సంకురాత్రి సంబరాలు---పండగ అప్పచ్చులు
సంక్రాంతి.. పేరు వింటేనే ముందు నాకు మా ఊరు గుర్తుకొచ్చేస్తుంది. మా ఇల్లు.. చావిడి...పొలాలు.. పొలాల్లో గట్ల వెమ్మటి బంతి పూలు...ముగ్గులు...గొబ్బెమ్మలు..అలా అలా మా ఊరంతా ఓ చుట్టేసి వస్తా! ఈ సంవత్సరంతో మా అబ్బాయి ఇంటరు అయిపోతుంది కాబట్టి వచ్చే సంవత్సరం నుండి సంక్రాంతికి మాత్రం తప్పకుండా మా ఊరు వెళ్ళాల్సిందే అని తీర్మానం కూడా చేసేసుకున్నా! సంక్రాంతి అంటే ముగ్గులు..గొబ్బెమ్మలే కాదు అరిసెలు కూడా! మిగతా పిండి వంటలు ఎప్పుడయినా చేసుకుంటారు కాని అరిసెలు మాత్రం ఒక్క సంక్రాంతికే చేసేది. పెళ్లప్పుడు ఏదో శాస్త్రానికి అల్లుడికని నాలుగు చేస్తారనుకోండి.
ప్రతి పండగకి మా ఇంట్లో అప్పచ్చుల (అదేనండి పిండివంటలు) కార్ఖానా వెలుస్తుంది. మా అమ్మా వాళ్లు అక్కచెల్లెళ్లు పంచపాండవులు. వీళ్లల్లో ముగ్గురు మా ఊరే.. మరో ఇద్దరు అటు ఓ ఐదు నిమిషాలు ఇటు ఓ ఐదు నిమిషాల ప్రయాణం దూరంలో ఉంటారు....అంటే పక్క పక్క ఊళ్లే అన్న మాట! మా అమ్మమ్మ వాళ్లది మా ఊరే! చూసారా మా తాతయ్య పిల్లలందరినీ ఎంచక్కా దగ్గరే ఉంచుకున్నారో! మా ఇద్దరు మామయ్యలు ఊర్లోనే!
ఆ పంచపాండవులకి అందరికి కలిపి ఓ డజను మందిమి సంతానం. అందులో ఒకరు తప్పితే అందరం ఆంధ్రదేశంలోనే నివాసం. ఈ పదకొండుమందికి దాదాపు ప్రతి పండగకి మా అమ్మలే ఇప్పటికీ పిండివంటలు చేసి పంపుతారు. (పండగలకే కాదు మధ్య మధ్య కూడా). ఇక సంక్రాంతి అయితే చెప్పక్కరలేదుగా ... అరిసెలు ముఖ్యమైన అప్పచ్చులు. వాటితో పాటు చక్రాలు, చక్కలు, చక్కపకోడిలు, బెల్లం మిఠాయి....ఎవరు ఏవి ఆర్డరు చేస్తే అవి.
పై ఫోటోలోని లడ్లు జంతికలు తప్పితే మిగతావన్నీ మా ఇంట్లో చేసినవే!
...పండగలప్పుడు ఈ అప్పచ్చులు వండటానికి ఓ ప్రత్యేక వంటశాల వెలుస్తుంది. ఇళ్ల దగ్గర పెద్ద పెద్ద చావిళ్లు కదా. ఎక్కువగా మా చావిట్లోనే ఈ సందడంతా! రోజుకి కిలోలు కిలోలు బెల్లంతో అరిసెలు వండేస్తారు. తెల్లవారుఝాము రెండుగంటలనుండి మొదలవుతుంది..ధనా ధనా పిండి కొట్టే మోత. చిన్నప్పుడు అయితే అసలే చలి ముడుచుకుని ముడుచుకుని పడుకుంటామా.. ఐదు దాటగానే మా నాయనమ్మ ఇకలే పిండి జల్లిద్దువు కానీ అని లేపేది. పక్కనుండి మా అమ్మమ్మ చాల్లే ఊరుకో దాన్ని పడుకోనీ..నేను జల్లిస్తున్నాగా . ఎవరన్నా నిద్రపోతుంటే చూడలేవు అని మెత్త మెత్తగా చివాట్లేసేది. అహా..ఆ రోజులే వేరు.
అరిసెలు గడ్డి మీద ఆరబెట్టటం పిల్లల వంతు. కాసేపు చేసాక ఇక విసుగేసి మేము ఆడుకోవాలంటూ పరిగెత్తేవాళ్లం. మా నాయనమ్మేమో పనిలో చండశాసనురాలు. అరిసెలన్నీ వృత్తలేఖినితో గీసినట్టు ఒకే వ్యాసంతో ఉండాలనేది. గారెలు, లడ్డు, బూరెలు..గవ్వలు..అన్నీ కొలిచినట్టు ఒకే సైజులో చేసేది..అందరూ అలాగే చెయ్యాలనేది. పని ఉన్నంత సేపు అందరినీ దడదడలాడించేది.
పిండివంటలతో పాటు రకరకాల కూరలు..పచ్చళ్లు..ఆ నాలుగయిదు రోజులు అందరూ అక్కడే భోజనం చేసేవాళ్ళు. ఓ చిన్న సైజు పెళ్ళి భోజనంలాగే ఉండేది. అప్పచ్చులు వండటం అయ్యాకా..ఎవరివి వారికి భట్వాడాలు ...మిగిలినవి పెద్ద గంగాళాలకి వేసి పెట్టేవాళ్లు. పండగ మూడు రోజులు ఇంట్లో ఏ మూలకెళ్ళినా నేతి ఘుమఘుమలే!
రోజుకి ఒకళిద్దరివి చొప్పున ఓ నాలుగయిదు రోజులు ఇదే పని మా అమ్మ వాళ్లకి. ఇక ఏ పండగ అయినా ఆ రోజంతా మా నాయనమ్మకి చేతినిండా పనే. పని వాళ్లందరూ అప్పచ్చుల కోసం వచ్చేవాళ్లు. చాకలి, మంగలి, కుమ్మరి, పొలంలో పని చేసేవాళ్లు.. పొద్దుటినుండి సాయంత్రం దాకా అలా వస్తూనే ఉండేవాళ్ళ్లు. మూడు నాలుగు పెద్ద పెద్ద జల్లి బుట్టల్లో అరిసెలు..గారెలు..చక్రాలు ..ఇలా వండినవన్నీ వేసిపెట్టి..పక్కనే ఓ పెద్ద పేపర్ల కట్ట పెట్టుకునేది. వచ్చినవాళ్లకల్లా ఆ పేపర్లల్లో అప్పచ్చులు పెట్టి ఇచ్చేది..సాయంత్రానికల్లా అవన్నీ ఖాళీ చేసి ఇంట్లో మాకని అట్టిపెట్టినవి కూడా అవచేసేది. మా అమ్మేమో వండేటప్పుడు అన్నెందుకంటావు..పెట్టేటప్పుడు మాత్రం చేతికి ఎముక లేకుండా పెడతావు అని నవ్వేసేది. మొత్తానికి అలా మా నాయనమ్మ అన్ని గంగాళాలు ఖాళీ చేసేది.
ఈ సంవత్సరం మాకు ఇప్పటికే రెండు సార్లు అరిసెలు వచ్చేసాయి..మూడోసారి రాబోతున్నాయి. అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా ఇప్పటివరకు ఏ లోటు లేకుండా నేను చేసే పని లేకుండా డబ్బాలు ఖాళీ అయ్యేటప్పటికి మరలా డబ్బాలు డబ్బాలు రకరకాల అప్పచ్చులు ఇంటినుండి వస్తుంటాయి. కారం ఏవో అప్పుడప్పుడు చేస్తాను కానీ తీపి వంటలకు మాత్రం నేను బహు దూరం. వేళ్లమీద లెక్క పెట్టవచ్చు నేను చేసే తీపి వంటకాలు. అయినా చేసిపెట్టే వాళ్లుండగా మనమెందుకు చేతులు కాల్చుకోవటం!
ఇవి మా ఇంటిముందు వేసిన ముగ్గులు
ఏంటో సంక్రాంతి అనగానే నాకు అలా దొర్లుకొచ్చేస్తాయ్ కబుర్లు.
సంక్రాంతి అందరి జీవితాలలో కాంతిని నింపాలని కోరుకుంటూ
6 వ్యాఖ్యలు:
పిండి కొట్టేవాళ్ళని ఎప్పుడో చిన్నప్పుడు చూసిన గురుతు! రోకళ్ళతోపిండి కొట్టే మిషన్లు వచ్చాక 'ఇక్కడ అరిసెలపిండి కొట్టబడును" అన్న బోర్డు దగ్గర బార్లు తీరిన తడి బియ్యం టిఫిన్లు చూడ్డమే!
చలిమిడి చేయాలన్నా ఇలా వాళ్ల దగ్గరికి వెళ్ళడమే!
అరిసెలు మా అమ్మ పల్చగా వత్తి అవి వేగా రెండు ఫ్లాట్ గరిటెల మధ్య పెట్టి నొక్కాక వాటిని మేము వంటింట్లో చాప వేసి దాని మీద న్యూసుపేపర్లు పరిచి ఆరబెట్టేవాళ్ళం!
నాకు ఇంకా రాలేదు అరిసెలు ఊర్నించి! చెయ్యడమా రాదాయె! ఓ నాలుగు ఇటు పంపించొచ్చుగా!
సుజాత గారు, మాకింకా రోకళ్ళ పిండేనండి. అది కూడా ఇంకెన్ని రోజులో సాగదులేండి..మెల్లగా వాళ్లు కూడా మిషన్లకి వెళ్ళక తప్పదు.
చూస్తుంటే తేలికగానే ఉంటుంది కాని ఆ గరిటెల మధ్య పెట్టి అరిసెలు నొక్కాలంటే చాలా బలం కావాలండోయ్! మా పిని నొక్కుద్ది..అరిసెల్లో ఒక్క బొట్టు నెయ్యి కూడా ఉండకుండా నొక్కుద్ది. కొంతమంది చెక్క మీద పెట్టికూడా నొక్కుతారు..అది తేలికగా ఉంటుంది నొక్కటానికి అంటారు మరి!
అరిసెలే కదా మీరేమన్నా ఉల్లిపాయలు అడిగారా...బంగారం అడిగారా! ఇటొచ్చేది ఉంటే ఓ మాట చెవినెయ్యండి..
బావున్నాయండీ మీ అరిసెల కబుర్లు .
అలా ఇంటి నుండీ వస్తే భలే సుఖం పాపం మా అమ్మ కూడా అలాగే పంపిస్తుంది.వద్దన్నా వినదు.
అరిసెలు చెక్కల మీద నొక్కడం తేలిక. చిన్నప్పుడు ఆ పని అచ్చంగా నాదే
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
బాగున్నాయండీ కబుర్లు, చిన్నప్పుడు అమ్మ పిన్ని కలిసి అరిసెలు చేస్తుంటే వాటిని చెక్కమీద వత్తే డ్యూటీ నాక్కూడా అప్పచెప్పేవారు :)
మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు :-)
"అయినా చేసిపెట్టే వాళ్లుండగా మనమెందుకు చేతులు కాల్చుకోవటం!" ...అవునండీ.. మా ఇంట్లో కూడా ఇదే మాట అంటారు, స్వీట్ షాపువైపు చూపిస్తూ :-) సంక్రాంతి శుభాకాంక్షలు..
Post a Comment