మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఊరు  సమీపిస్తుండగానే మనసు  ఉరకలేస్తుంది.  గుండె గొంతుకలోన కొట్టాడతాది.   పుట్టిపెరిగిన ఊరు, ప్రతి వీధి నాదే అని తిరిగిన ఊరు.  వారానికి   వెళ్ళినా, నెలకివెళ్ళినా, సంవత్సరానికి వెళ్ళినా అదే అనుభూతి,   అందరికీ  ఇలానేఉంటుందేమో, nostalgia they name it
  మాది గుంటూరు జిల్లాలో ఒక చిన్న సాదా సీదా పల్లెటూరు . ఊరంతా కలిపి  ఓ నాలుగు వీధులు, ఓ  ఏభై  ఇళ్లు, అంతే  మా  ఊరు.  ఒకప్పుడు ఓ చిన్న బడి, ఓ చిన్న గుడి,  ఓ చిన్న చెరువు, ఓ పెద్ద భావి , మా ఇంటికి  వెనక ఓ వీధి, అటు పక్క ఓ వీధి, ఇటుపక్క ఓ వీధి, వెరసి మా ఊరు.  ఇప్పుడు --పాడుబడ్డ బడి, పాడయిపోయిన  భావి, మాయమైపోయిన వెనక వీధి (ఇప్పుడు ఆ స్థలం ఓ  చిన్నఅడవి ప్రాంతం) .చెరువు  ఒక్కటే  చెరువుగా అలా    మిగిలి ఉంది, తన చుట్టూ జరిగే మార్పులిని గమనిస్తూ.

ఇక కొద్దో గొప్పో అభివృద్ధి జరిగింది గుడి  విషయంలోనే (మారుతున్న మనస్తత్వాలకి  ప్రతీకగా!!).  ఒకప్పుడు హనుమ జయంతి రోజుతప్పితే  ఎవరూ పెద్దగా  గుడికి వెళ్ళేవాళ్ళు కాదు.  శ్రీరామనవమి జరిగినా ఊరి మధ్యలో పందిరి వేసి చేసేవాళ్ళు ,  అలాంటిది  ఇప్పుడుప్రతి రోజు గుడిలో  భజనలు, విష్ణుసహస్రనామం, హనుమాన్ చాలీసా , ఆకు పూజ  అన్నీ  జరిపించుకుంటున్నాడు దేవుడు,  (రాయైతేనేమిరా దేవుడు హాయిగా ఉన్నాడు జీవుడు !).
        గ్రామ దేవత గోగులమ్మ.  గుడి అంటూ ఏమి ఉండదు, చెరువు గట్టున నడుం వరకు మాత్రమే ఉండే పడుకుని ఉండే అమ్మవారి
విగ్రహం.  ఎలాంటి  అలంకారాలు ఉండవు.   కాస్తంత పసుపు పూసి  కుంకుమ  పెడతారు.  గురువారం, ఆదివారం పూజలు                          జరుగుతాయి.  ఒకప్పుడు  ఎప్పుడో ఒకసారి జరిగే పూజలు ఇప్పుడు ప్రతి ఆది, గురువారాలలో జరుగుతున్నాయి.  చాలా సంవత్సరాల తరువాత ఈ మధ్య గోగులమ్మ దగ్గరికివెళితే పూజా విధానం కూడా మారిపోయింది.   ఇదివరకు చాకలి చేత పొంగలి చేయించి విగ్రహం చుట్టూ మజ్జిగ పోస్తూ మూడు సార్లు తిరిగి వేపాకులతో  పూజ చేసి ఓ కొబ్బరికాయ కొట్టేసి  వచ్చేవాళ్ళు .  చాకలి చేత చేయించిన పొంగలి అందరికి ఆకులలో పెట్టి ఇచ్చేవాళ్ళు.  ఇప్పుడు పొంగలితో పాటు పులిహోర, దద్దోజనం , ఒకటేమిటి  ఎన్నెన్ని రకాల పలహారాలో , వాటికి మళ్ళీ పేపరు పళ్ళాలు!నాగరికతా చిహ్నాలు!!!
మా బడి ఓ రెండు గదుల బడే కాని  దాని వంక చూస్తుంటే ఇది నేను చదువుకున్న బడి అని ఓ విధమైన గర్వంగా ఉంటుంది.   తరువాతచదివిన కాలేజిలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ అలాంటి అనుభూతిని ఇవ్వవు.  వరండాలో బాల్వాడి తరగతులు, ఒక గదిలో 
 ఒకటి, రెండు, తరగతులు, ఇంకొక గదిలో మూడు, నాలుగు, అయిదు తరగతులు జరిగేవి.  ఇద్దరేటీచర్సు.  ఒకటి రెండు  తరగతులకి పంతులమ్మ గారు వచ్చేవాళ్ళు.  పంతులమ్మ గారినిఊర్లో పెద్దల దగ్గరనుండి పిన్నల దాకా అందరం పంతులమక్కాయి అనేవాళ్ళం.  ఆమె మాబడిలో  చాలా చాలా సంవత్సరాలు  పనిచేసారు.   ఆమె అసలు పేరు దేవకీదేవి కానీ ఆ పేరుఎక్కువ మందికి తెలియదు, అందరికి పంతులమ్మక్కాయే.        ఊరిలో పిల్లలంతా ఆమె దగ్గరికి  ప్రైవేటుకి వెళ్ళేవాళ్ళు.   ఇంత డబ్బులు ఇవ్వండి  అని  ఎవరిని  ఏనాడూ అడిగి తీసుకునేదికాదు.  పాలో, పెరుగో, వడ్లో, బియ్యమో, కూరగాయలో ఎవరు ఏమిచ్చినా తీసుకునేది.     సాయంత్రం పూట వంట చేసుకుంటూ చదువుచెప్పేది.  ఈ మద్యే చాలా సంవత్సరాల తరువాత  హైదరాబాదులో  ఆమెని చూడటం ఎంత ఆనందం కలిగించిందో.  ఈ వయస్సులోకూడా అందరిని ఆమె పేరు పేరునా గుర్తుచేసుకుంటుంటే  వాహ్ అనిపించింది.
ఊరు ఎలా ఉన్నా   మనుషులు ఎలా మారినా అది మా  ఊరే.  ఊరు మారినా ఉనికి మారదు.  ఇప్పటికీ ఊరెళితే అప్పటిఅనుభూతులు, నేస్తాలు, ఆ ఆప్యాయతలు అన్నీ గుర్తొచ్చి ఆ జ్ఞాపకాల బరువుతో వెనక్కి తిరిగొస్తుంటాను.
మా ఊరిలో ఏమీ లేకపోవచ్చు, గొప్ప గొప్ప విద్యావేత్తలు లేకపోవచ్చు,  బడా బడా వ్యాపారవేత్తలు లేకపోవచ్చు, ఊసరవెల్లులలాంటి  కుహనా రాజకీయనాయకులు లేకపోవచ్చు, నాగరికతాచిహ్నాలైన షాపింగు మాల్స్ లేకపోవచ్చు, మల్టీప్లెక్సులు లేకపోవచ్చు, అభివృద్ధికి అద్దంపట్టే కార్పోరేటు బళ్ళు లేకపోవచ్చు, ఇవేవి లేకపోయినా అది నేను పుట్టి పెరిగిన ఊరు, నా వాళ్ళు ఉన్న ఊరు, అందుకే నాకు మా ఊరే గొప్ప.
"మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి
పచ్చనీ పచ్చికపై మేను వాల్చాలి
పైరగాలి వచ్చి నన్ను పలకరించాలి "
అన్న  పాలగుమ్మి గారి పాట విని పరవశించని మనసు ఉంటుందా!!