పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

January 24, 2011

జాతీయ ఓటర్ల దినోత్సవం......మా అమ్మాయి ఓటరు కార్డు

 రేపు అంటే జనవరి 25 న జాతీయ ఓటర్ల దినోత్సవం అంట.  ఈ సందర్భంగా ఓటర్ల నమోదుపై ప్రతిజ్ఞ.  ఇదేంటా అనుకుంటున్నారా..ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటర్ల ప్రతిజ్ఞను ఓటర్ల చేత అధికారులు చదివిస్తారట! 25వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో  అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి నూతన ఓటర్లను చేరుస్తారట.  మరి ఎవరయిన ఇంకా ఓటరు ఐ.డి కార్డు రాని వాళ్లు ఉంటే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు! ముఖ్యంగా  18-19 సంవత్సరాల యువతీ యువకులను లక్ష్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నామని ఎన్నికల సంఘం ఉవాచ.

అంతా బానే ఉంది..ఈ హడావిడీలు ..ఆర్భాటాలు. పేర్లు నమోదు చేసేటప్పుడే కాదు తరువాత కార్డు ఇచ్చేవరకు అధికారులల్లో అదే ఉత్సాహం ఉంటే బాగుంటుంది. 

సంవత్సరం బట్టి మా అమ్మాయికి ఓటరు ఐ.డి కార్డు కోసం విఫలయత్నం చేస్తున్నాం.  పోయిన సంవత్సరం కూడా ఏదో స్పెషల్ డ్రైవ్ అని పెట్టి ఓటర్లను చేర్చుకున్నారు.  అప్పుడు ఇచ్చాం అప్లికేషను.  మీరు అప్లికేషను ఇచ్చిన నెలకి కార్డు మీ ఇంటికే వచ్చేస్తుంది అని హామీ ఇచ్చేసారు..సరే నెల కాదు ఆరు నెలలయినా కార్డు అతీ గతీ లేదు.  ఎప్పుడు వార్డు ఆఫీసుకి వెళ్ళినా ఇంకా రాలేదు..ఎప్పుడొస్తాయో మాకు తెలీదు అనే సమాధానం.   ఓ తొమ్మిది నెలలకు కార్డు వచ్చింది..అదీ ఇంటికేం రాలేదు..మేమే వెళ్ళి తీసుకున్నాం.  తీరా చూస్తే అందులొ ఫోటో ఒక్కటే మా అమ్మాయిది.  .పేరు, వయస్సు, అడ్రస్సు అన్నీ వేరే వాళ్ళవి..ఓరి దేవుడా ఆనుకుని సవరణలకి form-8 పూర్తి చేసి ఇచ్చాం.ఇచ్చాక రెండు మూడు సార్లు వెళ్ళి అడిగినా ఇంకా రాలేదు అనే సమాధానం..  జనవరి 25 న జాతీయ ఓటర్ల దినోత్సవం..ఇలా సవరణలు ఉన్నవన్నీ ఆ రోజు ఇచ్చేస్తాం..ఈ సారి ఎలాంటి తప్పులు ఉండవు లేండి అని అక్కడ క్లర్కు హామీ ఇచ్చ్సాడు.

నాలుగు రోజులనాడు అటువైపు పని ఉండి వెళ్ళి అసలు లిస్టు అన్నా వచ్చిందేమో అని అడిగితే లిస్టు వచ్చిందని చేతిలో పెట్టారు..చూసా.... అన్నీ సరి చూసా..అమ్మయ్య ఈ సారి అన్నీ సరిగ్గానే ఉన్నట్టున్నాయి..ఫోటో.. మా అమ్మాయిదే......  పేరు... మా అమ్మాయిదే.. ....  అడ్రస్సు..మాదే...హమ్మయ్య అన్నీ సరిగ్గానే  ఉన్నా.....య్.....ఆ....వా... లేదు లేదు ..మా అమ్మాయిని పురుషుడుగా  చేసేసారు...ఆ పేజీలో పదిమంది పేర్లు ఉంటే అందులో ఆరుగురివి లింగాలు తారుమారు..ఖర్మ.. మరలా form-8 పెట్టుకోవాలట! అది కూడా రేపు 25 వ తారీకు కార్డు వచ్చాక అప్పుడు పెట్టుకోవాలట! ఇక మనకి ఇదే పనా? 


ఇలాంటి తప్పులు ఓటరు కార్డు మీద చాలా చాలా సహజం అయిపోయాయి..ఎంత సహజమంటే అవి తప్పుగా మనం పరిగణించనంత సహజంగా....  వాటిల్లో ఉండే తెలుగే శుద్ధ తప్పులయితే పై పెచ్చు ఇలాంటి పొరపాట్లు...ఎన్ని సార్లు చేసిన తప్పులే చేస్తూ సరిదిద్దుకుంటూ కూర్చుంటారో అర్థం కాదు.  కాస్త కూడా జాగ్రత్త లేదు..బాధ్యత లేదు. డాటా ఎంట్రీ వాళ్ల మీద ఓ అధికారిక కన్నేసి ఉంచాలి కదా! ఎక్కడో ఓ తప్పు అయితే పోనీ మానవ సహజం అనుకుంటాం..పది పేర్లలో ఆరుగురివి తప్పయితే ఇంకేం చెప్తాం.  అన్నీ సరిగ్గా ఉండే కార్డులు ఓ పది శాతం అన్నా ఉంటాయో లేదో..నాకు సందేహమే.  


సరే పాస్పోర్టు అప్లికేషను ఇవ్వటానికి వెళితే అక్కడ ఇంకో ప్రహసనం.  అప్లికేషనుతో పాటు ఇచ్చే గైడ్లైన్సు  ఫారమ్‍లో  రెసిడెన్సు ప్రూఫ్ కి ఒక ఆధారం చాలంటాడు..అక్కడ e-seva లో వాడేమో రెండు ఆధారాలు కావాలంటాడు.  ఇక ఆ ఓటరు ఐ.డి కార్డు వచ్చేదాకా పాస్పోర్టు అప్లికేషను సంగతి ఇంతే సంగతులు! బ్రోకరు ద్వారా అయితే ఇవేవి అక్కర్లేదు..ఒక్క ఆధారం ఉన్నా చాలు! ఈ తిప్పలన్నీ పడలేకే  అందరూ బ్రోకర్ల మీద అధారపడతారు కాబోలు అనిపించింది. 

 అప్లికేషను ఫీజు డబ్బు రూపంలో గాని డ్రాఫ్టు రూపంలో కాని కట్టొచ్చు అని అప్లికేషనులో ఉంటుంది..వాడేమో డ్రాఫ్టే అంటాడు.  ఇలాంటి వాటిల్లో కూడా ఇంత వైరుధ్యం ఏమిటొ అర్థం కాదు.


ఇప్పుడు భారత ప్రజలందరికీ ఆధార్ అని ఓ విశిష్ట గుర్తింపు సంఖ్య తీసుకొస్తున్నారుగా..చూద్దాం మరి  దాన్లో ఎన్ని ప్రహసనాలు ఉంటాయో!

Read more...

January 14, 2011

సంకురాత్రి సంబరాలు---పండగ అప్పచ్చులు



   
సంక్రాంతి..  పేరు వింటేనే ముందు నాకు మా ఊరు గుర్తుకొచ్చేస్తుంది.  మా ఇల్లు.. చావిడి...పొలాలు..   పొలాల్లో గట్ల వెమ్మటి బంతి పూలు...ముగ్గులు...గొబ్బెమ్మలు..అలా అలా మా ఊరంతా ఓ చుట్టేసి వస్తా!  ఈ సంవత్సరంతో మా అబ్బాయి  ఇంటరు అయిపోతుంది కాబట్టి వచ్చే సంవత్సరం నుండి సంక్రాంతికి మాత్రం తప్పకుండా మా ఊరు వెళ్ళాల్సిందే అని తీర్మానం కూడా చేసేసుకున్నా!  సంక్రాంతి అంటే ముగ్గులు..గొబ్బెమ్మలే  కాదు అరిసెలు కూడా! మిగతా పిండి వంటలు ఎప్పుడయినా చేసుకుంటారు కాని అరిసెలు మాత్రం ఒక్క సంక్రాంతికే చేసేది.  పెళ్లప్పుడు ఏదో శాస్త్రానికి అల్లుడికని నాలుగు చేస్తారనుకోండి.

ప్రతి పండగకి మా ఇంట్లో అప్పచ్చుల (అదేనండి పిండివంటలు)  కార్ఖానా వెలుస్తుంది. మా అమ్మా వాళ్లు అక్కచెల్లెళ్లు పంచపాండవులు. వీళ్లల్లో ముగ్గురు మా ఊరే.. మరో ఇద్దరు అటు ఓ ఐదు నిమిషాలు ఇటు ఓ ఐదు నిమిషాల ప్రయాణం దూరంలో ఉంటారు....అంటే పక్క పక్క ఊళ్లే అన్న మాట! మా అమ్మమ్మ వాళ్లది మా ఊరే! చూసారా మా తాతయ్య పిల్లలందరినీ  ఎంచక్కా దగ్గరే ఉంచుకున్నారో! మా ఇద్దరు మామయ్యలు ఊర్లోనే!

ఆ పంచపాండవులకి అందరికి కలిపి ఓ డజను మందిమి సంతానం. అందులో ఒకరు తప్పితే అందరం ఆంధ్రదేశంలోనే నివాసం. ఈ పదకొండుమందికి దాదాపు ప్రతి పండగకి మా అమ్మలే ఇప్పటికీ పిండివంటలు చేసి పంపుతారు. (పండగలకే కాదు మధ్య మధ్య కూడా). ఇక సంక్రాంతి అయితే చెప్పక్కరలేదుగా ... అరిసెలు ముఖ్యమైన అప్పచ్చులు. వాటితో పాటు చక్రాలు, చక్కలు, చక్కపకోడిలు, బెల్లం మిఠాయి....ఎవరు ఏవి ఆర్డరు చేస్తే అవి.

పై ఫోటోలోని లడ్లు జంతికలు తప్పితే మిగతావన్నీ మా ఇంట్లో చేసినవే!

...పండగలప్పుడు ఈ అప్పచ్చులు  వండటానికి ఓ ప్రత్యేక వంటశాల వెలుస్తుంది. ఇళ్ల దగ్గర పెద్ద పెద్ద చావిళ్లు కదా.  ఎక్కువగా మా చావిట్లోనే ఈ సందడంతా! రోజుకి కిలోలు కిలోలు బెల్లంతో అరిసెలు వండేస్తారు. తెల్లవారుఝాము రెండుగంటలనుండి మొదలవుతుంది..ధనా ధనా పిండి కొట్టే మోత.  చిన్నప్పుడు అయితే అసలే చలి ముడుచుకుని ముడుచుకుని పడుకుంటామా.. ఐదు దాటగానే  మా నాయనమ్మ ఇకలే  పిండి జల్లిద్దువు కానీ అని లేపేది.  పక్కనుండి మా అమ్మమ్మ చాల్లే ఊరుకో దాన్ని పడుకోనీ..నేను జల్లిస్తున్నాగా . ఎవరన్నా నిద్రపోతుంటే  చూడలేవు అని మెత్త మెత్తగా చివాట్లేసేది. అహా..ఆ రోజులే వేరు.


అరిసెలు గడ్డి మీద ఆరబెట్టటం పిల్లల వంతు.  కాసేపు చేసాక ఇక విసుగేసి మేము ఆడుకోవాలంటూ పరిగెత్తేవాళ్లం.  మా నాయనమ్మేమో పనిలో చండశాసనురాలు.  అరిసెలన్నీ వృత్తలేఖినితో గీసినట్టు ఒకే వ్యాసంతో ఉండాలనేది.   గారెలు, లడ్డు, బూరెలు..గవ్వలు..అన్నీ కొలిచినట్టు ఒకే సైజులో చేసేది..అందరూ అలాగే చెయ్యాలనేది.  పని ఉన్నంత సేపు అందరినీ దడదడలాడించేది.

పిండివంటలతో పాటు రకరకాల కూరలు..పచ్చళ్లు..ఆ నాలుగయిదు రోజులు అందరూ అక్కడే భోజనం చేసేవాళ్ళు.  ఓ చిన్న సైజు  పెళ్ళి భోజనంలాగే ఉండేది.  అప్పచ్చులు వండటం అయ్యాకా..ఎవరివి వారికి భట్వాడాలు ...మిగిలినవి పెద్ద గంగాళాలకి వేసి పెట్టేవాళ్లు.  పండగ మూడు రోజులు ఇంట్లో ఏ మూలకెళ్ళినా నేతి ఘుమఘుమలే!

రోజుకి ఒకళిద్దరివి చొప్పున ఓ నాలుగయిదు రోజులు ఇదే పని మా అమ్మ వాళ్లకి.   ఇక ఏ పండగ అయినా ఆ  రోజంతా మా నాయనమ్మకి చేతినిండా పనే.  పని వాళ్లందరూ అప్పచ్చుల కోసం వచ్చేవాళ్లు.  చాకలి, మంగలి, కుమ్మరి,   పొలంలో  పని చేసేవాళ్లు..   పొద్దుటినుండి సాయంత్రం దాకా అలా వస్తూనే ఉండేవాళ్ళ్లు.  మూడు నాలుగు పెద్ద పెద్ద జల్లి బుట్టల్లో అరిసెలు..గారెలు..చక్రాలు ..ఇలా వండినవన్నీ వేసిపెట్టి..పక్కనే ఓ పెద్ద పేపర్ల కట్ట పెట్టుకునేది.  వచ్చినవాళ్లకల్లా ఆ పేపర్లల్లో అప్పచ్చులు పెట్టి ఇచ్చేది..సాయంత్రానికల్లా అవన్నీ ఖాళీ చేసి ఇంట్లో మాకని అట్టిపెట్టినవి కూడా అవచేసేది.   మా అమ్మేమో వండేటప్పుడు అన్నెందుకంటావు..పెట్టేటప్పుడు మాత్రం చేతికి ఎముక లేకుండా పెడతావు అని నవ్వేసేది. మొత్తానికి అలా మా నాయనమ్మ అన్ని గంగాళాలు ఖాళీ చేసేది.

ఈ సంవత్సరం మాకు ఇప్పటికే రెండు సార్లు అరిసెలు వచ్చేసాయి..మూడోసారి రాబోతున్నాయి. అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా ఇప్పటివరకు ఏ లోటు లేకుండా నేను చేసే పని లేకుండా డబ్బాలు ఖాళీ అయ్యేటప్పటికి మరలా డబ్బాలు డబ్బాలు రకరకాల అప్పచ్చులు ఇంటినుండి వస్తుంటాయి.  కారం ఏవో అప్పుడప్పుడు చేస్తాను కానీ తీపి వంటలకు మాత్రం నేను బహు దూరం.  వేళ్లమీద లెక్క పెట్టవచ్చు నేను చేసే తీపి వంటకాలు. అయినా చేసిపెట్టే వాళ్లుండగా మనమెందుకు చేతులు కాల్చుకోవటం!
 
ఇవి మా ఇంటిముందు వేసిన ముగ్గులు
ఏంటో  సంక్రాంతి అనగానే నాకు అలా దొర్లుకొచ్చేస్తాయ్ కబుర్లు.
సంక్రాంతి అందరి జీవితాలలో కాంతిని నింపాలని కోరుకుంటూ

Read more...

January 1, 2011

కొత్త శతాబ్దంలో ఓ దశాబ్దం

జనవరి 1, 2011.....ఈ రోజు కొత్త సంవత్సరమే కాదు..ఈ రోజుకి మరొక ప్రత్యేకత కూడా ఉంది.
1-1-11 ఇలా నాలుగు ఒకట్లు వెయ్యి సంవత్సరాలకి ఒకసారే వస్తుంది.
అలాగే 11-11-11 ......నవంబరు 11, 2011
ఇలా వంద సంవత్సరాలకి ఒకసారే వస్తుంది.
నవంబరు 11, 1911 న ఇలా వచ్చింది..మరలా వంద సంవత్సరాలకి ఈ సంవత్సరం వస్తుంది.

కొత్త శతాబ్దంలో ఓ దశాబ్దం గడిచిపోయింది.  మరో దశాబ్దం మొదలయ్యింది.  2001 మొదలయినప్పుడు ఎంత హడావిడీ!  రోజు రోజూ మారే రోజే...ఎప్పుడూ వచ్చే డిసెంబరు 31....ఎప్పుడూ వచ్చే రాత్రి పన్నెండు గంటలే.. అన్ని సంవత్సరాలలాగే అదీ ఓ సంవత్సరమే.. కానీ అదేదో కొత్తదన్నట్టు..ఇంతకు ముందు ఎప్పుడూ రానిదయినట్టు...ఇక ముందు రాదేమో అన్నట్లు...మనం ఇక మరో సంవత్సరాన్ని చూడమేమో అన్నట్లు ఎంత హడావిడీ చేసాం. ఎంత ఘనంగా ఈ శతాబ్దపు మొదటి రోజుకు స్వాగతం పలికాం. మరి మన ఆశల్ని ఆకాంక్షల్ని ఈ దశాబ్దం నెరవేర్చిందా?  ఏమో సామాన్యుడి బ్రతుకు బండి వెనకటికంటే ఇంకా నిస్సారంగా నడుస్తుందేమో అనిపిస్తుంది. పెరిగిపోతున్న ఉగ్రవాదం...వేర్పాటు వాదం...ఆసిడ్ దాడులు...కక్షలు...కార్పణ్యాలు...కుంభకోణాలు.....అభం శుభం తెలియని చిన్నపిల్లల అపహరణలు..హత్యలు...దోపిడీలు....ఏంటో జానెడు పొట్టకోసం ఎన్నెన్ని అకృత్యాలు!!

ఈ పది సంవత్సరాలల్లో ఎన్నెన్ని మార్పులు, ఎన్నెన్ని కొత్త ఆవిష్కరణలు..ఆ ఆవిష్కరణల పుణ్యమా అని మన జీవితాల్లో ఎంత హడావిడీ! సరిగా తినటానికి, నిద్రపోవటానికి, ఆత్మీయులతో మాట్లడటానికి తీరికలేనంత హడావిడీ.  చేతినుండా డబ్బయితే ఉంటుంది కాని చేతిలో సమయమే ఉండటం లేదు. 

ప్రతి ఇంటినుండి కనీసం ఓ ఎన్నారై....ఒక్కో ఇంటికి కనీసం ఓ రెండు సెల్లు ఫోనులు (భారతదేశంలో బాత్‍రూములు లేకపోయినా సెల్లు ఫోనులు మాత్రం ప్రతి ఇంట్లో ఉన్నాయంట).... చదువు అయ్యీ అవగానే అందమయిన ఐదు నక్షత్రాల హోటళ్ల లాంటి ఆఫీసుల్లో కొలువులు...అంతర్జాల పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా మన కళ్లముందు ప్రత్యక్షం...ఆర్కుట్లు , బ్లాగులు, ఫేసుబుక్కులు,ట్విట్టర్లలో కొత్త కొత్త స్నేహాలు, చాటులు....ఇవి లేకుండా రోజు గడవని పరిస్థితి.  ఎదురుగా ఉండే మనుషులతో మాట్లాడాటానికి మాత్రం మనకు సమయం ఉండదు.

పదిసంవత్సరాల క్రితం హైదరాబాదులో ఒక్క మాలు కాని మల్టిఫ్లెక్సు  కానీ లేదు..అలాంటిది ఇప్పుడు అడుగడుక్కి  మాల్సు..మల్టిఫ్లెక్సులు....ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా జనాలు...మన కొనుగోలు శక్తి ఇంతలా పెరిగిపోయిందా అని అబ్బురపడేంత!!

ఇదివరకు ఏదో మన చదువుకి తగ్గ ఉద్యోగం..కుటుంబం నడిచిపోయేంత జీతం..అమ్మ నాన్నల్ని చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ప్రశాంతంగా జీవితం గడిచిపోతే చాలనిపించేది.  మరి ఇప్పుడో మొదలు మొదలే వేలల్లో జీతాలు..పోటాపోటీ ఆడంబరమయిన జీవన విధానాలు...కారు, ఇల్లు, స్థలం, ఇంట్ర్నేషనల్ స్కూల్లో పిల్లల చదువులు...అంతా వేలల్లో ఖర్చులు...పొద్దుట బ్రేకుఫాస్టు నుండి రాత్రి డిన్నరు వరకు అన్నిట్లో పోటీనే! అన్నిట్లో వేగమే...ప్రశాంతత లేని వేగం.

 గతంలో కన్నా ఈ పదేళ్లలోనే మన జీవితాలల్లో మార్పు చాలా వేగంగా ఉందేమో అని నాకు అనిపిస్తుంది.  ఈ వేగంలో పడి చిన్ని చిన్ని ఆనందాలు..అనుభూతులు..అన్నీ దూరం దూరం.  ఇంధ్రధనుస్సుని చూసి ఎన్ని రోజులయ్యింది.  ఓ పక్క ఎండ మరో పక్క సన్నటి చినకులు పడుతుంటే గబగబా బయటికి పరుగులు పెట్టేవాళ్లం ఇంధ్రధనుస్సు కనిపిస్తుందేమో అని..ఎన్ని సార్లు చూసినా తనివితీరని అందం..ఒకసారి కనీకనిపించకుండా కనువిందు చేస్తే మరోసారి ఆకాశం ఆ దరిని ఈ దరిని కలుపుతూ ఓ పెద్ద విల్లు..ఎవరో చిత్రకారుడు  పైకి వెళ్లి శ్రద్దగా గీసి కుంచెతో రంగులద్దినట్టు.  ఒక్కోసారి ఒకదాని కింద మరోటి..రెండు కూడా వచ్చేవి..ఇప్పటి పిల్లలకి అసలు ఇంధ్రధనుస్సు అంటే ఏంటో అది ఎప్పుడు వస్తుందో తెలుసో లేదో..అసలు మనమే మర్చిపోయాం దాని గురించి.  అసలు చూడటానికి ఈ ఆకాశహర్మ్యాల్లో అసలు ఆకాశం కనపడితేగా!!   మొన్నొక రోజు ఏదో పని మీద డాబా మీదకి వెళితే ఓ పెద్ద ఇంధ్రధనుస్సు...అబ్బ ఎన్ని రోజులకి అని నన్ను నేను మర్చిపోయి చూసాను. వరద గుడంటే..ఏ దేవుడి గుడి అని అడిగే వాళ్లే ఎక్కువ!

కాలం ఇలా కదిలిపోతూనే ఉంటుంది.  మరో సంవత్సరం..మరో దశాబ్దం..మరో శతాబ్దం.....దానికి అలుపు ఉండదు...దానికి ఏ కొత్త సంవత్సరపు తీర్మానాలూ ఉండవు..ఓ క్రమశిక్షణ కల సైనికుడిలా దాని పని అది చేసుకుంటూ పోతుంది. నిన్నే ఏదో బ్లాగులో అనుకుంటాను చదివాను...."గతం మంచులాంటిది...మళ్లీ కనిపించదు..వెనక్కి తిరిగి చూడకు"..అని.  కాలం మంచులాంటిదే అయినా అది మిగిల్చే జ్ఞాపకాలు కాంక్రీటు కన్నా గట్టి...చెదరవు మరి.  ఆ జ్ఞాపకాలే లేకపోతే మనిషికి  మానుకి తేడా ఏముంది??

ఇక వ్యక్తిగతంగా నాకు గడిచిన దశాబ్దం.....ముఖ్యంగా 2010 సంవత్సరం...ఆనందాలకంటే విషాదాలనే ఎక్కువగా మిగిల్చింది.  నేను చాలా అభిమానంచే మా నాయనమ్మ ఈ దశాబ్దంలోనే మరణించటం...అనుకోని రీతిలో మా నాన్న గారు ఈ సంవత్సరం మాకు దూరం కావటం మేమింకా  జీర్ణించుకోలేని సత్యాలే!

రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.  అలాంటి రైతుకి 2010 ఎప్పుడూ ఎరుగనన్ని చేదు జ్ఞాపకాలని... ఆవేదనని మిగిల్చింది. గాదెలనిండా ధాన్యరాసులతో కళళలాడాల్సిన రైతుల ఇళ్ళు ఈ సారి కళ తప్పి బోసిపోతున్నాయి. ముక్కిపోయిన మసక బారిన ధాన్యాని చూసుకుని ఏం చెయ్యాలో తెలియక ఆరుకాలం కష్టించి పండించిన పంటకి నిప్పు పెట్టుకుంటున్నాడు.  ఈ సంవత్సరమన్నా రైతుకి శుభప్రదం కలగాలని ..ప్రకృతి రైతుకి సహకరిస్తుందని ఆశిస్తూ ....

ఈ  రోజు మా ఇంటిముందు వేసిన ముగ్గులు.


                      
                                   సర్వేజనా సుఖినోభవంతు

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP