వేసవి వేళ
మబ్బు పడితే, ఉరుము ఉరిమితే, మెరుపు మెరిస్తే, వాన పడితే, పెరట్లో మల్లె తీగ మొదటిసారిగా మొగ్గ తొడిగితే... ఎంత ఆనందమో....ఎండాకాలం సెలవులు వస్తున్నాయంటే మా ఈతేరు పిల్లలకి అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉండేది.
పరీక్షల చివరి రోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకు చల్లుకోవటంతో మొదలయ్యేది ఆ ఆనందం. మిగతా రోజులలో ఎంత తిరిగినా ఎంత ఆడినా ఎండాకాలం ఆడే ఆటల తీరే వేరు మరి.
ఎన్నెన్ని ఆటలో.....కోతి కొమ్మచ్చి, ఆసంబాయ్, సబ్జా, ఉప్పాట, కరెంటు పాస్, దాగుడుమూతలాట, స్థంభాలాట, నాలుగు స్థంభాలాట, కుందుళ్ళాట, పిచ్చి బంతి, ముక్కుగిల్లుడు ఆట, పిన్నీసు ఆట, నీడలాట, అచ్చంగిల్లాయిలు, వామన గుంటలు, పాము పటాలు, గవ్వలు, పచ్చీసు, ..ఎన్నెన్నో.
ఇప్పటిలాగా హాలీడే హోంవర్క్సు, ప్రాజెక్టులు, ఎసైనుమెంటులు, సమ్మరు క్యాంపులు, సమ్మరు కోచింగులు, ఎక్స్ట్రా కోచింగులు, IIT క్లాసులు ఏమీ లేని మంచి బంగారు రోజులు అవి. ఆటలు, నిద్ర, ఇదే లోకంగా ఉండేది. ఇళ్ళు, చావిళ్ళు, దొడ్లు, గుడి, బడి, చెరువు, అన్నీ మాకు ఆటస్థలాలే. అప్పట్లో సెలవలికి వేరే ఊరు వెళ్ళటం లాంటివి కూడా చాలా తక్కువ, అసలు మాకు అలా వెళ్ళటం కూడా ఇష్టం ఉండేది కాదు. అందులోనూ మాకు మా చుట్టాలందరూ మా ఊరి చుట్టుపక్కల రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉండే వాళ్ళు, అందువల్ల వెళ్ళినా ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేసేవాళ్ళం.
అప్పట్లో మా చిన్నమ్మమ్మ గారి అమ్మాయి వాళ్ళు సూళ్ళూరుపేట (నెల్లురు జిల్లా) లో ఉండే వాళ్ళు. వాళ్ళు ప్రతి ఎండాకాలం సెలవలకి పిల్లల్తో వచ్చేవాళ్ళు. వాళ్ళు వెళ్ళినా వాళ్ళ పిల్లలు ముగ్గురు మాత్రం సెలవలన్నాళ్ళు ఇంకే ఊరు వెళ్ళకుండా మా ఊరిలోనే ఉండే వాళ్ళు. వాళ్ళతో పాటు వాళ్ళ కుక్క జిమ్మీ కూడ వచ్చేది. అది వాళ్ళని వదిలేది కాదు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే ఉండేది. వాళ్ళతో పాటు పరుగులు పెట్టేది, దాంకునేది, దాని పుణ్యమా అని వాళ్ళని అంటుకోవాలంటే మా అందరికి భయంగా ఉండేది, అందుకే వాళ్ళు ఎప్పుడూ దొంగ అయ్యేవాళ్ళు కాదు..
ఆడపిల్లలం, మగపిల్లలం అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. అసలు ఏ ఆట మొదలుపెట్టలా అనేదే తేలేది కాదు. ఒకళ్ళకి ఒక ఆట నచ్చితే ఇంకొకళ్ళకి ఇంకొకటి. ఈ ఆట అయితే నేను ఆడను అంటూ అలకలు, కోపాలు, నేనెళ్ళిపోతున్నా అయితే అంటూ బెదిరింపులు, వెళ్తూ వెళ్తూ రండిరా మనం ఇంకొక చోట ఆడుకుందాము అంటూ సగం మందిని విడదీసుకుపోవటాలు, భలేగుండేదిలే. ఒక్కొక రోజు మూడు గ్రూపులు కూడా తయరయ్యేవి. ఓ గంటే ఈ కోపాలు, తరువాత మరలా అందరూ తిరిగొచ్చేవాళ్ళు సర్లే మీరు చెప్పిన ఆటే ఆడదాంలే అని. ఆటల్లో దెబ్బలు తగిలినా ఆటలో అరటి పండు అన్నట్లు పట్టించుకునే వాళ్ళం కాదు. మధ్యాహ్నం పూట మాత్రం ఆడపిల్లలం కాసేపు చింతపిక్కలో, గవ్వలో, వామనగుంటలో అడేవాళ్ళం.
ఇక సాయంత్రాలు మా ఊరి చెరువులో ఆడే వాళ్ళం. ఎండాకాలం చెరువులో నీళ్ళు చాలా తక్కువగా ఉండేవి. చెరువునిండా తామరాకులు ఉండేవి. వాటి దుంపలు తీసుకు తినేవాళ్ళం, చాలా రుచిగా ఉంటాయి. తామరాకు కాడలతో గొలుసులు చేసి మెడలో వేసుకునేవాళ్ళం. ఒక్కొకసారి చెరువుని ఎండబెట్టేవాళ్ళు. అప్పుడు ఆలుచిప్పలు ఏరుకునే వాళ్ళం. సాయంత్రం పూట పున్నాగ పూలు ఏరి వాటితో జడలు అల్లి నగలు చేసుకుని అలంకరించుకునేవాళ్ళం. మా బడిలో మోదుగ (ఫ్లేం ఆఫ్ ద ఫారెస్టు) చెట్లు ఉండేవి. వాటి పూలతో కోడిపందాల ఆట ఆడేవాళ్ళం.
ఎవరి మీదన్నా కోపం ఉంటే అది ఆటలలో డొంకతిరుగుడుగా బాగా తీర్చుకునే వాళ్ళం, ముఖ్యంగా ముక్కుగిల్లుడు ఆటలో మన శతృవులు దొంగ అయితే కసితీరా ముక్కు ఊడి వచ్చేటట్లు గిల్లి వచ్చే వాళ్ళం.
ఇక వెన్నెల రాత్రులలో అయితే నీడలాట ఆడేవాళ్ళం. సెలవలు అయిపోతున్నాయంటే ఎంత దిగులుగా బాధగా ఉండేదో!
ఇంతకీ కొస మెరుపు ఏమిటంటే అందరి ఇళ్ళల్లో ఆడేవాళ్ళం కానీ మా ఇంటిలో మాత్రం ఆడేవాళ్ళం కాదు. మా నాయనమ్మ అంటే మా ఊరి పిల్లలందరికి హడలుగా ఉండేది. ఒకవేళ ఖర్మ కాలి ఆడుకోవటానికి వచ్చినా వెంటనే మా నాయనమ్మ ఎవడ్రా అది..వెధవ లం - కొడుకుల్లారా ఇంకెక్కడా మీకు చోటు దొరకలా ఆడుకోను అని తిట్లు మొదలెట్టేది, అందుకే పిల్లలు మా ఇంటికి రావటానికే భయపడేవాళ్ళు.
ఈ వేసవి సెలవుల ఆనందం మా పిల్లలు కూడా అనుభవించాలని ఎండాకాలం వాళ్ళని మా ఊరులోనే ఉంచేస్తాం. ఇప్పటి వాళ్ళు ఆడే ఆటలు వేరు అయినా పిల్లలందరు కలిసి సెలవల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక సెలవలు అయిపోతున్నాయంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో! మరలా ఎప్పుడు ఎండాకాలం సెలవలు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు.
10 వ్యాఖ్యలు:
కాస్సేపలా స్వర్ణయుగంలోకి తీసుకెళ్ళారు.. ప్చ్, ఆ రోజులే వేరు!!
మీరు చెప్పిన సంఘటనలన్నీ నావే అనిపించింది.
అదేంటో గానీ చిత్రంగా రెండు వైపులా చూసిన వాడను నేను.
అటు వేసవి సెలవలకి అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఇలాంటి అనుభవాలను మూటగట్టుకుని, అటు సిటీకి వచ్చి అన్ని సెట్ లకూ ప్రిపేర్ అవడమూ.
మాఊరు ఇంకాస్త పల్లెటూరు అయ్యుంటే ఇంకా బాగుండేదేమో అని పిస్తుంది ఇది చదివాక.అంతమాత్రాన మీరు చెప్పినవి మేము మిస్సయ్యామని కాదు కానీ ఎందుకో చదివాక కుళ్ళు పుడుతుంది నాకు.
ఇప్పుడే నేను మాఊరు వెళ్ళాను.తిరిగిరావడానికి చాలా రోజులు పట్టేట్టువుంది.మావారికి మీరే సమాధానం చెప్పుకోవాలి మరి.:)
చాలా బాగా చెప్పారు. నా చిన్నప్పుడు, వేసవి సెలవులకి, హైద్రాబాదు నుంచీ నా ప్రాణస్నేహితుడు ఒకడు వచ్చేవాడు. వాళ్ళ అమ్మమ్మగారిల్లు మా ఇంటిపక్కనే. అప్పట్లో చందమామలో మృత్యులోయ అనే సీరియల్ వచ్చేది. ఇద్దరం కలిపి, నీళ్ళటాంకు దగ్గర గుట్టలెక్కి ఆ ఆట ఆడుకుంటుండేవాళ్ళం.
రాధికా - మీ కామెంటు మెరుపు. ఊహాలోకాల్లో భారతావని చేరినా మీ ఆయన భరతం పట్టడం మానరల్లే ఉందే. పాపం మూగజీవుడు :-)
వరూధినిగారు,
వేసవి రాకముందే వేసవి కబుర్లు చెప్పారు. మీకు కనీసం వేసవిలో వెళ్ళడానికి పల్లెటూరంటు ఉంది. మాకైతే అందరు హైద్రాబాదులోనే ఉన్నారు.. ఇక ఈనాటి పిల్లలకు వేసవి , వర్షాకాలం, చలికాలం అనే తేడాలు లేకుండాపోయాయి. ఎప్పుడూ చదువులు, పరీక్షలు, హోమ్ వర్కులు. .
ఆ హాస్టల్‌లో ఒంటరిగా..
పాతజ్ఞాపకాలని తవ్వే అవకాశంకలిగించారు. మాకు వేరే ఊరెళ్ళే అవకాశం తక్కువుండేది - సెలవలంటే గుర్తొచ్చేది ఒక్క కాపారమే (తణుకు దగ్గర). మీరు టపాలు తరచుగా, చురుకుగా వ్రాయడం సంతోషంగాఉంది.
ఓహో! ఈ టపా మిస్సయ్యానే!! ఎన్ని రకాల ఆటలో. మీ నాయనమ్మను మరిచిపోకుండా గుర్తుచేసుకున్నారు. :))
జ్యోతి గారు ఇది పోయిన వేసవి సెలవలలో రాసిన టపా కాస్త వెనకపడ్డది :)
Post a Comment