పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 25, 2009

యామిని పిల్లలు-వెన్నెల కిరణాలు

ఈ చిత్రం గూగుల్ సౌజన్యం

ప్రమదావనం సహాయ కార్యక్రమంలో భాగంగా ఈ సారి యామిని ఫౌండేషన్ వారికి సహాయం అందించటం జరిగింది. యామిని ఫౌండేషన్ అన్నది మానసికంగా వెనుకపడ్డ పిల్లలకి సేవలు అందిస్తున్న ఓ స్వచ్చంద సంస్థ.  ఈ సంస్థ గురించిన మరిన్ని వివరాలకు "సామాన్యులలో అసామాన్యులు" టపా చూడవచ్చు.

ముందుగా ప్రమదావనం గురించి ఓ రెండు మాటలు
స్థూలంగా చెప్పాలంటే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలనుండి వ్రాస్తున్న తెలుగు మహిళా బ్లాగర్లకు ఇది ఓ వేదిక లాంటిది. ఎక్కడెక్కడి మహిళా బ్లాగర్లు అప్పుడప్పుడు సరదాగా కలిసి కబుర్లు చెప్పుకోవటానికి, బ్లాగులకు సంబంధించిన మరియు ఇతరత్రా సాంకేతిక విషయాలకు సంబంధించిన సలహాలకి, సందేహాల నివృత్తికి, ఇంకా సభ్యులకి  ఏవైనా సలహాలు కాని సంప్రదింపులు కాని అవసరమైతే ఇతోధికంగా సహాయ పడటానికి ఏర్పడ్డ ఓ వేదిక. ఓ రకంగా గూగుల్‍ తెలుగుబ్లాగు గుంపు లాగానే ఇది కూడా. మహిళా బ్లాగర్లు ఎవరైనా ఇందులో సభ్యులు కావచ్చు. దీనికి ప్రవేశ రుసుము లాంటివి ఏమీ లేవు. ఈ ప్రమదావనం గుంపుకు అనుబంధంగా ఒక చాట్ రూం కూడా ఏర్పాటు చేయబడి ఉంది.

అలా మొదలయిన ఈ ప్రమదావనం ప్రస్థానంలో సమాజంలో అవసరం ఉన్నవారికి చేతనయినంత సహాయం చేద్దామన్న తలంపుతో సహాయ కార్యక్రమాలకి కూడా అంకురార్పణ జరిగింది. ప్రమదావనం సభ్యుల నుండి కొంత మొత్తం సేకరించి ఈ కార్యక్రమాలకి వినియోగించటం జరుగుతుంది. ఇక్కడ నిర్భంధం ఏమీ వుండదు. ఇవ్వగలిగిన వారే ఇవ్వొచ్చు. ఎవరికి తోచినంత వారు ఇవ్వొచ్చు. ఎవరికి సహాయం చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలు ప్రమదావనంలో చర్చించి నిర్ణయాలు తీసుకోబడతాయి. మొదటిగా "అంకురం" అని ఆడపిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఓ స్వచ్చంద సంస్థకి సహాయం చేయటం ద్వారా ఈ సహాయ కార్యక్రమాలకి 2008 నవంబరులో అంకురార్పణ జరిగింది. అక్కడి పిల్లలకి కావలసిన స్టేషనరీ సామాను కొనివ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతిస్పందనగా మన తెలుగు బ్లాగులోకంలో నుండి కొంతమంది పురుషులు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారు కూడా మా సహాయ కార్యక్రమాలకి ఇతోధిక తోడ్పాటు  అందించటం మాకెంతో సంతోషంగా వుంది.

ఇంకొక్క మాట-తెలుగులో బ్లాగు వ్రాసే ప్రతి ఒక్క మహిళ ఇందులో బై డిఫాల్టు సభ్యులవటం జరగదు మరియు ప్రతి ఒక్క తెలుగు మహిళా బ్లాగరు ఇందులో సభ్యులు అయి ఉండాలన్న నియమం కూడా ఏమీ లేదు. ఆసక్తి ఉన్నవారు ఇందులో సభ్యులుగా చేరవచ్చు.

కిందటి శనివారం (21-02-09) ప్రమదావనం సభ్యులు యామిని స్కూలుకి అవసరమైన కొన్ని కుర్చీలు మరియు అక్కడి పిల్లలకి మధ్యాహ్న భోజనానికి అవసరమయిన సరుకులు కొనివ్వటం జరిగింది.

 
 
పై సరుకులు, కుర్చీలు వారికి అందచేసిన తరువాత  అక్కడి పిల్లలతో కాసేపు గడిపాము. స్కూలు పక్కన కల పార్కులో ఆ పిల్లలతో కలిసి ఓ గంట పైగా గడపటం నిజంగా మర్చిపోలేని అనుభవం.
వాళ్లతో ఆడి పాడి కాసేపు మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాం. కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. అలా ఆడుకుంటుంటే వాళ్లలో ఎంత హుషారో! ఆటలలో పాటలలో మామూలు పిల్లలకి మేమేమీ తీసిపోమనిపించారు. వారి ముఖాలలోని ఆనందపు వెలుగులు చూసాక ఆర్థిక సహాయంతో పాటు ఇలా వారితో గడపటం కూడా వాళ్లకి అవసరమే అనిపించింది.
ఇక్కడి పిల్లలలో చాలామంది మనం చెప్పినవి అర్థం చేసుకుని ఆచరించగల మానసిక వయస్సు ఉన్నవారే అందువలన మాకు వారితో ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు. ఒకరిద్దరు హైపర్ ఆక్టివ్ పిల్లలు ఉన్నా మాతోపాటు టీచర్సు కూడా ఉన్నారు కాబట్టి వారితో కూడా ఎలాంటి సమస్యా ఎదురవలేదు. అందులో కొంతమందికి మాటలు సరిగా రావు అయినా ఎంత ఉత్సాహంగా ఉన్నారో!

"అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే" అంటూ యామిని అన్న పాప చాలా చక్కగా ఓ పాట పాడి వినిపించింది. తనకి చాలా పాటలు వచ్చని చెప్పింది. ఈ సారి ఆ పాప పాటలు రికార్డు చేసి తేవాలి.  ఈ పాపకి మానసిక వైకల్యంతో పాటు శారీరక వైకల్యం కూడా వుంది. రెండు కాళ్లూ పోలియో వల్ల  దెబ్బతిన్నాయి. ఇలాంటి వారు ఇంకో ఇద్దరు ఉన్నారు. ఈ పిల్లల ఆత్మస్థైర్యాన్ని చూస్తుంటే  చాలా ముచ్చటేసింది. చిన్నిచిన్ని కారణాలకే జీవితం మీద విరక్తి పెంచుకుని ఆత్మహత్యలకి పాల్పడేవారికి  వీళ్లని ఒక్కసారి చూపించితే చాలు.
 
పిల్లలతో కాసేపు గడిపాక వారిని మరలా స్కూలులో వదిలిపెట్టి  మేము సెలవు తీసుకున్నాము. నేనయితే అప్పుడప్పుడు వెళ్లి ఇలా వాళ్లతో గడిపి రావాలని నిర్ణయించుకున్నాను. స్కూలు వారు పిల్లలని ఇలా ప్రతి బుధవారం పార్కుకి తీసుకెళుతుంటారట. ఈ విషయం నాకు చాలా నచ్చింది. అంతే కాక అదే రోజు సాయంత్రం జూబిలీ హిల్సులో ఓ ఫోటొ స్టూడియోకి ఈ పిల్లలచేత ప్రారంభోత్సవం చేయించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆ పిల్లలలో మీరు కూడా మాలో ఒకరే అన్న భావం పెంపొందించిన వాళ్లమవుతాం కదా అని అనిపించింది!

ప్రస్తుతం ఈ స్కూలుని అద్దె భవనంలో నడపుతున్నారు. త్వరలో స్కూలుకి స్వంత భవనం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలనీ కమిటీ వారు కాలనీలో కొంత స్థలం ఇచ్చారు. స్థలంతో పాటు నిర్మాణ వ్యయంలో సగం భరిస్తామని ముందుకొచ్చారట. మిగతా సగం స్కూలు వారు పెట్టుకోవాలి. దీనికోసం స్కూలు వారు బయటవారి సహాయాన్ని ఏ రూపంలో ఇచ్చినా తీసుకుంటారు, అంటే ధనరూపేణానే కాకుండా ఇనుము, ఇటుకలు, సిమెంటు, ఇసుక, తలుపులు, కిటికీలు లాంటివి, ఇంకా భవన నిర్మాణానికి అవసరమైన సామగ్రి ఏమి ఇచ్చినా తీసుకుంటారు.

ఈ స్కూలుకి సహాయం చేద్దామనుకున్న వారు ఈ కింది అడ్రస్సులో వారిని సంప్రదించవచ్చు.
Yamini Educational Society
Plot No 5-80-C/2, Vivekanandanagar Colony, Kukatpally
Hyderabad-500072
Phone: 23061796
School founder: K. Sreenivasa Rao; Mobile: 98494 23055

Read more...

February 23, 2009

మనసు ఉప్పొంగిన వేళ-జయహో రెహమాన్!

ఆనందం అర్ణవమైతే....నిజంగా మాటలు రావటం లేదు......

కోట్లాది భారతీయుల ఆశలను నిలబెడుతూ రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులని సాధించి ఈ సారి భారతదేశాన్ని ఆస్కార్ పీఠంపై అత్యున్నత స్థానంలో నిలబెట్టాడు, అంతే కాదు రెండు ఆస్కార్ అవార్డులని పొందిన మొదటి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.

ఈ రోజు ఆస్కార్ అవార్డుల ఉత్సవం చూసి మనస్సు ఉప్పొంగని భారతీయులు ఉండరేమో! ఖచ్చితంగా ఈసారి ఈ ఉత్సవాన్ని ఇంతకుముందు కంటే ఎక్కువమంది భారతీయులు టెలివిజన్‌లలో వీక్షించి ఉంటారు. కొంతమంది ఆనందతాండవం చేసి వుంటారు.

నామినేషన్ పొందిన 9 కాటగిరీలకి గాను 8 కాటగిరీలలో అవార్డుల పంట పండించుకున్న స్లం‍డాగ్ మిలయనీరుది  మొత్తం భారతీయ నేపధ్యమే. లఘు చిత్రాల విభాగంలో "స్మైల్  పింకీ"కి ఆస్కార్ రావటం కూడా మనకి గర్వకారణమే. ముఖ్యంగా రెహమాన్‌కి రెండు అవార్డులు రావటం మనందరం గర్వించదగ్గ విషయం. నిజానికి తను ఇంతకన్నా మంచి పాటలు ఇంతకు ముందు చేసాడు, కానీ ఇప్పటి ఆనందం వేరు. ఇది ప్రపంచానికి భారత సత్తా చాటిన సందర్భం. ఈ సందర్భంగా వేదిక మీద తన మాతృమూర్తిని, మాతృభాషని స్మరించుకున్న రెహమాన్‌కి అభినందనలు.

స్లండాగ్ మిలయనీర్‌కి అవార్డులు రాకుండా హాలీవుడ్లో తెరవెనుక ప్రయత్నాలు జరిగాయని ఓ కథనం, అది ఎంతవరకు నిజమో తెలియదు. ఈ సినిమా గురించిన వాదనలు ఎలా ఉన్నా ఈ సినిమా ఇంత విజయవంతం అవటానికి కారణమైన ఈ చిత్రం యూనిట్ సభ్యులందరికి మన అభినందనలు తెలియచేద్దాం.


స్లండాగ్ ఆస్కార్‌కి నామినేట్ అయిన కాటగిరీలు:
  1. Best picture
  2. Best director
  3. Best writing (Adopted)
  4. Music(song) (రెండు నామినేషన్లు)
  5. Music(score)
  6. Film Editing
  7. Sound mixing
  8. Sound editing
  9. Cinematography


అవార్డులు లభించిన కాటగిరీలు:
  1. Best picture
  2. Best director-Danny Boyle
  3. Best writing(Adopted)-Screenplay by Simon Beaufoy
  4. Music(song)-"Jai Ho"Music by A.R. Rahman; Lyric by Gulzar
  5. Music(score)-A.R. Rahman
  6. Film Editing-Chris Dickens
  7. Sound mixing-Ian Tapp, Richard Pryke and Resul Pookutty
  8. Cinematography-Anthony Dod Mantle
జయహో రెహమాన్ ........జయహో భారత్......

Read more...

February 20, 2009

నేను మెచ్చిన యండమూరి పుస్తకాలు

(ఈ టపా ఎప్పుడో 2007 జూనులో వ్రాసినది.  నా టపాల ఖజానాలో కనపడటం లేదు, ఎలా తప్పిపోయిందో తప్పిపోయింది.  మూసల్లో వుంది కాబట్టి మరలా పెడుతున్నాను :)

నేను తెలుగు పత్రికలు, పుస్తకాలు చాలా చిన్నప్పటినుండే చదవటం మొదలుపెట్టాను. అప్పట్లో మా నాన్నగారు పత్రికలలో వచ్చే ప్రతి సీరియలు తీసి పుస్తకంగా కుట్టేవాళ్ళు. సెలవలలో తీరిగ్గా అవి చదువుకునేవాళ్ళం. మా బంధువులు ఒకళ్ళకి పుస్తకాలు అద్దెకిచ్చే షాపు ఉండేది. అక్కడినుండి నవలలు తెచ్చుకుని చదివేవాళ్ళం. అవీ ఇవీ అని లేదు అన్నీ చదివేదాన్ని. పుస్తకాలు కొని చదవటం అంటూ ఉండేది కాదు. నేను నా చేతులతో మొదటగా కొనుకున్న పుస్తకం యండమూరి "రాక్షసుడు" (1986లో). అప్పట్లో యండమూరి అంటే విపరీతమైన అభిమానం. "వెన్నెల్లో ఆడపిల్ల" ఇప్పటికీ నాకు అత్యంత ఇష్టమైన పుస్తకం. ఆయన పుస్తకాలలో నాకు నచ్చినవి:

వెన్నెల్లో ఆడపిల్ల
ఋషి
ప్రియురాలు పిలిచె
ఆఖరి పోరాటం
ఆనందోబ్రహ్మ
అభిలాష
పర్ణశాల
డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు
తులసీదళం
తులసి
వెన్నెల్లో గోదావరి
యుగాంతం
నల్లంచు తెల్లచీర
దుప్పట్లో మిన్నాగు(కథలు)
మరణమృదంగం
రాక్షసుడు
నిశ్శబ్దం నీకు నాకు మధ్య
చీకట్లో సూర్యుడు
రాధ-కుంతి

ఇవన్నీ ఎప్పుడో చదివిన పుస్తకాలు. అప్పుడు నేను చదవాలనుకునీ చదవలేకపోయిన యండమూరి పుస్తకాలు కొన్ని వున్నాయి-మంచు పర్వతం, 13-14-15, ధ్యేయం.  అవి ఇప్పుడు చదువుదామంటే ఆసక్తిగా అనిపించటం లేదు. ఈ మద్య ఆయన పుస్తకాలు చదవటమే మానేసాను. వయసు పెరిగే కొద్ది అభిప్రాయాలు, ఆలోచనలు మారిపోతాయంటారు కదా అందుకనేనేమో!!

యండమూరివి కొన్ని పుస్తకాలు ఇక్కడ చదువుకోవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు యండమూరి website చూడండి.

Read more...

February 10, 2009

సామాన్యులలో అసామాన్యులు-1

యామిని ఫౌండేషన్

20 సంవత్సరాల వయస్సులో కూడా  పసిపిల్లల మనస్తత్వం, ఆకలేస్తే అన్నం తినాలని తెలియనితనం, హద్దుల్లేని భావోద్వేగాలు, ఎందుకు నవ్వాలో ఎందుకు ఏడవాలో తెలియనితనం, కల్మషం లేని నవ్వు, ఒక్కక్షణం కేరింతలు-మరో క్షణంలో అరుపులు ఏడుపులు---ఈసునసూయలు, మాయా మర్మం, కుట్రలు కుతంత్రాలు తెలియని మనుషులు---వారే మానసికంగా ఎదగని పిల్లలు---రాగద్వేషాలకి అతీతులు---తమదైన లోకానికి తామే ప్రభువులు.

ప్రతి తల్లిదండ్రి తమ బిడ్దలు ఆనందంగా ఆరోగ్యంగా సుఖసంతోషాలతో వుండాలని కోరుకుంటారు. దాని కోసం అహోరాత్రులు కష్టపడతారు-ఇది మనకు ఓ మామూలు విషయమే. కాని కొంతమంది తల్లిదండ్రులు వుంటారు- తమ బిడ్దతో పాటు ఇతరుల బిడ్దల గురించి కూడా ఆలోచించేవాళ్లు. అది కూడా మామూలు బిడ్డలు కాదు తమ ఉనికి గురించి తమకే సరిగా తెలియని మానసికంగా ఎదగని  పిల్లల గురించి. (వీరిని ఇప్పుడు మానసిక వికలాంగులు అనో మెంటల్లీ రిటార్డెడ్ అనో అనటం లేదు......మెంటల్లీ చాలెంజ్‌డు, మెంటల్లీ డిసేబుల్డు, ఇంటలెక్చ్యువల్లీ డిసేబుల్డు, ఇంటలెక్చ్యువల్లీ చాలెంజ్‌డు, డెవలప్‌మంటల్లీ చాలెంజ్‌డు, డెవలప్‌మంటల్లీ డిసేబుల్డు, స్పెషల్ చిల్డ్రన్ అంటున్నారు, మరి తెలుగులో ఏమంటున్నారో? నేనయితే మానసికంగా ఎదగని పిల్లలు అని అంటున్నాను).

తమ చిన్నారి పాపకి బుద్ది మాంద్యం సంక్రమించినప్పుడు తమకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తమ లాంటి పరిస్థితులలో ఉన్న ఆర్థికంగా వెనుకపడిన తల్లిదండ్రులకి బాసటగా మానసికంగా ఎదగని పిల్లల కోసం ఓ వ్యక్తి నెలకొల్పిన సంస్థ యామిని ఫౌండేషను.
 శ్రీకాకుళంకు చెందిన శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు పిల్లలు. అందులో మొదట పుట్టిన అమ్మాయికి మూడు నెలల వయస్సులో వచ్చిన మెదడు వాపు వ్యాధి కారణంగా ఆ అమ్మాయిలో మానసిక ఎదుగదల లోపించింది. తమ కూతురికి చికిత్స చేయించటంలో, విద్యాబుద్దులు నేర్పించటంలో సంఘంలో తమకు ఎదురైన అనుభవాలని దృష్టిలో పెట్టుకుని మానసికంగా సరైన ఎదుగుదల లేని పిల్లలకు సాయపడాలనే ఉద్దేశ్యంతో కొంతమంది మితృల సహకారంతో హైదరాబాదులోని కూకట్‌పల్లిలో 2005 లో వీరు యామిని స్కూలుని ప్రారంభించారు.

శ్రీనివాసు గారు వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నవారు కాదు, పెద్ద ఉద్యోగీ కాదు, రాజకీయ నాయకుడూ కాదు, ఓ సామాన్య దిగువ మధ్యతరగతి వ్యక్తి. బ్రతుకు తెరువు కోసం ఆయన చేసేది ఓ చిరు వ్యాపారం. డబ్బు సహాయం, మాట సహాయం చేసేవాళ్లు చాలామందే ఉంటారు, కానీ బుద్దిమాంద్యం వున్న పిల్లలని తన కూతురితో సమానంగా ఆయన చేరదీయటం నిజంగా గొప్ప విషయం. అందుకే ఆయన నా దృష్టిలో సామాన్యులలో అసామాన్యుడు.  ఆయనకి తోడ్పాటునందిస్తున్న మిగతా చేతులకి కూడా నా వందనాలు.

ప్రస్తుతం ఈ సంస్థ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకి చెందిన 52 మంది బుద్దిమాంద్యం ఉన్న పిల్లలకి ఉచిత ప్రత్యేక విద్య, వైద్య సహాయం, మధ్యాహ్న భోజనం, బట్టలు మరియు వారికి అవసరమైన కౌన్సిలింగు, ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ లాంటి సేవలను అందచేస్తుంది.
ఇక్కడ 6 ఏళ్ల వయసు పిల్లలనుండి 40 ఏళ్ల వయస్సు వారి వరకు వున్నారు. 40 ఏళ్ల వయస్సు వారు కూడా చూడటానికి 15-20 ఏళ్ల వయస్సు వారిలా అనిపిస్తారు, వీరి మానసిక వయస్సు కూడా 3 సంవత్సారాలే వుంటుంది.  వీరి మానసిక ఎదుగుదలని బట్టి వీరికి ఇవ్వాలిసిన శిక్షణ వుంటుంది.  పిల్లల మానసిక వయస్సుని బట్టి ప్రైమరీ, సెకండరీ, వొకేషనలు అని మూడు విభాగులుగా చేసి వారికి శిక్షణ ఇస్తున్నారు. పిల్లల మానసిక వయస్సు తెలుసుకోవటానికి వీరు NIMH (National Institute for the Mentally Handicapped) వారి సహాయం తీసుకుంటున్నారు. ఏదైనా ప్రత్యేక చికిత్స అవసరం అయిన సందర్భాలలో కూడా వీరు NIMH వారి సహాయం తీసుకుంటున్నారు. ఇక్కడ పిల్లలలో ఆటిజం సమస్య ఉన్న ఓ పిల్లవాడు వున్నాడు. తనకంటూ ఎవరూలేని ఓ అనాధ పిల్లవాడు కూడా వున్నాడు. ఇతనికి స్కూలు వారే ఓ వసతి గృహంలో వసతి సౌకర్యం ఏర్పాటు చేసారు.
ఇలాంటి పిల్లలతో వ్యవహరించటానికి చాలా ఓర్పు, నేర్పు, అంకితభావం వుండాలి. ఈ స్కూలులో పిల్లలకు అవసరం అయిన ప్రత్యేక విద్యనందించటానికి శిక్షణ పొందిన టీచర్సు వున్నారు. ప్రస్తుతం ఈ స్కూలు వారూ వీరూ ఇచ్చే విరాళాల మీద నడుస్తుంది. మధు వారణాసి అన్న ఓ హోమియో డాక్టరు అన్ని విధాలా తనకు చేతనైన తోడ్పాటు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 31 న ఈ పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇప్పిస్తున్నారు.

ఉన్నవాళ్లు సేవ చేయటం గొప్ప కాదు, ఓ దిగువ మధ్యతరగతి వ్యక్తి ఇదంతా చేస్తున్నాడంటే  మనకు చాలా అశ్చర్యం, ఆనందం కలుగుతాయి. నేను, నా ఇల్లు, నా పిల్లలు--ఈ వృత్తం లోనే గిరిగీసుకుని వుండే మనలాంటి వారం ఇలాంటి వారిని చూసి నేర్చుకోవలసినది చాలా వుంది. కల్లా కపటం తెలియని ఈ పసిమనసుల్ని చూస్తే మనస్సుకి హాయి అనిపిస్తుంది. అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు తెలియని వారి స్వచ్చమైన నవ్వుని చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి ఎవరికైనా.
 ఎక్కడో చదివాను ఒక సామాన్యుణ్ణి వాడు చేసే చిన్న పనిని గుర్తించి ప్రోత్సహిస్తే వాడు ఖచ్చితంగా మరో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు అని-అందుకే ఇంతకుముందు అంకురం పిల్లలకు సహాయపడిన విధంగా ఈ యామిని ఫౌండేషను వారికి కూడా ప్రమదావనం తరుపున చేతనైన సహాయం చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read more...

February 4, 2009

వక్కపలుకులు-7

హాస్య నటుడు నవ్వుల రేడు నగేశ్ ఇక లేరు. ఆయన గురించిన వ్యాసం నవతరంగంలో.

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌లో ఈ సారి భారత హవా బాగానే వుంది. మొదటిసారిగా జూనియర్సు విభాగంలో మన దేశానికి చెందిన యుకీ భాంబ్రి మరియు మిక్సుడు డబల్సులో భూపతి, సానియాల జోడి టైటిలు సాధించారు.

మరోసారి నాదల్ vs ఫెదరర్‌ల పోరాటంలో నాదల్‌దే పైచేయి అయింది. మొదట్లోనే తెలిసిపోయింది గెలుపెవరిదో కానీ ఎక్కడో కోరిక ఫెదరర్ గెలవాలని.

ఫిబ్రవరి నెలకి పుస్తకంలో ఓ విశిష్టత వుంది. అదేంటో అక్కడే చూడండి.

ఈమాటలో పెసరట్టు మీద ఈ వ్యాసం నాకు బాగా నచ్చింది. మరి ఆంధ్రమాత మీద ఎప్పుడు వ్రాస్తారో?

ఇప్పుడు మనం ఇంట్లోనే కూర్చుని ప్రపంచంలోని ఏ సముద్ర గర్భంలో అయినా  విహరించవచ్చు. గూగుల్ నవీకరించిన గూగుల్ ఎర్తులో ఈ టూలు పెట్టారు. సముద్రాలలోని జంతుజాలాన్ని, పగడపు దీవులని, మునిగిపోయిన ఓడలని ఎంచక్కా  త్రీడీలో చూడవచ్చు.

గూగుల్ వాళ్లే తమిళనాడులో ఓ ఇంటర్నెట్ బస్సుని ప్రారంభించారు. ఈ బస్సు తమిళనాడులోని ఓ 15 చిన్న చిన్న పట్టణాలలో ఆరు వారాల బాటు తిరిగి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, వ్యాపారస్తులకి, ఇంకా ఆసక్తి వున్నవారికి  ఇంటర్నెట్టుని ఎలా వాడాలో ఎలా ఉపయోగించుకోవాలో చెపుతారట. హిందీ తరువాత మన దేశంలో ఇంటర్నెట్టులో ఎక్కువగా వాడే భాష తమిళమేనట. మరి మన తెలుగు ఏ స్థానంలో వుందో!

ఫోర్బ్స్ వారి ప్రపంచ మొదటి పదిమంది సంపన్నుల జాబితాలో అంబానీ సోదరులు (3, 6 స్థానాలు) ముందుకు దూకగా విప్రో అధిపతి అజీం ప్రేంజీ వెనక్కి దూకి జాబితాలోనుండి బయటపడ్డారు, ఆయన స్థానంలో సునీల్ మిట్టల్ చేరారు. ఎలా అయితేనేం జాబితాలో మనవాళ్ల సంఖ్య తగ్గకుండా నాలుగు దగ్గరే వుంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం మీద MRPS కార్యకర్తల దండోరా చూశారా?

ప్రముఖ చిత్రకారుడు బాలితో కబుర్లు ఇక్కడ వినండి.

జల్లెడలో ఇప్పుడు మరిన్ని హంగులట!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP