పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

August 13, 2011

శ్రావణ పౌర్ణమికి మా ఇంట ఉదయించిన చందమామ

మా ఇంటి జాబిల్లి

సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం.... ఓ శ్రావణ పౌర్ణమి రోజు..

అమ్మాయా..అబ్బాయా అని అందరం ఆతృతగా ఎదురు చూస్తుండగా... రాత్రి 8:35 కి ---- ఆకాశంలోని పున్నమి చంద్రుడితో పోటీ పడుతూ...మా ఇంటి చందమామ ఈ లోకంలోకి అడుగు పెట్టింది.

చిన్న చిన్న కాళ్ళు...చిన్న చిన్న చేతులు..నాలో ప్రాణం పోసుకున్న మరో ప్రాణిని ...మొదటిసారి ఒళ్ళోకి తీసుకున్న ఆ క్షణం..అంతకన్నా మధుర క్షణం... ఈ జీవితంలో మరొకటి ఉండదేమో!  ఆ నులివెచ్చని మొదటి స్పర్శ...కొత్తగా ..వింతగా...ఇప్పటికీ అదొక మధురానుభూతి.

అక్కడి నుండి తనతో గడిపిన ప్రతి క్షణం అపురూపమే. తొలి అడుగు..తొలి మాట..తొలి పాట... తన ప్రతి కదలికని..తన ఎదుగుదలని అక్షరబద్దం..చిత్రబద్దం.. చేసి పెట్టుకున్నాం.

చుట్టుపక్కల నాలుగిళ్ళకి తనే పసిపిల్ల..అందరి గారాబం..ఇల్లేరమ్మలా లేచింది మొదలు ఇళ్లమ్మట తిరుగుతుండేది..

గోరింటాకు పెట్టి చేతులు రెండూ సాక్సుల్లో కట్టేసామని ఓ అర్థరాత్రి లేచి ఏడ్చిన ఏడుపుకి లైనులో అందరూ లేచి వచ్చి ఊరడించిన చిత్రం...

నాన్న ముక్కుని పట్టుకుని కసుక్కున కొరికిన చందం..

మొదటిసారి పలక మీద అ..ఆ..లు దిద్దమంటే నేను దిద్దనని మొండికేసిన వైనం...

స్కూలుకి వెళ్ళనని చేసిన  మారాం...

స్కూలులో టీచర్ టేబులెక్కి అక్కడే కూర్చుంటానని  చేసిన అల్లరి..

ఒకటా రెండా..ఎన్నెన్ని అనుభూతులు...

అందుకే శ్రావణ పౌర్ణమి అంటే నాకు రాఖీ పండగ అని కన్నా మా అమ్మాయి పుట్టిన రోజుగానే ఎక్కువ గుర్తు ఉంటుంది.

రాఖీ పండగకి ..రాఖీలు కట్టటం మాకు అలవాటు లేదు.  చిన్నప్పుడు అసలు ఇలా ఓ పండగ చేసుకుంటారని కూడా తెలియదు.

మా పిల్లలు వచ్చాక మాత్రం మా అమ్మాయి స్నేహితులని చూసి తనూ సరదాగా వాళ్ళ తమ్ముడికి కట్టటం మొదలుపెట్టింది. వాడికీ ఇలాంటివి అంత నచ్చవు.. బలవంతాన కట్టేది. మంచం మీదనుండి లేవటానికే కూడా బద్దకించేవాడు..ఇలాగే కట్టు అని చెయ్యి ఇచ్చేవాడు.  పాచి మొహానే కట్టించుకునేవాడు అన్నమాట.  కట్టాక ఓ అరగంట కూడా ఉంచుకునేవాడు కాదు..తీసి పడేసేవాడు.  బాగా చిన్నప్పుడు ఇలా రాఖీ కట్టించుకున్నాక అక్కకి ఏమైనా గిఫ్టు ఇవ్వాలి ఇవ్వు అంటే ఏంటి ఇచ్చేది అనేవాడు. పోనీలే ఇవాళ అక్క పుట్టిన రోజు కూడా కదా ఇవ్వు అంటే ఇచ్చేవాడు.

ఇప్పుడు దూరాన ఉన్నాడు కదా..మా అమ్మాయికి ప్రేమాప్యాయతలు ఇంకా పెరిగిపోయాయి.  ఓ మంచి కార్డు తనే స్వయంగా  తయారు చేసి రాఖీతో పాటు పంపింది. వాడసలు దాన్ని  తెరిచి చూస్తాడో లేదో కూడా నాకు అనుమానమే!

14 వ్యాఖ్యలు:

Sujata M August 13, 2011 at 1:35 PM  

తప్పకుండా తెరిచి చూస్తాడు మీ బాబు. ఈ వయసులో వాళ్ళ ఆప్యాయతలు ఎక్కువతాయి. ఎంత లవ్లీ గా రాసారు? మీ అమ్మాయికి పుట్టిన రోజూ, రాఖీ శుభాకాంక్షలు

Sravya V August 13, 2011 at 1:41 PM  

భలే ఉంది ఫొటోస్ లో బుట్ట బొమ్మ లాగా :) పుట్టినరోజు శుభాకాంక్షలు తనకి !

sunita August 13, 2011 at 2:01 PM  

ముందుగా మీ పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు! నేను తనని చూసినప్పుడు సిక్స్థొ,సెవెంతొ చదువుతున్నట్లు గుర్తు. చూస్తూనే పెరిగిపోతారు పిల్లలు!!

జయ August 13, 2011 at 3:22 PM  

మీ పాపాయి ముచ్చట్లు ఎంత మురిపెంగా చెప్పారండి. మీ పౌర్ణమి చందమామకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అమ్మాయి రాఖీ పండుగ మురిపెం కూడా తప్పక తీరుతుంది.

వేణూశ్రీకాంత్ August 13, 2011 at 4:45 PM  

మీ ఇంటి జాబిల్లి ముచ్చట్లు ఎంత బాగా చెప్పారండీ.. చాలా బాగుంది మీ టపా.. మీ పాపకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

బులుసు సుబ్రహ్మణ్యం August 13, 2011 at 5:18 PM  

మీ పున్నమి జాబిల్లి కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

లత August 13, 2011 at 5:37 PM  

మీ పాపకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అండీ

మాలా కుమార్ August 13, 2011 at 5:58 PM  

మీ చందమామ కు జన్మదిన శుభాకాంక్షలు .

KumarN August 13, 2011 at 6:53 PM  

Wow. Happy birthday to her.
Baga raasaaru

Chandu S August 13, 2011 at 7:52 PM  

దూరాన ఉన్న అబ్బాయి తప్పకుండా తెరుస్తాడు. అబ్బాయి ఏం చేశాడో తెలుసుకోవాలని ఉంది.

మధురవాణి August 13, 2011 at 8:55 PM  

So Sweet!
Happy Birthday to your daughter! :)

మురళి August 14, 2011 at 10:38 AM  

చాలా బాగుందండీ.. నా శుభాకాంక్షలు అందజేయండి.. తప్పకుండా ఓపెన్ చేసి చూస్తారు.. ఇంటికి దూరమైనా కొత్తలో అక్కడినుంచి వచ్చే ప్రతిదీ అపురూపంగానే అనిపిస్తుంది.. పైకి ప్రకటించడం, ప్రకటించకపోవడం అన్నది వారి వారి వ్యక్తిగతం..

Maina August 14, 2011 at 9:47 PM  

pondikaina ammayiki puttinaroju subhakankshalu

సిరిసిరిమువ్వ August 14, 2011 at 10:07 PM  

అందరికి ధన్యవాదాలు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP