మనిషి దూరమయితే మాత్రమేమి
అసలు రోజులు ఇంత తొందరగా ఎలా గడిచిపోయాయో!
అంతా నిన్న మొన్న జరిగినట్టు ఉంది.
ఆ క్షణం దాకా మనతో ఉన్న మనిషి మరు క్షణం దూరమయితే!
ఏదీ అర్థంకాని అయోమయం.
ఆ అయోమయంలోనుండి ఎప్పుడు బయటపడ్డామో కూడా తెలియదు!!
తను రోజూ ఫోను చేసే సమయానికి అలవాటయిన ఎదురుచూపులు...
ఈ రోజేంటి ఇంకా ఫోను చెయ్యలేదు అనుకునే అలవాటు పడ్డ మనస్సు..
అమ్మో నాన్నకి తెలిస్తే ఊరుకోరు అని మనసులో అలానే ఉన్న భయం..
ఎక్కడో ఉండి మమ్ముల్నందరిని చూస్తూనే ఉంటారన్న ఓ భ్రమ..
లేరని తెలిసినా దేన్నని మర్చిపోగలం!!!
చీకటి పడ్డాక ప్రయాణం చెయ్యకండి!
మీకు బాగా వర్షాలంట కదా...ఆయన .పిల్లలు ఇంటికి వచ్చారా?
మీ హైదరాబాదులో బాగా గొడవలంట కదా..
మీ వైపు ఎలా ఉంది? ఏమయినా గొడవలున్నాయా!
పిల్లాడు ఈ రోజు పరీక్ష బాగా వ్రాసాడా?
వడ్లకి బాగా రేటు వచ్చింది..అమ్మేయమంటావా?
ప్రతి నిత్యం...అడుగడుగునా పలకరింపులు..పరామర్శలు..
మందలింపులు..సలహాలు..సూచనలు.
ఇప్పుడేవి ఆ పలకరింపులు..పరామర్శలు...
ఏవీ ఆ మందలింపులు? ఇంకెవరిస్తారు సలహాలు..సూచనలు
మీ అమ్మని పని తగ్గించుకోమంటే తగ్గించుకోవటం లేదు..
రేపు మంచానపడితే ఆమెని చూసేది ఎవరు అంటూ
తనే ముందు వెళ్లిపోయారు ఎవరి చేత చూపించుకోకుండా..ఏమీ చేయించుకోకుండా.
జీవితం ఎంత చిత్రమయింది.
మన మనిషి మనకి దూరం అయిన రోజు ఇంకేం మిగిలింది..
అంతా శూన్యమే అన్నట్టు ఉంటుంది.
మరుసటి రోజునుండి మన జీవితం మనం అంతా షరా మామూలే.
మన ఆకలి మనతోనే ఉంటుంది.
మన నిద్ర మనతోనే ఉంటుంది..
మన మనిషి తప్పితే మనది అన్నది ప్రతిదీ మనతోనే ఉంటుంది
ఎవరున్నా లేకపోయినా ఈ జీవిత నాటకం నడుస్తూనే ఉంటుంది
ఈ నాటకంలో మన పాత్ర పూర్తయ్యే వరకు
ఎవరికి ఏమయినా మనకేమీ కాదు
ఏదీ శాశ్వతం కాదు అనే ఓ వేదాంత ధోరణిలో
మనకు మనం నచ్చ చెప్పుకుంటాం
బ్రతుకు బండి లాగించేస్తుంటాం
మన జీవితాల్లోంచి ఎవరు వెళ్లిపోయినా మనం ఇంతేనా!
మా నాన్న చెప్పాపెట్టకుండా మాకు దూరం అయి సంవత్సరం అయిన సందర్భంగా...
5 వ్యాఖ్యలు:
last paragraph..well said..absolutely true
ఎవరున్నా లేకపోయినా ఈ జీవిత నాటకం నడుస్తూనే ఉంటుంది
నిజమండీ,అన్ని మామూలుగానే జరిగిపోతాయి, ఒక్క ఆ వ్యక్తి మాత్రం ఉండరు.బాధ మాత్రం మనతోనే ఉంటుంది ఎప్పటికీ
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు.
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులు.
Hope you're feeling better.
nijame maanaanna poyinappudu elaa untaam naanna lekundaa asalu maa naanna chanipovadamenti ani entha aascharyamo naanna elaa poyaaru mammalni vadili ani kaanee ippudu eppudo gaanee gurthuke raavadam ledu ento
కొన్ని సంఘటనలు మనల్ని చాలా బాధ పెడతాయి...కాని ఆ బాధ తీవ్రత కూడా రోజులు గడిచే కొద్దీ తగ్గిపోతుంది...మనసు పొరల్లో మాత్రం ఎక్కదో దాని తది వుండిపోతుంది...కాలనికి మాత్రం ఇవేమి పట్టవ్...ఎవరున్నా లేకున్నా పరిగెడుతూనే వుంటుంది...చాలా బాగా రాసారు...
Post a Comment