తెలుగులో మహిళా బ్లాగుల ప్రస్థానం
మనసు భావాలని పంచుకోవటానికి బ్లాగు ఓ చక్కని వేదిక, ఇది మహిళల విషయంలో మరింత నిజం కూడా. ఇప్పుడు తెలుగు బ్లాగుల్లో మహిళల బ్లాగులు ఓ విశిష్ట స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. కథలు, కవితలు, సమీక్షలు, పుస్తకాలు, సినిమాలు, పాటలు, గేయాలు, రాజకీయాలు, అంతరంగాలు, స్వగతాలు, చలోక్తులు, విశ్లేషణలు, విమర్శలు, ముగ్గులు, వంటలు, కొండకచో ముఖాముఖీలు----ఒక్కటేమిటి..... పొడుపు కథలనుండి......అన్నమయ్య పదాల వరకు బ్లాగుల్లో మహిళలు స్పృశించని అంశం లేదు, అందరి గురించి అన్నిటి గురించి వ్రాసేస్తున్నారు.
తెలుగులో మహిళా బ్లాగులు 2005 లో మొదలయ్యాయి. మొదటగా వచ్చింది ఇందు భార్గవి ది అని చెప్పవచ్చు. ఈమెను ఆది బ్లాగరిత అనవచ్చేమో. ఇందు భార్గవి ఇంగ్లీషులో 2004లోనే మొదలుపెట్టినా తెలుగులో 2005 ఏప్రియల్‌లో వ్రాయటం మొదలుపెట్టారు. తను తెలుగులో వ్రాసింది చాలా తక్కువే, ఇప్పుడు పూర్తిగా ఇంగ్లీషులోనే వ్రాస్తున్నట్లున్నారు. తరువాత అభిసారిక . అభిసారిక కూడా మధ్యలో చాలా రోజులు కనపడలేదు, మరల తాజాగా 2008 నవంబరు నుండి వ్రాయటం మొదలుపెట్టారు. ఈమె పాత టపాలయితే ఏవీ ఇప్పుడు లేవు. తరువాత శైలజ అంగర, స్వాతికుమారి, సౌమ్య, రాధిక, లలిత, అమూల్య లాంటి వాళ్లు మొదలుపెట్టారు. వీరిని తొలితరం తెలుగు మహిళా బ్లాగర్లగా చెప్పుకోవచ్చు. వీరిలో ప్రస్తుతం సౌమ్య, రాధిక మాత్రమే తరుచుగా వ్రాస్తున్నారు. శైలజ అంగర మొదలుపెట్టటం ఐదు బ్లాగులు మొదలుపెట్టినా ఎక్కువగా వ్రాయటం లేదు. లలిత గారయితే తన బ్లాగుని పూర్తిగా మూసివేసారు. తను ప్రస్తుతం తెలుగు పిల్లల కోసం ఓ వెబ్ సైటుని నడుపుతున్నారు. అమూల్య కూడా ప్రస్తుతం వ్రాయటం లేదు. స్వాతికుమారి గారు తన బ్లాగుకి కొద్ది రోజులు విరామమిచ్చినట్లున్నారు.
2007 వరకు కాస్త నత్త నడక నడిచిన మహిళా బ్లాగులు 2007....2008 వచ్చేటప్పటికి పరుగు అందుకున్నాయి. విభిన్న రంగాల నుండి వచ్చిన వారు--గృహిణులు, రచయిత్రులు, కవయిత్రులు, ఉద్యోగినులు, స్త్రీవాదులు, ఎందరెందరో బ్లాగులు మొదలుపెట్టారు.
నిడదవోలు మాలతి, స్వాతి శ్రీపాద, శ్రీవల్లీ రాధిక, రమ్య లాంటి రచయిత్రులు, సత్యవతి, కల్పన రెంటాల, కొండేపూడి నిర్మల లాంటి స్త్రీవాదులు బ్లాగులు మొదలుపెట్టిన వారిలో ఉన్నారు.
అందరిలోకి చెప్పుకోవలసింది ఒంటిచేత్తో అవలీలగా ఏడు బ్లాగులు వ్రాస్తున్న జ్యోతి గారినే. ఒక సామాన్య గృహిణి అసామాన్య బ్లాగరుగా మారి సాధించిన విజయం ఇది. తనని స్ఫూర్తిగా తీసుకుని బ్లాగులు మొదలుపెట్టిన వారు ఎందరో. తన ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే బ్లాగులు వ్రాయమని ప్రోత్సహించటమే కాదు, దానికి కావలసిన సాంకేతిక సహాయం కూడా అందిస్తుంటారు. ఎక్కడో పల్లెటూరు నుండి తమ భావాలని పంచుకుంటున్న మహిళా బ్లాగర్లు కూడా వున్నారు
కొన్ని మహిళా బ్లాగుల గురించిన పరిచయం కింది టపాలలో చూడవచ్చు.
http://vareesh.blogspot.com/2008/09/blog-post_10.html
http://vareesh.blogspot.com/2008/09/blog-post_21.html
తెలుగులో తొలి మహిళా బ్లాగుల గురించి వివరాలు అందించిన తాడేపల్లి గారికి, సి.బి.రావు గారికి ధన్యవాదాలు.
26 వ్యాఖ్యలు:
మంచి ప్రయత్నం,కాకపోతే మీరు పరిచయం చేసిఆపారు.ఒక్కొకబ్లాగునూ విశ్లేషిస్తూ మరింతవివరంగా రాయండి :)
సామాన్య గృహిణి లో "సామాన్య" అనే పదం నచ్చలేదు నాకు.
అదలా వుంచితే, ఆవిడ సామాన్యురాలు కాదండీ బాబోయ్!!!!.
సిరి సిరిమువ్వ గారూ..
మీరు రాసిన మహిళా బ్లాగుల నివేదిక బావుంది. ఇంత చిన్నగా ఉందేంటా అనుకున్నాను. కానీ.. కింద మీరిచ్చిన మీ పాత టపాల్లోకి వెళ్లి చూసాక తెలిసింది మీరెంత చక్కగా రాసారో..!
మీకు అభినందనలు :)
అన్నట్టు చెప్పడం మరిచాను. కుమార్ గారి మాటతో నేనూ ఏకీభవిస్తాను. 'అసామాన్య' అనే పదం వాడాలి జ్యోతి గారి కోసం :)
ఆవిడ ఒంటిచేత్తో అన్ని బ్లాగులనే కాదు.. బోలెడు పనుల్ని చక్కబెట్టుకొస్తారు. నాలాంటి కొత్తవారికి చక్కటి సలహాలు కూడా ఇస్తుంటారు.
తెలుగు బ్లాగు చరిత్ర రాసేవారికి మీ వ్యాసం దోహదపడకలదు. మహిళా బ్లాగరులెందరున్నా ఆలస్యంగా వచ్చిన జ్యోతక్కను ప్రత్యేక బ్లాగరితగా పేర్కొనాలి. అక్క సృష్టించిన ప్రభంజనం ఇంతా అంతా కాదు. తెలుగు బ్లాగు చరిత్రలో గృహిణి జ్యోతి గురించి ప్రత్యేకంగా రాయాల్సుంటుంది. అక్క గూర్చి రాయాలంటే అక్క రాసిన టపాలపై ప్రత్యేక పరిశోధన చెయ్యాలి. అసంఖ్యాకమైన టపాలు అక్క కలం నుంచి వచ్చాయి.
మొదటి తరం మహిళా బ్లాగర్ల గురించి మంచి వివరాలు ఇచ్చారు సిరిసిరిమువ్వ గారు. నాకు చాలా మంది గురించి తెలియదు. Good to know.
nice post
gud post...
@రాజేంద్ర గారు, "ఒక్కొక బ్లాగునూ విశ్లేషిస్తూ"-నాకంత లేదండి:)
@కుమార్ గారు, మీతో ఏకీభవిస్తున్నాను. గృహిణిగా సామాన్యురాలే, బ్లాగరుగా అసామాన్యురాలు ఆవిడ. టపాలో కూడా మార్చాను చూడండి:)
@మధురవాణి గారు, కుమార్ గారికి చెప్పిన సమాధానమే మీకు కూడా.
@రావు గారు, మీరు మహిళా బ్లాగర్ల గురించి సమీక్షిస్తుండే వారు కదా, ఆ చేత్తోనే జ్యోతి, రాధిక గారి లాంటి వారి గురించి కూడా సమీక్షిస్తే బాగుంటుంది, రాధిక మీ మీద complaint కూడా చేస్తున్నారు:)
వేణు, నేస్తం, మేధ ధన్యవాదాలు.
సిరిసిరిమువ్వ గారు, మహిళా బ్లాగర్ల గురించి వివిధ టపాల్లో సమగ్ర సమాచారం అందించారు, బాగుంది.
మంచి ప్రయత్నం.అభినందనలు.
మంచి ప్రయత్నం.అభినందనలు.
ఎవరక్కడ?? ఓ నిచ్చెన వేయండి. ఇక్కడందరూ కలిసి నన్ను మునగ చెట్టెక్కించేస్తున్నారు. పడిపోయేటట్టున్నాను. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి.. పిల్లల పెళ్లిల్లు చేయాలి. వాళ్ల పిల్లలకు తెలుగు నేర్పి, నా బ్లాగుల అప్పజెప్పాలి..
మీకందరికి పనీపాటా లేదా? ఆయ్!..
వరూధినిగారు, మహిళా బ్లాగర్ల గురించి వివిధ టపాల్లో సమగ్ర సమాచారం అందించారు, బాగుంది. అలాగే వివిధ వర్గాలవారిగా మహిళా బ్లాగులను పరిచయం చేయండి...
వరూధిని గారూ మొత్తానికి విలేజి వెంకాయమ్మ గా నన్ను గుర్తించినందుకు సానా సంతోసవండీ, ఆయ్ .....
మంచి వివరాలతో చక్కని టపా రాసారు.
వరూధిని గారు,
చాలా బాగుంది టపా! బ్లాగు పోస్టులు రాయడానికి బోరుగా ఉన్నపుడు ఉత్ప్రేరకంగా పనికొచ్చేలా ఉంది నిజంగా!
లలిత గారు,
రాజమండ్రీ విలేజీ కాదంటే కాదు! నేనూ ఒప్పుకోను. పల్లెటూరు అంటే ఇంకా తెలుగుతనం వీడని ఊరు అని అర్థం చెప్పుకుందాం!
సుజాత గారు, లలిత గారిది రాజమండ్రి కాదు పక్కన ఓ పల్లెటూరు, లలిత గారు, కదా!
సుజాత గారి కామెంటే నాది కూడా! 'ఆ ఏం రాస్తాం లే' అని బద్దకంతో ఊగుతున్న మనసుకి కొత్త ఉత్సాగం వచ్చింది.. థాంక్స్ వరూధిని గారూ!
వరూధిని గారూ!మొదటి తరం మహిళా బ్లాగుల పరిచయం
బావుంది.అభినందనలు.జ్యోతిగారి గురించి 'అసామాన్య'అనే రాయాలి.
మీ పోస్ట్ ద్వార నాకు చాలా మహిళా బ్లాగుల గురించి తెలిసింది... ధన్యవాదాలు
~ చైతన్య
రాగం
మహిళా బ్లాగర్ల గురి౦చి తెలుసుకొవట౦, నాలా౦టి కొత్త బ్లాగర్లకి ఉపయోగకర౦గా ఉ౦ది..కొత్త ఉత్సాహాన్ని కూడా ఇస్తు౦ది.
మీ అభిమానం చూస్తుంటే, అర్ధాంతరంగా, అప్రయత్నంగా ముగిసిందనుకున్న నా బ్లాగు ప్రయాణం అర్థవంతంగా సంపన్నమైందని నాకు తృప్తిగా ఉంది.
ఒక కవి, తను రాసిన కవిత గాలికెగిరిపోయిందని బాధపడుతుంటాడు. ఒక రోజు ఆ కవితను తన స్నేహితుడు పాడుకోవడం వింటాడు. ఎగిరిపోయిందనుకున్న పాటను తన స్నేహితుడి హృదయంలో కనుగొని సంతోషిస్తాడు. పోలిక అతిశయం అయినా నా తృప్తి అటువంటిదే. ధన్యవాదాలు.
తెలుగు4కిడ్స్ కి మాత్రమే సమయం వెచ్చించగలుగుతున్నాను. అంతర్జాలంలో తెలుగుకి సంబంధించి అంతవరకే మెసులుతున్నాను.
కూడలి జాబితాలు పెరగడం గమనించాను. అంతర్జాలంలో ఎంత తిరిగినా, ఎన్ని చూసినా, "బ్లాగులలో తెలుగు బ్లాగులు వేరు" అనే నమ్ముతున్నాను ఇప్పటికీ.
అందరికీ అభినందనలతో,
సెలవు.
లలిత గారు, ఎన్ని రోజులకి మీ మాటలు వినపడ్డాయి. అప్పుడప్పుడు బ్లాగుల వంక కాస్త చూస్తుండండి.
Hello సిరిసిరిమువ్వ garu,
నేను రాయడం మానలేదు. ఇతర బాధ్యతల వల్ల టైము చిక్కలేదు అంతే. నాది ద్విభాషా blog కావడం వల్ల అప్పుడప్పుడు తెలుగు లో రాస్తాను. కిందటి నెల ఒకటి రాసాను.
మీ blog లో నా గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం ఒక మాస పత్రిక కి రాస్తున్నాను. మీ blog బాగుంది :)
Hello సిరిసిరిమువ్వ garu,
నేను రాయడం మానలేదు. ఇతర బాధ్యతల వల్ల టైము చిక్కలేదు అంతే. నాది ద్విభాషా blog కావడం వల్ల అన్నీ తెలుగు లో రాయడం కొంచెం కష్టం.అలా అని మాననూలేదు. ఈ మధ్యనే ఒకటి రాసాను.
ప్రస్తుతం ఒక మాస పత్రిక కి రాస్తున్నను. మీ blog లో నా గురించి ప్రస్తావించినందుకు గానూ ధన్యవాదాలు. మీ blog బాగుంది.:)
Post a Comment