December 31, 2010
ఆదివారం ఆడవాళ్ళకు సెలవు
సరే భోజనానికి ఏం చేస్తున్నారు అని అడిగా. అలోచిద్దాము అని అప్పటికి తప్పించుకుని వెళ్ళి మరలా కంప్యూటర్ మీద కూర్చున్నారు. నేను కూడ ఈనాడు ఆదివారం పుస్తకం పట్టుకుని మంచం ఎక్కా అహా ఏమి నా భాగ్యము అనుకుంటూ.
11 గంటలయ్యక అనుకుంటా మా పాప వెళ్ళి నాన్నా ఈ రోజు మనదే వంట పని అని గుర్తుచేసింది. లేదురా నాన్నా ఈ రోజు నాకు కంప్యూటర్ మీద చాలా పని వుంది (ఇంకేం పని, వికీ పని లేకపొతే బ్లాగుల పని) అందుకని బయటినుండి కూరలు తెచ్చేసుకుందాము,నువ్వు బియ్యం కడిగి పెట్టేయి అని ఒక అల్టిమేటం పడేసారు తనకి. లేచి వంట చేద్ద్దామా అనిపించింది ఒక నిమిషం,అమ్మో చేస్తే అసలకే లోకువవుతాము అని ఆ ప్రయత్నం విరమించా.
భోజనాల టైంకి వెళ్ళి కూరలు తెచ్చేసారు, అది కూడా నాలుగు రకాలు,(ఏం నువ్వు చేయకపొతే మాకేం అన్నట్లు ఒక చూపు విసిరి).
ఒక్క కూర కూడా నోట్లో పెట్టుకోను పనికి రాలా. మా వాడు అయితే పాపం వట్టి పెరుగన్నమే తిని సరిపెట్టుకున్నాడు. ఒకటేమో యమా కారం,ఒక దానిలో ఉప్పు లేదు,గుత్తొంకాయ అంట ఏదో పలచగా రసం లాంటి దానిలో నాలుగు వంకాయలు పడేసినట్లుంది. కొద్దిగా సాంబారే నయం అనిపించింది. పిల్లలిని చూస్తే అయ్యొ అనిపించింది. శుభ్రంగా పప్పు పచ్చడితో తిన్నా బాగుండేది, ఈయనని నమ్ముకుంటే ఇంతే అని మనసులోనే అనుకుని ఏదో తిన్నామనిపించాము. సాయంత్రం మన ముగ్గురం కలిసి ఎంచక్కగా వండేద్దాము అని ముగ్గురు కలిసి ఒక భయంకర తీర్మానం కూడా చేసేసుకున్నారు.
సాయంత్రం అయింది. ఇక వంట మొదలుపెడతారు కాబోలు అని చూస్తున్నాను, ఏమైనా సలహాలు అడిగితే పడేద్దాము అని. ఎబ్బే! ఏం కదలిక లేదు. కంప్యూటర్ మీద కొట్టుకుంటూనే వున్నారు. నాకెందుకని నేను కూడా మెదలకుండా టి.వి లో వచ్చిన ప్రతి సినిమా చూస్తూ పడుకున్నాను. తీరిగ్గా రాత్రి 8 అయ్యాక పదండి బయటికి వెళ్ళి భోంచేసి వద్దాము అని బయలుదేరదీసారు. ఆ హోటలు భోజనం అంతకన్నా దరిద్రంగా వుంది. అన్ని మంట, పైగా ఎ.సి సరిగ్గా లేదు, బిల్లు మాత్రం వాయించాడు. పిల్లలు సూపూ ఐస్క్రీమూ తప్పితే ఏదీ సరిగ్గా తినలేదు. ఇక ఈ హోటలుకి రాకూడదు అనుకుంటూ బయటపడ్డాము. ఇంటికి వచ్చాక నేను మా వాడు కాస్తంత మజ్జిగ తాగి అమ్మయ్యా అనుకున్నాము. మొత్తానికి నిన్న ఆదివారం అంతా మా వారి పుణ్యమా అని సండే స్పెషల్సు సంగతి దేవుడెరుగు అందరం అర్థాకలితోనే పడుకోవాల్సి వచ్చింది. అప్పుడు అర్థమయ్యింది మన పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి సెలవు ఎందుకు పెట్టలేదో!!!!! మీక్కూడా అర్థం అయ్యిందనుకుంటాను.
December 16, 2010
రండి రండి తరలి రండి రజతోత్సవ పుస్తక ప్రదర్శనకి .....
గత సంవత్సరపు తీపి గురుతులు మదిలో అలా అలా ఇంకా నిలిచి ఉండగానే హైదరాబాదు పుస్తక ప్రదర్శన మళ్లీ వచ్చేసింది. ఈ రోజు అంటే డిసెంబరు 16 నుండి డిసెంబరు 26 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. మిగతా పుస్తక ప్రియుల సంగతేమో కాని మన తెలుగు బ్లాగర్లకు మరియు e-తెలుగు సభ్యులకు మాత్రం ఇది నిజంగా ఓ పెద్ద పండగే! ఎప్పుడూ చూడని బ్లాగర్లని చూడవచ్చు....పరిచయం చేసుకోవచ్చు, కబుర్లాడుకోవచ్చు, మిరపకాయ బజ్జీలు తినవచ్చు..కాసేపు e-తెలుగు స్టాలులో నిలబడి ఎంతో మంది ప్రముఖులని కలుసుకోవచ్చు..వారితో మాటామంతీ ఆడవచ్చు..కొండొకచో వారితో బ్లాగులూ మొదలుపెట్టించవచ్చు!!
ఈ సంవత్సరం 250 అంగళ్లట! మరి అందరూ కొనాల్సిన పుస్తకాల చిట్టాతో తయారుగా ఉన్నారా !
అంతే కాదండోయ్ ఇది 25వ పుస్తక ప్రదర్శన. ఈ సందర్భంగా 19వ తేదీ అంటే వచ్చే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పుస్తక ప్రియులు చేసే పాదయాత్ర ఉంటుంది. పోయిన సంవత్సరం ఎక్కువగా మన e-తెలుగు సభ్యులు మరియు తెలుగు బ్లాగర్లే ఈ నడక కార్యక్రమంలో పాల్గొన్నారు, మరి ఈ సంవత్సరం కూడా e-తెలుగు సభ్యులు, తెలుగు బ్లాగర్లు మరింత ఉత్సాహంతో మరింతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుందాం.
అలాగే డిసెంబరు 26 అంటే ఆ పై ఆదివారం అన్ని రంగాలనుండి ఓ 25 మంది ప్రముఖులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.
ఎప్పటిలాగే e-తెలుగు వారు పెట్టే స్టాలుతో పాటు ఈ సారి ఇంకో కొత్త స్టాలు కూడా రాబోతుంది..అదీ మన తెలుగు బ్లాగర్లు పెట్టబోతుందే....మరి అదేంటో దాని కథాకమామిషూ ఏమిటో తెలియాలంటే మరి మీరూ పుస్తక ప్రదర్శనకు రావల్సిందే!
ఇంకొక విషయం అండోయ్.. ప్రముఖ బ్లాగరు మరియూ ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి గారు వ్రాసిన "చాతక పక్షులు" సీరియల్ దాదాపు బ్లాగర్లందరూ చదివే ఉంటారు..అది ఇప్పుడు ఎమెస్కో వాళ్ళు పుస్తకంగా తీసుకు వచ్చారు. అది కూడా పుస్తక ప్రదర్శనలో ఎమెస్కో వారి అంగటిలో లభ్యమవుతుంది..వెల 60 రూపాయలు మాత్రమే! మరి మీ కొనాల్సిన పుస్తకాల చిట్టాలో ఇంకో పుస్తకం జత చేసుకోవచ్చన్నమాట!
చివరగా ఓ విన్నపం....ఆసక్తి ఉన్నవాళ్ళు మీ విలువైన సమయాన్ని కొంత e-తెలుగు స్టాలులో వలంటీరుగా ఉండేందుకు వెచ్చించగలరేమో అలోచించండి!
తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి