పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 24, 2011

రమణకి తెలుగు బ్లాగర్ల అక్షరాంజలి

 ఈ రోజు రమణ గారు లేరని తెలిసాక మన తెలుగ బ్లాగర్ల స్పందనలు..(బ్లాగుల్లో ...బజ్జులో ....జాల పత్రికల్లో వచ్చినవి)  ఇక్కడ పెడుతున్నాను.  అన్నీ ఒక చోట ఉంటే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో పెడుతున్నాను. ఎవరికయినా అభ్యంతరం ఉంటే చెప్తే తీసివేయగలను.

వేణూ శ్రీకాంత్ (బజ్జులో)
ప్రముఖులు చనిపోయినపుడు టివిల్లో గుండెలవిశేలా రోధిస్తున్నవాళ్ళని చూసి మాస్ హిస్టీరియానే కానీ ఎంత అభిమానముంటే మాత్రం ఇంత ఏడుపు ఎలావస్తుంది అనుకునేవాడ్ని.

ముళ్ళపూడివారు ఇకలేరని ఒకగంట క్రితం తెలిసిన దగ్గర నుండీ ఎంతప్రయత్నించినా ఆగకుండా నిశ్శబ్దంగా కారుతున్న కన్నీళ్ళని చూస్తే ఇపుడు అర్ధమవుతుంది. ఎవరో మన నట్టింట్లోమనతో తిరుగుతూ కబుర్లు చెప్పే మన మనిషి పోయినంత బాధ. అయినా రమణ గారు ఇకలేకపోవడమేమిటి ఆయన సృష్టించిన బుడుగు నిక్కర్ వేసుకుని అల్లరిచేస్తూ మనమధ్యే తిరుగుతుంటాడు. ఇంకా రమణగారు తన రచనల రూపంలో మన నట్టింటే ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు.

రమణ గారి ఆత్మకు శాంతిని... బాపుగారికి మనశ్శాంతినీ.. ఇంతటి కష్టాన్ని తట్టుకునే  ధైర్యాన్నీ ప్రసాదించమని ఆభగవంతుడిని వేడుకోవడం తప్ప ఏంచేయగలం.



పప్పు నాగరాజు (బజ్జులో)



అమరణీయం - రమణీయం
Death doesn't separate a fellowship forged with love, friendship and mutual respect.

When Dave Packard (the founder of Hewlett & Packard) passed on in 1996, the San Jose Mercury News ran a full length obituary -- which ran into more than 40 pages. Many people - his friends, employees, associates and eminent people from all over America wrote about their association with him, their memories and how he made a difference to them. It was 40 pages of emotionally charged eloquent tribute to a great man.

But, his legendary partner and best friend Bill Hewlett didn't say anything - not even a word. His silence was not simply eloquent, it was ineffable.



రమణి (బజ్జులో)
బాపురమణీయం
బాపు ఒంటరివారయ్యారు.. ముళ్ళపూడి వెంకటరమణగారు ఇక లేరు.
బాపు.......(రమణీయం)?? :(
రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించారు. కుటుంబం ఇబ్బందులలో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివారు.

తర్వాత 7,8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరీ స్కూలులోను చదివాడు. పాఠశాల విద్యార్ధిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించారు. హాబీగా పద్యాలు అల్లేవారు. నాటకాలలో వేషాలు వేసేవారు.

1945లో బాల పత్రికలో రమణ మొదటి కథ 'అమ్మ మాట వినకపోతే' అచ్చయ్యింది. అందులోనే బాల శతకం పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే ఉదయభాను అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్ అయిపోయారు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, వచ్చిన డబ్బులతో సైక్లోస్టైల్ మెషిన్ కొన్నారు.

ఆ పత్రికకు రమణ ఎడిటర్. చిత్రకారుడు బాపు. విషయ రచయిత మండలీకశాస్త్రి. ఆర్ధిక ఇబ్బందుల వలన ఎస్సెల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశారు. 1954లో ఆంధ్ర పత్రిక డైలీలో సబ్ ఎడిటర్‌గా చేరారు. ఆంధ్రపత్రికలో పని చేసేటపుడే బుడుగు వ్రాశారు.

  స్వాతికుమారి (బజ్జులో)తెలుగుతనం మరోసారి తడబడింది. తన మడుసులకు కలాపోసన కనుక గా ఇచ్చిన అందాలరాముడి కోసం కలమెంట నీరెట్టుకుంది. ఐనా చిన్నవాడూ చితకవాడు కానివాడిని కూడా కుంచం బోలెడు బ్బయం లేకుండా తీసుకెళ్ళిన కాలానికి వీపు మీద గఠిగా ప్రైవేటు చెప్పాలనుంది.
 వరూధిని http://vareesh.blogspot.com/2011/02/blog-post_24.html రమణ లేని బాపు


అయ్యో బాపూ!


చిన్నీ రమణ గారు పోయారంట!


పొద్దున్నే టి.వి. లో వార్త చూసి మా ఆయన పెట్టిన కేక వినగానే
నాకు నోటివెంట వచ్చిన మొదటి మాట
 అయ్యో బాపూ!


బాపు-రమణ..
ఒక్క తెలుగు వారికే సొంతమయిన అరుదయిన జంట!
తనువు మనస్సూ ఒకటిగా మెలిగిన అపురూప స్నేహితులు
తెలుగు సినిమాకి...తెలుగు సాహిత్యానికి ఓ గుర్తింపు తెచ్చిన మహనుభావులు
ఇంతకాలం వాళ్ళిద్దరి పేర్లు కలిపి చదవాటానికి అలవాటుపడ్డ మనం
వాళ్ళిద్దరిని జంటగా చూడ్డమే అలవాటయిన మనం
ఇకనుండి ఒట్టి బాపు గారినే చూస్తాం అనుకుంటే ఎంత బాధగా ఉందో!
మనకే ఇంత బాధగా ఉంటే బాపూ గారికి ఇంకెంత తీరని లోటు!
ఆ క్షణం దాకా తనతో ఉన్న తన సహచరుడు
ఇక తనతో లేడు అనుకుంటే
అయ్యో బాపూ!


మీ ఇద్దరూ కలిసి తెలుగు వారికి
ఓ బుడుగుని... ఓ సీగానపెసూనని
ఓ రెండు జళ్ళ సీతని....ఓ గోపాలాన్ని
అన్నిటికీ మించి ఓ కోతికొమ్మచ్చిని
ఇచ్చినందుకు ఏమిచ్చి
మీ ఋణం తీర్చుకోగలం


పోయినోళ్ళందరూ మంచోళ్ళూ
ఉన్నోళ్ళు పోయినోళ్ల తీపి గురుతులు
అనుకుని ఊరట చెందటం తప్ప!! 


 

SHANKAR.S  http://blogavadgeetha.blogspot.com/

సెగట్రీ...ఈ మృత్యువు అడ్రసేటో కనుక్కో డిక్కీలో తొంగోబెట్టేదాం



దీన్సిగతరగా ఎదవ మృత్యువు...అభిమానులందరూ మాంచి నిద్రలో ఉండగా దొంగచాటుగా వచ్చి రమణని తీసుకుపోతుందా. అయినా దానికి లేకపోతే పోయే ఆ పెద్దాయనకైనా  ఉండద్దూ..."అప్పు" డే నా అని ఇంకో వందేళ్ళు జీవితాన్ని "ఋణం" గా తీసుకోవచ్చుగా దాన్దగ్గర. బాపు గురించి కాస్తయినా ఆలోచించాడా? లేకపోతే సీరామ రాజ్యం కత . డవిలాగులు మా బాగా రాసేసుంటాడు..ఆ రాములోరికి ముచ్చటేసి ఇలాంటోడు మన ఇలాకాలో ఉండాలి గానీ సీపుగా భూలోకం లో ఏంటి అని రాత్రికి రాత్రి "జనతా ఎక్స్ప్రెస్" లాంటి బండోటి పంపించి పిలిపించేసుకున్నడేమో. అసలే మనోడు ఈ మధ్యే "కోతి కొమ్మచ్చి" ఆడి ఆడి ఉన్నాడేమో ఆ "రాంబంటు" కోతి వచ్చి రాములోరు రమ్మంటున్నారు అని చెప్తే  గెంతుకుంటూ బండెక్కేసుంటాడు. సమయానికి బుడుగ్గాడు ఉన్నా బావుణ్ణు బాపు-రమణ ల "స్నేహం" గురించి చెప్పి ఠాట్ వెళ్ళడానికి వీల్లేదంటూ అడ్డేసేవాడేమో. అయినా ఎక్కడికి పోతాడ్లే...తెలుగోళ్ళు ఉన్నంత వరకూ మారేసం లో మన చుట్టూనే ఉంటాడు. మనమూ అక్కడికి వెళ్ళకపోతామా, అప్పుడు ఏటీ పని అని నిలదీసి ప్రైవేట్ చెప్పెయమూ.

అయినా ఆయన్లేడంటే మనసులో ఏదో మడతడిపోయినట్టు, గుండెలో గుండు సూది గుచ్చినట్టు ఎక్కడో ఏదో నొప్పి. అవున్లే సడెన్గా దేవుడు రేపట్నించి భూమీద ఉండడు అంటే భక్తులకామాత్రం బాధ ఉండదేంటి? అసలు ఆయన్ని తీసుకెళ్ళిన ఆ మృత్యువు  అడ్రసేటో కనుక్కో డిక్కీలో తొంగోబెట్టేదాం .





సుజాత (మనసులోమాట) 
http://manishi-manasulomaata.blogspot.com/2011/02/blog-post_24.html

రమణ లేని బాపు ! 

 అవును, ఇక బాపు .......రమణ లేని బాపు! 


పొద్దున్నే ఐదుంపావుకి చల్లని వేళ....పాటలు వింటూ వాకింగ్ కెళ్తుంటే అరిపిరాల గారి నుంచి వచ్చిన మెసేజ్ నిజంగా ఒక్క క్షణం అర్థం కాలేదు. "mullapudi venkata ramana no more" అని కనపడుతోంది ఫోన్లో! అర్థమైన మరుక్షణం మనసులోకొచ్చిన ఆలోచన

"మరి బాపు...? బాపుకెలా ఇప్పుడు? బాపు... బాపు"

ఎంతమంది అదృష్టవంతులుంటారిలా? బాపులా?.....రమణలా......!

సృష్టిలో తీయనిది స్నేహమే నని (ఆ మాటంటే వాళ్ళొప్పుకోరు.."తీయనిడి ఎందుకైందీ? మేం తీసేశాం" అంటారు) నిరూపించిన సజీవ సాక్ష్యాలు వాళ్ళు!

చిన్న నాటి స్నేహాన్ని ఎన్నాళ్ళయినా ఎన్నేళ్ళయినా నిలుపుకునేవారుంటారేమో!

కాని ఒకటే మాటగా, ఒకటే జీవితంగా, ఒకటే ఆలోచనగా ఒకే చోట ఒకే వూర్లో కుటుంబాలతో సహా కల్సిపోయి విడదీయలేని జంటగా బ్రతికిన అరుదైన మనుషులు వాళ్ళు.

బుడుగు, రాధ, గోపాలం,బామ్మ, పంచవటి కాలనీ,.........మధ్య తరగతి సౌందర్యాన్ని తన కళ్ళతో.... బాపు కుంచెతో ఆవిష్కరించిన వాడు, ఏడుపదులు దాటిన వయసులో హైస్కూలు కుర్రాడిలా  కోతికొమ్మచ్చి ఆడుతున్నవాడు,ఎంత ఎదిగినా మధ్యతరగతిలో ఒదిగిన వాడు....

ఒక్కోసారి కొన్ని సంఘటనలు అలా జరిగిపోతుంటాయి. జీవితకాలం లేటైపోతుంటాయి. ఈ మధ్య శంకర్ గారి బ్లాగులో చదివినపుడు "అవును, ఇప్పటికే ఆలస్యం చేశా! ఈ సారి చెన్నై వెళ్ళినపుడు వీళ్ళిద్దరినీ చూడాలి" అనుకున్నాను!

చాలా చాలా ఆలస్యమైపోయింది. ఇక కలవాలని లేదు. రమణ లేని బాపునీ, బాపు లేని రమణ నీ ఊహించుకోలేం కదా!

మనం సరే,  బాపు?

ఏదో ఆలోచన బుర్రలో మెరిసిన క్షణాన "అది కాదు రమణా." అంటూ పక్కకి చూస్తారేమో!

రమణ గారి ఫోన్ కి రింగ్ చేసి "అరె....ఇక రమణ లేడుగా"అని ఉస్సురని కూలబడతారేమో!

అయ్యో, బాపు గారూ , ఎలా? ఎలా? ఎలా మీ బాధను పంచుకోవడం?

 వాళ్ళిద్దరినీ , ఒకే చోట వాళ్ళిద్దరినీ చూసినపుడు  నాకు ఈపాట.గుర్తొస్తూ ఉండేది

రమణ ఇక లేరు

బాపు మనసుకు శాంతి లభించు గాక !

ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత ముళ్ల‌పూడి వెంక‌ట‌ర‌మ‌ణ క‌న్నుమూశారు. బాపు- ర‌మ‌ణ జోడీ గా సుప్ర‌సిద్దులైన ర‌మ‌ణ‌.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. చెన్నై లో స్థిర‌ప‌డిన ర‌మ‌ణ‌- స్వ‌స్థ‌లం తూర్పు గోదావ‌రి జిల్లా లోని ధ‌వ‌ళేశ్వ‌రం. మొద‌ట పాత్రికేయునిగా జీవితాన్ని ప్రారంభించి ఆ త‌ర్వాత సినీ ర‌చ‌యిత గా ఆయ‌న ఎదిగారు. ఆ త‌ర్వాత బాపు తో జ‌త క‌లిసిన త‌ర్వాత ఆయ‌న ప్ర‌స్థానం అద్భుతంగా సాగింది. సాక్షి సినిమా ఆయ‌న‌కు మొద‌టి సినిమా అంటున్నారు.

బుడుగు ర‌చ‌న‌ల‌తో ఆయ‌న సునిశిత హాస్యాన్ని జ‌నం మీద చిల‌క‌రించారు. ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డు ఆయ‌న అందుకొన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న శ్రీ‌రామ‌రాజ్యం సినిమాకు ర‌చ‌న చేస్తున్నారు. ఆయ‌న‌కు గోదావ‌రి యూత్‌.. విన‌యంగా నివాళి అర్పిస్తోంది.



ప్రసీద (సుభద్ర వేదుల)
  http://praseeda1.blogspot.com/2011/02/blog-post_24.html



ముళ్ళపూడి వెంకట రమణ గారు ఇక లేరు.. మరి తిరిగి రారు.. నిజమేనా? తెల్లవారుతూనే ఎంత విషాదకరమైన వార్త వినవలసి వచ్చింది.. పొద్దున్నే ఒకటో రెండో తెలుగు బ్లాగ్లలో తప్ప మరెక్కడా కనిపించలేదు చాలా సేపు.. అబద్ధమైతే బావుండును అని ఒక ఆశ మనసులో అన్నిమూలలా.. ఆశ, దోశ అన్నారు ఆయన.. .

  ఇలా మీ దారిన మీరు హాయిగా వెళ్ళిపోతే  ..అరుదైన శైలికీ , ఆరోగ్యమైన హాస్యానికీ , అందమైన తెలుగు సాహిత్యానికీ ,  వీటన్నింటికీ చిరునామా రమణ గారే అని ఆరాధించే   ఆశేషాంధ్ర సాహితీప్రియుల మాట ఏమిటి? వారు  సరే..
     పిల్లపిడుగులు బుడుగులూ, చిన్నారి సీగాన పెసూనాంబ లూ, రాధా గోపాళాలూ, లావుపాటి పక్కింటి పిన్నిగార్లూ, రెండు జెళ్ళ సీతలూ, వాళ్లకి ఈలలు వేసే బాబాయిలూ  ఏమయిపొతారు? హలో ఓ ఫైవుందా? అని అప్పారావులు ఎవరిని అడుగుతారు? ఇప్పుడు ఫైవు కూడా రూపాయి బిళ్ళలా నాణెం అయిపోయిది కదా, కనీసం ఓ టెన్ ఉందా అని వారు అడగాలన్నా, ఆ డైలాగ్ మార్చి రాయాలన్నా ఎవరి దగ్గరకి వెళతారు ? పాపం వాళ్లనోసారి చూడండి సార్!

మూగమనసులూ, పూలరంగడూ, భార్యా భర్తలూ అంటూ ప్రేక్షకుల మనసులతో  మీ కలంతో దాగుడు మూతలాడి ఇక ఇప్పటికింతే అని ఇప్పుడు తీరిగ్గా దానికి కేప్ పెట్టేస్తే  ఎలాగండీ  ?

     మేమిద్దరం తూగోజీ, పగోజీ అని చెప్పి,  ఇప్పుడు ఆయన్నీ, ఆయనతో పాటు తెలుగువారినీ ఒంటరిగా వదిలేస్తే అర్ధం ఏమిటి రమణాజీ? భట్టు గారి అట్టు మీద వొట్టు, ఎన్నో తెలుగు కళ్ళల్లో తిరిగిన కన్నీరు మీద ఒట్టు... మీరు లేక మా  అందరి మనసులూ మూగపోవూ.. మనసుల దాకా ఎందుకు? ఈ వార్త విని మనుషులే మూగపోయారు..నిజంజీ.

   తెలుగు వాకిట మీరిద్దరూ వేసిన  "ముత్యాల ముగ్గులు', పెట్టిన 'గోరంత దీపాలు, బుద్ధిమంతులుగా మారిన బుడ్డిమంతులు,  వారు 'అందాల రాముళ్లై' తరుణి సీతమ్మను చేపట్టినప్పుడు మీరు చేయించిన 'సీతాకళ్యాణాలు' ( మామూలు భాషలో సీతమ్మ పెళ్ళిళ్ళూ  ), రాధా కళ్యాణాలు.. పెళ్లీడు పిల్లలతోనూ, నవదంపతులతోనూ  మీరు చదివించిన పెళ్లి పుస్తకాలు, మిస్టర్ మొగుడా? మిసెస్ పెళ్ళామా ? అన్నది కాదు ప్రశ్న, భర్త కొంచం ఎక్కువ సమానం అని నువ్వనుకున్నా  కావలసినది సమానత్వమే, తెలుసుకోరా మొగుడా అని మెత్తగా చివాట్లు పెట్టిన  మిస్టర్ పెళ్ళాలూ .. ఒకరా ఇద్దరా.. చిట్టా రాస్తే  సంపూర్ణ రామాయణమంత పెద్ద గ్రంధం నిండే మీ  చిత్రాలూ, పాత్రలు . చిత్రసీమనూ, మంచి తెలుగు చిత్రాభిమానులనూ ఎన్నో ఏళ్ళు ఏలిన జంట రాజాదిరాజుల్లో ఒకరు లేక  అనాధలై తల్లడిల్లి పోవూ?
   
    ఆత్మ కధంటే  కేవలం ఆత్మ స్తుతీ,  పరనిందా నూ.. అందుకే నేను రాయనన్నాను అన్నారు. అయినా స్వాతీజీ మాట కాదనలేక రాసానన్నారు. ఎంత మంచి పని చేసారు.. కోతి కొమ్మచ్చి, కో.కొ.. కొహొతి కొమ్మ్మచ్చి అని మొదటా, ఇంకోతి కొమ్మచ్చి అంటూ పిమ్మటా,  సరదాగా, గడుసుగా, గబా గబా  ఎన్నో కొమ్మలు ఎక్కించారు.. మధ్య మధ్యలో 'శాఖా చంక్రమణం' చేస్తున్నాను.. అయ్యా క్షమించండి అంటూ ఎన్నో విషయాలు తమాషాగా చెప్పారు, మురిపించారు.. మమ్మల్ని మరిపించారు.. ముక్కు గోక్కుంటున్న బొమ్మ వేసి 'ముక్కోతి కొమ్మచ్చి'  త్వరలో అని ఊరించారు. ఇంతలోకే ఏమంత తొందర వచ్చిందని చిటారు కొమ్మనేక్కేసారు ?  ఇక్కడ పంచిన సాహితీ పరిమళాలు చాలు , ఇంక అక్కడ కూడా ఇదే పని చెయ్యి అంటూ  ఓ ఆర్డర్ పారేసి  అక్కడ దేవుడేం మిఠాయి పొట్లం పెట్టాడో మరి..





 సౌమ్య ఆలమూరు
  http://vivaha-bhojanambu.blogspot.com/2011/02/blog-post.html

చీకటి రోజు :(

ఈరోజు ఎంతటి అశుభదినం...నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. మా అభిమాన రచయిత ముళ్ళపూడి వారు ఇక లేరనే నిజం నన్ను వణికిస్తోంది. ఇన్నాళ్లు మనల్ని ఆయన కోతికొమ్మచ్చి ఆడించి ఇప్పుడేమో జాటర్ డమాల్ అనేసారు. నాకే ఇలా ఉంటే బాపూగారికి ఎలా ఉంటుండో ఊహించడం కూడా కష్టంగా ఉంది. అప్పుడెప్పుడో ఒకసారి "నా తెగులు" మృత్యుంజయ్ గారు బాపూ గారి బొమ్మ వేసి బ్లాగులో పెడితే సరిగ్గా రాలేదండీ...బహుసా బాపూగారిని ఒంటిరిగా వేసారు కదా రమణ గారిని పక్కనబెట్టకుండా అందుకే బాగా రాలేదేమో" అని నేను వ్యాఖ్య రాసాను. ఆయన కూడా దానికి ఒప్పుకున్నారు. బాపూ-రమణలని విడదీసి చూడడం మన కళ్ళకి అలవాటు లేదు. మనకే అలవాటు లేకపోతే బాపూగారికి ఎలా ఉంటుంది! ఈ కష్టాన్ని తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని బాపూగారికి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

క్రితసారి చెన్నై వెళ్ళినప్పుడు వారిరువురినీ కలవాలని ప్రయత్నించాను. వారు బిజీగా ఉండడం, నాకు టైం కుదరకపోవడంతో కలవలేకపోయాను.వచ్చేసారి వెళ్ళినప్పుడు తప్పకుండా కలవాలని ఒట్టుపెట్టుకున్నాను....ఇప్పుడిలా...మాటలు రావట్లేదు, దుఖం తన్నుకుని వస్తోంది. గుండెకోత కోసినట్టుగా ఉంది. అభిమాన ఉంటే ఇంత దుఖం వస్తుందా....నాకు తెలీదు. ఆయన నా మనసుకి ఇంత దగ్గరవారని....ఇంత అనురాగాన్ని నింపుకున్నానని నాకు ఈరోజు బాగా తెలుస్తోంది. భానిమతిగారు చనిపోయినప్పుడు ఏడ్చాను, మళ్ళీ ఇప్పుడు ఏడుపు ఆగట్లేదు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. మొదటిసారి భానుమతిగారిని కలుసుకోవాలని తీవ్ర నిర్ణయం తీసుకున్న ఒక నెల రోజులకే ఆవిడ పోవడం, ఇప్పుడు ఏప్రిల్ లో చెన్నై వెళ్ళేటప్పుడు బాపు-రమణలని కలవాలని ఒట్టుపెట్టుకోవడం...ఇలా జరగడం. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో...ఇంక నేను వారిని చూడలేను కదా.

రమణగారి మీద ఉన్న ప్రేమతో ఆయన పుట్టినరోజునాడు ఒక టపా కూడా రాసాను. ఆయన రమణీయాలు చదివి ఎంత ఉత్సాహాన్ని పొందానో నాకే తెలీదు. ఆయన రచనాశైలి అద్వితీయం. ఆ శైలికే నేను కట్టుబడిపోయాను. నేను ఈ సమయంలో చెయ్యగలిగినది ఒక్కటే ఆయన రచనలను చదవడం, వీలైతే కొందరిచేతైనా చదివించగలగడం. రమణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బాపూ గారికి మనశ్శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.

ఆయన గురించి నేను రాసిన పోస్ట్ మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను.

ముళ్ళపూడి వెంకట రమణ గారి గురంచి తెలియనివారు ఆంధ్రదేశంలో ఉండరు. ఆయన గురించి అందరు అన్ని రకాలుగా చెప్పేసారు, పొగిడేసారు. ఇహ నేను కొత్తగా చెప్పాల్సిందేమీలేదు. ఈరోజు ఆయన జన్మదినం...ఆయనకెలాగూ ముఖాముఖి జన్మదిన శుభాకాంక్షలు తెలుపలేము కాబట్టి ఆయన కలము నుండి జాలువారిన హాస్య చతురోక్తులలో కొన్నింటిని తలుచుకోవడమే ఆయనకు నేను చెప్పగల జేజేలు.

రమణగారి భాష గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆయన రచనలే అందుకు సాక్ష్యాలు. ఆయన జీవితం ఒక ముళ్ళబాట, జీవితంలో కష్టాలను అలవోకగా అవేమీ పట్టనట్టు అలా అలా రాసేస్తారు, చదువుతున్న మనకే కన్నీళ్ళు ధారలా కారిపోతాయి. ఆయన గురించి ఒకచోట శ్రీరమణ అంటారూ...
"పచ్చని గోరింటలో అరుణిమలు దాగినట్లు
ముళ్ళపూడి నవ్వుల్లో ముళ్ళలాంటి వేదన"

బాపు-రమణ అంటే స్నేహం అని మనం నిర్వచనం చెప్పుకోవచ్చు.
రమణగారి మానసపుత్రుడు బుడుగు గురిచి తెలియనిదెవరికి?
రమణగారు బోలెడు రమణీయాలు రచించారు....సినీరమణీయం, కదంబరమణీయం, ఇలా ఎన్నో....వాటిల్లో కొన్ని రమణీయమైన గుళికలు......

ఒకసారి ముళ్ళపూడి వారికి అప్పు అవసరమై ఒక స్నేహితుడికి ఫోన్ చేసి అడిగారట.

రమణ: ఓయ్ కాస్త అప్పు కావాలోయ్
స్నేహితుడు: అలాగా, ఎప్పటికి కావాలి?
రమణ: మొన్నటికి

....ఇలా ఉంటుంది వీరి వ్యవహారం

...............................
రచయితల మీద వేసిన జోకు:
"నా కొత్త నవల మీద పత్రికలో విమర్శ వేయించండి" అంటూ రచయిత ఒక పుస్తకం అందించాడు. పుస్తకం బాగా నలిగి చిరిగిపోయింది.
"పబ్లిషర్ నాకు ఒక్కటే కాపీ ఇచ్చాడండీ, మా అబ్బాయి దాన్ని నలిపి చింపేశాడు, మరోలా అనుకోకండి," అన్నాడు రచయిత.
"అయితే ఇంకా విమర్శ ఎందుకు? మీ అబ్బాయి అభిప్రాయం తెలుస్తూనే ఉందిగా" అన్నాడు సంపాదకుడు.


1960 లో తన ఋణానందలహరి పుస్తకం ఫస్ట్ ఎడిషన్ వెలువడింది. ఆ కాపీని ఇచ్చేటప్పుడు
దానిపై అచ్చుతప్పులతో, అభినందనలతో అని రాసి మరీ సంతకం చేసి ఇచ్చారట ఆ
గ్రంధకర్త శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ-కొంత వరకైనా పాప పరిహారం అవుతుందని."
....................................
ఎత్తిపొడుపులలో రమణ గారి చమత్కారం:
"ఆహా కోట్లార్జించినా మీలో ఆవగింజంత మార్పు కూడా లేదండీ, నాడెంతో నేడూ అంతే" అన్నడొక స్నేహితుడు.

"మార్పులేకేం. పూర్వం నేను పొగరుబోతుని, ఇప్పుడు నాది ఆత్మవిశ్వాసం. లోగడ మొండి రాస్కెల్ ని, ఇప్పుడు చిత్తశుద్ధి-దృఢసంకల్పం కలవాడిని. ఆ మధ్య జడ్డివెధవని, ఇప్పుడు సజ్జనుణ్ణి. లోగడ నోరు విప్పితే అవాకులు -చవాకులు దొర్లేవి, ఇప్పుడు చమత్కారంగా.....సరసంగా మాట్లాడుతున్నాను అంటున్నారు" అన్నాడు శ్రీమంతుడు.
..................................
దృష్టిలోపం:
ఒక కళాసృష్టి జరిగినప్పుడు
రసికుడు: అందులో మంచినీ, అందాన్ని వెతుకుతాడు
విమర్శకుడు: అచ్చుతప్పుల్నీ-తతిమా దోషాల్ని వెతుకుతాడు.
సెన్సారువాడు: బూతునే వెతుకుతాడు
.............................................
జోస్యం
"మీరు డెబ్బైయేళ్ళు బతుకుతారండీ"
"ఏడిసినట్టే ఉంది, నాకు ఇప్పుడు డెబ్బైయేళ్ళే"
"చూసారా, నే చెప్పలే!"
..........................

ప్రముఖుల గురించి రమణగారి మాటల్లో

అమరావతి కథల గురించి చెప్తూ...
"అమరావతి కథలు ప్రేమతో, భక్తితో, ఆవేశంతో సత్యంగారి హృదయం లోంచి ఉప్పొంగాయి. జలపాతంలా ఉరికాయి. బాలకృష్ణవేణిలా పరిగెత్తాయి. స్వామి కోవెల దగ్గర కృష్ణలా భయభక్తులతో తలవంచుకుని నడిచాయి" అన్నారు.

సాలూరి రాజేశ్వరరావుగారి గురించి....
"నిఘంటువులో 'శ్రావ్యసంగీతం' అనే మాటకి అర్థం రాయటానికి మాటలు వెతికి చేర్చేబదులు రాజేశ్వరరావు అని టూకీగా రాస్తే చాలు"

యెస్.వి.రంగారావు గురించి....
"వెండితెరకి రాకుంటే రంగారావు ఏం చేసేవాడు? ఎప్పుడో అప్పుడు ఝామ్మని వచ్చేసేవాడు, అందుకు సందేహమేమిటి!"

కె.వి.రెడ్డి గురించి.....
కృతకమైన సాంఘికం కన్నా సహజమైన జానపదం లక్షరెట్లు మెరుగు. కె.వి. దగ్గర ఉంటే పది లక్షలు మెరుగు. దైవమిచ్చిన జానపదానికి మకుటంలేని రాజు కె.వి.

భానుమతి గురించి.....
చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షర క్రమాన పేర్లు ఎన్నికచేస్తే "బి" శీర్హిక కింద బహుముఖ ప్రఙ్ఞావతి భానుమతి పేరు చేరుతుంది"

రమణగారి గురించి ఇలా రాసుకుంటు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....ఒక జీవితం చాలదు!
......... అశృనయనాలతో నివాళులర్పిస్తున్నాను.



మల్‌రెడ్డిపల్లి 
http://mallreddypall-sathoshamani.blogspot.com/2011/02/blog-post_23.html


ప్రముఖ సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ కన్నుమూత
ప్రముఖ తెలుగు సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ చెన్నైలోని అభిరామపురంలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస వదిలారు. ఆయన కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రమణ 1931 జూన్‌ 28న ధవళేశ్వరంలో జన్మించారు. ఆయన అసలు పేరు ముళ్లపూడి వెంకటరావు. ప్రముఖ దర్శకులు బాపు, ముళ్లపూడి వెంకటరమణ ప్రాణ స్నేహితులు. వీరిద్దరి సమష్టి కృషి తెలుగు ప్రజలకు పలు విజయవంతమైన చిత్రాలను అందించింది. సాక్షి, పంచదార చిలక, ముత్యాల ముగ్గు, పెళ్లిపుస్తకం, మిస్టర్‌ పెళ్లాం, రాధాగోపాళం తదితర సినిమాలకు రమణ రచయితగా పనిచేశారు. మూగమనసులు సినిమాకు కథాసహకారం అందించారు. రక్తసంబంధం మాటల రచయితగా, అక్కినేని నాగేశ్వరరావు నటించిన బుద్ధిమంతుడు, అందాల రాముడు సినిమాలకు కథారచయితగా పనిచేసిన ముళ్లపూడి సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ముళ్లపూడి వెంకటరమణ రాసిన పిల్లల పుస్తకం 'బుడుగు' తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం పొందింది. జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన రమణ 'దాగుడుమూతలు' సినిమాతో పూర్తిస్థాయి సినీ రచయితగా మారారు. తాజాగా బాపు దర్శకత్వంలో బాలకృష్ణతో రూపొందుతున్న 'శ్రీరామరాజ్యం' సినిమాకు ముళ్లపూడే రచయిత. ఆయన రాసిన ఆత్మకథ 'కోతికొమ్మచ్చి' విశేషంగా పాఠకాదరణ పొందింది. ముళ్లపూడి వెంకట రమణ మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయింది. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు



 


వెంకట అప్పారావు
http://surekhacartoons.blogspot.com/2011/02/blog-post_103.html


గతనెల జనవరి 26 న ఆయన పెళ్ళిరోజుకు శుభాకాంక్షలు పంపితే
వెంటనే ఫొను చేసి ఆయన అన్న మాట " నేనంటే మీకెంత ప్రేమండి"
అదే ఆయన దగ్గరనుంచి వచ్చే ఆఖరి ఫోనని నేననుకోలేదు. బాపురమణ
లంటె కవలలుకాని కవలలు. ఏ పని చేసినా ఇద్దరూ చేయవలసినదే.
ఓ పెర్సనల్ పని పై రాజమండ్రి వచ్చి మేం ఫలానాచోట వున్నాం అంటూ
ఆప్యాయతగా ఫోను చేసేవారు. ఈ ఉదయాన్నే బి.విజయవర్ధన్ గారి
మెయిల్ చూడగానే పెద్దగా ఏడ్చేశాను. భగవంతుడు ఇలా ఎందుకు
చేశాడా అనిపించింది. ఈ రోజు నేను కోటిఅందాల కోనసీమ గురించి
నా బ్లాగులో వ్రాస్తూ అంతర్వేది అన్న మాట రాగానే ముత్యాలముగ్గులో
కాంట్రాక్టరుకు ఆయన వ్రాసిన డైలాగు గుర్తువచ్చింది.
ఆయన ఇంటికి వెళ్ళితే ఆయన చూపే ఆప్యాయత ఎలా మర్చిపోగలను.
నాకు కానుకగా ఇచ్చే ఏ పుస్తకాన్నైనా బాపుగారు సంతకంచేసి, రమణ
గారిని సంతకం చేయమనేవారు. మొదటిసారి బాపురమణ గార్లను కలసి
నప్పుడు ఆయన సాహితీసర్వస్వం పుస్తకం పై సంతకం చేసి, క్రింద
బాపు సంతకంకూడా ఆయనే చేసి బ్రాకెట్లో ఆధరైజ్డు ఫోర్జరీ అని వ్రాసారు.
తరువాత ఆ పుస్తకాన్ని పోగొట్టుకున్నాను. ఆ విషయం ఆయనకు చెబితే
వెంటనే కోరియర్లో సంతకంచేసి మరోటి పంపిచారు. ఫోను చేయగానే ఆయనే
ముందు నమస్కారమండీ అంటు పలకరిస్తుంటే చాలా ఇబ్బందికరంగా
వుండేది.
.నా కార్టూన్ పుస్తకానికి ముందుమాట వ్రాయమని కోరగానే వ్రాసి పంపి.,
అది అంత తృప్తిగా లేదంటూ మరోటి వ్రాసి పంపిన రమణగారి మంచి మనసును
నాలాటి సామాన్యుడు ఎలా వర్ణించగలడు. భాపుగారికి ఆ శ్రీరాముడు ఈ విషాదాన్ని
తట్టుకొనే శక్తినిచ్చి మాలాటి అభిమానులకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తూ, రమణగారి
కుటుంబానికి నా సానుభూతిని తెలియ జేస్తున్నాను
అవును రమణ గారూ, మేమంటే మీకెంత ప్రేమండీ ? !
.అశృధారలతో, మీ అభిమాన అభిమాని అప్పారావు ( మీరు సృష్టించిన పాత్ర పేరు
కూడా అప్పారావే అవడం నే చేసుకొన్న అదృష్టం!) రమణగారు ఇక మన మధ్యలేరు
అన్నమాటను వ్రాయలేక ఈ రచన మొదలు పెట్టినప్పుడు నా చేతులు వ్రాయలేక
పోయాయి. ఆయన రచనలు చదివినప్పుడు ప్రతిసారి, నవ్వితేనవ్వండిలోని జోకులు
గుర్తొచ్చినప్పుడల్లా ఆయన మన చెంతనే వుంటారు.

 


సనత్ శ్రీపతి
http://raata-geeta.blogspot.com/2011/02/blog-post_23.html

రమణకు ఎటులొప్పజేతు "రాత-గీత" ?





మీకిది భావ్యమా? రమణ ! మీకయి మీరిటు నిశ్చయించినన్
మాకెవరయ్య దిక్కు యని మారము చేయరొ బుంగమూతితో
మాకతి ప్రీతిపాత్రులగు మీ బుడుగున్, మరి బాపు బొమ్మలునున్!
శ్రీ కరమైన ధామమును జేరగ మీకిటు తొందరేలనో?


కమ్మగ కధలను జెప్పగ
రమ్మని పిలుపొచ్చెనేమొ రమణకు బాపూ
కొమ్మల నూగెడు కోయిల
ఇమ్మహి విడి నాకమునకు ఇటజనె నకటా !!


వెళ్ళక తప్పదొ? హాస్యపు
త్రుళ్ళింతకు మనసుపడిరొ తుహినగవాసుల్?
మళ్ళీ జన్మొకటుంటే
వెళ్ళొచ్చెయ్ ముళ్ళపూడి వెంకట రమణై !!


మా తండ్రిగారికి బాబాయి వరస ఔతారు శ్రీ ముళ్ళపూడి వారు (పెత్తల్లి, పినతల్లి బిడ్డలు). ఎప్పుడు మద్రాసు వెళ్ళినా కక్కిగారిని (ముళ్ళపూడి వారి తల్లిగారిని) కలవకుండా వచ్చేవారు కాదు నాన్నగారు. రాముడూ - స్ఫూర్తి అని నేన్రాసుకున్న పద్యాలు విన్న మొదట్లో నాన్నగారు బాపు రమణలకు వీలైనప్పుడు చూపిస్తే సంతోషిస్తారు అన్నారు. అది కాస్తా తీరకుండానే వీరు విజయం చేయటం....  వేటూరివారు, ముళ్లపూడి వారు మొదలైన హేమాహేమీలు, జగజ్జెట్టీలు ఇట్లా తెలుగు ప్రియులను వదిలి సుదూర తీరాలకు వెళ్ళిపోవటం అత్యంత దురదృష్టకరం....


వారి రచనలద్వారా, వారి బుడుగుద్వారా, బాపూ బొమ్మలద్వార వారు మన్లకు స్ఫూర్తి కలిగించాలని ఆకాంక్షిస్తూ...

 చిలమకూరు విజయమోహన్
http://vijayamohan59.blogspot.com/2011/02/blog-post_24.html

రాత గీతల్లో చెరగిపోయిన రాత -ముళ్ళపూడి వారికి అశ్రునివాళి

మీ నుదుటి పుస్తకాన విధాత రాసిన రాత చెరగిపోయినా,
ఆంధ్రుల హృదయ పుస్తకాన మీరు రాసిన రాత ఎన్నటికీ చెరగదు.
నిలిచిపోయిన రాత
పగిలిన తెలుగు పాఠక హృదయం.



రాఘవ
http://vaagvilaasamu.blogspot.com/2011/02/blog-post_24.html

వేడ్కఁ దెలుఁగుహాస్యము నీ
మాడ్కి రచించెడిదెవరయ మా బాపు సఖా
వీడ్కోలోయ్ బుకురుకుగుకు
వీడ్కోలిక ముళ్లపూడి వేంకటరమణా




చిత్రమాలికలో సౌమ్య వ్రాసినది
http://chitram.maalika.com/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B1%82-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82/



బాపు-రమణ: అందమైన ద్వంద్వ సమాసంట…ఎంత చక్కని ఉపమానం!
హాయిగా కోతికొమ్మచ్చిలాడుతూ అకారణంగా జాటర్ డమాల్ అనేస్తే ఎలా? కోతికొమ్మచ్చి ఆడడానికి అంతదూరం ఎందుకు వెళ్ళిపోవాలి, ఏం ఇలలో మేము చాలలేదూ!
ఏం కొంప మునిగిపోయిందని…అడిగితే మా జీవితాలు ఇచ్చేయమూ! మేమెంత బుద్దిమంతులమో మీకు తెలీదా? మాతో ఈ దాగుడుమూతలెందుకు?
ఒహో హాస్యం వెనకాల చిప్పిల్లిన కన్నీరు ఉండడం మీకు తెలుసు కదూ, మేము నవ్వుతూ ఎలా ఏడుస్తామో చూడాలనుకున్నారా! పోనీ మా సంగతి వదిలేయండి….మీ గీతని వదిలేససెళ్ళారు కదూ…మీ రాత లేని గీత ఎలా ఉంటుందనుకున్నారు? ఇద్దరుమితృలం, రక్తసంబంధాన్ని కాలదన్నేటంత ప్రాణమితృలం అని గొప్పగా చెప్పుకున్నారే, ఆ మూగమనసు ఎంతగా రోదించి ఉంటుందో మీకు కనబడలేదూ? ఎన్నో కష్టాలు పడి గోరంతదీపంతో జీవనజ్యోతిని వెలిగించుకున్న మీరు, పూలరంగడిలా మా తెలుగువారికి నవ్వు నేర్పించింది చాలు…ఇక ఏడుపు నేర్పింద్దామనుకున్నారేం! మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల…


నిజమే కానీ మా నవ్వులను ఎత్తుకెళ్ళిపోతానంటే ఎలా! సరేలెండి మీ ఆశలు అడియాశలే….మేమేమీ తక్కువవారం కాము….మీరెంత దూరం వెళ్ళినా వెనక్కి లాగి మా గుండెలకు హత్తుకోమూ! మీ బుడుగు మా చేతిలో ఉన్నాడు…నిండు నూరేళ్ళు వాడిని కాపు కాస్తాం. వాడిచేత ముందు తరాలవారికి ప్రైవేటు చెప్పించే బాధ్యత మాది. మీ మాటల చమత్-కారాల ఘాటుని మా పిల్లలకి పప్పన్నంతో కలిపిపెడతాం. గిరీశం లెక్చర్లు అనుకున్నారేమో, గుడిగంటల సాక్షి గా చెబుతున్నాం సీతాకల్యాణంలో వేసిన ముత్యాలముగ్గులా ఎంతో రమణీయంగా మీరు అందించిన సాహితీ సర్వస్వాన్ని మా నెత్తిన పెట్టుకుని ఊరేగుతాం. గుండెల్లో ముళ్ళలాంటి వేదనని దిగమింగుకుంటూ మమ్మల్ని నవ్వించి, కవ్వించారు కదూ! మేము మీకు అప్పుపడిపోయాం….ఎన్ని జన్మలైనా ఆనందంగా ఆ రుణానందలహరిలో తేలియాడుతాం. పైనుండి మమ్మల్ని చూసి మీరు నవ్వితేనవ్వండి, మాకేం పట్టదు. మేము చాలా మొండివాళ్ళం…మీరెంత దూరం, ఎంత తొందరగా పారిపోవాలని చూసినా మా జనతాఎక్స్‌ప్రెస్స్ ని దాటి పోలేరు. కానీ ఇప్పుడు మా బెంగంతా  గీత గురించే.
మీలో సగభాగంగా రాజాధిరాజులా సిగార్ గొట్టం లో నుండి విలాసంగా పొగ వదులుతూ ప్రేమించిచూడు అంటూ అందాలరాముడిని ఉసిగొలిపిన మా గీత కి ఇప్పుడు ఏ విధంగా సానుభూతి తెలుపగలం! ఏమైనా సరే రాంబంటుల్లా మేమున్నాం….మేము మా గీతని ఒరిగిపోనివ్వం, ఆ కుంచెని విరిగిపోనివ్వం. మీ జ్ఞాపకాలను మాలో పదిలపరుచుకుని, నలుగురికీ పంచుతూ ఇంకోతికొమ్మచ్చి ఆడుతూనే ఉంటాం.
ఇట్లు
మీ తెలుగువారు




విజయభారతిhttp://vijayasribharathi.blogspot.com/2011/02/aagindi.html
కలం గుండె ఆగింది అక్షరాలని అలవోకగా రంగరించి తెలుగువాడి గుండెలలో రసరమ్య కావ్యాలని అందించిన కలం పాళి ములుకు విరిగిపోయింది, అయితే మనదందరం కుంచె వైపు దిగాలుగా చూస్తున్నాం, కలంతో స్నెహం చెసిన కుంచె ఆ కావ్యాలకి రంగులద్దిన కుంచె, కలం లొంచి జాలువారిన అలొచనలకు ఆక్రుతి నిచ్చిన కుంచె ఇప్పుడెం చెస్థుంది అన్నదె ప్రతి తెలుగువాడి భాధ.బాపురే అంటే కడురమణీయం. అని ఆస్వాదించే తెలుగు ప్రజలకి అన్యాయం చెసాడా దేముడు.



సంహిత ...కలం కలలు
http://loveforletters.blogspot.com/2011/02/blog-post_23.html

ఆయన కలం "అక్షరం" - ఆ స్నేహం అమరం



అక్షరం అంటే eternal.  వారిది బాల్య స్నేహం,  కళా సహవాసం, బడలిక లేక సాగిన పయనం.  చరితగ మిగిలిన సాంగత్యం.  ఒకరిది స/చలనచిత్ర చిత్రాల వైనం.  మరొకరిది అక్షరపొది.  హాస్య రస వల్లరి.  నవ్వుల జాజిపందిరి.  ఆయన అక్షరాల అక్షయజీవి.  అమరుడు. 

బాపు-రమణ  కవలలు కారన్న అమాయకత్వపు రోజుల నుంచి,  వారి పట్ల ఆసక్తి మీదగా గౌరవాభిమానాలుగా ఎదిగిన ఎరుక.


బాపు దర్శకత్వం లో వచ్చిన "స్నేహం" లో అంధుడైన బాలుని పాట, అతని ఆప్త మిత్రునికి -
"నిన్న రాతిరి ఓ కల వచ్చింది,  ఆ కలలో ఒక దేవత దిగివచ్చింది
చందమామ కావాలా
ఇంద్రధనుస్సు కావాలా
అమ్మ నవ్వు చూడాలా
అక్క ఎదురురావాలా
అని అడిగింది, దేవత అడిగింది. అపుడు నేనేమన్నానో తెలుసా.. 'నీవుంటే వేరే కనులెందుకు'"


స్నేహానికి ప్రతీకగా మెలిగిన వారిరువురికీ ధన్యవాదాలు. 


బాపు గారికి ప్రగాఢ సానుభూతి. ముళ్ళపూడి వారికి శ్రద్ధాంజలి. 

స్నేహం అన్న అంశం మీద ఎన్నో చదివినా, ఈ చిరు వచనం నాకు నచ్చి పదిలపరుచుకున్నది.  మరణాన విడిపోవాల్సివచ్చినా మళ్ళీ కలుద్దామని నొక్కి చెప్పే ప్రమాణం.  వారి చెలిమికి సమర్పిస్తూ...

Written with a pen
Sealed with a kiss
If you are my friend,
Please answer this:
Are we friends or are we not?
You told me once, but I forgot.
So tell me now and tell me true,
So I can say, I am here for you.
Of all the friends I've ever met,
You're the one I won't forget.
And if I die before you do,
I'll go to Heaven (I’m sure I’am)
And wait for you.


స్వర్గాన బహుశా సమరం జరుగుతుందేమో,  ఈ నవ్వుల విరించి మావాడంటే మా వాడని!!!



పుస్తకం  http://pustakam.net/?p=6603
తరాల అంతరం లేకుండా, ప్రతి తెలుగు సాహిత్యాభిమానీ, సినిమా ప్రియుడు అభిమానించే ముళ్ళపూడి వెంకటరమణ గారు చెన్నైలో నేడు కన్నుమూశారు. వారి కుటుంబానికి, బాపు గారి కుటుంబానికి పుస్తకం.నెట్ సంతాపం తెలియజేస్తోంది.




  SR Rao
http://sirakadambam.blogspot.com/2011/02/blog-post_24.html


హాస్య ప్రవాహం ఆగింది

నిరంతర జల ప్రవాహం గోదావరిది 
సజీవ హాస్య ప్రవాహం ముళ్ళపూడిది 

గోదావరి ప్రవాహం నిలిచిపోయిందా 
హాస్య ప్రవాహం ఆగిపోయిందా 

తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అపురూప జంట బాపు రమణ 
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం బాపు రమణ 

ఇప్పుడు బాపు గీతకు ముళ్ళపూడి రాత ఏది ?
ఇప్పుడు బాపు బొమ్మకు ముళ్ళపూడి పూత ఏది ? 

బాపు రమణ జంట పేరు ఇక వినబడదా ?
ఎందుకు వినబడదు ? వినబడుతూనే వుంటుంది
తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే వుంటుంది.

బాపు ఎప్పటికీ ఒంటరి కారు 
ఆయన ఆలోచనల్లో... ఆయన గీతల్లో.... ఆయన చిత్రాల్లో ...... 
అన్నిటిలోనూ ముళ్ళపూడి నిలిచి వున్నారు.... వుంటారు 
ఇది సత్యం..... ఇదే సత్యం.....


 

శివరామప్రసాదు కప్పగంతు

 http://saahitya-abhimaani.blogspot.com/2011/02/blog-post_24.html



"నవతరంగం" బ్లాగులో 'బాపు ఇక ఒంటరి వారు' అన్న కాప్షన్ చూడంగానే మనసు కీడు శంకించింది. ఎక్కడో ఒక చిరు ఆశ బాపు గారు తానూ తియ్యబోయే కొత్త సినిమాకి కథ సంభాషణలు మరేవరికన్నా ఇచ్చారా? (ఎలా ఇస్తారు ఒక భయంకర నిజాన్నించి తప్పించుకోవటానికి వచ్చిన వెర్రి ఆలోచన కాకపొతే). కాని, విషయం చదివి పూర్తి విషాదంలోకి కూరుకుపోయ్యాను.తెలుగు సాహిత్యంలో ఒక శకం ముగిసింది. హాస్యాన్ని ఇంత అద్బుతంగా అందించవచ్చా అని అందరూ అపురూపంగా చూసుకునే రచనలు చేసి, హాస్య రచనకే కాదు, తెలుగు కథా రచనకే అనితర సాధ్యమైన గౌరవాన్ని తీసుకొచ్చినవారు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయన ఇక లేరన్న ఆలోచన చాలా బాధ కలిగిస్తున్నది.వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నా అభిమాన రచయిత ముళ్ళపూడి వారికి శ్రద్ధాంజలి.


==================================
ముళ్ళపూడి వెంకటరమణ గారి అభిమానులను ఎవరు ఓదార్చగలరు?




నవతరంగం
http://navatarangam.com/2011/02/ramana_no_more/

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు గత రాత్రి చెన్నైలో పరమపదించారు.
కొన్ని దశాబ్దాలుగా బాపురమణ అంటే ఒకటే పేరుగా చెలామణి అయిన ఈ జంట ఇక జంట కాదు. సీగానపెసూనాంబ లేని బుడుగులా, సీత జాడ తెలియని రాముడిలా, రెండుజళ్ళసీత లేని గోపాలంలా బాపు ఇప్పుడు ఒంటరివాడు. ఒక మంచి కవి, తెలుగువాడు అని గర్వంగా చెప్పుకోదగిన రచయిత, నిర్మాత ఇక లేకపోవటం దురదృష్టం.
ఇది “తెలుగు సినిమా” అని చెప్పుకోదగ్గ చిత్రాలు “ముత్యాలముగ్గు”, “మనవూరి పాండవులు”, “సీతాకల్యాణం”, “మిస్టర్ పెళ్ళాం”,”పెళ్ళిపుస్తకం” లాంటి ఎన్నో చిత్రాలు, ఇది తెలుగు పుస్తకం అని చెప్పుకోదగ్గ పుస్తకాలు “బుడుగు”, “జనతా ఎక్స్ ప్రెస్”, “కోతికొమ్మచ్చి” వంటివి ఎన్నో రమణగారు సృజించారు. బాలకృష్ణ రాముడిగా బాపు దర్శకత్వంలో రూపొందుతున్న శ్రీ రామరాజ్యం” ఆయన ఆఖరు చిత్రం.
నవతరంగం రమణగారి శ్రద్ధాంజలి, బాపుగారికి సానుభూతి ప్రకటిస్తోంది.
  
నామాల నాగమురళీధర్ (బజ్జులో)
కాలం మారింది కలం పాతబడిపోతుంది. మధ్యతరగతి జీవితాల్లో అందాన్ని ఆవిష్కరించటానికి ఆ తరగతి లేదు. తరగతిలో అందరూ పాసయ్యి మాష్టార్ని వదిలి వెళ్ళిపోయారు. ఆలుమగల మధ్య అలకలని కలంతో అలంకరిద్దామంటే గిల్లికజ్జాల్లేవక్కడ కోర్టు వ్యాజ్యాలే. బుడుగు సీగేన పసూనాంబల్లా ముద్దు ముద్దు ఆరిందాల్లేరు అందరూ ముదురులే. చిన్నబుచ్చుకున్న పెద్దాయన అలిగి వెళ్ళిపోయాడు.
బాపు శ్రీరామపట్టాభిషేకం పటంలో ఆంజనేయునికి అటుగా చేరిపోయాడు.
  పొద్దు పత్రికhttp://poddu.net/?q=node/799
అనుబంధాలు

ఋణానుబంధాలు
రమణీయానాందాలు
నేత్రానంద సినీ కావ్యాలు
అన్నిటినీ మనకిచ్చేసి

తేట తెలుగు పట్టుగొమ్మల మీద ఆజన్మాంతమూ బుడుగాటల కోతికొమ్మచ్చులాడి..
కన్నీళ్లని చక్కిలిగింతలుగా మార్చగల రసవిద్యని మాత్రం తనతో అట్టేపెట్టుకుని
అమాంతంగా, అందర్నీ వదిలేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన

ముళ్ళపూడి వెంకట రమణ గారికి
పొద్దు అశృనివాళి..





భమిడిపాటి ఫణిబాబు
http://harephala.wordpress.com/2011/02/24/baataakhaani-439/


ఈవేళ ప్రొద్దుట హారం లో నవతరంగం లో ‘బాపు ఇక వంటరి వారు…’ అనే శీర్షిక చూసి, ఏమిటీ బాపూ రమణల జంట విడిపోయి, వారు తీసే కొత్త సినిమాకి రచయితని మార్చారా ఏమిటీ అనే అనుకున్నాము కానీ, తెలుగువారి అభిమాన రచయిత శ్రీ ముళ్ళపూడి వారు ఇకలేరని, అసలు తల్చుకోడానికే అవలేదు.అప్పటికే, శ్రీ ఎం.వి.అప్పారావుగారి దగ్గరనుండి నా సెల్లులో ఓ మిస్స్డ్ కాల్ ఉంది. ఆయనకు తిరిగి ఫోను చేసి మాట్లాడదామంటే అసలు మాటలే రాలేదు.గొంతుక పూడుకుపోయింది.ఎవరో మన ఆత్మ బంధువే ఆ భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోయారా అన్నంతగా ఏడుపొచ్చేసింది.
   ప్రొద్దుటినుండీ వివిధ చానెల్స్ లోనూ ప్రసారం చేస్తున్న శ్రధ్ధాంజలి కార్యక్రమాలూ, బ్లాగుల్లో వ్రాస్తున్న టపాలూ చూసిన తరువాత, ఇదిగో ఇప్పటికి తేరుకుని వ్రాయడం మొదలెట్టాను. కీ బోర్డ్ మీద వేళ్ళు నడవ్వే.ఎలా వ్రాయాలో, ఎక్కడ మొదలెట్టాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి.అసలు వ్రాయకపోతే ఏమౌతుందీ? నేను వ్రాయకపోతే, ఆయనమీద ఉన్న నాకున్న భక్తి, ఆరాధన,ఎవరికి ఎలా చెప్పుకోనూ? స్వయంగా అనుభవించిన ఆనందం, అదీ ఇంకా ఆరు నెలలేనా అవలేదు.ఇంతలోనే ఏం తొందరొచ్చేసిందీ ఆయనకి? అక్కడేం రాచకార్యాలు వెలగబెట్టాలిటా?అక్కడే చిర్రెత్తుకొస్తుంది ఇలాటి వారితో, గత నలభై ఏళ్ళనుండి ప్రయత్నిస్తున్నా వీలు పడని ఆ అవకాశం, నాకోసమే అన్నట్లుగా రావడం ఏమిటీ, నేనూ మా ఇంటావిడా చెన్నై వెళ్ళడమేమిటీ, అక్కడ ఆయనతో ఫోనులో దెబ్బలాడేసి, ఆయన్ని కలిసి ఒకటా రెండా, మూడున్నర గంటలు ఆయన సముఖంలో కూర్చోడమేమిటీ, ఏమిటో అంతా కలగానే మిగిలిపోయింది.
   అదంతా కల కాదూ నిజం గానే జరిగిందీ అనడానికి, ఆయన మా టెండర్ లీవ్స్ కి ఇచ్చిన పాతిక పుస్తకాలూ పక్కనే ఉన్నాయే, పోనీ ఆ సంగతి వదిలేయండి, మా టెండర్ లీవ్స్ కి ఒక సందేశం పంపించగలరా అని, చేత్తో వ్రాయలేక( ఎందుకంటే వ్రాసేటప్పుడు నా చేతులు వణుకుతాయి!), కంప్యూటరు లో వ్రాసే ధైర్యం చేసి, ఆ తప్పిదానికి కారణాలు వివరిస్తూ క్షమాపణ చెప్పుకుంటూ, ఓ ఉత్తరం మళ్ళీ దానికీ ప్రింటౌట్టోటీ,ఎందుకంటే, ఆయనకి ఇ కంప్యూటరు తో పరిచయం లేదని, ముందుగానే చెప్పారు.ఇన్ని హడావిళ్ళు చేసి నేను పోస్ట్ చేసిన పది రోజుల్లో, ఓ ఇన్లాండ్ ఉత్తరం మీద స్వయంగా వ్రాసి నా ఎడ్రెస్ కూడా స్వయంగానే వ్రాయగా, నాకొచ్చిన అమూల్య కానుక ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది.
   పోనీ ఈ విషయం పక్కకి పెడదాము.క్రిందటి నెల 26 న అప్పారావుగారి బ్లాగులో శ్రీ ముళ్ళపూడి వారి వివాహ వార్షికోత్సవమూ అని చదివి, అక్కడికి ఆయనేదో మన దగ్గర బంధువులా, మేము శుభాకాంక్షలు చెబ్దామనుకుని ఫొను చేయగానే, ముందుగా శ్రీదేవి గారూ, శ్రీ రమణగారూ, ఇలా నేనూ పూణె నుంచి ఫణిబాబూ అనగానే ‘ హల్లో మీ అబ్బాయి లైబ్రరీ ఎలా ఉందీ’ అని వాళ్ళిద్దరూ అడగడమెమిటండి బాబోయ్! అసలు ఆ దంపతుల గురించి ఏమనుకోవాలో తెలియడం లేదు. అసలు చుట్టాలే మొహం చాటేస్తున్న ఈ రోజుల్లో ఏ బంధుత్వమూ లేని, మాలాటి అర్భకుల మీద అసలు అంత అభిమానం ఎందుకండి బాబూ?
   పోనీ ఈ అభిమానమైనా నాలుగు కాలాల పాటు ఆస్వాసిద్దామా అనుకుంటే, ఎవరికీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం.అసలు ఆ భగవంతుణ్ణనాలి,శ్రీ ముళ్ళపూడి వంటి వారిని పుట్టించడం ఎందుకూ, పోనీ పుట్టించాడే,ఆ కోతికొమ్మచ్చి మూడో భాగం కూడా వ్రాయనీయొచ్చుకదా. అప్పుడు కలిసినప్పుడు అడిగితే, ఇంకా తొంభై పేజీలు తక్కువయిందీ, ఎప్పుడో తీరిక చేసికుని వ్రాస్తానూ అన్నారు. ఇంకెక్కడి తీరిక?మా స్నేహితులడిగారు ఆయనతో మూడున్నర గంటలు ఏం మాట్లాడారూ అని.కావలిసినన్ని( జీవితం అంతా గుర్తుంచుకోకలిగినన్నీ) కబుర్లు చెప్పుకున్నాం. అన్నీ అందరికీ చెప్పాలా ఏమిటీ? మా పిల్లలూ అడిగారు, మీరింతసేపు అక్కడేం చేశారూ అని,నేను మాట్లాడినదెంతా, ఆయన మొహంలోకి చూడ్డంతోనే సరిపోయింది.
   నేను కూడా కంప్యూటరులో తెలుగులో వ్రాయగలనూ అనే ఆత్మ విశ్వాసం, మొట్టమొదటి సారి, రాజమండ్రీ కాపరం లో ‘ స్వాతి’ వార పత్రికలో ‘కోతొకొమ్మచ్చి’ మీద నేను వ్రాయగా ప్రచురించబడ్డ ఉత్తరం ద్వారానే కదా!అప్పుడు నాకు తోచినదేదో వ్రాసేశాను, ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది, అంత ధైర్యం అసలు ఎలా చేయగలిగానా అని.
చెన్నైలో శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారితో నేనూ, మా ఇంటావిడా అనుభవించిన అలౌకికానందం గురించి ఇక్కడ చదవండి.

   అసలు ఆ భగవంతుడేమిటో, మనతో ఎందుకు ఆడుకుంటాడో ఎవరికీ అర్ధం అవదు. రేపు ఆ ‘బుడుగు’ వచ్చి మా నాన్నెక్కడా అంటే ఏం చెప్తాం?




ఆత్రేయ
http://lipilenibasha.blogspot.com/2011/02/blog-post_24.html
గతం లో ఎప్పుడో ఒక రోజు , రాత్రి ఒంటి గంట నా ఫోన్ ట్రింగ్ ట్రింగ్ .... చేసింది మా ఉయ్యూరోడు ప్రెబాకరు.
నేను " హలో ..... ఏరా పక్కా !!"
"ఏమి చేస్తున్నావురాండి ? "
" ఏమీ లేదు రమణీయం నూట తొమ్మిదో సారి చదువు తున్నాన్రాండ్రి"
ఎరా ఒరేయ్ అనుకునే మా మధ్య అండి ( రా + అండి ) రాండి లు చొప్పించిన చిలిపి రమణ గారు లేరుట.
నా ఆరో ఏట నుంచి నుంచి బుడుగు తో మొదలెట్టి, అయన రాసిన వన్నీ చదివి చదివి ఆయనకి పెద్ద పంఖా లా
తయారయ్యి.. నా వయసు తో బాటు పెరుగు తున్న శరీరం తో బాటు అయన మీద ( అయన సహచరుడు బాపు గారి తో కలిపి)
విపరీత మైన ప్రేమ అభిమానం గౌరవం పెంచుకొని,
సొంత బంధువు లా,
మరింత దగ్గరి చుట్టం లా,
ఎంతెంతో కుటుంబ సభ్యునిలా....
చేస్కున్న అయన ఇక లేరు
అయన లాంటి ఒక పెదనాన్న, ఒక బాబాయి, ఒక తాత, ఒక అన్న, మేన మామ , తమ్ముడు , చివరాకరికి ఒక బుడుగు
లాంటి కొడుకు ఉంటె బాగుండనిపించే విశిష్ట వ్యక్తిత్వం "ముళ్ళపూడి " గారిది.
కస్టాలకేం పని లేదు వాటికేం తోచక మనకొస్తాయి,
ఇష్టాలతో పనిలేకుండా వాటిని ఆహ్వానించు, ఆస్వాదించు ,
ఆనక ఆనందంగా సాగ నంపు అనే అయన జీవిత వేదాంతం అయన రచనల్లో చదివి నిజం గా ఒంట పట్టించుకున్నా..
కేవలం నవ్వుకుంటే వచ్చే కంటి తడే కాదు
తవ్వుకుంటే వచ్చే బాధ తడి కూడా నవ్వుతూ తుడిచేసుకునే నేర్పు నేర్పారు.
అయన కేమిచ్చి తెలుగు సాహితీ ప్రియులు ఋణం మాఫీ చేయించుకో గలరు ?? ( ఇవ్వాలంటే ఆయనేరి ?)
జీవితం లో నేను చూసిన అతి కొద్ది అద్భుతాలలో బాపు రమణ గారు ఒకళ్ళు ( అవును వాళ్ళు ఒకళ్లె )
ఇది రాస్తుంటే పక్కాగాడి ఫోన్ ఎంటిరా ఇలా జరిగింది అంటూ..
భోరు మని ఏడిచే వయసు కాక పోయినా
హోరున తుళ్ళి పడుతున్న మనసుల అలల చెమ్మ ఇరు వైపులా తెలుస్తోంది.
అయన లేక పోతే మనకే ఇలా ఉంటె ఇంకా బాపుగారికెలా ఉంటుందో.
ఏమైనా మన ఏడుపు మనమే ఏడవాలి
మన కంటి తడి మనమే తుడవాలి
బాపు గారి కి
వెంకట రమణ గారి కుటుంబానికి
రమణ గారి అభిమానులందరికీ
ప్రగాఢ సంతాపం.. తో ...
ఏమి రాయాలో తోచని దిక్కులేని మనసు తో !!







శుభకరుడు 
http://subhakarudu.blogspot.com/2011/02/blog-post_24.html
ఎంతపని చేశావయ్యా రమణా... అప్పుడే అంత తొందరేం వచ్చిందని...
నాలాంటి నీ అభిమానుల కోసమో.. నీలాంటి నీ ప్రాణమిత్రుడు బాపూ కోసమో..    
తెలుగు తనం కోసమో.. గిలిగింతలు పెట్టే హాస్యం కోసమో.. వ్యంగ్యం కోసమో..
మరికొన్నాళ్ళుంటే నీ సొమ్మేం పోయింది...

ఆ పై వాడు కబురంపగానే లగెత్తుకుని వెళ్ళిపోవడమేనా !!

“ఝాఠర్ ఢమాల్ !! నేనప్పుడే రాను.. తెలుగు పాఠకులకు అందించాల్సిన అమృత గుళికలు ఇంకా చాలా ఉన్నాయ్ నువ్వు ఇప్పుడెళ్ళి మళ్ళీ ఒక ఫ్ఫదీ ముఫ్పై ఏళ్ళ తర్వాతెప్పుడైనా రా పో !! అని అంటే ఆ దేవుడు మాత్రం కిమ్మనకుండా వెనుదిరిగి వెళ్ళిపోయుండేవాడు కాదూ...  

ఓహో కష్టాలను కూడా ఇష్టాలుగా నవ్వుతూ అలవోకగా భరించేయండిరా అని నువ్వు నేర్పిన నీతిని మేమెంత బాగా పాటిస్తున్నామో పైనుండి చూడాలని వెళ్ళిపోయావా.. మాకు నీ అంత గుండెధైర్యమెక్కడిదయ్యా... నువ్వు లేవని ఇక పై రాయలేవనీ.. గుండె చెరువయ్యేలా తెలుగు తెలిసిన ప్రతిఒక్కరూ కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూనే ఉన్నారే రాత్రినుండీ :-( మా ఈ దుఃఖ్ఖం ఆగేదెపుడు.. నీ ప్రాణ స్నేహితుడు బాపూను ఓదార్చగలిగేదెవరు..






 






http://24gantalu.blogspot.com/2011/02/blog-post_4849.html
సెగట్రీ! ! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూ ఆకాసంలో!....సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ?, ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల.ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?
తెలుగునాట ఈ డైలాగ్ ఓ సంచలనం. విలనిజానికే సరికొత్త భాష్యాన్ని చెప్పింది. తెలుగు సినిమాలో విలన్ అంటే కరుడుగట్టి ఉండక్కర్లేదని నిరూపించింది. దాన్ని నిరూపించిన వ్యక్తి ముళ్లపూడి వెంకటరమణ. సంభాషణలను ఎంత బాగా రాయగలడో చెప్పడానికి ఇదో మచ్చుతునక మాత్రమే. 
తెలుగంటే రమణకు ప్రాణం. అందుకే... ఆయన రాసే ప్రతీ సంభాషణలో తెలుగుదనం పరిమళిస్తుంటుంది. కఠిన పదాలు వాటిల్లో ఉండనే ఉండవు. సామాన్యుడు మాట్లాడే భాషే ముళ్లపూడి రచనలో కనిపిస్తుంది. తెలుగు సినిమా కథలు ఎన్నో రమణ చేతిలో పడి జీవం పోసుకున్నాయి. సినిమాలకు పనికిరాదని తేల్చిసిన కథలను సైతం రమణ, తన కలం పదునుతో రక్తికట్టించారు. తెలుగు సినీ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే మూగమనసులు ఇలా తయారయ్యిందే.
తాను రచయితను కాబట్టి ఏది రాసినా చెల్లుబాటు అవుతుందని ముళ్లపూడి ఎప్పుడూ అనుకోలేదు. సినిమా విజువల్ మీడియం కాబట్టి.. సంభాషణలు ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిదనేవారు. అన్నట్లే... తన సినిమాల్లో డైలాగ్స్‌ను పొదుపుగానే రాసేవారు. అందుకే.. రమణ రచనలో వచ్చిన సినిమాలు ఎప్పుడూ ఎక్కడా బోరు కొట్టించవు.
సినిమాల్లో సహజంగానే నాటకీయత ఎక్కువ. కానీ రమణ సినిమాల్లో మాత్రం నాటకీయత ఓ పాలు తగ్గి.. సహజత్వం పాలు ఎక్కువవుతుంది. సన్నివేశానికి తగ్గట్లుగానే మాటలు ఉంటాయి తప్ప.. మాటల కోసం సన్నివేశాలు ఎక్కడా ఉండవు. అదే రమణ ప్రత్యేకత. 

అస్తమించిన అక్షరశిల్పి
బాపు బొమ్మ గీయాలి... రమణ దానికి రాతలు రాయాలి. అప్పుడు దానికి పరిపూర్ణత్వం వస్తుంది. అది ఒక్క కార్టూన్ అయినా... సిరీస్ అయినా.. కార్టూన్ కథ అయినా... సరే. బాపూ బొమ్మ ఎంత అందంగా ఉంటుందో... దానికి రమణ వేసే చమక్కు అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. రమణ రాతల్లో ఏదో మహత్యం ఉంది. లేకపోతే.. తెలుగు ప్రపంచమంతా ఆయన కథలను ఎందుకు చదవాలనుకుంటుంది. ఎప్పుడో యాభై ఏళ్లక్రితం ఆయన రాసిపాడేసిన కథలను ఇప్పటికీ చదివి మురిసిపోతుంటుంది.. ఎందుకంటే.. ఆయనలా మరొకరు రాయరు.. రాయలేరు. కథను చెప్పే తీరులోనూ రమణ మార్క్ ప్రత్యేకం.
హాస్య కథకుడిగా రమణకు పేరుపడ్డప్పటికీ, నవరసాలను పండించడంలో ఆయన నైపుణ్యం వర్ణించలేనిది. సెంటిమెంట్‌ను కూడా ఎంతో చక్కగా ఆయన పండించగలరు. అంతేస్థాయిలో విషాధాన్ని పలికించగలరు. అందుకే.. హాస్యకథలు రాసేవాడంటూ ఎద్దేవా చేసినా.. రక్తసంబంధం సినిమా కథతో అందరికీ తన రచనా సామర్థ్యాన్ని చాటిచెప్పారు ముళ్లపూడి.
 

రమణ రచనాశైలి ఎంతో విలక్షణం. ఆయనలా ఆలోచించడం ఎవరికీ సాధ్యం కాదు. తెలుగు పదాలతో ఆడుకోవడమూ ముళ్లపూడికి చెల్లినంతగా ఎవరికీ చెల్లకపోవచ్చు. రమణ అందించినంత వైవిధ్యభరిత సాహిత్యాన్ని తెలుగుభాషకు ఎవరూ ఇవ్వకపోవచ్చు. రమణలా రాయాలని ఎంతో మంది ప్రయత్నించారు. సినిమాలను విమర్శించడానికి ముళ్లపూడి పాటించిన విధానం ఇప్పటికీ అందరికీ ఆదర్శనీయం.
సాక్షి సినిమాతో మొదలైన బాపూ,రమణల ప్రస్థానం ఇప్పుడు శ్రీరామరాజ్యంగా ఆగిపోయింది. బాపూను ఒంటరిని చేసి, రమణ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు బాపూ గీతలకు మాటలు నేర్పేది ఎవరు..? నిజమే.. రమణ లోటును బాపూ తట్టుకోలేకపోవచ్చు. బాపూనే కాదు.. తెలుగు సాహితీ పిపాసులెవరైనా సరే.. ముళ్లపూడి వెంకట రమణ ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేరు.





ఆవకాయ.కామ్
http://www.newaavakaaya.com/index.php?option=com_content&view=article&id=157:kalaaposana-mallinkeppudo&catid=52:cinema-chitra-varta-chitraavalokanam-tit-bits
"ఉత్తినే తిని తొంగుంటే మడిసి గొడ్డుకి తేడా ఏటుంటదని" విడమర్చి చెప్పిన బాపూ మాటల కాంట్రాక్టర్ ముళ్ళపూడి వెంకటరమణ నిదురించే ఏ తోటలోకో పాటలా వెళ్ళిపోయారు. రేవు బావురుమంటోదని బాపూ గుండె అంటూనే ఉంటుందిప్పుడు.
 పాపం బుడుగు, సీగానపెసూనాంబ, దీక్షితులు లాంటి ఎవర్ గ్రీన్ అల్లరి పిల్లలు ఇంక మీదట మౌనంగా అల్లరి చేస్తారా? చెయ్యగలరా? చేసినా మనం ఆస్వాదించగలమా?
"వచ్చినవాడు ఫల్గుణుడు.." అంటూ బుడుగు బాణం వేస్తే "వీచింది ఎదురుగాలి!" అని పెసూనాంబ తలతిప్పకుండా చెబితే...ముక్కు మీదికి దూసుకొస్తున్న బాణాన్ని విస్తుబోయి చూస్తున్న బుడుగును మరువగలమా? బాపూ గీతలకు రమణ రాతలు సహజ కవచ కుండలాల్లాంటివి.
పింగళి నాగేశ్వర రావు తర్వాత మాటలను శాసించిన సినీ రచయితల్లో రమణగారు ప్రథమ పంక్తిలో ఉంటారు. "వీరే పంచాయితీ స్వరూపులు" అని పొగిడినా, "మగాడిదలు" అని తిట్టినా, "అపార్థసారథమ్మా!" అని ఆప్యాయంగా దెప్పిపొడిచినా, కోలాకు ప్రతిసృష్టి "ఇంకోలా" చేసినా అవి రమణ మార్కు మంత్రాలయ్యాయి.
         కన్నుల్లో నీళ్ళు నిండె మా అల్లరి బుడుగుకు
          ప్రాణాలే నిలిచిపోయే సీగానపెసూనకు
          మాటల్లో మిగిలిపోతు, మబ్బుల్లో కలిసిపోతు
          వింటావా ముళ్ళపూడి వెంకటరమణ!






బంతిపూలు
http://bantipoolu.blogspot.com/2011/02/blog-post_4440.html
చిన్నారి బుడుగు ఏడుస్తున్నాడు !!
తెలుగు భాష కి యెనలేని సేవలు చేసి మాలాంటి వారికి భాష మీద మక్కువ పెంచి తన చుట్టూ తిప్పుకున్న మహా మహుడు, రచనారావిన్దుడు, మన ముళ్ళపూడి వెంకట రమణ గారు దూర లోకాలు చేరారు. ఇక బాపు బొమ్మ ఏ బుడుగు తో ఆడుకుంటుంది, పాడుకుంటుంది, కబుర్లు చెప్పుకుంటుంది??

పాపం చిన్నారి బుడుగు ని దగ్గరకు తీసుకోండి, లాలించండి, మీ గుండెల్లో పెట్టి పెంచుకోండి.

ఆ ఆంధ్రాగ్రేసరునికి నివాళులతో
లక్ష్మణ కుమార్ మల్లాది.



విశ్వనాథ్
http://insideviswam.blogspot.com/2011/02/blog-post_24.html

రాచ్చసుడూ పదమూడో ఎక్కం ఖద

ముళ్ళపూడి వారు ఇక లేరు అని వినగానే నాకు మనసు మనసులో లేదు. నా చిన్ననాటి హీరొ ఆయన. వారి స్మరించుకుంటూ నేను చిన్నప్పుడు బాగా ఇష్టపడి చదివిన బుడుగులోని ఒక కథ.(Image పెద్దది కావడానికి ఒక సారి click చేయండి).)




అచార్య ఫణీంద్రhttp://dracharyaphaneendra.wordpress.com/2011/02/24/%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%B5%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%89%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B8%E0%B1%8D/
అఫ్సర్http://www.newaavakaaya.com/index.php?option=com_content&view=article&id=160%3Ateluguvaadi-navvunaram-tegipoyindi&catid=58%3Avyasaalu-essays&Itemid=1మృత్యువుకు ఉరిశిక్ష వేస్తా!

 చిన్నప్పటి నుండి

నన్ను నవ్విస్తున్న ‘బుడుగు‘

కంటికి మంటికి ఏకధారగా
ఏడుస్తున్నాడేమిటి?
కళ్ళతో చిలిపిగా మాట్లాడే
బాపు బొమ్మలు
మౌనంగా రోదిస్తున్నాయెందుకు?
అయ్యయ్యో!
వెండి తెరకు చెందిన
రెండు కళ్ళలో ఒకటి చితికిపోయిందే!
అరెరే! కలం విరిగిపోయిందని
కుంచె కుమిలిపోతుందే!
రవి నుండి రశ్మి రాలిపోయిందే!
శశి నుండి జ్యోత్స్న కూలిపోయిందే!
ఏమిటీ దారుణం -
పెనవేసుకొన్న గీతల, రాతల
చేతులను విడదీసింది ఎవరు?
స్నేహానికి పాఠాలు నేర్పిన
చిరకాల మిత్రులను
భూమీ, ఆకాశంలా వేరు చేసిన
నిర్దాక్షిణ్యులు ఎవరు?
‘రమణ‘ నీలి మేఘాలలో కలసి పోతే -
‘బాపు‘ నేలపై మోడు వారిన చెట్టులా మిగిలాడే!
‘బాపు‘ నుండి ‘రమణ‘ను
దూరం చేసిన 
కఠినాత్ములు ఎవరు? 
అయ్యో!
నా గుండెలు మండిపోతున్నాయి -
‘మడిసికీ, గొడ్డుకూ తేడా తెలియని‘
మృత్యువు ఎంత పని చేసింది?
నాకే గాని, అధికారముంటే …
మృత్యువుకు ఉరిశిక్ష వేస్తా!




తెలుగు వాడికి నవ్వడం నేర్పించిన ముళ్ళపూడి వెంకట రమణకి నిష్క్రమణ లేదు.

మన ఇంట్లో బుడుగుల మాటలు విన్నప్పుడల్లా, మన రాజకీయ నాయకుల కార్టూన్ ముఖాలలోంచి పెల్లుబికే ఓటు వాక్కులు విన్నప్పుడల్లా , "ఓ ఫైవ్" కోసం మన చుట్టూ గ్రహంలా తిరిగే అప్పారావుల "నోటు" మాటలు విన్నప్పుడల్లా, చటుక్కున అక్కడ ముళ్ళపూడి ప్రత్యక్షమయిపోతారు. కాబట్టి, ముళ్ళపూడికి కన్నుమూతా, పెన్నుమూతా లేవు.

ముళ్ళపూడి నవ్వుల నావలో ఈ ప్రయాణం ఎప్పుడు మొదలయ్యింది? బుడుగుతోనేనా? ఆ నోటు బుక్కు సైజు పుస్తకం, కాస్త పెద్దచ్చరాలు, మధ్యలో బాపు వొయ్యారి గీతల్లో ప్రాణం పోసుకొని వివిధ భంగిమల్లో బుడుగూ, సీగాన పసూనాంబ..చూస్తున్నప్పుడే కాదు, పుస్తకం మూసి, రమణాక్షరాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా కన్ను కొట్టినట్టుండే కొంటె గీతలు...అటు నించి వాక్యాల వెంట ప్రాణాలని లాక్కుపోయే రమణ గారి మాటలు...బొమ్మ ముందా, మాట ముందా అంటే ఎటూ తేలని సందిగ్ధం. మొత్తానికి బుడుగు ఒక అనుభవం. మనలోపలి చిలిపితనాలని, కొంటె కోణాన్ని నిద్రలేపే రసార్ణవం.

వాక్యాలు అందరూ రాస్తారు. డయలాగుల లాగులు రైటర్ టైలర్లంతా కుడతారు. కాని, కొన్ని లాగులు అరువు లాగుల్లా వుంటాయి. బరువు మూటల్లా వుంటాయి. కాని, ఈ టైలరు అసలు ఎలాంటి కొలతలూ తీసుకోకుండానే మనసుకి కొలత పెట్టి డయలాగులు కుట్టేస్తాడు.

ముళ్ళపూడి డయలాగులు వదులూ కావు, బిగువూ కావు. మనసుకి వొదిగి పోతాయి. కాబట్టే, తెలుగు వాక్యం ఆయన దగ్గిర చాలా కాలం ఆగిపోయింది. ఆయన వొంపు సొంపుల రేఖల నించి తప్పించుకోవడానికి దానికి చాలా కాలం పట్టింది. ఆ మాటకొస్తే, ఆ వాక్యం ఇంకా అక్కడే ఉండి పోయిందేమో అనీ అనిపిస్తుంది. కనీసం మన నవ్వులు అక్కడ చిక్కడిపోయాయి.

నిన్న ముళ్ళపూడి బాపు గార్ల ఇంటికి వెళ్ళాము. వారింటికి వెళ్ళటానికి లోకల్ ట్రైన్ లో స్టేషన్ లో దిగాను . దండ కొనాలి అనుకున్నాను. ఐతే ఎక్కడా నాకు దండ దొరకలేదు. ఆటో అతను మైలాపూర్ (అంటే వెనక్కి) వెళ్ళాల్సిందే సార్ అని అని నన్ను తిన్నగా మైలాపూర్ కపాలేశ్వరుడి గుడి కి తీసుకు వెళ్ళాడు దండ కొని ముళ్ళపూడి వారికి నివాళి అర్పించాను.

అక్కడ దుఖం ఆవరించి ఉన్నది. ఐస్ పెట్టె లో ముళ్ళపూడి వారు చల్లగా పడుకుని ఉన్నారు. అయనకి నమస్కరించుకుని నిలబడ్డాను.పాత స్మృతులు సినిమా రీల్ లాగ కళ్ళముందు కనిపించాయి. దండ వేసి వారి పాదాల వేపుకు నడిచి మోకరిల్లి నిలబడి రెండు నిమిషాల పాటు నన్ను నేను మరిచిపోయాను .
ముళ్ళపూడి వారికి మైలాపూర్ కపాలేశ్వరుడి మీద భక్తి . ఆ విషయం ఒకటి రెండుసార్లు చిత్రకల్పన ఆఫీసు లో మిత్రులతో మాట్లాడె సందర్భం లో విన్నాను . కపాలేశ్వరుడి గుడి గురించి తన 'కోతి కొమ్మచ్చి" లో కూడా వ్రాశారు. వెనక్కి తిరిగి వస్తుండగా అనిపించింది, ఆ కపాలేశ్వరుడే ముళ్ళపూడి వారికి ఒక దండ పంపించాడు అని.






తృష్ణ

http://trishnaventa.blogspot.com/2011/02/blog-post.html
అవును..ఏం రాయను..? ముళ్ళపూడి వెంకటరమణ గారి గొప్పతన్నాని నేను అక్షరాల్లోకి ఒదిగించగలనా? అసాధ్యం. నిన్న పొద్దున్నే పూజకు కూర్చున్నాను.. టివీలో స్క్రోలింగ్ వెళ్తోంది అని "ముళ్లపూడిగారి వార్త" చెప్పారు తను. గబుక్కున లేచి రాబోయాను. "ఇంకేమీ చూపించటం లేదు. పూజ పూర్తి చేసుకుని రా. కంగారు పడకు" అన్నారు తను. స్తోత్రాలేవో చదువుతున్నాను కానీ స్థిమితం లేదు. ధ్యాస అక్కడ లేదు. నిన్న దేవుడికి పువ్వులు తేవటం కుదరలేదు. మందిరం బోసిగా ఉంది నా మనసులాగే..అనుకున్నా. అయ్యో, బాపూ గారు ఎలా ఉన్నారో...అని అలోచన. యాంత్రికంగా పూజ అయ్యిందనిపించి, పాపను స్కూలుకు పంపించాకా టీవీ ముందుకు చేరా. స్క్రోలింగ్స్ లో తప్ప ఎక్కడా ఎవరు ఈ సంగతి మాట్లాడటంలేదు. ఇక బ్లాగులు తెరిచను. వరుసగా అన్నీ రమణగారిపై టపాలు...! ఆఫీసుకి వెళ్తూ తను చెప్పారు.."ఆ టివీ చూసి, బ్లాగులు చదివి బాధపడుతూ కూర్చోకు. అవన్నీ కట్టేసి ఏ పుస్తకమో చదువుకో.." అని.

టీవీ అయితే కట్టేసాను కానీ బ్లాగులు మూయలేదు. పనుల మధ్యన తెరుస్తూ మూస్తూ ముళ్ళపూడిగారిపై వచ్చిన ప్రతి టపా చదువుతూ పొద్దంతా గడిపేసాను. మధ్యలో బాపూరమణల సినిమానవల ఒకటి పూర్తిచేసేసాను. చాలా రోజులకు ఒకపూటలో మొత్తం పుస్తకాన్నిచదివేసాను మునుపటిలా. మొన్ననే వస్తూ వస్తూ నాన్న దగ్గర నుంచి కొన్ని సినిమా నవలలు తెచ్చుకున్నాను. విచిత్రమేమిటంతే వాటిల్లో మూడు బాపూరమణల సినిమాలే. వాటి గురించి వీలు చూసుకుని రాయాలి. అయితే వీటి సినిమా సీడీలు మాత్రం దొరకలేదు. ఇటీవలే ఒక ప్రముఖ మ్యూజిక్ స్టోర్స్ లో సీడీలు వెతుకుతూ అక్కడ నించిన్న అమ్మాయిని బాపూ సినిమాలేమైనా ఉన్నాయా అంటే "బాపూ" ఎవరు? అంది. ఓసినీ నీకిక్కడ నించునే అర్హత ఉందా అసలు? అని మనసులో తిట్టుకుని, గొప్ప తెలుగు సినిమాలు తీసిన డైరెక్టర్ అమ్మా అని మాత్రం చెప్పి ముందుకెళ్ళిపోయా. ఇంకేం చెప్పాలి?

ఏమాటకామాటే చెప్పాలి. తమిళులకున్న భాషాభిమానం తెలుగువాళ్లకు లేదు. బొంబాయిలో Matunga road ఏరియా దగ్గరకు వెళ్లినప్పుడలా అనుకునేదాన్ని ఇలాంటి మహా నగరంలో చిన్న తమిళ్నాడును సృష్టించగల ప్రాంతీయాభిమానం తమిళులకే ఉంది అని. కాలేజీ రోజుల్లో కలకత్తా వెళ్ళినప్పుడు "శాంతినికేతన్" చూడటానికి వెళ్ళం. బోల్ పూర్ స్టేషన్లో దిగి అక్కడ నుంచి రిక్షాలో వెళ్ళాలి శాంతినికేతన్ కి. (ఇప్పుడు ఆటోలు గట్రా వచ్చాయేమో తెలీదు) వెళ్తూంటే ఆ రిక్షానడిపే అతను దారి పొడుగునా అక్కడి విశేషాలు, రవీంద్రుడు చేసిన పనులు, శాంతినికేతన్ ఎలా కట్టారు? టాగూర్ ఏం ఏం చేసారు మొదలైన డీటైల్స్ అన్నీ ఎంతో చక్కగా హిందీలో వివరించాడు మాకు. రిక్షా అబ్బాయికి కూడా ఎంత శ్రధ్ధా? అని ఆశ్చర్యపోయాం మేము. మన తెలుగువారికా శ్రధ్ధ ఉందా?

తెలుగు సాహితీ ప్రపంచానికి రమణగారు చేసిన సేవ తక్కువా? సినీ ప్రపంచంలో బాపూరమణ ద్వయం తీసిన సినిమాలకే కాక రక్త సంబంధం, మూగ మనసులు, ప్రేమించి చూడు మొదలైన మంచి మంచి సినిమాలకు రమణగారు అందించిన "మాటలు" ఎంత అద్భుతమైనవి? ఇవాళ్టికీ ఇంట్లో మాటల్లో వాడుకునే "బుడుగు" డైలాగ్స్ కు పోటీ ఏవైనా ఉన్నాయా? అసలు "బుడుగు"లాంటి గొప్ప కేరెక్టర్ ను తెలుగు సాహిత్య ప్రపంచంలో మరెవరైన సృష్టించగలిగారా? మరి అటువంటి మహానుభావులకు తెలుగువారు ఏమి అవార్డులు ఇచ్చారు? ప్రభుత్వం ఏమి చేసింది? మనిషి పోయిన తరువాత ఎన్ని గౌరవాలు ఇస్తే మాత్రం ఏం లాభం? వారసులు తడిమి చూసుకోవటానికి తప్ప అవి ఎందుకైనా పనికివస్తాయా? బ్రతికి ఉండగా వారి గౌరవాన్ని వారికి అందిస్తే అది వారి ప్రతిభకు గుర్తింపు అవుతుంది. వారు చేసిన సాహిత్యసేవకు, కళా సేవకూ విలువనిచ్చినట్లౌతుంది. రమణగారూ దూరమైపోయినా కనీసం బాపూగారికయినా ప్రభుత్వం ఏదైనా ప్రతిష్ఠాత్మకమైన అవార్డుని ఇప్పటికైనా అందిస్తే బాగుంటుంది అనిపిస్తోంది.

సినీజగత్తులో పేరు పొందిన వ్యక్తులెవరైనా పోయినప్పుడు దూరదర్శన్ వాళ్ళు(DD-1) వారి తాలూకూ సినిమాలను వరుసగా ఓ పదిరోజులనుకుంట టివీలో వేసేవారు. నేను స్కూల్లో ఉన్న రోజుల్లో అలా ఎన్ని మంచి మంచి హిందీ సినిమాలు చూసానో. అంతా దూరదర్శన్ పుణ్యమే. హృషీకేష్ ముఖర్జీ, గురుదత్, రాజ్ కపూర్, బిమల్ రాయ్ మొదలైనవారి మేటి సినిమాలన్నీ నేను చూసినది టీవీలోనే. నాన్నతో పాటూ అర్ధ్రరాత్రి దాటినా ఆ సినిమాలన్నీ వదలకుండా చూసేదాన్ని. అది మన తెలుగువాళ్ళు ఎందుకు చెయ్యరో నాకు అర్ధమే కాదు. పోయినప్పుడనే కాదు, ఫలానావారి స్మృత్యార్ధం అని ఎస్.వీ.రంగారావు, నాగయ్య, సావిత్రి మొదలైన గొప్పనటులు నటించిన సినిమాలు, విఠలాచార్య, ఆదుర్తి సుబ్బారావు మొదలైన గొప్ప దర్శకులు తీసిన చిత్రాలు ఓ వారం రోజులపాటు వేయచ్చు కదా. లేకపోతే ఇప్పటి తరానికి పూర్వసినీవైభవం తెలిసేది ఎలా? కొన్ని ఛానల్స్ వాళ్లు ఏ.ఏన్.ఆర్ హిట్స్ అనీ, ఎన్.టీ.ఆర్ హిట్స్ అనీ వేస్తున్నట్లున్నారు. ఇప్పుడిక టివీ పెద్దగా చూడను కాబట్టి నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇప్పుడు ఇన్ని ఛానల్స్ లో ఏదైనా ఓ ఛానల్ వాళ్ళైనా బాపూరమణల సినిమాలు ఓ వారం రోజులు చక్కగా వేస్తే ఎంత బాగుంటుంది? కనీసం వారు తీసిన సినిమాలన్నీ సీడీల రూపంలోనో డివీడీల రూపంలోనో బయటకు వస్తే ఎంత బాగుంటుంది? ఆ మ్యూజిక్ స్టోర్స్లో అమ్మయికి బాపూగారి గొప్పతనం అర్ధమైతే ఎంత బాగుంటుంది?

"అంతులేని ఆవేదన ఎందుకే కడలీ" అని ఓ ప్రైవేట్ సాంగ్ ఉంది. అలాగ ఏదో రాయాలని తాపత్రయం తప్ప ఏం రాసి ఏం ప్రయోజనం? నేను రాస్తే ప్రభుత్వం అవార్డులిచ్చేయదు. పోయిన మనిషి తాలూకూ ఎడబాటుని బాపుగారు, ఆయన మనుషులు అనుభవించకా తప్పదు. ఏదో హృదయ ఘోష ఇలా అక్షరాలోకి మార్చి నే "తుత్తి"పడ్డం తప్ప...! వెళ్పోయినవాళ్ళు బానే ఉంటారు స్వర్గంలో. ఉన్నవాళ్ళకే బాధ. ఆ ఎడబాటులోని వ్యధ, లోటు మరెవరూ పూడ్చలేనివీ. బ్రతికి ఉన్నంతకాలం అనుభవించవలసినవీనూ.

ఆత్రేయగారి మాటల్లో అందంగా చెప్పాలంటే "పోయినోళ్ళందరూ మంచోళ్ళు...ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు"...అంతే కదా..






http://putchas.blogspot.com/2011/03/blog-post.html

ఇక సునిసిత హాస్య వ్యంగ్యాలు మ్రుగ్యమేనా?










10 వ్యాఖ్యలు:

రాధిక(నాని ) February 24, 2011 at 4:46 PM  

మాకు కరెంట్ లేక, టీవీ చూడక రమణ గారు ఇక లేరన్న విషయం నాకు మీ బ్లాగ్లో చూసేవరకు తెలీదండి :(( అయ్యో!బాపుగారు:(((

మాలతి February 24, 2011 at 5:01 PM  

నాకు ఏం చెప్పాలో తోచడంలేదు.పైన చెప్పిన మాటలూ, ఇంకా ఏవో చెప్పలేని మాటలూ అన్నీను... సిరిసిరిమువ్వగారూ, మీరు అన్నీ ఒకచోట చేర్చి రవంత ఊరట కలిగించారు. చదువుతుంటే నేనూ అలాగే అనుకుంటున్నాననాలిపిస్తోంది. అంతే. ముళ్ళపూడి వెంకటరమణ తెలుగువారికి ఒక అపురూపవరం. ఆయన వ్యక్తిత్వం అనుసరణీయం. వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేసుకుంటున్నాను ఇక్కడే.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी February 24, 2011 at 6:14 PM  

జాతస్యహి ధృవో మృత్యుః అని తెలిసినా ఏదో బేలతనం ఆవహించే సమయాలివి.
నేనూ వేటూరి గారి గురించి తెలుగు బ్లాగర్లు రాసిన వ్యాసాలన్నింటినీ ఎప్పుడూ నా బ్లాగులో కనిపించేలా పెట్టుకున్నాను.

ఆ.సౌమ్య February 24, 2011 at 7:03 PM  

చాల మంచి ప్రయత్నం....ఇలా అన్నిటినీ ఒకచోట చదువుతూ ఉంటే దుఃఖం పొంగుకొస్తున్నాది.

Unknown February 24, 2011 at 7:20 PM  

ఒకేలా ఉన్న అందరి స్పందనలూ చూస్తూ ఉంటే తెలియకుండానే మనసు బేల అయిపోయి, తెలియని దుఖం వస్తోంది. అక్షరశిల్పి కి ఎన్ని అశ్రు తర్పణాలు అర్పిస్తే తరిగే బాధ ఇది? ఎక్కడున్నా ఆయన నవ్వులు చిలకరిస్తూనే ఉంటారని ఆశిస్తూ ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

ఊకదంపుడు February 25, 2011 at 12:06 PM  

http://insideviswam.blogspot.com/2011/02/blog-post_24.html;

http://dracharyaphaneendra.wordpress.com/2011/02/24/%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%B5%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%89%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B8%E0%B1%8D/

పరిమళం February 25, 2011 at 4:20 PM  

ముళ్ళపూడి వెంకట రమణ గారికి శ్రద్ధాంజలి

పుచ్చా March 1, 2011 at 10:51 PM  
This comment has been removed by the author.
పుచ్చా March 1, 2011 at 11:00 PM  

అభిమానుల అక్షరాంజలి ని ఒక చోట పొందుపర్చే మహత్తర కార్యం చేశారు. వారిది అలనాడు జ్యోతి వీక్లీ లో 'ఎమ్వీఎల్ కాలం ' ఒకటి వచ్చేది.'రమణ ' కి 'ఆర్ ' కదా - 'ఎల్ ' ఏంటి అని ఒక పాటకుడి ప్రశ్నకి సమాధనంగా 'నా పేరు ముళ్ళపూడి వెంకట లమన" అని సరస సమాధానం. అది గుర్థుకొచ్చి వర్చస్వి వేసిన 'చిత్రాంజలి ' ని putchas.blogspot.com లో చూసి మీ బ్లాగ్ లోకి ఎలా ఎటాచ్ చేస్తారో మరి.

సిరిసిరిమువ్వ March 4, 2011 at 6:00 PM  

నందిని వర్చస్వి గారూ

మీరు వ్యాఖ్య వ్రాసిన సమయంలో నేను ఊరిలో లేకపోవటం మూలాన మీ టపా జత చేయటం కొంచం ఆలస్యమయింది..ఇప్పుడు చేసాను చూడండి.

ధన్యవాదాలు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP