పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 24, 2011

ఏం కావాలి వీళ్లకి.....ఏం చెయ్యాలి వీళ్లని?????



శారద వాళ్ళ అమ్మాయి డ్రగ్సు కి అలవాటు పడిందట..శారద చాలా డిప్రెషనులో ఉంది..ఒకసారి ఫోను చేసి మాట్లాడతావా ?

నాలుగు రోజుల క్రితం నా స్నేహితురాలు ఫోనులో చెప్పిన మాటలు నాకు ఇంకా చెవుల్లో ప్రతిద్వనిస్తున్నాయి.

ఈ మధ్య కాలేజిల్లో పిల్లలు ఈ డ్రగ్సుకి అలవాటుపడుతున్నారని అక్కడక్కడా వింటున్నాం కానీ బాగా తెలిసిన అమ్మాయి ఇలా అయిందంటే ఏంటో నమ్మశక్యంగా లేదు.  ఆ పిల్ల అమాయకపు మొహమే కళ్ళముందు కదులుతుంది.

ఎవరు దీనికి బాధ్యులు?
తల్లిదండ్రులా....పిల్లలా?

ఏం కావాలి ఇప్పటి పిల్లలకి?
అమ్మా నాన్న ఏం తక్కువ చేస్తున్నారని వీళ్లు ఇలాంటి అలవాట్ల బారిన పడుతున్నారు?
ఎందుకు తల్లిదండ్రులిస్తున్న స్వేచ్చని దుర్వినియోగం చేసుకుంటున్నారు?

మా శారదకి ఒక్కతే పాప.  మా శారద చాలా పద్దతిగా తన పనేమో తానేమో అన్నట్టు ఉంటుంది.  ఉన్న ఒక్కాగానొక్క పిల్లని మంచి స్కూల్లో చదివించాలని అప్పట్లో హైదరాబాదులో బాగా పేరున్న ఓ స్కూల్లో చేర్చింది.  తను ఉద్యోగానికెళితే పిల్లకి ఇబ్బంది అని వాళ్ల అమ్మా వాళ్ళని కూడా హైదరాబాదు తీసుకొచ్చేసింది.

ఏడో తరగతి నుండే పాప ప్రవర్తన కాస్త తేడాగా ఉందని... స్నేహితులు అంతా పెద్ద పెద్ద ఇళ్ళనుండి వచ్చిన వాళ్ళు అని..వాళ్లని చూసి వాళ్ళలాగా అన్నీ కావాలంటుందని....పెద్దవాళ్ళు అంటే లెక్కలేకుండా మాట్లాడుతుందని.....చదువు మీద శ్రద్ద చూపటం లేదని ...ఇలా  నా దగ్గర చాలా సార్లు వాపోయింది.  స్కూలు మార్చాలని చూసింది కానీ వాళ్ళ పాప స్కూలు మారటానికి ససేమిరా అంది.  నేనూ వారించాను..ఎందుకంత బలవంతం చేస్తావు...స్నేహితుల ప్రభావం...కొంచం పెద్దయితే తనే తెలుసుకుంటుందిలే అని. 

ఇంటరుకి వచ్చాక హాస్టలులో పెట్టింది..ఓ వారం ఉండి నేనుండనని వచ్చేసింది..సరే అని మరో కాలేజీలో చేర్చింది.  ఇంటరు అయ్యాక ఫాషను డిజయినింగ్ చేస్తానంటే కోచింగు ఇప్పించారు..తీరా పరీక్ష సమయానికి నేను అది చదవను..ఇంజనీరింగే చదువుతానంది..దానికీ సరే అని  ఓ మంచి కాలేజీలో పది లక్షలు పోసి సీటు కొని చేర్పించారు.  ఇంజనీరింగులో చేరాక నాకు ప్రత్యేకంగా కారు కావాలంది.....కొనిచ్చారు..ఈ పిచ్చి అపార్టుమెంటు ఏంటి..మన స్థలం ఉందిగా దాంట్లో ఇల్లు కట్టండి అంటే ఇల్లు కట్టటం మొదలుపెట్టారు.

 మా శారద వెనకాల నసుగుతానే ఉంది..ఇంత చిన్న పిల్లకి కారేంటి...ప్రతిదానికి ఇలా తను ఆడించినట్టల్లా ఆడితే తర్వాత మన మాట వింటుందా అని వాళ్ళాయన్ని హెచ్చరిస్తూనే ఉంది.  పోనీలే మనకున్న దాంట్లోనే కదా కొంటున్నాం.. అది సుఖంగా ఉంటే మనకి అంతే చాలు అని ఆయన వాళ్ళమ్మాయిని వెనకేసుకొచ్చేవారు.

శారద నాకు ఫోను చేసినప్పుడల్లా అందరి పిల్లలు చక్కగా బాధ్యతగా చదువుకుంటున్నారు..మా అమ్మాయే ఇలా ఎందుకయిందో నాకర్థం కావటం లేదు..తల్లిగా నేను విజయవంతం  కాలేకపోయాను..నేను చదివిన చదువు (తను పిల్లల పెంపకం లో డిగ్రీ చదివింది...ఉద్యోగం కూడా దాని మీదే!)నా పిల్లని పెంచుకోవటంలో నాకు ఉపయోగ పడలేదు..నేను ఎక్కడ తప్పు చేసానంటావు...చెప్పినప్పుడు బాగానే వింటుంది..ఇక నుండి బాధ్యతగా ఉంటాను..బుద్ధిగా చదువుకుంటాను అని చెప్తుంది..మరలా మూడో రోజు నుండి మామూలే... స్నేహితులు..షికార్లు..షాపింగులు...ఇక ఈ పిల్ల మారదు అని చాలా బాధపడేది.  ఈ వయస్సులో పిల్లలు అలానే ఉంటారులే అని నేనూ ఎప్పటికప్పుడు తనకి సర్దిచెప్తుండేదాన్ని.

ఇప్పుడు శారదతో ఏమని మాట్లాడాలి నేను?
ఇక్కడ శారద చేసిన తప్పేంటి? ?
 పిల్లని అపురూపంగా పెంచుకోవటమా?
మంచి స్కూలు..కాలేజీల్లో చదివించటమా?
అడిగినవన్నీ కొనిపెట్టటమా?
కావల్సినంత స్వేచ్చ ఇవ్వటమా?
ఎలాంటి ఆంక్షలూ పెట్టకపోవటమా?

పిల్లలూ ......
ఆలోచించండి..
మీ తల్లిదండ్రుల గురించి ఒక్క నిమిషం ఆలోచించండి..
వాళ్ళ ప్రాణాలన్నీ మీ మీదే పెట్టుకు బ్రతుకుతారు...
మీకు చిన్న దెబ్బ తగిలినా వాళ్ళు విలవిల లాడతారు..
వాళ్ళ ఆశలు....ఆశయాలు అన్నీ మీరే..
వాళ్ళ కలల ప్రతిరూపాలు మీరు..
మీరు నవ్వితే నవ్వి....మీరు ఏడిస్తే ఏడ్చి
మీ కోసమే బ్రతికే వాళ్ళని..
ఇలాంటి అలవాట్లతో క్షణం క్షణం చంపకండి..
సరదాగా స్నేహితుల ప్రభావంతో మొదలయ్యే అలవాటు..
మనిషిని ఎంత అధఃపాతాళానికి తీసుకెళుతుందో  అర్థం చేసుకోండి!
పిల్లలూ ఒక్కసారి ఆలోచించండి..
ఈ మాదక ద్రవ్యాల మహమ్మారికి దూరంగా ఉండండి..
మీ జీవితాలకి ఓ విలువ కలిపించుకోండి!!

జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా

16 వ్యాఖ్యలు:

వేణూశ్రీకాంత్ June 24, 2011 at 5:23 PM  

మీ టపా చదవగానే మనసంతా భారంగా ఐపోయిందండీ... చివరి లైన్స్ చాలా బాగా చెప్పారు.

తన ప్రవర్తనలోని తేడా గమనించినపుడే పరిసరాలను మార్చడం.. స్వేచ్ఛకు పరిమితులు విధించడం.. అవసరానికి విలాసానికీ మధ్య తేడా స్పష్టం చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. పిల్లల విషయంలో ప్రేమ గారాబం ఉన్నా కూడా ఇలాటి సంధర్బాలలో కాస్త కఠినంగా వ్యవహరించక తప్పదు. మరీ ఇంజనీరింగ్ లో కారు, తను చెప్పిందని ఇల్లుకట్టడం అనేవి కొంచెం అతిగారాబంగానే అనిపిస్తున్నాయ్ నాకు. ఎంతైనా బయటనుండి చెప్పడం చాలా ఈజీనే అనుకోండి చేయడమే కష్టం. ఇప్పటికైనా మించిపోయినది లేదు హైద్రాబాద్/బెంగళూరుల్లో డి అడిక్షన్ సెంటర్స్ ని ఆశ్రయిస్తే మంచి ఫలితాలు ఉండచ్చు. ఇలాంటపుడే నాకు ఏదో సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది.. పిల్లలను కనగలమే కానీ వాళ్ళ జాతకాలను కాదు అని...

ఆ.సౌమ్య June 24, 2011 at 6:04 PM  

hm....sad!
వేణు చెప్పినదానితో ఏకీభవిస్తున్నాను. అతి గారాబం చెయ్యకుండా ముందునుండే జాగ్రత్తపడవలసినది.
Peer pressure అని ఒకటి ఎప్పుడూ ఉంటుంది. దాని నుండి పిల్లలని తప్పించడం ఈనాటి తల్లిదండ్రులకి పెద్ద చాలెంజ్!

శిశిర June 24, 2011 at 7:02 PM  

పిల్లలని కష్టాలలో పెంచక్కరలేదు కానీ కష్టమంటే ఏమిటో తెలియచెపుతూ పెంచాల్సిన అవసరం మాత్రం ఉందండి. పిల్లలు అడిగారు కదా, ఇవ్వగల స్థోమత మనకుంది కదా అనుకుంటూ వాళ్ళు కోరిందల్లా తెచ్చి ముందు పెడుతూ ఉంటే వాళ్ళకి కొన్నిటి విలువ తెలియకపోవచ్చు. ముందు అతిగారాబం చేసి తరువాత బాధ పడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మంచికి చెడుకి తేడా తెలియని పసివాళ్ళకి మంచేదో, చెడోదో చెప్తూ పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారంతో తమ భవిష్యత్తుని సరైన దిశగా మలచుకోవాల్సిన బాధ్యత పిల్లలది.
ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగింది. ఆ అమ్మాయి త్వరగా ఆ మహమ్మారినుండి బయటపడాలని కోరుకుంటూ..

Praveen Mandangi June 24, 2011 at 7:18 PM  

ముంబైలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకు తాగిన మత్తులో కార్ నడిపి రోడ్ పక్కన నిద్రపోతున్నవాళ్ళని కార్‌తో తొక్కేశాడు. యాక్సిడెంట్ కేస్‌తో పాటు తప్పుడు ఏజ్ సర్టిఫికేట్ చూపించి లైసెన్స్ తెచ్చుకున్నందుకు ఫోర్జరీ కేస్ కూడా ఫైల్ చేశారు.

శరత్ కాలమ్ June 24, 2011 at 7:26 PM  

టీనేజీ పిల్లల మనస్థత్వం తల్లితండ్రులు అర్ధం చేసుకోలేక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి పిల్లలు దూరం అవుతారు, పెడదారులు పడతారు. టీనేజీ పిల్లల మనస్థత్వం గురించి తల్లితండ్రులు చదవాల్సిన చక్కటి పుస్తకం గురించి నేను వ్రాసాను. వీలయితే వారికి ఆ పుస్తకం బహుమతిగా ఇవ్వండి.ఆ తల్లి పిల్లల పెంపకం మీద కోర్సు చేసినా, ఉద్యోగం చేసినా సరే ఆ పుస్తకంలోని విషయాలు తెలిసివుండకపోవచ్చు.

http://sarath-kaalam.blogspot.com/2009/09/yes-your-teen-is-crazy-loving-your-kid.html

ఆ పుస్తకం నాకు ఎంతో చక్కగా ఉపయోగపడింది. టీనేజీ డెప్రెషనులో వున్న వారు పెద్దవారు మాంద్యంలో వున్నట్లుగా విచారంలొ వుండరు. దురుసుగా మారతారు. అది ఎక్కువయితే మత్తు మందులకు కూడా అలవాటు పడతారు.

వీలయితే ఈ పుస్తకం కూడా చదవమనండి:
http://sarath-kaalam.blogspot.com/2009/09/hidden-gifts-of-introverted-child.html

సిరిసిరిమువ్వ June 24, 2011 at 10:31 PM  

వేణూ, నిజమేనండి..స్వేచ్చకి పరిమితులుండాలి..పిల్లలని కట్టడి చేయాల్సినప్పుడు కట్టడి చేయాలి. ఇది కత్తి మీద సాము లాంటిది. తల్లిదండ్రులు చాలా మెలుకువగా ఉండాలి. ఏదయినా చెప్పినంత తేలిక కాదు పిల్లల్ని పెంచటం...ఈ రోజుల్లో పిల్లల్లు చిన్న మాట అన్నా పంతాలకి పోతున్నారు.

సౌమ్యా, ఈ రోజుల్లో పిల్లల మీద స్నేహితులు, సమ వయస్కులు, సెలెబ్రిటీల ప్రభావం చాల ఎక్కువగా ఉంటుంది..అది మంచి విషయాల్లో ఉంటే బాగుంటుంది.

శిశిర గారూ, బాగా చెప్పారు. పిల్లల మీద స్నేహితుల ప్రభావం ఎంతగా ఉంటుందంటే వాళ్ల దృష్టిలో తల్లిదండ్రులకి ఏమీ తెలియదు...స్నేహితులు చెప్పిందే వేదం...తల్లిదండ్రులు కాస్త కంట్రోలు చెయ్యబోతే ఎదురు తిరుగుతున్నారు. తల్లిదండ్రులబట్టే పిల్లల వ్యక్తిత్వం ఉంటుంది కానీ కొంతమంది విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా పిల్లలని అదుపులో పెట్టలేకపోతున్నారు.

ప్రవీణ్ గారూ..మీ వ్యాఖ్య నాకు అర్థం కాలేదు.

శరత్ గారూ..మంచి పుస్తకాల గురించి చెప్పినందుకు ధన్యవాదాలు.

ramya June 25, 2011 at 12:01 AM  

ఆ అమ్మాయి మానసికంగా ఏదైనా బాధలో ఉందేమో!
తెలిసి తెలియక తను చేసిన పొరపాట్లు, తన అలవాట్ల గురించి తల్లి తన మీద అందరికీ చెడు ప్రచారం చేస్తుందని ఏమైనా కృంగిపోయిందేమో!

డ్రగ్స్ అలవాటు మానిపించటం సులభమే. ఎర్లీ స్టేజ్ లో మానిపించాక పెద్దగా సైడ్ ఎఫెక్ట్ కుడా ఉండవు. కొంచెం విత్డ్రావల్ సిండ్రోమ్స్ తప్పించి. ఆ తరువాత ఆ అమ్మాయిని కనిపెట్టుకుని ఉండేంత టైమ్ ఆమె పేరెంట్స్ ఉందోలేదో!!
చాలా మంది పేరెంట్స్ ప్రవర్తన బయటి వాళ్ళతో ఉన్నట్టు తమ పిల్లలతో ఉండదు. మరి !!

సిరిసిరిమువ్వ June 25, 2011 at 9:49 AM  

రమ్య గారూ..అదేం లేదండి...ఇంట్లో ఆ అమ్మాయిదే పై చేయి. మా ఫ్రెండు బాగా దగ్గర వాళ్లతోనే సరిగ్గా చదువుకోవటం లేదని చెప్పేది కానీ చులకనగా మాట్లాడటం అదీ ఏమీ లేదండి. ఇప్పుడు కూడా వేరేవాళ్ళు చెప్తే తెలియటం తప్ప తానుగా ఎవరికీ చెప్పలేదు.

మనం ఎంతసేపటికి తప్పంతా తల్లిదండ్రులదే అన్న దృష్టితోనే చూస్తాం..ఈ కాలం పిల్లల మీద స్నేహితుల ప్రభావం చాలా ఉంటుందండి...కొంతమందికి అది మంచి చేస్తే కొంతమందికి చెడు చేస్తుంది. ఏదో సరదాకి మొదలుపెట్టిన అలవాట్లు వాళ్ళని ఊబిలోకి దింపుతున్నాయి.
తల్లిదండ్రులు కూడా కొన్ని విషయల్లో కొంచం కటువుగా ఉండాలి.

మురళి June 25, 2011 at 10:21 PM  

ఏం కావాలి వీళ్ళకి? అని అడిగారు కదా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదైతే దొరకదో, అదే కావాలి.
నేను చెప్పాలనుకున్నది వేణు గారు, శిశిర గారు చెప్పేశారు..

Mauli June 27, 2011 at 11:20 PM  

@ఒక్కాగానొక్క పిల్లని మంచి స్కూల్లో చదివించాలని అప్పట్లో హైదరాబాదులో బాగా పేరున్న ఓ స్కూల్లో చేర్చింది.

ఇదే కారణ౦ :)

సిరిసిరిమువ్వ June 30, 2011 at 11:14 AM  

మురళి గారూ, ధన్యవాదాలు. ఈ రోజుల్లో పిల్లల పెంపకం కత్తి మీద సాములా ఉంటుంది. మారిన జీవన ప్రమాణాలు కానివ్వండి...మారుతున్న విలువలు కానివ్వండి..కారణం ఏదయినా..తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా బయటి ప్రభావాలు చాలా ఉంటున్నాయి.

Mauli గారూ, నిజమేనేమో!
ఇంతకీ మీ పేరు తెలుగులో ఎలా వ్రాయాలో చెప్తారా!

ramya June 30, 2011 at 7:00 PM  

సిరిసిరిమువ్వ గారు, అలాగా, ఐతే పొరపాటు అమ్మాయిదే అయ్యుంటుంది.
ఎవరిదైనా, వాళ్ళ కుటుంబం మొత్తం ఇప్పుడు బాధ పడుతున్నారు. మీ స్నేహితురాలిని ధైర్యంగా ఉండమని చెప్పండి. పరవాలేదు ఇలాంటివన్నీ దాటి తప్పకుండా తన బాధ్యత తెలుసుకునేలా చేయవచ్చు అని ఊరడించండి.
అమ్మాయికి తన ఆరోగ్యం గురించి తన గురించీ తనే శ్రద్ద తీసుకోవాలనీ ఎల్లకాలం ఎవరూ తన బాధ్యత తీసుకోరనేది స్పష్టంగా తెలియజేయాలి.
చెప్పలేమండి, కొందరు పిల్లలు ఎంత నిర్లక్ష్యంగా వదిలినా చక్కగా బాధ్యతగా ఉంటున్నారు. కొందరు ఎంత శ్రద్దగా చూసుకున్నా తప్పటడులు వేస్తున్నారు.
అమ్మాయి తప్పకుండా జీవితం విలువ తెలుసుకుంటుంది. కాని అప్పట్లోగా ఆ అమ్మాయి జీవితాన్ని తప్పకుండా తల్లిదండ్రులే కాపాడుకోవాలి. మీ స్నేహితురాలు క్షమ, సహనం, ముఖ్యంగా ధైర్యంతో ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో.
అంతా మంచే జరుగుతుంది.

Mauli June 30, 2011 at 9:47 PM  

మీ బ్లాగు బావు౦ద౦డి.

-మౌళి

Mauli July 1, 2011 at 12:17 AM  

బ్లాగ్మిత్రుల౦దరి లా మొదట ఈ టపా చూడగానే బాధ కలుగలేద౦డి. కోప౦ వచ్చి౦ది. కనీస౦ ఈ పాపకు నయ౦ అవుతు౦ది. కాని లాస్ట్ మ౦త్ లో మా కజిన్ తన ప్రాణమే తీసికొన్నాడు.:( . ఒక్కగానొక్క కొడుకు.బోలెడ౦త ఆస్తి ఉ౦ది కాని ఏ౦ లాభ౦.ఇప్పుడు ఏమన్నా వారి బాధ తగ్గి౦చలేము.

పిల్లల్ని పె౦చడ౦ అ౦టే మాటలు కాదు ఒప్పుకు౦టాను.

ఈ పీర్ ప్రెజర్ ము౦దు అ౦తర్లీన౦గా పెద్ద వాళ్ళకి ఉ౦డడ౦ వల్లనే, ఆ ప్రెజర్, ఇ౦కా క౦పారిజన్ పిల్లలకి తెలీకు౦డానే ట్రాన్స్ఫర్ అవుతు౦ది.

మీరు శారద గారిని పలకరి౦చడానికి స౦శయి౦చాల్సిన పని లేదు,వారికి, అమ్మాయికి తోడుగా ఉ౦డ౦డి... అర్ధ౦ చేసికొనేలా చెప్ప౦డి చాలు.

Anonymous,  July 26, 2011 at 8:01 PM  

నా అభిప్రాయంలో ఈనాటి ప్రభావాలూ, పరిస్థితులు అన్నీ యువత(ఇంకా మాట్లాడితే పిల్లలు) తప్పుదారి పట్టడానికే అనువుగా ఉన్నాయి. అంతవరకూ ఎందుకు మందు, సిగరెట్ తాగడం తప్పేమీ కాదు కాఫీ, టీల్లాగే అవి కూడా అలవాట్లని భావించే స్థితిలో ఉందీ సమాజం(అందరూ అని నా అభిప్రాయం కాదు). ఏ రోడ్డు మీదో మనకి తెలిసినవారబ్బాయి సిగరెట్ తాగుతూ కనిపిస్తే మందలించగలరా మనలో ఎవరైనా... ఆ స్వాతంత్రం సమాజానికి ఇవ్వట్లేదీనాటి కుటుంబం. ఈ రోజు సిగరెట్టయ్యింది రేపు డ్రగ్స్ అవుతుంది. ప్రజాబాహుళ్యం అలవాటు పడిపోగానే ప్రభుత్వాం అది కూడా సిగరెట్, మందులాగా ఆదాయ మార్గంగా మలుచుకుంటుంది.
నా ఉద్దేశ్యంలో ఇవన్నీ దాటి ఎవరైనా ఏ దురలవాట్లూ లేకుండా, మంచి సంస్కారంతో ఉన్న వ్యక్తిగా తయారైతే అది కేవలం ఒక యాక్సిడెంట్.

సిరిసిరిమువ్వ July 27, 2011 at 11:53 AM  

పక్కింటబ్బాయి (ఇల్లు మారాడు): మీ మాటలతో కొంతవరకే ఏకీభవిస్తాను. "ప్రజాబాహుళ్యం అలవాటు పడిపోగానే ప్రభుత్వాం అది కూడా సిగరెట్, మందులాగా ఆదాయ మార్గంగా మలుచుకుంటుంది"..మరీ అలా తయారవుతుందంటారా? ఒకవేళ అయితే బాధ్యత గల పౌరులుగా దానిని ఎదిరించాల్సిన అవసరం మనమీదే ఉంటుంది.

"నా ఉద్దేశ్యంలో ఇవన్నీ దాటి ఎవరైనా ఏ దురలవాట్లూ లేకుండా, మంచి సంస్కారంతో ఉన్న వ్యక్తిగా తయారైతే అది కేవలం ఒక యాక్సిడెంట్"..
పరిస్థితులు మరీ అంత దారుణంగా ఉన్నాయని నేననుకోను. వెనుకటికంటే ఎక్కువమంది వాటి పైపుకి ఆకర్షించబడుతున్న మాట వాస్తవమే కాని మీరు మరీ అందరినీ ఒకే గాట కట్టేస్తున్నారు. యువత అంతా అలా లేరులేండి!

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP