పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

November 22, 2012

డెహ్రాడూన్ సోయగాలు

డెహ్రాడూన్....ఉత్తరాఖండ్ కి రాజధాని.

హరిద్వార్, రిషీకేశ్,  గంగోత్రి, యమునోత్రి,  కేదార్ నాథ్, బదరీ నాథ్ లాంటి పుణ్య క్షేత్రాలున్న ఉత్తరాఖండ్ ని దేవభూమి అని పిలుచుకుంటారు అక్కడి వాళ్ళు.

డెహ్రాడున్ ఈ పుణ్యక్షేత్రాలన్నిటికి ఒకరకంగా గేట్ వే లాంటిది.  దీనికి ఉత్తరాన  హిమాలయాలు (Lower Himalayas), దక్షిణాన శివాలిక్ పర్వతాలు (Outer Himalayas),  తూర్పున గంగా నది,  పశ్చిమాన యమునా నది ఉంటాయి.

డెహ్రాడూన్ నుండి సుమారుగా మసూరి-30 కి.మీ, ఋషీకేశ్-50 కి.మీ, హరిద్వార్-54 కి.మీ దూరంలో ఉంటాయి.

డెహ్రాడూన్ లో మన తెలుగు వాళ్ళు అధికంగానే ఉన్నారు.  అక్కడి తెలుగు సంఘానికి DEVTA (Devbhumi Telugu Association) అని పేరు పెట్టుకున్నారు. పండగలకి..పబ్బాలకి బాగానే కలుస్తుంటారు.

డెహ్రాడూన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది డూన్ స్కూల్. ఒకప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఎక్కువగా ఇక్కడే చదివే వాళ్ళు.




ఇదే కాక
Forest Reasearch Institute
The Indian Military Academy (IMA)
Indian Institute Of Petroleum
Indian Institute of Remote Sensing
Lal Bahadur Shastri National Academy of Administration (LBSNAA), Mussoorie

లాంటి ప్రసిద్ద విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి..

హరిద్వార్, ఋషీకేశ్, మసూరి, గంగోత్రి, యమునోత్రి..వగైరా వన్నీ అందరూ ఎక్కువగా చూసేవే!  ఇవన్నీ కాక డెహ్రాడున్ లోనే బోలెడన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి.  ప్రకృతి ఆరాధకులకి డెహ్రాడూన్ ఓ భూతల స్వర్గమే అని చెప్పవచ్చు.  కొండలు..లోయలు..జలపాతాలు..అలా చూస్తూ గడిపేయ వచ్చు.

డెహ్రాడూన్ లో ఉన్న చూడవలసిన ప్రదేశాలల్లో కొన్ని..నేను చూసినవి:

1.  Forest Research Institute: ఇది ఓ బ్రహ్మాండమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్..తప్పక చూడవలసినది.  ఇలాంటిది ఆసియాలో ఇదొక్కటే! ఇలాంటి వాటిల్లో చదవటం తర్వాత సంగతి..చూడటమే ఓ గొప్ప అనుభూతి కలిగిస్తుంది.


రాజ ప్రాసాదాన్ని తలపించటం లేదూ!
IFS (Indian Forest Service ) వాళ్ళ ట్రైనింగ్ ఇక్కడే జరుగుతుంది.  దీనిని బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1906 లో స్థాపించారు. వంద ఏళ్ళ పై బడిన ఈ కాలేజీని చూడటానికి రెండు కళ్ళూ చాలవు.  దీని వ్యూ మొత్తం ఒకేసారి ఫోటో కూడా తీయలేము..స్టిచ్ ఫోటో నే.

కనుచూపు మేరా లానే..

బకింగ్ హామ్ పాలస్ కన్నా పెద్దదట ఇది! మైళ్ల కొద్దీ పొడవుండే పెద్ద పెద్ద కారిడార్లు...ఎకరాల కొద్దీ విస్తరించి ఉండే లాను.. 450 హెక్టార్లలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ ని పూర్తిగా నిశితంగా చూడటానికి ఓ రోజంతా పడుతుందంటే అతిశయోక్తి కాదు.

కారిడార్... సొగసు చూడతరమా!

ఇందులో ఆరు మ్యూజియమ్ లు ఉన్నాయి.  ఇన్స్టిట్యూట్ లోపల తిరిగి చూడటానికి టికెట్ అక్కర్లేదు కానీ మ్యూజియమ్ లు లోపలకి వెళ్ళి చూడాలంటే టికెట్ తీసుకోవాలి.
టికెట్ పెద్దలకి-15 రూపాయలు....పిల్లలకి- 5 రూపాయలు.

సోమవారం నుండి శుక్రవారం వరకు 9:30 నుండి 1:30 మరకు..మరలా  2.00 నుండి 5:30 వరకు అనుమతిస్తారు.

ఇంకా ఎక్కువ వివరాలకు..ఫోటోలకు ఈ కింది సైటులు చూడవచ్చు.

http://fri.icfre.gov.in

http://fri.icfre.gov.in/index2.php (ఫోటోలకి)

http://fri.icfre.gov.in/videofri/frivideo.html (వీడియోలకి)

2. టపకేశ్వర్ గుడి: ఇది ఓ శివాలయం.  ఓ గుహలో శివ లింగం ఉంటుంది.  దాని మీద ఎప్పుడూ నీళ్ళ చుక్కలు టప..టప పడుతూ ఉంటాయి ..అందుకే ఆ పేరు.  ఇక్కడే రుద్రాక్షలతో చేసిన శివలింగం ఉంది..చాలా ఆకర్షణీయంగా ఉంది.  గుడి పక్కనే నది ప్రవహిస్తూ ఉంటుంది..చాలా బాగుంటుంది.  ఇక్కడ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి!





రుద్రాక్షలతో చేసిన శివలింగం


వడి వడిగా పరుగులు..



3. శివుని గుడి: డెహ్రాడూన్ నుండి ముసోరి వెళ్ళే రోడ్డులో డెహ్రాడూన్ నుండి ఓ 20 కి.మీ దూరంలో ఈ గుడి ఉంది.  ఇది ఇక్కడ చాలా ప్రసిద్ది చెందిన గుడి. ఇక్కడ ఎలాంటి కానుకలూ స్వీకరించబడవు. ఇక్కడ ప్రసాదంగా రాజ్మా రైస్, ఫ్రైడ్ రైస్, టీ  లాంటివి  ఇస్తారు. గుడి ప్రాంగణంలో రుద్రాక్షలు, ముత్యాలు, జాతి రాళ్ళు అమ్ముతారు..అదే దేవాలయానికి ఆర్థిక వనరట! మంచివే దొరుకుతాయన్నారు!




4. సహస్త్ర ధార: ఇది ఓ జలపాతం...చాలా బాగుంటుంది. ఈ నీళ్ళు పక్కనే ఉన్న నదిలో కలుస్తాయి.  ఈ నీళ్ళల్లో సల్ఫర్ ఉంటుంది..ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరూ ఇక్కడ స్నానాలు చేస్తారు. స్నానం చెయ్యటానికి ప్రత్యేకంగా గంధక్ జల్ కుండ్ అని ఓ చిన్న కొలను లా ఉంటుంది.


ఎక్కడికో ఈ ఉరుకులు...

నది పక్కనే మూడు చిన్న చిన్న గుహలు ఉన్నాయి..శివుడి గుహ..పార్వతి గుహ..ఇంద్రేష్ గుహ..చాలా చిన్నవే కానీ పై నుండి నీళ్ళు పడుతూ ఉంటే లోపలకి వెళ్ళి రావటం బాగుంటుంది.  కాకపోతే కాస్త జాగ్రత్తగా నడవాలి..ఇక్కడ రాళ్ళు బాగా జారిపోతూ ఉంటాయి.

శివుడి గుహ

పార్వతి గుహ


గంధక్ జల్ కుండ్

ఇక్కడ రోప్ వే..అమ్యూజ్మెంట్ పార్కు..రైడ్సు ఉన్నాయి.  మేము వెళ్ళిన రోజు ఆ రైడ్సు ఏవీ నడపటం లేదు.  మనుషులు సరిపడా ఉంటేనే అవి నడుపుతారు..మేము వెళ్ళింది ఉదయం పూట కాబట్టి ఎక్కువ మంది లేరు...అందుకని వాటిని నడపటం లేదు.

5. రాబర్స్ కేవ్: ఈ ప్రదేశాన్ని గుచ్చూ పానీ అని కూడా అంటారు  అంటే "water in the cup of your hands" అని అర్థం అట!.ఇది నిజంగా ఒక అద్భుతం. రెండు కొండల మధ్య ఓ సన్నటి లోయ..ఆ లోయలో  నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.. పై నుండి సూర్య కాంతి పడుతూ నీళ్లు మిల మిలా మెరుస్తూ ఉంటాయి. నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీళ్లల్లో ప్రవాహానికి ఎదురు నడవటం..అదొక మరుపురాని అనుభవం.

రాబర్సు కేవ్ కి వెళ్ళే దారి
గుహ ప్రవేశానికి ముందు..తళ తళ మెరుపులు..
పూర్వం దొంగలు తాము దోచుకున్న సంపద తెచ్చి ఈ కొండల్లో దాచే వాళ్ళట..అందుకనే రాబర్సు కేవ్ అని పేరు వచ్చిందట!

ఇక్కడి నుండి గుహ మొదలవుతుంది...
మధ్య మధ్యలో పై నుండి నీళ్ళు జల్లులా  మన మీద పడుతూ ఉంటాయి. అక్కడక్కడ గోడల మీద పాములు కూడా తగుల్తాయట చేతులకి!..నాకయితే ఏమీ తగల్లేదు..భయపడే వాళ్ళకే అవి తగుల్తాయి అనుకుంటాను.


కొన్ని చోట్ల రెండు కొండల మధ్య దూరం 3-4 అడుగులే ఉంటుంది. మధ్యలో ఎత్తైన రాళ్ళు దారికి అడ్డంగా ఉంటాయి..ఒక చోట ఓ ఎత్తైన రాయి..కింద నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి..ఇక్కడ చాలా లోతుగా కూడా ఉంటుంది..అందుకని ఆ రాయి ఎక్కి అవతలకి వెళ్ళాలి..కొంచం జాగ్రత్తగా దాటాలి..ఏ మాత్రం కాలు జారినా కింద నీళ్ళలోకి పడిపోవటమే! నేనయితే బాగానే దాటేసాను. నాతో పాటు వచ్చిన పిల్లలు అయితే భయడిపోతూ అమ్మో ఆంటీ మీరు చక చకా ఎక్కేస్తున్నారు మాకు భయం వేస్తుంది అంటూ ఒకటే ఆర్తనాదాలు!


అలా నీళ్లల్లో ఓ నాలుగయదు కిలో మీటర్లు నడవ వచ్చు.  ఓపిక ఉంటే చివరి దాకా వెళ్ళి రెండో వైపు నుండి బయటకు రావచ్చు. కాకపోతే అక్కడి నుండి మళ్ళీ పార్కింగు దగ్గరకి రావాలంటే దూరం..అందుకని మేము మరీ చివరి దాకా వెళ్ళకుండా మధ్యలోనే వెనక్కి వచ్చేసాం...నాకయితే చివరి దాకా వెళ్ళాలనిపించింది కానీ అప్పటికే చీకటి పడుతుంది అని వెనకకి మరిలాం.

రెండు కొండలు ముద్దు పెట్టుకుంటున్నట్టు లేదూ!
ఇక్కడ ఎంట్రన్సులో ఓ చిన్న హోటలు ఉంటుంది.  అక్కడ మాగీ చాలా ఫామస్ అట.  వేడి వేడిగా అప్పటికప్పుడు చేసి ఇస్తాడు. మనిషి కూడా చాలా మంచి వాడు.  అందరి కెమెరాలు..బాగ్ లు ఇతని దగ్గరే పెట్టి వెళ్తారు..వాటికి కాపాలా కాసినందుకు డబ్బులు కూడా ఏమీ తీసుకోడు!..ముందు నీళ్ళు..ఆ నీళ్లల్లో రాళ్ళు..ఆ రాళ్ళ మీద కూర్చుని నీళ్లల్లో కాళ్ళు ఆడిస్తూ వేడి వేడి మాగీ ఊదుకుంటూ తినటం ఓ మధురానుభూతి ఎవరికైనా!

డెహ్రాడూన్ వెళ్తే మాత్రం ఈ ప్రదేశం తప్పక చూడండి.

ఇవీ నేను చూసిన డెహ్రాడూన్ సోయగాలు..మరిన్ని మరోసారి!

20 వ్యాఖ్యలు:

Anonymous,  November 22, 2012 at 12:41 PM  

అదృష్టవంతులు మీరు స్వర్గంలో విహరించి వచ్చారు.

జయ November 22, 2012 at 2:18 PM  

మువ్వగారు, మిమ్మల్ని ఇలా పిలవాలంటే నాకు చాలా ఇష్టం. నేను రెండు సార్లు డేహ్రాడూన్ వెళ్ళాను. మొదటిసారి చార్ ధాం యాత్ర చేసినా, రెండో సారి మీరు చెప్పిన చాలా ప్రాంతాలు చూసాను. కాని సహస్రధార మిస్ అయ్యాను. ఈ ఫొటోలు చూస్తుంటే నాకేడుపొస్తోంది:(((మళ్ళీ వెల్తే తప్పకుండా చూస్తాను. అస్సలొదలను.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் November 22, 2012 at 3:51 PM  

Looks like you people had a great time :-)

Very useful links too. Thank you!

http://www.iirs.gov.in/ ఈ లింక్ పనిచెయ్యట్లేదండి.

Wiki link :
http://en.wikipedia.org/wiki/Indian_Institute_of_Remote_Sensing

హరే కృష్ణ November 22, 2012 at 5:46 PM  

అరచేతిలో అద్భుతాలు అక్షర పద జాలం తో పార్ట్లు పార్ట్లు గా జనాల పేషన్స్ ని పరీక్షిస్తున్నా మీరు చాలా సరళమైన రీతిలో అద్భుతం గా వంద పదాలు = ఒక్క ఫోటో అని నిరూపించి డిటైల్డ్ గా చూపించారు
అభినందనలు
ట్రిప్ ని మీరు ఎంతగా ఎంజాయ్ చేసారో ప్రతి పదం లోనూ కనిపించింది
చాలా బావుంది వరూధిని గారు

సిరిసిరిమువ్వ November 22, 2012 at 6:07 PM  

లలిత గారూ..వెళ్ళాలనుకుంటే ఎంతసేపండి...డెహ్రాడూన్ సంవత్సరంలో ఎప్పుడు వెళ్ళినా బాగుంటుంది..వర్షాకాలం మరీనూ!

జయ గారూ..మీరు ఎలా పిలిచినా ఆనందమే! ఈ సారి వెళ్తే తప్పకుండా చూడండి. నేను కూడా చూడనవి ఇంకా ఉన్నాయి..ఈ సారికి అట్టి పెట్టుకున్నాను:)

సిరిసిరిమువ్వ November 22, 2012 at 6:10 PM  

భాస్కర్, నాకు లింకు బాగానే పని చేస్తుంది. Thank you.

హరే కృష్ణ థాంక్యూ!
వంద పదాలు=ఒక్క ఫోటో..ఈ కాప్షను ఏదో బాగుందే!

ఫోటాన్ November 22, 2012 at 6:13 PM  

వరూధిని గారు!
ఫొటోస్ బాగున్నాయి.. :)

బులుసు సుబ్రహ్మణ్యం November 22, 2012 at 6:25 PM  

నా బండ పడా. నా మొహం మండా. నేను డెహ్రాడున్ IIP కి,10-15 మాట్లు వెళ్ళి ఉంటాను. మీరు చూసిన వాటిలో సగం కూడా చూడలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి.

ఎస్, చాలా సుందరమైన ప్రదేశం.

Zilebi November 22, 2012 at 6:49 PM  

బులుసు గారు,


చలో ఒన్స్ అగైన్ డూన్!

@వరూధిని గారు,

మన దేశం లో నే ఇన్ని సోయగాలు ! బాగున్నాయండీ ఫోటోలు, టపా కీ కరణం . మంచి టపా, సిరి సిరి మువ్వ అనబడే వరూధిని గారు !

చీర్స్
వరూధిని గాని జిలేబి.

సిరిసిరిమువ్వ November 22, 2012 at 6:57 PM  

ఫోటాన్..థాంక్యూ!

బులుసు గారూ..మరోసారి వెళ్ళి అన్నీ చూసి రండి.

జిలేబి గారూ..థాంక్సండి.

సుభ/subha November 22, 2012 at 7:13 PM  

వావ్ భలే ఉన్నాయి విశేషాలు ఫోటోలతో సహా.. చదవగానే ఇప్పటికిప్పుడు వెళ్ళాలనిపించిందండీ.. ఆ నీటిలో అలా నడుచుకుంటూ వెళ్ళడం.. అబ్బా! ఎంత బాగుందో అండీ..

ఇందు November 22, 2012 at 10:08 PM  

Chala bagunnay pics Muvva garu. Naku aa Robers caves baga nachay :) naaku ilantivi bhale ishtam. Eppatikainaa vellali ikkadiki. Thanks mee anubhavaalu maato panchukunnanduku :)

వేణూశ్రీకాంత్ November 23, 2012 at 7:56 AM  

వావ్ సూపర్ పోస్ట్ వరూధిని గారు, ఫోటోలు విశేషాలు అన్నీ చాలా బాగున్నాయ్.

సిరిసిరిమువ్వ November 23, 2012 at 10:55 AM  

సుభ గారూ, ఇందూ, వేణూ..థాంక్యూ ఆల్!

durgeswara November 23, 2012 at 9:42 PM  

velli chudalekapoyinaa meevalana ilaagainaa chudagaligaam
dhanyavaadamulu

Sravya V November 24, 2012 at 10:21 AM  

Very Nice ! చాలా బాగా రాసారు !

భాస్కర్ కె November 24, 2012 at 3:05 PM  

అయ్యో మే చాలా మిస్ అయ్యామండి, రుషికేష్ చూసి డెహ్రాడూన్ వెళ్లాం,.కేవలం డిల్లీ ట్రైన్ పట్టుకోవడానికి, స్టేషన్ మాత్రమే చూసాం,...ఈ సారి, వెళ్తే చూడాలి,..

మధురవాణి November 24, 2012 at 4:41 PM  

Interesting post! బోల్డు కొత్త ప్రదేశాల గురించి పరిచయం చేసారు. నాక్కూడా అన్నీ exciting గా అనిపించాయి ఒక్క రాళ్ళ మీద పాములు తగిలే గుహ తప్ప.. :P

సిరిసిరిమువ్వ November 25, 2012 at 5:35 AM  

@దుర్గేశ్వర గారూ..ధన్యవాదాలు.
@శ్రావ్యా, మధురా..థాంక్యూ!
@the tree గారూ..ఈ సారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. Thank you.

రసజ్ఞ January 16, 2013 at 4:37 AM  

హరిద్వార్ అవీ వెళ్ళినప్పుడు వెళదామనుకుని కూడా వెళ్ళలేకపోయాను :(
చదివిన వెను వెంటనే వెళ్ళి చూడాలనిపించేలా వ్రాశారు!

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP