పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 24, 2012

నా బ్లాగుకి పంచ వసంతాలు!

ఏంటో ఈ మధ్య నా బ్లాగు జోలికే వెళ్ళటం లేదు. ఈ రోజు ఎందుకో బ్లాగులోకి వెళ్తే అసలు ఈ సంవత్సరం ఒక్క టపా కూడా వ్రాయలేదు! హతోస్మి!  దిక్కూ మొక్కు లేనట్టు పడున్న నా  బ్లాగుని చూస్తే దిగులేసింది.

ఏం చెయ్యను! గత రెండు నెలలుగా ఊపిరి పీల్చుకోను కూడా తీరికలేనంత పని!

జనవరి 2 న మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం..ఆ తరువాత మా అక్క వాళ్ళ అబ్బాయి పెళ్లి హడావిడి..ఇదిగో పోయిన వారంతో అన్నీ ముగిసి తెరిపిన పడ్డా!

పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు
తాళాలు.. తలంబ్రాలు
మూడే ముళ్ళు ..ఏడే అడుగులు
మొత్తం కలిసి నూరేళ్లు....
ఎంత బాగా చెప్పాడు ఆత్రేయ!

పెళ్ళంటే ఆడపెళ్లి వారి కంటే మగ పెళ్ళి వారికే ఎక్కువ హడావిడి ఉంటుంది.  వాళ్లకి ఒక్క రోజుతో అయిపోతే మగపెళ్ళి వారికి మూడు రోజుల హడావిడి!

 ఇప్పటి కాలపు పెళ్లిలా షామియానాలు..బఫే భోజనాలు..ఒక్క పూట తంతులా  కాకుండా... తాటాకు చలువ పందిళ్లు, మేళతాళాలు, బంతి భోజనాలు.. పదహారు రోజుల పండగ దాకా అన్నీ దివ్యంగా ..సాంప్రదాయబద్దంగా జరిపాం.

ఇంతకీ నేనివాళ గమనించిన విషయం ఏంటంటే  ఫిబ్రవరి 21 కి నా బ్లాగు మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు..అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయాయా? ఇప్పటివరకు ఇది కూడా గమనించలేదు నేను!

 ఈ టపాతో కలిపి ఓ 130 టపాలు వ్రాసినట్టున్నా..మరీ నత్త నడకంటారా? పోనీలేండి  నా వరకు నాకది ఎక్సుప్రెస్సు నడకే!  నా బ్లాగు ప్రయాణం బహు సమతుల్యతతో నడుస్తుంది..అంత వేగంగానూ నడవటం లేదూ ...మరీ మూలనా పడటం లేదు.

ఈ ఐదు సంవత్సరాల బ్లాగు ప్రయాణం లో అన్ని రుచులు ఆస్వాదించా! మంచి స్నేహితులూ దొరికారు! కొంతమంది మంచి మితృలు కనుమరుగయ్యారు!  కొత్త మితృలు జత కలిసారు!

నా దృష్టిలో బ్లాగన్నది మన జీవితంలో ఓ భాగం కాదు.  మన అభిప్రాయాలు, మనసులోని భావాలు పంచుకోవటానికి ఓ వేదిక అంతే! కుదిరిన రోజు వ్రాస్తాం..లేని రోజు లేదు! నచ్చిన వాటిని మెచ్చుకుంటాం..నచ్చని వాటిని వదిలేస్తాం!

నా మొదటి వార్షికోత్సవ టపా! 

సర్వే బ్లాగు జనా సుఖినోభవంతుః

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP