మొదటి వార్షికోత్సవం
నేను బ్లాగు లోకంలోకి అడుగుపెట్టి ఈ రోజుకి (ఫిబ్రవరి 21) సంవత్సరం. ఈ టపాతో కలిపి మొత్తం 28 టపాలు రాసాను (హమ్... పర్లేదు నెలకు రెండు కన్నా ఎక్కువే రాసాను, not too bad :-). ఈ సంవత్సరకాలంలో నా బ్లాగుని వీక్షించిన వారి సంఖ్య 3231.
నాకు బ్లాగులు రాయటం కన్నా బ్లాగులు చదవటం ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. మధ్యలో ఆరోగ్యం బాగాలేకపోయినా వారానికి రెండు వారాలకి ఒక రోజు అయినా అన్ని బ్లాగులు కాకపోయినా నాకు నచ్చినవి చదివేదాన్ని. ఇప్పుడు కూడా ఒక్కొక రోజు ఇవాళ బ్లాగు రాయాలి అని కూర్చుంటాను, సరే ముందు ఎవరెవరు ఏమి రాసారో చూద్దాం అని కూడలిలోకి వెళతాను, ఇక అంతే కాలం కరిగిపోతుంది, నేనేం రాద్దామనుకున్నానో మర్చిపోతాను.
నేను రాయాలునుకున్నవి చాలా రాయలేకపోయాను. పుస్తకాల పరిచయం మొదలుపెట్టి అది మధ్యలోనే ఆపేసాను. కొన్ని అయితే ముసాయిదాల రూపంలో ఉన్నాయి. అవి ఒకసారి చూసి బ్లాగులో పెడదామనుకుంటా అలానే అయిపోతుంది.
ఈ సంవత్సరంలో బ్లాగుల సంఖ్య కూడా బాగా పెరిగింది. అన్నీ చదవాలన్నా కుదరటం లేదు. ఒక్కొక్కసారి వ్యాఖ్యలు చూసి బ్లాగులు చదవటం అవుతుంది. ఆ మధ్య తెలుగు'వాడిని' గారు నచ్చిన బ్లాగులు మరియు టపాలు పేరుతో కొన్ని మంచి బ్లాగులని, టపాలని చక్కగా పరిచయం చేశారు. సి.బి. రావు గారు (దీప్తిధార) బ్లాగ్వీక్షణం పేరుతో తనకి నచ్చిన టపాలని పరిచయం చేస్తున్నారు. ఈ మధ్య పొద్దు పత్రిక వాళ్ళు కూడా బ్లాగుల సమీక్ష మొదలుపెట్టారు. వీటి ద్వారా మన నుండి తప్పించుకున్న కొన్ని మంచి టపాలని చదవగలుగుతున్నాము. ఈ సంవత్సర కాలంలో మంచి బ్లాగర్లు కొంతమంది రాయటం తగ్గించారు.
ఇక నాకు వ్యాఖ్యలు రాయాలంటే మహా బద్దకం. బద్దకం కన్నా ఎలా రాయాలో తెలియనితనం అంటే నయమేమో!!! కొన్ని మంచి టపాలకి ఒట్టి బాగుంది అని రాస్తే ఏదో కృతకంగా అనిపిస్తుంది. ఎందుకు నచ్చిందో చెప్పేటంత పాండిత్యం లేదు. వ్యాఖ్యలు రాయటం కూడా ఓ కళే. బ్లాగు టపా రాయటం కన్నా వ్యాఖ్యలు రాయటమే ఎక్కువ కష్టం. వ్యాఖ్యలు రాయటంలో రాధిక గారు, కొత్తపాళీ గారు ది బెస్టు. వీరిద్దరు నా దృష్టిలో ఉత్తమ వ్యాఖ్యాతలు. అందరిని ప్రోత్సహిస్తూ రాస్తారు. సరే ఇక బాగోని టపాలకి మీ టపా బాగోలేదు అని రాసే ధైర్యం నాకు లేదు, అందుకే వాటి జోలికి అసలు పోను.
బ్లాగు అంటే పర్సనల్ డైరీ లాంటిది అంటారు కాని పర్సనల్ డైరీలో రాసుకున్నంత స్వేచ్చగా దీనిలో రాయలేం, అందరూ చూస్తారు కదా కొంచం ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయాలి, అందుకే నా దృష్టిలో ఇది పర్సనల్ డైరీ కాదు, మన అభిప్రాయాలు, మనసులోని భావాలు పంచుకోవటానికి ఓ వేదిక అంతే.
బ్లాగు రాయటం వల్ల నాకు కనపడ్డ ముఖ్య ఉపయోగం భాషని మెరుగుపరుచుకోవటం. మనకు తెలుగు చాలా బాగా వచ్చు అనుకుంటాము. మాట్లాడేటప్పుడు అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ రాస్తుంటే కాని తెలియదు మనం ఎన్ని తప్పులు రాసేది. కొన్ని పదాలు రాసేటప్పుడు ఒక్కొకసారి అది ఒప్పా కాదా అని ఎంత అనుమానం వస్తుందో !!! ఇదంతా తెలుగులో రాయటం తగ్గిపోవటం (మర్చిపోవటం) వల్లే కదా! కిరాణా సరుకుల పట్టి రాసుకోవటానికి తప్పితే ఈ రోజులలో తెలుగు రాసే వాళ్ళు ఉన్నారా!! (కిరాణా సరుకుల పట్టి కూడా ఇంగ్లీషులో రాసేవాళ్ళే ఎక్కువ ఈ రోజులలో, అది వేరే విషయం ). ఏదో ఈ బ్లాగుల పుణ్యమా అని మరలా చక్కటి తెలుగులో రాసుకునే అవకాశం దొరికింది. అందుకే బ్లాగు సృష్టికర్తలకి, బ్లాగు బ్రహ్మలకి హృదయపూర్వక నమస్సుమాంజలి.
మీ సమాచారం కోసం :- ఈ టపా బ్లాగర్.కామ్ లో తెలుగులో నేరుగా రాసింది. అలా రాయాలంటే ఏమి చేయాలో ఇక్కడ చూడండి.