పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 24, 2011

రమణ లేని బాపు

అయ్యో బాపూ!

చిన్నీ రమణ గారు పోయారంట!

పొద్దున్నే టి.వి. లో వార్త చూసి మా ఆయన పెట్టిన కేక వినగానే
నాకు నోటివెంట వచ్చిన మొదటి మాట
 అయ్యో బాపూ!

బాపు-రమణ..
ఒక్క తెలుగు వారికే సొంతమయిన అరుదయిన జంట!
తనువు మనస్సూ ఒకటిగా మెలిగిన అపురూప స్నేహితులు
తెలుగు సినిమాకి...తెలుగు సాహిత్యానికి ఓ గుర్తింపు తెచ్చిన మహనుభావులు
ఇంతకాలం వాళ్ళిద్దరి పేర్లు కలిపి చదవాటానికి అలవాటుపడ్డ మనం
వాళ్ళిద్దరిని జంటగా చూడ్డమే అలవాటయిన మనం
ఇకనుండి ఒట్టి బాపు గారినే చూస్తాం అనుకుంటే ఎంత బాధగా ఉందో!
మనకే ఇంత బాధగా ఉంటే బాపూ గారికి ఇంకెంత తీరని లోటు!
ఆ క్షణం దాకా తనతో ఉన్న తన సహచరుడు
ఇక తనతో లేడు అనుకుంటే
అయ్యో బాపూ!

మీ ఇద్దరూ కలిసి తెలుగు వారికి
ఓ బుడుగుని... ఓ సీగానపెసూనని
ఓ రెండు జళ్ళ సీతని....ఓ గోపాలాన్ని
అన్నిటికీ మించి ఓ కోతికొమ్మచ్చిని
ఇచ్చినందుకు ఏమిచ్చి
మీ ఋణం తీర్చుకోగలం

పోయినోళ్ళందరూ మంచోళ్ళూ
ఉన్నోళ్ళు పోయినోళ్ల తీపి గురుతులు
అనుకుని ఊరట చెందటం తప్ప!!

7 వ్యాఖ్యలు:

మరువం ఉష February 24, 2011 at 8:29 AM  

యాదృచ్చిక ఘటన. సాయంత్రం ఎందుకో [అప్పటికీ వార్త తెలియదు] వీరిని గూర్చే చదివాను.

*****
.... ముళ్ళపూడి వెంకటరమణ పత్రికల్లో పనిచేసేకాలంలో సి.వి.వి. లక్ష్మి ., సి. వి. విజయలక్ష్మి అనే మారుపేర్లతో కాలంస్ రాసేవారట. ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వం ( కదంబ రమణీయం _1) లో ఈ వ్యాసాలన్నీ వున్నాయి
Ref:
http://naaspandhana.blogspot.com/2011/02/blog-post.html
*****

అలా కాసేపు వారి రచనల గూర్చి తలపోసాను. మీరన్నట్లు ఒక్కొక్కరి నిష్క్రమణ ఒక్కో వాస్తవ చరిత్రని గతానికి తరలిస్తుంది. కానీ ఎన్ని రేపుల వాస్తవాల్లోనైనా సజీవంగా మిగలగల చరితార్థులు కదా. బాపు గారే నా కళ్ళలోనూ కదలాడుతున్నారు. కాలమే అన్నిటికీ సమాధానం.

సిరిసిరిమువ్వ February 24, 2011 at 8:46 AM  

ఉషా
రెండురోజులబట్టి మా అబ్బాయి బుడుగు పుస్తకం పట్టుకుని కూర్చుంటుంటే రాత్రే ఒరేయ్ పరీక్షలప్పుడు కూడా ఆ పుస్తకం ఏంటి అని అరవబోయి పోనీలే మన ముళ్ళపూడి బుడుగే కదా అని ఊరుకున్నాను..అలా నిన్న రాత్రి నేనూ ఆయన్ని తలుచుకున్నాను:(

"ఎన్ని రేపుల వాస్తవాల్లోనైనా సజీవంగా మిగలగల చరితార్థులు కదా"..అవును మీరు చాలా చక్కగా చెప్పారు.

పరిమళం February 24, 2011 at 10:26 AM  

ముళ్ళపూడి వారికి శ్రద్ధాంజలి.

చిలమకూరు విజయమోహన్ February 24, 2011 at 12:25 PM  

‘శ్రీకృష్ణలీలలు’ ద్వారా వారిరువురూ ఎల్లప్పుడూ నా హృదయాన నిలిచే ఉంటారు.

durgeswara February 24, 2011 at 1:03 PM  

మహానుభావులు.ప్రత్యక్షంగా హరిసేవకోసం తరలివెళ్లారు.

SHANKAR.S February 24, 2011 at 9:39 PM  

ఇన్నాళ్లుగ నీ రాతల్లో నువ్వొదిలిన
ఫన్నీలన్నీ ఇపుడు నువ్వు లేవంటూంటే
కన్నీళ్లు ఒక్కుదుటన ధారలవుతున్నాయి
విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా

అటు చూడు
"హన్నా" అంటూ బెదిరించే బుడుగు బేలగా ఏడుస్తున్నాడు
"ప్రైవేట్" చెప్పేందుకు ఎవరూ లేక బాబాయ్ భోరుమంటున్నాడు
"సెగట్రీ" నీ ఆర్డర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు
"అరుణ" 'అప్పు'డే ఋణం తీర్చుకోద్దంటోంది
"రాధా గోపాళం" రావా రమణా అని పిలుస్తున్నారు

సర్లే ఇవన్నీ వదిలేయి. అటు చూడు బాపు కళ్ళలో ...తన మనసు నీకు తెలీదని కాదు కానీ నువ్వు లేని బాపు ని చూస్తే ఆత్మ లేని శరీరాన్ని చూసినట్టు లేదూ? అయినా
నీ ఆత్మ బాపులో
బాపు ఆత్మ నీలో ఉన్నప్పుడు
తన అనుమతి లేకుండా
పరమాత్మను చేరే హక్కు నీ కెక్కడ రమణా?

Unknown February 28, 2011 at 2:15 PM  

mullapoodi variki sraddanjali.......

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP