పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 16, 2010

రండి రండి తరలి రండి రజతోత్సవ పుస్తక ప్రదర్శనకి .....

గత సంవత్సరపు తీపి గురుతులు మదిలో అలా అలా ఇంకా నిలిచి ఉండగానే  హైదరాబాదు పుస్తక ప్రదర్శన మళ్లీ వచ్చేసింది.  ఈ రోజు అంటే డిసెంబరు 16 నుండి డిసెంబరు 26 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. మిగతా పుస్తక ప్రియుల సంగతేమో కాని మన తెలుగు బ్లాగర్లకు మరియు e-తెలుగు సభ్యులకు మాత్రం ఇది నిజంగా ఓ పెద్ద పండగే! ఎప్పుడూ చూడని బ్లాగర్లని చూడవచ్చు....పరిచయం చేసుకోవచ్చు, కబుర్లాడుకోవచ్చు, మిరపకాయ బజ్జీలు తినవచ్చు..కాసేపు e-తెలుగు స్టాలులో నిలబడి ఎంతో మంది ప్రముఖులని కలుసుకోవచ్చు..వారితో మాటామంతీ ఆడవచ్చు..కొండొకచో  వారితో బ్లాగులూ మొదలుపెట్టించవచ్చు!!

ఈ సంవత్సరం 250 అంగళ్లట! మరి అందరూ కొనాల్సిన పుస్తకాల చిట్టాతో తయారుగా ఉన్నారా !

అంతే కాదండోయ్ ఇది 25వ పుస్తక ప్రదర్శన.  ఈ సందర్భంగా 19వ తేదీ అంటే వచ్చే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పుస్తక ప్రియులు చేసే పాదయాత్ర ఉంటుంది.  పోయిన సంవత్సరం  ఎక్కువగా మన e-తెలుగు సభ్యులు మరియు తెలుగు బ్లాగర్లే  ఈ నడక కార్యక్రమంలో పాల్గొన్నారు,  మరి ఈ సంవత్సరం కూడా e-తెలుగు సభ్యులు, తెలుగు బ్లాగర్లు మరింత ఉత్సాహంతో మరింతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుందాం.

అలాగే డిసెంబరు 26 అంటే ఆ పై ఆదివారం  అన్ని రంగాలనుండి ఓ 25 మంది ప్రముఖులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.

ఎప్పటిలాగే e-తెలుగు వారు పెట్టే స్టాలుతో పాటు ఈ సారి ఇంకో కొత్త స్టాలు  కూడా రాబోతుంది..అదీ మన తెలుగు బ్లాగర్లు పెట్టబోతుందే....మరి అదేంటో దాని కథాకమామిషూ ఏమిటో తెలియాలంటే మరి మీరూ పుస్తక ప్రదర్శనకు రావల్సిందే!

ఇంకొక విషయం అండోయ్.. ప్రముఖ బ్లాగరు మరియూ ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి గారు వ్రాసిన "చాతక పక్షులు" సీరియల్ దాదాపు బ్లాగర్లందరూ చదివే ఉంటారు..అది ఇప్పుడు ఎమెస్కో వాళ్ళు పుస్తకంగా తీసుకు వచ్చారు.  అది కూడా పుస్తక ప్రదర్శనలో ఎమెస్కో వారి అంగటిలో లభ్యమవుతుంది..వెల 60 రూపాయలు మాత్రమే! మరి మీ కొనాల్సిన పుస్తకాల చిట్టాలో ఇంకో పుస్తకం జత చేసుకోవచ్చన్నమాట!

చివరగా ఓ విన్నపం....ఆసక్తి ఉన్నవాళ్ళు మీ విలువైన సమయాన్ని కొంత e-తెలుగు స్టాలులో వలంటీరుగా ఉండేందుకు వెచ్చించగలరేమో అలోచించండి!
                                                     
                             తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి

Read more...

December 6, 2010

ఇంటినుండి పని-ఎంత సౌఖ్యం

ఇంటినుండి పని (work from home)...ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఓ ఉద్యోగ అమరిక.  ఓ పదేళ్లముందు ఇలా ఇంటినుండి పని గురించి మనం కనీసం కల కూడా కని ఉండం. ఇంటి దగ్గర చెప్పుకునే ట్యూషన్సు, డాటా ఎంట్రీ వర్కులు..ఇలాంటి వాటి గురించి వదిలెయ్యండి.  ఖచ్చితంగా ఆఫీసుకే వెళ్ళి చెయ్యాల్సిన ఉద్యోగాన్ని మనం ఇప్పుడు ఇంటినుండే చెయ్యగలుగుతున్నాం.  సాంకేతిక అభివృద్ధి అనండి..మరోటి అనండి అసలు కనని కల ఇలా సాకారమై చాలామందికి ఎంతో సౌలభ్యంగా ఉంది.  ఎప్పుడో ఒక రోజు కాదు అస్సలు ఆఫీసు ముఖం చూడకుండా పని చేసెయ్యటం..నెల తిరిగేటప్పటికి మన డబ్బులు మన అకౌంటులో పడిపోవటం...ఎంత సౌలభ్యం!!

కానీ ఈ మధ్య కొంతమంది, ముఖ్యంగా ఆడవారు, ఈ ఇంటినుండి పని పట్ల విముఖత చూపిస్తున్నారని ఓ స్టడీలో వెల్లడయింది.  దానికి వారు చెప్పిన ప్రధాన కారణాలు
1. మేము సోషలు లైఫు మిస్సు అవుతున్నాం. ఇంట్లో నుండి పని చెయ్యటం వల్ల వ్యక్తిగతంగా మాకంటూ ఓ జీవితం లేకుండా అంతా మెకానికల్ అయిపోయింది అనిపిస్తుంది. ఇంట్లో కుటుంబసభ్యులతో చెప్పుకోలేని కొన్ని సమస్యలను ఆఫీసులో స్నేహితులతో చెప్పి ఊరట చెందేవాళ్లం.  ఇప్పుడు ఆ అవకాశం లేదు.  ఆఫీసులో జరిగే బాతాఖానీలు ...పార్టీలు..మనస్సుకి కాస్త రిలాక్సేషను ఇచ్చేవి.  ఇప్పుడు అవేవి లేవు.  ఇలాంటి వాటిని బాగా మిస్సు అవుతున్నాం.

2. పిల్లలతో మిగతా కుటుంబసభ్యులతో సమయం గడపగలుగుతున్నాం కానీ...దాని మూలాన మా మీద మామూలు కన్నా వత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నాం కదా అని అందరూ మా మీద మరీ ఎక్కువగా ఆధారపడుతున్నారేమో అనిపిస్తుంది.  ఇంతకుముందు ఆఫీసుకి వెళ్లేటప్పుడు నాకు పనిలో సహాయం చేసినా చెయ్యకపోయినా ఎవరి పనులు వాళ్లు చేసుకునే వాళ్లు.  కానీ ఇప్పుడు అన్నిటికి నా మీదే ఆధారపడుతున్నారు.  అన్నీ ఎదురెదురు అందివ్వాల్సి వస్తుంది .  ఈ వత్తిడి నా ఉద్యోగ విధుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

3. ఇక అనుకోకుండా వచ్చే అతిధులతో వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
వీటన్నిటితో  మా పని మేము ఇదివరకటి అంత శ్రద్దగా...అంకితభవంతో చెయ్యలేకపోతున్నాం.  వృత్తి జీవితంలో అనుకున్నంత ముందుకు కూడా వెళ్లలేకపోతున్నాం..కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది.

ఈ ఇంటినుండి పని తప్పక చెయ్యటమే కానీ మాకు నచ్చి చెయ్యటం కాదు.  కొన్ని సౌలభ్యాలు కూడా ఉన్నాయి కానీ మాకు కలిగే అసంతృప్తితో పోల్చుకుంటే ఆఫీసుకెళ్లి పనిచేసుకోవటమే ఉత్తమం అనిపిస్తుంది.  పిల్లలు పెద్దవ్వగానే మరలా ఆఫీసునుండే పని చేస్తాం.......ఇవీ స్థూలంగా వాళ్లు చెప్పిన కారణాలు.

నేనూ గత ఐదు సంవత్సరాలుగా ఇంటినుండే పని చేస్తున్నా కానీ నాకు ఇలా అనిపించలేదు..కొన్ని అనిపించినా అవి మనం ప్లాన్ చేసుకోవటంలో మిగతా కుటుంబసభ్యులకి అర్థం అయ్యేటట్లు చెప్పుకోవటంలో ఉంటుంది .  కొన్ని అసౌకర్యాలు ఉన్నా నాకు ఇంటినుండి పనే సౌఖ్యంగా ఉంది. దేంట్లో అయినా కొంత మంచి..కొంత చెడూ ఉంటాయి.

ఆఫీసు టైముకి ఓ రెండు మూడు గంటలు ముందు బయలుదేరి మన నగర ట్రాఫిక్కులో ఈదుకుంటూ  ఆఫీసు చేరి..సాయంత్రం ఆఫీసు అయ్యాక ఓ రెండు మూడు గంటలకి ఉసూరుమంటూ ఇల్లు చేరటం..మళ్లీ ఇంట్లో పనులు..బాధ్యతలు.... దీనికన్నా హాయిగా ఇంట్లో ఉండి పనిచేసుకోవటంలో ఎంత ఆనందం ఉందో కదా! ఈ ఆనందం ముందు ఆఫీసుకి వెళ్తే వచ్చే ఎన్ని ఆనందాలయినా దిగదుడుపే!!

మనం పని చేసేది అమెరికా కంపెనీలకి..మరి వాటిల్లో మన పండగలకి పబ్బాలకి సెలవులుండవు...ఆ రోజుల్లో హడావుడిగా ఎనిమిదింటికల్లా అన్ని పనులు (ఆ రోజు పనమ్మాయి రాకపోతే అ పని కూడా) చేసుకుని ఆఫీసుకి
పరిగెత్తిన రోజులు ఎన్నో!! అదీ ఆఫీసు ఇంటికి దగ్గర కాబట్టి ఆఫీసు టైముకి ఇంటి దగ్గర బయలుదేరితే సరిపోయేది..అదే దూరం అయితే..అవన్నీ తలుచుకుంటే నాకయితే బాబోయ్ మళ్లీ ఆఫీసు గడపా తొక్కటమా అనిపిస్తుంది.

పిల్లలకి ఆరోగ్యం బాగోని రోజుల్లో అయితే ఇంకా నరకం.  సెలవు పెట్టినా..ఆఫీసునుండి ఫోన్లు..మేడం ఒక్క గంట వచ్చి వెళ్లండి..మీరు చేసే డాక్టరు ఒకరి డిక్టేషను బాగా ఎక్కువ వచ్చింది మీరు కొన్ని ఫైల్సు అయినా చేసి వెళ్లండి..ఒక్క గంట వచ్చివెళ్లండి ప్లీజ్ అంటూ అభ్యర్థనలు.......కాదనలేం.. వెళ్లాలేం.  ఇప్పుడయితే వాళ్ల పక్కన కూర్చుని వాళ్లని చూసుకుంటూ నా పని నేను చేసుకోవచ్చు.

ఒక్కోరోజు మన పని మనం పూర్తిచేసుకుని ఇక బయలుదేరదామనుకుంటుండగా..మేడం....ఈ ఫైలు ఇప్పుడే లేటుగా  వచ్చింది..TAT ఫైలు.  MT లందరూ వెళ్ళిపోయారు.మీరే ట్రాన్స్క్రిప్షనూ..ప్రూఫింగ్ చేసి అప్లోడ్ చెయ్యండి..ప్లీజ్ 2 నిమిషాల ఫైలే..అంటూ అభ్యర్థనలు..కాదనలేం కదా! ఆ రెండు నిమిషాల ఫైలు ట్రాన్స్క్రైబ్ చేసి.... ప్రూఫింగ్ చేసి అప్లోడ్ చెయ్యాలంటే కనీసం అరగంట పడుతుంది.  అదే ఇంట్లోనుండి అయితే మన పని అవ్వగానే టప్పున లాగ్ అవుట్ అయిపోతే ఇక మనకి వాళ్లకి సంబంధం ఉండదు :)

ఎప్పుడయినా అవసరానికి అర రోజు సెలవు పెడతామా..పేరుకే అర రోజు..పావు రోజు అవ్వగానే ఫోన్లు మొదలవుతాయి..మేడం ఎన్నింటికి వస్తారు..వస్తున్నారు కదా అంటూ..అనవసరంగా అర రోజు సెలవు పెట్టామే అనిపిస్తుంది.  పాపం వాళ్ల తప్పు కూడా ఏమీ లేదులేండి.  మా పనే అలాంటిది.  ఏ రోజు వర్కు ఆ రోజు అయిపోవాలి.  పెండింగు పెట్టటానికి ఉండదు.

ఓ రోజు ఊరెళ్లి వస్తున్నాను.  ట్రెయిను లేటు..ట్రెయిను దిగి ఆటొలో ఇంటికి వస్తుండగా ఆఫీసు నుండు ఫోను..మాడం మీరెక్కడున్నారు అంటూ..దారిలో ఉన్నా ఇంటికెళ్ళి ఓ గంటలో వస్తా అంటూ ఉండగానే..మాడం..మాడం..డైరెక్టుగా ఆఫీసుకు వచ్చేయకూడదూ కొన్ని కెనడీ ఫైల్సు ఉన్నాయి ..TAT ఫైల్సు...నేను మీరు వచ్చేటప్పటికి టిఫిను తెప్పిస్తాను.....వాటి వరకు చేసి ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి వద్దురు అంటూ....వ్వావ్వా...ఇలాంటి కష్టాలు చాలా ఉంటాయిలేండి!

అన్ని ఉద్యోగాలకి ఈ సౌలభ్యం ఉండకపోవచ్చు కానీ ఉన్నవాళ్లయినా వినియోగించుకుంటే బాగుంటుంది. కాకపోతే సర్వసన్నద్దమై ఇంటినుండి పని మొదలుపెడితేనే ఉపయోగం.   సిస్టం..దానిలో మన పనికి అవసరమయిన సాఫ్టువేరులు.....బ్రాడుబ్యాండు కనక్షను....పవర్ ప్రాబ్లం లేకుండా బ్యాకప్......ఇలా అవసరమయినవన్నీ సిద్దం చేసుకోవాలి కాబట్టి మొదట్లో కొద్దిగా డబ్బులు పెట్టుబడి కూడా పెట్టాల్సి ఉంటుంది.

ఇక ఇంట్లో నుండి పని చేస్తే ఉండే అసలు లాభం ఏంటో చెప్పనా....
ఆఫీసుకి వెళ్తే కట్టిన చీర కట్టకుండా కట్టుకెళ్లాలా:)  ఆదివారం వచ్చిందంటే వీటన్నిటికీ గంజి....ఇస్త్రీలు..అదో పేద్ద పని!! ఆ చీరలకి మరి మ్యాచింగు బ్యాగులు....చెప్పులు....క్లిప్పులు...పిన్నులు...అబ్బో చాలా మెయెంటెయిను చెయ్యాలి......ఇప్పుడు అవన్నీ మిగులే:)))

ఇక దీనిలో ఉండే కష్టాల గురించి మరోసారి .........

Read more...

July 6, 2010

సికింద్రాబాదు రైల్వేస్టేషనులో వృద్దులకు వికలాంగులకు ఉచిత వీల్‍చెయిరు సదుపాయం

సికింద్రాబాదు రైల్వేస్టేషనులో ఎయిర్‍టెల్ వాళ్లు మరియు బ్యాంకు ఆఫ్ బరోడా వాళ్లు వృద్దులకు.. వికలాంగులకు ఉచిత వీల్‍చెయిరు సదుపాయం కల్పించారు.  ఇది మామూలు వీల్‍చెయిరు కాదు...బాటరీ ఆపరేటెడ్ ఆటో..చాలా సౌకర్యంగా ఉంది.  రైలు స్టేషను చేరుకునేముందే వీరికి ఫోను చేసి ఫలానా రైలు ఫలానా బోగీకి వస్తున్నాం  అని చెపితే వాళ్లు రైలు వచ్చే సమయానికి ఆ బోగీ దగ్గరకు వస్తారు.  అలానే రైలు ఎక్కటానికి వెళ్లేటప్పుడు కూడా వాళ్లకి ఫోను చేసి చెప్తే  మొదటి ఫ్లాటుఫారం మీదనుండి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళతారు.  ఈ సదుపాయాన్ని  పోయిన డిసెంబరునుండి ఎయిర్‍టెల్ వాళ్లు మరియు బ్యాంకు ఆఫ్ బరోడా వాళ్లు కల్పించారు.  ఇద్దరూ చెరొక ఆటో తిప్పుతున్నారు.  దీనితో రైల్వే వాళ్లకు ఎలాంటి సంబంధమూ లేదు.  మనం డైరెక్టుగా ఆ ఆటోల డ్రైవర్లకి ఫోను చెయ్యటమే! కాకపోతే దీని గురించి ఒక్క మొదటి ఫ్లాటుఫారం మీద మాత్రమే ఫోను నంబర్ల వివరాలు కల నోటీసు అంటించారు..ఈ నోటీసు అన్ని ఫ్లాటుఫారాల మీద అంటిస్తే ప్రయాణీకులకు బాగా ఉపయోగపడుతుంది.  మొన్న ఒకసారి నేను వైజాగు నుండి వస్తూ పెద్దదయిన మా ఆమ్మ కోసం తొమ్మిదవ నంబరు ఫ్లాటుఫారం నుండి ఈ ఫోను నంబర్ల కోసం ఒకటో నంబరు ఫ్లాటుఫారానికి రావల్సి వచ్చింది.  అక్కడ టి.సి.ని...పోర్టర్లని..మామూలు వీలుచెయిరు వాళ్లని ఎవర్ని అడిగినా ఫోను నంబర్లు మాకు తెలియదు అన్నారు.  చాలా మంది ప్రయాణీకులకు కూడా ఈ సదుపాయం గురించి తెలియదు. ముఖ్యమయిన ఎక్సుప్రెస్సు రైళ్లల్లో కూడా ఈ సమాచారం పెడితే ఇంకా బాగుంటుంది.

ఫోను చెయ్యవలసిన నంబర్లు
ఎయిర్ టెల్:--9676707007
బ్యాంకు ఆఫ్ బరోడా:--9652210067 

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP