పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

April 16, 2009

నేను ఓటు వేసా, మరి మీరు!

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత ఎన్నికలకు పోలింగు ఈ రోజు జరుగుతుంది. మన రాష్ట్రంలో  ఉత్తర కోస్తా, తెలంగాణా ప్రాంతాల్లోని 22 పార్లమెంట్, 154 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగు జరుగుతుంది.

మనకి మరోసారి ఓటు వేసే అవకాశం వచ్చింది. అంతా సవ్యంగా ఉంటే మళ్లీ ఐదేళ్లకి కాని మనకి ఓటు వేసే అవకాశం రాదు, అందుకే ఆలసించిన ఆశాభంగం, వెళ్లి ఓటు వేసి రండి.  నేనెప్పుడో పొద్దుట ఏడు గంటలకే వెళ్లి ఓటేసొచ్చా. ఇక ఫలితాల కోసం ఓ నెల రోజులపాటు ఎదురు చూడాలి. ఈ లోపు ఎక్కడ ఎంత శాతం ఓట్లు పోలయ్యాయి, ఓటింగు సరళి ఎలా ఉంది--ఇలాంటి విశ్లేషణలతో పత్రికలు, వార్తా చానళ్లు హోరెత్తించేస్తాయి.

ఏడు గంటలకి నేను పోలింగు బూతుకి వెళ్లేటప్పటికే జనం లైనులో నిలబడి ఉన్నారు.  పోలింగు ఏడు గంటలకి మొదలు అన్నారు కాని మా బూతులో ఏడున్నరకి కాని మొదలవలేదు. అప్పటికే జనం బాగా వచ్చారు. నాకయితే ప్రతి సారి ఓటు వేసాక ఏదో గొప్ప పని చేసామన్న సంతృప్తి కలుగుతుంది. ముందు పార్లమెంటు అభ్యర్థికి ఓటేసా, లైటు బాగానే వెలిగింది, మోత కూడా బాగానే వచ్చింది.  తరువాత అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేసా, ఈ సారి లైటు సరిగ్గా వెలగలేదు కాని మోత అయితే వచ్చింది. నాకేమో అసలు ఓటు పోలయిందా లేదా అని సందేహం. ఏంటో ఈ మెషీనులు.

నాకు మా ఊరిలో ఓటెయ్యాలని ఎంత కోరికో! ప్చ్....ఏం చేస్తాం...నాకు ఓటు హక్కు వచ్చేటప్పటికి చదువు కారణంగా ఊరికి దూరంగా ఉండి ఓటు వెయ్యలేకపోయాను. అసలు మా వాళ్లు నా పేరు ఓటర్ల లిస్టులో వ్రాయించారో లేదో కూడా నాకు తెలియదు. తరువాత ఎలక్షన్ల టైముకి పెళ్లయి మా ఊరికి దూరం అయిపోయా! ఇక ఎప్పటికీ అది తీరని కోరిక అయిపోయింది. పెళ్లయ్యాక మాత్రం ఎప్పుడు ఎన్నికలు జరిగినా నా ఓటు హక్కు వినియోగించుకుంటూనే ఉన్నాను. పోయిన సంవత్సరం ఖైరతాబాదు ఉపఎన్నికలో ఓటు వేయలేకపోయినందుకు ఎంత బాధ పడ్డానో.
                                                          
                                   మంచి మార్పు కోసం ఓటేద్దాం.

Read more...

April 13, 2009

మన ఓటు మనమే వేద్దాం

ఓటు వేయటం మన ప్రాధమిక హక్కు. . . ఓటు వేయటం మన బాధ్యత. .
ఓటు వేయకుండా రౌడీలు, గూండాలు, దుర్మార్గులు అందలం ఎక్కేస్తున్నారు అని వగచే హక్కు మనకి లేదు.
ఓటు వేయకుండా దోపిడీ రాజ్యం అయిపోయింది అని దిగాలు పడే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా అవినీతి వేయి తలలు వేసింది అని ఆక్రోశించే హక్కు మనకు లేదు
ఓటు వేయకుండా లంచగొండితనం పెరిగిపోయింది, మామూళ్లు మామూలు అయిపోయాయి అని ఏడ్చే హక్కు మనకి లేదు.
ఓటు వేయకుండా పైరవీలు లేందే ఏ పనీ అవటం లేదు అని గగ్గోలు పెట్టే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా నీతికి, న్యాయానికి, సమర్థతకి, ప్రతిభకి ఈ దేశంలో స్థానం లేదు అని ఘోషించే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా రోడ్లు చండాలంగా ఉన్నాయి అని ఫిర్యాదు చేసే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా ప్రభుత్వం మాకేం చేయట్లేదు అని నిందించే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా మొత్తం వ్యవస్థ అంతా కుళ్లిపోయింది అని అసహ్యించుకునే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా సమాన హక్కులు కావాలి అని ఎలుగెత్తే హక్కు స్త్రీవాదులకు లేదు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మన ఒక్కళ్లం ఓటు వేయనంత మాత్రాన ఏం మునిగిపోతుంది అనుకోకండి, మన ఒక్క ఓటుతో దేశం బాగుపడుతుందా అని నిర్వేదం చెందకండి. కళ్లు, కాళ్లూ లేని వాళ్లు, ముసలివాళ్లు.....కొండల్లో, ఎడారుల్లో ...ప్రయాణించి..ఓపిగ్గా వరుసలో నిలబడి ఉత్సాహంగా ఓటేస్తుంటే మనం మాత్రం ఎందుకు ఇంట్లో కూర్చోవాలి? మన ఓటు ఓ రౌడీనో గూండానో వేసే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? మన ఓటు మనమే వేద్దాం

మీకు తెలుసా ప్రస్తుత పార్లమెంటు మరియు అసెంబ్లీ సభ్యులలో ఎక్కువ మంది పది శాతం కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్నవారే. మరి మనందరం ఓటేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించండి. సమాజంలో మనం కోరుకుంటున్న మార్పు రావాలంటే ఓటు ద్వారానే అది సాథ్యం. మన రాష్ట్రంలోని ఓటర్లలో, ముఖ్యంగా హైదరాబాదులో, స్త్రీలు, యువతే ఎక్కువ శాతం ఉన్నారు. అందుకే ఎవరు గెలిస్తే నాకేంటిలే అన్న నిర్లిప్తత వీడండి. మీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ మనసు మాట వినండి. మీకు నచ్చిన వారికి ఓటెయ్యండి. మార్పుకి మార్గం వేయండి.

మనం ఓటు వేసే అభ్యర్థి గెలవకపోయినా పర్లేదు, అవతల వాడిని ఎంతమంది వద్దనుకుంటున్నారో తెలియటానికయినా మనం ఓటు వేయాలి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


ఓటు వేయటానికి ఓటరు గుర్తింపు కార్డే అక్కర్లేదు. ఈ కింది వాటిలో ఏ ఒక్కటి ఉన్నా ఓటు వేయవచ్చు.
పాసుపోర్టు.
డ్రైవింగు లైసెన్సు.
రేషన్ కార్డు.
పాన్ కార్డు.
ఫోటోతో ఉన్న ఏదైనా జాతీయ బ్యాంకు పాసు పుస్తకం లేదా పోస్టు ఆఫీసు పాసు పుస్తకం లేదా కిసాను పాసు పుస్తకం (పట్టాదారు పాసు పుస్తకం).
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులయితే ఫోటోతో ఉన్న వారి గుర్తింపు కార్డు.
ఫోటొతో ఉన్న ఎ.టి.ఎం కార్డు.

అసలు నన్నడిగితే ఓటు వేయటానికి ఓటరు గుర్తింపు కార్డు తీసుకెళ్ళకుండా ఉండటమే మంచిది, లేదంటే అందులో మన ఫోటో చూసి ఇది నువ్వు కాదు అని ఓటు వెయ్యనీయకపోయే ప్రమాదం వుంది సుమా:)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఓటు వేయకుండా మనకు ప్రశ్నించే హక్కు లేదు
, విమర్శించే హక్కు లేదు, నిలదీసే హక్కు లేదు, ఫిర్యాదు చేసే హక్కు లేదు.
                                              మంచి మార్పు కోసం ఓటేద్దాం

Read more...

March 13, 2009

తెలుగులో పిల్లలు చదవదగ్గ పుస్తకాలు

ఏం చదవాలి?
మొన్న శనివారం విశాలాంధ్రకి వెళుతుంటే మా ఆమ్మాయి అమ్మా మాకు కూడా ఏవైనా పుస్తకాలు తీసుకురా అంది, సరే తెస్తాను కాని తెలుగు పుస్తకాలే తెస్తాను అన్నా, సరే అవే తీసుకురా అంది. తెస్తానని చెప్పాను కాని తీరా అక్కడికి వెళ్లాక తెలుగులో 13 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలకి ఆసక్తికరంగా వుండే  పుస్తకాలు నాకేం కనిపించల! ఇది అసలు నాకు ఎప్పుడూ ఉండే సమస్యే. ఉన్న పుస్తకాలలోనే తీసుకోవచ్చుగా అంటారా? అదే అసలు సమస్య. ఈ వయస్సు అటూ ఇటూ కాని వయస్సు. అటు బాలసాహిత్యానికి ఎక్కువ ఇటు పెద్దల సాహిత్యానికి తక్కువ. అందులోనూ మా పిల్లలు బాల సాహిత్యంలో చాలా వరకు పుస్తకాలు చదివారు. కొన్ని ఇంగ్లీషు పుస్తకాలకి తెలుగు అనువాదాలు చదివారు. ఇక పెద్దల సాహిత్యానికి వస్తే ఇల్లేరమ్మ కథలు, దర్గామిట్ట కథలు, ప్రళయకావేరి కథలు, సలాం హైదరాబాదు, ఇల్లాలి ముచ్చట్లు, చంఘీజ్‌ఖాన్, ముళ్లపూడి, నాయని, శ్రీరమణల రచనలు.....ఇలాంటివి కొన్ని ఇంతకుముందే చదివారు, మరి ఈ సారి వాళ్లకంటూ ఏం తీసుకోవాలో నాకు అర్థం కాలేదు.

అదే ఇంగ్లీషులో చూడండి పుంఖానుపుంఖానులుగా పుస్తకాలు వుంటాయి, అక్కడ ఏం తీసుకోవాలో అర్థం కాదు, ఇక్కడ తీసుకోవటానికి ఏమీ దొరకవు అన్నట్టు వుంటుంది పరిస్థితి. మొన్నటి హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో మా పిల్లలని ఈ సారి పుస్తకాలు మీరే వెతుక్కుని కొనుక్కోండి అని వదిలేస్తే అన్నీ ఇంగ్లీషు పుస్తకాలే కొనుక్కొచ్చారు, ఇదేంటర్రా అంటే మరి మాకు తెలుగులో ఏం కనపడలేదు అన్నారు. మేము ఇంగ్లీషు పుస్తకాలు పెద్దగా చదివిందీ లేదు వాళ్లకి చెప్పిందీ లేదు మరి వాళ్లకి ఇంగ్లీషువి దొరికినప్పుడు తెలుగువి ఎందుకు దొరకలేదు? తెలుగులో ఈ వయస్సు పిల్లలని దృష్టిలో పెట్టుకుని అసలు పుస్తకాలు వస్తున్నాయా? రాకపోతే ఎందుకు రావటం లేదు?

ఇక మొన్న ఏం దొరకక యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల తీసుకున్నాను. ఇంటికి వచ్చాక మా అమ్మాయి అడిగింది ఏం తెచ్చావు అని, నాకేం కనిపించల అందుకని ఈ పుస్తకం తెచ్చాను అని చూపిస్తే ఇదా అని ఓ చూపు చూసి అవతల పడేసింది. నువ్వు ఆ మధ్య చదివిన చేతన్ భగత్ కంటే చాలా బాగా వ్రాస్తాడు చదువు అన్నా. అసలు మీరు చిన్నప్పుడు ఎలాంటి పుస్తకాలు చదివేవాళ్లు అంది----అవును అప్పుడు ఏం చదివేవాళ్లం?----ఒకసారి గతంలోకి తొంగి చూస్తే......

అప్పుడు కూడా ఈ వయస్సు పిల్లలకంటూ ప్రత్యేకంగా తెలుగు సాహిత్యం ఏమీ వుండేది కాదు. మా ఇంటికి అన్ని వార, మాస పత్రికలు వచ్చేవి. దాదాపు ఆరు ఏడు తరగతుల నుండే ఈ పత్రికలు చదివేవాళ్లం. అందులో వచ్చే సీరియల్సు అన్నీ మా నాన్న చింపి పుస్తకాలు కుట్టేవారు. ఎండాకాలం సెలవులలో అవన్నీ చదవటం మంచి కాలక్షేపంగా వుండేది. అవి కాక మా పక్క ఊరిలో మంచి గ్రంధాలయం వుండేది, అందులో అప్పట్లో వచ్చిన నవలలన్నీ దొరికేవి, మేము హైస్కూలు ఆ ఊరిలొనే చదివాం కాబట్టి స్కూలు నుండి వస్తూ అవి తెచ్చుకునేవాళ్లం. ఇక మా బంధువులకి పుస్తకాలు అద్దెకిచ్చే షాపు ఉండేది, అక్కడ నుండి ప్రముఖుల కొత్త నవలలు, కొమ్మూరి సాంబశివరావు, షాడో మధు బాబుల  డిటెక్టివ్ పుస్తకాలు  తెచ్చుకుని  ఎప్పటివప్పుడు చదివేసి తరువాతి పుస్తకం కోసం ఎదురు చూస్తుండేవాళ్లం.  కొమ్మూరి సాంబశివరావుది అయితే నెలకొక పుస్తకం విడుదలవుతుండేదని గుర్తు. గిరిజశ్రీ భగవాన్‌వి కూడా బాగానే చదివేవాళ్లం. అప్పట్లో డిటెక్టివ్ నవలలు పెద్దలు పిన్నలు అందరూ విపరీతంగా చదివేవాళ్లు.


యద్దనపూడి, మాదిరెడ్డి, యండమూరి, మల్లాది, చల్లా సుబ్రమణ్యం, చందు సోంబాబు, యర్రంశెట్టి, కొమ్మనాపల్లి, కోగంటి విజయలక్ష్మి, జొన్నలగడ్డ లలితాదేవి, పోలాప్రగడ, వాసిరెడ్డి, తురగా (మోచర్ల) జయశ్యామల, తురగా జానకీరాణి, అరెకపూడి (కోడూరి) కౌసల్యా దేవి (ఈవిడ నవలల పేర్లలో ఎక్కువగా చక్రం వుంటుండేది!), లల్లాదేవి, తోటకూర ఆశాలత, లత, రంగనాయకమ్మ, డి. కామేశ్వరి, బీనా దేవి, రావినూతల సువర్నాకన్నన్, వడ్డెర చండీదాస్......అబ్బో లెక్కలేనంతమంది......అందరి పుస్తకాలు నమిలేసేవాళ్లం. ఇందులో ఎన్ని గుర్తున్నాయి అని మాత్రం అడగకండి! ఏ పుస్తకం కొని చదివిన పాపాన మాత్రం పోలేదు. ఇక ఇప్పుడు పుస్తకాలు అద్దెకిచ్చే షాపులూ లేవు, మా చుట్టాల కొట్టూ   లేదు....ఏం చేస్తాం....ఓ పదేళ్ల నుండి పుస్తకాలు కొనే చదువుతున్నాం లేండి!


కథలు, సీరియళ్లే కాదు అప్పట్లో శ్రీశ్రీ ప్రశ్న-జవాబు(ప్రజ), మాలతీచందూర్ ప్రమదావనం, రామలక్ష్మి ప్రశ్నలు-జవాబులు, పురాణం సీత ఇల్లాలి ముచ్చట్లు ఇత్యాదివి చాలా ఆసక్తికరంగా వుండేవి. అచ్చంగా వీటికోసమే పత్రికలు చదివేవాళ్లు వుండేవారు. వారపత్రికలే కాకుండా వనిత, వనితాజ్యోతి, మహిళ, యువ, జ్యోతి లాంటి మాసపత్రికలు కూడా అందుబాటులో వుండేవి.  ఏవో ఒకటీ అరా తప్పితే ఈ పత్రికల స్థాయి కూడా బాగుండేది, వాటిమధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ వుండేది. 70-80లలో తెలుగులో రచయిత్రుల హవా బాగా నడిచిందని చెప్పవచ్చు.అందుకే ఆకాలంలో ఆడపేర్లు పెట్టుకుని వ్రాసే మగవారు ఎక్కువగా వుండేవారు.

ఇక అసలు విషయానికి వస్తే అప్పట్లో దొరికింది  ఏదైనా చదివేవాళ్లం కాబట్టి పిల్లలకంటూ ప్రత్యేకంగా పుస్తకాలు లేకపోయినా ఆ లోటు తెలియలేదేమో! అప్పటి ఆ పుస్తకాలు ఇప్పటి పిల్లలకి అంత ఆసక్తికరంగా ఎందుకు వుండటం లేదు? వాళ్ల అభిరుచులకు తగ్గట్టు తెలుగులో పుస్తకాలు ఎందుకు రావటం లేదు? నచ్చకపోవటానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి? ఇంగ్లీషు మాధ్యమంలోని చదువుల ప్రభావమా! తెలుగులో పుస్తకాలు చదివే వాళ్లు (పిల్లలు మరియు పెద్దలు) తగ్గిపోవటమా! ఇంగ్లీషు సాహిత్యం ప్రభావమా! టి.వీ.లు, కంప్యూటర్ల మహిమా! తోటి పిల్లల ప్రభావమా! తోటి పిల్లల ప్రభావం అని ఎందుకంటున్నానంటే మేమా పుస్తకం చదివాం ఈ పుస్తకం చదివాం అంటూ పిల్లల మధ్య చర్చలు జరుగుతుంటాయి, అందులో తెలుగు పుస్తకాల గురించి చర్చ వస్తే ఆశ్చర్యపడాల్సిందే. ఒకవేళ ఎవరైనా తెలుగు పుస్తకాలు చదివే పిల్లలు ఉన్నా వాటి గురించి మాట్లాడటం తక్కువతనం అనుకునే రోజులు ఇవి. అసలు ఇప్పుడు ఈ వయస్సు పిల్లలని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా రచనలు చేస్తున్నారా?ఒకవేళ రచనలు చేసేవాళ్లు ఉన్నా చదివేవాళ్లు ఉన్నారా? ఏంటో ఈ టపా అంతా ప్రశ్నలమయమే అనుకుంటున్నారా?

చివరిగా ఇంకొక్కటే ఒక్క ప్రశ్న!అసలు ఈ వయస్సు పిల్లలు చదవతగ్గ పుస్తకాలు తెలుగులో ఏం ఉన్నాయి? తెలిసిన పెద్దలు చెప్పగలరు. చదివే అభిరుచి ఉండాలే కాని ఏవైనా చదవ్వొచ్చు అంటారా!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP