అచ్చు పుస్తకం VS e-పుస్తకం
హైస్కూలులో ఉండగా పక్క ఊరి లైబ్రరీ నుండి మా అమ్మకి..అక్కకి నవల్సు తెచ్చిపెట్టేవాళ్ళం. కొత్త నవలలు, కొన్ని ప్రసిద్ద నవలలు అంత తొందరగా దొరికేవి కావు. ఎప్పుడు వచ్చేవో..ఎవరు తీసుకెళ్ళేవాళ్లో అసలు లైబ్రరీ లో కనపడేవి కావు. మొత్తానికి ఎప్పటికో దొరికేవి. మా నాన్న వారపత్రికల్లో..మాసపత్రికల్లో వచ్చిన సీరియల్సు అన్నీ తీసి బైండ్ చేసేవాళ్ళు. ఇప్పటికీ బోలెడున్నాయి అలా బైండ్ చేసిన అనాటి సీరియల్సు.
హాస్టల్ లో ఉండగా ఎవరైనా కొత్త నవల తెస్తే వాళ్ళు చదవటం అయ్యాక నాకంటే నాకు అని వంతులు వేసుకునే వాళ్ళం. అది చదివే దాకా నిద్ర పట్టేది కాదు. క్లాసులో డెస్కు కింద పుస్తకం పెట్టుకుని తలవంచుకుని ఏదో సీరియస్సుగా చదువుతున్నట్లు నవల్సు చదివిన రోజులు కూడా ఉన్నాయి.
మా కజిన్ వాళ్ళకి పుస్తకాలు అద్దెకిచ్చే షాపు ఉండేది. ఆ షాపు పుణ్యమా అని వచ్చిన పుస్తకం వచ్చినట్లు చదివే వాళ్ళం. విశాలాంధ్రలు..నవోదయల గురించి మాకసలు చాలా రోజులు తెలియనే తెలియదు.
ఏమైపోయాయో ఆ లైబ్రరీలు.. ఆ పుస్తకాల షాపులు..ఆ సీరియల్సు బైండింగులు!
కాలంతో పాటు మనమూ మారటంలేదూ..అలాగే పుస్తకాల లభ్యత కూడా మారిపోతుంది.
ఎక్కడో అదృశ్యంగా ఉండి పుస్తకాలు అమ్మే అంగళ్ళు వచ్చేసాయి. ఇలా ఓ క్లిక్ కిక్కి కొనుక్కోవటం..అలా ఓ నాలుగు రోజుల్లో మన చేతిలో పుస్తకం వాలిపోవటం.
ఇప్పుడయితే ఆ నాలుగు రోజులు కూడా అక్కర్లేదు. ఓ క్లిక్ తో క్షణాల్లో మన కళ్లముందుకి సరికొత్త పుస్తకం వచ్చేస్తుంది. అప్పటికప్పుడే చదివేసుకోవచ్చు. వేలి కొనతో అక్షరాలని మనకు కావల్సిన సైజులోకి మార్చుకోవచ్చు. షాపుల్లోకన్నా ముందు మన దగ్గరికి వచ్చేస్తున్నాయి పుస్తకాలు.
ఈ మధ్య ఫేస్ బుక్ లో కథావార్షిక-12 విశాలాంధ్రలో దొరకటం లేదని కొంతమంది మితృలు విచారం వెళ్ళబుచ్చారు. e-పుస్తకంగా మాత్రం అప్పటికే చాలా మంది చదివారు.
ఏనాడైనా కలగన్నామా ఇలా e-పుస్తకాలు వస్తాయి అని?
ఎవరినీ ఏ పుస్తకమూ అడగక్కర్లేదని
వాటి కోసం ఏ లైబ్రరీకీ వెళ్ళక్కర్లేదని
ఏ పుస్తకాల షాపు వాడినీ బ్రతిమాలుకోవక్కర్లేదని
కావల్సిన పుస్తకం కోసం ఎక్కడో మూల మూలల దుమ్ములో వెతుక్కోవక్కర్లేదు అని
ఎవరో చదివి ఇచ్చేదాకా వేచి ఉండక్కర్లేదు అని
వందల పుస్తకాలు ఓ బుల్లి టాబ్లెట్ లో దాచేసుకోవచ్చని
అసలేనాడైనా కలగన్నామా!
పుస్తకాలు పాడవుతాయన్న భీతి లేదు
ఎవరన్నా తీసికెళతారన్న భయం లేదు
తీసుకెళ్ళిన వాళ్ళు తిరిగి ఇవ్వరేమో అన్న సంకోచమూ లేదు
అడిగిన వారికి ఇద్దామా వద్దా అన్న సందిగ్థత అసలే లేదు!
మన తర్వాత వీటన్నిటినీ ఏం చెయ్యాలా అన్న బెంగా లేదు!
ఓ క్లిక్కుతో కొనుక్కున్నట్టే ఓ క్లిక్కుతో తీసిపడేయావచ్చు!!
ఎక్కడికంటే అక్కడికి ఎన్నంటే అన్ని పుస్తకాలు మోసుకెళ్ళవచ్చు!
అంతా డిజిటల్ మయం అవుతున్న ఈ కాలంలో పుస్తకాలు మాత్రం ఎందుకు కాకూడదు!!
నిజమే..అన్నీ బాగానే ఉన్నాయి...కానీ..
అచ్చు పుస్తకం చదివితే వచ్చే తృప్తి ఓ e-పుస్తకం చదివితే వస్తుందా?
కొత్త పుస్తకం వాసన కానీ
అందరి చేతుల్లో పడి నలిగిన పాత వాసన కానీ
మొదటి పేజీలోనో..రెండో పేజీలోనే ఉండే నానా విధాల హస్తాక్షరాలు
మనకు పుస్తకం ఇచ్చినవాళ్లవో..రచయితవో ఆత్మీయ అక్షరాలూ
నలిగిన పేజీలు..మాయమైన పేజీలు
మడతలు పడిన మూలలు..అండర్ లైన్ చేసిన వాక్యాలు
వీటన్నిటినీ మిస్ అవటం లేదూ!
ఓ వర్షాకాలం సాయంత్రం
వర్షం వెలిసాక
అప్పుడప్పుడే చెల్లా చెదురవుతున్న మబ్బుల సాక్షిగా
ఎవరూ లేని ఏకాంతంలో
ఆరుబయట
ఓ వాలు కుర్చీలో కూర్చుని
ఏ వెన్నెల్లో ఆడపిల్లో..ఏ ప్రళయ కావేరి కథలో
చదువుకుంటూ
మధ్య మధ్యలో పుస్తకాన్ని గుండెల మీద పెట్టుకుని
మనసారా హత్తుకుని
అక్షరాలని అలా ఓ సారి సుతిమెత్తగా తడిమి చూసుకుని
చదువుకునే అనుభూతికి దూరమయి మరీ చదువు కొంటున్నాము!
ఏమో కొద్ది రోజుల్లో అసలు అచ్చు పుస్తకాలే లేకుండా పోతాయేమో!
అమ్మే వాళ్లకి కూడా e-పుస్తకాలే లాభం అట.
అమెరికాలో లెక్కలు ఇవి..... |
ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు
పుస్తకాలు పేర్చి పెట్టక్కర్లేదు...భద్రపరచక్కరలేదు... వెతకక్కర్లేదు
తక్కువ ఖర్చు-ఎక్కువ రాబడి..ఇదే కదా వ్యాపారానికి ముఖ్యం!
రచయితలకి కూడా చాలా సౌలభ్యం e-పుస్తకం
పబ్లిషర్ల చుట్టూ తిరగక్కరలేదు, తామే అచ్చేసుకోవచ్చు
ప్రింట్ చేసినవన్నీ అమ్ముడు పోవేమో అన్న బెంగ ఉండదు
పబ్లిష్ చేసిన మరు నిమిషంలో పాఠకులని చేరిపోవచ్చు
ఏమైనా మార్పులు-చేర్పులు ఊంటే నిమిషాల్లో చేసేయవచ్చు
మార్పులతో మళ్ళీ మొత్తం పుస్తకం ప్రింట్ చెయ్యాలన్న బాదరబందీ లేదు.
ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి 150 e-పుస్తకాలకి 100 అచ్చు పుస్తకాలు అమ్ముడవుతున్నాయట. ముఖ్యంగా యువతరానికి e-పుస్తకాల మీదే ఎక్కువ మక్కువ అట.
2007 లో kindle విడుదలయింది. విడుదలయిన నాలుగు సంవత్సరాలలోనే అమెజాన్ లో e-పుస్తకాల అమ్మకం ప్రింట్ పుస్తకాల అమ్మకాలని మించి పోయింది.
తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే e-పుస్తకాల అమ్మకం మొదలయింది. ఆంధ్రదేశానికి దూరంగా ఉండటం..షాపుల్లో పుస్తకాలు సరిగ్గా దొరకపోవటం..దూరాభారం..తెలుగు పాఠకుల్ని e-పుస్తకాల వైపుకి మళ్ళేలా చేస్తున్నాయి.
Books are not broken, but our hearts do...
****************************************************
గత కొద్దిరోజులుగా e-పుస్తకాలు విపరీతంగా చదువుతున్న ఫలితం ఈ టపా. తెలుగు e-పుస్తకాలతో నా అనుభవాలు-అనుభూతులు మరో టపాలో!
14 వ్యాఖ్యలు:
చిన్నప్పుడు లైబ్రరీ లో చందమామ (పాత సంచికలు),సీరియల్స్ బౌండ్ చేసినవి చదివిన రోజులు గుర్తే నాకు.తరువాత చదువుకునే రోజుల్లో నవలలు చదవటం కూడా మరచిపోలేదు.అలాగే ఇప్పుడు Kindle లో , Ipad -ibooks/reader లాంటి apps use చేసి బుక్స్ చదవటం అలవాటయ్యింది. నాకైతే చదివే పుస్తకాన్ని బట్టి మనసు స్పందిస్తుంది కాని, ఎందుకో అందరు చెపుతున్నట్టు, అచ్చు పుస్తకానికి ,e-book కి పెద్దగా తేడా అనిపించండి. మీరు చెప్పిన "వర్షాకాలం సాయంత్రం, వర్షం వెలిసాకా....", అచ్చు పుస్తకమైనా,e-book అయినా అనుభూతి ఒకేరకం గా ఉంటుందేమోనండి. మీ పోస్ట్ బాగుంది వరూధిని గారు.
టెక్నాలజి ని కాదనలేము తెలుగులో త్వరలో ఈ -పుస్తకం త్రివిక్రమావతారం ఎత్తవచ్చు!కానీ నాకు అచ్చుపుస్తకమే ఇష్టం!ఎందుకంటే కొత్తపుస్తకం పుటల వాసన నా ముక్కుపుటాలకు పరిమళంలా సోకుతుంది!!!!!!
@రహ్మాన్ :)
@జలతారు వెన్నెల గారూ ముందు ముందు ఏమో కానీ ఇప్పటికైతే నా మొగ్గు అచ్చు పుస్తకం వైపే. కొత్త పుస్తకం వాసన e-పుస్తకానికి ఉంటుందా? పేజీ తిప్పేటప్పుడు ఆ మెత్తదనం అనుభవం అవదు కదా! నాకయితే అసలు పూలకి..ప్లాస్టిక్ పూలకి ఉన్నంత తేడా ఉన్నట్టనిపిస్తుంది. Thank you.
@Surya Prakash garu..thank you. నిజమేనండి నాకు కూడా కొత్త పుస్తకాల వాసన ఇష్టం.
e పుస్తకం చదవటం కూడా బానే ఉంది వరూధిని. ఎలాను మనం అందరం ఇవాళ రేపు పొద్దుగూకులు కంప్యూటర్ ముందు ఉంటున్నాము కదా.. అక్కడే పుస్తకాలు ఉంటే చదువుకోవొచ్చు. ఆచ్చు పుస్తకాల లో ఉండే మజా దానిలో ఉంది కాదు అనఅను కాని e పుస్తకం మనకు ఈ ఆన్‍లైన్ మేగజైన్స్ తో కాస్త అలవాటు ఐన ప్రక్రియే కదా.. కాకపోతే కొనుక్కుని మన లైబ్రరీ లో ఉంచుకుని చదువుకొంటాము అంతే.
మారుతున్న రోజుల్లో ఏ మార్పు జరిగినా అది popular అవడం దానిని ఉపయోగించే.. ఇంకా దాని వలన మనం పొందే సౌలభ్యాన్ని బట్టే ఉంటుంది.
ఒకప్పుడు తాటాకుపత్రాల మీద ఘంటంతో వ్రాసేవారు. ఎప్పుడైతే అచ్చుయంత్రం వచ్చిందో అప్పటినుంచీ వేదాల నుంచీ పురాణాల దాకా పుస్తకాలు అచ్చువేసి భద్రపరిచారు.
ఈ రోజుల్లో పుస్తకాన్ని డిజిటలైజ్ చేస్తే శాశ్వతంగా ఉంటుందని వాటిని కూడా డిజిటలైజ్ చేసి భద్రపరుస్తున్నారు.
కాని మనం అంత తొందరగా కొత్తదనాన్ని ఆహ్వానించలేం. పాతా, కొత్తా బేరీజు వేసుకుంటాం. అలాగని పాతది పనికిరాదనీ కాదు.. కొత్తది వాడొద్దనీ కాదు.
ఇప్పటికీ కొంతమంది రోటిలో రుబ్బిన పచ్చడి రుచి మిక్సీ లో రుబ్బినదానికి లేదంటారు. కాని ఇప్పుడు ఎంతమంది ఇళ్ళలో రోళ్ళు కనబడుతున్నాయి?
అలాగే అపార్ట్ మెంట్ లో ఉండలేమని ఒకప్పుడు అనేవారు కూడా ఇప్పుడు వాళ్ల స్థలాలని డెవెలప్ మెంట్ కి ఇచ్చేస్తున్నారు.
పుస్తకం చదవడంలో గల భావోద్వేగాల గురించి మీరు చెపితే నేను ఇదంతా ఎందుకు చెపుతున్నానంటారా..
ఎప్పుడైతే ఒక పనిని సులభంగా చెయ్యడానికి మనం అలవాటు పడిపోతామో అప్పుడు మళ్ళీ కష్టపడలేం.
ఇదీ అంతే.. కొన్నాళ్ళు పాతరోజులు, ఆహ్లాదకరమైన సాయంత్రంవేళల్లో ఇష్టమైన పుస్తకం చదువుకోడాలు గుర్తురాక తప్పవు. అవింక ఙ్ఞాపకాలుగానే మిగిలిపోతాయేమో అనిపిస్తోంది నాకయితే...
బావున్నాయండీ పుస్తకాల గురించిన కబుర్లు...
నా వరకూ అయితే, అచ్చు పుస్తకాలే..! నూక్ ఈ-బుక్ కంటే కూడా ప్రింట్ పుస్తకం చాలా హాయిగా అనిపిస్తుంది..
చేతిలో పుస్తకం పట్టుకుని, రాత్రంతా చదువుతూ ఉన్నప్పుడు, అబ్బా ఇంకా ఎంతసేపే లైట్ తీసెయ్యి అని విసుక్కునే బామ్మ మాటలు ఈ-బుక్ లో ఉండవు :P
అయితే అచ్చు పుస్తకాలు చదివేంత వరకూ బానే ఉంటాయి.. తరువాత ఇల్లు మారుతున్నప్పుడో, సర్దాల్సి వచ్చినప్పుడో మాత్రం అక్షింతలు తప్పవు.. కానీ అదో తుత్తి అంతే :)
వరూధిని గారు,
నా వోటు కూడా అచ్చు పుస్తకాలకే . షాప్ కెళ్ళి మనకు కావలసిన పుస్తకం వెతుక్కొని కొనుక్కోని, వాలు కుర్చీలో హాయిగా కూర్చొని చదవటం లో వున్న ఆనందమే వేరు.కాకపోతే నా తరువాత ఈ పుస్తకాలన్నీ ఏమవుతాయా అన్న దిగులు లేకపోలేదు . నేను ఇంతవరకూ ఈ బుక్ చదవలేదు . అమెరికా వెళ్ళినప్పుడు కూడా మా కోడలు , నవల కింత అని పే చేసి నవలలు ప్రింట్ చేసి ఇచ్చేది:)
చాలాబాగారాశారండీ.. నా ఓటు అచ్చుపుస్తకానికే, నేను ఈ రీడర్ లాంటిదేమీ కొనలేదు. లాప్ టాప్ లో ఈ బుక్స్ చదవడానికి అంత సౌకర్యంగా అనిపించలేదు. నేనైతే ఇంతవరకూ ఒక్క ఈ బుక్ కూడా పూర్తిగా చదవలేదు.
I prefer e-book.
mana phone lo net vunte chalu.
ekkadyna eppudyna chaduvukovachu.
night times light off cheyi ani adige vallu vundaru.
happy ga duppati kappukoni,cell lo book chaduvutunte vuntundi super asalu.
@Uma,e-పుస్తకం చదవటం బానే ఉంటుంది కాదనను కానీ ప్లాస్టిక్ పూలకి..నిజం పూలకి తేడా ఉండదూ..ఇదీ అంతే. మరీ ఎక్కువయిందా:)
@శ్రీలలిత గారూ చాలా చక్కగా చెప్పారండి. జ్ఞాపకాలే ఓదార్పు..జ్ఞాపకాలే మైమరుపు అనుకుంటూ బతకాలేమో ఇక!
@మేధా.."చేతిలో పుస్తకం పట్టుకుని, రాత్రంతా చదువుతూ ఉన్నప్పుడు, అబ్బా ఇంకా ఎంతసేపే లైట్ తీసెయ్యి అని విసుక్కునే బామ్మ మాటలు ఈ-బుక్ లో ఉండవు"..:)) బాచెప్పారు.
అచ్చు పుస్తకాలతో ఎన్ని అనుబంధాలో..ఎన్నెన్ని అనుభూతులో కదా!
@మాలా గారూ..అవునండి పుస్తకాలు దాచటం..తర్వాత వాటికి వారసులు ఎవరనేది అందరికీ ఉన్న పెద్ద దిగులే!
e-పుస్తకాలు చదువుకోను బాగానే ఉంటాయి కానీ వాటిల్లో ఆత్మ ఉన్నట్టు అనిపించదు.
@వేణూ..e-బుక్సు లాప్టాప్ లో చదవటానికి అంత సౌకర్యంగా ఉండవండి. గుంటూరు లో ఉంటూ మీకెందుకండి e-రీడర్సు! హాయిగా కావలిసినన్ని అచ్చు పుస్తకాలు అయితే!
@Sravya....I prefer e-book...:)expected this from you.
"happy ga duppati kappukoni,cell lo book chaduvutunte vuntundi super asalu"....మా అమ్మాయి మామూలు పుస్తకాలు కూడా ఇలా దుప్పటి ముసుగేసుకుని చదివేస్తూ ఉంటుంది.
అచ్చు పుస్తకం అమ్మలాంటిది తప్పుచేస్తే కొడతాది... ఈ పుస్తకం అనివార్యంగా తప్పులు వెతుక్కోవడం లాంటిది. అదేదో అమ్మదెబ్బే తింటే తప్పులు చేయంగా...అది లెక్క...ధన్యవాదాలు.. తెలుగోడు.
Post a Comment