పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 24, 2011

ఏం కావాలి వీళ్లకి.....ఏం చెయ్యాలి వీళ్లని?????



శారద వాళ్ళ అమ్మాయి డ్రగ్సు కి అలవాటు పడిందట..శారద చాలా డిప్రెషనులో ఉంది..ఒకసారి ఫోను చేసి మాట్లాడతావా ?

నాలుగు రోజుల క్రితం నా స్నేహితురాలు ఫోనులో చెప్పిన మాటలు నాకు ఇంకా చెవుల్లో ప్రతిద్వనిస్తున్నాయి.

ఈ మధ్య కాలేజిల్లో పిల్లలు ఈ డ్రగ్సుకి అలవాటుపడుతున్నారని అక్కడక్కడా వింటున్నాం కానీ బాగా తెలిసిన అమ్మాయి ఇలా అయిందంటే ఏంటో నమ్మశక్యంగా లేదు.  ఆ పిల్ల అమాయకపు మొహమే కళ్ళముందు కదులుతుంది.

ఎవరు దీనికి బాధ్యులు?
తల్లిదండ్రులా....పిల్లలా?

ఏం కావాలి ఇప్పటి పిల్లలకి?
అమ్మా నాన్న ఏం తక్కువ చేస్తున్నారని వీళ్లు ఇలాంటి అలవాట్ల బారిన పడుతున్నారు?
ఎందుకు తల్లిదండ్రులిస్తున్న స్వేచ్చని దుర్వినియోగం చేసుకుంటున్నారు?

మా శారదకి ఒక్కతే పాప.  మా శారద చాలా పద్దతిగా తన పనేమో తానేమో అన్నట్టు ఉంటుంది.  ఉన్న ఒక్కాగానొక్క పిల్లని మంచి స్కూల్లో చదివించాలని అప్పట్లో హైదరాబాదులో బాగా పేరున్న ఓ స్కూల్లో చేర్చింది.  తను ఉద్యోగానికెళితే పిల్లకి ఇబ్బంది అని వాళ్ల అమ్మా వాళ్ళని కూడా హైదరాబాదు తీసుకొచ్చేసింది.

ఏడో తరగతి నుండే పాప ప్రవర్తన కాస్త తేడాగా ఉందని... స్నేహితులు అంతా పెద్ద పెద్ద ఇళ్ళనుండి వచ్చిన వాళ్ళు అని..వాళ్లని చూసి వాళ్ళలాగా అన్నీ కావాలంటుందని....పెద్దవాళ్ళు అంటే లెక్కలేకుండా మాట్లాడుతుందని.....చదువు మీద శ్రద్ద చూపటం లేదని ...ఇలా  నా దగ్గర చాలా సార్లు వాపోయింది.  స్కూలు మార్చాలని చూసింది కానీ వాళ్ళ పాప స్కూలు మారటానికి ససేమిరా అంది.  నేనూ వారించాను..ఎందుకంత బలవంతం చేస్తావు...స్నేహితుల ప్రభావం...కొంచం పెద్దయితే తనే తెలుసుకుంటుందిలే అని. 

ఇంటరుకి వచ్చాక హాస్టలులో పెట్టింది..ఓ వారం ఉండి నేనుండనని వచ్చేసింది..సరే అని మరో కాలేజీలో చేర్చింది.  ఇంటరు అయ్యాక ఫాషను డిజయినింగ్ చేస్తానంటే కోచింగు ఇప్పించారు..తీరా పరీక్ష సమయానికి నేను అది చదవను..ఇంజనీరింగే చదువుతానంది..దానికీ సరే అని  ఓ మంచి కాలేజీలో పది లక్షలు పోసి సీటు కొని చేర్పించారు.  ఇంజనీరింగులో చేరాక నాకు ప్రత్యేకంగా కారు కావాలంది.....కొనిచ్చారు..ఈ పిచ్చి అపార్టుమెంటు ఏంటి..మన స్థలం ఉందిగా దాంట్లో ఇల్లు కట్టండి అంటే ఇల్లు కట్టటం మొదలుపెట్టారు.

 మా శారద వెనకాల నసుగుతానే ఉంది..ఇంత చిన్న పిల్లకి కారేంటి...ప్రతిదానికి ఇలా తను ఆడించినట్టల్లా ఆడితే తర్వాత మన మాట వింటుందా అని వాళ్ళాయన్ని హెచ్చరిస్తూనే ఉంది.  పోనీలే మనకున్న దాంట్లోనే కదా కొంటున్నాం.. అది సుఖంగా ఉంటే మనకి అంతే చాలు అని ఆయన వాళ్ళమ్మాయిని వెనకేసుకొచ్చేవారు.

శారద నాకు ఫోను చేసినప్పుడల్లా అందరి పిల్లలు చక్కగా బాధ్యతగా చదువుకుంటున్నారు..మా అమ్మాయే ఇలా ఎందుకయిందో నాకర్థం కావటం లేదు..తల్లిగా నేను విజయవంతం  కాలేకపోయాను..నేను చదివిన చదువు (తను పిల్లల పెంపకం లో డిగ్రీ చదివింది...ఉద్యోగం కూడా దాని మీదే!)నా పిల్లని పెంచుకోవటంలో నాకు ఉపయోగ పడలేదు..నేను ఎక్కడ తప్పు చేసానంటావు...చెప్పినప్పుడు బాగానే వింటుంది..ఇక నుండి బాధ్యతగా ఉంటాను..బుద్ధిగా చదువుకుంటాను అని చెప్తుంది..మరలా మూడో రోజు నుండి మామూలే... స్నేహితులు..షికార్లు..షాపింగులు...ఇక ఈ పిల్ల మారదు అని చాలా బాధపడేది.  ఈ వయస్సులో పిల్లలు అలానే ఉంటారులే అని నేనూ ఎప్పటికప్పుడు తనకి సర్దిచెప్తుండేదాన్ని.

ఇప్పుడు శారదతో ఏమని మాట్లాడాలి నేను?
ఇక్కడ శారద చేసిన తప్పేంటి? ?
 పిల్లని అపురూపంగా పెంచుకోవటమా?
మంచి స్కూలు..కాలేజీల్లో చదివించటమా?
అడిగినవన్నీ కొనిపెట్టటమా?
కావల్సినంత స్వేచ్చ ఇవ్వటమా?
ఎలాంటి ఆంక్షలూ పెట్టకపోవటమా?

పిల్లలూ ......
ఆలోచించండి..
మీ తల్లిదండ్రుల గురించి ఒక్క నిమిషం ఆలోచించండి..
వాళ్ళ ప్రాణాలన్నీ మీ మీదే పెట్టుకు బ్రతుకుతారు...
మీకు చిన్న దెబ్బ తగిలినా వాళ్ళు విలవిల లాడతారు..
వాళ్ళ ఆశలు....ఆశయాలు అన్నీ మీరే..
వాళ్ళ కలల ప్రతిరూపాలు మీరు..
మీరు నవ్వితే నవ్వి....మీరు ఏడిస్తే ఏడ్చి
మీ కోసమే బ్రతికే వాళ్ళని..
ఇలాంటి అలవాట్లతో క్షణం క్షణం చంపకండి..
సరదాగా స్నేహితుల ప్రభావంతో మొదలయ్యే అలవాటు..
మనిషిని ఎంత అధఃపాతాళానికి తీసుకెళుతుందో  అర్థం చేసుకోండి!
పిల్లలూ ఒక్కసారి ఆలోచించండి..
ఈ మాదక ద్రవ్యాల మహమ్మారికి దూరంగా ఉండండి..
మీ జీవితాలకి ఓ విలువ కలిపించుకోండి!!

జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP