పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

July 8, 2008

మా ఊరు ఒక్కసారి పోయి రావాలి

ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఊరు సమీపిస్తుండగానే మనసు ఉరకలేస్తుంది. గుండె గొంతుకలోన కొట్టాడతాది. పుట్టిపెరిగిన ఊరు, ప్రతి వీధి నాదే అని తిరిగిన ఊరు. వారానికి వెళ్ళినా, నెలకివెళ్ళినా, సంవత్సరానికి వెళ్ళినా అదే అనుభూతి, అందరికీ ఇలానేఉంటుందేమో, nostalgia they name it

మాది గుంటూరు జిల్లాలో ఒక చిన్న సాదా సీదా పల్లెటూరు . ఊరంతా కలిపి నాలుగు వీధులు, ఏభై ఇళ్లు, అంతే మా ఊరు. ఒకప్పుడు ఓ చిన్న బడి, ఓ చిన్న గుడి, చిన్న చెరువు, పెద్ద భావి , మా ఇంటికి వెనక వీధి, అటు పక్క వీధి, ఇటుపక్క వీధి, వెరసి మా ఊరు. ఇప్పుడు --పాడుబడ్డ బడి, పాడయిపోయిన భావి, మాయమైపోయిన వెనక వీధి (ఇప్పుడు ఆ స్థలం ఓ చిన్నఅడవి ప్రాంతం) .చెరువు ఒక్కటే చెరువుగా అలా మిగిలి ఉంది, తన చుట్టూ జరిగే మార్పులిని గమనిస్తూ.

ఇక కొద్దో గొప్పో అభివృద్ధి జరిగింది గుడి విషయంలోనే (మారుతున్న
మనస్తత్వాలకి ప్రతీకగా!!). ఒకప్పుడు హనుమ జయంతి రోజుతప్పితే ఎవరూ పెద్దగా గుడికి వెళ్ళేవాళ్ళు కాదు. శ్రీరామనవమి జరిగినా ఊరి మధ్యలో పందిరి వేసి చేసేవాళ్ళు , అలాంటిది ఇప్పుడుప్రతి రోజు గుడిలో భజనలు, విష్ణుసహస్రనామం, హనుమాన్ చాలీసా , ఆకు పూజ అన్నీ జరిపించుకుంటున్నాడు దేవుడు, (రాయైతేనేమిరా దేవుడు హాయిగా ఉన్నాడు జీవుడు !).

గ్రామ దేవత గోగులమ్మ. గుడి అంటూ ఏమి ఉండదు, చెరువు గట్టున నడుం వరకు మాత్రమే ఉండే పడుకుని ఉండే అమ్మవారివిగ్రహం. ఎలాంటి అలంకారాలు ఉండవు. కాస్తంత పసుపు పూసి కుంకుమ పెడతారు. గురువారం, ఆదివారం పూజలు జరుగుతాయి. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి జరిగే పూజలు ఇప్పుడు ప్రతి ఆది, గురువారాలలో జరుగుతున్నాయి. చాలా సంవత్సరాల తరువాత ఈ మధ్య గోగులమ్మ దగ్గరికివెళితే పూజా విధానం కూడా మారిపోయింది. ఇదివరకు చాకలి చేత పొంగలి చేయించి విగ్రహం చుట్టూ మజ్జిగ పోస్తూ మూడు సార్లు తిరిగి వేపాకులతో పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేవాళ్ళు . చాకలి చేత చేయించిన పొంగలి అందరికి ఆకులలో పెట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పొంగలితో పాటు పులిహోర, దద్దోజనం , ఒకటేమిటి ఎన్నెన్ని రకాల పలహారాలో , వాటికి మళ్ళీ పేపరు పళ్ళాలు!నాగరికతా చిహ్నాలు!!!

మా బడి ఓ రెండు గదుల బడే కాని దాని వంక చూస్తుంటే
ఇది నేను చదువుకున్న బడి అని ఓ విధమైన గర్వంగా ఉంటుంది. తరువాతచదివిన కాలేజిలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ అలాంటి అనుభూతిని ఇవ్వవు. వరండాలో బాల్వాడి తరగతులు, ఒక గదిలో ఒకటి, రెండు, తరగతులు, ఇంకొక గదిలో మూడు, నాలుగు, అయిదు తరగతులు జరిగేవి. ఇద్దరేటీచర్సు. ఒకటి రెండు తరగతులకి పంతులమ్మ గారు వచ్చేవాళ్ళు. పంతులమ్మ గారినిఊర్లో పెద్దల దగ్గరనుండి పిన్నల దాకా అందరం పంతులమక్కాయి అనేవాళ్ళం. ఆమె మాబడిలో చాలా చాలా సంవత్సరాలు పనిచేసారు. ఆమె అసలు పేరు దేవకీదేవి కానీ ఆ పేరుఎక్కువ మందికి తెలియదు, అందరికి పంతులమ్మక్కాయే. ఊరిలో పిల్లలంతా ఆమె దగ్గరికి ప్రైవేటుకి వెళ్ళేవాళ్ళు. ఇంత డబ్బులు ఇవ్వండి అని ఎవరిని ఏనాడూ అడిగి తీసుకునేదికాదు. పాలో, పెరుగో, వడ్లో, బియ్యమో, కూరగాయలో ఎవరు ఏమిచ్చినా తీసుకునేది. సాయంత్రం పూట వంట చేసుకుంటూ చదువుచెప్పేది. ఈ మద్యే చాలా సంవత్సరాల తరువాత హైదరాబాదులో ఆమెని చూడటం ఎంత ఆనందం కలిగించిందో. ఈ వయస్సులోకూడా అందరిని ఆమె పేరు పేరునా గుర్తుచేసుకుంటుంటే వాహ్ అనిపించింది.

ఊరు ఎలా ఉన్నా
మనుషులు ఎలా మారినా అది మా ఊరే. ఊరు మారినా ఉనికి మారదు. ఇప్పటికీ ఊరెళితే అప్పటిఅనుభూతులు, నేస్తాలు, ఆ ఆప్యాయతలు అన్నీ గుర్తొచ్చి ఆ జ్ఞాపకాల బరువుతో వెనక్కి తిరిగొస్తుంటాను.

మా ఊరిలో ఏమీ లేకపోవచ్చు, గొప్ప గొప్ప విద్యావేత్తలు లేకపోవచ్చు, బడా బడా వ్యాపారవేత్తలు లేకపోవచ్చు, ఊసరవెల్లులలాంటి కుహనా రాజకీయనాయకులు లేకపోవచ్చు, నాగరికతాచిహ్నాలైన షాపింగు మాల్స్ లేకపోవచ్చు, మల్టీప్లెక్సులు లేకపోవచ్చు, అభివృద్ధికి అద్దంపట్టే కార్పోరేటు బళ్ళు లేకపోవచ్చు, ఇవేవి లేకపోయినా అది నేను పుట్టి పెరిగిన ఊరు, నా వాళ్ళు ఉన్న ఊరు, అందుకే నాకు మా ఊరే గొప్ప.

"మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి
పచ్చనీ పచ్చికపై మేను వాల్చాలి
పైరగాలి వచ్చి నన్ను పలకరించాలి "
అన్న పాలగుమ్మి గారి పాట విని పరవశించని మనసు ఉంటుందా!!

Read more...

June 14, 2008

దీపాలు ఆర్పెయ్యండి---ఇదెక్కడి గొడవండి బాబు

జూన్ 15, 2008 సమయం రాత్రి 7:29:57
మూడు, రెండు, ఒకటి.......ఇక ఒక గంట పాటు మీ ఇంట్లో దీపాలు ఆర్పెయ్యండి. ఆరుబయటో డాబా మీదో కూర్చుని మీ పిల్లా పాపలతో కబుర్లు చెప్పుకోండి.

ఈ మద్య ఎక్కడ చూసినా ఈ దీపాలు ఆర్పే గోలే, దానితో పాటు చక్కటి విశ్లేషణలు. దీనికి ఇంతటి ప్రాచుర్యాన్ని కల్పించిన కొత్తపాళీ గారికి అభినందనలు.

ఈ బత్తి బందులు,
ఈ విశ్లేషణలు, ఒక రోజుకో, ఒక గంటకో పరిమితం కాకూడదు. మనది గుంపు మనస్తత్వం. ఏదో ఎదుటి వాళ్ళు చెప్పారనో, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దామనో ఆ ఒక్క రోజుకి దీపాలు ఆర్పే వాళ్ళే ఎక్కువ. ఒక గంట పాటు దీపాలు ఆర్పటం మూలాన సమస్య పరిష్కారం అయిపోదు. ముందు కావల్సింది ప్రజలలో ఈ సమస్య గురించిన అవగాహన, అది లేని నాడు ఎన్ని బత్తి బందులు చేసినా ఉపయోగం శూన్యం. జూన్ 15 తరువాత ఎంతమంది ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారు అన్నది కోటి రూపాయల ప్రశ్న. ఈ global warming (భూతాపం) మూలాన ఇప్పటికిప్పుడు మనకు వచ్చిపడే నష్టం ఏమి లేదు, వందల ఏళ్ళ తరువాత కాని దాని ప్రభావం కనపడదు, కానీ అది తగ్గించాలంటే ఇప్పటినుండే ప్రయత్నాలు చేయాలి కదా అని మన వాళ్ళ భావన. ఆశయం మంచిదే కాని అది ఎంతవరకు ఫలితాల్ని ఇస్తుందో వేచి చూడాలి. అసలంటూ ముందు అడుగు పడితే కదా పరుగు మొదలయ్యేది.

హైదరాబాద్ వాతావరణం ఈ అయిదారు సంవత్సరాలలో ఎంత మారి పోయిందో , బయటకు అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. ఇది ఇలానే కొనసాగితే? మొన్న మే లో కూడా ఒకసారి హైదరాబాద్ అన్‌ప్లగ్ అంటూ ఒక కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య అతిథులు ఇలియానా, కారుణ్య,
శేఖర్ కమ్ముల, దినాజ్, పుల్లెల గోపిచంద్ లాంటి స్టార్స్. ఇలాంటి కార్యక్రమాలకి అలాంటి వాళ్ళు అవసరమా?? పైగా కార్యక్రమం జరిగింది శిల్పారామంలో. వాళ్ళు అక్కడికి రావటానికి ఎన్ని కార్లు వాడి ఉంటారు? అక్కడ ఏర్పాట్లకి ఎంత విద్యుత్తు వృథా చేసి ఉంటారు? పైగా కారుణ్య లైవ్ షో, దానికి ఎంత విద్యుత్తు ఖర్చు అయ్యి ఉంటుంది??ఇక హైదరాబాద్ జనాలు ఒక గంట అన్‌ప్లగ్ చేసి ఏంటి ఉపయోగం?? ?ఇలాంటి కార్యక్రమాలు మీడియాలో ప్రచారానికే కాని వాటివల్ల ఈసుమంత అయినా ఉపయోగం ఉంటుందా?

అసలే ఇక్కడ రోజుకి గంటనుండి ఏడు గంటల వరకు కరెంటు కోత అది చాలక ఇంకా ఈ దీపాలు ఆర్పటం కూడానా అనే వాళ్ళు కూడా ఉన్నారు. దీపాలు ఆర్పటం ఒక్కటే కాదు, మనకు వీలైనంతలో, మనకు చాతనయన రీతిలో పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టాలి, అది మన జీవితంలో ఒక అంతర్భాగంగా ఉండాలి
. నిజానికి ఇది ఒక inter linked process, ఏదో ఒక రోజు ఒక గంట దీపాలు ఆర్పినంత మాత్రాన తీరే సమస్య కాదు. ముందు మన ఇంటి నుండే మనం సంస్కరణలు మొదలుపెట్టాలి. సంస్కరణలంటే మనమేం బరువులు మొయ్యక్కరలేదు, త్యాగాలు చేసేయ్యక్కరలేదు, కొంచం అవగాహన, కాస్త జాగ్రత్త ఉంటే చాలు. కొన్ని నీటి బిందువులు చేరి సముద్రం అయినట్లు మనం తీసుకునే కొన్ని చిన్ని చిన్ని జాగ్రత్తలే మనకు మన పుడమి తల్లికి శ్రీరామ రక్ష. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే నాలుగు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లే.

గ్రామాలలో కన్నా పట్టణాలలో, చదువు రాని వారి కన్నా చదువుకున్న వాళ్ళతోనే భూమాతకి ఎక్కువ సమస్యలు. ఈ భూతాపానికి మూల కారణం సంపన్న దేశాలు. ప్రాశ్చాత్య సంస్కృతిని సాంప్రదాయాలని అనుకరించటం మొదలుపెట్టి తెలిసి తెలిసి మనమే మన పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం. ప్లాస్టిక్ అన్నది మన జీవితాలలో ఒక భాగం అయిపోయింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకమే. అదివరకు కొట్టు నుండి సరుకులు తెచ్చుకుంటే కాగితం సంచుల్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నిటికి ప్లాస్టిక్ సంచులే. పల్లెటూళ్ళలో కూడా వీటి వాడకం ఎక్కువయి పోయింది. ఊరు వెళితే ఊరి పొలిమేర్లలో ఇప్పుడు మనకు కనిపించేది పచ్చటి చెట్లు కాదు, నలుపు తెలుపు రంగుల ప్లాస్టిక్కు కవర్లు (మున్సిపాలిటీ వాళ్ళు ఊరి బయట పోసే చెత్తలో సింహభాగం ఈ ప్లాస్టిక్ కవర్‌లే). ఇంకొకటి ప్రతి దానికి డిస్పోజబుల్ వస్తువులు వాడటం. ఆరోగ్య రక్షణకు అవసరమయిన సిరంజిల దగ్గరనుండి తినే స్పూన్ల వరకు అన్ని డిస్పోజబుల్ . వెనకటి రోజులలో వంటకు మట్టి పాత్రలు, వడ్డించటానికి ఆకులు, తినటానికి చేతులు వాడేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి ఎవరైనా నలుగురు అతిథులు వచ్చారంటే డిస్పోజబుల్ ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసులు, డిస్పోజబుల్ స్పూన్లు, ఒక్కటేంటి సమస్తం డిస్పోజబులే, అతిధులు వెళ్ళాక మన చేతికి పని లేకుండా అన్ని చెత్తబుట్టలోకి నెట్టివేయడమే. పిల్లలకి స్కూల్‌కి లంచ్ బాక్సుల్లో ఆహార పదార్థాలు అల్యూమినియం ఫాయిల్లో చుట్టి పెట్టటం ఇప్పుడు ఒక ఫాషన్ అయిపోయింది. అదేమంటే శుభ్రత. శుభ్రత పేరుతో మనకి మనం ఎంత హాని చేసుకుంటున్నామో మనకి అర్థం కావటం లేదు. అది వరకు మాకు ఇంటినుండి ఉప్పులు, పప్పులు గుడ్డ సంచుల్లో పోసి పంపేవాళ్ళు, నేను ఆ సంచుల్ని జాగ్రత్త చేసి మరలా వెనక్కి పంపేదాన్ని. ఇప్పుడు అమెరికా నుండి దిగుమతి అయిన జిప్‌లాక్ కవర్లు వాడటం మొదలుపెట్టారు. అదేమంటే వాళ్ళు పంపుతున్నారు మేము వాడుతున్నాం అంటున్నారు.

ఇక అమెరికా నుండి మనం దిగుమతి చేసుకున్న ఇంకొక వస్తువు ఉంది---డిస్పోజబు‌ల్ డైపర్స్.
డైపర్స్ అక్కడి వాళ్ళకి అవసరం అయితే ఇక్కడి వాళ్ళకి అదొక ఫాషన్ సింబల్ అయింది. పర్యావరణానికి హాని అటుంచి మన వేడి వాతావరణంలో పిల్లలికి వాటి వల్ల ఎంత అసౌకర్యంగా ఉంటుందో చెప్పలేం. వెనకటి రోజులలో తాతయ్య నాయనమ్మల మెత్తటి పంచలు చింపి లంగోటాల్లా కుడితే పిల్లలకి ఎంత సౌకర్యంగా ఉండేదో.

ఇక కంప్యూటర్లు, కార్లు, ఎ.సిలు, ఫ్రిజ్‌లు, టి.విలు, సెల్ ఫోన్ల వాడకం గురించి చెప్పక్కరలేదు. ఇవన్ని వాడకుండా ఉండటం అసాధ్యమే కాని వీలయినంత వరకు తగ్గించుకుందాం (నేనీ మధ్య బ్లాగులు చాలా తక్కువగా రాస్తుంది ఇందుకేనండోయ్ ).


ఇందుమూలంగా ఇక్కడ వీవెన్ గారికి ఓ విన్నపం --నెలకి ఒక శనివారం, ఒక ఆదివారం కూడలి తలుపులు మూసి వేయండి. ఈ మధ్య కూడలి కబుర్ల గదులు ఎక్కువయి పోయాయి :)).

ఈ విషయం మీద ప్రతి ఒక్కరు ఇంకొకరికి అవగాహన కలిగించండి.

-జై హింద్-

Read more...

June 11, 2008

మన భరతం పట్టే భాగ్యనగరం ఆటోలు

డిజిటల్ అయిననేమిలే---
హైదరాబాదులో ఆటో చార్జీలు మళ్ళీ పెరిగాయి. ఇది అధికారిక పెరుగుదల. అనధికారంగా పెట్రోలు రేట్లు పెరిగిన ప్రతిసారి వీళ్ళు చార్జీలు పెంచేస్తూనే ఉంటారు. అదేమంటే పెట్రోలు రేటు పెరిగింది కదా అంటారు. ఆటో మినిమం చార్జి ఇప్పటివరకు 10 రూపాయలు, కానీ ఆ పది రూపాయలకి మనం ఎక్కడికీ వెళ్ళలేము. ఒక కిలోమీటరు, రెండు కిలోమీటర్ల దూరానికి కూడా కనీసం ముప్పై నలభై చెల్లించుకోవాల్సిందే. 5 కి.మీ లోపు అసలు మీటరే వేయరు. దూరం ఎక్కువ అయినా ఒక్కోసారి మీటరు మీద రామంటారు, అదేమంటే ట్రాఫిక్కు టైము కదా టైము ఎక్కువ పట్టుద్ది అంటారు.

డిజిటల్ మీటర్లు ప్రవేశపెట్టటానికి వీళ్ళు ఎంత అడ్డు చెప్పారో అందరికి తెలిసిన విషయమే--అందుకు ముఖ్య కారణం వాటిని టాంపరింగ్ చేయటం కుదరదని (నిజమేనని నమ్మిన మనం పిచ్చివాళ్ళం), కానీ వాటిని కూడా ఎంత చక్కగా టాంపరింగ్ చేయవచ్చో మన హైదరాబాదు ఆటో వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు.

గత 20 రోజులలో రెండుసార్లు ఆటో వాళ్ళ దోపిడీకి ప్రత్యక్షంగా బలయ్యాను. ఒకసారి అమీరుపేట నుండి హిమాయత్‌నగర్ వెళ్ళటానికి 43 రూపాయలు అయ్యింది, అదే దూరం తిరిగి వచ్చేటప్పుడు 56 రూపాయలు అయ్యింది, మళ్ళీ రెండూ డిజిటల్ మీటర్లే, దీని భావమేమి తిరుమలేశా!!!

వారం క్రితం సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో దిగి ఇంటికి రావటానికి ఆటో దగ్గరికి వెళితే ప్రతి వాడు- పెట్రోలు చార్జిలు పెరిగాయి, మీటరు మీద రాము, కూకట్‌పల్లి అంటే 150 అవుద్ది అనే వాళ్ళే, ఇక రెండో మాట లేదు. చివరికి ఒకతను మీటరు మీద 10 ఇస్తే వస్తానన్నాడు. మీటరు 89 అయ్యింది--ఈ మద్య కాలంలో నేను చూసిన కాస్త ఖచ్చితమైన ఆటో ఇదేనేమో. అంతకు ముందు పదిహేను రోజుల క్రితం ఊరు వెళ్ళేటప్పుడు ఇదే దూరానికి 140 రూపాయలు అయ్యింది--ఇక్కడ కూడ రెండూ డిజిటల్ మీటర్లే. నిజానికి వచ్చేటప్పుడు బోయగూడలో దిగి వచ్చాం కాబట్టి కొంచం దూరం కూడా ఎక్కువే. దూరం పెరిగిన చార్జీలు తగ్గునన్నమాట :) (విలోమానుపాతం).

ఒకసారి రాత్రి పూట 8-9 గంటల మధ్య ఆటో ఎక్కాం, మధ్యలో పెట్రోలు కోసం అని నడి రోడ్డు మీద ఆటో ఆపి తీరిగ్గా నడుచుకుంటూ వెళ్లి పెట్రోలు తెచ్చి పోసుకుని పది తరువాత ఇంటికి చేర్చి ఒకటిన్నర రెట్లు డబ్బులు గుంజాలని చూసాడు. మేము ఇవ్వలేదనుకోండి. హైదరాబాదుకి కొత్తవాళ్ళు, నోట్లో నాలుక లేని వాళ్ళయితే చచ్చినట్లు వాళ్ళడిగినంత సమర్పించుకోవలసిందే.

హైదరాబాదులో ట్రాఫిక్కు సమస్యకి సగం కారణం ఈ ఆటోల వాళ్ళే. ఒక్కొక సారి రోడ్డు దాటాలంటే ఈ ఆటోలను చూసి ఎంత భయంవేస్తుందో. రోడ్డు దాటదాం అనుకుంటుండగా రయ్యిమని వచ్చి ఆటోని దాదాపు మన కాళ్ళ మీదకి ఎక్కించినట్లే ఆపేసి ఆటో కావాలా, బోయినపల్లి, ESI అంటూ అరుస్తూ ఉంటారు.

ఇలాంటివి అనుభవం అయినప్పుడు ఛ్ఛ అసలు ఈ ఆటోలు ఎక్కకూడదు అనుకుంటా, కానీ తప్పదు, ఏం చేస్తాం.

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP