ఎమ్ సెట్ కౌన్సిలింగుకి ఉద్యమ సెగ
ఓ రెండు సంవత్సరాలనుండి రాష్ట్రంలో విద్యార్థులకి కాస్త ఉద్యమ సెగ తగ్గి ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సెగ మొదలయ్యింది.
ఈ రోజు నుండి ఎమ్‍సెట్ కౌన్సిలింగ్ మొదలు కాబోతుంది. సీమాంధ్రలో ఉద్యమాలు ఉవ్వెత్తున జరుగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సిలింగు సజావుగా సాగుతుందా అన్నది పిల్లల మరియు తల్లిదండ్రుల ఆందోళన. ఇప్పటికే మన రాష్ట్రంలో కౌన్సిలింగ్ ఆలస్యం అయింది. కోర్టు అక్షింతలతో ఇప్పుడు మొదలుపెట్టారు. దాదాపు అన్ని రాష్ట్రాలలో ఇప్పటికే అడ్మిషన్సు అయిపోయి క్లాసులు కూడా మొదలయ్యాయి.
ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో కౌన్సిలింగు ఇలా ఆలస్యంగా జరగటం మామూలే. ఎప్పటికప్పుడు కౌన్సిలింగు ఈ సంవత్సరం సకాలంలో పూర్తి చేసి ఆగస్టుకల్లా క్లాసులు మొదలుపెడతాం అని హామీలయితే ఇస్తారు కానీ ఏ సంవత్సరమూ సరిగా సమయానికి కౌన్సిలింగు జరిగిన దాఖలాలు లేవు. కర్ణుడి చావుకి వెయ్యి కారణాల లా కౌన్సిలింగు ఆలస్యం అవటానికి కూడా బోలెడన్ని కారణాలు.
తెలంగాణాలో ఉద్యమం ఉదృతంగా ఉన్న రోజుల్లో కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. తెరాసా నాయకుడు ఉండి ఉండీ సరిగ్గా పరీక్షల ముందు ఏదో ఒక అలజడి రేపేవాళ్ళు..వాళ్ళ ఆందోళనల మూలాన పరీక్షలు వాయిదా పడ్డ సందర్భాలు ..అసలు రద్దు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఉద్యమాలు ఏవైనా కానీ ఇలాంటి వాటికి అడ్డంకి గా మారకూడదు. పిల్లలని..స్కూల్సుని..కాలేజీలని ఇలాంటివాటికి దూరంగా పెట్టాలి. ఉద్యమాల మీదే బ్రతికేసే విద్యార్థి నాయకులున్న మన రాష్ట్రంలో కాలేజీ విద్యార్థులని దూరంగా పెట్టమంటే విద్యార్థి నాయకులే ఊరుకోరు. కనీసం స్కూలు విద్యార్థులని..కౌన్సిలింగు ప్రక్రియ లాంటి వాటిని అయినా ఈ ఉద్యమాలకి దూరంగా పెట్టాలి.
ఎమ్‍సెట్ కౌన్సిలింగు ఏ ఆటంకాలూ లేకుండా జరగాలని కోరుకుందాం.
0 వ్యాఖ్యలు:
Post a Comment