మాలతీ చందూర్-ఓ విజ్ఞాన సర్వస్వం
గూగుల్ సౌజన్యంతో |
ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకి పరిచయం చేసిన అతి కొద్ది మంది రచయిత్రిలలో మాలతి గారు ఒకరు. పాతకెరటాలు శీర్షిక ద్వారా ఎన్నెన్నిప్రపంచ ప్రసిద్ద నవలలని తెలుగులో పరిచయం చేసారో! అవి చదివి అబ్బో ఈవిడ ఎంత పెద్ద చదువులు చదివి ఉంటారో అని అబ్బురపడేవాళ్ళం. తర్వాత తెలిసింది ఆమె పెద్దగా చదువుకోలేదని. ఒకటి కాదు రెండు కాదు ఐదు దశాబ్దాల పాటు ఈ శీర్షిక నిర్వహించారు ఆవిడ. తెలుగు పత్రికలలో ఇంతకాలం ఓ శీర్షిక నిర్వహించిన ఘనత ఆమెకే దక్కుతుంది. నవలా పరిచయం అనే సాహితీ ప్రక్రియకి ఓ గొప్ప గౌరవం కలిగించారు మాలతి గారు.
ఈ పరిచయాలు "పాత కెరటాలు", "నవలా మంజరి" పేర్లతో పుస్తకాలుగా విడుదలయ్యాయి. తెలుగు పాఠకుల దృష్టి ముఖ్యంగా మహిళల దృష్టి ఆంగ్ల సాహిత్యం మీదకి మళ్ళటానికి ఈ పాతకెరటాలు చాలా దోహదం చేసింది. ఆంగ్ల నవలలే కాక పలు ఇతర భాషల నవలల్ని కూడా ఆమె పరిచయం చేసారు. నేను వ్రాసిన పరిచయం చదివి ఊరుకోకుండా అసలు నవలని కూడా చదవాలి అని చెప్పే వారు ఆమె.
ప్రమదావనం లో అయితే అంతర్జాతీయ వార్తల దగ్గరనుండి అంతరిక్షం దాకా దేని గురించి అడిగినా చాలా లోతుగా విశ్లేషించి మరీ చెప్పేవారు. కుటుంబ సమస్యల నుండి అంతర్జాతీయ సమస్యల వరకు చాలా విస్తృతంగా ప్రశ్నలు ఉండేవి. ఆవిడ కూడా అంతే విస్తృతంగా సమాధానాలు చెప్పేవారు. అసలు ఆవిడకి తెలియని విషయం ఉండేది కాదు. తెలియకపోయినా తెలుసుకుని చెప్పేవాళ్లు. ఆంద్రప్రభ రాగానే ముందుగా ఆ కాలమే చదివేవాళ్లం.
ఇది ప్రత్యేకంగా మహిళల కోసమే మొదలుపెట్టిన శీర్షిక అయినా పురుషులు కూడా పోటీపడి ప్రశ్నలు అడిగేవారు. మాలతి గారు భయపడుతూ భయపడుతూనే ఈ శీర్షిక మొదలుపెట్టారంట.
అప్పట్లో మద్రాసు వెళ్ళే తెలుగు వారు సినిమా నటులతో పాటు మాలతీ చందూర్ గారిని కూడా చూడటానికి ఉవ్విళ్లూరేవారట.. తెలుగు పాఠకలోకంలో అంతగా ప్రసిద్దులు ఆవిడ.
ఆమె పేరులో చందూర్ చూసి నాకు ఆసక్తిగా ఉండేది ఆ పేరు పట్ల. తరువాత తెలిసింది ఆమె భర్త పేరు నాగేశ్వరరావు చందూరి అని ఆయన ఎన్.ఆర్. చందూర్ గా ప్రసిద్దులని.
సాహిత్యరంగంలోనే కాదు పాకశాస్త్రం లో కూడా ఆమె మంచి నిపుణురాలు. ఆమె వ్రాసిన వంటలు, పిండి వంటలు పుస్తకం అప్పట్లో ఆడపిల్లలకి ఇచ్చే సారెలో ఒక ముఖ్య వస్తువుగా ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో 1974 లో మొదట ముద్రణ అయిన ఈ పుస్తకం ఇప్పటికి 30 ముద్రణలు పూర్తి చేసుకుంది.
వంటలన్నీ ఖచ్చితమైన కొలతలతో బహు సరళంగా చెప్పటం వలన కొత్తగా వంటలతో ప్రయోగం చేసేవాళ్ళకి చాలా ఉపయోగంగా ఉండేది ఈ పుస్తకం. ఇందులో వంటకం చేసే పద్దతే కాదు ..ఆ వంటకంలో వాడే ప్రతి పదార్థం గురించి..దాని ఆరోగ్య ఉపయోగాల గురించి వివరంగా చెప్పారు.
తర్వాత కాలంలో స్వాతి వారపత్రికలో "నన్ను అడగండి" కాలం నిర్వహించారు. వెనకటి పాఠకులకంటే ఇప్పటి పాఠకులు తెలివి మీరిపోయారు కదా, అందుకో మరి ఏ కారణంతో అయినా కానీ ప్రమదావనం ఆకటుకున్నట్లు ఇది ఆకట్టుకోలేదు పాఠకుల్ని. కాస్త విమర్శలు కూడా వచ్చాయి. ఈ కాలం ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది.
ఆమె వ్రాసిన మొదటి కథ "రవ్వల దుద్దులు"...ఆంధ్రవాణిలో వచ్చిందట. 25 కి పైగా నవలలు, పలు కథలు, వ్యాసాలు వ్రాసారు. ఆమె వ్రాసిన నవలల్లో శిశిర వసంతం, ఆలోచించు, భూమిపుత్రి, హృదయనేత్రి, కలల వెలుగు, మనసులోని మనసు, ఏమిటీ జీవితాలు ప్రాచుర్యం పొందాయి.
ఆవిడ రచనలు గుజరాతీ, తమిళం, కన్నడ, హిందీ లాంటి ఇతర భారతీయ భాషలలోకి అనువాదం చెయ్యబడ్డాయి. కొన్ని ప్రసిద్ద తమిళ రచనలని ఆమె తెలుగులోకి అనువదించారు.
ఆ మధ్య రేడియో తరంగ వారు మాలతీచందూర్ గారితో చేసిన ముఖాముఖీ ఈ కింది లింకులో వినవచ్చు.
http://telugu.tharangamedia.com/specail-show-with-malathi-chandur/
తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం మాలతి గారి లాంటి సాహితీవేత్తలకి మరణం ఉండదు.
6 వ్యాఖ్యలు:
సమగ్ర పరిచయం . సాహితీ రంగానికి సంబందించి ఆమె తెలుగువారందరికీ ఆప్తురాలు. ఆమె రచనలలో ఆమె జీవించే ఉంటారన్నది అక్షర సత్యం.
nijamendi anthadi goppa manishi chani pothu kuda thana dehanni medical test la kosam icharante chala goppa ga anipinchindi...
మాలతీచందూర్ గారు వివిధ పుస్తకాల పువ్వుల నుంచి సమాచారపుప్పొడిని ప్రోది చేసే తేనెటీగ!
మాలతీచందూర్ గారి సమాధానాలు సూదితో గుచ్చినట్లుంటాయి... ఎమైన అంటే ఇంజక్షన్ చెస్తేనేకదా రోగం తొందరగా తగ్గుతుంది అంటారు... ఎమైన అవి ఆవిడకి మాత్రమే సాధ్యమైన సమాధానాలు..
sarigamalu vinnanta sravyamgaa undi.
http://www.googlefacebook.info/
మాలతి గారి పూర్తి భావాన్ని అందించారు...ధన్యవాదాలు... తెలుగోడు.
Post a Comment