వీడ్కోళ్లు.....స్వాగతాలు.
వీడ్కోళ్లు...స్వాగతాలు...కమ్మటి జ్ఞాపకాలు...చేదు అనుభవాలు...
సంవత్సరం తరవాత మరలా మరో సంవత్సరం.....ఇలా పునారావృత్తం అవుతూనే ఉంటాయి. అదే నేను, అదే నీవు, అదే మనం, అదే లోకం, అదే బ్రతుకు....తేడా ఏమీ ఉండదు.
ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వచ్చింది, వెళ్లిపోతుంది, మరో సంవత్సరం రాబోతుంది. ఇలా సంవత్సరాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, మరి ఎప్పుడూ జరిగే దానికి ఇలా వేడుకలు, హడావిడీలు ఎందుకో నాకర్థం కాదు. కొంతమంది అయితే ఈ రోజు గడిచిపోతే మరలా రాదేమో, అనుభవించాల్సింది అంతా ఇప్పుడే ఈ నిమిషమే అనుభవించాలి అన్నట్టు ఉంటారు. దానికోసం ఎంత డబ్బైనా తగలేస్తారు. మళ్లీ రోజు తిరిగిందంటే ఎవరి బ్రతుకు పోరాటం వారిది, అంతా మామూలు అయిపోతుంది.
కొంతమంది ప్రతి కొత్త సంవత్సరం రోజు కొన్ని నిర్దిష్ట ప్రణాళికలు, కొన్ని లక్ష్యాలు, కొన్నిresolutions పెట్టుకుంటుంటారు, మరి ఎంతమంది వాటిని నిర్విఘ్నంగా విజయవంతంగా ఆమలు పరుస్తారో నాకైతే తెలియదు. ఓ పద్దతి ప్రకారం నడిచే వాళ్లకి ఈ కొత్త సంవత్సర లక్ష్యాలు, resolutions అవసరమా అని నాకనిపిస్తుంది. అయినా అవి కొత్త సంవత్సరం రోజే ఎందుకు పెట్టుకోవాలో అన్నది నాకర్థం కాని ఓ కోటి రూపాయల ప్రశ్న!
ఒకప్పుడు కొత్త సంవత్సరం వస్తుందంటే ఓ పది రోజుల ముందు నుండి ఎంత హడావిడి పడిపోయేదాన్నో. గ్రీటింగు కార్డులు చేయటం, పంపించటం, అదే సమయంలో సంక్రాంతి ముగ్గులు--పగలంతా గ్ర్రీటింగ్ కార్డ్సు చేసే పని రాత్రి ముగ్గులు వేసే పని, అబ్బో క్షణం తీరిక ఉండేది కాదు. ఇప్పుడు అసలు ఈ శుభాకాంక్షలు అవీ ఎందుకన్న ఓ నిరాసక్తి. మరో సంవత్సరం వస్తుంది, అది మామూలే కదా, దానికి ఇంత హడావిడి అవసరమా అన్న ఓ నిర్వేదం. వయస్సు ప్రభావం కావచ్చు. ఓ సంవత్సరం గడిచిపోయిందంటే మనకీ ఓ సంవత్సరం దగ్గర పడ్డట్టేగా! దాన్ని ఎలుగెత్తి చెప్పాటానికేనా ఈ ఉత్సవాలు, ఈ సంబరాలు? అయినా ఏం సాధించామని ప్రతి సంవత్సరం ఈ సంబరాలు, ఉత్సవాలు అనిపిస్తుంది.
ఒక్కొకసారి రోజులు ఇంత త్వరగా ఎందుకు గడుస్తాయా అనిపిస్తుంది. నా కళ్లముందే నన్ను మించి (శారీరకంగా, మానసికంగా) నా పిల్లలు పెరిగిపోతుంటే అదొక అబ్బురంగా ఆనిపిస్తుంది. నా పొత్తిళ్లలో ఆడుకున్నది వీరేనా అని అనిపిస్తుంది. చిట్టి చిట్టి చేతులతో అమ్మ పొట్టని తడుముతూ కాస్త ఎడం అయితే ఎక్కడికన్నా వెళ్లిపోతుందేమో అన్నట్టు కాళ్లూ చేతులతో పెనవేసుకుని పడుకున్న పిల్లలు వీళ్లేనా అనిపిస్తుంది. అంత అబ్బురంలో కూడా ఏ మూలో కించిత్తు బాధ----ఇంకొన్నేళ్లు పోతే వాళ్లెక్కడో నేనెక్కడో కదా అని అనిపిస్తుంది.
కాలం ఇలా ఆగిపోనీ.......
కాలం ఇలా ఇక్కడే ఈ నిమిషం ఫ్రీజ్ అయిపోతే....ఎంత బాగుంటుందో కదూ!
ఊగిసలాడకే మనసా నువ్వు ఉబలాట పడకే మనసా ...!
http://etelugu.org/typing-