పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

January 1, 2011

కొత్త శతాబ్దంలో ఓ దశాబ్దం

జనవరి 1, 2011.....ఈ రోజు కొత్త సంవత్సరమే కాదు..ఈ రోజుకి మరొక ప్రత్యేకత కూడా ఉంది.
1-1-11 ఇలా నాలుగు ఒకట్లు వెయ్యి సంవత్సరాలకి ఒకసారే వస్తుంది.
అలాగే 11-11-11 ......నవంబరు 11, 2011
ఇలా వంద సంవత్సరాలకి ఒకసారే వస్తుంది.
నవంబరు 11, 1911 న ఇలా వచ్చింది..మరలా వంద సంవత్సరాలకి ఈ సంవత్సరం వస్తుంది.

కొత్త శతాబ్దంలో ఓ దశాబ్దం గడిచిపోయింది.  మరో దశాబ్దం మొదలయ్యింది.  2001 మొదలయినప్పుడు ఎంత హడావిడీ!  రోజు రోజూ మారే రోజే...ఎప్పుడూ వచ్చే డిసెంబరు 31....ఎప్పుడూ వచ్చే రాత్రి పన్నెండు గంటలే.. అన్ని సంవత్సరాలలాగే అదీ ఓ సంవత్సరమే.. కానీ అదేదో కొత్తదన్నట్టు..ఇంతకు ముందు ఎప్పుడూ రానిదయినట్టు...ఇక ముందు రాదేమో అన్నట్లు...మనం ఇక మరో సంవత్సరాన్ని చూడమేమో అన్నట్లు ఎంత హడావిడీ చేసాం. ఎంత ఘనంగా ఈ శతాబ్దపు మొదటి రోజుకు స్వాగతం పలికాం. మరి మన ఆశల్ని ఆకాంక్షల్ని ఈ దశాబ్దం నెరవేర్చిందా?  ఏమో సామాన్యుడి బ్రతుకు బండి వెనకటికంటే ఇంకా నిస్సారంగా నడుస్తుందేమో అనిపిస్తుంది. పెరిగిపోతున్న ఉగ్రవాదం...వేర్పాటు వాదం...ఆసిడ్ దాడులు...కక్షలు...కార్పణ్యాలు...కుంభకోణాలు.....అభం శుభం తెలియని చిన్నపిల్లల అపహరణలు..హత్యలు...దోపిడీలు....ఏంటో జానెడు పొట్టకోసం ఎన్నెన్ని అకృత్యాలు!!

ఈ పది సంవత్సరాలల్లో ఎన్నెన్ని మార్పులు, ఎన్నెన్ని కొత్త ఆవిష్కరణలు..ఆ ఆవిష్కరణల పుణ్యమా అని మన జీవితాల్లో ఎంత హడావిడీ! సరిగా తినటానికి, నిద్రపోవటానికి, ఆత్మీయులతో మాట్లడటానికి తీరికలేనంత హడావిడీ.  చేతినుండా డబ్బయితే ఉంటుంది కాని చేతిలో సమయమే ఉండటం లేదు. 

ప్రతి ఇంటినుండి కనీసం ఓ ఎన్నారై....ఒక్కో ఇంటికి కనీసం ఓ రెండు సెల్లు ఫోనులు (భారతదేశంలో బాత్‍రూములు లేకపోయినా సెల్లు ఫోనులు మాత్రం ప్రతి ఇంట్లో ఉన్నాయంట).... చదువు అయ్యీ అవగానే అందమయిన ఐదు నక్షత్రాల హోటళ్ల లాంటి ఆఫీసుల్లో కొలువులు...అంతర్జాల పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా మన కళ్లముందు ప్రత్యక్షం...ఆర్కుట్లు , బ్లాగులు, ఫేసుబుక్కులు,ట్విట్టర్లలో కొత్త కొత్త స్నేహాలు, చాటులు....ఇవి లేకుండా రోజు గడవని పరిస్థితి.  ఎదురుగా ఉండే మనుషులతో మాట్లాడాటానికి మాత్రం మనకు సమయం ఉండదు.

పదిసంవత్సరాల క్రితం హైదరాబాదులో ఒక్క మాలు కాని మల్టిఫ్లెక్సు  కానీ లేదు..అలాంటిది ఇప్పుడు అడుగడుక్కి  మాల్సు..మల్టిఫ్లెక్సులు....ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా జనాలు...మన కొనుగోలు శక్తి ఇంతలా పెరిగిపోయిందా అని అబ్బురపడేంత!!

ఇదివరకు ఏదో మన చదువుకి తగ్గ ఉద్యోగం..కుటుంబం నడిచిపోయేంత జీతం..అమ్మ నాన్నల్ని చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ప్రశాంతంగా జీవితం గడిచిపోతే చాలనిపించేది.  మరి ఇప్పుడో మొదలు మొదలే వేలల్లో జీతాలు..పోటాపోటీ ఆడంబరమయిన జీవన విధానాలు...కారు, ఇల్లు, స్థలం, ఇంట్ర్నేషనల్ స్కూల్లో పిల్లల చదువులు...అంతా వేలల్లో ఖర్చులు...పొద్దుట బ్రేకుఫాస్టు నుండి రాత్రి డిన్నరు వరకు అన్నిట్లో పోటీనే! అన్నిట్లో వేగమే...ప్రశాంతత లేని వేగం.

 గతంలో కన్నా ఈ పదేళ్లలోనే మన జీవితాలల్లో మార్పు చాలా వేగంగా ఉందేమో అని నాకు అనిపిస్తుంది.  ఈ వేగంలో పడి చిన్ని చిన్ని ఆనందాలు..అనుభూతులు..అన్నీ దూరం దూరం.  ఇంధ్రధనుస్సుని చూసి ఎన్ని రోజులయ్యింది.  ఓ పక్క ఎండ మరో పక్క సన్నటి చినకులు పడుతుంటే గబగబా బయటికి పరుగులు పెట్టేవాళ్లం ఇంధ్రధనుస్సు కనిపిస్తుందేమో అని..ఎన్ని సార్లు చూసినా తనివితీరని అందం..ఒకసారి కనీకనిపించకుండా కనువిందు చేస్తే మరోసారి ఆకాశం ఆ దరిని ఈ దరిని కలుపుతూ ఓ పెద్ద విల్లు..ఎవరో చిత్రకారుడు  పైకి వెళ్లి శ్రద్దగా గీసి కుంచెతో రంగులద్దినట్టు.  ఒక్కోసారి ఒకదాని కింద మరోటి..రెండు కూడా వచ్చేవి..ఇప్పటి పిల్లలకి అసలు ఇంధ్రధనుస్సు అంటే ఏంటో అది ఎప్పుడు వస్తుందో తెలుసో లేదో..అసలు మనమే మర్చిపోయాం దాని గురించి.  అసలు చూడటానికి ఈ ఆకాశహర్మ్యాల్లో అసలు ఆకాశం కనపడితేగా!!   మొన్నొక రోజు ఏదో పని మీద డాబా మీదకి వెళితే ఓ పెద్ద ఇంధ్రధనుస్సు...అబ్బ ఎన్ని రోజులకి అని నన్ను నేను మర్చిపోయి చూసాను. వరద గుడంటే..ఏ దేవుడి గుడి అని అడిగే వాళ్లే ఎక్కువ!

కాలం ఇలా కదిలిపోతూనే ఉంటుంది.  మరో సంవత్సరం..మరో దశాబ్దం..మరో శతాబ్దం.....దానికి అలుపు ఉండదు...దానికి ఏ కొత్త సంవత్సరపు తీర్మానాలూ ఉండవు..ఓ క్రమశిక్షణ కల సైనికుడిలా దాని పని అది చేసుకుంటూ పోతుంది. నిన్నే ఏదో బ్లాగులో అనుకుంటాను చదివాను...."గతం మంచులాంటిది...మళ్లీ కనిపించదు..వెనక్కి తిరిగి చూడకు"..అని.  కాలం మంచులాంటిదే అయినా అది మిగిల్చే జ్ఞాపకాలు కాంక్రీటు కన్నా గట్టి...చెదరవు మరి.  ఆ జ్ఞాపకాలే లేకపోతే మనిషికి  మానుకి తేడా ఏముంది??

ఇక వ్యక్తిగతంగా నాకు గడిచిన దశాబ్దం.....ముఖ్యంగా 2010 సంవత్సరం...ఆనందాలకంటే విషాదాలనే ఎక్కువగా మిగిల్చింది.  నేను చాలా అభిమానంచే మా నాయనమ్మ ఈ దశాబ్దంలోనే మరణించటం...అనుకోని రీతిలో మా నాన్న గారు ఈ సంవత్సరం మాకు దూరం కావటం మేమింకా  జీర్ణించుకోలేని సత్యాలే!

రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.  అలాంటి రైతుకి 2010 ఎప్పుడూ ఎరుగనన్ని చేదు జ్ఞాపకాలని... ఆవేదనని మిగిల్చింది. గాదెలనిండా ధాన్యరాసులతో కళళలాడాల్సిన రైతుల ఇళ్ళు ఈ సారి కళ తప్పి బోసిపోతున్నాయి. ముక్కిపోయిన మసక బారిన ధాన్యాని చూసుకుని ఏం చెయ్యాలో తెలియక ఆరుకాలం కష్టించి పండించిన పంటకి నిప్పు పెట్టుకుంటున్నాడు.  ఈ సంవత్సరమన్నా రైతుకి శుభప్రదం కలగాలని ..ప్రకృతి రైతుకి సహకరిస్తుందని ఆశిస్తూ ....

ఈ  రోజు మా ఇంటిముందు వేసిన ముగ్గులు.


                      
                                   సర్వేజనా సుఖినోభవంతు

Read more...

December 31, 2010

కొన్ని టపాలు డ్రాఫ్టుల్లోకి వెళ్ళిపోయాయి

నేను నా బ్లాగులో టపాలే అంతగా వ్రాయటం లేదనుకుంటుంటే...వ్రాసిన వాటిల్లో కూడా కొన్ని డ్రాఫ్టుల్లోకి వెళ్ళిపోయాయి.  ఈ మధ్య నేనుగా అయితే నా బ్లాగుని ఏం కెలకలేదు..మరి ఎందుకు వెళ్ళాయో? వాటిని మరలా ప్రచురించుకుంటున్నాను.  ఏంటి ఈ పాత టపాలు అనుకుంటారేమోనని చిన్న వివరణ.

Read more...

ఆదివారం ఆడవాళ్ళకు సెలవు

ఇంతకు ముందు ఆదివారం వస్తే మా వారు వంట పనిలో ఎంచక్కగా సాయం చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ వికీపిడీయాలు,బ్లాగులు వచ్చాక ఆదివారం కూడా లేవగానే కంప్యూటర్ ముందు సెటిల్ అయిపోతున్నారు. ఇక లాభం లేదని నిన్న ఆదివారం నాకు నేనే సెలవు ప్రకటించేసుకున్నాను. (ఈ మధ్య ఆదివారము ఆడవాళ్ళకు సెలవు అని ఒక సినిమా వచ్చిందిలేండి, ఆ స్ఫూర్తితో) . శుభ్రంగా పొద్దున్నే లేచి పేపరు చదువుకుంటూ కూర్చున్నా (ఏం మగవాళ్ళకేనా పొద్దున్నే పేపరు చదువుకునే హక్కు అనుకుంటూ). ఈయన లేచివచ్చి ఈ రోజేంటి టిఫిన్ అనగానే మీ ఇష్టం మీరు ఏం చేస్తే అదే అన్నా, ఆయనికి అర్థం అయిపొయింది ఇక ఈ రోజుకి వంటింటి డ్యూటీ తనదేనని. నేను మాత్రం చక్కగా పేపరు చదివేసి, తలకి హెన్నా పెట్టుకుని స్నానం చేసి వచ్చా. వచ్చేటప్పటికి పిల్లలు ఆయన కలిసి డైనింగ్ టేబుల్ అంతా నానా కంగాళీ చేసి ఏదో శ్రమ పడి బ్రెడ్ సాండ్విచ్ చేసేసారు (మరి అదే కదా తేలికైన టిఫిన్-అదే నేనైతే ఆదివారం స్పెషల్ అంటూ పూరి చేయించేవాళ్ళు).

సరే భోజనానికి ఏం చేస్తున్నారు అని అడిగా. అలోచిద్దాము అని అప్పటికి తప్పించుకుని వెళ్ళి మరలా కంప్యూటర్ మీద కూర్చున్నారు. నేను కూడ ఈనాడు ఆదివారం పుస్తకం పట్టుకుని మంచం ఎక్కా అహా ఏమి నా భాగ్యము అనుకుంటూ.

11 గంటలయ్యక అనుకుంటా మా పాప వెళ్ళి నాన్నా ఈ రోజు మనదే వంట పని అని గుర్తుచేసింది. లేదురా నాన్నా ఈ రోజు నాకు కంప్యూటర్ మీద చాలా పని వుంది (ఇంకేం పని, వికీ పని లేకపొతే బ్లాగుల పని) అందుకని బయటినుండి కూరలు తెచ్చేసుకుందాము,నువ్వు బియ్యం కడిగి పెట్టేయి అని ఒక అల్టిమేటం పడేసారు తనకి. లేచి వంట చేద్ద్దామా అనిపించింది ఒక నిమిషం,అమ్మో చేస్తే అసలకే లోకువవుతాము అని ఆ ప్రయత్నం విరమించా.

భోజనాల టైంకి వెళ్ళి కూరలు తెచ్చేసారు, అది కూడా నాలుగు రకాలు,(ఏం నువ్వు చేయకపొతే మాకేం అన్నట్లు ఒక చూపు విసిరి).

ఒక్క కూర కూడా నోట్లో పెట్టుకోను పనికి రాలా. మా వాడు అయితే పాపం వట్టి పెరుగన్నమే తిని సరిపెట్టుకున్నాడు. ఒకటేమో యమా కారం,ఒక దానిలో ఉప్పు లేదు,గుత్తొంకాయ అంట ఏదో పలచగా రసం లాంటి దానిలో నాలుగు వంకాయలు పడేసినట్లుంది. కొద్దిగా సాంబారే నయం అనిపించింది. పిల్లలిని చూస్తే అయ్యొ అనిపించింది. శుభ్రంగా పప్పు పచ్చడితో తిన్నా బాగుండేది, ఈయనని నమ్ముకుంటే ఇంతే అని మనసులోనే అనుకుని ఏదో తిన్నామనిపించాము. సాయంత్రం మన ముగ్గురం కలిసి ఎంచక్కగా వండేద్దాము అని ముగ్గురు కలిసి ఒక భయంకర తీర్మానం కూడా చేసేసుకున్నారు.

సాయంత్రం అయింది. ఇక వంట మొదలుపెడతారు కాబోలు అని చూస్తున్నాను, ఏమైనా సలహాలు అడిగితే పడేద్దాము అని. ఎబ్బే! ఏం కదలిక లేదు. కంప్యూటర్ మీద కొట్టుకుంటూనే వున్నారు. నాకెందుకని నేను కూడా మెదలకుండా టి.వి లో వచ్చిన ప్రతి సినిమా చూస్తూ పడుకున్నాను. తీరిగ్గా రాత్రి 8 అయ్యాక పదండి బయటికి వెళ్ళి భోంచేసి వద్దాము అని బయలుదేరదీసారు. ఆ హోటలు భోజనం అంతకన్నా దరిద్రంగా వుంది. అన్ని మంట, పైగా ఎ.సి సరిగ్గా లేదు, బిల్లు మాత్రం వాయించాడు. పిల్లలు సూపూ ఐస్క్రీమూ తప్పితే ఏదీ సరిగ్గా తినలేదు. ఇక ఈ హోటలుకి రాకూడదు అనుకుంటూ బయటపడ్డాము. ఇంటికి వచ్చాక నేను మా వాడు కాస్తంత మజ్జిగ తాగి అమ్మయ్యా అనుకున్నాము. మొత్తానికి నిన్న ఆదివారం అంతా మా వారి పుణ్యమా అని సండే స్పెషల్సు సంగతి దేవుడెరుగు అందరం అర్థాకలితోనే పడుకోవాల్సి వచ్చింది. అప్పుడు అర్థమయ్యింది మన పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి సెలవు ఎందుకు పెట్టలేదో!!!!! మీక్కూడా అర్థం అయ్యిందనుకుంటాను.

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP