూముకి వచ్చేటప్పటికి.  నాలుగు రోజులు కాళ్ళ నెప్పులు తగ్గలేదు.  మా అక్క వాళ్ళ అబ్బాయికయితే కాలు వాచిపోయి ఓ వారం రోజులు ఇబ్బంది పడ్డాడు.

మున్నార్ మా టూరులో దాదాపు చివరి పాయింట్ కాబట్టి సరిపోయింది.  అదే టూరు మొదట్లోనే ఇలా జరిగి ఉంటే మధ్యలోనే ఇంటికి వచ్చేయాల్సి వచ్చేది!

నేనయితే ఇక జీవితంలో మళ్ళీ ట్రెక్కింగ్ చెయ్యకూడదనుకున్నా!

అలా అని ఊరుకోలేదండోయ్ మళ్లీ ముదుమలై అడవుల్లో పులి అడుగుజాడల్లో పులిని వేటాడుతూ మరో ట్రెక్కింగ్ చేసాం.  దాని గురించి మరో టపాలో!

Read more...

June 21, 2013

e-పుస్తకాలు-ఒక్కోసారి తప్పని అవసరం!

మామూలుగా నాకు కంప్యూటర్ లో చదవటం అంత ఇష్టం ఉండదు...వెబ్ మాగజైనులు కూడా నేను అంతగా చదవను.  చాలా బాగున్నాయి చదివి తీరాల్సిందే అనుకుంటేనే చదువుతాను.   కానీ ఒక్కోసారి మనకు ఎంత ఇష్టం లేని పనులైనా పరిస్థితుల ప్రభావం వల్ల చెయ్యక తప్పదు.  అలాంటి పరిస్థితుల ప్రభావం వల్లే నాకు e-పుస్తకాలు చదవటం తప్పనిసరి అయి ఇప్పుడు అవే ముద్దయిపోయాయి.

దాదాపు సంవత్సరంన్నర క్రితం మొదటగా కిండిల్ లో (కిండిల్ టచ్ మా పిల్లలకని తెప్పిస్తే వాళ్ళు పుస్తకమే మాకూ ఇష్టం అని దాన్ని పక్కన పడేసారు..అది అలా ఊరికే పడి ఉండటం చూసి బాధేసి నేను వాడదామని ప్రయత్నించాను) కొన్ని తెలుగు పుస్తకాలు చదువుదామని ప్రయత్నిస్తే అసలు చదవటానికి వీలుగా లేదు.  చీమతలకాయలంత అక్షరాలు చదవటం చాలా కష్టమయ్యేది.  ఫాంట్ సైజు పెంచామంటే తర్వాతి పేజీకి వెళ్ళాలంటే మళ్లీ ఫాంట్ సైజు తగ్గించుకుని కాని వెళ్ళలేకపోయేవాళ్ళం.

నెట్ లో వెతికాను కానీ ఈ సమస్యకి సరైన పరిష్కారం కనిపించలేదు.  ఏదో mobi format అన్నారు..అలా చేసినా చదవటానికి తల ప్రాణం తోకకొచ్చేది.  ఇక నా వల్ల కాదని పక్కన పడేసాను.

అప్పుడే మాలతి గారు కూడా ఇదే విషయం పై ఓ టపా వ్రాసారు.  అమ్మయ్య నాకు  ఇంకా తోడున్నారన్నమాట అని ఊపిరి పీల్చుకున్నాను!

అసలు విషయం ఏంటంటే e-రీడర్సు లో చదవటానికి వీలయ్యేటట్టు మన తెలుగు పుస్తకాలు రావటం లేదు.  మనకి  నెట్టులో దొరికే తెలుగు పుస్తకాలు..వ్యాసాలు ఎక్కువగా PDF రూపంలో ఉంటాయి.  ఇవి కిండిల్ లో చదవటం (మిగతా e-రీడర్సు గురించి నాకు తెలియదు) చాలా ఇబ్బందికరం.

అలా కిండిల్ ని మూలన పడేసాను. హైదరాబాదులో ఉన్నంత కాలం మళ్ళీ e-పుస్తకాల మీదకి దృష్టి పోలేదు..అంత అవసరమూ రాలేదు.

తర్వాత డిసెంబరు-2012 లో గూగుల్ నెక్సస్-7 వచ్చింది.  దాంట్లో కూడా మొన్నమొన్నటి వరకు మెయిలు చూసుకోవటం..నెట్ సర్ఫింగ్..ఆటలకి తప్పితే పుస్తకాలు చదువుదామని ప్రయత్నించలేదు.  పది నెలలబట్టి ఆంధ్రదేశానికి దూరంగా ఉన్నా హైదరాబాదు వెళ్ళినప్పుడల్లా పుస్తకాలు తెచ్చుకుంటూ చదువుకుంటూ గడిపేస్తున్నాను.  ఎన్ని పుస్తకాలని తెచ్చుకోగలను! తెచ్చుకున్న పుస్తకాలు అయిపోయాయి.

ఆ మధ్య ఒక రోజు నెక్సస్ లో తెలుగు e-పుస్తకాలు చదవగలమేమో చూద్దాం అని పురుగు కుట్టింది.  సరే మన కినిగె వాళ్ళున్నారుగా వాళ్లని సంప్రదించాను..మీ e-పుస్తకాలు నెక్సస్ లో చదవగలమా అని? వచ్చు..వచ్చు Bluefire లేదా Aldiko రీడర్ల ద్వారా ఎంచక్కా చదువుకోవచ్చు అని చెప్పారు.

అహా ఏమి హాయిలే హలా అనుకుంటూ అప్పటికే మా నెక్సస్ లో Aldiko ఉంది, Bluefire కూడా దింపుకుని టపటపా ఓ ఎనిమిది పుస్తకాలు దింపేసుకున్నాను కినిగె నుండి.




హాయిగా ఉంది చదువుకోవటానికి.  Bluefire..Aldiko..ఈ రెండిటిల్లో నాకు Bluefire వీలుగా బాగుంది.  Aldiko కూడా బాగుంది కానీ అందులో ముందు Aldiko కి వెళ్ళి దాని ద్వారా కినిగె కి వెళ్ళి పుస్తకాలు దించుకోవాలి.  Bluefire అయితే డైరెక్టుగా కినిగె నుండే దింపుకోవచ్చు.

నా ఓటు ఎప్పుడైనా అచ్చు పుస్తకానికే కానీ e-పుస్తకంతో కూడా కొన్ని అనుకూలతలు ఉన్నాయి.

ఆంధ్ర వెలుపల ఉన్నవాళ్లకి చాలా ఉపయోగం.  కొరియరో..పోస్టో..షిప్మెంటో ఇలాంటి వాటి కోసం వెతుక్కోనక్కరలేదు.  మరీ ముఖ్యంగా మాలాగా ఇంటర్ నెట్ తప్ప ఎలాంటి సమాచార సదుపాయాలు లేని  అడవుల్లో ఉండేవాళ్ళకి ఎడారిలో ఒయాసిస్సు లాంటివి ఈ e-పుస్తకాలు.

చదువుకోవటానికి బాగానే ఉన్నాయి కానీ వీటి పట్ల నాకు ఇంకా కొంత అసంతృప్తి ఉంది.

1. తెలుగు e-పుస్తకాలంటే స్కాన్ చేసి పెట్టేస్తున్నారు.  అలా కాకుండా e-రీడర్సుకి..టాబ్లెట్స్ కి అనువైన ఫార్మాట్ లో తేగలిగితే బాగుంటుంది.

2.  అక్షరాల సైజు పెంచుకోవాలంటే మనం ప్రతి పేజీకి పెంచుకోవాలి..అలా కాకుండా ఇంగ్లీషు పుస్తకాలకి పెంచుకున్నట్టు పుస్తకం మొత్తానికి ఒకేసారి పెంచుకునేట్లు ఉండాలి.

3. పేజీకి రెండు కాలమ్సు ఉండే కొన్ని పుస్తకాలు చదవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది.  ఉదాహరణకి  జమీల్యా...ఈ పుస్తకం ఫాంట్ చాలా చిన్నదిగా ఉంది..పేజీకి రెండు కాలమ్సు ఉంటాయి.  ప్రతి పేజీ ఫాంట్ పెద్దది చేసుకు చదవాలి..ఇలా ఫాంట్ పెద్దది చేసినప్పుడు రెండో కాలం కనపడదు..మొదటి కాలం చదివాక రెండో కాలం కి స్క్రీన్ జరుపుకోవాలి..దాంతో పుస్తకం చదివే వేగం కుంటుపడుతుంది...చదవాలన్న ఇష్టమూ పోతుంది.






ఈ సమస్య మళ్ళీ కథాకేళి లాంటి మాసపత్రికల్లో లేదు.


తెలుగులో e-పుస్తకాలు రావటం ఇప్పుడిప్పుడే మొదలయింది కాబట్టి త్వరలోనే పై సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం.  ఫార్మాట్ సమస్య తీరితే సమస్యలన్నీ దానికి రిలేటడ్ కాబట్టి అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది.

కినిగె వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారని ఆశిద్దాం.

అలాగే తెలుగులో విడుదలైన ప్రతి పుస్తకం e-పుస్తకంగా తేవాలని ఈ సందర్భంగా కినిగె వాళ్ళని కోరుతున్నాను.

మిగతా టాబ్లెట్సులో, e-రీడర్సు లో ఎలాంటి సమస్యలున్నాయో నాకు తెలియదు.  అవి ఉపయోగించుతున్న వాళ్ళు తెలియచేయాలి.

e-రీడర్  ఉంటే అరచేతిలో ఓ పేద్ద గ్రంధాలయం ఉన్నట్టే కానీ పుస్తకం చేతిలో పట్టుకుని చదివితే ఆ అనుభూతే వేరు.

కొంతమంది పర్యావణ ప్రేమికులు  పుస్తకాల కోసం ఎన్ని చెట్ట్లు కొట్టేయ్యాల్సొస్తుందో ..ఎన్ని అడవులు నాశనం అవుతున్నాయో అని e-పుస్తకాలనే వాడండి అని సందేశాలు ఇస్తున్నారు ఈ మధ్య.  అది కూడా నిజమే కానీ అడవుల సంరక్షణకు వేరే పర్యావరణ పరిరక్షణ పద్దతులు పాటిస్తే మేలు కదా అనిపిస్తుంటుంది నాకు.  పుస్తకాలు చదవటం మానేసి e-పుస్తకాలు చదివినంత మాత్రాన అడవులు రక్షింపబడతాయి అని నేననుకోను.

రాబోయే రోజుల్లో తెలుగు e-పుస్తకాలకి మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.

నవీన్ గారు వ్రాసిన ఈ టపా కూడా కొత్తగా e-రీడర్ కొనుక్కుందాం అనుకునేవాళ్లకి ఉపయోగంగా ఉంటుంది.

Read more...

June 17, 2013

అచ్చు పుస్తకం VS e-పుస్తకం




హైస్కూలులో ఉండగా పక్క ఊరి లైబ్రరీ నుండి మా అమ్మకి..అక్కకి నవల్సు తెచ్చిపెట్టేవాళ్ళం.  కొత్త నవలలు, కొన్ని ప్రసిద్ద నవలలు అంత తొందరగా దొరికేవి కావు.  ఎప్పుడు వచ్చేవో..ఎవరు తీసుకెళ్ళేవాళ్లో అసలు లైబ్రరీ లో కనపడేవి కావు.  మొత్తానికి ఎప్పటికో దొరికేవి. మా నాన్న వారపత్రికల్లో..మాసపత్రికల్లో వచ్చిన సీరియల్సు అన్నీ తీసి బైండ్ చేసేవాళ్ళు.  ఇప్పటికీ బోలెడున్నాయి అలా బైండ్ చేసిన అనాటి సీరియల్సు.

హాస్టల్ లో ఉండగా ఎవరైనా కొత్త నవల తెస్తే వాళ్ళు చదవటం అయ్యాక నాకంటే నాకు అని వంతులు వేసుకునే వాళ్ళం. అది చదివే దాకా నిద్ర పట్టేది కాదు.  క్లాసులో డెస్కు కింద పుస్తకం పెట్టుకుని తలవంచుకుని ఏదో సీరియస్సుగా చదువుతున్నట్లు నవల్సు చదివిన రోజులు కూడా ఉన్నాయి.

మా కజిన్ వాళ్ళకి పుస్తకాలు అద్దెకిచ్చే షాపు ఉండేది.  ఆ షాపు పుణ్యమా అని వచ్చిన పుస్తకం వచ్చినట్లు చదివే వాళ్ళం. విశాలాంధ్రలు..నవోదయల గురించి మాకసలు చాలా రోజులు తెలియనే తెలియదు.

ఏమైపోయాయో ఆ లైబ్రరీలు.. ఆ పుస్తకాల షాపులు..ఆ సీరియల్సు బైండింగులు!

కాలంతో పాటు మనమూ మారటంలేదూ..అలాగే పుస్తకాల లభ్యత కూడా  మారిపోతుంది.

ఎక్కడో అదృశ్యంగా ఉండి పుస్తకాలు అమ్మే అంగళ్ళు వచ్చేసాయి. ఇలా ఓ క్లిక్ కిక్కి కొనుక్కోవటం..అలా  ఓ నాలుగు రోజుల్లో మన చేతిలో పుస్తకం వాలిపోవటం.

ఇప్పుడయితే ఆ నాలుగు రోజులు కూడా అక్కర్లేదు.  ఓ క్లిక్ తో క్షణాల్లో మన కళ్లముందుకి సరికొత్త పుస్తకం వచ్చేస్తుంది. అప్పటికప్పుడే చదివేసుకోవచ్చు.  వేలి కొనతో అక్షరాలని మనకు కావల్సిన సైజులోకి మార్చుకోవచ్చు. షాపుల్లోకన్నా ముందు మన దగ్గరికి వచ్చేస్తున్నాయి పుస్తకాలు.

ఈ మధ్య ఫేస్ బుక్ లో కథావార్షిక-12 విశాలాంధ్రలో దొరకటం లేదని కొంతమంది మితృలు విచారం వెళ్ళబుచ్చారు. e-పుస్తకంగా మాత్రం అప్పటికే చాలా మంది చదివారు.

ఏనాడైనా కలగన్నామా ఇలా e-పుస్తకాలు వస్తాయి అని?
ఎవరినీ ఏ పుస్తకమూ అడగక్కర్లేదని
వాటి కోసం ఏ లైబ్రరీకీ వెళ్ళక్కర్లేదని
ఏ పుస్తకాల షాపు వాడినీ బ్రతిమాలుకోవక్కర్లేదని
కావల్సిన పుస్తకం కోసం ఎక్కడో మూల మూలల దుమ్ములో వెతుక్కోవక్కర్లేదు అని
ఎవరో చదివి ఇచ్చేదాకా వేచి ఉండక్కర్లేదు అని
వందల పుస్తకాలు ఓ బుల్లి టాబ్లెట్ లో దాచేసుకోవచ్చని
అసలేనాడైనా కలగన్నామా!
పుస్తకాలు పాడవుతాయన్న భీతి లేదు
ఎవరన్నా తీసికెళతారన్న  భయం లేదు
తీసుకెళ్ళిన వాళ్ళు తిరిగి ఇవ్వరేమో అన్న సంకోచమూ లేదు
అడిగిన వారికి ఇద్దామా వద్దా అన్న సందిగ్థత అసలే లేదు!
మన తర్వాత వీటన్నిటినీ ఏం చెయ్యాలా అన్న బెంగా లేదు!
ఓ క్లిక్కుతో కొనుక్కున్నట్టే ఓ క్లిక్కుతో తీసిపడేయావచ్చు!!
ఎక్కడికంటే అక్కడికి ఎన్నంటే అన్ని పుస్తకాలు మోసుకెళ్ళవచ్చు!

అంతా డిజిటల్ మయం అవుతున్న ఈ కాలంలో పుస్తకాలు మాత్రం ఎందుకు కాకూడదు!!

నిజమే..అన్నీ బాగానే ఉన్నాయి...కానీ..
అచ్చు పుస్తకం చదివితే వచ్చే తృప్తి ఓ e-పుస్తకం చదివితే వస్తుందా?
కొత్త పుస్తకం వాసన కానీ
అందరి చేతుల్లో పడి నలిగిన పాత వాసన కానీ
మొదటి పేజీలోనో..రెండో పేజీలోనే ఉండే నానా విధాల హస్తాక్షరాలు
మనకు పుస్తకం ఇచ్చినవాళ్లవో..రచయితవో ఆత్మీయ అక్షరాలూ
నలిగిన పేజీలు..మాయమైన పేజీలు
మడతలు పడిన మూలలు..అండర్ లైన్ చేసిన వాక్యాలు
వీటన్నిటినీ మిస్ అవటం లేదూ!

ఓ వర్షాకాలం సాయంత్రం
వర్షం వెలిసాక
అప్పుడప్పుడే చెల్లా చెదురవుతున్న మబ్బుల సాక్షిగా
ఎవరూ లేని ఏకాంతంలో
ఆరుబయట
ఓ వాలు కుర్చీలో కూర్చుని
ఏ వెన్నెల్లో ఆడపిల్లో..ఏ ప్రళయ కావేరి కథలో
చదువుకుంటూ
మధ్య మధ్యలో పుస్తకాన్ని గుండెల మీద పెట్టుకుని
మనసారా హత్తుకుని
అక్షరాలని అలా ఓ సారి సుతిమెత్తగా తడిమి చూసుకుని
చదువుకునే అనుభూతికి దూరమయి మరీ చదువు కొంటున్నాము!

ఏమో కొద్ది రోజుల్లో అసలు అచ్చు పుస్తకాలే లేకుండా పోతాయేమో!

అమ్మే వాళ్లకి కూడా e-పుస్తకాలే లాభం అట.

అమెరికాలో లెక్కలు ఇవి.....
కాగితంతో పని లేదు..ఎక్కువమంది మనుషులతో పని లేదు
ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు
పుస్తకాలు పేర్చి పెట్టక్కర్లేదు...భద్రపరచక్కరలేదు... వెతకక్కర్లేదు
తక్కువ ఖర్చు-ఎక్కువ రాబడి..ఇదే కదా వ్యాపారానికి ముఖ్యం!

రచయితలకి కూడా చాలా సౌలభ్యం e-పుస్తకం
పబ్లిషర్ల చుట్టూ తిరగక్కరలేదు, తామే అచ్చేసుకోవచ్చు
ప్రింట్ చేసినవన్నీ అమ్ముడు పోవేమో అన్న బెంగ ఉండదు
పబ్లిష్ చేసిన మరు నిమిషంలో పాఠకులని చేరిపోవచ్చు
ఏమైనా మార్పులు-చేర్పులు ఊంటే నిమిషాల్లో చేసేయవచ్చు
మార్పులతో మళ్ళీ మొత్తం పుస్తకం ప్రింట్ చెయ్యాలన్న బాదరబందీ లేదు.

ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి 150 e-పుస్తకాలకి 100 అచ్చు పుస్తకాలు అమ్ముడవుతున్నాయట.  ముఖ్యంగా యువతరానికి e-పుస్తకాల మీదే ఎక్కువ మక్కువ అట.

2007 లో kindle విడుదలయింది.  విడుదలయిన నాలుగు సంవత్సరాలలోనే అమెజాన్ లో e-పుస్తకాల అమ్మకం ప్రింట్ పుస్తకాల అమ్మకాలని మించి పోయింది.

తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే e-పుస్తకాల అమ్మకం మొదలయింది.  ఆంధ్రదేశానికి దూరంగా ఉండటం..షాపుల్లో పుస్తకాలు సరిగ్గా దొరకపోవటం..దూరాభారం..తెలుగు పాఠకుల్ని e-పుస్తకాల వైపుకి మళ్ళేలా చేస్తున్నాయి.

Books are not broken, but our hearts do...

****************************************************

గత కొద్దిరోజులుగా e-పుస్తకాలు విపరీతంగా చదువుతున్న ఫలితం ఈ టపా. తెలుగు e-పుస్తకాలతో నా అనుభవాలు-అనుభూతులు మరో టపాలో!


Read more...

November 22, 2012

డెహ్రాడూన్ సోయగాలు

డెహ్రాడూన్....ఉత్తరాఖండ్ కి రాజధాని.

హరిద్వార్, రిషీకేశ్,  గంగోత్రి, యమునోత్రి,  కేదార్ నాథ్, బదరీ నాథ్ లాంటి పుణ్య క్షేత్రాలున్న ఉత్తరాఖండ్ ని దేవభూమి అని పిలుచుకుంటారు అక్కడి వాళ్ళు.

డెహ్రాడున్ ఈ పుణ్యక్షేత్రాలన్నిటికి ఒకరకంగా గేట్ వే లాంటిది.  దీనికి ఉత్తరాన  హిమాలయాలు (Lower Himalayas), దక్షిణాన శివాలిక్ పర్వతాలు (Outer Himalayas),  తూర్పున గంగా నది,  పశ్చిమాన యమునా నది ఉంటాయి.

డెహ్రాడూన్ నుండి సుమారుగా మసూరి-30 కి.మీ, ఋషీకేశ్-50 కి.మీ, హరిద్వార్-54 కి.మీ దూరంలో ఉంటాయి.

డెహ్రాడూన్ లో మన తెలుగు వాళ్ళు అధికంగానే ఉన్నారు.  అక్కడి తెలుగు సంఘానికి DEVTA (Devbhumi Telugu Association) అని పేరు పెట్టుకున్నారు. పండగలకి..పబ్బాలకి బాగానే కలుస్తుంటారు.

డెహ్రాడూన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది డూన్ స్కూల్. ఒకప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఎక్కువగా ఇక్కడే చదివే వాళ్ళు.




ఇదే కాక
Forest Reasearch Institute
The Indian Military Academy (IMA)
Indian Institute Of Petroleum
Indian Institute of Remote Sensing
Lal Bahadur Shastri National Academy of Administration (LBSNAA), Mussoorie

లాంటి ప్రసిద్ద విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి..

హరిద్వార్, ఋషీకేశ్, మసూరి, గంగోత్రి, యమునోత్రి..వగైరా వన్నీ అందరూ ఎక్కువగా చూసేవే!  ఇవన్నీ కాక డెహ్రాడున్ లోనే బోలెడన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి.  ప్రకృతి ఆరాధకులకి డెహ్రాడూన్ ఓ భూతల స్వర్గమే అని చెప్పవచ్చు.  కొండలు..లోయలు..జలపాతాలు..అలా చూస్తూ గడిపేయ వచ్చు.

డెహ్రాడూన్ లో ఉన్న చూడవలసిన ప్రదేశాలల్లో కొన్ని..నేను చూసినవి:

1.  Forest Research Institute: ఇది ఓ బ్రహ్మాండమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్..తప్పక చూడవలసినది.  ఇలాంటిది ఆసియాలో ఇదొక్కటే! ఇలాంటి వాటిల్లో చదవటం తర్వాత సంగతి..చూడటమే ఓ గొప్ప అనుభూతి కలిగిస్తుంది.


రాజ ప్రాసాదాన్ని తలపించటం లేదూ!
IFS (Indian Forest Service ) వాళ్ళ ట్రైనింగ్ ఇక్కడే జరుగుతుంది.  దీనిని బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1906 లో స్థాపించారు. వంద ఏళ్ళ పై బడిన ఈ కాలేజీని చూడటానికి రెండు కళ్ళూ చాలవు.  దీని వ్యూ మొత్తం ఒకేసారి ఫోటో కూడా తీయలేము..స్టిచ్ ఫోటో నే.

కనుచూపు మేరా లానే..

బకింగ్ హామ్ పాలస్ కన్నా పెద్దదట ఇది! మైళ్ల కొద్దీ పొడవుండే పెద్ద పెద్ద కారిడార్లు...ఎకరాల కొద్దీ విస్తరించి ఉండే లాను.. 450 హెక్టార్లలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ ని పూర్తిగా నిశితంగా చూడటానికి ఓ రోజంతా పడుతుందంటే అతిశయోక్తి కాదు.

కారిడార్... సొగసు చూడతరమా!

ఇందులో ఆరు మ్యూజియమ్ లు ఉన్నాయి.  ఇన్స్టిట్యూట్ లోపల తిరిగి చూడటానికి టికెట్ అక్కర్లేదు కానీ మ్యూజియమ్ లు లోపలకి వెళ్ళి చూడాలంటే టికెట్ తీసుకోవాలి.
టికెట్ పెద్దలకి-15 రూపాయలు....పిల్లలకి- 5 రూపాయలు.

సోమవారం నుండి శుక్రవారం వరకు 9:30 నుండి 1:30 మరకు..మరలా  2.00 నుండి 5:30 వరకు అనుమతిస్తారు.

ఇంకా ఎక్కువ వివరాలకు..ఫోటోలకు ఈ కింది సైటులు చూడవచ్చు.

http://fri.icfre.gov.in

http://fri.icfre.gov.in/index2.php (ఫోటోలకి)

http://fri.icfre.gov.in/videofri/frivideo.html (వీడియోలకి)

2. టపకేశ్వర్ గుడి: ఇది ఓ శివాలయం.  ఓ గుహలో శివ లింగం ఉంటుంది.  దాని మీద ఎప్పుడూ నీళ్ళ చుక్కలు టప..టప పడుతూ ఉంటాయి ..అందుకే ఆ పేరు.  ఇక్కడే రుద్రాక్షలతో చేసిన శివలింగం ఉంది..చాలా ఆకర్షణీయంగా ఉంది.  గుడి పక్కనే నది ప్రవహిస్తూ ఉంటుంది..చాలా బాగుంటుంది.  ఇక్కడ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి!





రుద్రాక్షలతో చేసిన శివలింగం


వడి వడిగా పరుగులు..



3. శివుని గుడి: డెహ్రాడూన్ నుండి ముసోరి వెళ్ళే రోడ్డులో డెహ్రాడూన్ నుండి ఓ 20 కి.మీ దూరంలో ఈ గుడి ఉంది.  ఇది ఇక్కడ చాలా ప్రసిద్ది చెందిన గుడి. ఇక్కడ ఎలాంటి కానుకలూ స్వీకరించబడవు. ఇక్కడ ప్రసాదంగా రాజ్మా రైస్, ఫ్రైడ్ రైస్, టీ  లాంటివి  ఇస్తారు. గుడి ప్రాంగణంలో రుద్రాక్షలు, ముత్యాలు, జాతి రాళ్ళు అమ్ముతారు..అదే దేవాలయానికి ఆర్థిక వనరట! మంచివే దొరుకుతాయన్నారు!




4. సహస్త్ర ధార: ఇది ఓ జలపాతం...చాలా బాగుంటుంది. ఈ నీళ్ళు పక్కనే ఉన్న నదిలో కలుస్తాయి.  ఈ నీళ్ళల్లో సల్ఫర్ ఉంటుంది..ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరూ ఇక్కడ స్నానాలు చేస్తారు. స్నానం చెయ్యటానికి ప్రత్యేకంగా గంధక్ జల్ కుండ్ అని ఓ చిన్న కొలను లా ఉంటుంది.


ఎక్కడికో ఈ ఉరుకులు...

నది పక్కనే మూడు చిన్న చిన్న గుహలు ఉన్నాయి..శివుడి గుహ..పార్వతి గుహ..ఇంద్రేష్ గుహ..చాలా చిన్నవే కానీ పై నుండి నీళ్ళు పడుతూ ఉంటే లోపలకి వెళ్ళి రావటం బాగుంటుంది.  కాకపోతే కాస్త జాగ్రత్తగా నడవాలి..ఇక్కడ రాళ్ళు బాగా జారిపోతూ ఉంటాయి.

శివుడి గుహ

పార్వతి గుహ


గంధక్ జల్ కుండ్

ఇక్కడ రోప్ వే..అమ్యూజ్మెంట్ పార్కు..రైడ్సు ఉన్నాయి.  మేము వెళ్ళిన రోజు ఆ రైడ్సు ఏవీ నడపటం లేదు.  మనుషులు సరిపడా ఉంటేనే అవి నడుపుతారు..మేము వెళ్ళింది ఉదయం పూట కాబట్టి ఎక్కువ మంది లేరు...అందుకని వాటిని నడపటం లేదు.

5. రాబర్స్ కేవ్: ఈ ప్రదేశాన్ని గుచ్చూ పానీ అని కూడా అంటారు  అంటే "water in the cup of your hands" అని అర్థం అట!.ఇది నిజంగా ఒక అద్భుతం. రెండు కొండల మధ్య ఓ సన్నటి లోయ..ఆ లోయలో  నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.. పై నుండి సూర్య కాంతి పడుతూ నీళ్లు మిల మిలా మెరుస్తూ ఉంటాయి. నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీళ్లల్లో ప్రవాహానికి ఎదురు నడవటం..అదొక మరుపురాని అనుభవం.

రాబర్సు కేవ్ కి వెళ్ళే దారి
గుహ ప్రవేశానికి ముందు..తళ తళ మెరుపులు..
పూర్వం దొంగలు తాము దోచుకున్న సంపద తెచ్చి ఈ కొండల్లో దాచే వాళ్ళట..అందుకనే రాబర్సు కేవ్ అని పేరు వచ్చిందట!

ఇక్కడి నుండి గుహ మొదలవుతుంది...
మధ్య మధ్యలో పై నుండి నీళ్ళు జల్లులా  మన మీద పడుతూ ఉంటాయి. అక్కడక్కడ గోడల మీద పాములు కూడా తగుల్తాయట చేతులకి!..నాకయితే ఏమీ తగల్లేదు..భయపడే వాళ్ళకే అవి తగుల్తాయి అనుకుంటాను.


కొన్ని చోట్ల రెండు కొండల మధ్య దూరం 3-4 అడుగులే ఉంటుంది. మధ్యలో ఎత్తైన రాళ్ళు దారికి అడ్డంగా ఉంటాయి..ఒక చోట ఓ ఎత్తైన రాయి..కింద నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి..ఇక్కడ చాలా లోతుగా కూడా ఉంటుంది..అందుకని ఆ రాయి ఎక్కి అవతలకి వెళ్ళాలి..కొంచం జాగ్రత్తగా దాటాలి..ఏ మాత్రం కాలు జారినా కింద నీళ్ళలోకి పడిపోవటమే! నేనయితే బాగానే దాటేసాను. నాతో పాటు వచ్చిన పిల్లలు అయితే భయడిపోతూ అమ్మో ఆంటీ మీరు చక చకా ఎక్కేస్తున్నారు మాకు భయం వేస్తుంది అంటూ ఒకటే ఆర్తనాదాలు!


అలా నీళ్లల్లో ఓ నాలుగయదు కిలో మీటర్లు నడవ వచ్చు.  ఓపిక ఉంటే చివరి దాకా వెళ్ళి రెండో వైపు నుండి బయటకు రావచ్చు. కాకపోతే అక్కడి నుండి మళ్ళీ పార్కింగు దగ్గరకి రావాలంటే దూరం..అందుకని మేము మరీ చివరి దాకా వెళ్ళకుండా మధ్యలోనే వెనక్కి వచ్చేసాం...నాకయితే చివరి దాకా వెళ్ళాలనిపించింది కానీ అప్పటికే చీకటి పడుతుంది అని వెనకకి మరిలాం.

రెండు కొండలు ముద్దు పెట్టుకుంటున్నట్టు లేదూ!
ఇక్కడ ఎంట్రన్సులో ఓ చిన్న హోటలు ఉంటుంది.  అక్కడ మాగీ చాలా ఫామస్ అట.  వేడి వేడిగా అప్పటికప్పుడు చేసి ఇస్తాడు. మనిషి కూడా చాలా మంచి వాడు.  అందరి కెమెరాలు..బాగ్ లు ఇతని దగ్గరే పెట్టి వెళ్తారు..వాటికి కాపాలా కాసినందుకు డబ్బులు కూడా ఏమీ తీసుకోడు!..ముందు నీళ్ళు..ఆ నీళ్లల్లో రాళ్ళు..ఆ రాళ్ళ మీద కూర్చుని నీళ్లల్లో కాళ్ళు ఆడిస్తూ వేడి వేడి మాగీ ఊదుకుంటూ తినటం ఓ మధురానుభూతి ఎవరికైనా!

డెహ్రాడూన్ వెళ్తే మాత్రం ఈ ప్రదేశం తప్పక చూడండి.

ఇవీ నేను చూసిన డెహ్రాడూన్ సోయగాలు..మరిన్ని మరోసారి!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP