పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 1, 2011

వీనులవిందు....చూడ పసందు

విశ్వనాథ్.... జయప్రదం (మా టి.వి)
బాలు..ఉషా.... పాడుతా తీయగా (ఈ.టి.వి)
వంశీ.... సూపర్ సింగర్ 6 (మా టి.వి)

ఇవి రాత్రి టి.వి లో వచ్చిన కార్యక్రమాలు..వాటికి విచ్చేసిన అతిథులు
.
విశ్వనాథ్ జయప్రదం:  జయప్రదం  కార్యక్రమాన్ని సెలెబ్రిటీలతో చెయ్యటం మూలాన జయప్రదని భరిస్తున్నామేమో అనిపిస్తుంది నాకు.  ఈ మధ్య జయప్రదని అసలు చూడబుద్ది కావటం లేదు..తనకి నప్పని మేకప్పు, కేశాలంకరణ...అసలు ఈమె జయప్రదేనా అని ఆమె అభిమానులు ఒకింత నిరాశపడే ఆహార్యం.  కానీ రాత్రి మరి ఎదురుగా ఉన్నది విశ్వనాథ్ అవటం మూలానేమో కాస్త మునుపటి జయప్రదని చూడకలిగాం.  సామాన్యంగా గంభీరంగా ఉండే విశ్వనాథ్ గారు బాగానే నవ్వించారు.

కళాతపస్వి విశ్వనాథ్..తన బిరుదునే తన ఇంటిపేరుగా చేసుకున్న కాశీనాథుని విశ్వనాథ్ అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు.కళాతపస్వి విశ్వనాథ్‍గానే ఆయన ఇప్పటి తరానికి పరిచయం .ఆయనకి కళాతపస్వి బిరుదినిచ్చినప్పటి ఓ సంగతి గుర్తు చేసుకున్నారు.  ఓ సభలో ఈయన్ని ఆ బిరుదుతో సత్కరిస్తే..అయ్యా నేను ఈ బిరుదుకి తగిన వాడిని కాను..నాకు చాలా అలవాట్లు ఉన్నాయి...పాన్ తింటాను..ఇంకా చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి నేను అర్హుడిని కాను ఈ బిరుదుకి అంటే... ఆ సభలో ఉన్న ఓ పెద్దాయన లేచి..తపస్వి అంటే మీసాలు గడ్డాలతో ముక్కు మూసుకుని తప్పస్సు చేసుకునే వ్యక్తి అని కాదు ఇక్కడ అర్థం..తను చేసే పనిని ఓ తపస్సులా...దీక్షగా చేసేవాడని అర్థం.. కాబట్టి మీరు ఈ బిరుదుకి అర్హులే అని సెలవిచ్చారట!

మొత్తానికి చాలా ఆహ్లాదంగా సాగింది ఈ కార్యక్రమం. ఇంతకుముందు ఎపిసోడులో రాధిక కూడా చాలా లవ్లీగా చేసింది కార్యక్రమాన్ని. అంతకుముందు కమల్ హాసన్...మొత్తానికి కాస్త బాగానే ఉంటుంది ఈ కార్యక్రమం. జయప్రదకి ఒక్కోసారి ప్రశ్నలని అడగటంలో కంట్యునిటీ తప్పుతుంది..మధ్యలో అవతలి వాళ్ళు ఏవో కబుర్లులోకి వెళ్ళిపోతుంటారు..దానితో ఈమె తనేం ప్రశ్న అడిగిందో కూడా మర్చిపోతుంది.

ఇక "పాడుతా తీయగా"....నేనయితే ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా బాలు కోసం ఆయన చెప్పే కబుర్ల కోసమే చూస్తాను. నిన్నటి కార్యక్రమానికి అతిధి గాయని ఉష.  ఈమె పాడుతా తీయగా ద్వారానే వెలుగులోకి వచ్చింది.  అప్పటి కబుర్లు పంచుకుంటూ బాలు ఉష చేత మిమిక్రీ చేయించి ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించాడు. ఝాన్సీ, సునీత, గాయని నిత్యసంతోషిణిలా ఆమె చేత మిమిక్రీ చేయించారు.  ఝాన్సీ లాగా చాలా బాగా చేసింది ఉష.  చివరగా బాలు లాగా కూడా చేసి అందరిని నవ్వులతో ముంచెత్తింది.  వచ్చేవారం కూడా తనే అతిథి.

చూడదగ్గ  టి.వి కార్యక్రమాలలో ఈ రెండిటిని చేర్చుకోవచ్చు.

సూపర్ సింగరులో నిన్న వంశీ కూడా ఒక అతిధిలా వచ్చారు..కాని ఎక్కువసేపు ఉన్నట్టు లేరు. పాడుతా తీయగా చూస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ఎక్కువ చూడలేదు..మద్యమద్య చూసాను.

3 వ్యాఖ్యలు:

Ennela February 1, 2011 at 11:32 PM  

మీ బ్లాగ్ లోకి యీ రోజే అడుగెట్టాను...చాలా బాగుంది..అభినందనలు.

సిరిసిరిమువ్వ February 2, 2011 at 6:31 PM  

ఎన్నెల గారూ..మీ అభినందనలకి ధన్యవాదాలు.
ఎన్నెల..భలే పేరు పెట్టుకున్నారు..బాగా వ్రాస్తున్నారు కూడాను!

Ennela February 2, 2011 at 6:43 PM  

కృతజ్ఞతలండీ...ఇది నాకు బాగా ఇష్టమైన నా పేరు...(అచ్చంగా నాదేనండీ...నిజ్జం)

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP