మేమూ-మా ట్రెక్కింగ్-మున్నార్
కేరళ...God’s own country..నిజమే..అద్భుతమైన ప్రకృతి సోయగాలు కేరళ సొత్తు.
కేరళ వెళ్ళిన వాళ్ళు సామాన్యంగా మున్నార్ వెళ్ళకుండా ఉండరు. మున్నార్ ట్రెక్కింగ్ కి మంచి అనువైన ప్రదేశం. కొండలు..లోయలు ఉంటే ఎక్కడైనా ట్రెక్కింగ్ కి అనుకూలమే అనుకోండి...కానీ మున్నార్ లో అది ఇంకా అద్భుతంగా ఉంటుంది.
ఒకానొక వేసవిలో మేము కేరళ పర్యటనకి వెళ్ళాము. త్రివేండ్రం..కన్యాకుమారి, కొల్లం, అలెప్పీ చూసుకుని మున్నార్ చేరాం. అక్కడ సైట్ సీయింగ్ కి ఓ ఆటో అతన్ని మాట్లాడుకున్నాం. డ్రైవర్.. గైడ్ ..అన్నీ అతనే అన్నమాట! అక్కడ డాం లు..టీ తోటలు..అన్నీ చక్కగా చూపెట్టాడు. మున్నార్ టీ తోటలు..జలపాతాలు..డ్యాంలు..ఆ కొండలు..మబ్బులు..అప్పుడప్పుడు చిరుజల్లులు...చూసి అనుభవించాలే కానీ వర్ణించలేము. అప్పుడే పీకిన తాజా కారెట్లు..అలా చూస్తేనే తినబుద్దవుతుంది.
మా అబ్బాయి చిన్నప్పటినుండి ఎక్కడైనా కొంచం కొండలు..గుట్టలు ఉంటే చాలు ఎక్కేస్తా..ఎక్కేస్తా అంటూ ఉండేవాడు. అలాగే మున్నార్ లో కూడా కొండలెక్కుదాం..ట్రెక్కింగ్ కి వెళదాం అంటూ మొదలుపెట్టాడు. మా అమ్మాయి కూడా వంత పాడింది. సరే ఇప్పటి వరకు ఎప్పుడూ ట్రెక్కింగ్ చెయ్యలేదు చేద్దాం అని నేనూ సై అన్నాను.
అక్కడ ఓ రెండు మూడు ట్రెక్కింగ్ కాంప్ ల వాళ్ళ దగ్గరకి వెళితే..రెండేమో మూసేసి ఉన్నాయి..ఒకళ్ళేమో కనీసం ఓ పదిమంది ఉంటే కానీ ట్రిప్ వెయ్యం..అదీ కాక ఈ రోజు ఉదయమే ఓ గుంపు వెళ్ళింది..ఇక రేపు..ఎల్లుండి వెయ్యం అన్నాడు.
మేము ఇలా ట్రెక్కింగ్ కాంప్ ల చుట్టూ తిరగటం చూసిన ఆటో డ్రైవర్.. సార్..మీరు ట్రెక్కింగ్ కి వెళ్ళాలంటే నేను తీసుకెళతాను..చాలా మంది ఫారినర్సుని తీసుకెళుతూ ఉంటాను. ఇక్కడ కొండలన్నీ నాకు కొట్టిన పిండి అని ఊరించాడు. అందరం ఉత్సాహంగా సరే అంటే సరే అనుకుని అయితే రేపు ఉదయాన్నే ట్రెక్కింగ్ కి వెళదాం అని మరుసటి రోజుకి ప్లాన్ చేసాం.
మరుసటి రోజు చెప్పినట్టు ఆరుగంటలకల్లా అతను వచ్చాడు. కొంచం దూరంలో ఓ కొండ ఉందండి..అక్కడనుండి మన ట్రెక్కింగ్ మొదలవుతుంది..అక్కడ దాకా ఆటోలో తీసుకెళతాను. కొండ ఎక్కటానికి ఓ రెండు గంటలు..దిగటానికి ఓ రెండు గంటలు..మీరు నెమ్మదిగా నడిచినా మొత్తం ఐదు గంటలకన్నా పట్టదు అని చెప్పాడు.
మధ్యలో ఓ హోటల్ దగ్గర ఆపి టిఫిన్ పార్సిల్ చేయించుకెళితే మధ్యలో తినొచ్చండి అని సలహా ఇస్తే సరే అని దిట్టంగా టిఫిన్ పార్సిల్ చేయించాం.
ఊరినుండి ఓ ఐదారు కిలోమీటర్లు వెళ్ళాక ఆటో ఓ కొండ పాదం దగ్గర ఆపి..ఈ కొండేనండి మనం ఎక్కేది అని చూపెట్టాడు. కొండ ఏటవాలుగా పచ్చ పచ్చగా చూడటానికి భలే ఉంది.
సరే ఇక నడక మొదలెడదాం అని మా వంక తేరిపార చూసి అదేంటండి షూస్ లేకుండా ట్రెక్కింగ్ కి వచ్చారు అని ఎర్ర బస్సు వాళ్ళని చూసినట్టు చూసాడు. అసలు ట్రెక్కింగ్ ప్లానే లేదయ్యా మాకు..షూసు..సాండల్సు ఇన్ని రకాలంటే లగేజీ ఎక్కువవుతుందని షూ అసలు ఎవరమూ పెట్టుకోలేదు.
మామూలుగా ట్రెక్కింగ్ అంటే బాక్ పాక్..చేతిలో కర్ర..షూస్ లాంటివి ఉండాలి కదా..మేము ఇవేమీ లేకుండా బయలుదేరాం. నేనయితే చీరలో మరీ ట్రెక్కింగ్ కి బయలుదేరా. ఈ టపా అంతా చదివాక చీరతో ట్రెక్కింగ్ చేసిన వీరవనిత అని మీరంతా నాకు బిరుదు కూడా ఇస్తారు :)
వర్షం వస్తేనే కాస్త కష్టం కానీ ..లేకపోతే మరీ అంత ఇబ్బంది ఏమీ ఉండదులేండి....షూ లేకపోయినా ఎక్కేయవచ్చు లేండి అని మా గైడ్ భరోసా ఇవ్వటంతోటి మా ట్రెక్కింగ్ మొదలయింది. తనే నడిచేటప్పుడు సపోర్టు ఉంటే బాగా నడవచ్చు అని అందరికి తలో చేతి కర్ర ఇచ్చాడు.
ఆడుతు పాడుతు ఎక్కేస్తుంటే అలుపూ సొలుపూ ఏముంది అనుకుంటూ హుషారుగా ఎక్కేస్తున్నాం. ట్రెక్కింగ్ మొదలెట్టిన ఓ పది నిమిషాలకే మా అబ్బాయి చమట పోస్తుందంటూ పై షర్టు (పొద్దుట బయలుదేరినప్పుడు బాగా మబ్బులు పట్టి చలిగాలిగా ఉంది..వాడికి చలి గాలి పడదు..అందుకని షర్టు మీద షర్టు..మంకీ కాప్ అన్నీ బలవంతాన తొడిగిచ్చాం) తీసేసి వాళ్ళ నాన్నకి ఇచ్చాడు. ఈయన అది భుజం మీద వేసుకుని ఈల వేసుకుంటూ ఎక్కుతుంటే రివ్వుమని కొండగాలి షర్టుని ఎగరేసుకుపోయింది. అసలు ఎటు పోయిందో కూడా కనపడలేదు. కొత్త షర్టు..ప్చ్! ఇప్పటికీ నా కళ్లల్లో మెదులుతూ ఉంటుంది ఆ షర్టు!
వాలు మీదకి ఎక్కటం మూలాన త్వరగా అలసిపోతున్నా ఉత్సాహంగా ఉంది. మా గైడ్ తనతో పాటు మంచినీళ్లు తెచ్చాడు. అవి జీలకర్ర వేసి కాచిన నీళ్ళు. మధ్య మధ్య ఇవి తాగితే అలుపు రాదు..దప్పిక దరిచేరదు..అందుకని మేము ఇవి ఎప్పుడూ వెంటపెట్టుకుని తిరుగుతాము ..మీరు కూడా తాగండి అని మధ్య మధ్య ఇచ్చేవాడు. భలే రుచి గా ఉన్నాయి ఆ నీళ్లు.
కొంచం దూరం నడిచాక తెచ్చుకున్న పలహారాలు తిని..కాసేపు సేద తీరి మరలా మొదలెట్టాం మా ట్రెక్కింగ్! పైకి వెళ్ళేకొద్దీ అప్పుడప్పుడు వచ్చి మన చెంపలు నిమిరి వెళ్లే మబ్బులు...కురవమంటారా ..కురవమంటారా అని కవ్విస్తున్నట్టు ఉంటాయి. ఆ మబ్బుల్లో కొంచం పదడుగులు ముందు ఉన్నవాళ్ళు కూడా కనపడరు ఒక్కోసారి. అక్కడక్కడ గడ్డి దుబ్బులు..పచ్చగా నున్నగా జారిపోతూ ఉండేవి. అవి ఉన్న దగ్గర మాత్రం కాస్త జాగ్రత్తగా ఎక్కాల్సి వచ్చేది..ఇక్కడ కర్ర బాగా ఉపయోగపడింది.
మధ్య మధ్య ఫోటోలు తీసుకుంటూ కొండ పైకి సునాయసంగానే చేరాం. ఓ రెండు గంటల్లో పైకి వెళ్ళిపోయాము. ఎవరెస్టు అధిరోహించినంత సంబరపడి ఇక కిందకి దిగటం ఏముంది తేలికే కదా త్వరగానే వెళ్ళిపోవచ్చు అనుకుని కాసేపు అక్కడే చతికిల పడ్డాం.
మేమెక్కిన కొండ పక్కనే ఇంకో కొండ..ఈ కొండకి...ఆ కొండకి దారి కూడా ఉంది. మా గైడ్ ఆ కొండ చూపెట్టి దిగేటప్పుడు ఆ కొండ మీదనుండి దిగుతామండి అని ఓ సన్నని దారి గుండా ఆ కొండ పైకి తీసుకెళ్ళాడు. అక్కడినుండి హుషారుగా కిందకి దిగటం మొదలుపెట్టాం. కొంచం దూరం దిగాక కొండ మరీ స్లోపుగా ఉండి ఒక అడుగు వేస్తే నాలుగు అడుగులు జర్రున కిందకి జారిపోతుంది. ఉన్న కొద్దీ దిగటం చాల కష్టమైపోయింది. ఒకళ్ళ చేతులు ఒకళ్ళం పట్టుకుని మెల్లగా దిగటం మొదలుపెట్టాం. కింద కిందకి వెళ్ళే కొద్దీ చిన్న చిన్న రాళ్ళు..బాగా కొనతేలి కొన్ని..నున్నగా కొన్ని...అడుగు వేస్తే వెళ్ళి కిందపడతామేమో అన్నంతగా జారిపోతున్నాయి. అందులోనూ అవి లూజుగా ఉండి కిందకి దొర్లిపోతున్నాయి. ఒక్కోచోట అయితే ఇక అసలు ముందుకెళ్ళలేం అనిపించింది. ఉత్సాహం కాస్తా భయం లోకి మారింది.
మాతో పాటు మా అక్క వాళ్ళ బాబు కూడా ఉన్నాడు. తను అయితే చివరి చివరికి అసలు నడవలేకపోయాడు. కాసేపు మా గైడు తనని పట్టుకుని నడిపించాడు కూడా. అలా నడుస్తూనే ఉన్నాం. ఎంతసేపటికీ కింద రోడ్డు కనపడటం లేదు. మా గైడేమో ఇంకెంతండి..ఇంకొక్క పదినిమిషాలండి..వచ్చేసాం..వచ్చేసాం అని చెప్తూనే ఉన్నాడు. గంట..రెండు..మూడు గంటలు అలా నడుస్తూనే ఉన్నాం.. ఇంకాస్త ముందుకి వెళ్ళాక తను కూడా దిక్కులు చూట్టం మొదలెట్టాడు. అలా కాసేపు అన్ని దిక్కులూ చూసి చూసి దారి తప్పాం అనుకుంటానండి..ఈ దారి ఎప్పుడు చూడలేదు నేను కూడా అని చావు కబురు చల్లగా చెప్పాడు.
తెచ్చుకున్న మంచినీళ్ళు అయిపోయాయి. ముందు దారేమో భయంకరం..పోనీ వెనక్కి వెళదామా అంటే వెనక్కి కొండ పైకి అసలు ఎక్కలేని పరిస్థితి. ఆ జారే రాళ్ళ మీద అది అసలు అయ్యే పని కాదనిపించింది. సరే ముందుకే వెళితే ఎక్కడో అక్కడికి చేరుకుంటాం కదా అని అలానే పళ్ళబిగువున నడక సాగించాం. అందరికీ ఒంట్లో శక్తి హరించుకుపోయింది. మాట రావటం లేదు. అసలు మాట్లాడే పరిస్థితే లేదు. కింద రాళ్ళు..రప్పలు చూసుకుంటూ ఒకరినొకరం పట్టుకుని మెల్లగా నడుస్తూ..నడుస్తూ...చివరికి ఓ టీ ఎస్టేటులోకి తేలాం. పాపం మా గైడు కూడా అలాంటి దారి ఊహించలేదు.
ఆ టీ ఎస్టేట్ ఏమో చాలా పెద్దది. దాంట్లో నుండి బయట రోడ్డు మీదకి పడటానికి బోలెడంత నడవాల్సి వచ్చింది. చివరకి ఎలాగో ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్డెక్కాం. అదేమో మున్నార్ కి బాగా దూరం.
మేము బయటకి వచ్చిన దగ్గర ఊరు కూడా ఏమీ లేదు. అప్పుడొకటి..ఇప్పుడొకటి జనాల్ని కుక్కేసుకుని జీపులే తిరుగుతున్నాయి అటూ ఇటూ. అది కూడా పర్యాటకులు కాదు..పొలం పనులకి అటూ ఇటూ తిరిగేవాళ్ళు. వాళ్ళ చేతుల్లో కొడవళ్ళు..కర్రలు..బుట్టలు..పారలు తోటి కిక్కిరిసిపోయి ఉండేవి జీపులు. మా గైడ్ ఏమో తన ఫ్రెండుకి మేము ఎక్కడయితే ట్రెక్కింగ్ మొదలుపెట్టామో అక్కడికి ఆటోతో వచ్చి ఉండమని చెప్పి వచ్చాడు. మేమేమో ఇంకో దారిన బయటపడ్డాం. అక్కడికి తన ఫ్రెండుకి ఫోను చేసి రమ్మన్నా రావటానికి గంట పడుతుందన్నాడు. ఆ దారిన బస్సులు కూడా ఉండవట. జీపులో వెళ్ళాల్సిందేనండి అన్నాడు.
ఒక్క జీపు కూడా కాస్త ఖాళీది రావటం లేదు. చూడగా చూడగా కాసేపటకి ఓ జీపు ఓ మనిషి పట్టే ఖాళీతో వచ్చింది. అదే మహాభాగ్యం అనుకుని ఐదుగురం దాంట్లో ఎక్కేసాం. ఎలాగో రూముకి వచ్చి పడ్డాం. కాందిశీకుల్లాగా తయారయ్యాం రూముకి వచ్చేటప్పటికి. నాలుగు రోజులు కాళ్ళ నెప్పులు తగ్గలేదు. మా అక్క వాళ్ళ అబ్బాయికయితే కాలు వాచిపోయి ఓ వారం రోజులు ఇబ్బంది పడ్డాడు.
మున్నార్ మా టూరులో దాదాపు చివరి పాయింట్ కాబట్టి సరిపోయింది. అదే టూరు మొదట్లోనే ఇలా జరిగి ఉంటే మధ్యలోనే ఇంటికి వచ్చేయాల్సి వచ్చేది!
నేనయితే ఇక జీవితంలో మళ్ళీ ట్రెక్కింగ్ చెయ్యకూడదనుకున్నా!
అలా అని ఊరుకోలేదండోయ్ మళ్లీ ముదుమలై అడవుల్లో పులి అడుగుజాడల్లో పులిని వేటాడుతూ మరో ట్రెక్కింగ్ చేసాం. దాని గురించి మరో టపాలో!
19 వ్యాఖ్యలు:
హహహ బాగున్నాయండీ మీ ట్రెక్కింగ్ అనుభవాలు ఎంతైనా మీకు ధైర్యమెక్కువే :)
ఇలాంటిది కర్ణాటకలో మాకొక అనుభవం ఎదురయింది. మాకు కొండ సమస్య కాలేదు కానీ అడవి సమస్య అయింది.
అన్నట్టు ఆ నాలుగవ ఫోటో లో వారిని ఎక్కడో చూసినట్టుంది.
ఎడ్వెంచరస్!
మీ కెక్కడిదండీ ఇంత ధైర్యం. మేమూ వెళ్ళాము కాని...నో ట్రెక్కింగ్:) మీ అనుభవాలు మాత్రం మార్వలెస్.
@ వేణూ..:)
@ రవి గారూ మీరు అడవిలో తప్పిపోయారా? ఆ ఫోటోలో ఉన్నది బ్లాగరు చదువరి..మా వారు. బ్లాగుల్లోనో..బ్లాగర్ల సమావేశం లోనో చూసుంటారు.
@కిషోర్ గారూ..థాంక్సండి.
@జయ గారూ..ఈ ధైర్యం మూలాన అప్పుడప్పుడు చివాట్లు కూడా తింటుంటానండి. Thank you.
సరిగమలు గారు : ఫుటో విషయం తెలుసండి. కావాలనే అడిగాను. :))
అవును. మేము అడవి పక్కన నిట్టూరు అనే కుగ్రామంలో ఇరుక్కున్నాము. నాకు భయం కాలేదు కానీ, మా కజిన్స్ ఇద్దరూ కాస్త భయపడ్డారు. అయితే జీపు దొరికింది. జీపు దొరికిన తర్వాత కూడా ఘాట్ రోడ్డులో గంటన్నర చీకట్లో, లైట్లు లేని సన్నని రోడ్డులో ప్రయాణం. ఎలానో బయటపడ్డామనుకోండి.
bagundi... ilativi chepthe maakkodaa vellipovalanipisthundi
మేమూ గత సంవత్సరం వెళ్ళాం కాని ట్రెక్కింగ్ సాహసం చేయలేదు!అందరికీ మీ అంత ధైర్యం ఉంటుందా!మీరు దారితప్పి బతుకు జీవుడా అంటూ చివరికి రోడ్డున పడడం మలుపుమలుపుల కథ చదువుతున్నంత ఉత్కంటను రేపింది!బ్రేవో!
@ రవి గారూ అనుకున్నానండి మీరు కావాలనే అడుగుతున్నారని..కాకపోతే మీ ప్రొఫైల్ ని దాచేసినట్టున్నారుగా అందుకని కాస్త అనుమానం వచ్చింది..వేరే వారేమోనని.
@ నరేష్ గారూ వెళ్ళండి..వెళ్ళండి.
@ సూర్యప్రకాష్ గారూ సరైన ప్లానింగ్ తో కొంచం ఎక్కువ మందితో కలిసి వెళితే ట్రెక్కింగ్ లో భయపడాల్సింది ఏమీ ఉండదండి.
బావుంది బావుంది.. ట్రెక్కింగ్ అనుభవాలు.. ఎక్కేటప్పుడు ఉత్సాహంలో ఎక్కేస్తాం, దిగేటప్పుడే అనిపిస్తుంది ఇంకా ఎంత దూరం అని.. :P
నేనూ కూర్గ్‌కి వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్లో చెప్పుల్లో ఉన్నదాన్ని నేను ఒక్కదాన్నే.. ఎక్కేటప్పుడు ఫర్లేదు కానీ, దిగేటప్పుడు మాత్రం ఎక్కడోకక్కడ పడడం ఖాయమనుకున్నా, లక్కీగా సేఫ్‌గా తిరిగివచ్చా :)
మీరు అసలు సూపర్.. ఏకంగా, కొండ, ఎస్టేట్ అన్నీ చుట్టి వచ్చారు :)
ఇలాంటివన్నీ మర్చిపోలేని అనుభవాలు. అనుభవించేటప్పుడు కష్టంగా అనిపించినా తర్వాత తల్చుకున్నప్పుడు ఆనందంగా అనిపించి, నలుగురితో పంచుకోవాలనిపిస్తుంది. బాగుంది మీ ట్రెక్కింగ్ అనుభవం.
భలే ఉందండీ, మీ ట్రెక్కింగ్ అనుభవం! మొత్తానికి చీరలోనే అంత దూరం ఎక్కి దిగేశారన్న మాట! నిజంగా మీరు వీరవనితే!!
చెప్తే వింతగా చూస్తారేమో కానీ నాకలా తప్పిపోవడం చాలా ఇష్టమండీ.. అదీ, అలాంటి ప్రకృతిలో అయితే మరీను.. అఫ్కోర్స్, ఒక రెండుమూడు గంటల కంటే ఎక్కువ తప్పిపోకూడదు మళ్ళీ! :))
ఎక్కేటపుడు బాగానే ఎక్కింగు
దిగేటపుడు జారింగు, దొర్లింగు, పొర్లింగు
దిగాక నిట్టూర్చింగు
హోటలుకొచ్చాక ముక్కింగు, మూలిగింగు
-వెరసి మూనారు ట్రెక్కింగు
రవీ.. :)
@ మేధ...మరే ఎక్కడా పడకుండా తిరిగొచ్చా:)
@ శ్రీలలిత గారూ...నిజమేనండి భలే మరచిపోలేని అనుభవాలు...ఇప్పుడు తలుచుకుంటే అసలు ఎలా దిగి వచ్చామా అనిపిస్తుంది.
@ నిషీ.తప్పిపోవటం ఇష్టమా...భలే ఉంది నీ కోరిక. ఒకసారి మీ ప్లోరిడా బీచుల్లో కాసేపు తప్పిపోయి చూడరాదూ:)
మీరు బ్లాగ్ వేదికలో మీ బ్లాగును అనుసంధానం చేసినందుకు కృతజ్ఞతలు అందిస్తున్నాము.బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.గమనించగలరు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.
క్రింది లింక్ ను చూడండి. http://blogsvedika.blogspot.in/p/blog-page.html
చీరతో ట్రెక్కింగ్ చేసిన వీరవనిత గారు మీ ట్రెక్కింగ్ అనుభవాన్ని అద్భుతంగా రాసారు.:) మీరు రాసిన విధానం చాలా బాగుందండీ.
అమ్మయ్య క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారు అంతే చాలు. మీరు ఎక్కుతున్నంత సేపూ నేను ఖంగారు పడుతూనే ఉన్నా..
చదువరి గారి కవిత సూపరంటే సూపరు!
Post a Comment