పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 30, 2011

మేమిందుకిలా???



 పెళ్ళి ఆడపిల్ల జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో!

 నేను చెప్పేది ఇప్పటి ఆడపిల్లల గురించి కాదు! మా తరం గురించి!

అప్పటి వరకు హాయిగా స్వేచ్చగా సీతాకోక చిలుకల్లా ఎగిరిన మేము ఒక్కసారిగా ప్యూపా దశలోకి వెళ్ళిపోతాం.

ఇల్లు..భర్త..పిల్లలు..ఇదే లోకం...అదే సర్వస్వం...

ఇల్లే కదా స్వర్గ సీమ అని పాడేసుకుంటూ  ఆ ప్యూపా దశలోనే ఉండిపోతాం.

అందులోనుండి బయట పడాలని కూడా అనుకోము!

ఇల్లు విడిచి ఒక్క రోజు ..ఒక్క గంట బయటకి వెళ్ళాలన్నా ఎన్ని ప్రతిబంధకాలో!

అమ్మాయి కాలేజీ నుండి వచ్చే టైము..అబ్బాయి ఆటలకి వెళ్లే టైము..అయ్య గారు ఆఫీసు నుండి వచ్చే టైము..మామ గారికి ఒంట్లో బాగోకపోవటమో..చుట్టాలు రావటమో..ఇలా ఏదో ఒకటి అడ్డం పడుతూనే ఉంటుంది.

ఇలా అడ్డాలు లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారనుకోండి..కానీ తక్కువ.

ఓ రెండు రోజులు ఊరెళ్ళాలంటే ఎన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి వెళ్లాలో..

ఓ వారం ముందు నుండే ఏర్పాట్లు మొదలుపెట్టాలి..

మంచినీళ్ల దగ్గరనుండి. పెరుగు దాకా.అన్నీ రెడీగా పెట్టి వెళ్లాలి.

వెళ్ళాక అయ్యో ఏం ఇబ్బంది పడుతున్నారో అని మనసులో పీకులాటే...

పాలబ్బాయి వచ్చే టైం కి లేచారో లేదో...పనమ్మాయి టైం కి వచ్చిందో లేదో..

టిఫిన్ తిన్నారో ..తినకుండా పరిగెత్తారో..తలుపులు సరిగ్గా వేసారో లేదో...

పనమ్మాయిని బతిమాలుకోవాలి..నేను లేని రెండు రోజులు మానకుండా రా తల్లీ అని..

అదేంటో ఇంత చెప్పినా మనం ఊరెళ్ళిన టైం లోనే ఆ పనిపిల్లకీ ఏవో అర్జంటు పనులో.. జలుబో..జ్వరమో వచ్చేడుస్తాయి!

మనుషులం అక్కడే కాని మనస్సంతా ఇక్కడే ఉంటుంది..

ఇప్పుడంటే ఫోన్లు వచ్చాక అడుగడుక్కి మానిటరింగ్ చేస్తున్నాం కానీ మా పెళ్లయిన కొత్తలో ఫోన్లు అంతగా లేని రోజుల్లో ఉత్తరాలే ఆధారం..

ఇక ఆ ఉత్తరాల నిండా జాగ్రత్తలు..హెచ్చరికలు..ఉపదేశాలు..మాత్రమే ఉండేవి:)

ఇంతా చేసి వెళ్ళిన దగ్గరన్నా ప్రశాంతంగా ఉంటామా అంటే అదీ లేదు!

మంచాల మీద విడిచిన బట్టల కుప్పలు..సింకులో కడగని గిన్నెలు....పొయ్యి మీద మాడిన దోసెలు కళ్ల ముందు నాట్యం చేస్తుంటే ఇంకెక్కడి ప్రశాంతత!

అదే మగాళ్లకి చూడండి ఈ జంజాటాలు ఏమీ ఉండవు..ఎక్కడికంటే అక్కడికి ఝామ్మంటూ వెళ్ళిపోతారు.

ఎవరి అనుమతులూ అక్కర్లేదు..ఏ ముందస్తు ఏర్పాట్లూ చెయ్యక్కర్లేదు!

ఇంటి గురించి ఏ బెంగా..ఆలోచనలూ..ఆందోళనలూ..ఉండవు!

ఇప్పటి వాళ్లయితే మరీనూ..ఆఫీసు నుండి అటు నుండి అటే ఫ్లైట్ ఎక్కేస్తారు!

మరి నిజంగానే మేము లేకపోతే ఇళ్లల్లో జరగదా అంటే శుభ్రంగా జరిగిపోతుంది, మాకే లేనిపోని ఆరాటం.

అందరూ నా మీదే అధారపడ్డారు..నేను లేకపోతే వీళ్లకిక జీవితమే లేదు అన్న ఓ అందమైన భ్రమలో బ్రతుకుతున్నాం!

ఇప్పుడీ సోదంతా ఎందుకంటే....

మా డిగ్రీ. మరియు.పి.జి కాలేజీల వాళ్లం జనవరి ఒకటిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకుందామనుకుని మొదలెట్టాం(ను).

ఆలోచన ఇంకో ఫ్రెండుది..నాది..కానీ తను ఉండేది అమెరికాలో కాబట్టి ఆ బాధ్యతంతా నేనే తలకెత్తుకున్నాను..

అందరి అడ్రస్సులు సంపాదించటం ఓ ఎత్తయితే మా జనాల్ని ఒప్పించటం ఇంకో ఎత్తయింది..

దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం కదా అని అందరూ ఉత్సాహంగా ఎగురుకుంటూ వస్తారనుకుని మొదలెట్టా!

మొదలెట్టాక కాని తెలియలేదు మా వాళ్ల కుటుంబ భక్తి..పతి భక్తి..పిల్లల భక్తి..

జనవరి ఒకటినా అంటూ సాగదీసిన వాళ్లే ఎక్కువ..

జనవరి ఒకటిన నేను మా ఆయనతోనే ఉండాలమ్మా అని ఒయ్యారాలొలకపోసిన వాళ్లూ...

జనవరి ఒకటిన మా అమ్మాయి దగ్గరికి వెళ్ళకపోతే ఇంకేం లేదే బాబూ..నన్ను చంపి పాతరేస్తుంది అని భయపడి పోయిన వాళ్లూ....

జనవరి ఒకటికి మా ఫామిలీస్ అన్నీ కలిసి రిసార్ట్సు కి వెళతాం..కుదరదబ్బా అన్న వాళ్లూ..(వీళ్లు కలుసుకునేది సంవత్సరానికి ఒక్కసారి జనవరి ఒకటిన మాత్రమే అట..అందరూ మళ్ళీ ఉండేది హైదరాబాదులోనే)!

హైదరాబాదులోనా..మాకు దూరం కదా.వచ్చి వెళ్ళాటానికి కనీసం మూడు రోజులన్నా కావాలి..నేను లేకపోతే మా ఇంట్లో మూడు నిమిషాలు కూడా జరగదమ్మా అని దీర్ఘాలు తీసిన వాళ్లూ..

జనవరి ఒకటి... ప్రోటోకోల్ ప్రకారం మంత్రుల్ని..కలక్టర్లని..ఎమ్మేలేలని కలవాలి కుదరదు అని ఖరాఖండిగా చెప్పిన ప్రభుత్వంలోని పెద్ద ఉద్యోగులు..

మా ఆయన జనవరి ఒకటికి ఎక్కడికన్నా వెళదామంటున్నారు... ఇప్పుడు నేను రానంటే ఆయన చిన్నబుచ్చుకుంటారు ..రానులే అన్నవాళ్ళూ..

మా అత్త గారికి ఆరోగ్యం అంత బాగుండటం లేదు..నీకు తెలుసుగా ఆవిడ్ని మేమే చూసుకోవాలి---ఈ సారికి కుదరుదులే ఏమీ అనుకోకు (ఇదేదో మా ఇంట్లో ఫంక్షన్ అయినట్టు) అని దీర్ఘాలు తీసిన వాళ్లూ..

మా ఆడపడుచు గారమ్మాయి పెళ్ళి కుదిరిందిరా..ఆ షాపింగు పనులతో బిజీగా ఉన్నా..ఇంకో సారి పెట్టినప్పుడు వస్తాలే అన్నవాళ్లూ..

అయ్యో అదే సమయానికి మా ఆయన వాళ్ల స్కూలు వంద సంవత్సరాల వేడుక..తను ఇండియా వస్తున్నారు కాబట్టి నేను రాలేను అన్నవాళ్లు..

చచ్చీ చెడీ..దేశాలన్నీ గాలించి..నెట్టులో జల్లెడ పట్టి...వాళ్లనీ వీళ్లనీ అడుక్కుని...ఓ అరవై మందివి అడ్రస్సులు  ఫోను నంబర్లు సంపాదించి అందరిని కాంటాక్టు చేసి ఎంతో ఉత్సాహంగా మొదలుపెడితే ...

ఈ కారణాలు విని  దిమ్మ తిరిగి...నా ఉత్సాహమంతా చప్పగా నీరు కారిపోయింది..

ఈ కారణాలన్నీ చూడండి..అన్నీ కుటుంబం చుట్టూ తిరిగేవే!

ఎందుకు ఇంతలా మమ్ముల్ని మేము ఈ కుటుంబ బంధాల్లో కట్టి పడేసుకుంటున్నాం?

నచ్చిన సినిమాకి తీసుకెళ్లలేదనో..తను కోరుకున్నంత మోడ్రన్ గా భర్త లేడనో..

అత్త గారితో ఓ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడరనో..అమెరికా వెళ్ళొద్దంటున్నారనో..

ఎడాపెడా విడాకులిచ్చేస్తున్న ఈ రోజుల్లో మేమిందుకిలా ఉన్నాం?

మాకంటూ కాస్త సమయాన్ని ఎందుకు కల్పించుకోలేక పోతున్నాం?

నిజంగా పైన చెప్పినవన్నీ రాలేనంత కారణాలా?

నిజానికి కుటుంబంలో ఇలాంటి వాటికి వెళ్తామంటే వద్దనే వాళ్లు కూడా ఎవరూ ఉండరు..

మేమే అలా అలవాటు పడిపోయాం...మా చుట్టూ మేమే ఓ గిరి గీసుకున్నాం..

అది దాటి బయటకు రావటానికి ఇష్టపడం..రావటానికి ప్రయత్నమూ చెయ్యం..

ఈ ప్యూపా బతుకులే మాకిష్టం!

***********************************************************************************

సరే జనవరి ఒకటని అభ్యంతరాలు చెప్తున్నారు కదా అని కార్యక్రమం జనవరి రెండుకి మార్చినా మరలా ఏవో కారణాలు రాలేకపోతున్నందుకు..

చివరికి ఓ పాతిక మంది తేలారు వచ్చేవాళ్లు..

మేమెందుకిలా???

ఈ ప్యూపా దశ నుండి బయటపడి మళ్లీ సీతాకోక చిలుకల్లా హాయిగా ..స్వేచ్చగా ఎప్పుడు ఎగురుతామో!

Read more...

December 16, 2011

26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన

పుస్తక ప్రియులు ఎంతగానో ఎదురు చూసే  పుస్తకాల పండగొచ్చేసింది.
 26 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శన నిన్న అనగా డిసెంబరు 15 న మొదలయింది.

ఈ ప్రదర్శన  డిసెంబర్ 15 నుండి 25 వరకు నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది.

ప్రదర్శన వేళలు:
మామూలు రోజుల్లో:  మద్యాహ్నం 2  నుండి రాత్రి 8  గంటల వరకు
శని.. ఆది వారాలలో:  మద్యాహ్నం 12 నుండి రాత్రి  9 గంటల వరకు

ఇక ప్రతి సంవత్సరం లాగానే e-తెలుగు తరఫున ఒక స్టాలు, కినిగె తరుపున ఒక స్టాలు తెరిచారు.
e-తెలుగు స్టాల్ నంబరు: 2
కినిగె స్టాలు నంబరు:  190

ఈ సందర్భంగా ప్రతి రోజూ సాయంత్రం వేళలో పుస్తకావిష్కరణలు,  రచయితల సభలు, సమావేశాలు, చర్చలు , సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడొచ్చు.

******************************************************************************

e-తెలుగు తరుపున కశ్యప్ గారు తెలుగు బ్లాగు గుంపు కి పంపిన సందేశం ఇక్కడ పెడుతున్నాను. ఆసక్తి ఉన్నవాళ్ళు కశ్యప్ గారిని సంప్రదించండి.

 వేలలో ఉన్న తెలుగు బ్లాగుల సందర్శకులని లక్షల్లోనికి  పెంచే దిశగా ఈ పుస్తక ప్రదర్శనలో మన కార్యక్రమాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే, పుస్తక ప్రదర్శనకి వచ్చేవారిలో చదివే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎక్కవ శాతం ఉంటారు.

పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాల్ లో ఉండి e-తెలుగు, కంప్యూటర్ లో తెలుగు వాడకం, మరీ ముఖ్యంగా అంతర్జాలం లోని సాంఘికజాల నెలవులలో(సోషల్ నెట్వర్కింగ్ సైట్స్) తెలుగు ఉపయోగం వంటివి ప్రదర్శనకు వచ్చే వారికి వివరించేందుకు విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది. తెలుగు బ్లాగరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహాయ సహకారాలను అందించాలని కోరుకుంటున్నాము . మీ సూచనలు సలహాలు అహ్వానిస్తున్నాము .

క్రింది వివరాలను e-మెయిలు ద్వారా గాని..టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.

పేరు:
టెలిఫోను నంబరు:
e-మెయిలు చిరునామా:
ఏ తేదీలలో ఏ సమయంలో స్టాలులో ఉండగలరో ఆ వివరాలు:

మీ అందరి సహాయ సహకారాలను ఆకాంక్షిస్తూ ,అన్ని రోజులూ ఒక్కరే ఉండలేరు కాబట్టి ఒక్కో రోజూ ఒక్కొక్కరూ వంతుల వారీగా చెయాల్సిరావచ్చు. మీకు ఏయే రోజులలో వీలవుతుందో చెప్తూ ఇక్కడ స్పందించండి. (దీనికోసం ఓ పూట మీ కార్యాలయం నుండి సెలవు తీసుకునే దిశగా కూడా ఆలోచించండి.)

మీ సహాయం మరియు తోడ్పాటు మాకు ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. మీ నుండి సానుకూల స్పందనని ఆశిస్తూ...

మీ శ్రేయోభిలాషి 
కశ్యప్...9396533666

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP