మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఊరు సమీపిస్తుండగానే మనసు ఉరకలేస్తుంది. గుండె గొంతుకలోన కొట్టాడతాది. పుట్టిపెరిగిన ఊరు, ప్రతి వీధి నాదే అని తిరిగిన ఊరు. వారానికి వెళ్ళినా, నెలకివెళ్ళినా, సంవత్సరానికి వెళ్ళినా అదే అనుభూతి, అందరికీ ఇలానేఉంటుందేమో, nostalgia they name it
మాది గుంటూరు జిల్లాలో ఒక చిన్న సాదా సీదా పల్లెటూరు . ఊరంతా కలిపి ఓ నాలుగు వీధులు, ఓ ఏభై ఇళ్లు, అంతే మా ఊరు. ఒకప్పుడు ఓ చిన్న బడి, ఓ చిన్న గుడి, ఓ చిన్న చెరువు, ఓ పెద్ద భావి , మా ఇంటికి వెనక ఓ వీధి, అటు పక్క ఓ వీధి, ఇటుపక్క ఓ వీధి, వెరసి మా ఊరు. ఇప్పుడు --పాడుబడ్డ బడి, పాడయిపోయిన భావి, మాయమైపోయిన వెనక వీధి (ఇప్పుడు ఆ స్థలం ఓ చిన్నఅడవి ప్రాంతం) .చెరువు ఒక్కటే చెరువుగా అలా మిగిలి ఉంది, తన చుట్టూ జరిగే మార్పులిని గమనిస్తూ.
ఇక కొద్దో గొప్పో అభివృద్ధి జరిగింది గుడి విషయంలోనే (మారుతున్న మనస్తత్వాలకి ప్రతీకగా!!). ఒకప్పుడు హనుమ జయంతి రోజుతప్పితే ఎవరూ పెద్దగా గుడికి వెళ్ళేవాళ్ళు కాదు. శ్రీరామనవమి జరిగినా ఊరి మధ్యలో పందిరి వేసి చేసేవాళ్ళు , అలాంటిది ఇప్పుడుప్రతి రోజు గుడిలో భజనలు, విష్ణుసహస్రనామం, హనుమాన్ చాలీసా , ఆకు పూజ అన్నీ జరిపించుకుంటున్నాడు దేవుడు, (రాయైతేనేమిరా దేవుడు హాయిగా ఉన్నాడు జీవుడు !).
గ్రామ దేవత గోగులమ్మ. గుడి అంటూ ఏమి ఉండదు, చెరువు గట్టున నడుం వరకు మాత్రమే ఉండే పడుకుని ఉండే అమ్మవారివిగ్రహం. ఎలాంటి అలంకారాలు ఉండవు. కాస్తంత పసుపు పూసి కుంకుమ పెడతారు. గురువారం, ఆదివారం పూజలు జరుగుతాయి. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి జరిగే పూజలు ఇప్పుడు ప్రతి ఆది, గురువారాలలో జరుగుతున్నాయి. చాలా సంవత్సరాల తరువాత ఈ మధ్య గోగులమ్మ దగ్గరికివెళితే పూజా విధానం కూడా మారిపోయింది. ఇదివరకు చాకలి చేత పొంగలి చేయించి విగ్రహం చుట్టూ మజ్జిగ పోస్తూ మూడు సార్లు తిరిగి వేపాకులతో పూజ చేసి ఓ కొబ్బరికాయ కొట్టేసి వచ్చేవాళ్ళు . చాకలి చేత చేయించిన పొంగలి అందరికి ఆకులలో పెట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పొంగలితో పాటు పులిహోర, దద్దోజనం , ఒకటేమిటి ఎన్నెన్ని రకాల పలహారాలో , వాటికి మళ్ళీ పేపరు పళ్ళాలు!నాగరికతా చిహ్నాలు!!!
మా బడి ఓ రెండు గదుల బడే కాని దాని వంక చూస్తుంటే ఇది నేను చదువుకున్న బడి అని ఓ విధమైన గర్వంగా ఉంటుంది. తరువాతచదివిన కాలేజిలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ అలాంటి అనుభూతిని ఇవ్వవు. వరండాలో బాల్వాడి తరగతులు, ఒక గదిలో ఒకటి, రెండు, తరగతులు, ఇంకొక గదిలో మూడు, నాలుగు, అయిదు తరగతులు జరిగేవి. ఇద్దరేటీచర్సు. ఒకటి రెండు తరగతులకి పంతులమ్మ గారు వచ్చేవాళ్ళు. పంతులమ్మ గారినిఊర్లో పెద్దల దగ్గరనుండి పిన్నల దాకా అందరం పంతులమక్కాయి అనేవాళ్ళం. ఆమె మాబడిలో చాలా చాలా సంవత్సరాలు పనిచేసారు. ఆమె అసలు పేరు దేవకీదేవి కానీ ఆ పేరుఎక్కువ మందికి తెలియదు, అందరికి పంతులమ్మక్కాయే. ఊరిలో పిల్లలంతా ఆమె దగ్గరికి ప్రైవేటుకి వెళ్ళేవాళ్ళు. ఇంత డబ్బులు ఇవ్వండి అని ఎవరిని ఏనాడూ అడిగి తీసుకునేదికాదు. పాలో, పెరుగో, వడ్లో, బియ్యమో, కూరగాయలో ఎవరు ఏమిచ్చినా తీసుకునేది. సాయంత్రం పూట వంట చేసుకుంటూ చదువుచెప్పేది. ఈ మద్యే చాలా సంవత్సరాల తరువాత హైదరాబాదులో ఆమెని చూడటం ఎంత ఆనందం కలిగించిందో. ఈ వయస్సులోకూడా అందరిని ఆమె పేరు పేరునా గుర్తుచేసుకుంటుంటే వాహ్ అనిపించింది.
ఊరు ఎలా ఉన్నా మనుషులు ఎలా మారినా అది మా ఊరే. ఊరు మారినా ఉనికి మారదు. ఇప్పటికీ ఊరెళితే అప్పటిఅనుభూతులు, నేస్తాలు, ఆ ఆప్యాయతలు అన్నీ గుర్తొచ్చి ఆ జ్ఞాపకాల బరువుతో వెనక్కి తిరిగొస్తుంటాను.
మా ఊరిలో ఏమీ లేకపోవచ్చు, గొప్ప గొప్ప విద్యావేత్తలు లేకపోవచ్చు, బడా బడా వ్యాపారవేత్తలు లేకపోవచ్చు, ఊసరవెల్లులలాంటి కుహనా రాజకీయనాయకులు లేకపోవచ్చు, నాగరికతాచిహ్నాలైన షాపింగు మాల్స్ లేకపోవచ్చు, మల్టీప్లెక్సులు లేకపోవచ్చు, అభివృద్ధికి అద్దంపట్టే కార్పోరేటు బళ్ళు లేకపోవచ్చు, ఇవేవి లేకపోయినా అది నేను పుట్టి పెరిగిన ఊరు, నా వాళ్ళు ఉన్న ఊరు, అందుకే నాకు మా ఊరే గొప్ప.
"మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి
పచ్చనీ పచ్చికపై మేను వాల్చాలి
పైరగాలి వచ్చి నన్ను పలకరించాలి "
అన్న పాలగుమ్మి గారి పాట విని పరవశించని మనసు ఉంటుందా!!
43 వ్యాఖ్యలు:
"ఊరు ఎలా ఉన్నా మనుషులు ఎలా మారినా అది మా ఊరే." .... ఆ అనుభూతికి సాటి ఏమీ ఉండదేమో ... అదే మన పల్లెల మహిమేనేమో కదా ...
చక్కని ప్రారంభానికి, nostalgic అనిపించేలా చేసిన వర్ణనకు ఓ అందమైన ముగింపు ఇచ్చారు ఓ మంచి పాటతో...
అభ్యంతరం లేకపోతే ఊరి పేరు చెప్పగలరా ?
ఇంతకూ అది మీ స్కూల్ ఫొటోయేనా?
ఎప్పటినుంచో అడుగుదామనుకుంటున్నా ఇది ... మీ బ్లాగ్ పేరు (vareesh) అర్ధం ఏమిటి? Is it some sort of an Acronym or name?
ఏమిటో ఈ రోజు మీ బ్లాగ్ చూస్తుంటే అన్నీ ప్రశ్నలే !! :-(
ఒకసారి మళ్లీ నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి తీసుకెళ్ళి పడేసారు...ఊరంతా మరీ యాభై గడప కాదనుకోండి...కానీ మేముండే అగ్రహారం మటుకు సుమారు యాభై గడపలే...:)
beautiful.
Unfortunately, I don't feel this attachment to my home town which has changed beyond recognition.
However, I feel exhilarated just to set foot on Indian soil and breath its air.
బావుందండీ మీ ఊరు. ఫోటో లు చూస్తుంటే నాకు కూడా మీ ఊరంతా తిరిగి చూస్తున్న అనుభూతి కలిగింది. పాట చాలా బావుంది.
ఎన్నొ విషయాలను గుర్తు చెసారు .....
బావుందండీ మీ ఊరు. పాట చాలా బావుంది. your blog template is very nice.
Kolluri Soma Sankar
www.kollurisomasankar.wordpress.com
ఆ పాట ప్రతి ఒక్కరూ పాడుకుంటారేమో కదా వరూధిని గారూ వాళ్ల ఊరికి వెళ్ళినపుడు! మీ వూరి గురించి చదువుతుంటే మా వూరు గుర్తొచ్చింది. అదేగా ఈ టపా గమ్యం అనిపించింది నాకు! ఏళ్ల తరబడి వేరే వూళ్ళలో ఉండటం 'అలవాటు ' అయింది కానీ, ఇష్టం కాదు!
మా పెరటి(మా వూర్లో) బాదం చెట్టు నీడలో నవారు మంచం మీద పడుకుంటే నిద్ర పట్టినట్టు ఇంకెక్కడా, ఇక్కడ ఈ హైదరాబాదు లో కూడా పట్టదు నాకు! అసలు ఆ వూరి గాలి తగలగానే మనసంతా తడి తడిగా మారుతుంది. ఆకలేస్తుంది, అనవసరంగా మొహాన నవ్వు పూస్తుంది, పరిగెత్తాలనిపిస్తుంది. ప్రతి ఆర్నెల్లకోసారి వెళ్ళినా సరే!
ఊరు మారినా ఉనికి మారదు. కరెక్టుగా చెప్పారు.
చాలా బాగుంది. శీర్షిక చదవగానే మైండులో ఆపాట హమ్మింగ్ మొదలయిపోయింది. ఆపాట నడుస్తోండగా టపా చదవడం వల్ల మాఊరే వెళ్ళొచ్చినట్లయింది. ఉద్యోగికి స్వంత ఊరు, పరదేశం ఉండవు కదా. చిన్నప్పటినుంచీ వలసలు అలవాటైపోయి, ఏఊరెళ్ళినా టైం బాంబు జేబులో పెట్టుకుని వెళ్ళడం అలవాటైపోయింది. దాంతో ఏఊరిమీదా మమకారం పెంచుకోకపోవడం ఒక అలవాటై పోయింది. అయినా ఎక్కడో అంతరాంతరాల్లో చిన్న కదలికలు- స్వంతఊరు పేరు వింటే.
వరూధినిగారు,
నిజంగా చిన్నప్పడు మనం పెరిగిన ఇల్లు, స్కూలు,వీధులు అన్నీ ఎంతో మధురమైన జ్ఞాపకాలు. జీవన సమరంలో అప్పుడప్పుడు వాటిని గుర్తుకుతెచ్చుకొవడం ఎంతో తృప్తిగా ఉంటుంది.
తెలుగు’వాడి’ ని గారు,,
మీ ప్రశ్నలలో ఒక్కదానికి నేను సమాధానం చెప్పగలను.వరూధిని గారు ఏమనుకోవద్దే మీ తరఫున చెప్తున్నందుకు..
vareesh = varudhini + shireesh ( var + eesh )
భార్యలో మొదటి సగం, భర్తలో చివరి సగం కలిపి ఆ పేరు పెట్టుకున్నారు. భలే చమత్కారులు కదా ఇద్దరూ.. :)
జ్యోతి గారూ, ఆ పేరులో మీరు చెప్పిన రెండు భాగాలున్నాయిగానీ..,
గమనించారో లేదో -ఆ పేర్లు రెండూ నావే!:)
@తెలుగు'వాడి'ని గారు,ధన్యవాదాలు.
అన్నీ ప్రశ్నలే అవటం మూలానేమో మీ మామూలు ధోరణికి భిన్నంగా వాక్యాలు చిన్నగా ఉన్నాయి:).
1.మా ఊరి పేరు-ఈతేరు.
2.అది మా స్కూల్ ఫోటోయే.
3.ఇక నా బ్లాగు పేరు గురించి జ్యోతి గారు చెప్పారు కదా!!
@వంశీ గారు,
అగ్రహారాలు ఎక్కువగా అంతే ఉండేయనుకుంటాను.
@కొత్తపాళీ గారు, అవును కదా, that's the nostalgia.
@వేణూశ్రీకాంత్ గారు, మొత్తానికి మా ఊరు చూసేసారన్నమాట.
@శంకరరెడ్డి గారు, మీరు బ్లాగు అయితే మొదలుపెట్టారు కాని ఇంకా ఏమి రాసినట్లు లేరు, మీకు గుర్తొచ్చిన విషయాలని రాయండి.
@సోమశంకర్ గారు, ధన్యవాదాలు.
@సుజాత గారు,"అనవసరంగా మొహాన నవ్వు పూస్తుంది", మీరు భలే వారే,అనవసరం కాదండి,ఈ రోజులలో కావలిసిందే అది,అందుకే ఎప్పుడు మన ఊరిని తలుచుకుంటూ ఉందాము :))
@సత్యసాయి గారు, బహుకాల దర్శనం. ఎలాఉంది ముంబాయి. బ్లాగులోకం మీద సీత కన్ను వేసినట్లున్నారు!
అన్నట్లు మీకు ఈ పాట సాహిత్యం మొత్తం తెలుసా? తెలిస్తే మీకు తీరిక ఉన్నప్పుడు పంపగలరా?
@జ్యొతి గారు, "భలే చమత్కారులు కదా ఇద్దరూ.. " అబ్బే కాదండి.
అందమయిన టపా...
చక్కని జ్ఞాపకాలు తీసుకొచ్చింది వెంట.
aది సీత కన్నా? శీత కన్నా?
chinnappuDu school ki Salavulivvagaanae maa ammamma gari ooreLtumTae daari poDugunaa naa mohaana alagae anavasaramgaa, ApukOlaekumDA navvulu poostumDaevi. chuTToo evarannA choosate picchidanukumTArani bhayam.. talchukumTaenoo, ee Tapaa chadootumTaenoo ippuDoo adae navvu.. Thanks for reminding those golden days!
@ చదువరి:
అన్యాయమండీ, vareesh గురించి జ్యోతక్క చెప్పిందే కరెక్టు, మీ కలం పేరులో వరి ఉన్నా సరే.
బ్లాగ్పేరు సంగతి అటుంచితే, మూస, కూర్పు, రంగుల ఎంపిక ( వెరసి లే ఔట్) బావున్నాయి. [చదువరి గారి ప్రమేయం ఉన్నాట్టు లేదు :) ]
మీ ఊరి సంగతులు బావున్నాయి. ఎక్కడండి ఈ ఈతేరు.
వరూధిని గారు,
అనవసరంగా కాదు, 'మనకు తెలీకుండానే ' అనడానికి సరైన పదం దొరక్క అలా వాడేసానన్నమాట.
బాగుంది.. ఈ టపాతో మీ ఊరంతా చుట్టేసి వచ్చా!! ఫోటోలు పెట్టడం భలే ఉంది.
చాలా బాగుంది. ఊరంటే బడీ, గుడే ముందుగా గుర్తొస్తాయి. కృష్ణాతీరంలోని కొబ్బరి చెట్లతో అలరారే ఏ ఊరిని చూసినా అదో చక్కని అనుభూతి. పెరిసేపల్లి అని ఓ ఊరుంది కృష్ణా జిల్లాలో. ఊరు, ఊరి మధ్యన ఓ చెరువు, పక్కనే ఓ అందమయిన దేవాలయం, పక్కనే పెద్ద చెట్టు క్రింద అరుగు, ఆ పక్కనే ఆ పల్లెటూళ్ళోకి వచ్చే ప్రతీ వారినీ పరిశీలించటానికే అన్నట్లు ఓ బస్టాండు. కత్తితో కొయ్యగలిగేంత కమ్మని గడ్డపెరుగు... ఇన్నీ చెప్పాక తాటి ముంజలు, నాకు మరింత ఇష్టమయిన ఈతపళ్ళు .... అబ్బో..... అన్నీ గుర్తుకు తెచ్చేసారు. ధన్యవాదాలు.
caalaa baagaa raasaaru.nannu imTi daggara vadili vachchaayi mii aksharaalu
@ప్రవీణ్, thank you.
@ఒరెమూనా, అది శీతకన్నే,అప్పుతచ్చు. అయినా మన పత్రికలలో రెండూ వాడుతుంటారులేండి.
ప్చ్..పొద్దు గడిలోకి మా బ్లాగు పేర్లు ఎప్పుడెక్కుతాయో:)
@teresa, నా బ్లాగులో మీ కామెంటు మొదటిసారి అనుకుంటా! Thank you.
@త్రివిక్రం, మీరు చెప్పిందే నిజం:)
@ఊకదంపుడు గారు, చదువరి గారు నేర్పిన విద్యే ఇది. మా ఊరు బాపట్ల దగ్గర అండి.
@పూర్ణిమ,రాధిక, ధన్యవాదాలు.
@వికటకవి గారు, ఈతపళ్ళు మీకు కూడా ఇష్టమా! మాగేసిన ఈతపళ్ళు దొంగతనంగా తినడం ఎంత బాగుంటుందో!!
ఫోటోలతో సహా చాలా చక్కగా మీ ఊరిని చూపించారు వరూధిని గారూ. మాగేసిన ఈతపళ్ళు గుర్తు చేసి నా హృదయాన్ని ఎంత క్షోభ పెట్టేసారో :)) రోజూ పొద్దున్నే లేచి కుండ తీసి మాగిన పళ్ళ కోసం వెతుక్కోవటం భలే ఉండేది..
నా ప్రశ్నలకు సమాధానం చెప్పినందులకు ముందుగా జ్యోతి, సిరిసిరిమువ్వ గార్లకు ఇవే నా ధన్యవాదములు.
సిరిసిరిమువ్వ గారు : రాముడు మంచి బాలుడు లాగా మీ బ్లాగులో నేనెప్పుడూ చిన్నవిగా, క్లుప్తంగా, సరళంగానే రాస్తుంటే నా వ్యాఖ్యలన్నీ, నన్ను ఎలాగూ అంత మాట అన్నారు కాబట్టి నేను
చి.క్లు.స వ్యాఖ్యభంగం చేసి అనుకున్నదంతా రాసేస్తున్నా ఇక్కడ. :-)
నా వరకు మీది 'ఆహ్లాదకర' విభాగానికి సంబంధించిన బ్లాగ్ అండీ ... అక్షరాల వెంట కనులు, పదాల భావంతో పాటు మనసు ఒకదానితో ఒకటి పోటీపడెలా చేసే ప్రయత్నంలో పాఠకులను అనుభూతుల సంద్రంలో తడిసిముద్దై పోయేలా, అనుభవాల ఇంద్రధనస్సులతో చూసిన లోకాన్ని మరోసారి చుట్టి వచ్చేలా, జీవిత మధురోహల జ్ఞాపకాలనే పాటలలో పల్లవికీ, ప్రతి చరణానికీ సరిగమలు పలికించేలా చేయగలిగినది. అందుకే ఒక్క ముక్కలో సింపుల్ గా బాగుంది అని చెప్పి మీ టపాకు చిన్నతనం ఆపాదించటమో లేక ఒక చిన్న/మామూలు విశేషణాన్ని కట్టబెట్టటమో చెయ్యలేక, నా (ప్రతి)స్పందనకు అక్షరరూపం ఇవ్వటానికి ఎక్కువ సమయం కావలసిరావటంతోనో మౌనంగా ఏమి చెప్పక వెనుదిరుగుటకు అర్ధం.
ఇంతకు ముందు ఈ రెండు పేర్లు నాకు తగిలినప్పుడు అంత పెద్ద processing జరగలేదు అందుకే లైటు వెలగలేదు :-( [ అసలు ఈ బ్రహ్మీ పాత్ర పోషణ దెబ్బకు ఉన్న కొంచెమే మాడిపోయి చానా కాలమే అయ్యిందనుకోండి ]
నాకు ఈ కావ్య/ప్రబంధ నాయికల పేర్లు అంటే చాలా ఇష్టం. ఈ పేర్లు చదువుతున్నా, విన్నా ... 'రాజసం' ఊహగానైనా కనుల ముందు ఛాయాసమీరంలా అలా కదిలి వెలుతున్నట్టే ఉంటుంది.
మీకు ఇంతటి చక్కని పేరు పెట్టినందుకు మీ తల్లిదండ్రులకు (పెద్దవారికి) [ కొంపదీసి మీరు మధ్యలో మార్చుకోలేదు కదా ] ప్రణామములు.
స్వగ్రామం అంటే ఎవరికైనా ఎన్నో బాల్య స్మృతులు, అప్పటి మధుర క్షణాలు గుర్తుకు వస్తాయి. అందరినీ ఒకసారి పాత జ్ఞాపకాల దొంతరలోకి విజయవంతంగా తీసుకెళ్లగలిగారు. మీ బ్లాగు టెంప్లేట్ బాగుంది. ముక్తలేఖ బ్లాగు నుంచి ప్రేరణ కలిగిందా? పొద్దు గడి లో తెలుగు బ్లాగుల పేర్లు వస్తున్నాయా? అలా వచ్చిన బ్లాగు పేర్లు గుర్తున్నవి తెలుపగలరు. మీ తండ్రి గారి ఛాయా చిత్రం (మీ నాన్న గారు అధ్యాపకులుగా ఉన్న P.B.N.College లో నేను విధ్యార్ధిని) నాకు పంపగలరా?
మంచి వ్యాసం, మాఊరు అందమైనది అనుకోని వారు ఉంటారా? అదీ పల్లెలగురించి అయితే వేరే చెప్పాల్సిన అవసరం లేనేలేదు. మా ఊరు జ్నాపకాల మంచి గందం. మాఊరు మరుమల్లెల సౌరభం, ఇంకా చాలా సౌరభాలు, వాసనలు, జ్నాపకాలు చాలా చాలా....
మరోసారి అభినందనలు.
@నిషిగంధ, అక్కడుండే మీకే కాదు ఇక్కడుండే మాకు కూడా ఇప్పుడు ఈత పళ్ళు దొరకటం లేదు :(
@తెలుగు'వాడి'ని గారు, నేనేదో తమాషాకి అన్నానండి, మరీ మునగ చెట్టు ఎక్కించేసారుగా!
నా పేరు మా నాన్న పెట్టిందే.
@సి.బి.రావు గారు, ఈ నెల పొద్దు గడిలో చావా గారి బ్లాగు పేరు వచ్చింది లేండి, అందుకని అలా అన్నాను.
మా తండ్రి గారి ఛాయా చిత్రం పంపిస్తాను.
@విశ్వనాథ్ గారు, ధన్యవాదాలు.
@ వరూధిని / సుజాత / సత్యసాయి
మీలో ఎవరైనా ఆ పాట గురించి ఇంకొంచెం చెప్పగలరా..ప్లీజ్...ఈ టపా చదివినప్పటి నుండి వెంటాడుతుంది కానీ వెతికితే దొరకడం లేదు. పాలగుమ్మి గారు అంటే మేఘసందేశం లో పాటలు వ్రాసిన పాలగుమ్మి పద్మరాజు గారే నా లేక ఈయన వేరా... మీరు చెప్పిన "మా ఊరు ఒక్క సారి..." పాట ఏదైనా సినిమా పాటా లేకా లలిత గీతమా. ఆల్బం / సినిమా పేరు లేదా పూర్తి సాహిత్యం ఇవ్వ గలిగితే ఇంకా సంతోషిస్తాను.
మీవూరు ఎంత మారినా మీకింకా మంచి జ్ఞాపకాలు పంచుతోందంటే మీ అదృష్టం.
నేనేంతో వువ్విళ్ళూరుతూ వూరు చేరితే నాకు మాత్రం చాలా మట్టుకు చేదు మాత్రలే మింగించింది మా వూరు. ప్చ్!
--ప్రసాద్
http://blog.charasala.com
@వేణూ శ్రీకాంత్:
"మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి
పచ్చనీ పచ్చికపై మేను వాల్చాలి
పైరగాలి వచ్చి నన్ను పలకరించాలి "
ఈ పాట రాసినవారు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం. H.M.V., Polydor వగైరా Labels లాగా నాద వినోదిని అనే లేబుల్ పై ఈ పాటలు వెలువడ్డాయి. ఈ పాటలు సంగీతం పాటలు అమ్మే దుకాణాలలో లభ్యం కావు. ఆసక్తి ఉన్నవారు పాలగుమ్మి విశ్వనాథం గారిని Phone No: 27633329 లో సంప్రదించవచ్చు.
@వరూధిని: మీ జవాబుకు ధన్యవాదాలు. ఛాయాచిత్రం కోసం ఎదురు చూస్తాను.
సిరిసిరిమువ్వగారి తాజాబ్లాగుటపా చూసాక పీవీనరసింహారావు అన్న ఢిల్లీకి రాజయినా తల్లికి బిడ్డే మాటగుర్తుకొచ్చింది.అలాగే పెళ్లయ్యి నాలుగుదశాబ్దాలయ్యాక,ఏమోయ్ మీ ఊరు పేరేమిటి అని నార్ల వెంకటేశ్వరరావు,తన భార్యను అడగటం,ఆ ప్రశ్నకు ఆవిడ చురుచురలాడటం ఆయన మాటల్లోనే చదివి సరదాగా నవ్వుకోవటం గుర్తుకొచ్చాయి.
అయితే యే చీరాలో,బాపట్లో వెళ్ళేటప్పుడు రోడ్డుపక్కనున్న ఈతేరును చూడటం తప్ప,అక్కడ ఆగిందీ,చూసిందీ లేదు నేను.కానీ ఈ టపా చదివాక ఈతేరు మరీ ఇంత చిన్న ఊరా అని అనుమానమొచ్చి వికీపీడియాను సంప్రదించా.తెవికీ ప్రకారం,ఆ గ్రామజనాభా3252 అని,వారిలో అక్షరాస్యులు 1930 అని,గ్రామ జనాభాలో అధిక భాగం హరిజనులు అని ఉంది.ఈజనసంఖ్య ప్రకారం ఉత్తరాంధ్ర లో ఆయితే మేజరు పంచాయితీ అయ్యుండేది.అలాగే పొన్నూరు నుండి 12 కిలోమీటర్లు, బాపట్ల నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది అని కూడా తెవికీ చెప్తోంది.ఈలెక్కప్రకారం పొన్నూరుకు,బాపట్లకు మధ్యనున్న దూరం 24 కిలోమీటర్లు అవుతుంది.కానీ అదే తెవికీ పొన్నూరుకు బాపట్ల పట్టణం 19 కి మీ ల దూరంలో ఉన్నది అని అంటుంది ఇదే వాస్తవ దూరం.
అలాగే తెవికీ గ్రామ ప్రముఖులు విభాగములో ప్రముఖ దళిత నాయకుడు, రచయిత, కత్తి పద్మారావు పేరు ఒక్కటే పేర్కొంది.కానీ ఈతేరులో చెంచురామయ్య గారనే ప్రముఖుడు పొన్నూరు పాములపాటి బుచ్చినాయుడు కళాశాలలో కొన్ని దశాబ్దాలపాటు ఫిజిక్స్ అధ్యాపకుడిగా పనిచేశారు.ఆయన పేరూ జోడించటం సమంజసం.ఇప్పటికే ఎంతో ఉన్నతాశయాలతో ఉద్భవించిన వికీపీడియాను ప్రామాణికత లేదనీ,సమగ్రం కాదనీ చాలామంది పండితులు ఈసడిస్తున్నారు.కాబట్టి తెవికీ కార్యకర్తలు ఈ విషయములో కాస్త శ్రద్ధ వహించాలని మనవి.ఇంకొక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఒక ప్రసిద్ధ బ్లాగరూ,వికీపీడియన్ ఈ ఈతెరు గ్రామానికి అల్లుడు.ఆయనెవరో చదువరులే కనిపెట్టాలి:).
నేనేంతో వువ్విళ్ళూరుతూ వూరు చేరితే నాకు మాత్రం చాలా మట్టుకు చేదు మాత్రలే మింగించింది మా వూరు. ప్చ్! అన్న చరసాల ప్రసాద్ గారి వ్యాఖ్య మనసులో కలుక్కుమనిపించింది.అదేదో మాఊరును ఆయన తిట్టినంత ఇదిగా ఫీలయ్యాను.కానీ తర్వాత అర్ధం చేసుకోగలిగాను.కొన్ని సార్లు అంతే.ఎన్నో ఆశలతో ఊరు చేరిన మనకు అలాంటి సంఘటనలు తప్పవు.నేను ఇటీవల నా విశాఖతీరాన బ్లాగులో మొదలుపెట్టిన నాయాత్రా విశేషములు..అన్న టపాను పూర్తి చెయ్యకపోవటానికీ ఈ అంతఃసంఘర్షణ కూడా ఒక కారణం ప్రసాద్ గారు.కానీ మెల్లగా ముగిస్తాను అనుకుంటున్నాను.
చివరగా సిరిసిరి మువ్వగారికి ఒక మనవి,ఈ వ్యాఖ్యానం అధికప్రసంగం గా ఉంటే తక్షణం తొలగించగలరు.
రావు గారు చాలా థాంక్స్ అండీ...
@ప్రసాదు గారు, ఇప్పుడు చేదు మాత్రలు మింగించినా ఒకప్పటి జ్ఞాపకాలు మనల్ని వీడవు కదండి, వాటిని తలుచుకుని ఆనందించటమే ఇప్పుడు మనం చేయకలిగింది..
@రాజేంద్ర కుమార్ గారు,
ముందుగా మా ఊరి గురించి వికీని తిరగతోడినందుకు ధన్యవాదాలు.
నాకు తెలిసి మా ఊరి నుండి బాపట్ల 11 కి.మీ కి తక్కువ అయితే ఉండదు. ఈ సారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొలుచుకొస్తానులేండి:). ఇక జనాభా గురించి ఆ లెక్కలు వికీలో పెట్టింది నేనేనండి:). నా బ్లాగులో నేను హరిజనవాడని పరిగణలోకి తీసుకోలేదు. ఆ మాటే నా టపా లో రాసి కూడా మరీ ఇంత వివరణ అవసరమా అని తీసేసాను, అదే మీరు పట్టేసుకున్నారు!!
ఇక ప్రముఖులు--గ్రామంలో బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు, వాళ్లందరి గురించి రాస్తే ఊరందరి గురించి రాసినట్లే అవుతుంది:)
వికీలోని విషయాలు ప్రామాణికం కాదు కానీ ఎవరో ఒకరు రాస్తూ ఉంటేనే దిద్దుబాటులు జరిగి అసలు విషయాలు బయటికి వచ్చేది.
నా భాధా అదేనండి. జ్ఞాపకాలంత తియ్యగా వాస్తవాలుండవు.
--ప్రసాద్
http://blog.charasala.com
ఈ మధ్యకాలం లో శ్రీనివాస్ గారి గజల్ కూడా ఒకటివచ్చింది .. "ఒక్కసారి ఉరు పోయిరా" అని మంచి సాహిత్యం
చాలా బాగుంది మీ వూరు, మన వూరు లో ఏవి వుంటే అవే మనకు గొప్ప.. మీ వూరు చదువుతుంటే నాకు మా అమ్మమ్మ వాళ్ళ వూరు మా నాన్న పుట్టిన వూరు అలా గుర్తు వచ్చాయి, మా అమ్మదేమో గుడివాడ దగ్గర పోలుకొండ, మా నాన్న దేమో ప్రకాశం జిల్లాలో ఇంకొల్లు దగ్గర ఒక వూరు.. మా అమ్మమ్మ వాళ్ళ వూరుకు వెళుతుంటే నాకు కూడా ఎన్ని జ్ఞాపకాలో ... మళ్ళీ ఇంకో టపా రాయాలనిపించింది మీ వూరు గురించి చదువుతుంటే...
వో మీది బాప ట్ల దగ్గర ఈతేరు నా? మా అత్త వాళ్ళది పక్కన అప్పికట్ల, మా కజిన్ ది పక్కన మునిపల్లె, ఇంకో స్నేహితురాలిది పొన్నూరు, మా అన్నయ్య ది బాపట్ల... ఆ వూర్లు వెళుతున్నప్పుడు మీ వూరి మీద నుంచే కదా వెళతాము... రోడ్ మీదకు వుంటుంది కదా..
@భావన గారూ, మా ఊర్లన్నీ మీకు పరిచయమే అన్నమాట. అప్పికట్ల, పొన్నూరు, బాపట్ల అన్నీ మావే:)
బలే రాసారండీ...మనసులోనూ, కళ్ళలోనూ తడి చేరింది మా ఊరు గుర్తొచ్చి!
Post a Comment