మా ఊరు..మా గాలి...తాటి ముంజలు.
ఎండాకాలం మల్లెలు.....మామిడి కాయలు..అంటూ అందరూ ఎదురు చూస్తారు కానీ నేను మాత్రం తాటి ముంజలు..ఈతకాయలు కోసం ఎదురు చూస్తా. మాకు పొలాల గట్ల వెమ్మటి బారులు తీరి ఉంటాయి తాటి చెట్లు. హైదరాబాదులో తీసిన ముంజలు దొరుకుతాయి కానీ..ముంజల్ని కాయనుండి బొటనవేలుతో తోడుకు తినటంలో ఉండే మజాయే వేరు..ఆ మజా తీసిన ముంజలు తింటే రాదు.
ఎండాకాలం ఇంటికి వెళితే నేను మొదటిగా చేసేది మా శ్రీనుని (పనబ్బాయి) పిలిచి సాయంత్రానికల్లా ముంజకాయ గెలలు..ఈతకాయలు తెమ్మని ఆర్డర్ జారీ చేయటం. అసలు నేను వస్తున్నాని తెలిస్తే ముందే తెచ్చిపెడతాడు.
మొన్న మాత్రం రెండు రోజులు ఉన్నా ముంజ కాయలు దొరకలేదు. చిన్న చిన్న కాయలే కొట్టుకెళుతున్నారు... పిల్లలు అసలు ఉంచట్లేదు..అని శ్రీను బాధపడిపోయాడు. సరేనని మా అక్క వాళ్ళింటికి వెళ్ళగానే ముందుగా చెప్పిన మాట నాకు ముంజ కాయలు కావాలి తెప్పించు అని...సాయంత్రం అవి వచ్చేదాకా పదినిమిషాలకి పదినిమిషాలకి గుర్తుచేయటమే..ఏంటి ఇంకా తేలేదు..మళ్ళీ కబురు చేయి అని మా అక్కా వాళ్ళ చిన్నాడ్ని షంటుతూనే ఉన్నా! పిన్నీ నీకెందుకు సాయంత్రానికల్లా తీసుకొస్తాడుగా అన్నా విననే! అవి వచ్చేదాకా కాలుకాలిన పిల్లిలా గేట్లోకి ఇంట్లోకి తిరుగుతూనే ఉన్నా! రాగానే ఓ 7-8 కాయలు లాగించేసా. బాగా లేత కాయలు...ఒక్క పూటే తిన్నానే అని ఓ దిగులు..ఇంకో పూటన్నా ఉండి మరో పదో ఇరవయ్యో కాయలు తింటే కాని తృప్తిగా ఉండదు మరి!
టకటకా పనాళ్ళు కాయలు కొడుతుంటే ధన ధనా లాగించేస్తూ ఉంటాం... ఓ పదిమందిమి ఉన్నామంటే ఓ ఇద్దరు పనాళ్ళకి చేతినిండా పనే! మళ్ళీ మనొంతు వచ్చేదాకా ఎదురుచూడాలి. బొటనవేలితో ముంజ తోడుకు తినటం ఓ కళ....అందులో .నీళ్ళు పోకుండా తినటం అందరికీ రాదు.
ఎండాకాలం ఈ తాటి ముంజల్లో నీళ్లు చాలా చలువ చేస్తాయి...ముఖ్యంగా చిన్న పిల్లలకి ముసలి వాళ్లకి చాలా మంచిది. కొంతమంది కాస్త గడ్డుగా ఉండే ముంజల్ని ఇష్టపడతారు..అవి కొబ్బరిలాగా కసాకసామంటూ ఉంటాయి. నాకు మాత్రం అటు మరీ లేతగా కాకుండా ..ఇటు మరీ గడ్డుగా కాకుండా. ఉండాలి..పిల్లలకి ముంజలు తీసిస్తామన్నా వినరు ....మేమే తీసుకుతింటాం అని మహా చక్కగా లాగించేస్తారు! మాతో పోటీ అన్నమాట!
ఇప్పుడు కాయలు తింటామా...ఆగస్టు సెప్టెంబరు వచ్చేటప్పటికి పండిన తాటికాయలతో బూరెలు..కుడుములు చేస్తారు... బాగా పండిన తాటికాయల్ని కాల్చి రసం పిండి కొంచం బొబాయి రవ్వ కలిపి చేస్తారు. తాటి బూరెల్లో వెన్నపూస పెట్టుకు తింటే ఆహా..ఏమి రుచి అనాల్సిందే. నేను తినే ఏకైక స్వీటు తాటి బూరెలే! ఇవీ మరీ అంత తియ్యగా ఉండవు. అసలు కాల్చిన తాటిపండు కూడా మహా రుచిగా ఉంటుంది. కాల్చిన తాటి బుర్ర చీకుతూ తినటం కూడా ఓ కళే! మా నాయనమ్మకి మహ ఇష్టం....అవలీలగా రెండు కాయలు తినేది. ఇక తేగల గురించి చెప్పక్కరలేదుగా! కాల్చిన తేగలకన్నా ఉడకపెట్టినవి బాగుంటాయి.
చిన్నప్పుడు తినేసిన తాటి బుర్రలతో అందరూ బండ్లు కట్టే ఉంటారు..ఒకసారి మా బుడ్డోళ్ళని చూడండి..అన్నా చెల్లెళ్ళిద్దరూ పోటీ పడి లాగేస్తున్నారు!
ఈ తాటి కాయలు ఈతకాయలతో పాటుఎండాకాలం సాయంత్రాలు మా ఊర్లో వీచే గాలి కూడా నాకు మహా ఇష్టం. పగలు ఎంత వేడి ఉన్నా సాయంత్రం అయ్యేటప్పటికి మంచి చల్లటి గాలి కొడుతుంది. అరుబయట మంచం వేసుకు పడుకుంటే .. ఓపక్క మా అమ్మ కబుర్లు చెప్తూనే ఉంటుంది...నేను హాయి హాయిగా అలా అలా నిద్రలోకి జారిపోతాను. టివిలు... కంప్యూటర్లు..అన్నీ బంద్. అసలు వాటి ధ్యాసే ఉండదు... అంత సమయమూ ఉండదు.
ఈతకాయల గురించి మరో సారి...
12 వ్యాఖ్యలు:
ఇది చాలా అన్యాయం అధ్యక్షా.ఇక్కడ ఎటు చూసినా తలకాయలు తప్ప తాటికాయలు కనిపించి చావట్లేదు,కనిపించాయా చచ్చాయే అన్నమాట.వెళ్ళిన వాళ్ళు పొన్నూరు తిరనాల దాకా ఆగొచ్చుగదండీ...
రాజేంద్ర గారూ :)
ఇంతవరకు నేను పొన్నూరు తిరనాళకి వెళ్ళలేదండి!
యెంత అదృష్టవంతులు... నేను చిన్నప్పుడు ముంజెలనీ, వాటిని తినేవాళ్ళనీ కేవలం చూసి సంతోష పడ్డాను.. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రోడ్డు పక్కన, సూపర్ మార్కెట్లలోనూ కనిపించేవి నాకెందుకో నచ్చడం లేదు.. వాటికో, నాకో టేస్ట్ లేదనుకుంటా... ఈత పళ్ళ గురించి కూడా రాసేయండి, మీ పేరు చెప్పుకుని మరోసారి బాల్యంలోకి వెళ్లి వచ్చేస్తాను..
వేసవిలో ఇంటికెళ్ళి కొన్ని సంవత్సరాలవుతోంది :( అచ్చం ఇలాగే తెగ తెప్పించుకుని తినడమే పని! మధ్యాహ్నం తెచ్చిన ముంజలన్నీ కుండీలో చల్లటి నీట్లో వేసి సాయంత్రం కొట్టేవాళ్ళు.. భలే ఉండేవి!
ఆహా ఏమి మీ భాగ్యము! ఏంత చక్కటి బాల్యము! ఇంతకీ మీవూరేదన్నారు?
మంచి ఈతపళ్ళు, చిన్న ఖర్జూరాల రుచి వుంటాయి కదండి?
మురళి గారూ, "నేను చిన్నప్పుడు ముంజెలనీ, వాటిని తినేవాళ్ళనీ కేవలం చూసి సంతోష పడ్డాను"..అంటే మీరు తినేవాళ్ళు కాదా??ఔరా..కడు విచిత్రంగా ఉన్నదే:)
ఈతకాయల గురించి త్వరలో వ్రాస్తా!
గోపాల్ గారూ, అవును తాటికాయలు నీళ్లల్లో వేసి ఉంచితే భలే చల్ల చల్లగా బావుంటాయి. మీరు త్వరలో మీ ఊరు వెళ్ళి ముంజకాయలు తినాలని కోరుకుంటున్నాను.
Snkr గారు, అవునండి బాగా కండ ఉన్న ఈతకాయలు చిన్న సైజు ఖర్జూరపళ్ళ లాగానే ఉంటాయి. మాది గుంటూరు జిల్లా అండి:)
నాక్కూడా ఈ ముంజలంటే చాలా ఇష్టం. కొంచెం ఊరిబయట బళ్ళల్లో అమ్ముతుంటారు. అవి రుచిగానే ఉంటాయి. సూపర్ మార్కెట్ లో తినే కంటె ఊరుకోవటం బెస్ట్. మీ ఊరినుంచి మాక్కూడా తెచ్చిపెట్టొచ్చుకదా:)
సూపర్ మార్కెట్ లో తినే కంటె.....???????
ముంజలు చాలా బాగుంటాయండి. ఇక్కడ ఊరిబయట కాస్త మంచివే బళ్ళమీద తెచ్చి అమ్ముతారు. ఎంతైనా పళ్ళెటూళ్ళ రుచిమాత్రం దొరకదు. అక్కడా మీరుచెప్పినట్లు పరిస్థితులు మారిపోతున్నాయి. అలా గాకుండా ఉంటే బాగుండు.
చూడగానే ఫోటోలు చూసాను ముందు నేను. కాంటెంట్ బజ్ లో చదివా కదా అందుకని. :-)
నాకు తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి.. కామెంట్ రాస్తూ పోతే ఒక పోస్ట్ అంత అవుతుంది, అందుకే ఇక్కడితో ఆపేస్తున్నా.
Post a Comment