పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 13, 2008

తల్లిదండ్రులకి పరీక్షాకాలం

ప్రస్తుతం చిన్న పిల్లల తల్లిదండ్రులకి పరీక్షాకాలం. స్కూల్సులో ఎడ్మిషన్స్ మొదలయ్యాయి, దానితో తల్లిదండ్రులకి కష్టకాలం మొదలయ్యింది. ఇంకొద్ది రోజులు పోతే పిల్లల్ని స్కూలులో జాయిన్ చేయటం కన్నా చంద్రమండలం మీదకి వెళ్ళి రావటం తేలికగా ఉంటుందేమో!!!

ఈ రోజులలో పిల్లలు పుట్టక ముందే వాళ్ళని స్కూలులో చేర్చటం గురించి ఆలోచించాల్సి వస్తుంది. కొన్ని స్కూల్సులో మూడు సంవత్సరాల ముందే పేరు నమోదు చేసుకోవాలి, దానికి తోడు రికమండేషన్సు. ఫిబ్రవరి, మార్చి నెలలు తల్లిదండ్రులకి పెద్ద పరీక్షాకాలం. ముందు ఏ స్కూల్లో చేర్చాలా అన్నది ఓ పెద్ద ప్రశ్న. స్కూలు ఎంపిక చేసుకున్నాక ఆ స్కూలుకి వెళ్ళి విచారణ పత్రం ఒకటి నింపి ఇవ్వాలి. ఆ తరువాత వాళ్ళు చెప్పిన రోజు వెళ్ళి గంటలు గంటలు నిలబడి అప్లికేషన్ ఫారం తెచ్చుకోవాలి (వెల కనీసం 500 రూపాయలు మాత్రమే), అది పూర్తి చేసి వాళ్ళు చెప్పిన రోజుకి తిరిగి ఇవ్వాలి. తరువాత ఒక రోజు పిలుపు లేఖ (కాల్ లెటరు) వస్తుంది, పలనా రోజు పలానా సమయానికి ఇంటర్యూ అని, ఇక అప్పటినుండి తల్లిదండ్రులకి అసలు టెన్షన్ మొదలవుతుంది, పిల్లలిని రుద్దటం మొదలవుతుంది. వాళ్ళ పేరు, అమ్మా నాన్నల పేర్లు, అక్కలు అన్నయ్యలు ఉంటే వాళ్ళ పేర్లు, వయసు, రంగులు, నంబర్లు ఇలాంటివన్ని బట్టీ పెట్టించేసి ఇంకేమి అడుగుతారో అని వాళ్ళని వీళ్ళని సమాచారం అడిగి తాము టెన్షను పడి పిల్లలిని పడేసి, ఎక్కడ సీటు రాదో అని దిగులు పెట్టేసుకునే వాళ్ళు ఎంతమందో! ఈ పిల్ల గడుగ్గాయిలేమో ఒట్టప్పుడు వాగుడుకాయల్లా వాగుతూ వుంటారు కాని అవసరమైనప్పుడు నోరు విప్పరయ్య!! అసలు మాట్లాడతారో లేదో తెలియదు.. కొన్ని స్కూల్సులో తల్లిదండ్రులకి కూడా ఇంటర్యూలు ఉంటాయి. వీటికి తల్లిదండ్రుల ప్రిపరేషను ఏ స్థాయిలో ఉంటుందంటే వాళ్ళ ప్రాజెక్టు వైవా లేక థీసిస్ వైవా అప్పుడు కాని తమ ఉద్యోగ ఇంటర్యూలప్పుడు కాని అంతగా ప్రిపేరు అయి ఉండరు, అంత టెన్షనూ పడి ఉండరు.

అన్నట్లు నర్సరీలో, L.K.G.లో చేరబోయే పిల్లలిని ఈ ఇంటర్యూలకి ప్రిపేరు చేయటానికి ప్రత్యేకంగా ట్రైనర్సు కూడా ఉన్నారు, ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే.

మొన్న మా తమ్ముడు వాళ్ళ అబ్బాయికి L.K.G. కి ఇంటర్యూ జరిగింది. అమ్మ, నాన్నల పేర్లు, తన పేరు, రంగుల పేర్లు, నంబర్లు ఇలా చిన్న చిన్నవి ఏవో అడిగారు, అన్నిటికి బాగానే జవాబు చెప్పాడు. చివరికి ఏదైనా ఒక రైము చెప్పమన్నారంట, ఇక అంతే ఏడుపు లంకించుకున్నాడు. టీచరు చాక్లెట్టు ఇవ్వబోయినా తీసుకోకుండా వాళ్ళ అమ్మ ఒడిలో దూరి ఒకటే ఏడుపు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే వాడికి మాటలు ఇంకా అంత బాగా రాలేదు. మాటలు చెప్తాడు కాని వాక్యాలతో ఇబ్బంది పడతాడు. రైము అంటే మరి కొంచం పెద్ద పెద్ద వాక్యాలు ఉంటాయి కదా (వాడి దృష్టిలో) అదీ వాడి బాధ.

కొన్ని స్కూల్సు ఈ మధ్య సీటు ఇవ్వటానికి చాలా చాలా నియమాలు పెడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి:

స్కూలు ఉన్న కాలనీలో ప్లాటు కాని, ఫ్లాటు కాని ఉన్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

స్కూలులో ఇప్పటికే పిల్లల అన్నయ్యలు కానీ, అక్కయ్యలు కానీ చదువుతుంటే వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

తల్లిదండ్రులు ఇద్దరూ కనీసం డిగ్రీ అయినా చదివి ఉండాలి. ఇద్దరూ ఉద్యోగస్తులయితే ఇంకా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఇక సీటు వచ్చాక అసలు కథ మొదలవుతుంది. స్కూలు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కొక్కటి చిట్టాకెక్కుతాయి. మచ్చుకి కొన్ని:
1. మా బస్సులన్నీ ఇప్పటికే ఫుల్లు అందువల్ల మీ పిల్లల ట్రాన్స్పోర్టేషను మీరే చూసుకోవాలి.
2. ఒకవేళ ట్రాన్స్పోర్టేషను ఉంటే దానికి మరలా వేరే డిపాజిట్టు కట్టాలి.
2. పిల్లలికి పుస్తకాలు, యూనిఫారం, షూసు, బెల్టు, టై అన్నీ స్కూలులోనే కొనాలి.
3. పిల్లలికి ఎలాంటి అనారోగమైనా స్కూలు మధ్యలో ఇంటికి పంపించం, కావాలంటే ముందే స్కూలు మానిపించండి. పరీక్షల అప్పుడు అయినా అంతే.
4. మధ్యాహ్నం భోజనం ఉదయం పిల్లలతో పాటే ఇచ్చి పంపాలి, మధ్యలో తెచ్చి ఇవ్వటం కాని, పిల్లల్ని ఇంటికి పంపటం కాని జరగవు (స్కూలు పక్క ఇల్లు అయినా సరే).
5. నర్సరీ, L.K.G., U.K.G.. పిల్లలికి లంచ్ బాక్సులలో అన్నం పెట్టరాదు, ఏదైనా టిఫిను పెట్టి పంపాలి, అది కూడ మేము ఇచ్చిన టైము టేబులు ప్రకారం రోజుకొకటి పంపించాలి. (కొన్ని స్కూల్సు లో అయితే రోజుకొకళ్ళు క్లాసు మొత్తానికి లంచ్ పట్టుకెళ్ళాలి).

ఈ మధ్య కొన్ని స్కూల్సులో పిల్లల ఫొటోతో పాటు మొత్తం కుటుంబం ఫొటో కూడా అడుగుతున్నారు, ఎందుకో మరి!

వీటన్నిటికి తలవంచి తలకు మించిన డొనేషను కట్టి పిల్లలిని స్కూలులో చేర్చేటప్పటికి తల్లిదండ్రులకి తల ప్రాణం తోకకి వస్తుంది. ఇక అంతటితో వాళ్ళ బాధలు తీరుతాయా? అబ్బే ఇక వేరే బాధలు మొదలవుతాయి, అవి మరొకసారి.

17 వ్యాఖ్యలు:

lalithag February 13, 2008 at 9:08 PM  

అరే మీరు ఇలా భయపెడితే ఎలా?
ఇక్కడి తలనొప్పులు ఇంకో విధంగా ఉంటాయి.
ఒక్కో సారి మన దగ్గరే నయం, వచ్చేద్దామా అనిపిస్తుంటుంది.
మీ టపా చదువుతుంటే ముందు నుయ్యి వెనకాల గొయ్యి లాగా అనిపిస్తోంది.
మా లాంటి తల్లిదండ్రులని మీరు ఇంకా educate చేస్తారని ఆశిస్తూ....

కొత్త పాళీ February 13, 2008 at 9:13 PM  

వార్నాయనోయ్ ..
ఇన్ని భూతాలనెదురుకుంటున్న తల్లిదండ్రులకి నిజంగానే జోహార్లు!
సుబ్బరంగా జంటాలో ఒకరు ఉద్యోగం మానేసి హోం స్కూలింగ్ చేసుకోటాం బెటరేమో!

Nagaraju Pappu February 13, 2008 at 10:40 PM  

ఏవైనా హిడింబ అధృష్టవంతురాలు - ఘటోత్కచుడు పుట్టంగానే పదారుఏళ్ళ వాడైపోయాడట. అలాటి సదుపాయం ఏదైనా ఉంటే, ఈ హిడింబాసురల బారీనుంచీ పిల్లలూ, వాళ్ళ తల్లితండ్రులు తప్పించుకోవచ్చు కదా :-)
--నాగరాజు (సాలభంజికలు)

Unknown February 13, 2008 at 11:17 PM  

ఆహా... అచ్చంగా మీరు చెప్పినట్లే మా మేనల్లుడు స్కూలు అడ్మిషను అనుభవం.
అది పిల్లలకీ, వారితో పాటు తల్లిదండ్రులకీ క్షోభ. సవాలక్ష రూల్సూ, రెగులేషన్సూ. (అదీ మన చేతి చమురు వదిలించుకున్న తరువాత)
అడ్మిషను ఫామ్ లు, డొనేషన్లూ, రిజర్వేషన్లూ అన్నీ దాటుకుని మంచి స్కూల్లో ఒక సీటు సంపాదించుకునే వరకూ తల ప్రాణం తోకకొస్తుంది.

రాధిక February 13, 2008 at 11:42 PM  

క్లాసు మొత్తానికి భోజనం,లంచ్ బాక్సుల్లో అన్నం పెట్టకూడదు అనడం,రోజుకొక వెరైటీ ఇవ్వడం... ఇవన్నీ ఇక్కడ చేస్తూ వుంటారు.ఇప్పుడు అక్కడ కూడానా?మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు 2009 లొ ఇండియా వెళ్ళిపోతామని నిర్ణయించుకుని హైదరాబాదులో స్కూలు గురించి చూస్తే 2010 వరకు అడ్మిషన్లు అయిపోయాయట.ఒక మోస్తరు స్కూళ్ళల్లో కూడా లేవని అన్నారట.ఏదో గల్లీ స్కూళ్ళల్లో అడిగితే వచ్చాకా 2 లక్షల డొనేషన్ కట్టేలా,ఇప్పుడే 50వేలు డిపోజిట్ చేసేలా అయితే సీటు వుంచుతామని అన్నరాట.ఈ వార్త దావానలం లా వ్యాపించింది.ఇప్పుడు అందరూ పుట్టని పిల్లల కోసం కూడా సీట్లు రిజర్వు చేయించుకోడానికి తయారయ్యారు.
డిగ్రీ కంప్లీటు అవ్వకుండా పెళ్ళయిన నా ఫ్రెండు తన బాబు స్కూలు కోసం ఇప్పుడు డిగ్రీని పూర్తి చేస్తుంది.వేమన పద్యాలు,సుమతీ శతకాలు గడ గడా చెప్పే వాళ్ల అబ్బాయి ఇంగ్లీషులో సరిగ్గా మాట్లాడట్లేదని ఒకటవ క్లాసు నుండి మళ్ళా యుకేజీ కి పంపేసారు.అందుకోసం వేరే స్కూలు మారిస్తే[అడ్మిషన్ దొరికిన ఏదో చిన్న స్కూలు] వాళ్ళు తల్లి డిగ్రీ చదవకపోతే తీసుకోమని చెప్పేసారట.
ఇవన్నీ తలచుకుంటుంటే అసలు చదువుల్ని,స్కూలుని బేన్ చేసేయాలన్నంత కోపం వస్తుంది.

మొన్న మొన్నటి దాకా ఇక్కడి చదువులు,వెధవ రూల్సు చూసి మావాడిని ఇండియాలో చదివిద్దామనుకున్నాను.ఇన్ని విన్నాకా ఏమి చెయ్యాలో పాలుపోవట్లేదు.లలిత గారన్నట్టు నుయ్యి,గొయ్యి లానే వుంది వ్యవహారం.

cbrao February 13, 2008 at 11:55 PM  

ఈ టపాలో చెప్పదలిచినదేమిటి? సమస్యేనా? పరిష్కారం పాఠకులకే వదిలేసారా?

Rajendra Devarapalli February 14, 2008 at 10:23 AM  

cbrao గారు ఈ అంశంలో సమస్య సూదిముళ్ళైతే పరిష్కారాలు పల్లేరుకాయలు.మొత్తం ప్రాధమిక విద్యావ్యవస్త అంతా ముళ్ళకంపమీద పడ్డ పైపంచలాగుంది.ఉంచలేం,పీకలేం.కొన్ని స్కూళ్ళల్లో తల్లితండ్రులు కనీసం డిగ్రీచదివి ఉండాలీ,తల్లి మాత్రం ఉద్యోగం మాత్రం చేయకూడదని షరతులు పెడుతున్నారు.యల్ కెజి పిల్లలకు సంవత్శరానికి లక్ష రూపాయల ఫీజు కట్టేందుకు సిద్ధమౌతున్న సంపన్నులు లక్షల మంది ఈరోజు ఆంధ్రదేశంలొ.విద్య ఇంతగా వ్యాపారపరమైన రాష్ట్రం మనదే.

రమ్య February 14, 2008 at 1:16 PM  

lkg నుండీ యునిఫాం,షూ,టై..ఇండియా లో ఈ మండే ఎండల్లో చిన్న పాపాయి లు ఆ షు తో స్కూల్ కి వెళ్లడమంటే అదో పనిష్మెంటు.
ఇప్పుడుకొన్ని(మంచి) స్కూల్స్ టైమింగ్స్ ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు ఇంటికి వచ్చాక మళ్ళీ హోంవర్క్.ఎంప్లాయ్స్ కి ఈటైంమింగ్ చాలా అనువుగా ఉందట!

Kolluri Soma Sankar February 14, 2008 at 3:04 PM  

ఈ వారంలో మా పాపాయికి అక్షరాభ్యాసం చేస్తున్నాం! జూన్ నుంచి బడికి పంపాలని ఆలోచన. నిజం చెప్పద్దు - మీ టపా, దాని మీది వ్యాఖ్యలు చదివాక,- కట్టాల్సిన ఫీజుల గురించి, స్కూలు వాళ్ళు పెట్టబోయే కండీషన్ల గురించి తలచుకుంటే భయమేస్తోంది.బాబోయ్!
సోమ శంకర్
www.kollurisomasankar.wordpress.com

lalithag February 14, 2008 at 5:26 PM  

కొన్ని ప్రశ్నలు:
చదువుకుని, ఆర్థికంగా కాస్త బలంగా ఉన్న వారు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించి ఆ బడులను సరిగా నడిపేలా కార్యశిలకంగా వ్యవహరిస్తే?
ఒక ప్రాంతంలో ఉన్న ఒకేలా ఆలోచించే వారు కూడి ఒక పాఠశాలను ఉన్నత విలువల ప్రకారం స్థాపించి నడపడాం మొదలు పెడితే?
పోటీ కోసమే కదా కార్పొరేటు విద్యాలయాల్లలో మనం చేర్పించేది. మన ఆలోచనా విధానం కాస్త మార్చుకుంటే?

సిరిసిరిమువ్వ February 14, 2008 at 5:29 PM  

@లలిత గారు అక్కడైనా ఇక్కడైనా ఏదో ఒక సమస్య తప్పదు. అక్కడ సృజనాత్మతకి, వ్యక్తిత్వవికాసానికి, విషయ పరిజ్ఞానానికి ప్రాధాన్యతనిస్తే ఇక్కడ ఎంతసేపటికి rote memory (fruitless memorization) కే ప్రాధాన్యత. ఏది మంచిదో మీరే నిర్ణయించుకోండి.

@ కొత్తపాళీ గారు,ఇప్పుడు హైదరాబాదులో so called international schools లో లక్షలు లక్షలు డొనేషన్లు కట్టి పిల్లలిని జాయిన్ చేసేది ఎక్కువగా NRIs, మరి ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళతో పోటీ పడి డొనేషన్సు కట్టాలంటే ఇద్దరూ ఉద్యోగం చేయటం తప్పనిసరి అయిపోయింది.మరి కాస్త చిన్న స్కూల్సులో చేరిస్తే పరువు తక్కువ కదా!!.

నాగరాజు గారు, జీవితంలో అత్యంత మధురమైన బంగారు బాల్యాన్ని దూరం చేస్తే ఎలాగండి. మీ పరిష్కారం నాకు నచ్చలేదు.

రాధిక గారు, మీరు చెప్పింది నిజమే, కాస్తో కూస్తో పేరున్న స్కూల్సులో మూడు సంవత్సారాల ముందే రిజిస్ట్రేషను చేసుకోవాలి, అలా అని సీటేమి గ్యారంటీ కాదు.

@రావు గారు ఇది పరిష్కారం లేని సమస్య. లక్షలు లక్షలు డొనేషన్సు కట్టటానికి రెడీగా ఉన్న తల్లిదండ్రులు ఇది అసలు ఒక సమస్యగానే పరిగణించటంలేదు, ఇక పరిష్కారం ఎక్కడనుండి వస్తుంది.

@రాజేంద్ర గారూ చక్కగా చెప్పారు.

@రమ్య గారు తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్ఠులైతే ఇంట్లో వేరే పెద్ద దిక్కు లేకపొతే ఆ పిల్లల బాధలు అన్నీ ఇన్నీ కాదు, అందులో ఇదీ ఒకటి.

@సోమ శంకర్ గారు భయపడకండి. All the best.

సిరిసిరిమువ్వ February 14, 2008 at 5:39 PM  

లలిత గారు మీరు చెప్పింది బాగుంది. తలుచుకుంటే చేయగలం కూడా.రిటైరు అయిన టీచర్సుతో, టీచింగు అంటే ఉత్సాహం ఉన్న కాలేజి పిల్లలతో, మంచి teaching abilities ఉండి ఖాళీగ ఉండే ఆడవారితో కలిసి ఒక మంచి స్కూలు నడపవచ్చు. దీనికి మొదటి అడుగు ఎవరు తీసుకుంటారు అన్నదే ప్రశ్న. ప్రతి ఊరిలో అలాంటి స్కూలు ఒకటి రావాలి.

ఊకదంపుడు February 14, 2008 at 6:02 PM  

http://www.eenadu.net/archives/archive-12-2-2008/district/districtshow1.asp?dis=hyderabad#7
ఈ వార్త చదవండి, కొన్ని జన్మల పాటు మీ పిల్లలని హైదరబాదు లొ చదివించే అలోచన చేయరు. ఆ పిల్లవాడి అత్మశాంతి కోసమై ఓ నిముషం ప్రార్ధించండి.

ఊకదంపుడు February 14, 2008 at 6:10 PM  

వార్త: చిన్నారిని బలిగొన్న పాఠశాలవ్యాన్

lalithag February 14, 2008 at 11:37 PM  

బహుశా మీరు ఇంకో చర్చ మొదలు పెట్టచ్చేమో, ఒక వేళ ఎవరైనా మొదలు పెడితే ఎటువంటి బడి తయారు చెయ్య వచ్చు? అందుకు constriants ఏమిటి?
బడి నుండి తల్లి దండ్రులు, తల్లిదండ్రుల నుండి బడులు, ఇద్దరూ కలిసి పిల్లలనుండి, ఏమి ఆశించవచ్చు? ఇలా....

Naveen Garla February 15, 2008 at 10:37 AM  

లలితగారు చెప్పిన పరిష్కారం చాలా బాగుంది.
ఆఫ్రికాలో మారు మూల గ్రామంలో ఉన్న కటిక పేద పిల్లగాడికి కూడా ప్రపంచంలో ఉన్న విఙ్ఞానం అంతా వాడి మాతృభాషలో అందాలన్న వికీ స్పూర్తి మనకు ఆదర్శం కావాలి. ఉద్యోగాలు చేసుకొనే చాలా మంది ఆ స్కూల్లో టీచర్ల కన్నా అద్భుతంగా బోధించగలరు. తలా ఒక చెయ్యి వేస్తే ఉన్నత ప్రమాణాలు కలిగిన స్కూలును ఉచితంగా నడపడం సాధ్యమౌతుందేమో?? కాకుంటే దాని కష్ట నష్టాలు ఆలోచించుకోవాలి. ఉన్నత చదువు చదువుకున్న వారంతా స్వచ్చందంగా వారి తీరిక సమయాల్లో విఙ్ఞానదాయకమైన వ్యాసాలు, వీడియోలు తయారు చేసే ప్రాజెక్టు చేపడితే బాగుంటుంది.

krishna rao jallipalli February 15, 2008 at 11:02 PM  

ఏడో తరగతి వరకు గవర్నమెంటు స్కూల్స్ బెటర్. // సృజనాత్మతకి, వ్యక్తిత్వవికాసానికి, విషయ పరిజ్ఞానానికి ప్రాధాన్యతనిస్తే ఇక్కడ ఎంతసేపటికి rote memory (fruitless memorization) కే ప్రాధాన్యత//
ఇటువంటి తొక్క తోలు బొంగు భోషాణం .. అవసరం లేదు. అదంతా ఒట్టి ట్రాష్.
కొంతలో కొంత లలిత గారి అభిప్రాయం బాగుంది

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP